మతాలకతీతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం!

మతాలకతీతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం!

ముస్లిం సమాజంపై విష ప్రచారాన్ని ఖండిద్దాం!!

కరోనా వైరస్ మానవ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. జనం చచ్చిపోతున్నారు. అనేక మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చనిపోవటం ఒక రకమైన విషాదమైతే బతుకు దెరువు కోల్పోయి నరకయాతన అనుభవిస్తూ బతకటం మరింత ఘోరమైన విషాదం. కులం, వర్గం, మతూ, లింగం, ప్రాంతం, దేశాలకి అతీతంగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. అన్ని రకాల ప్రజలకి, అన్ని దేశాల ప్రభుత్వాలకి ఇది ఒక పెను సవాలు. ప్రజలను ఈ విపత్తు నుండి రక్షించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వాలపైనే వుంటుంది. ఈ విపత్తు పట్ల ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అందుబాటులో వున్న వైద్య, పోలీసు, మీడియా, సామాజిక, సాంకేతిక, మానవ వనరులని సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్, క్వారంటైన్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ లాంటి పద్దతులని అమలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే  మన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ అమలు చేస్తూనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వ్యూహాలతో కరోనాని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుతో జనతా కర్ఫ్యూ, చప్పట్లు కొట్టటం, దీపాలు వెలిగించటం లాంటి కార్యక్రమాలలో  కోట్లాదిమంది దేశ ప్రజలు కుల, మతాలకి అతీతంగా పాల్గొన్నారు.
ఇదే సమయంలో మరొక వాస్తవాన్ని కూడా గమనించాలి. ప్రభుత్వం లాక్ డౌన్ అమలులోకి తెచ్చిన పద్ధతి కోట్లాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. హడావుడిగా కాకుండా, తగినన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ప్రజలు సిద్దపడేందుకు, సర్దుకునేందుకు, తమ తమ ప్రాంతాలకి, ఇళ్ళకి చేరుకోటానికి కొంత సమయాన్నిచ్చి, అవసరమైన ఏర్పాట్లని చూపించి లాక్ డౌన్ చేసివుంటే పేద ప్రజలకి కొంతలో కొంతైనా మేలు జరిగేది.  పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలనుంచి పట్టణాలకు వచ్చి బతుకులు వెళ్లమారుస్తూన్న కోట్లాదిమంది అసంఘటిత నిరుపేద వలస కార్మికులు, శ్రమజీవులు పిల్లాపాపలతో వీధుల పాలయ్యారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తమతమ ఇళ్ళకి చేరుకోవాలని ఆకలి దప్పులతో వందలు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తున్నారు.  పసిపిల్లలు, ముసలివాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు. మరోప్రక్క మధ్య తరగతి కుటుంబాలలో గృహహింస పెరిగిపోయి మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నట్టు తెలుస్తుంది. రోజువారీ కూలిమీద, రోజువారీ బేరాల మీద ఆధారపడి బతికే అనేక కుటుంబాలు కనీస అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు.  ఈ విధంగా ఎన్నో కష్టాలని, నష్టాలని ఎదుర్కొంటూ, బతుకు బీభత్సాన్ని దిగమింగుకుంటూ ప్రజలు, మరీముఖ్యంగా పేదవాళ్ళు ప్రభుత్వ ఆదేశాలకి, నియమ నిబంధనలకి కట్టుబడి,ఈ కరోనా మహమ్మారి నుండి ఎప్పుడూ బయటపడదామా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఒకరికొకరు తోడుగా, ప్రేమగా, పలకరించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ రోజుల్ని లెక్కిస్తున్నారు.
ఈ సానుకూల వాతావరణాన్ని కలుషితం చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది. న్యూఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగ్ జమాఅత్ కేంద్ర కార్యాలయం (మర్కజ్)లో జరిగిన ఒక ధార్మిక సదస్సును నెపంగా తీసుకొని ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో విష ప్రచారం మొదలయింది. భారత దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తికి కేవలం తబ్లీగ్ జమాఅత్ లేదా ముస్లిం సమాజమే పూర్తిగా కారణం అనే రీతిలో ఈ ప్రచారం సాగుతుంది. ‘కొరోనా జిహాద్’, కోరోనా ఉగ్రవాదం’, ఇస్లామిక్ పునురుత్థానం’, వంటి పదాలు కూడా వాడుకలోకి వొచ్చాయి. భారత దేశానికి మళ్ళీ కొత్తగా ముస్లిం ముప్పు ముంచుకు వచ్చిందనే కథనాలతో మీడియా మారుమోగుతుంది.   ప్రస్తుత సందర్భంతో ఏ మాత్రం సంబంధం లేని రకరకాల దృశ్యాలను జత చేసి, వింత వింత కథనాలను మీడియా ప్రసారం చేస్తుంది. ఉన్నట్టుండి ముస్లింలు కొత్తగా ఏదో ప్రమాదకరమైన పెద్ద విద్రోహ చర్యకు పాల్పడ్డారా అని మిగిలిన సమాజం భయభ్రాంతం అయ్యేంతగా ఈ ప్రచారం సాగుతుంది. అనేక పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ముస్లింల పట్ల వ్యతిరేక వైఖరి తీసుకొని బలంగా ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ముస్లింలను ముట్టుకుంటే చాలు కోరోనా వైరస్ అంటుకుంటుందని అనుమానాలు సృష్టిస్తున్నాయి. కోరోనా వైరస్ నుండి ఆత్మ సంరక్షణకు పాటిస్తున్న సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) ముస్లింల విషయంలో సామాజిక వెలివేత (సోషల్ బాయ్ కాట్) రూపం ధరిస్తుంది. ఈ పరిస్థితి సమిష్టిగా కోరోనాపై సాగుతూన్న పోరాటస్పూర్తికి గొడ్డలి పెట్టు. వైద్యులు ముస్లింలకు వైద్య సేవలు అందించటానికి భయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనేక చోట్ల ముస్లింలను పనుల్లోకి రావొద్దని ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. దేశ వ్యాపితంగా ముస్లింలు అపరాధ, అభద్రతా భావనతో బతుకులు వెళ్ళదీయాల్సిన దుస్థితి దాపురించింది. మిగిలిన సాధారణ బాధలతో పాటు ముస్లిం సమాజం అదనంగా దారుణమైన మానసిక హింసను అనుభవిస్తున్నది. ప్రజల్లో పరస్పరం అవిశ్వాసం, విద్వేషం పెంచి సమాజాన్ని నిట్టనిలువుగా చీల్చే ఈ చర్యలు విద్రోహపూరితమైనవి, విచ్ఛిన్నకరమైనవి, చట్ట విరుద్ధమైనవి. కరోనా వ్యాప్తికి ఒక వర్గమో, కులమో, మతమో కారణం కాదని అందిరికీ తెలుసు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, ఏ ఒక్క దేశ సమస్య కాదని, ఇది సమస్త మానవాళి ఎదుర్కొంటున్న ఒక మహా విపత్తు అని, కరోనా ఒక మహమ్మారి అని తెలియని మనిషి లేరంటే అతిశయోక్తి కాదు.
మన దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తికి కారణాలు అనేకం అయినా సమిష్టిగా బాధ్యత వహించాల్సిన సమయం. ఈ విపత్తుని ఎదుర్కొనటంలో మనకి అనేక పరిమితులు, వైఫల్యాలు వున్నా వాటిని ప్రక్కన పెట్టి మనకున్న మానవ వనరులు,  విలువలపై ఆధార పడాల్సిన సమయం. మన దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తికి కేవలం తబ్లీగ్ జమాఅత్, లేదా ముస్లింల చర్యలే కారణం అనే విష ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం. కొంతమంది మత విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు కావాలనే ఒక పథకం ప్రకారం ముస్లిం సమాజాన్ని వికృతీకరిస్తూ సామాజిక మాధ్యమాలలో అమానవీయమైన ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి క్రూరమైన చర్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఈ చర్యలకి బాధ్యులైన వారిపై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాం.  అదే విధంగా మరోసారి ముస్లింలను బలిపశువులను చేసే కుతంత్రాల్ని బట్టబయలు చేసి, మత సామరస్యాన్ని పెంచే దిశగా ప్రయత్నించాలని అన్ని రకాల మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మర్కజ్ ధార్మిక సదస్సులో పాల్గొన్నవారు, వీరితో కలిసిన ఇతర ముస్లింలు స్వచ్చందంగా ఆయా అధికారుల వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకొని, డాక్టర్ల సలహాలు పాటించి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము.

కరోనా వైరస్ ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా  ఇది సమస్త మానవాళి ఎదుర్కొంటున్న ఒక మహా విపత్తు. సమైక్యంగా, సంఘటితంగా, రాజకీయాలకీ, మతాలకీ అతీతంగా మనం ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.

బూర్గుల నర్సింగరావు, స్వాతంత్ర సమర యోధులు;  కె. శ్రీనివాస్, ఎడిటర్, ఆంధ్రజ్యోతి; ప్రొఫెసర్ రమా మేల్కోటే; కె. రామచంద్ర మూర్తి, సీనియర్ జర్నలిస్ట్; ప్రొఫెసర్ హరగోపాల్, పౌర హక్కుల సంఘం నాయకులు;  జహీర్ అలీ ఖాన్, సియాసత్; అమీర్ అలీ ఖాన్, సియాసత్; అల్లం నారాయణ, జర్నలిస్ట్; బి. నర్సింగరావు, సినీదర్శకుడు; ఖాదర్ మొహియుద్దీన్,  జర్నలిస్ట్; గీతా రామస్వామి, ప్రచురణకర్త;  విమల, కవి; లెల్లె సురేష్, కవి; జీవన్ కుమార్, వి.యస్.కృష్ణ,  మానవ హక్కుల వేదిక; జస్టిస్ చంద్రకుమార్; ఎన్. వేణుగోపాల్, జర్నలిస్ట్; బి.బి.జి. తిలక్, రచయిత తదితరులు 

విమల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు