సలికాలం మాగిపొద్దు. జల్దిన పొద్దిమీకుతది. రాత్రి పెద్దది పగలు చిన్నది. “కుక్కుడూకూ” అని గూట్లె ప్రకృతి అలారం కోడిపుంజు కూతేశింది. దాని సౌండు నిదిరిస్తున్న యాభై ఏళ్ల అమీనమ్మ చెవుల్లో పడింది. ఒక్క ఉదుటున నిద్రలేచింది. లేస్తూనే తన అరచేతులను చూసుకుంది. “యా రహీం యా కరీం.. ఎల్లవ్వ.. నల్ల పోషవ్వ నువ్వే సల్లగ సూడాలి” లోగొంతుతో అనుకుని నోటితో గాలిని చేతులకు ఊదుతూ.. ఆ అరచేతులను తన ముఖానికి మర్దన చేసుకుంది. తన చెవులకు ఉన్న మఫ్లర్ తీసేసి, చిక్కులుగా ఉన్న తన నెరిసి వెండి రంగులో ఉన్న తెల్లని వెంట్రుకలను వేళ్లతో దువ్వుకుని సరిచేసి సిగలా ముడి వేసుకుంది. అనంతరం ఆ మప్లర్‌ను చెవులకు నిండుగా కప్పినట్టు కట్టుకుంది. నిన్న పొద్దంత పొలంల కలుపులు తీసి నడుము నిర్రున నీలిగిపోయినట్టైంది అమీనమ్మకు. కాస్త గునుగుతూనే లేచింది పక్క బట్టలు సర్దడానికి. పక్క బట్టలు సర్దుతూ గూట్లో వెలుగుతున్న దీపాన్ని చూసింది. ఆ గూడు కింద నిద్రపోతున్న మనవడు జాకీర్ వైపు చూసింది. నిండా నల్లని ఉన్ని గొంగడి కప్పుకుని గుర్రుకొడుతూ నిద్రపోతున్నాడు. అనుమానంగా తల గోక్కుంటూ లోపలి అర్రవైపు చూసింది. అర్రలో జాకీర్ భార్య అన్వరీ నిద్రపోతోంది. ఆమె పక్కలో రెండేళ్ల చిన్నబాబు సాజిద్ నిద్రపోతున్నాడు. ముని మనవడిని చూడగానే అమీనమ్మ ముఖంలో ఆనందం. ఆ వెంటనే జాకీర్, అన్వరీలని పరిపరిగా చూస్తూ చిత్రంగా ముఖం పెట్టింది. “ఉం.. ఈల్లేం పెండ్లాం మొగోల్లో ఏమో. ఒక్క పిల్లను కనంగనే సాలిచ్చుకున్నట్టున్నరు.
అప్పుడే ఆయిన ఈడ.. ఆమె ఆడ. ఏం సంసారాలు జేస్తరో ఏమో ఇప్పటోళ్లు. ఈ పోరడు ఏందో ఏమో. ఆమె సప్పటిదే.. ఈడు సప్పటోడె. ఉండుర్రి బిడ్డెలార రేపటిసంది కూరల ఉప్పూకారం బగ్గ నూకుత. మా పెద్దమన్షి ఉండే.. ముల్లడిచ్చుట్ల నంబరేక్ ఉండె. రేపు సస్తడనంగ గూడ నా కొంగు ఇడ్వలేదు నా పెద్దమన్షి. దండి అక్రమాశోడు ఉండె. తాత గుణంల ఒక్కటంటే ఒక్కటి గూడ తేలేకపోయిండు ఈ ఏడువోడావ్‌లోడు” అంటూ గొణుక్కుంటూ దీపం పట్టుకుని బయట తలుపు దగ్గరకు నడిచింది. దండెం మీదున్న కుంచి అందుకుని కప్పుకుంటూ గొళ్లెం తీసి బయటకు వెళ్లింది. గొళ్లెం సడి వినగానే కొట్టంలోని ఆవులు, బర్రెలు, మరో కొట్టంలో ఉన్న మేకలు తోకలు, చెవులు ఆడిస్తూ, కాళ్లతో నేలను రాస్తూ, తలలు ఊపి రమ్మంటున్నట్టే అరిచాయి. యజమానురాలు తమ కొట్టం శుభ్రం చేసి తమను చింత చెట్టు కింద ఉన్న తలుగుకు కట్టేస్తుందని వాటికి ఎరుక. అందుకే ఆత్రంగా మెడకున్న తలుగును గుంజులాడుతున్నాయి.
కప్పుకున్న కుంచిని నడుముకి చుట్టుకుని కొట్టం వైపు వడివడిగా కదిలింది అమీనమ్మ. ఒక్కో దాని మెడలోంచి తలుగు తీసేస్తుంటే అవి నేరుగా వెళ్లి చింతచెట్టు కింద తలుగు మీద నిలబడుతున్నాయి. వాటిని అక్కడ కట్టేస్తుండగా “అమీన శిన్నీ లేశినవా” అంటూ పిలిస్తున్న మేదరి నర్సవ్వ పిలుపు వినబడింది. “ఆఆ లేశిన నర్సవ్వా.. రారా” అంది. “ఏమచ్చుడో ఏమో సలి ఇగం లేశింది. జరంత జర్ద వెట్టు. ఆకు, సున్నం, కాసు ఉంది గనీ” అంటూ అమీనమ్మ దగ్గరికి వచ్చేసింది నర్సవ్వ. ఎదురింట్లో ఉంటుంది నర్సవ్వ. ఇద్దరిదీ ఒకే వయసైనా చిన్నమ్మ, కూతురి వరస పెట్టుకుని పిలుచుకుంటారు వాళ్లు. అమీనమ్మ తన బొడ్లో ఉన్న సంచిని తీసింది. “నా దగ్గర గూడ జర్జ దగ్గర వడ్డది. పోయిన అంగడి తెచ్చుకున్నది. ఈ అంగడికి జర్రంత ఎక్కనే తెచ్చుకునాలే” అంటూ సంచిలోంచి సున్నంకాయలు తీసింది. వాటిలోంచి ఓ డబ్బీలోంచి జర్దా తీసి నర్సవ్వ అరచేతిలో వేసింది. ఆలోపు ఇద్దరికీ ఆకులో సున్నం, కాసు పెట్టి సిద్ధం చేసింది నర్సవ్వ.
ఓ మడతపెట్టిన ఆకును అమీనమ్మకు అందించింది. ‘‘పాశి మొకాన్నే ఆకు తినుమంటున్నవా’’ అంటూనే ఆకు తీసుకుని వేసుకుంది. తర్వాత అరచేతిలో జర్దా గుమ్మరించుకుని దవడకు వేసుకున్న అమీనమ్మ యథావిధిగా తన పనిలో నిమగ్నం అయింది. నర్సవ్వ మాటలు కలిపింది. ‘‘అవునే శిన్నీ.. ఇయాల్లా లొంకలపల్లి గట్టుకు గిన వోదామా. పొయిలకు కట్టెలు పూరగ లేకుంట అయినయి’’ అంది నర్సవ్వ ఆకు నములుతూ. ‘‘ఇయాల్ల గండ్లె పొలంల మిగిలిన కొన గుంటల కలుపు తీద్దామనుకుంటున్న. ఇయాల్ల తియ్యకపోతే సాలు తప్పుతదే నర్సవ్వా’’ అంటూ లేగలను, దూళ్లను, మేకలను చింతచెట్టు కింద తలుగులకు కట్టేస్తోంది అమీనమ్మ. ‘‘నీ మన్మన్నీ, మన్మరాలును పొమ్మను కలుపు తియ్య’’ అంది నర్సవ్వ. ‘‘అద్దే.. ఆమెకు సంటి పిలగాడు ఉన్నడు. మొన్నటిదాక ఆడు ఇత్మార లేకుంట పనులు జేశిండు. అయినా మావోడు ఇంట్ల గ్యాస్ బుడ్డి ఉండంగ ఇంకా గా కట్టెలపొయ్యి ఎందుకు అంటున్నడు” ‘‘అట్లన్నాడు.. అయినా నీ మన్మడు, మన్మరాలు గంత సదువుకొని గూడ వ్యవుసం జేస్తున్నరు. తారీప్ గల్లోల్లు ఆల్లు. అగో నా మన్మడు ఉన్నడు ఏమంట పెద్ద సదువు సదువ పట్నం బోయిండో.. ఆ కాన్నుంచి పల్లెటూరు అంటే ఇశీశి అంటున్నడు.
కాలుకు పొలంల బుర్జ అంటినా ఒసోసా అంటున్నడు. అట్ల మనూర్ల శానమంది పోరగాండ్లు జమైతున్నరు. ఇట్లైతే మన తరం ఎన్క వ్యవుసం జేశేటోళ్లు కరువైతరు. పోరగాండ్లు నీ మన్మని లెక్కట ఉండాలె గనీ.. వ్యవుసానికి ఎంతో శాని అస్తది. తెలివిగల్లోడు వ్యవుసం జేస్తే ఆ తరువాయే ఏరుంటది. పొలానికి ఎరువు ఎంతో జిగో సదువుకున్నోల్లు వ్యవుసం జేస్తే వ్యవుసానికి అంత జిగి. సరే, నీ ఇష్టం తియ్ గనీ.. మా ఇంటికి ఇయ్యాల్ల ఒగ లీటర్ పాలు ఎక్క పంపియ్యి’’ అంది నర్సవ్వ ఎర్రని ఉమ్మిని అటు పక్కన తుప్పున ఉమ్మేస్తూ.
‘‘ఎందుకే సుట్టాలు గిట్టాలు అస్తున్నరా ఏంది?’’ సంశయించింది అమీనమ్మ. ‘‘ఆవ్.. పెద్దబిడ్డె రాజమణి, పెద్దల్లుడు కిషన్ అస్తున్నమని ఫోన్ జేశిర్రు’’ చెప్పింది. ‘‘అట్లనా.. పంపిస్త తియ్’’ అంటూ పేడకళ్లు ఎత్తుతూ గంపలో వేస్తోంది అమీనమ్మ. వెంటనే ఎన్పల్ల పొర్క కట్ట పట్టుకుని రప్పరప్ప ఊడ్చుతోంది. పశువులు ఉచ్చలు, పేడ వేసి తొక్కడంతో కొట్టం అంతా రొచ్చు రొచ్చు అయింది. ఆ రొచ్చులో చిన్న చిన్న గుంతలు కూడా పడ్డాయి. వెంటనే అక్కడున్న మట్టిని దోసిళ్లతో ఎత్తి ఆ గుంతలు పూడ్చుతోంది. ఇంతలో లోపలినుంచి నిద్రలేచి ఒళ్లు విరుస్తూ బయటకు వచ్చాడు జాకీర్. ‘‘నానీ.. నానీ(అమ్మమ్మ)’’ అని పిలిచాడు.
‘‘ఏందిరా పోడా.. గీడనే ఉంది మీ నానీ’’ అని సమాధానం ఇచ్చింది నర్సవ్వ. ఆమె మాటలు వింటూ తలకు తువాల చుట్టుకొని, లుంగీని మోకాలి మీది వరకు మలిచి జారాడ్‌లోకి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని బయటకు వచ్చాడు. అక్కడ దడిలో అడ్వాన్స్‌గా తెచ్చి పెట్టుకున్న వేప పలుగర్రను నోట్లో వేసుకుని పళ్లు తోముతూ అమీనమ్మను, నర్సవ్వలను చూస్తున్నాడు. “ఏం పెద్దమ్మా కిష్టడు కానస్తలేడు ఎటువోయిండు” నర్సవ్వను ఉద్దేశిస్తూ అన్నాడు. “అక్కాబావలను తోల్కస్తనని మెదకు వోయిండు. ఇయ్యాల్ల అస్తున్నరురా” అంది నర్సవ్వ. ‘‘అట్లనా..’’ అంటూ జోరసంచిని కుంచిలా నెత్తిమీద కప్పుకుని పెండ తట్టను నెత్తిమీదకు ఎత్తుకుని బయటకు నడిచాడు. ఇంటికి రెండు వందల అడుగుల దూరంలో ఉన్న హనుమాండ్ల బొందలో ఉన్న తమ పెంటలో ఆ పెండను పారబోసి వచ్చాడు.
అమీనమ్మ వరుసగా ఐదు తట్టల నిండా పెండ నింపి పెట్టింది. జాకీర్ వరుసగా ఒక్కో తట్టను ఎత్తుకుపోతుంటే అమీనమ్మ ఖాళీ అవుతున్న తట్టల్లో ఇంకా పేడ నింపుతోంది. మేకల గొద్దెలు కూడా అవే తట్టల్లో ఎత్తింది. అలా ఓ పది పన్నెండు తట్టల వరకు పెండ ఎత్తిపోసింది. వాళ్లను అలా చూస్తున్న నర్సవ్వకు ఏదో గుర్తుకువచ్చింది. ‘‘అస్త శిన్నీ.. పాలు పంపిచ్చుడు మర్శిపోకు’’ అంటూ నర్సవ్వ వెళ్లసాగింది. ‘‘పంపిస్త పో నువ్వు’’ అంది అమీనమ్మ. అంతా ఊడ్చి శుభ్రం చేయడం అయిపోయింది.
అమీనమ్మ కూడా వేప పలుగర్ర వేసుకుని కుంపటి ముందు కాసేపు కూర్చుంది. ఈలోపు జాకీర్ ఇత్తడి, కంచు బుడ్లు, ముంతలు అందుకుని ఒక్కో బర్రెకు, ఆవుకు పాలు పితకడం మొదలు పెట్టాడు. ఓవైపు జాకీర్ పాలు పితుకుతుంటే అమీనమ్మ ఇంటి దగ్గర ఎవరెవరికి పాలు పొయ్యాలో ముంతల్లో కలిపి పోసి వస్తోంది. నర్సవ్వ ఇంటికి కూడా లీటర్ పాలు ఎక్కువ పోసి వచ్చింది. మిగతా పాలను ఓ గంపలో పెట్టుకుంది. వాటిని ఏడు గంటల వరకు ప్యాటలో ఉన్న వాడికలోల్లకు పోసి వస్తుంది అమీనమ్మ. ఇంతలో అన్వరీ నిద్రలేచి చీపురు పట్టుకుని వాకిలి పారగొట్టింది. ఆ తర్వాత గుడిసెలో పొయ్యి ముట్టిచ్చి చాయి పెట్టింది. తలా ఇంత పోయగానే ముగ్గురూ కలిసి వేడి వేడి చాయి తాగారు. అప్పుడే తెలతెలవారుతోంది. గూట్లోంచి కోళ్లు ఎప్పుడు బయటపడాలని బాగా అరుస్తున్నాయి. వెంటనే జాకీర్ వెళ్లి కోళ్ల గూడు తలుపు చెక్కను పైకి ఎత్తగానే కోళ్లు ఒకదాని మీద ఒకటి పడుతూ గుంపుగా బయటపడ్డాయి.
అక్కడ అరుగు మీద కూసాల్లో చెక్కిన రెండు కొడవళ్లను తీసి ఆకురాయి మీద నూరుతున్నాడు. అమీనమ్మ వెళ్లి అరుగు మీద ఉన్న పచ్చగడ్డి తీసుకెళ్లి పశువులకు వేసింది. లోపల అర్రలోంచి పసివాడు సాజిత్ లేచి ఏడుస్తున్నాడు. అన్వరీ పరుగున వెళ్లి ఎత్తుకుని బయటకు వచ్చింది. కొడుకు వైపు మురిపెంగా చూస్తూ జాకీర్ సైకిల్ మీద లంబడి గడ్డ మీదున్న తన పొలం దిక్కు వెళ్లాడు పశువులకు పచ్చిగడ్డి కోసుకు వద్దామని. అప్పటికేే పొగమంచు ఆవరించుకుని మనిషికి మనిషి కానరాకుండా ఉన్నారు. అక్కడక్కడా చలిమంటలు మసకమసకగా కనిపిస్తున్నాయి.
* * *
కామునికంతలో ఉన్న అమీనమ్మ ఇంటికి కొట్టానికి మధ్యలో విశాలమైన వాకిలి ఉంటుంది. యాభై అడుగులు వేస్తే కొట్టం. నాలుగు గదులు, బంకు ఉన్న ఆ పెంకుటింటికి కుడిపక్క వంట చేసుకోవడానికి వరి గడ్డితో కప్పిన పూరి గుడెసె ఉంది. ఎడమ పక్కన చింత చెట్టు, జామ చెట్టు విశాలంగా పరుచుకుని ఉన్నాయి. కొట్టం గుడెసె మీద ఆనిగం కాయల తీగ ఉంది. వంట గుడిసె మీద కాకరకాయ తీగ ఉంది. దానికి ఆనుకునే జారాడు ఉంది.
వంట గుడిసెలోనే కోళ్లగూడు ఉంది. గుడెసెలను, ఇంటిని కలుపుకుని ఇల్లింత కంప నాటబడి ఉంది. కంపకు కూడా జాజిమల్లి తీగ అల్లుకుని పచ్చగా మారిపోయింది దడి. ఆ దడికి మధ్యలో రెండు పక్కల పెద్ద గుంజలు నాటి ఆ కంపతోనే గేటు మాదిరి తయారు చేశారు. ఆ దడికి అక్కడక్కడా ఊరపందులు, కుక్కలు కలుగులు ఉన్నాయి. వాటిలోంచి అవి లోపలికి వస్తుంటాయి, పోతుంటాయి. అమీనమ్మ భర్త పేరు మైబుసాబు. భర్త చనిపోయినప్పటి నుంచి ఇంటి భారం మొత్తం అమీనమ్మ మీదే పడింది. ఆమె పెద్ద కూతురు రహీమా.. జాకీర్, జులేఖాలను కన్నాక చనిపోయింది. అంతకుముందే ఆమె భర్త ఖయ్యుం చనిపోయాడు.
భర్త ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేని రహీమా దిగులుతో మంచం పట్టి జబ్బు చేసి చనిపోయింది. అప్పటి నుంచి కూతురు పిల్లల బాధ్యతను అమీనమ్మే తీసుకుంది.
కొడుకు భార్యా పిల్లలను తీసుకుని ఎల్లారెడ్డి తాలుకాలో ఉంటున్నాడు. పోతూపోతూ ఊర్లో ఇల్లు అమ్మేస్తానన్నాడు. “ఊర్ల ఉన్న పెద్ద మనుసుల నసలు అస్సలు పోనియ్య” అని అమీనమ్మ పంతం మీద కూర్చుంది. తన వద్ద దాచుకున్న డబ్బులు, బంగారం అమ్మి ఆ డబ్బును మనవడు జాకీర్‌కు ఇచ్చింది. అందులోకి జాకీర్ మరిన్ని డబ్బులు వేసి ఆ ఇంటిని కొనుక్కున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు అవడంతో జాకీర్, జులేఖాలను పట్టుకుని ఉండిపోయింది అమీనమ్మ. కొడుకు దగ్గరికి ఎప్పుడైనా చుట్టం చూపుగా వెళ్లొచ్చేది. తనకు కూతురు పిల్లలే దిక్కు అనుకుంది.
జాకీర్, జులేఖాలకు మంచి సంబంధం చూసి పెళ్లిళ్లు కూడా చేసింది. వారికి పుట్టిన పిల్లలే ప్రపంచంగా బతుకుతోంది. పిల్లలిద్దరికీ తల్లిదండ్రులు లేని లోటు తెలీకుండా పెంచి పెద్ద చేసింది. జాకీర్ బీఎడ్ చేసి టీచర్ అవుదామని అనుకుంటూనేే ఇంటివద్ద అమ్మమ్మకు తోడుగా ఉంటూ వ్యవసాయం, పశువులను చూసుకుంటున్నాడు. జాకీర్ భార్య అన్వరీ కూడా బీటెక్ చదివింది కానీ, ఆమె కూడా జాకీర్ మనస్తత్వం కలదే. ఊరు అన్నా, పచ్చని ప్రకృతి అన్నా అన్వరీకి చాలా ఇష్టం. చదువులు, ఉద్యోగాలు, పట్నం వంటివి అన్వరీకి బొత్తిగా నచ్చవు. చక్కగా పెళ్లి చేసుకుని పచ్చని పల్లెలోనే బతికెయ్యాలనేది ఆమె వాంఛ. అన్వరీ కూడా జాకీర్‌కు వ్యవసాయం పనుల్లో తోడుగా ఉంటుంది. పనులు రాకపోతే అమీనమ్మను అడిగి నేర్చుకుంది. ఆధునిక భావాలు ఉన్నా పాతకాలం ఆచారాలను గౌరవించాలె అనే ఎరుక ఉన్నది అన్వరీ. అన్వరీ అంటే అమీనమ్మకు కూడా ఎంతో ఇష్టం.
+ + +
సూర్యుడు అప్పుడే మెల్లగా నిద్రలేస్తున్నాడు. మొగులు నారింజ రంగును పులుముకున్నది.
మంచుపొగ దట్టంగ కమ్ముకుని ఉంది. అలా సైకిల్ తొక్కుకుంటూ జాకీర్ లంబడి గడ్డకు చేరుకున్నాడు. పొలంలోకి అడుగుపెడుతూ చెప్పులు అక్కడ పక్కన విడిచేశాడు. పచ్చని పైరుమీద ముత్యాల్లా ఉన్నాయి మంచు బిందువులు. అవి చల్లగా పాదాన్ని తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీ తన శరీరంలోకి ఎగబాకినట్టైంది జాకీర్‌కు. పొలం గెట్లమీద మూరెడునర వరకు పెరిగిన పచ్చగడ్డిని చూడగానే జాకీర్ మనసు పులకించింది.
కొడవలి తీసుకుని రప్పరప్ప గడ్డి కోస్తున్నాడు. అలా గంటలో నాలుగు గెట్లు పొతం పట్టించాడు. మెదలు మెదలుగా జమాచేసిన గడ్డిని రెండు మోపులుగా కట్టాడు. అప్పటికే మరికొందరు ఊరివాళ్లు పొలంలోకి పచ్చగడ్డి కోసం వచ్చారు. వాళ్లను పిలిచి రెండు గడ్డి మోపులను సైకిల్ మీద కట్టుకున్నాడు. ఒకటి క్యారిల్ మీద, మరొక మోపును దండా మధ్యలో దూర్చి నడుస్తూ సైకిల్ తోలుతున్నాడు. అలా ఇంటికి వచ్చేసి మోపులు రెండూ అరుగు మీద పారేశాడు. ఆ పచ్చగడ్డిని చూడగానే రెండు లేగదూడలు పరుగెత్తుకు వచ్చి ఆవురావురుమంటూ పచ్చగడ్డిని నమిలేస్తున్నాయి. అమీనమ్మ రెండు మూడు ఇళ్లల్లోంచి కుడితి తీసుకువచ్చి పాలిచ్చే బర్లకు తాగిస్తోంది. ఆ కుడితిలో తవుడు కలిపి పెట్టింది. కుడితిని బర్లు, ఆవులు ఉవ్వీళ్లూరుతూ తాగేస్తున్నాయి. జాకీర్ జారాట్లోకి వెళ్లి వేడినీళ్లతో స్నానం చేసి బయటకు వచ్చాడు. ఇంతలో అమీనమ్మ పాల గంప ఎత్తుకుని ప్యాటకు బయలుదేరింది. సాజిద్ వాకిట్లో బొమ్మతో ఆడుకుంటున్నాడు. ‘‘అన్నం తింటవా’’ అడిగింది అన్వరీ. ‘‘ఏం కూర’’ జాకీర్ అడిగాడు. ‘‘పందిరి మీద ఉన్న బచ్చల కూర పప్పులేశి రుద్దిన. కావాలంటే ఆమ్లెట్ ఏశి ఇస్త’’ అంది. ‘‘సరే పెట్టు’’ అన్నాడు.
వెంటనే పొయ్యి మీద రెండు గుడ్లతో ఆమ్లెట్ వేసింది. అన్నం వడ్డించింది. ఇద్దరూ కలిసి తిన్నారు. సాజిద్‌కు కూడా చప్పగా ముద్దలు పెట్టింది అన్వరీ. తిన్నాక జామ చెట్టుకింద కూర్చీ వేసుకుని కూర్చున్నాడు. అన్వరీ తెలుగు పేపర్ తెచ్చి ఇచ్చింది. పేపర్ పట్టుకుని చకచకా చదివేస్తున్నాడు జాకీర్. ‘‘ఇగ మూడు రోజులైతే బక్రీద్ పండుగు. కొత్త బట్టలు ఎప్పుడు తెచ్చుకుందం? రెండు మ్యాకలను ఖుర్బానీ గూడ ఇయ్యాలె’’ అంటున్న అన్వరీ వైపు ఆశ్చర్యంగా చూశాడు జాకీర్. బక్రీద్ పండగ మీద అతని ధ్యాస లేకుండా పోవడంతో ఆ మాట వినగానే కాస్త ఆశ్చర్యపోయాడు. ఏదో తట్టినట్టు చేతిలో ఉన్న పేపరు పక్కన పెట్టేశాడు. ‘‘అంటే.. పెద్దల పండుగు బక్రీద్ కన్నా ఒకరోజు ముందుగాల్లనే అస్తుంది కదా. అంటే రెండు రోజులే ఉంది పెద్దమనుసుల పండగకు అన్నమాట’’ భృకుటి ముడిపడింది జాకీర్‌ది. ‘‘అవును’’ అంటూ తలాడించింది అన్వరీ. ‘‘అంటే నేను నల్గొండకు పోవాలె. ఈసారి ఎట్ల అయినా నేను అమ్మ ఆఖరి కోరికను తీర్చాలె’’ ఉద్విగ్నంగా వస్తున్నాయి జాకీర్ మాటలు. ‘‘అవును ఇట్ల అనుకుంట పదేండ్ల కాలం ఎల్లదీశినం. ఇప్పటికైనా అత్తమ్మ ఆఖరి కోరిక తీర్సకపోతే మనం ఉండి వేస్టు’’ విచారిస్తూ అంది అన్వరీ.
‘‘అమ్మ సచ్చిపోయే ముంగట నన్ను నాయిన పక్కలనే బొంద వెట్టుర్రి అన్నది. కనీ ఎక్కడా మర్మన్నోల్లు కుదరనిచ్చిర్రా’’ శూన్యంలోకి చూస్తూ అన్నాడు జాకీర్. ‘‘మామ సచ్చిపోయి ముప్ఫై ఏండ్ల కాలం అయితున్నది. ఏరోజు నువ్వు వోయి నాయిన బొంద మీద పూలు ఎక్కించింది లేదు. దురూద్ సదివి సమర్పించింది లేదు. అసలు నాయిన బొంద ఎక్కడుందో గూడా వాళ్లు నీకు చెప్పలేదు. మనం వోతే ఆస్తిల యాడ పాలు అడుగుతమోనని ఆల్ల భయం ఆల్లకుంది. రోజుకు ఐదుసార్లు నమాజులు జేస్తరు మీ మర్మన్న అన్నలు. చెహ్రాలు(గడ్డం) పెంచిర్రు. అల్లా మౌలా అనుకుంట మనపట్ల గింత అన్యాయం ఎట్ల చేశిర్రో ఏమో. మాటకు అల్లా అనేటోల్లు మన హక్కును కొట్టేశిర్రు’’ అంటున్న అన్వరీ కళ్లు ఛెమ్మగిల్లాయి.
‘‘పోనియ్ అన్వర్.. మనకు ఏం రాశిపెట్టి ఉంటే గదే జరుగుతది. నాయిన అమ్మను రెండో పెండ్లి చేస్కొని తప్పు జేశిండు. పెద్దమ్మకు ఐదుగురు కొడుకులే. వాళ్లు అప్పటికే పెద్దపెద్దగున్నరు. అమ్మకు మేమిద్దరు పుడితిమి. ఇద్దరు పెండ్లాలను వేరువేరు ఉంచి బాగనే మెంటేన్ జేశిండట గనీ.. అల్లాకు ఓర్వబుద్ధిగాక గుండెనొప్పితోని ఆయింత నాయినను దోసుకున్నడు. నాయిన వోయిన పికర్‌తోని అమ్మీ గుంజుకచ్చి సచ్చిపోయింది. నాయిన పక్కకే అమ్మను బొంద వెడదామంటే ఆల్లు కలవనియ్యలే. అద్దు అద్దు అన్నరు. నాయిన సావంగనే ఉన్నఇల్లు, భూమి, జాగలల్ల ఇద్దరు పెండ్లాలకు శెరి సగం పాలు ఇయ్యకుంట అంత ఆల్లే అమ్రిచ్చుకున్నరు. అప్పటికి మేము శిన్నగుంటిమి. మాకేం తెల్వకపాయె. పోతేపోనీ వాళ్లు మమ్ములను వాళ్ల రక్తమే అనుకుంటే సాలు అనుకున్న గనీ.. ఆల్లు ఆ మాటగూడ అనకుంట చేశిర్రు. నల్లగొండకు రావద్దని అన్నలు, పెద్దమ్మలు బేమానితనానికి ఎగవడ్డరు. ఏనాడు మమ్ములను నల్గొండకు రానియ్యలేదు. అమ్మను పెద్దమ్మల సూస్కోవాలని మస్తు పానం గుంజింది గనీ.. ఆల్లకు మామీద గింత గూడ ప్రేమ లేదు. కాదన్నకాడ కడ తక్క అంటరు. అందుకే సాలిచ్చుకున్న. ఎప్పుడన్న అన్నలకు ఫోన్ జేస్తే ఎత్తరు. ఎత్తినా నల్లగొండకు రావద్దు అంటరు. పోని రంజాన్, బక్రీద్ పండుగుల కన్నా నల్లగొండకు పోయి నాయిన బొంద మీద నాలుగు పూలు ఏశి, దురూద్ సదివి అద్దామంటే రావద్దు అని మొకం వట్టుకొని చెప్పిర్రు. అట్ల అన్నంక ఎట్ల పోబుద్ది అయితది. కనీ, ఈసారి అమ్మకోసం అయినా పోవాలె’’ పిడికిలి బిగిస్తూ అన్నాడు జాకీర్. రేపు పొద్దుగాల్ల పోదువు గనీ’’ అంది అన్వరీ. ఇంతలో బయట జంగిడి గోజలు వచ్చినట్టు కాపరులు విజిల్స్ వేస్తున్న చప్పుడు వినిపించింది. తేరుకున్న జాకీర్ వెంటనే పశువుల మెడలో తలుగులు విప్పుతుంటే అవి బయటకు వెళ్లిపోతున్నాయి. మేకల తలుగులు కూడా విప్పాడు. అవి కూడా పరుగెత్తుకుపోయాయి బయటకు.
* * *
రేపే పెద్ద మనుసులు పండుగు. ఎల్లుండి బక్రీద్ పండుగు. నల్గొండ వెళ్లడానికి జాకీర్ తయారయ్యాడు. మనసు భారంగా ఉంది జాకీర్‌కు. అమ్మ చివరి కోరికను తీరుస్తున్నందుకు కాస్త ఆనందంగానే ఉన్నా.. అంతకన్నా ఎక్కువ బాధగానే ఉంది. పరిస్థితులకు అనువుగా అమ్మకోరిక తీరుస్తున్నాననే బాధ జాకీర్‌లో ఉంది. అమీనమ్మ, అన్వరీలు.. జాకీర్‌ను ఫికర్‌తోని చూస్తున్నారు. ‘‘అరే బిడ్యా పైలెంరా. ఆల్లు నీకు కనవడ్డా సలాం జెయ్యు గనీ పల్టాంచి ఒక్క మాట గూడ అనకు సరేనా’’ అంటున్న అమీనమ్మను చూస్తూ ‘‘సరే’’ అన్నట్టు తలాడించాడు. బ్యాగు భుజాన వేసుకుని బయటకు నడుస్తూ.. కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అన్వరీకి ఇచ్చేశాడు. అందరి వైపు చూస్తూ బయటకు నడిచాడు. టాటా చెబుతున్న సాజిద్ వైపు మురిపెంగా చూస్తూ చేయి ఊపుతూ వెళ్లిపోయాడు.
* * *
బస్సులో కూర్చున్న జాకీర్ మనసు అల్లకల్లోలంగా ఉంది. మనసులో ఒక రకమైన అపరాధ భావం కూడా తొణికిసలాడుతోంది. కళ్లు మూసుకుని అమ్మతో తనకున్న యాదులను మననం చేసుకోసాగాడు. ఆ యాదులు అతని గుండెల్లో గుణపంతో దిగబడినట్టు అవుతుంటే కళ్లు చిప్పిల్లాయి. కర్చీప్‌తో కళ్లు తుడుచుకుని ఆలోచనలతోనే సాగింది అతని ప్రయాణం. నల్లగొండ చేరుకున్నాడు. అక్కడుండే తన రిపోర్టర్ మిత్రుడు శేఖర్‌కు ఫోన్ చేశాడు. ‘‘ఖబ్రస్తాన్‌కు వచ్చేయ్’’ అన్నాడు శేఖర్. బస్టాండ్‌లో దిగి ఆటోలో ఖబ్రస్తాన్‌కు వెళ్తున్నాడు. తన తండ్రి సమాధి ఎక్కడుందో తనకు తెలియకపోవడంతో.. నల్గొండలో ఉండే పత్రికా రిపోర్టర్ శేఖర్ సహాయం తీసుకున్నాడు. శేఖర్‌కు జాకీర్ మర్మన్న అన్నలు యూనుస్, ఖళీల్‌లు తెలుసు. వాళ్లను అడిగి ఎలాగోలా జాకీర్ వాళ్ల నాన్న సమాధి జాడ కనుక్కున్నాడు. ఖబ్రస్తాన్ దగ్గరికి ఆటో వచ్చి ఆగగానే జాకీర్ మనసులో అలజడి మొదలైంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎన్నో ఏళ్ల తర్వాత నాన్న సమాధిని చూస్తున్నాననే ఉద్విగ్నం ఓవైపు, అమ్మకోసం తాను చేస్తున్న పని తాలూకు ఉద్విగ్నం మరోవైపు జాకీర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
శేఖర్ ఎదురు వచ్చి ‘‘హాయ్ జాకీర్’’ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇస్తూనే శేఖర్‌ను గట్టిగా కౌగిలించుకున్నాడు జాకీర్. ‘‘నువ్వు చేస్తున్న ఈ సహాయం నాకు ఎంతో విలువైంది మేరే దోస్త్’’ అన్నాడు. ‘‘నాదేముంది భాయ్. మాట సాయమే గదా. మనం మనుషులం గీయింత సాయం జేసుకోకపోతే ఎందుకు ఇగ మనం చెప్పు’’ భుజం చరుస్తూ అన్నాడు శేఖర్. ఇద్దరూ కలిసి గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టారు. చల్లని గాలి తెమ్మెర జాకీర్ ముఖాన్ని రివ్వున తాకింది. అది నాన్న చేతి స్పర్శలా తోచింది జాకీర్‌కు. ‘‘ఇన్నేండ్ల తర్వాత నువ్వు మీ నాయిన సమాధి చూస్తున్నవు గదా.. నీకన్న ఎక్క నాకే శానా సంతోషంగా ఉంది తెల్సా’’ అంటున్న శేఖర్ వైపు కృతజ్ఞతగా చూశాడు జాకీర్. సమాధుల మధ్యలో పచ్చగా రకరకాల చెట్లు మొలిచాయి. ఖబ్రస్తాన్ చాలా విశాలంగా ఉంది. చనిపోయినవారంతా శ్మశానంలోని సమాధుల్లో ప్రశాంతంగా శాశ్వత నిద్రలో ఉన్నట్టుగా ఉంది. ఆ సమాధులన్నింటి వైపు చూస్తూ నిట్టూర్చాడు జాకీర్. ‘‘దేశాలేలే రాజు అయినా.. ఎంతటి తీస్‌మార్కాడు అయినా చివరికి వచ్చేది ఈడికే. వారంకొకసారి ఇసుంటి జాగలకు రావాలె భాయ్. జిందగీ అస్లియత్ ఏందో తెలుస్తది. నేను నేను అని ఎగిరేటోళ్లు ఈడికస్తే సచ్చం అంటే ఏందో ఎరుకైతది’’ అన్నాడు శేఖర్. ‘‘సైమాట అన్నవు’’ అంటూ సమాధులనే చూస్తున్నాడు జాకీర్. 30 ఏళ్ల తర్వాత కన్నతండ్రి సమాధిని చూస్తున్నానని.. తన చేత్తో నాన్న సమాధి మీద పూలు వేస్తున్నాననే ఆతృత జాకీర్ మనసును ఆగమాగం చేస్తోంది. ‘‘అగో అదే మీ నాయిన ఖయ్యుంసాబ్ సమాధి’’ అని వీళ్లకు ఇరవై అడుగుల దూరంలో కనిపిస్తున్న సమాధిని చూపించాడు శేఖర్.
తెల్లగా సున్నం వేసి ఉన్న ఆ సమాధిని చూడగానే జాకీర్ మనసు ఒక్కసారిగా పులకించిపోయింది. టపటపా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. వేగంగా నడుస్తూ సమాధిని చేరాడు. సమాధి తలాపున పాల రాయి మీద ఖయ్యుం అని రాసి, మరణించిన తేది కూడా చెక్కబడి ఉంది. ఉద్విగ్నంగా వెళ్లి సమాధి మీద అమాంతం పడిపోయాడు. కన్నీళ్లు ఏరుధారలయ్యాయి. ఆ కన్నీళ్లు సమాధిని తడిపేస్తున్నాయి. నాన్నను అలుముకున్నట్టుగానే ఉంది జాకీర్‌కు. ‘‘పప్పా.. పప్పా..’’ అంటూ వెక్కుతున్నాడు. అది చూసి శేఖర్ కళ్లు కూడా చిప్పిల్లాయి. ‘‘ఎన్ని ఏండ్లు అయింది పప్పా నీ ఖబర్(సమాధి) సూశి’’ అంటూ సమాధి మీద నుంచి లేవలేకపోతున్నాడు. ‘‘కూల్ దోస్త్..’’ అంటూ శేఖర్ తల నిమిరాడు.
‘‘అరే.. నాయిన సుట్టు అంత అడ్డమైన అలం మొల్శింది. ఉండు సాపు జేస్త’’ అని సమాధి చుట్టూ ఉన్న పిచ్చి చెట్లను పీకేస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న సమాధులను ప్రశ్నావదనంతో చూస్తున్నాడు. అది గమనించిన శేఖర్.. ‘‘అది మీ నాయినమ్మ సమాధి అంట. అగో ఆ పక్కకు ఉన్నది మీ పెద్దనాయినది. గా మీదికి ఉన్నది మీ తాతది’’ అని ఆ సమాధులను చూపిస్తున్నాడు. వాటిని చూస్తూ జాకీర్ మరింత ఆనందానికి లోనవుతూ.. అన్నీ సమాధుల పాదాల వైపు తన చేత్తో తాకుతూ బ్యాగులోంచి గులాబీ పువ్వులను తీసి సమాధుల మీద పోస్తున్నాడు. అక్కడున్న అలాన్ని కూడా పీకేస్తున్నాడు. కాసేపట్లోనే ఆ సమాధుల చుట్టూ క్లీన్ చేసేశాడు. శేఖర్ కూడా సాయం అందించాడు. ఇన్నేళ్ల తన ప్రేమనంతా ఆ ఎర్రని గులాబీ పువ్వుల్లో నింపేసి సమాధుల మీద పోశాడు జాకీర్. శేఖర్ కూడా కాసిన్ని పూలు తీసుకుని ఆ సమాధుల మీద పోశాడు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినవాడిలా ఆత్రంగా తన బ్యాగు తీశాడు. అందులోంచి ఓ మూటగట్టిన గుడ్డను తీశాడు. ‘‘ఏంది ఇది?’’ అడిగాడు శేఖర్ దానిని అనుమానంగా చూస్తూ. ‘‘మా అమ్మ సమాధి మీద మన్ను’’ అని సమాధానం చెప్పాడు. ‘‘గదెందుకు తెచ్చినవు’’ శేఖర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘నాయిన దగ్గరికి అమ్మను తీస్కచ్చిన. అమ్మ సచ్చిపోయే ముంగట తనను ఈడ నాయిన పక్కకే బొంద వెట్టుమన్నది గనీ.. వీళ్లు కుదరనియ్యలేదు. గందుకే ఇట్ల నాకు తోశింది చేస్తున్న. అమ్మ బొంద మీది మట్టిని నాయిన బొందమీద, నాయిన బొంద మీది మట్టిని అమ్మ బొంద కాడికి తీసుకపోదామనే వచ్చిన. ఇట్ల జేస్తేనన్న అమ్మ కోరికను నేను సగమన్న తీర్శిన అని అనుకుంట’’ అంటున్న జాకీర్‌ను రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు శేఖర్. జాకీర్ ఆ మూటలోని మట్టిని తీసి నాన్న సమాధి మీద పోశాడు. ‘‘అమ్మను నీ దగ్గరికి తీస్కచ్చిన పప్పా’’ అంటూ గొల్లుమన్నాడు. వెంటనే శేఖర్ జాకీర్‌ను పట్టుకుని ఓదారుస్తున్నాడు. కాసేపు దురూద్ చదివి అందరి పేర్లను తలుచుకుంటూ సమర్పించుకున్నాడు. అనంతరం నాన్న సమాధి మీది మన్నును తీసి అదే మూటలో వేస్తున్నాడు. శేఖర్ కూడా సాయం చేస్తున్నాడు. నాలుగైదు దోసిళ్ల మన్నును మూటలో వేసి ముడివేసి బ్యాగులో వేసుకున్నాడు. కాసేపు అలాగే సమాధులను చూస్తూ ఉండిపోయాడు. జాకీర్‌ను సమీపించిన శేఖర్ ‘‘పోదామా ఇగ’’ అన్నాడు. ‘‘పా’’ అంటూ తలూపాడు జాకీర్.
భారంగా అక్కడినుంచి కదిలాడు జాకీర్.
నాన్న తనతోనే వస్తున్న ధీమా నిండిపోయింది జాకీర్‌లో. ఇక ప్రతీ పండగకు అమ్మానాన్నలకు పూలు సమర్పించవచ్చు అనుకుంటున్నాడు. ఖబ్రస్తాన్ బయటకు వచ్చి మళ్లీ అటువైపు చూస్తూ విషణ్ణవదనంతో భారమైన హృదయంతో తల తిప్పుకున్నాడు. శేఖర్ భుజం మీద చేయి వేసి నిమురుతున్నాడు. ఇద్దరూ కలిసి బయటకు వస్తుండగా దూరంగా మర్మన్న అన్న యూనుస్ రావడం గమనించాడు శేఖర్. ‘‘అగో గాన్నుంచి మీ అన్న అస్తున్నడు సూడు’’ అని చూపించాడు. బుల్లెట్ మీద వస్తున్నాడు యూనుస్. జాకీర్, యూనుస్‌ను చూశాడు. మనసులో ఆనందం, రక్తసంబంధం అనే ప్రేమ పొంగుతుండగ జాకీర్ దానిని అదుపులో పెట్టుకున్నాడు. ఎప్పటినుంచో వాళ్లను కలవాలని జాకీర్ ఎంత తాపత్రయపడ్డా.. వారు ఆ అవకాశం ఇవ్వలేదు. వాళ్లకు మనమీద ప్రేమ లేనప్పుడు మనమెందుకు ఆరాటపడాలి? అనుకుని తన మనసును బిగుతు చేసుకుంటున్నాడు. ముక్కు పుఠాలు ఉబ్బిస్తూ అన్నయ్య మీద నుంచి చూపు మరల్చి దారి సాగుతున్నాడు. అర్థం చేసుకున్నా శేఖర్, జాకీర్‌ను అనుసరిస్తున్నాడు. ‘‘మీ అన్నోల్ల వాడకట్టుల ఎవరో సచ్చిపోయిర్రట. బొంద తవ్వ జాగ సూడ అస్తున్నట్టున్నడు. ఆయిన రాకమునుపే మన పని అయిపోయింది. థాంక్ గాడ్’’ అన్నాడు శేఖర్.
ఇంతలో ఆటో వచ్చి ఆగింది వారి ముందు. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. జాకీర్ మౌనంగా ఉన్నాడు. ‘‘ఇంత దూరం అచ్చినవు గదా.. రెండు ముద్దలు మా ఇంట్ల తినిపోవాలె’’ అన్నాడు శేఖర్. ‘‘అస్త’’ అంటూ ఆప్యాయంగా చూశాడు శేఖర్ వైపు. ఆటో శేఖర్ ఇంటి ముందు ఆగింది. కాళ్లు చేేతులు కడుక్కున్నాడు. శేఖర్ భార్య అనన్య జాకీర్‌ను ‘అన్నా’ అని అనురాగంగా పిలిచింది. వారింట్లో కడుపు నిండా తిని, వేడి వేడిగా టీ తాగి ఇంక తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు. తన బైక్ మీద బస్టాండ్ దాకా తోలేశాడు శేఖర్. హైదరాబాద్ బస్సులో కూర్చున్నాడు శేఖర్‌కు బాయ్ చెప్తూ. హైదరాబాద్‌లో దిగి అక్కడినుంచి బోధన్ బస్సు ఎక్కితే తన ఊరికి వెళ్లిపోతాడు జాకీర్. బస్సులో కూర్చుని నాన్న మట్టిని పెట్టుకున్న బ్యాగును గుండెలకు హత్తుకున్నాడు. ‘‘అమ్మీ నన్ను మాఫ్ జెయ్యి. నీ కోరిక తీర్చలేకపోయిన. ఇట్లనన్న నాయిన నీ దగ్గరనే ఉంటడని నాకు అనిపిచ్చింది. గందుకే గీ పని జేస్తున్న. నాది పిచ్చి పని అనిపిచ్చినా నీ ఆత్మకు తృప్తి ఇస్తదని అనుకుంటున్నా..’’ అనుకుని గుండెల నిండా శ్వాస పీల్చి వదిలాడు. బస్సు కిటికీలోంచి వస్తున్న చల్లని గాలి ముఖాన్ని తాకుతుంటే.. నెమ్మదిగా అతని కళ్లు మూతలు పడుతున్నాయి.
* * *
ఊళ్లో దిగగానే నేరుగా ఖబ్రస్తాన్‌కే వెళ్లాడు జాకీర్. అమ్మ సమాధి మీద నాన్న సమాధి మీద నుంచి తెచ్చిన ఆ మట్టిని మూట విప్పి పోశాడు. ‘‘అమ్మీ పప్పాను నీ దగ్గర్కే తెచ్చిన. ఇగనుంచి మీ ఇద్దర్కి దురూద్, దువాలు జేస్తా’’ అంటూ అమ్మ సమాధి మీద పడిపోయాడు. కాసేపటివరకు అలాగే ఉండిపోయాడు. శ్మశానం అంతా ప్రశాంతంగా ఉంది. సమాధులన్నీ జాకీర్‌కు జేజేలు చెబుతున్నట్టుగానే చెట్లన్నీ ఊగుతున్నాయి. చాలా సేపటివరకు జాకీర్ అమ్మ సమాధి మీదనుంచి లేవలేకపోయాడు.
* * *
రేపే బక్రీద్ పండగ. ఈరోజు పెద్దమనుసుల పండగ. అమీనమ్మ, అన్వరీలు ఇల్లంతా శుభ్రంగా కడిగారు. అలుకువూతలు చేసుకువచ్చారు. మటన్ తీసుకువచ్చాడు జాకీర్. బగారన్నం, మటన్ కూర్, దాల్చ, మీఠాఖానా చేశారు ఇద్దరూ కలిసి. సాయంత్రం ఆరుగంటలప్పుడు మగ్రీబ్ సమయంలో ఫాతెహాలకు సిద్ధం చేశారు. అన్నం, కూర, మీఠాఖానా, దాల్చ, తమలపాకులు, బీడీలు, సిగరెట్లు పెట్టారు. పెద్దమనుసులకు ఏవి ఇష్టమో అవి పెట్టి ఫాతెహాలు ఇస్తారు. అగరబత్తీలు వెలిగించి ఫాతెహాలు ఇస్తున్నాడు. ‘‘ఈ కాన్నంచి మీ పప్పాను గూడా పెద్ద మనుసులల్ల షరీక్ జేశి ఫాతెహాలు ఇయ్యురా’’ అంది అమీనమ్మ. ‘అవును’ అన్నట్టు తలూపాడు. తన పాతెహాల్లో పప్పా పేరును కూడా తలుచుకుంటూ అందరి పేర్ల మీద ఊదు అగ్గి నిప్పుకల మీద పోశాడు. అనంతరం అందరూ తలా ఇంత ఊదు పోశారు. ఇల్లంతా ఊదు పొగతో నిండిపోయింది. ‘‘నల్లగొండల ఊదు వొయ్యాల్శినోడు ఈడనే వోస్తున్నడు. ఏంజేస్తం తండ్రీ.. నువ్వెట్ల తలుస్తే మా బతుకులు అట్లనే ఉంటయి’’ అనుకుని ఊదు పోసింది అమీనమ్మ. బిడ్డె, అల్లుడిని పెద్దమనుసుల్లో కలపడం అమీనమ్మకు జీర్ణం కాని విషయమే. చిప్పిల్లాయి ఆమె కళ్లు.
జాకీర్‌కు మాత్రం మనసులోంచి ఓ భారం దిగిపోయి దూదిపింజెలా మారినట్టైంది.
*
Very nice storeis I like so much keep it up Allah may bless you. You write more storeis in future you have brute future I believe amen. 💝👌👍
షుక్రియా భయ్యా. యే హమారే కహానియాం హై. అప్నే గోపాల్ పేట్ కే జిందగియాం.
nice story
థాంక్యూ మేడం
సంఘీర్ బయ్యా చాలా మంచి కథ రాసారు పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అమ్మ నాన్నల మీద జాకీర్ కి ఉన్న ప్రేమని యెంతో చక్కగా రాసారు
థాంక్యూ భాయ్