అవతలివైపు నిశ్శబ్దాన్ని అర్ధం చేసుకుంటూ “వాసూ ఎలాగూ ఊళ్ళో లేరు కదా! పోనీ సాయంత్రం పిల్లల్ని పికప్ చేసుకుని ఇక్కడికి రాకూడదూ, కాస్త మార్పుగా ఉంటుంది?” అన్నాను.
“ఇప్పుడు కాదులే” అంటూ ఫోను పెట్టేసింది వనిత. దుఃఖంతో పూడుకుపోయిన ఆ గొంతు బరువుగా వినపడింది. తన గురించే ఆలోచిస్తూ మిగిలిన గిన్నెలు తోముకున్నాను.
ఆడవాళ్ళని పొగిడేటపుడు అమ్మ మాటల్లో ‘భూదేవికున్నంత సహనం’ అనే విశేషణం వినపడేది, ఎంత భరిస్తే అంత గొప్ప అన్నట్టు! సహనం సద్గుణమే కావచ్చు గాని మితిమీరితే దాని ఫలితం ఇలాగే ఉంటుంది.
*
వనితా, నేనూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం. ప్రకాష్ మా సీనియర్. అతను వనితనిష్టపడి పెళ్లి ప్రస్తావన తెచ్చినపుడు తనకీ ఇష్టమే అవడంతో కొన్నాళ్ళు స్నేహంగా కలిసి తిరిగారు. తల్లిదండ్రులకి చెప్పి, పెళ్లి చేసుకుందామనుకునేసరికి వనితది మధ్య తరగతి కుటుంబం కావడం, తండ్రి లేకపోవడం ప్రకాష్ తల్లిదండ్రులకి నచ్చలేదు. అతను తనవాళ్లని ఒప్పించలేకపోయాడు. ఎవరి దారి వారిదయింది.
మొదట్లో కొన్నాళ్ళు దిగులుపడింది వనిత. తర్వాత రిజల్ట్స్ రావడం, డిస్టింక్షన్ లో పాసవడం, మంచి ఉద్యోగం రావడం- అన్నీ వరసగా జరిగాయి. ఆర్ధికంగా కాస్త కుదుటపడడంతో ఉత్సాహం పుంజుకుని, పూర్వంలాగే ఆరోగ్యంగా, ఆనందంగా తయారయింది.
రాజేష్ అప్పట్లో వనిత ఆఫీసులో పనిచేసేవాడు. విరిసిన పువ్వులా కళకళలాడే వనితని కొన్నాళ్ళు గమనించి అతనే ప్రపోజ్ చేశాడు. ఈసారి ముందు జాగ్రత్తగా తమ ఆర్ధికస్థితి గురించి వివరంగా చెప్పి తనతో వివాహం అంటే కట్నకానుకలూ, ఆస్తిపాస్తులూ ఏమీ ఆశించకూడదని చెప్పింది. అవేవీ తనకక్కర్లేదన్నాడు.
పెళ్ళైన కొత్తల్లో ప్రేమగానే ఉండేవాడు. కొంత పురుషాహంకారం, ఇంటిపనుల్లో బద్ధకం, లోలోపల కట్నం తీసుకోకుండా వనితని ఉద్ధరించాడన్న భావనా ఉండేవి గాని తనపట్ల ఇష్టంగానే ఉండేవాడు. ముచ్చటైన ఇద్దరు పిల్లలు పుట్టారు. అందరిళ్ళలో ఉన్నట్టే ఏవో చిన్న చిన్న చికాకులూ, వాటిని మరుగుపరుస్తూ సరదాలూ సంతోషాలూ- అంతా బానే నడిచిపోతూ వచ్చింది.
ఇంతలో మా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమావేశం జరిగింది. మా బాచ్ కి అదే మొదటిసారి. ఆ సమావేశానికి వనితనీ, నన్నూ రాజేష్ తన కారులో దింపాడు. ఆడిటోరియం దగ్గర మేం దిగుతుంటే ఆ పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్న మా క్లాస్మేట్స్ చుట్టుముట్టి పలకరించారు.
వనిత రాజేష్ ని పరిచయం చేయబోయింది. ఆలోపే సూరి అనే అతను చూపుడువేలు రాజేష్ వైపు పెట్టి చూపిస్తూ “లెటమీ గెస్! యూ ఆర్ ప్రక్కాష్” అన్నాడు. మా మొహాలు వివర్ణమవడం లిప్తపాటే అయినా రాజేష్ గ్రహించేశాడు.
వెంటనే తేరుకుని “ఇన్నాళ్లయినా నీ కంగారు ఏమీ మారలేదన్నమాట! ప్రకాష్ రాజ్ కాదయ్యా బాబూ. వనిత హస్బెండ్ పేరు రాజేష్ ఖన్నా” అన్నాను నవ్వుతూ.
“అదేవిటీ ప్రకాష్ ఏమయ్యాడూ? అయితే వాడొట్టి టైం పాసేనా?” అన్నాడు. అతను చదువుకునే రోజుల్లో కూడా ఇలాగే వేపకాయంత వెర్రితో ఉండేవాడు.
రాజేష్ మాత్రం ‘ప్రకాష్ లాస్ తన గెయిన్ అయింద’ని వనిత భుజం చుట్టూ చెయ్యేసి, రొమాంటిక్ హీరోలా నవ్వులు చిందిస్తూ ఓవరాక్షన్ చేశాడు. ఆ నవ్వు చూసి నా మనసు తెరిపినపడింది. మమ్మల్ని దింపి అతను వెళ్లబోతుంటే మా వాళ్ళు మాటవరసకు భోంచేసి వెళ్ళమన్నారు. ఆ మాటలు పట్టుకుని లంచ్ దాకా మాతో ఉండిపోయాడు. భోజనాలపుడు సూరి కూర్చున్న టేబిల్ దగ్గరే కూర్చుని, అతనితో కబుర్లాడి, కావలసిన విశేషాలు రాబట్టుకుని వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత రాజేష్, వనితల మధ్య పరిస్థితి మారిపోయింది. ఆఫీస్ లో ఆలస్యమైతే వంకర మాటలతో వేధించడం, ఎవడితో పోయావే అంటూ బూతులు తిట్టడం, సన్నిహిత సమయాల్లో ప్రకాష్ ప్రస్తావన తెచ్చి అసభ్య ప్రేలాపనలతో దాని మనసు తూట్లుపొడవడం అతనికి అలవాటైపోయింది. పెద్దలకి సమ్మతమై పెళ్లి కుదిరాక వనిత రాజేష్ తో సన్నిహితంగా చనువుగా ఉండేది. అతని మనసులో ప్రకాష్, వనితల మధ్య చనువు ఎక్కడిదాకా వెళ్లిందోననే ఆలోచన పురుగులా దొలచడం మొదలెట్టింది.
ఎదిగీ ఎదగని పసివాళ్ళ ముందు గొడవపడటం ఇష్టంలేక సహనం వహిస్తున్న వనితని చూసి, ‘తప్పు చేసింది కనకే తలవంచుకుపోతోంది’ అనుకోవడం మొదలుపెట్టాడు. అసలే బద్ధకస్తుడు. ఇపుడీ వంక తోడయింది. మెత్తనమ్మని చూస్తే మొత్తబుద్ధి అన్నట్టు పనులతో అలిసిపోయి, పక్క మీద వాలిన వనిత మనసు నొప్పించి, మాటలతో హింసిస్తేనే గాని అతనికి తృప్తి లేకుండా అయిపోయింది.
పుట్టింటి ఆసరా లేదు. కొడుకింట్లో ఎలాగోలా గడుపుకుంటున్న వాళ్ళమ్మగారి నుంచి వనితకెలాంటి సాయం దొరికే అవకాశం లేదు. ఒంటరిగా మోయలేని పసిపిల్లల బాధ్యత దాని ఆత్మాభిమానాన్ని చంపేసినట్టుంది. అప్పుడపుడు ఇలా ఫోన్ చేసి, కాసేపు తన బాధ నాకు చెప్పుకుని, ఏడ్చి, మళ్ళీ రొటీన్ లో పడిపోవడం దానికి అలవాటైపోయింది.
ఇలా అది ఫోన్ చేసి పెట్టేశాక ఆ బాధంతా నా గుండెలోకి దిగి కొంతసేపు సలుపుతుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత నన్ను చికాకు పరుస్తుంది. తర్వాత నేనూ నా సంసార తాపత్రయంలో పడి మర్చిపోతాను.
*
కుకర్ ఎక్కించి కూర తరుగుతుంటే బెల్ మోగింది. రంగమ్మే అయుంటుంది. వస్తున్న కోపాన్ని అదిమిపట్టి తలుపు తెరిచాను. ఎదురుగా భావరహితమైన మొహంతో నిలబడి ఉంది రంగమ్మ. వెనక ఆమె కూతురు మనీష. పన్నెండేళ్ళది.
“ఇక పనికి రావద్దులే రంగమ్మా. మనకి కుదరడంలేదు” అన్నాను తలుపుకి అడ్డంగా నిలబడి. లేకపోతే నన్ను లక్ష్యపెట్టకుండా లోపలికెళ్లి పనిలో జొరబడిపోతుంది.
“ఇగ మానన్లే” అంది.
“నువ్వేం చెప్పినా నేను వినను రంగమ్మా. వారం రోజులు చెప్పా పెట్టకుండా మానేశావు. ఫోన్ చేస్తే తియ్యవు. రానని చెప్పవు. మాకూ ఉద్యోగాలున్నాయి కదా?”
నా మాట వినబడనట్టు నిలబడింది.
ఇంతలో కుకర్ విజిల్ గట్టిగా వినిపించింది. “రంగమ్మా, నాకు నీతో వాదించే ఓపిక లేదు. తీరిక అంతకంటే లేదు. ఆఫీస్కి టైమైపోతోంది. నీకోసం రోజూ ఎదురుచూసి, సగం సగం పని చేసుకుని పరుగెత్తే బదులు రాత్రే పనంతా చేసేసుకోవడం వీలుగా ఉంది” అని తలుపేసి వచ్చేశా.
కూర పోపులో వేసి వెనక్కి తిరిగేసరికి హాలు ఊడుస్తూ రంగమ్మా, దివాను మీది బట్టలు మడతేస్తూ మనీషా కనబడ్డారు. పేపర్ కోసం నా కూతురు మయూర తలుపు తెరవగానే ఇద్దరూ లోపలికొచ్చేసినట్టున్నారు. ఇంక నేనేం మాట్లాడలేదు. స్టవ్ సిమ్ లో పెట్టి, కాఫీకప్పుతో బాల్కనీలోకొచ్చా. ఇల్లు తుడుస్తున్న రంగమ్మ వెనకే కుర్చీలూ, బల్లలూ జరుపుతూ సాయపడుతున్న మనీషని చూస్తుంటే మనసు నొచ్చుకుంది. పాపం దాని వయసెంతని?
బడికి సెలవున్నపుడు వాళ్ళమ్మతోపాటు తనూ వస్తుంది, సంచీలో లెక్కలూ ఇంగ్లీషూ పుస్తకాలు పుచ్చుకుని. వీలుని బట్టి ఓ అరగంటో, గంటో తనకి పాఠాలు చెపుతాను. తెలివైనదే. ఆదరంగా చూస్తూ, సరదాగా మాట్లాడే సరితమ్మ ఇలా కోపంగా ఉంటే ఆ పసిమనసుకెంత బాధనిపించిందో?
ఇవాళ బడికి సెలవులేదే … మరి ఎందుకొచ్చిందో? అడగబుద్ధి కాక ఊరుకున్నా. ఇక రంగమ్మ విషయానికొస్తే… నాలుగేళ్లుగా నా దగ్గర పనిచేస్తోంది. అడపాదడపా నాగాలు పెడుతూనే ఉంటుంది. అవసరాలకి ఆదుకుంటూ ఎంత ఆదరంగా చూసినా నాతో ఏ అనుబంధమూ ఉండదు తనకి. ఆ మొహంలో ఏ భావమూ కనపడదు!
*
మిగిలిన పనంతా చేసేసి వెళ్ళిపోబోతుంటే “రేపటినుంచి రాకు రంగమ్మా. నీతో నాకు కుదరడం లేదు. వేరే చోట పని చూసుకో” అన్నాను. రాయిలా నిలబడింది.
వెనక నిలుచున్న మనీష “అమ్మకి ఒల్లు బాగలేదమ్మా” అంది. నల్లకలువలాంటి ఆ మొహంలో తీరైన పలువరస తళుక్కున మెరిసింది.
“ఏమయింది?” అన్నాను, ఏదో ఒక సుత్తి చెపుతుందిపుడు అనుకుంటూనే.
“మా తాత పొలం కోసం తెచ్చిన పురుగుమందు తాగేసిందంట. దవకానలో మూడ్రోజులుంది. ఇంటికాడ మూడ్రోజులు పండింది. చేతనైతలేదంట”
“ఎందుకలా?” కళ్లప్పగించి చూస్తూ అడిగాను. గోడవైపు చూస్తూ నిలబడింది.
“రాయిలా నిలబడి నాకు చిర్రెత్తించకు! ఎందుకలా చేశావ్?” అరిచాను.
“యాదో గొడవ పడ్డమమ్మా ఇంట్ల”
“దేని గురించి?”
“యాదో ఒకటి లొల్లిపెడ్తనే ఉంటడు. సుక్కురారం రోజు ఇంట్ల పూజ ఉన్నదని మూడో ఫ్లోరు మేడం ఇల్లంతా సదిరిపిచ్చింది. ఇంటికి పోయేతలికి సీకటైపోయింది. ఎవుడింటికి పోయినవ్ అంట మీద మీద కొచ్చిండు. చెప్తె ఇంటలేడు. జుట్టుపట్టి బాగ కొట్టిండు. నువ్విచ్చిన టీవీ సుత పలగొట్టిండు”.
భావరహితమైన ఆ చూపు మనసులోకి మంచుకత్తిలా దిగింది.
“ఎన్నిసార్లు చెప్పినా పోలీస్ కంప్లయింట్ ఇద్దామంటే రావు. వాడికి అడ్డూ ఆపూ లేదు గనకే అలా పశువులా ప్రవర్తిస్తున్నాడు. అయినా ఇలా ఎన్నిసార్లు జరగలేదు? ఇపుడు మందెందుకు తాగావు?” అడిగాను. మళ్ళీ అదే మొహం. మనసు మెలిపెట్టినట్టైంది.
“నిన్నే అడిగేది? నువ్వు ఛస్తే ఆ పిల్లల్నెవరు చూస్తారు రంగమ్మా? ముగ్గురూ తిరగబడి నాలుగు బాదితే కిక్కురుమనకుండా పడి ఉంటాడు వెధవ. ఎంత చెప్పినా వాడి కాళ్ళ కింద కుక్కలా ఉంటావు. ఇంక వాడెందుకు మారతాడు? నువ్వు మందేదో తాగి చస్తే బాగుపడుతుందా నీ సంసారం?” రంగమ్మ మొహంలోకి చూస్తూ అడిగాను.
మొదటిసారిగా ఆ కళ్ళలో తడి.
జీరబోయిన గొంతుతో అంది “సద్దమని ఈ పురుగుమందు తాగిన గాని, తిర్గి బతుకుడు నా సావుకొచ్చిందమ్మా. సచ్చిపోతే బాగుండేది. ఎవరి సావు ఆళ్లే సచ్చేటోళ్లు. ఇపుడు బతికిచ్చి రోజూ సావమని పంపిర్రు. ఇఱైయేలు అప్పయింది దవాఖాన బిల్లు. ఈ కొత్త అప్పు, పాత మిత్తీలు అన్నీ తీర్సలేక సావాలి. దవాఖాన బిల్లు కట్టనీకి ఆటో కుదవబెట్టిండు. ఇప్పుడిగ మందుకి పైసలు గూడ నేనే ఇయ్యాలి”
నాకు తలమీద బండతో మోదినట్టయింది. చద్దామని మందు తాగాక తిరిగి బతకడం తన చావుకొచ్చిందిట! ఎంత విషాదం!
ఒక నిముషం ఆగి “ఎందుకలా తన్నులు తింటూ పడుంటావు రంగమ్మా? వాడి సంపాదన వాడి తాగుడుకు చాలదు. నీ మానాన నువ్వుంటే ఇంతకన్నా బాగా బతగ్గలవు” అన్నాను మృదువుగా, అనునయంగా.
“యాడికి పోనమ్మా? యాడికెళ్తే ఆడికే వొస్తడు. నిన్ను సంపి జైలుకు పోత అంటడు. ఆయన సిన్నగున్నప్పుడే రెండుసార్లు జైలుకి పోయొచ్చిండు” నిర్లిప్తంగా అంది. కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాను.
“బియ్యమున్నాయా?”
“లెవ్వు”
షాపులో కావలసినవి తీసుకుని ఫోను చేయిస్తే, ఫోన్ పే చేస్తానని చెప్పి వాళ్ళని పంపించాను. ఏ భావమూ కనపడని రంగమ్మ మొహంలో మొదటిసారి కనపడిన దైన్యం ఆఫీసుకి వెళ్లాక కూడా పదే పదే గుర్తొచ్చి బాధించింది.
కనీసభద్రత కూడా దొరకని జీవితం, విశ్రాంతి లేని చాకిరీ తనలోని మానవ సహజమైన స్పందనల్ని చంపేసి మరమనిషిలా చేసి ఉంటాయి. వనిత కూడా అలా అయిపోతుందా? ఏదో బెంగ మనసుని చుట్టేసింది.
చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనుకుంటూ ఎలా ఉండను? అలా అని వీళ్ళకి నేనేం చెయ్యగలను? ఇలాంటి జీవితాలని పైకి లాగాలంటే ఎంత శక్తి సరిపోతుంది? వీళ్లిలా బతుకీడుస్తూండడం వెనక కనపడకుండా సమాజం చేసే కండిషనింగ్, బెదిరింపూ ఎంత ఉందో తలచుకుంటే విచారం కమ్మేసింది.
*
ఆదివారం. మయూర నిన్న రాత్రి స్నేహితురాలింటికి స్లీపోవర్ కి వెళ్లింది. రంగమ్మతో పాటు మనీష కూడా వచ్చింది. కాసేపు లెక్కలు చెప్పి, క్లాసు పుస్తకంలో ఆ టాపిక్ మీద లెక్కలన్నీ చేసేస్తే మంచి బహుమతి ఇస్తానన్నాను.
వార్తాపత్రిక పట్టుకుని బాల్కనీలో కూర్చుంటే అవే ఆలోచనలు మళ్ళీ చుట్టుముట్టాయి. ఇలా ఏమీ చెయ్యకుండా బాధపడుతూ గడిపినంతకాలం శాంతి లభించదని అర్ధమైంది. బాధిత స్త్రీలకోసం పనిచేసే హెల్ప్ లైన్ లో వాలంటీర్ గా పనిచేస్తున్న వేదవతి గుర్తొచ్చింది. కాసేపు వాళ్లింటికి రావచ్చేమో అడుగుదామని తనకి ఫోన్ చేశాను.
“మీ కాలనీలోనే ఉన్నానోయ్. ఒక పది నిముషాల్లో నా పని పూర్తవుతుంది” అంది.
“అవునా? కాసేపు రాకూడదూ మంచి కాఫీ ఇస్తా!” అన్నాను.
నవ్వి “సరే” అంది.
కాఫీ తాగుతూ చూచాయగా వనిత వివరాలు చెప్పాను. రంగమ్మ సంగతి ఇంతకు ముందే తనకు తెలుసు.
“ఇద్దరాడపిల్లలు వేదా! పుట్టింటి ఆసరా ఏ మాత్రం లేదు. కోర్టుకి వెళితే తేలేసరికి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. కస్టడీ ఎవరికిస్తారో చెప్పలేం. ఒకవేళ దీనికే ఇచ్చినా ఇద్దర్నీ ఒంటరిగా పెంచడమంటే మాటలు కాదు. అతను వేధించాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్లగలడు. సంసారం పిల్లలూ ఇదే గుడుగుడు గుంచంలో తన ఫ్రెండ్స్ అందర్నీ వదులుకుంది గాని రాజేష్ ఇక్కడే పుట్టి పెరిగాడు. బోలెడుమంది ఫ్రెండ్స్. పోలీస్ వర్గాల్లో కూడా అతనికి స్నేహితులున్నారు. దీనికి సాయంగా వచ్చేవాళ్లెవరుంటారు?” చెపుతుంటేనే నా గొంతు గద్గదమైంది.
“తను పనిచేసే ఆఫీస్ లోనూ, ఉంటున్న ఇంటి చుట్టుపక్కలా స్నేహ సంబంధాలు పెంచుకోవాలి సరితా! పెళ్ళై కుటుంబం ఏర్పడగానే తమ శక్తియుక్తులు పూర్తిగా ఇంటికే ధారపోస్తారు ఆడవాళ్లు. వాళ్ళు చేసే ప్రధానమైన తప్పు ఇదే. బయట ఎవరితోనూ పెద్దగా సత్సంబంధాలకోసం, స్నేహం కోసం ప్రయత్నించక, ‘మొగుడూ ఇల్లూ పిల్లలూ ఉద్యోగం… ఇంతే చాలు’ అన్నట్టుంటారు.
“మిన్నువిరిగి మీద పడేదాకా నెట్టుకుంటూ వస్తారు. తప్పనిసరి పరిస్థితులెదురయినపుడు ఒక్కసారిగా అన్నీ బయట పెట్టుకోవల్సొస్తుంది. అందువల్ల ఉపయోగం ఉండదు. ఎటూ తోచని స్థితిలో కొందరు ఆత్మహత్య వైపు నెట్టబడతారు. కొందరు అభాసుపాలై కుంగిపోతారు. ఈ క్రమంలో పిల్లలు ఎన్నో రకాల వత్తిళ్ళకి గురవుతారు.
“అందుకే మన జీవన ప్రయాణం సాగుతున్నంత కాలం కనీసం మనసుకు నచ్చిన ఐదారుగురు ఫ్రెండ్స్ తో స్నేహాన్ని నిలుపుకుంటూ, వాళ్ల సమస్యలని అర్ధం చేసుకుంటూ, చేతనయినంతలో వాళ్ల అవసరాలకి సాయపడుతూ ఉండాలి. అవసరమైనపుడు మన సమస్యలు చెప్పి సాయం తీసుకుంటూ ఉండాలి. ఇచ్చిపుచ్చుకోవడాలని ఇష్టపడని వాళ్ళు ఒంటరి ద్వీపాలైపోతారు” అంది.
నిజమే. వాసూ మంచివాడు కనుక అవసరం లేకపోయింది గాని నేనూ అంతే. అవసరమైతే చేయందించే గాఢమైన స్నేహం నాకు మాత్రం ఎవరితో ఉంది?
“మన కొండాపూర్ లో కూడా భరోసా సెంటర్ ఉంది, నీకు తెలుసా? తేలిగ్గా గుర్తుంచుకునే నంబర్ 100. దానికి చేస్తే చాలు. అవసరమైన సాయం దొరుకుతుంది. బయట ఎవరికైనా ఒక షెల్టర్ కావాలన్నా, సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలన్నా, లాయర్ సలహా అవసరమైనా చాలా ఖర్చవుతుంది. భరోసా ద్వారా బాధితులకి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి.
“వెతకాలి సరితా. ‘భరోసా’ అని కొట్టి నెట్ లో వెతుకు. లేదా డొమెస్టిక్ వయొలెన్స్ హెల్ప్ లైన్ అని చూడు. క్షణంలో ఎంతో సమాచారం ప్రత్యక్షం అవుతుంది. ఆ నంబర్ కి ఫోన్ చేయించు. నువ్వెళ్ళి ఆమె ఇంట్లో నుంచుని ఆ మొగుడితో పోరాడాలేమో అని నీ భయం. అలాంటి అవసరం ఉండదు. ఫిర్యాదు అందాక వాళ్ళే చూసుకుంటారు. పోలీస్ కేసైతే వాడికీ భయం కలుగుతుంది” అంది.
“నిజమే వేదా. సరే…రంగమ్మ సంగతంటే వేరు. వనిత విషయం ఇంకా కాంప్లికేటెడ్ కదా. ఫిజికల్ అబ్యూజ్ లేదు. ఆ హింసని తనెలా నిరూపిస్తుంది?”
“హింస ఎన్నిరకాలుగా ఉంటుందో తెలిసినవాళ్ళు సరితా వీళ్ళు! శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్. ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో వాళ్ళే తర్ఫీదిస్తారు” అంది.
“వనిత కూడా రంగమ్మలా చేసే అవకాశం ఉందంటావా?”
“ఎందుకులేదూ? ప్రపంచంలో ప్రతి నలభై సెకన్లకీ ఒక ఆత్మహత్య సంభవిస్తోంది తెలుసా? మనం గృహహింసనీ, ఆత్మహత్యనీ విడివిడిగా చూస్తాం. చాలా సందర్భాల్లో అవి ఇంటర్ లింక్డ్ గా ఉంటాయి”
ఏదో భయం సర్రున నా వెన్నులో పాకింది.
“కొంతకాలం సర్దుకుంటే పిల్లలు పెద్దవాళ్లవుతారని దాని ఆలోచన. మొగుడి సపోర్టు లేకుండా ఇంత చిన్నపిల్లల్ని ఒక్కర్తీ పెంచలేదని దాని భయం!”
“ఎవరికోసం తను సర్దుకు బతకాలనుకుంటోందో వాళ్ళకే అది మంచిది కాదు సరితా! ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల్లో పెద్దయ్యాక తండ్రిలాగే ప్రవర్తించే టెండెన్సీ ఉంటుంది! డ్రగ్స్ కీ, ఇతర వ్యసనాలకీ అలవాటుపడడం కూడా ఇలా పెరిగిన పిల్లల్లోనే ఎక్కువ. వయసు పెరుగుతున్నకొద్దీ వీళ్ళలో మానసిక వైకల్యాలు కూడా ఎక్కువయే అవకాశముంది.
“వనితకి మంచి ఉద్యోగం ఉంది. కాస్తపాటి ఆసరా ఉంటే చాలు, తనే దారి వెతుక్కోగలుగుతుంది. ఇంట్లో ఉంటూనే కొన్ని సాక్ష్యాధారాలు పోగుచేసుకోవడం ఎలానో అక్కడ లాయర్ చెప్తారు. తను మారకపోతే ఆమెని కోల్పోతాడని రాజేష్ కి అర్ధం కావాలి సరితా! అలాంటి భయం అతనిలో కలిగేలా ఆవిడ ప్రవర్తించకపోతే అతనెప్పటికీ మారడు.
“భరోసానే కాదు, భూమిక హెల్ప్ లైన్, సఖి హెల్ప్ లైన్, షీ టీమ్స్ ఇలా మహిళల కోసం పనిచేసే సంస్థలు ఇపుడు చాలా ఉన్నాయి. స్త్రీలు ఒంటరివాళ్ళు కారనీ, వాళ్ళ వెనక అండగా నిలబడే ఇంత పెద్ద సంస్థలున్నాయనీ తెలిస్తే అతనే దారికి వస్తాడు. రాకపోతే ఉద్యోగం కూడా ఊడిపోయే స్థితి వస్తుంది!” అంది. తన మాటల్లో ఉట్టిపడుతున్న కాన్ఫిడెన్స్ కి ఆశ్చర్యం కలిగింది.
“తాగుడూ, మత్తుమందు అలవాట్లని మాన్పించడానికి కూడా ఏదైనా దారి ఉందా వేదా?”
“లేకేం? నేనింతకుముందు చెప్పిన ఆ మహిళా సహాయతా కేంద్రాలన్నిటికీ అనుబంధంగా డి-అడిక్షన్ సెంటర్స్ కూడా ఉంటాయి. మా వాలంటీర్లు రంగమ్మ లాంటి వాళ్ళ ఇళ్లకి కూడా వెళ్తారు. తన మొగుణ్ణి ఒక్కసారి భరోసా సంస్థకి తీసుకురాగలిగితే, అక్కడ తాగుడు వ్యసనం నుంచి బయటపడ్డవాళ్లతో టీమ్ చేస్తాం. మనం ఎన్ని చెప్పినా వాళ్ళ తలకెక్కదు గాని, అలా బయటపడి బాగుపడ్డ తమలాంటి వాళ్ళు చెప్పినపుడు వాళ్లలో బలే మార్పు వస్తుంది.
“వ్యసనాలనించి బయటపడి పిల్లల్ని బాగా చదివించుకుంటూ, సమాజంలో గౌరవాదరాలూ, కుటుంబంలో ప్రేమాప్యాయతలూ అందుకుంటున్న తోటి మగవాళ్ళని చూసి తాము కూడా మారాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. అపుడపుడు వాళ్ళు ఇంకొకళ్ళని తీసుకొస్తూ ఉంటారు. అలాంటి భార్యాభర్తలు మాపట్ల చూపించే కృతజ్ఞత అంతా ఇంతా కాదు. అది చూసి మేం పడిన శ్రమంతా మర్చిపోతాం! వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటూ పైకొస్తుంటే కలిగే ఆనందం మాటలో చెప్పలేను” అంది. ఆ కళ్ళనిండా వెలుగు అపురూపంగా కనబడింది.
*
వేదతో మాట్లాడాక వనితని భరోసా సెంటర్ కి తీసుకువెళ్లాలని విశ్వప్రయత్నం చేశాను. ఆఫీసులో పనెక్కువగా ఉందనీ, పిల్లలిద్దరికీ జ్వరాలొచ్చాయనీ, తనక్కొంచెం సమయం కావాలనీ, కొన్ని రోజులు తనని వదిలేయమనీ … ప్రతిసారీ ఏదో ఒకటి చెప్తూ దాటవేసింది గానీ, ఎంతకీ ధైర్యం తెచ్చుకుని ముందుకి రాలేదు. చివరికి విసుగొచ్చి వదిలేశాను.
వార్తాపత్రిక తెరిస్తే చాలు ఉరేసుకునో, కిరోసిన్ పోసుకునో, ట్యాంక్ బండ్ మీంచి దూకో, నిద్ర మాత్రలు మింగో- గృహిణుల ఆత్మహత్యల వార్తలు కనబడుతూనే ఉన్నాయి. ‘ఈసారి వనిత ఫోన్ చేసి తన బాధ వెళ్లబోసుకున్నా ఓపిక తెచ్చుకుని వింటాను గాని ఏమీ చెప్పను. దాని గురించి ఆలోచించి బాధపడను’ అనుకున్నాను గానీ నిజంగా ఆ పరిస్థితి ఎదురైనపుడు మాత్రం పట్టరాని కోపం వచ్చింది.
కిందటిసారిలాగే పొద్దున్నే ఫోను. బరువెక్కిన గొంతుతో రాత్రేం జరిగిందో చెప్తూ, మధ్య మధ్యలో ఏడుస్తూంటే అభావంగా విన్నాను గానీ “సరితా, నాకేదైనా అయితే ఈ పసివాళ్ళని చూస్తావు కదే” అనగానే నాకు ఒళ్ళు మండిపోయింది.
“అవునే, నువ్వు బతికుండీ ఏమీ చెయ్యవు గాని నువ్వు లేకుండా పోతే వాళ్ళని నేను చూడాలా? చాలా బావుందే! శభాష్!” అన్నాను వెటకారంగా.
అదొక క్షణం నిర్ఘాంతపోయి ఫోన్ పెట్టేసింది. కుర్చీలోనో, మంచంమీదో వాలిపోయి ఏడుస్తూ ఉండి ఉంటుంది! నా మనసు వికలమైపోయింది. ఉక్రోషమూ వచ్చింది. లోలోపలంతా అల్లకల్లోలంగా ఉండడంతో ఆఫీసులో పనులు కూడా అస్తవ్యస్తంగా జరిగాయి. సాయంత్రం ఇంటికొచ్చేసరికి భరించలేని తలనొప్పి. వేడిగా కాస్త కాఫీ తాగుదామని పాలు స్టవ్ మీద పెట్టాను.
ఏబ్రాసికి పనెక్కువ అనేది అమ్మ. చేసే ఓపికలేనపుడు ఎలాగోలా పూర్తి చేసేద్దామని తొందరపడతాం. అపుడు ఖచ్చితంగా పనెక్కువవుతుంది. పైనుంచి చక్కెర సీసా తీస్తుంటే చెయ్యిజారి సీసా కిందపడి, భళ్ళున పగిలింది. వంటిల్లంతా గాజుముక్కలూ, పంచదార పలుకులూ పరుచుకున్నాయి. ఉసూరుమనిపించింది.
నా అదృష్టం బాగుండి, సరిగ్గా అప్పుడే రంగమ్మొచ్చింది. సాధారణంగా సాయంత్రం రాదు. పొద్దున్న తన పని పూర్తవకముందే నేను వెళ్లిపోవడంతో ‘సాయంత్రం వచ్చి బట్టేసి తుడుస్తా’నని మయూరకి చెప్పి వెళ్ళిందిట.
“ఏమిటి విశేషం?” అడిగాను.
“అదే కొండాపూర్ల భరోసా సెంటర్కి వోతున్నం గదమ్మా” అంది వెనక తలుపు తెరుస్తూ.
ఆశ్చర్యపోయి “ఎప్పట్నించీ” అన్నా.
కొబ్బరి చీపురుతో గాజుముక్కలన్నీ చేటలోకి ఎత్తుతూ “పదిరోజులయ్యిందమ్మా. మా మరిదింట్ల దావతుందని జెప్పిన గద. అయ్యాల మా ఆయన తాగొచ్చి కొట్టిండు. అయితే వేదమ్మ వొచ్చిన్రోజు మీరిద్దరూ మాట్లాడుతుంటే మా మనీష ఇన్నదంట. ఆయమ్మ చెప్పిన నంబరుకి ఫోన్ జేసి చెప్పిందంట. నాకేమి చెప్పలే. ముగ్గురు ఆడోళ్ళు, ఒక పోలీసాయన మా ఇంటికొచ్చిర్రు. మా ఇద్దర్నీ, పిల్లల్నీ భరోసా సెంటర్కి తీస్కపొయిర్రు. శానా సేపు మా గురించి అడిగి, ఏవో పోలీస్ కేసులూ, జైలు శిక్షలూ అన్నీ చెప్పిర్రు. ఇట్లనే తాగుడు మానేసినోల్ల గ్రూపేదో ఉందంట. మాయన్ని సుత దాన్ల జాయిన్ జేసిర్రు. అప్పటిసంది ‘తాగుడు మానేస్తా’ అంటుండు. ఆల్లు రమ్మని చెప్పినపుడల్లా ఇద్దరం పోతున్నం. ‘పిల్లల్ని మంచిగా సదివిస్త’ అంటుండిపుడు” అంది.
ఆశ్చర్యంగా వింటూ కాఫీ కలుపుకున్నా.
“ఇదంత నే తుడిసి శుభ్రం జేస్తలే. నువ్వు పోయి కాఫీ తాగు” అంది. బాల్కనీలో కూర్చుని వేడి కాఫీ తాగుతుంటే, మనసులో పొద్దుటినుంచి తిరుగుతున్న పాట గుర్తొచ్చింది. ‘మగువా, మగువా! లోకానికి తెలుసా నీ విలువా? మగువా, మగువా! నీ సహనానికి సరిహద్దులు కలవా?’
లోకానికి తెలుసో తెలియదో అటుంచి తమ విలువ తమకే తెలియని మగువలెందరో? తమకి ఏ మాత్రం విలువ దొరకని చోట ఊడిగం చేస్తూ, తమ శ్రమకు తగిన గౌరవం లభించని చోట పోరాటం కూడా చెయ్యకుండా జీవచ్ఛవంలా బతుకీడుస్తూ ఎంతమందో! భర్త నిరాదరించాడనో, హింసిస్తున్నాడనో, ప్రేమించినవాడు కాదన్నాడనో తమ జీవితాన్ని తామే అంతం చేసుకునే ఆడవాళ్లలో మార్పు ఎలా వస్తుంది? వనితని తీసుకొచ్చి రంగమ్మతో మాట్లాడిస్తే?
ఆ ఆలోచన బావున్నట్టనిపించింది. తలనెప్పి సర్దుకున్నట్టై మనసు నెమ్మదించింది.
ఏదో ఆశిస్తూ ఏవేవో చేస్తాం. ఫలితం కనబడదు. ఉద్వేగాలని వదిలేసి ఏదీ ఆశించని క్షణంలో చీకటి సొరంగపు చివర చిన్న వెలుగులా ఒక ఆశా కిరణం కనబడుతుంది! నిర్మలచిత్తంతో ప్రయత్నిస్తే నిజంగానే విశ్వమంతా ఏకమై అది సిద్ధించేలా చేస్తుంది కాబోలు. లోపల్నించి ఏదో కొత్త ఉత్సాహం పొంగుకొచ్చింది.
***
చాలా బాగుందండీ 👌🏻👌🏻👌🏻 ఇలానే సరితలా కొందరి కష్టాలు విని కోపం వస్తూ ఉంటుంది నాకు. కథలో చదువుకున్న వనిత కన్నా రంగమ్మ మెరుగ్గా ప్రవర్తించి జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేసింది. చదువు, ఉద్యోగం ఉన్న వనిత లాంటి వాళ్ళు పరువుకో, తరువాత తలెత్తే సమస్యల కో భయపడి తెగింపు చేయరు. Nice story.
ధన్యవాదాలండీ
మంచి కథ. ఈ కథ ద్వారా కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఇందులో చర్చించిన అంశాలు బహుశా చాలా మంది మహిళళలకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథ మనిషా లా చాలా మంది ఈ విషయాల్ని ఉపయోగించుకొని గృహహింస నుంచి తప్పించుకోవడమే కాదు. హింసా ప్రవృత్తి ఉన్న మగవాళ్ళను అందులోంచి బయట పడేయ వచ్చు.
అవునండి. ఆ అవకాశం ఇపుడుంది. బాధితులు తమంత తామే ఆ ప్రయత్నం చేయడం అరుదు. సమాజం కూడా కొంతైనా పట్టించుకుంటే అలాంటివాళ్ల జీవితాలు బాగుపడతాయి.
Very relevant for today’s life situations. Hearty congratulations Nagalakshmi garu. Nice illustration too❤️
Thank you Shridevi garu!
చాలా బాగా రాసారండీ. హింసని మోతాదు పెంచుకుంటూ అలవాటు చేసుకుంటున్నారు ఆడవారు.
ధన్యవాదాలు శ్రీదేవి గారూ!
చాలా చాలా బాగుంది కథ నాగలక్ష్మి. ఇది కథ అనడం కన్నా ఎన్నో జీవితాల్లో చాలా మామూలుగా వ్యాపించిపోయిన జాడ్యాల పాలి పడ్డ వనితల వ్యథ. అబ్యూజ్ కు ఎంత అలవాటు అయిపోతారంటే… అదే జీవితం, అదే రాసిపెట్టి ఉంది… భరించాలిసిందే.. అన్నట్టు నూతిలో కప్పలా అలవాటు పడిపోతారు ఆ ఇరుకు పరిధికి. బయట పడరు. ప్రతీదీ పరువుకు, సమాజానికీ, పిల్లలకూ లింకు పెట్టుకుని… ఆ అబ్యూజ్ నుండి తప్పించుకోడానికి ప్రయత్నించరు. మధ్యతరగతి కన్నా దిగువతరగతి వారికి కాస్త తెగువ ఎక్కువ. చాలా మంచికథకు అభినందనలు.
థాంక్యూ శశీ!
కథ చాలా బాగుంది Nagalakshmi garu. కుటుంబంలో హింస ని మామూలు విషయం గా చేసింది మన సమాజం. మార్పు పై నమ్మకం లేక అందులో నే ఉండి బాధ పడుతూ ఉంటారు మీ కథలో పాత్ర లాగా. మార్పు కి దారి ఎలాగో సూచించారు. బాగుంది.
థాంక్యూ రమాదేవి గారూ!
సమాజంలో పాతుకుపోయిన ఆడదానికి భూదేవంత ఓర్పుండాలి అనే నానుడికి కూడా ఒక హద్దనేది ఉంటుందని బాగా చెప్పారు నాగలక్ష్మి గారూ. మధ్యతరగతి వారికన్న, దిగువ మధ్యతరగతి వారు కాస్త తొందరగా స్పందిస్తారన్న మాట వాస్తవం.
ఆ సంగతి మీ కథలో హృద్యంగా చెప్పారు.
అభినందనలు.
ధన్యవాదాలు లక్ష్మి గారూ!