మనసుని తాకే పిల్లల సినిమాలు : అనిల్ బత్తుల

మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్ష్యణాలు- పిల్లల దృష్టి కోణంలో ప్రపంచాన్ని చూడగలగటం.

చిన్నపిల్లల ప్రపంచం చాలా పెద్దది. వాళ్ల ఆలోచనలకి హద్దులు, ఊహలకి పొలిమేరలు ఉండవు. ఫౌంటెన్ లాగా చిమ్మే ఉత్సాహం, కెరటాల్లా పొంగే కుతూహలం పిల్లల సొంతం. అందుకే పిల్లల సృజనాత్మక దాహం తీర్చడానికి మాములు కథలు సరిపోవు. మాములు సినిమాలు వాళ్లని ఆకట్టుకోలేవు. పిల్లల మానసిక ఆవరణంలో స్వేచ్చగా తిరగగలిగే పెద్దవాళ్ళు మాత్రమే వాళ్లకి కావల్సిన కథలు చెప్పగలరు. వాళ్లకి నచ్చే సినిమాలు తియ్యగలరు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనసెరిగి తీసిన కొన్ని మంచి సినిమాల గురించి ‘పిల్లల సినిమా కథలు’ అనే పేరుతో అనిల్ బత్తుల ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం గురించిన కొన్ని ప్రశ్నలకి అనిల్ చెప్పిన జవాబులు ఇక్కడ–

ప్రపంచ బాలల సినిమాల మొత్తం లోనుంచి ఇరవయ్యైదు సినిమాలని గొప్పవని ఎంచడం అంటే సాహసమే. ఈ సంఖ్య ముందే అనుకున్నదా? ఎంపిక కి ఆధారం ఏంటి?

అసలు ఈ పుస్తకం రాయటానికి దారితీసిన పరిస్థితులను క్లుప్తంగా చెప్తాను. ఫోయిన సంవత్సరం జులై లో హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి , నా సొంత వూరికి చేరాను. ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ, నచ్చిన పిల్లల పుస్తకాలు రాసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, పక్షుల శబ్ధాలు వింటూ, మా అమ్మతో ఎక్కువ సమయం గడుపుతూ వున్నాను. ఈ సమయంలో ఒక పిల్లల యానిమేషన్ సినిమాకు మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ మాటలు రాసే క్రమంలో ప్రపంచంలోని ఉత్తమ పిల్లల సినిమాలు చూడటం ప్రారంభించాను. అంతకు ముందు కొన్ని పిల్లల ఇరానియన్ సినిమాలు చూసున్నాను. ఒక స్నేహితుడి సలహా మేరకు ‘ద కార్ట్ ‘ అనే ఇరానియన్ పిల్లల సినిమా అతి కష్టం మీద సంపాదించి చూశాను. అది హృదయాన్ని తాకింది. ఈ సినిమా గురించి ప్రజలకు, తల్లిదండ్రులకు, ఉపాద్యాయులకు, పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో, ఆ సినిమా కథా పరిచయాన్ని నా ఫేస్ బుక్ వాల్ మీద రాశాను. రాయకుండా వుండలేకపోయాను, అంత కదిలించింది ఆ చిత్రం. ఇలా మొదలయ్యింది నా పిల్లల సినిమా ప్రయాణం. ఏ సినిమాలు చూడాలి అనేది పెద్ద ప్రశ్న. బాలల చిత్రాలను వెతకడం, ఎంపిక చేసుకోవడం చాలా కష్టమైన పని. మిత్రులు సినిమా పేర్లు సూచించి సలహాలు ఇచ్చారు. ఊహతెలిసిన వయసు నుండి పన్నెండు ఏళ్ళ పిల్లల వరకు చూడదగ్గ మనసును తాకే పిల్లల చిత్రాల సమాచారంతో [ కథా పరిచయాలతో] ఏదైనా పుస్తకం వుందా అని వెతికాను. ప్రపంచంలోని ఏ భాషలోను అటువంటి పుస్తకం లేదు అని నా పరిశోధనలో తేలింది. మనమే ఎందుకు రాయకుడదు? అనిపించి ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాను. అలా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఎంపిక కి ఆధారం ఒకటే ‘మనసుని తాకాలి’. సినిమా చుశాక కూడా దాని ప్రభావం కొంత కాలం లేదా జీవితాంతం వెంటాడాలి. అటువంటి చిత్రాలనే ఎంచుకున్నాను. 

వీటిల్లో ఎనిమిది ఇరానియన్ సినిమాలే ఉన్నాయి. ఎందుకని?

ఈ పుస్తకంలో ఎక్కువగా ఎనిమిది ఇరానియన్ సినిమాలే వుండటానికి కారణం- వాళ్ళు పిల్లల ఉత్తమ సినిమాలు తీయటంలో అగ్రగణ్యులు. అక్కడ వున్న కఠిన సెన్సార్ నిబందనల వల్ల వాళ్ళు పిల్లల చిత్రాల మీదే తమ సర్వశక్తులు ఒడ్డారు. ప్రపంచంలోనే ఉత్తమ పిల్లల చిత్రాలు తీశారు, తీస్తున్నారు. ఇరాన్లో సినిమా తీయటానికి ముందు ఫిల్మ్ స్క్రిప్ట్ ని సెన్సార్ వాళ్ళకి పంపి అనుమతి తెచ్చుకోవాలి. అనుమతి వచ్చాకే సినిమా తీయాలి. ఇలా బోలెడు కష్టమైన నిబంధనలు వుంటాయి. ఇరాన్ పిల్లల సినిమాలు సూటిగా మనసుని తాకుతాయి. అందుకే అవి ఈ పుస్తకంలో ఎక్కువగా వున్నాయి. 

మనదేశంలో పిల్లల సినిమాలు గతంలోను, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది?

మనదేశంలో పిల్లల సినిమాల్ని మెలో డ్రామా, పాటలు తినేస్తున్నాయి. అవి లేకుంటే గొప్ప సినిమాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం తక్కువగా వచ్చినా మన దేశం నుండి మంచి పిల్లల సినిమాలే వస్తున్నాయి.

ఈ మొత్తం లిస్ట్ లో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ‘బాలరాజు కథ”. దీన్ని ఎంచుకోవడానికి కారణాలేంటి?

హృద్యమైన కథ, మహాబలిపురం నేపధ్యం ఈ సినిమా ఎంచుకోవటానికి ప్రధాన కారణం.

సాంకేతికత, హృద్యమైన కథ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, పిల్లల గురించి పెద్దవాళ్లకి అర్థమయ్యేలా చెప్పడం, పెద్దవాళ్ల ప్రపంచాన్ని పిల్లలకి పరిచయం చెయ్యడం, వీటిల్లో ఒక మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలేంటి? ఇవి కాక మిగతా ఏ లక్షణాలుంటే అది మంచి బాలల సినిమా అవుతుంది.

మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలు- పిల్లల దృష్టి కోణంలో ప్రపంచాన్ని చూడగలగటం. మనం రోజు చూసే దృశ్యాలనే కథతో పాటు కవితాత్మకంగా చూపించగలగటం. ప్రేక్షకుల మనసుల్ని కదిలించగలగటం. కథే ప్రాణం. ఆ కథని ఎంత గొప్పగా చెప్పామనేది కూడా చాలా ముఖ్యం.

నువ్వు గనక పిల్లల సినిమా తీస్తే అది ఎలా ఉంటుంది? ఏ అంశాలమీద ఎక్కువ దృష్టి పెడతావు?

భలే ప్రశ్న అడిగావు. ప్రస్తుతం ఒక పిల్లల సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నా. వచ్చే సంవత్సరం పిల్లల సినిమాకి డైరెక్షన్ చేయాలనేది నా ఆశయం. పిల్లవాడు లేదా చిన్నారి పాప కనురెప్పల నుండి ప్రపంచాన్ని చుపెట్టడమే నా సినిమా లక్ష్యం.

నువ్వు తీసుకొచ్చిన ‘పిల్లల సినిమా కథలు పుస్తకం; డిజైన్ పరంగా బాగుంది. బుక్ డిజైనింగ్ విషయంలో నీకున్న ప్రత్యేకమైన ఆసక్తి గురించి కొంత చెప్పు.

ఊహ తెలిసిన వయస్సు నుండీ 12 సంవత్సరాల వయస్సు వున్న పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే వినూత్న పుస్తకం. 130 జి.యస్.యం ఆర్ట్ పేపర్ పై ముద్రించిన ఈ పుస్తకం ఒక లిమిటెడ్ ఎడిషన్. రీప్రింట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కవర్ పేజ్ బొమ్మ మొషే డయాన్ గీశాడు. ఈ పుస్తకాన్ని బంగారు బ్రహ్మం డిజైన్ చేశారు. ఆయన ఇచ్చిన లే అవుట్ కి, కొన్ని మార్పులు చేస్తూ నేను పేపర్ మీద లే అవుట్ గీశాను. దానికి అనుగుణంగా బంగారు బ్రహ్మం అద్భుతంగా డిజైన్ చేశారు….. పర్స్పెక్టివ్ రామ కృష్ణ గారు ప్రింటింగ్ పనులకు చాలా సాయం చేశారు. పుస్తకం బయటకు రావటానికి ఎంతో మంది మిత్రులు సాయం చేసారు, వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు.  నాకు పుస్తకాల డిజైన్ అంటే చాలా పిచ్చి. బుక్ కవర్ పేజీలను ప్రత్యేకంగా స్టడీ చేస్తాను. బుక్ డిజైన్ కు సంబందించిన పుస్తకాలను జపాన్ నుండి, జర్మనీ నుండీ, రష్యా నుండి తెప్పించుకుని చదివేవాడిని. రెగ్యులర్ గా వున్న ఫార్మేట్ ను బద్దలు కొట్టడం నాకు అత్యంత ఇష్టం.  ప్రపంచంలో వివిధ సైజుల్లో వున్న పిల్లల పుస్తకాలు తెప్పించుకునే వాడిని, ఆ లే అవుట్ ని అర్థం చేసుకోవడానికే ఇదంతా చేసేవాడిని. సోవియట్ పుస్తకాల సేకరణ కూడా నాకు ఈ విషయంలో దోహదపడింది. ఆ పుస్తకాలు బుక్ డిజైన్, లే అవుట్ ఇంకా ప్రింటింగ్ లో ఉన్నత ప్రమాణాల్ని సృష్టించాయి. ఇవన్నీ నా ప్రస్తుత పుస్తకానికి ఇన్స్పిరేషన్. ఈ పిల్లల సినిమాలకు మూలమైన పుస్త కాలను చదివాను. ఆ పుస్తకాల ముఖచిత్రాలు ఇప్పటి నా పుస్తకానికి అదనపు ఆకర్షణ.  సోవియట్ యూనియన్లో ముద్రింపబడిన ఇంగ్లీష్ పిల్లల పుస్తకాలు ఒక 500 దాకా సేకరించాను. అవి వివిధ సైజుల్లో, వివిధ లే అవుట్లలో రంగులలో ఆర్ట్ పేపర్ పై ముద్రించిన పుస్తకాలు. మా ఇంట్లో ఒక పెద్ద బీరువా నిండా ఇవే వుంటాయి. వాటిలో అద్భుతమైన బొమ్మలుంటాయి. ఈ పుస్తకాలు నాకు బుక్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటి మీద అవగాహనను పెంచాయి.

ఈ పుస్తకం ముఖచిత్రం మొషే డయాన్ గీశారు కదా! అది ఆసక్తిదాయకంగా వుంది, ఆ చిత్రం వెనకున్న కథ ఏమిటి?

మోషే కవర్ బొమ్మ వెనక కథ ఇది. నేను, మోషే, మరో ఇద్దరు మిత్రులతో కలిసి మొన్న డిసెంబర్ చివరి రోజుల్లో హంపి వెళ్ళాము. ఒక రోజు ఉదయం మోషే, నేను యాంటిక్ షాప్ లో మెటల్ బొమ్మలు  చూస్తున్నాము.  అప్పుడు నేను మాటల మధ్యలో ‘నా చిన్నప్పటి తొలి సినిమా గూడూరు లోని యెస్.ఆర్.ఏ టాకీస్ లో చూశానని, ఆ హాలు పైన పెద్ద చేప బొమ్మ, భూగోళం బొమ్మ ఉన్నాయని’ చెప్పాను. అవి ఎందుకు అలా ఉన్నాయో నాకు ఇప్పటికీ సమాధానం దొరికలేదని చెప్పాను. అతికష్టం మీద ఫేస్ బుక్ ద్వారా శ్రీనివాసులు అనే మిత్రుడు, 90 లలో కూలగొట్టిన ఆ సినిమా హాలు ఫొటోలు పంపాడని చెప్పాను. మోషే నవ్వి ఇలా అన్నాడు- ” అనిల్, నువ్వు అట్లాస్ లా ఆ ప్రశ్నను చిన్నతనం నుండి ఇప్పటికీ మోస్తున్నావు. కానీ ఆ హాలు పై ఉన్న చేపకు సమాధానం తెలిసినా అది చెప్పదు, అది నిన్ను చూసి నవ్వుతుంది. ఆ చేప పై ఉన్నది భూగోళం లేదా ఒక కలల కాస్మిక్ ప్రపంచం కావొచ్చు. ఇది నేను బొమ్మ వేస్తా అనీల్” అన్నాడు. ఆ రోజు 31 డిసెంబర్ 2020. రఫ్ స్కెచ్ గీసి రాత్రి చూపించాడు. అది చూసి ప్రేమతో హగ్ చేసుకున్నా. ఫైనల్ స్కెచ్ 4 జనవరి 2021 రోజున గీసిచ్చాడు. ఆ బొమ్మ  నా చిన్ననాటి తడి జ్ఞాపకం. కానీ దానికి ప్రాణం పోసిన బ్రహ్మ పేరు మోషే. 

P.S: ఆ బొమ్మని పటం కట్టించుకుని ఇంట్లో అపురూపంగా గోడకు తగిలించి నమస్కరించుకున్నాను. ధన్యవాదాలు మిత్రమా, నా బొమ్మల బ్రహ్మ!

ఈ పుస్తకంలో వాడిన ఫోటోలు ఎక్కడినుంచి తీసుకున్నావు? ఎలా ఎంపిక చేశావు?

గూగుల్ లో వెతికి మంచి రెసొల్యూషన్ వున్న సినిమా పొస్టర్లు , సన్నివేశాల చిత్రాలు తీసుకున్నాను. ముఖ్యంగా సినిమా మూలకథను తెలియజేసే చిత్రాలు, ప్రధాన పాత్రలైన పిలల్ల బొమ్మలు ఎంచుకున్నాను.

పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?

పిల్లల సినిమా కథలు – అనిల్ బత్తుల

184 పేజీల ఈ పుస్తకం ధర – Rs.200/-

సోల్ డిస్ట్రిబుషన్ & ప్రతులకు :

నవోదయ బుక్ హౌస్

ఆర్యసమాజ్ ఎదురు వీధి,

కాచిగూడా చౌరాస్తా , హైదరాబాద్ – 500027

ఫోన్ : 040-24652387

పుస్తకాన్ని ఆన్ లైన్లో కొనటానికి:

https://www.telugubooks.in/products/pillala-cinema-kathalu

ఇంకేవైనా పుస్తకాలు రాస్తున్నావా?

ఈ పుస్తకానికి సీక్వెల్ రాస్తున్నాను. దాని పేరు ‘బాలల సినిమా కథలు’. ఇలానే మరో 25 బాలల ఉత్తమ చిత్రాల కథలను నేటి తరానికి పరిచయం చేయాలని నా మరో ప్రయత్నం.

*

స్వాతి కుమారి

6 comments

Leave a Reply to Anil battula Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి ఇంటర్వ్యూ. టచీగా ఉంది.

    – మనదేశంలో పిల్లల సినిమాల్ని మెలో డ్రామా, పాటలు తినేస్తున్నాయి. అవి లేకుంటే గొప్ప సినిమాలు వస్తాయని నేను నమ్ముతున్నాను –

    పిల్లల సినిమాలనె కాదు పెద్దల సినిమాలను కూడా మెలోడ్రామా, పాటలు, కుప్పిగంతులూ తినేస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో నటులు కుప్పిగంతులు వేసె సినిమాలు తీసేది ఇండియాలోనేమో 🙂

    అభినందనలు అనిల్ . లవ్ యూ .

  • తెలుగు బుక్స్ ద్వారా కొరియర్ లో పుస్తకం అందింది ..
    మంచి సినిమాలు పరిచయం చేశారు. చాలా సినిమాలు చూ సినవే అయినా
    మళ్ళీ చూడాలనిపించేవి.

    తెలుగులో “లిటిల్ సోల్జర్స్ “కూడా మంచి పిల్లల సినిమానే .. ఇప్పటి తరానికి బాగా
    నచ్చే సినిమా ..

    మీ ప్రయత్నం అభినందనీయం. .. మంచి పిల్లల చిత్రం తీయాలనే మీ ప్రయత్నం నెరవేరాలి అని కోరుకుంటున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు