రెండు మూడు దశాబ్దాలుగా సామాన్య ప్రజలు కోకొల్లలుగా స్టాక్‌మార్కెట్‌లో షేర్ల క్రయవిక్రయాలలో (trading) మునిగి షేర్ల వ్యాపారాన్ని కొన్ని వేల, లక్షలకోట్ల రూపాయల స్థాయికి తీసుకువచ్చారు భారతదేశంలో. ఈ వేలంవెర్రి ఒక్క భారతదేశానికే పరిమితం కాదు దీపం చుట్టూ చేరే పురుగుల్లా సామాన్య జనాలు స్టాక్‌మార్కెట్‌లో తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో తమ డబ్బును రెట్టింపు చేసుకుందామని ఆశతో ఎగబడుతూవుంటే స్టాక్‌బ్రోకర్‌లూ, రకరకాల ఆపరేటర్లూ, ఫండ్స్ రాబందుల్లా వేచివుంటారు. అంటే అందరూ అలా వుంటారని కాదు. డబ్బెవరికి చేదు, అందుకే స్టాక్‌మార్కెట్‌లో చాలా మంది ఎవరూ పసిగట్టలేని, సామాన్య ప్రజానీకానికి అర్థం కాని విధంగా వ్యవహరిస్తూ దారి తప్పించడానికి వెనుకాడకపోవచ్చు.
సామాన్య జనాలను మభ్య పెట్టడానికి రకరకాల మయసభలను సృష్టించారు ఏది నిజమో, ఏది అబద్దమో, ఏది నమ్మాలో, ఏది నమ్మగూడదో తెలియని స్థితి. తమకున్న డబ్బుతో, సమాచారంతో, మార్కెట్ పరిజ్ఞాన బలంతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు కనపడకుండా చట్ట పరిధిలోనే సామాన్య ప్రజల డబ్బును దోచేయడంలో నిపుణత్వం సంపాదించుకున్నారు చాలా మంది స్టాక్‌మార్కెట్ రాబందులు. ముందు తెలిసీ తెలియని జనాన్ని రకరకాల పరోక్ష పద్ధతులలో ఆ షేర్ల కొనుగోలులోకి గుంజుతారు ఆ షేర్లను పైపైకి తీసుకు వెళ్తూ, ఆ తరవాత ఆ షేర్లను పాతాళానికి పంపి వలలో పడిన అమాయక జనాల పెట్టుబడిని కుప్పకూల్చేస్తారు.
స్టాక్‌మార్కెట్ మోసాలు, ప్రలోభాలు సామాన్య ప్రజలకు అర్థం కావని భారత స్టాక్‌మార్కెట్ రెగ్యులేటర్, సెక్యూరిటీస్ ఎండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Securities and Exchange Board of India) లేదా క్లుప్తంగా సెబి (SEBI) ఎన్నో నియమ నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ వుంటుంది సమయసమయానికి. సెబి ఎన్ని ఆదేశాలు జారిచేస్తూవున్నా అక్రమమైన పనులు చేసేవాళ్ళు చేస్తూనే వుంటారు. స్టాక్‌మార్కెట్ రెగ్యులేషన్ ప్రకారం, ఏ కంపెనీయైనా “ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్[1]” (price sesitive information) అంటే ఏ సమాచారం వల్ల స్టాక్‌మార్కెట్‌లో ఒక్క షేర్ విలువ పెరుగుతుందో లేదా పడిపోతుందో అలాంటి సమాచారాన్ని ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు) అందరు షేర్‌హోల్డర్స్కూ ఒక్కటే సారి బహిరంగ ప్రకటన (public disclosure) ద్వారా తెలియజేయాలి ఎందుకంటే ఒక్క షేర్ విలువ అకస్మాత్తుగా కొన్ని నిమిషాలలో 10 శాతం పెరగడమో లేదా పడిపోవడమో జరగవచ్చు దాని వలన కొంతమంది పెద్ద మొత్తం ధనాన్ని ఒక్క రోజులోనే సంపాదించుకోవడమో లేదా పోగొట్టుకోవడమో జరగవచ్చు. ఈ విషయం గురించి ఒక్క వ్యాపారవేత్తలాంటి అవగాహన కావాలంటే వ్యాపారవేత్తలాగా ఆలోచించాలిగదా.
ఉదాహరణకు బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ల మీద 5 శాతం వడ్డీ ఇస్తుందనుకుందాము. మీరు ఒక్క లక్ష రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్లో వేస్తే, ఒక్క ఏడాది తరవాత రూ. 5,000 వడ్డీగా ఆ ఫిక్సెడ్ డిపాజిట్ మీద సంపాదించగలుగుతారు. ఒక్క షేర్‌కి సంబంధించిన ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసనుకోండి అలాంటి సమాచారం వలన ఆ షేర్ విలువ ఒక్క రోజులో 10 శాతం పెరిగిందనుకుందాము, అలాంటప్పుడు మీరు అదే లక్ష రూపాయల మీద ఒక్క రోజులోనే రూ. 10,000 సంపాదించుకోవచ్చు. ఒక్కవేళ మీకు షేర్‌మార్కెట్‌లో రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన సత్తా వుంటే ఒక్క రోజులోనే ఒక్క కోటి రూపాయలను సంపాదించుకోవచ్చు ఆ రూ. 10 కోట్ల పెట్టుబడి మీద.
అందుకే ఇలాంటి అక్రమాన్ని ఆపడానికే ఏదైనా ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కంపెనీలు అలాంటి సమాచారాన్ని గుప్తంగా వుంచాలి ఒక్కటే సారి బహిరంగ ప్రకటన ద్వారా అందరు షేర్‌హోల్డర్స్‌కూ తెలియజేయాలి. అంతే కాదు ఆ కంపెనీ అధికారులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు లేదా వేరెవరైనా సలహాదార్లు లేదా బోర్డ్‌మెంబర్లు ఎవరికైతే ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుసో వాళ్ళు స్వంతగానో లేదా తమ కుటుంబ సభ్యుల ద్వారానో లేదా వేరే ఇతర వ్యక్తుల ద్వారా ఆ కంపెనీ షేర్ల లావాదేవీల వల్ల డబ్బును సంపాదించడం చట్టవిరుద్ధం. ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఇలా స్టాక్‌మార్కెట్‌లో తమ దగ్గర వాళ్ళను వాడుకుని డబ్బు సంపాదించడాన్ని “ఇన్సైడర్ ట్రేడింగ్” (insider trading) అంటారు. అంతే కాదు ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల లాభం గడించినట్టు రుజువైతే కారాగార శిక్ష లేదా పెద్ద మొత్తం ధనం జుర్మానా విధించవచ్చు లేదా ఈ రెండూ కలిపి శిక్ష విధించవచ్చు న్యాయాలయాలు. అంటే ఒక్క చిన్న సమాచారం ఎంత విలువైనదో ఎంత సంపాదనకు దారితీస్తుందో తెలిసింది కదా. అందుకే ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కొంతమంది నానారకాల మార్గాల ద్వారా కూపీలులాగడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇంకొక స్టాక్‌మార్కెట్ రెగ్యులేషన్ ప్రకారం, ఏక్టింగ్ ఇన్ కన్సెర్ట్ (acting in concert) కూడా నేరంగా పరిగణిస్తారు. సరళంగా చెప్పాలంటే కొంతమంది స్టాక్‌మార్కెట్ ఆపరేటర్లు కుమ్ముక్కై ఒక్క షేర్ విలువను అక్రమంగా పైపైకి తీసుకువెళుతూ వుంటారు సర్క్యులర్ లావాదేవీల (circular transactions) ద్వారా. సర్క్యులర్ లావాదేవీలంటే కొంతమంది స్టాక్‌బ్రోకర్లు వాళ్ళ మధ్యలోనే ఉట్టుట్టి షేర్ క్రయవిక్రయాలు చేస్తూ ఒక్క షేర్ గిరాకీని కృత్రిమంగా పెంచి ఆ షేర్ విలువను పెంచేస్తూ ఆ షేర్ గురించి మార్కెట్‌లో ఒక్క సంచలనాన్ని సృష్టిస్తారు. ఏ నోట విన్నా ఆ షేర్ గురించే చర్చ మారుమోగేలాగా చేస్తారు పలురకాల మాధ్యమాల (వార్తా పత్రికలు, టీవీలు, ఇంటర్నెట్ ఇలా ఎన్నో) ద్వారా – ఫలానా షేర్ కొని ఫలానా వ్యక్తి తక్కువ సమయంలో ఎంత ఎక్కువ డబ్బు సంపాదించాడని. ఇంకేముంది వేలంవెర్రి ముదిరి బలం పుంజుకుంటుంది, షేర్ విలువ ముందుకి పరిగెడుతుంది.
ఉదాహరణకు 12 మంది స్టాక్‌బ్రోకర్లు ఒక్క షేర్‌ని ఒక్క ఆట ఆడిద్దామనుకుని రహస్యంగా నిశ్చయించుకున్నారని అనుకుందాం. ప్రస్తుతం ఆ షేర్ విలువ రూ. 20 అనుకుందాం. మొదటిసారి 5-6 మంది స్టాక్‌బ్రోకర్లు మిగిలిన స్టాక్‌బ్రోకర్లకు ఆ షేర్‌ను రూ. 30కు అమ్ముతారు. రెండవసారి ఆ షేర్‌ను కొన్నవాళ్ళు తాము ఎవరి దగ్గర నుంచి కొన్నామో వాళ్ళకు కాక తత్తిమ్మా వాళ్ళకు అదే షేర్‌ను రూ. 40కు అమ్ముతారు ఎవ్వరికీ వీళ్ళు కుమ్ముక్కైనట్టు అనుమానం రాకుండా వుండడానికి, పట్టుబడకుండా వుండడానికి. అలా తమ మధ్యలోనే ఆట ఆడుతూ ఆ షేర్ విలువను ఆ 12 మంది స్టాక్‌బ్రోకర్లు తక్కువ సమయంలో నాలుగురెట్లు చేసారనుకుందాం. దాని వల్ల బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా జనాలు ఆ కోలహలాన్ని చూసి ఆకర్షితులై మెల్ల మెల్లగా వలలోకొస్తూ వుంటారు ఎందుకంటే వాళ్ళకు ఆ షేర్ విలువ ఎందుకు పెరుగుతుందో అలా పెరగడం సహజమో కాదో తెలియదు కాబట్టి. మెల్ల మెల్లగా ఈ 12 స్టాక్‌బ్రోకర్లు వాళ్ళ మధ్యలోని ఉట్టుట్టి క్రయవిక్రయాలను ఆపేసి ఆ షేర్లను జనాలకు అంటగడతారు, ఆ తరవాత వాళ్ళు జారుకుంటారు. దమ్ములేని షేర్ కావడం వలన ఆ తరవాత ఆ షేర్ కుప్ప కూలిపోతుంది, అలా పెట్టుబడి పెట్టిన జనాల డబ్బు గుంజేయడం జరుగుతుంది.
ఈ ఆటకి ఎవరెవరికి సంబంధం వుంది అంటే పైన చెప్పిన అందరి స్టాక్ఆపరేటర్లకు ఏదో ఒక్క విధమైన లాభం వుంటుంది కాబట్టే అందరూ తోడు దొంగల్లాగా ఈ ఆటాడతారు. మన కంటికి కనిపించని ఏదో ఒక్క రహస్య ఒడంబడిక వుంటుంది ఇలాంటి ఆట వెనక స్టాక్ఆపరేటర్ల మధ్య. మొట్టమొదట ఏ షేర్‌నైతే ఇలా పెంచడం జరిగిందో ఆ కంపెనీకే దీనివలన లాభం వుండవచ్చు. ఒక్క ‘A’ కంపెనీ షేర్ విలువ తక్కువగా వుంటే ఆ కంపెనీకి పోటిగావున్న ‘B’ కంపెనీకి ‘A’ కంపెనీ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఎన్నో కారణాలవల్ల ‘A’ కంపెనీకున్న నెట్‌వర్త్ (networth లేదా బుక్‌వాల్యూ book value) కంటే ఆ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ చాలా తక్కువ వుండవచ్చు, దాని వల్ల ఆ కంపెనీ బలమైన ‘B’ కంపెనీకి ఎరకావచ్చు. బలమైన కంపెనీలెప్పుడూ పడుతూలేస్తూవున్న కంపెనీలను ఇట్టే మింగెయ్యడానికి ఎదురుచూస్తూవుంటాయి.
కంపెనీ నెట్‌వర్త్‌ని (బుక్‌వాల్యూ) అర్ధం చేసుకోవడం చాలా సులువు, దీన్నే ఇంకో మాటల్లో చెప్పాలంటే ఆ కంపెనీకున్న సర్వ ఆస్తుల విలువ నుంచి అన్నీ రుణాల విలువను తీసేస్తే మిగిలే సంఖ్యే ఇది. కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ అంటే కంపెనీ జారిచేసిన మొత్తం షేర్ల ప్రస్తుత మార్కెట్ విలువ. ఉదాహరణకు ఒక్క కంపెనీ ఆస్తుల విలువ రూ. 1,000 కోట్లు, రుణాలు రూ. 500 కోట్లు అయితే నెట్‌వర్త్ (బుక్‌వాల్యూ) రూ. 500 కోట్లు (అంటే రూ. 500 కోట్లను రూ. 1,000 కోట్ల నుంచి తీసేస్తే). అదే కంపెనీలో చాలా రోజులనుంచి నడుస్తున్న కార్మికుల ఆందోళన వల్ల ఆ కంపెని మార్కెట్ కాపిటలైజేషన్ అంటే కంపెనీ జారిచేసిన మొత్తం షేర్ల విలువ రూ. 300 కోట్లు అయ్యిందని అనుకుందాము. అంటే ఒక్క బలమైన కంపెనీ కేవలం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి రూ. 1,000 కోట్ల ఆస్తులు వున్న ఇంకొక కంపెనీని కొనేసుకోవచ్చు.
ఇలాంటి భయమున్నప్పుడు బలహీనమైన కంపెనీ యజమానులు స్టాక్‌మార్కెట్ ఆపరేటర్లను వాడుకుని అక్రమంగా షేర్ విలువను పైకెత్తడానికి ప్రయత్నించవచ్చు. దీని వలన ఆర్ధికంగా బలహీనంగా వున్న ఒక్క కంపెనీ ఇంకొక్క బలమైన కంపెనీకి ఎర కాకుండా తప్పించుకోవచ్చు. ఆ కంపెనీ రీసెర్చి ఎనలిస్ట్‌లకు, బిజినెస్ టీవీ ఛానల్లలో పెద్ద పేరున్న స్టాక్‌మార్కెట్ నిష్ణాతులకు డబ్బు ముట్టచెప్పవచ్చు లేదా ఇంకో విధంగా సహాయం చేయవచ్చు, కుటుంబంలో ఎవరికో చిన్న ఉద్యోగం ఇప్పించడమో ఇలా ఎన్నో. ఒక్క షేర్ విలువ పెరుగుదల తరుగుదల వెనుక కంటికి కనిపించని ఎన్నో కథలు వుండవచ్చు. కానీ, వీటన్నిటి వెనుక మాత్రం కూటికోసం కోటి పాట్లు పడే మనిషి యొక్క దురాశ మాత్రం తప్పనిసరిగా వుంటుంది.
స్టాక్‌మార్కెట్ అక్రమాలను సెబి ఎందుకు ఆపలేకపోతుంది?
సెబిలో మొత్తం ఉద్యోగుల సంఖ్య బహుశా ఏడెనిమిది వందలు మాత్రమే అందులోనూ గుమస్తాలనూ రెగ్యులేషన్ పనికి సంబంధించని వాళ్ళను తీసి పక్కన పెడితే బహుశా ఐదువందల కంటే తక్కువ మంది వుంటారు రెగ్యులేషన్ పనిలో నిమగ్నమైన వాళ్ళు. ఇదిలా వుండగా దేశంలో లక్షలాది మంది స్టాక్‌మార్కెట్‌లో క్రయవిక్రయాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ రకరకాల సేవలు అందించడానికి స్టాక్‌బ్రోకర్లూ, డిపాజిటరీలూ, బ్యాంకులూ, రీసెర్చ్ కంపెనీలు, ఎనలిస్టులు, మీడియా, ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు వీళ్ళందరినీ కలిపితే కొన్ని లక్షల మంది ఈ స్టాక్‌మార్కెట్‌తో రకరకాలుగా ముడిపడి వున్నవాళ్ళు. వీళ్ళందరినీ కూడా స్టాక్‌మార్కెట్ ఆపరేటర్లుగా భావించవచ్చు. కేవలం స్టాక్‌బ్రోకర్లను మాత్రమే స్టాక్‌మార్కెట్ ఆపరేటర్లుగా భావిస్తారు చాలామంది ఎందుకంటే ప్రతీ క్రయవిక్రయంలో ప్రత్యక్షంగా వీళ్ళ హస్తం వుంటుంది కనుక.
ఒక్క రోజులో నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (NSE)లో దాదాపుగా వెయ్యికి పైగా కంపెనీలకు సంబంధించిన 300-350 కోట్ల షేర్లు దాదాపు 2 కోట్ల క్రయవిక్రయ లావాదేవీల ద్వారా చేతులు మారుతాయి, వీటి విలువ రూ. 50 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం లావాదేవీలు కేవలం ఒక్క స్టాక్ ఎక్ఛేంజ్‌లో అయితే, మిగిలిన స్టాక్ ఎక్ఛేంజ్‌ల లావాదేవీలను కూడా కలిపితే వాటి విలువ ఇంతకు రెండింతల పైగా వుండవచ్చు. పాపం, ఐదు వందలకంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న సెబి ఎవ్వరి మీద నిఘా వేయగలదు? ఏమి చేయగలదు?
ఇంత పెద్ద మొత్తం షేర్ల వ్యాపారంలో ఏవి అక్రమ లావాదేవీలనీ ఏవి సక్రమ లావాదేవీలనీ కనుక్కోవడం ఎవ్వరికీ సాధ్యం కానిపని. ఎవ్వరైనా ఫిర్యాదులు చేస్తే తప్ప అక్రమ లావాదేవీలు ఎవ్వరి కంట పడవు అంత సులువుగా, ఒక్కవేళ కనపడినా ఎన్నో దర్యాప్తులు చేసినా పట్టుకోవడం చాలా కష్టం అవ్వవచ్చు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్టాక్‌మార్కెట్ ఆపరేటర్లు స్టాక్‌మార్కెట్‌లో నానారకాల మాయలను, గారడీలను చేసి అమాయకమైన సామాన్య జనాలను కసాయివాడి దగ్గరకు పంపే మార్గం ద్వారా నడిపిస్తారు. సామాన్య జనాలకు మయసభలో కనిపించేవన్నీ నిజంకాదని తెలియదు కదా.
సిగరెట్ల పెట్టెల మీద వున్న హెచ్చరికలలాగా ఏవైనా లావాదేవీలు చేసేముందు అన్ని విషయాలను అర్ధంచేసుకుని చెయ్యమని మనవిచేస్తారు. మేము చెప్పేవి మా ఉద్దేశ్యాలు, అంచనాలు మాత్రమే, ఇలా అవ్వవచ్చని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వట్లేదు అని చెప్తారు. ఇన్ని చెప్పినా మిడిమిడి జ్ఞానంతో సామాన్య జనాలు బుట్టలో పడితే వాళ్ళదేమి తప్పులేదు కదా, వాళ్ళు ముందే హెచ్చరించారు కదా, తెలుసుకుని మాత్రమే దూరమని. ఆ తరవాత సామాన్య జనాల బట్టలూడిపోతే ఏంటి, ఇల్లుగుల్లైపోతే ఏంటి, వాళ్ళ తప్పేమీ లేదు కదా. టీవీల్లో వచ్చే రకరకాల వాణిజ్య ప్రకటనలలోని మోసపూరితమైన మాటల్లాగా సామాన్య జనాలకు ముసుగుతొడగడం, మభ్యపెట్టే ఏమార్చే మాటలు చెప్పడం బాగా అలవాటైన విద్య స్టాక్‌మార్కెట్ ఆపరేటర్లకు.
ఒక్క లాటిన్ జాతీయం “caveat emptor” ఇంగ్లీష్ సామెతగా మారింది (ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేస్తే “let the buyer beware”) – అంటే కొనుగోలుదారుడు తాను కొనుక్కునే వాటి గురించి జాగ్రత్తగా వుండాలని హెచ్చరిక. స్టాక్‌మార్కెట్‌లో అందరూ ఎల్లప్పుడూ ఇది మనసులో వుంచుకుని వ్యవహరిస్తే మంచిదేమో.
[1] ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎన్నో రకాలుగా వుండవచ్చు – ఒక్క కంపెనీ పెద్ద మొత్తం లాభాలను గడించినట్టో లేదా తీవ్ర నష్టాలకు గురి అయినట్టో లేదా మరొక కంపెనీను స్వాధీనం చేసుకోబోతున్నట్టో లేదా కంపెనీ యాజమాన్యం కొత్త వ్యాపారాన్ని తలపెడుతున్నట్టో లేదా వ్యాపార వృద్ధి కోసం పర దేశాలలో లైసెన్స్‌లు సంపాదించినట్టో. మార్కెట్ దృష్టి ప్రకారం, ఇలాంటి విషయాలన్నీ ఒక్క కంపెనీ షేర్ విలువను అకస్మాత్తుగా పెంచడమో తగ్గించడమో చెయ్యవచ్చు.
*
Add comment