భయం

ది నా లోకి ఎలా ప్రవేశించిందో
కానీ నన్ను కంపి తుని చేస్తుంది

అకుంఠిత పట్టుదలను తెగింపును వేడిని తలెత్తుకొని నిలిచే వ్యక్తిత్వాన్ని
ఎవరికీ తలవంచని ఉదయ ధైర్యాన్ని
మెల్ల మెల్లగా నన్ను సల్ల పరిచింది

ఎలా బతకాలి అనే తలంపు రాగానే
ఎలా మెదులు కోవాలనే తర్ఫీదు నిస్తుంది ఎలా నిలదొక్కుకోవాలని యోచనకలువగానే
ఎలా నంగి నంగిలా
ఒదిగి ఉండాలనో నేర్పుతుంది

ఆవహించు కోగానే
అద్వితీయమైన ప్రశ్నను లాగేసుకుంటుంది నేను ను తునాతునకలు చేస్తుంది
కాళ్లు చేతులులూ  కట్టి పడేసి
కురీచ ముందర  పడవేస్తుంది

లొంగిపోయి గులాములా
వంగి వంగి మోకాళ్ళ మీద
నిలబడి సలాం  చేయిస్తుంది
నరనరాన జరజరా పాకి
రగ రగ నిప్పుని బొగ్గులా మార్చివేస్తుంది

బాగుపడడం అంటే ఏంది
మంచిగా ఉండటం అంటే ఏంది
సుఖ పడటం అంటే ఏంది
ఇబ్బంది లేకపోవడం అంటే ఏంది
సౌకర్యం అంటే ఏంది
తలను పాదాల దగ్గర పెట్టడమే కదా

నీదంటూ నీకంటూ సంపాదించుకున్న

అద్భుత వ్యక్తిత్వ నిర్మాణాన్ని లక్కఇల్లులా

తగుల పెట్టుకోవడమే కదా

తోకూపు కుంటూ
మ్యావ్ మ్యావ్ అంటూ
మన అడుగుల చప్పుడు
మనకే వినిపించనంత
నిలువునా చిగురాకులా వణికిపోవడం  నిరాయుధం కావడమే

శత్రువుని నిలువరించడానికి నిస్సహాయునని చేయడం
అన్ని ఆయుధాలు కలిగి ఉండిన
నిన్ను ఎప్పుడైతే భయం ఆక్రమిస్తుందో
అప్పుడే లొంగి పోయావు
నువ్వేదో బతికి ఉన్నానని
బింకాలు పోతున్నావు కానీ
నువ్వు ఎప్పుడో చచ్చిపోయి
వాచిపోయి దుర్వాసన వేస్తున్నావు

ఛీ
ఒక మోచేతి నీళ్లు తాగే
బతుకు బతుకేనా
ఇంత భయం భయంగా జీవించే  బదులు ఉన్నట్టు కాదు లేనట్టు కాదు
ఒక్కసారి చటుక్కున
పో
పోతే నే మంచిది ఉండిలేని సమానం

*

జూకంటి జగన్నాథం

1 comment

Leave a Reply to Penugonda sarasija Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు