మనం రెండక్షరాలం!

రాతిలో‌ మొలుచుకొచ్చిన చెట్టులా
కోత దుంగను కౌగిలించిన చిగురులా
నరికి పారేసినా నడిచే జీవంలా
ప్రేమ మొండిగా ప్రాణంతోనే వుంటుంది
కొనప్రాణంతో కాచుకొని వుంటుంది
రూపాలు మార్చుకొని
పరకాయ ప్రవేశం చేస్తుందని
నాకెందుకు అనిపిస్తుంది?
ఒకప్పుడు ఇక్కడ ఒక జంట
ప్రేమ ఊసులు నెమరేసుకున్నారని
నిట్టూర్పులతో ఎదురుచూపులు
కుప్పబోసుకున్నారని..
ఈ రాతిశిలల మీద
రహస్య రాయబారాలు రాసుకున్నారని
ఒకరి కళ్ళల్లో ఒకరు
కలత నిద్రలు పోయారని..
పుటల మీద పరిచిన ఒక కథ చెపుతుంది
చెమరించి అల్లిన ఏ కవిత్వమో చెపుతుంది
కలాలు కాగితాలు లేని రోజుల్లో
ఈ ప్రేమికుల నిట్టూర్పుల్ని
కాలాలు దాటి ఎవరు మోసుకొచ్చారో ?
భూమిపొరల్లో కప్పబడిన కథల్ని
ఎవరు తవ్వి తీస్తున్నారో ?
ప్రేమ ఏ పుస్తకంలో ఊపిర్లుతీస్తున్నా
దాని వేర్లకుదుర్లు కాలగర్భంలో..
కళ్ళలో పాకుతూ తేలే
ప్రణయ ఊహల ఊడల నీడలు
అందని లోతుల్లో..
నిన్నని ఈరోజుని రేపటి రోజుని
కాలం అన్నింటినీ తనలో కలుపుకుంటుంది
నువ్వు నేను మన జ్ఞాపకాలు
దివారాత్రుల అనంత చక్రభ్రమణంలో
అదృశ్యంగా కరిగిపోతాయి
నువ్వొకటి నేనొకటి
రేపు
మనం రెండక్షరాలం.
*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కలాలు కాగితాలు లేని రోజుల్లో
    ఈ ప్రేమికుల నిట్టూర్పుల్ని
    కాలాలు దాటి ఎవరు మోసుకొచ్చారో ?

  • చక్కని కవిత. అభినందనలు శ్రీనివాస్ గారు

  • అద్భుతమైన కవిత..
    కాలాలను దాటి ఒక ప్రేమ ..
    పుటల మీద కథగా నిలవడం …
    రెండక్షరాలుగా శిలల మీద శిల్పంగా
    మిగలడం..
    అంతా ప్రేమే…
    అంతటా ప్రేమే…

  • ‘మనం రెండక్షరాలం’ అంటూ..”ప్రేమ” యొక్క శాశ్వతత్వాన్ని, దాని అదృశ్యమైన ఉనికిని అద్భుతంగా చిత్రీకరించారు శ్రీనివాస్ గౌడ్ గారు. మొదటి భాగంలో..ప్రేమ యొక్క మొండి పట్టుదలని, విడిచిపెట్టని స్వభావాన్ని సూచించారు. అలాగే, ప్రేమ..రూపాలు మార్చుకొని పరకాయ ప్రవేశం చేస్తుందని అనిపించడం, దాని నిరంతర పరిణామానికి, పునర్జన్మకు ప్రతీకగా చెబటం బాగుంది.
    కలాలు, కాగితాలు లేని రోజుల్లో కూడా ప్రేమికుల నిట్టూర్పుల్ని కాలాలు దాటి ఎవరు మోసుకొచ్చారో అనే ప్రశ్న..ప్రేమ యొక్క చరిత్రను, దాని నిశ్శబ్ద ప్రయాణాన్ని సూచించడం బాగుంది.

    కవిత చివరలో ప్రేమ యొక్క లోతైన తాత్వికతను ఆవిష్కరించిన కవి అభినందనీయుడు. భూమి పొరల్లో కప్పబడిన కథలు, కాలగర్భంలో కలిసిపోయే వేర్ల కుదుర్లు, అందని లోతుల్లో ఉండే ప్రణయ ఊహలు ప్రేమ యొక్క నిగూఢత్వాన్ని, అంతుచిక్కని స్వభావాన్ని చాటిచెప్పాయి.

    కవిత చివరివాక్యాల్లో కాలం అన్నింటినీ తనలో కలుపుకుంటుంది అని చెప్పడం, మనం, మన జ్ఞాపకాలు దివారాత్రుల అనంత చక్రభ్రమణంలో అదృశ్యంగా కరిగిపోతామని సూచిస్తుంది.

    నువ్వు, నేను అనే ఇద్దరం రేపు రెండక్షరాలం మాత్రమే అవుతామనే వాక్యం, మానవ ఉనికి క్షణభంగురమైనదని, కానీ మన ప్రేమ అనే భావం నిరంతరం ఉంటుందని సూచిస్తుంది.

    ఈ కవిత ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని, దాని నిశ్శబ్ద ప్రయాణాన్ని, కాలంతో దాని సంబంధాన్ని ఒక తాత్విక కోణంలో అద్భుతంగా ఆవిష్కరించింది. కవితా శీర్షికతోనే కవితకు ముగింపు పలకడం నచ్చింది.మంచి కవితను అందించిన మిత్రుడు గౌడ్ గారికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు