1.
అంతకంతకూ ఎక్కువయ్యే మనాది వజను ఓపలేక కూలబడుతవు. ఎంతకూడదీసుకున్నా అగ్గిపెట్టె మనసు సొరంగంలోకి సొచ్చుకపోలేవు. మొసమొర్రని బతుకైపోయిందిరా కొడుకా.. రొంబొచ్చె గుద్దుకుంటవు.
2.
గల్మముంగటికొచ్చి నిలవడ్డ పీరీలకు దస్తిగడుతనని మొక్కుకుంటవు. లోపల్లోపల అలావా గుండం తొక్కుడుబడ్డా ఎందుకనో జెప్పున్నే సల్లారది. మందలిచ్చేటోడు కరువై కుతిలేశిన పానం ఒక్కతీరుగ తండ్లాడుతాంటది. పురాగ సావకుంట బత్కకుంట అయితాంది గదరా అయ్యా.. లబ్బలబ్బ మొత్తుకుంటవు. నెత్తినోరు కొట్టుకుంటవు. నీ మాటలినలేక యాష్టకచ్చిన జనం శెవుల్ల సీసం బోసుకుంటరు.
3.
కోనేట్ల మునిగి పాలకాయ తల్కాయను పటుక్కున పలగ్గొట్టుకుని కోల్యాగను వదిలిపెడుతవు. జడలుగట్టిన జుట్టు కొప్పుముడిప్పి ముక్కుమూసుకుని తపస్సుజేత్తవు. నిప్పులగుండం మీద పొర్లుదండంబెట్టి బొబ్బలెక్కిన పెయి మీది బుగ్గల్ని టప్ప టప్ప పలగ్గొట్టుకుంటవు. ఏం గోసరా తండ్రీ..ఎన్నడు బాత్తదిరా రందీ..ఎంత అవుగోలిచ్చిన పలుకవేందిరా నాయినా.. ఓ నా నాయినా..శివాలూగుతనే వుంటవు.
4.
అంతా కలికలి. నీ తరం గాదు. నీ వశం గాదు. నీతో నువ్వెప్పటికీ నెగులలేవు. లోపల సలుపుతనే వుంటది. వాన ఎల్శినంక సూరుపొంటి ఒక్కొక్క బొట్టు రాలినట్టు సలిపిన కొద్దీ పానం ఎల్లిపోతాంటది. కుతకుత వుడికే బువ్వకుండల మెతుకు మీది ఆవిరి సుక్కల్లెక్క అగో..అగో..అగసూడు గాలి గైకట్టెకు జిక్కి మాయమైతాంది బిడ్డా..జాడదీసుకుంట యాడని ఎంకులాడనే అవ్వా…ఓ నా అవ్వా..బొందిల పానం గదనే..ఎట్టెట్ట ఎన్కకు గుంజుకరానే..
*
చిత్రం: సృజన్
Add comment