మంత్రం – మాయ – మాజిక్ రియలిజం!

కొన్ని కథలు పరిచయం చెయ్యడం అంత సులభం కాదు. పరిచయం తరువాత కూడా కథని ఆసక్తిగా పాఠకుల చేత చదివించాలని పరిచయకర్త అభిమత మయినప్పుడు ఆ పని ఇంకాస్త జటిల మవుతుంది. కథ మధ్యలో వెల్లడయ్యే ఒక రహస్యంగానీ లేదా కథ చివరలోని ఒకటో రెండో వాక్యాలు కథకి కీలకాలు అవడం గానీ ఈ సంకటానికి కారణాలు కావచ్చు. క్రితం నెల పరిచయం చేసిన ‘టైమ్స్ ఆరో’ ఆ రెండో కోవకి వస్తుంది. అయితే, ఈ నెల “నైట్ సర్ఫ్” https://www.writersdigest.com/online-exclusives/writers-digest-may-june-2019/14th-annual-popular-fiction-awards-grand-prize-winning-short-story-night-surf

అన్న కథని తెలుగు పాఠకులకి పరిచయం చేయడానికి గల ముఖ్య కారణాల గూర్చి తెలియజెయ్యడం ఆవశ్యకం.

మొదటిది పోటీలో బహుమతి పొందిన కథ అయినా గానీ సందేశాత్మకం కాకపోవడం. రెండవది, రచయిత పాత్రలద్వారా గానీ లేదా స్వయంగా తెరముందు నిలబడి గానీ ఉపన్యాసా లివ్వకపోవడం. మూడవది, మంత్రం వేసినట్లుగా పాఠకులని కథలోకి లాక్కుని వెళ్లడం. మంత్రం – మాయ – మాజిక్ రియలిజం! నాలుగవది, కథని కథగా మిగలనివ్వడం. ఐదవది, ఈ సంవత్సరంలో ప్రచురింపబడడం.

తెలుగు కథల పోటీల ఫలితాలని గత దశాబ్దాలుగా అనుసరిస్తూన్నవాళ్లకి ఆంగ్ల కథలలో పోటీలు ఉంటాయా, ఎలాంటి కథలు బహుమతులు పొందుతున్నాయి, అవి కూడా సమస్య-పరిష్కారం-సందేశం చుట్టూ గానుగెద్దు తిరిగినట్లు తిరుగుతూనే ఉంటాయా అన్న ప్రశ్నలు కలుగక మానవు. ఇంతకు ముందు ఈ శీర్షికన పరిచయం చెయ్యబడ్డ ‘ది పేపర్ మినాజెరీ’ అన్న కథ పోటీల్లో బహుమతులను పొందలేదు గానీ, ప్రచురణ అయిన తరువాత అనేక పురస్కారాల నందుకున్నది. ఈనాటి పరిచయం, ‘రైటర్స్ డైజెస్ట్’ నిర్వహించిన కాల్పనిక కథల పోటీలో విశేష బహుమతి నందుకున్న ‘నైట్ సర్ఫ్’ కథది.

కథని పరిచయం చేసే ముందర ఈ పోటీ గూర్చి రెండు వాక్యాలు చెప్పాలి. తెలుగులో కథల పోటీ అనగానే “ప్రపంచంలో ఏ అంశం గూర్చి అయినా రాయవచ్చు, ఏ సబ్జెక్టు నయినా ఎన్నుకోవచ్చు!” అని తరచుగా ఆ పోటీ ప్రకటనలలో కనిపిస్తుంటుంది. క్రీడల పోటీలు అనగానే టెన్నిస్ కీ, బాస్కెట్ బాల్ కీ, క్రికెట్టుకీ, హాకీకీ, ఈతకొట్టడాలకీ, పరుగెత్తడాలకీ అన్నింటికీ కలిపి ఒక ప్రథమ బహుమతీ, ఒక ద్వితీయ బహుమతీ, కొన్ని విశేషబహుమతులూ అంటే నవ్విపోతాం – పోవయ్యా, ప్రతి ఆటకీ వేరేవేరే బహుమతు లుండాలి గానీ ఈతగానికి ప్రథమ బహుమతి అనీ, బాడ్మింటన్ ఆడేవాడికి రెండవ బహుమతి అనీ, క్రికెట్ ఆటగానికి మూడవ బహుమతి అనీ అనడం అర్థవంతంగా లేదు, అని. అయితే, ఈ తెలుగు కథల పోటీలని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాళ్లకి మాత్రం ఈ ఇబ్బందులున్నట్టు కనిపించదు. బహుమతులని ఇచ్చేవాళ్లకీ, పుచ్చుకునేవాళ్లకీ కూడా కథలు సందేశాత్మక మయినవి మాత్రమే అవాలి అన్న ఏకాభిప్రాయం ఉండడం అందుకు కారణం అవచ్చు. సమస్యని నిర్వచించి పరిష్కారాన్ని సూచించ గలిగితే ఇంకా మంచిది. అందుకనే, ప్రత్యేకంగా ఒక అంశానికే పరిమితం చేసిన పోటీల్లో తప్పితే సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్లు, హాస్య కథలు, శృంగార కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు ఈ పోటీలలో బహుమతులు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కనిపించదు, అలా గెలుచుకున్న దాఖాలాలూ తక్కువే. ఈ ‘రైటర్స్ డైజెస్ట్’ నిర్వహించిన పోటీల్లో మాత్రం, ప్రతి రసానికీ – క్రైం, రోమాన్స్, సైన్స్ ఫిక్షన్, హారర్, యంగ్ ఆడల్ట్స్, ఇవి కాక, ఇవేవీ కాని పాపులర్ ఫిక్షన్ – వేర్వేరు పోటీలు.

తెలుగులో, పాపులర్ ఫిక్షన్ అనగానే ఆ రంగంలో పెద్దపీఠాన్ని అధిష్ఠించిన యండమూరి వీరేంద్రనాథ్ గారి పేరు గుర్తొస్తుంది. (అయితే, ఆయన కథలు పోటీల్లో గెలుపొందినట్లు నాకు తెలియదు. ఆ పోటీల్లో ఆయన అసలు పాల్గొనకపోయి ఉండొచ్చు కూడా; అది వేరే విషయం.) ఆ కోవకి చెందిన కథలని సామాన్య ప్రజానీకం ఆదరించి వుండొచ్చు గానీ విమర్శకులు పెద్దగా పట్టించుకున్నట్లు నాకు అనిపించదు. దానికి కారణం, ఎక్కడో ఒక చోట “కప్పడాలు” వంటి కథలు తప్పితే కథా సంకలనాలల్లో ఇవి పెద్దగా కనిపించకపోవడం.

ఇక ఇక్కడి కథ పరిచయానికి వస్తే – అమెరికాలో సముద్రపుటొడ్డున చీకటిపడ్డ తరువాత ఒంటరిగా మిగలిన ఒక ముసలివానితో ‘నైట్ సర్ఫ్’ మొదలవుతుంది. ఆ ప్రత్యేకమయిన రోజున ప్రతి సంవత్సరమూ అక్కడ ఒక రూపం కనిపిస్తున్నదనీ, దానికి, కొన్నేళ్ల క్రితం అక్కడ తప్పిపోయిన తన కూతురి విషయంతో పరిచయం గానీ సంబంధం గానీ ఉండివుండవచ్చు నెమో నన్న ఆలోచనతో అక్కడికి వచ్చాడు. దాని గూర్చిన సూచన అక్కడికి వచ్చిన బీట్ పోలీస్ ఆ ముసలివానితో జరిపిన చిన్న సంభాషణలో సూచనప్రాయంగానే కన్పిస్తుంది. ఆ బీట్ పోలీస్ ద్వారా ఆ ముసలివాని పేరు మనకు తెలుస్తుంది గానీ, రచయిత తరువాత ఎక్కడా ఆ పేరుని వాడుకోడు. మిగిలిన కథ ఆ తరువాత ముసలివానికీ, అక్కడికి వచ్చిన ఇంకొక వ్యక్తికీ మధ్య జరుగుతుంది. ఆ వ్యక్తి చేతిని అతను పట్టుకుని ఎన్నో దశాబ్దా లయింది. ఈనాడు చెయ్యి పట్టుకోవడా న్నటుంచి అతను ఆ కళ్లల్లోకి చూసే అవకాశం కలుగుతుందా? ఇక్కడ మంత్రానికీ, మాయకీ, మాజిక్ రియలిజానికీ మాత్రమే కాక, మానవ సంబంధ మయిన ప్రేమకీ, ఎడబాటుకీ, ఆవేదనకీ, కూడా చోటుంది. పోటీకి వచ్చిన పన్నెండు వందల కథల్లో మిగతా కథలు ఎలా ఉన్నాయనేది తెలియకపోయినా, దీన్ని అత్యుత్తమ మయినదిగా భావించడానికి గల కారణాలు పరిశీలకులకే గాక మనకి కూడా కథలో కనిపించినవి అవడంవల్లనేనని మనం నిర్ధారణకు రావచ్చు.

రచయిత పరిచయం:

రచయితతో ఇంటర్వ్యూని ఇక్కడ చదవవచ్చు. ఈ కథకు మదిలో బీజం ఎప్పుడు పడింది, కథ ఎలా రూపు దిద్దుకున్నదీ అన్న వివరాలు ఆసక్తికరంగానూ అనిపించవచ్చు, నిరాశని కలిగించనూవచ్చు.

https://www.writersdigest.com/online-exclusives/writers-digest-may-june-2019/extended-interview-with-david-burns-wds-14th-annual-popular-fiction-awards-grand-prize-winner

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

1 comment

Leave a Reply to విషాదం, సాంత్వనాల మేలు కలయిక – సారంగ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు