బీసీల సాహిత్యం మీద వివక్ష ఎందుకు?!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో మొదటి నుంచి బోధన, పరిశోధన, ప్రచురణ, ప్రాచుర్యం అంతా కూడా బ్రాహ్మణులు రాసిన సాహిత్యానికే దక్కింది. వీటివల్ల ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి పొందింది కూడా మెజారిటీగా ఆ సామాజిక వర్గం వారే! అధ్యయనం లో భాగంగా గురజాడ శ్రీరామమూర్తి మొదలు వయా కందుకూరి వీరేశలింగం నుంచి ఆరుద్ర వరకు సాహిత్య చరిత్ర, కవి, పండిత జీవిత చరిత్రలూ వారే వెలువరించారు. ఇందుకు జి.నాగయ్య, సిమ్మన్న లాంటి ఒక్కరిద్దరు మినహాయింపు. ఇట్లా వెలువడిన సాహిత్య చరిత్రల్లో బ్రాహ్మణ పండితుల గురించి కుల గోత్రాలు, ఇంటిపేర్ల విశ్లేషణలు, నియోగి, వైదిక విభజన వివరాలతో సహా రాసిండ్రు. అయితే బీసీల విషయం వచ్చే సరికి వారి కుల గోత్రాలు విస్మరించారు. లేదంటే బీసీలను సైతం బ్రాహ్మణులుగా తమ ఖాతాలో వేసుకున్నారు. కందుకూరి రుద్రకవి ఇందుకు పక్కా  ఉదాహరణ.

ఇటీవలి కాలంలో అంటే 1990ల తర్వాత రాసిన చరిత్రల్లో దళితులకు కొంత స్థానము దక్కుతూ ఉన్నది. ఆ యా విశ్వవిద్యాలయాల్లో అనివార్యంగా జాషువా మొదలు కొలకలూరి ఇనాక్‌ వరకు రాసిన సాహిత్యాన్ని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. అయితే సమాజంలో 50 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల గురించి ఈ విశ్వవిద్యాలయాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇవ్వాళ ఈ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల్లో వందకు 95 శాతం మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాల నుంచి వచ్చినవారున్నారు. అందులో బీసీలు తమ జనాభా దామాషా మేరకన్నా ఎక్కువగానే ఉన్నారు.

ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒకట్రెండు పాఠ్యాంశాలు తప్ప మిగతా ఏ విశ్వవిద్యాలయంలోనూ బీసీలు సృజించిన రచనలకు, బీసీల జీవితాలు ప్రతిఫలించిన సాహిత్యానికి ఎప్పుడోతప్ప స్థానం దక్కడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయినప్పటికీ నన్నయ మొదలు శ్రీశ్రీ వరకు ఆధిపత్య కులాల వారి రచనలే రెండు రాష్ట్రాల్లో పాఠ్యాంశాలై వర్ధిల్లుతున్నాయి. ఇట్లా ఆధిపత్య కులాల వారి రచనలే బోధించడం ద్వారా విద్యార్థులకు నన్నయ మొదలు కందుకూరి, గురజాడ, గిడుగు, చలం, శ్రీశ్రీ తదితర (తెలంగాణలో వీరికి కాళోజి, దాశరథిల జోడిరపు) బ్రాహ్మణ సాహితీవేత్తలు మాత్రమే గొప్పవారు, వారు తప్ప యోగ్యులైన మిగతా సాహిత్యం, సాహితీవేత్తలు లేరు అని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖల ఆచార్యులు సంకేతిస్తున్నారు. ఇప్పటికైనా ఈ తీరు మారి బీసీలు రాసిన సాహిత్యానికి, బీసీ పండితుల జీవితాలు పాఠ్యాంశాలుగా రావాల్సిన అవసరమున్నది.

ఇన్నేండ్లూ తెలుగు సాహిత్య చరిత్ర రాసిన వాళ్లలో దాదాపు అందరూ (వెలమల సిమ్మన్న, జి.నాగయ్య లాంటి ఒకరిద్దరు మినహా) ఆధిపత్య కులాల వారే కావడంతో వారెన్నడూ ప్రత్యేక శ్రద్ధతో బీసీల రచనలను పరిశీలించలేదు. దాని పర్యవసానంగా వాళ్లు రాసిన సాహిత్య చరిత్రలో బీసీలకు న్యాయమైన స్థానం దక్కలేదు. ఇప్పుడీ ఒరవడిని మార్చి సాహిత్య అధ్యయనం, అధ్యాపనలను బీసీ మార్గం పట్టించాల్సిన అవసరమున్నది.

ఇందుకోసం ముందుగా బీసీలు రాసిన రచలేమున్నాయనేది పరిశోధించి విస్తృతంగా ప్రచారంలో పెట్టాల్సిన అవసరమున్నది. నిజానికి మొత్తం తెలుగు సాహిత్య చరిత్రనే సబాల్టర్న్‌ దృక్కోణంతో తిరగరాయాల్సిన అవసరమున్నది. అందుకు పునాదిగా ఈ రచన ఉంటుందని ఆశిస్తున్నాను.

ఆధునికతకు పూర్వం బ్రాహ్మణ స్త్రీలెవ్వరూ (తాళ్లపాక తిమ్మక్క మినహా) రచనలు చేయక పోవడంతో వారి స్థానంలో కుమ్మరి మొల్ల రాసిన రామాయణం అప్పుడప్పుడు పాఠశాల స్థాయిలో పాఠ్యంశమయ్యింది. కానీ అక్కమహాదేవి చరిత్ర రాసిన జంగమ మహిళ బాల పాపాంబ, కృష్ణదేవరాయలు కూతురు మోహనాంగి, ఆ కాలం నాటి తుక్కాదేవి, తిరుమలాంబ, నాయక రాజుల ఏలుబడిలోని రామభద్రాంబ, మధురవాణి, కృష్ణాజమ్మ, పసుపులేటి రంగాజమ్మ, ముద్దుపళని రచనలు రకరకాల కారణాలతో పాఠ్యాంశాలు గాకుండా పోయాయి. పోతులూరి వీరబ్రహ్మం మనవరాలు ఈశ్వరాంబ, విశాఖపట్నం గోడెవారి ఆడపడుచు పెఱిక మహిళ మదిన సుభద్రయ్యమ్మ, పద్మశాలి వనిత దార్ల సుందరమ్మల రచనలు ఎన్నడూ పాఠ్యాంశంగా మారలేదు. వీళ్లందరూ ఇప్పటి సామాజిక అంతరాల ప్రకారం బీసీ మహిళలే! 200ల ఏండ్ల కన్నా ముందు రచనలు చేసినవారే!! ఇట్లా విస్మరణకు గురైన వీరి రచనలు చాలా వరకు అందుబాటులో లేవు. ఫెమినిప్టు దృక్కోణముతో నైనా వారి రచనలకు విలువ చేకూరాల్సిన అవసరమున్నది.

కందుకూరి వీరేశలింగం కవుల చరిత్రలో నిర్ధారించిన కులాలను కాదంటూ ‘అయిదుగురు కవుల సంగ్రహ చరిత్ర’ పేరుతో పెదగాడ గంగయ్య 1929లో ఒక విమర్శా పుస్తకం ప్రచురించిండు. ఇందులో పాల్కురికి సోమనాథుడు, కందుకూరి రుద్రకవి, చేమకూర వేంకటకవి, టంకసాల నృసింహకవి, తెనాలి రామలింగము అనే అయిదుగురూ బీసీలే అని ఆధారాలతో సహా నిరూపించిండు. సోమనాథుడు జంగముడు, చేమకూర వేంకట కవి భోగము, మిగతావారు విశ్వబ్రాహ్మణులు అని తేల్చి చెప్పిండు. అయితే విమర్శకోసమైనా ఈ పుస్తకాన్ని ఏ విశ్వవిద్యాలయం తమ రెఫరెన్స్‌ గ్రంథాల్లో పేర్కొనలేదు. అట్లాగే తంజావూరులో విజయరంగనాథ నాయకుడికి సమకాలీనుడైన పదకర్త, సంకీర్తన కవి పెద్దదాసు ‘నారసింహుని పాడిన నోట ఊరసింహమును గూర్చి పాడన్‌’ అని ధిక్కరించిండు. ఈయన గాజుల బలిజ కులానికి చెందినవాడు. ఈయన కులాన్ని గురించి గానీ, గాన ప్రతిభను గురించి గానీ సాహిత్య చరిత్రలో రికార్డు కాలేదు.

పదకర్తలు అనగానే అన్నమయ్య మొదలు మంగళంపల్లి బాలకృష్ణ వరకు అందరూ బ్రాహ్మణులు మాత్రమే చరిత్రకారులకు కనిపిస్తారు. పెద్దదాసుని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని వందల కీర్తనలు, యాలలు, పదాలు రాసినటువంటి యాగంటి లక్ష్మప్ప పద్మశాలి కులములో పుట్టినాడనే విషయాన్ని పండితులు ఎక్కడా చెప్పలేదు. బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించి సాహిత్యాన్ని సంస్కరణ మార్గం పట్టించిన పోతులూరి వీరబ్రహ్మం గురించి ఎన్నడూ పాఠ్యంశంగా బోధించలేదు. గవండ్ల రాజలింగకవి, సుంకరనేని ఫణికుండలుడు, బాణాల శంభుదాసుడు, చిత్తారు గంగాధరయ్య, అలపాక పెద్దు, గుఱ్ఱము చికపోతయ్య, పోలిశెట్టి లింగకవి లాంటి కావ్యాలు రాసిన ప్రాచీన బీసీ కవులు పదుల సంఖ్యలో ఉన్నారు.

సరే వీళ్లంతా ప్రాచీనులు అని తలిస్తే ఆధునికుల విషయంలోనూ పండితులు ఇలాంటి అన్యాయమే కొనసాగించారు. నిజానికి తనకు తాను శూద్రుడిని అని చెప్పుకున్న త్యాగరాజ మొదలియార్‌ మహాభారతాన్ని వచనంలో రాసిన తొలి వ్యక్తి. తన మాతృభాష తమిళమైనప్పటికీ తెలుగులో కావ్య రచనలు చేసిండు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో ఉద్యోగం చేసిండు.

బళ్ళారిలో శ్రీయక్షిణి అనే తెలుగు సాహిత్య పత్రికను 1863-65 మధ్యకాలంలో నిర్వహించిండు. ఆయన గురించి ఎక్కడ కూడా ఒక్క ముక్క పాఠ్యాంశంగా చెప్పిన దాఖలాలు లేవు. ఈయన జీవితము` సాహిత్యము ని విశ్లేషిస్తూ నేను ఇటీవల ఒక గ్రంథాన్ని వెలువరించాను.

అయ్యనకోట పార్థసారథి (1862-1918) అనే నెల్లూరు జిల్లాకు ఓచెందిన కుమ్మరాయిన 1890 ఆ ప్రాంతంలో పెనుగొండలో డాక్టర్‌గా పనిచేసిండు. తాను 1896లో ‘సత్య విజయం’ పేరిట హరిశ్చంద్రుని కథను కావ్యంగా మలిచిండు. ఈ పుస్తకం 125 ఏండ్ల క్రిందట మదరాసు విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఇది పాఠ్యంశంగా చోటు చేసుకోలేదు. అంతే కాదు బాల బాలికలకు ప్రత్యేకంగా నీతిబోధ చేసేందుకు కుమార, కుమారీ శతకాలను కూడా రాసి వెలువరించిండు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు దగ్గరలోని దబ్బాకులపల్లెకు చెందిన ఆధ్యాత్మిక గురువు సంగడి నాగదాసు అనేక శతకాలు, యక్షగానాలు రాసిండు. అచల గురువుగా మన్ననలందుకున్నాడు. ఈయన భక్తి, వేదాంత రచనలు చేసిండు. శ్రీ లక్ష్మీనారాయణ శతకము, శ్రీపతి శతకము, నామదేవు చరిత్రము, రంతిదేవు చరిత్రము హరికథలు రాసిండు. యక్షగానాలు కూడా రాసిండు. బహుశా 60వ యేట 1925 ఆ ప్రాంతంలో చనిపోయిన ఈయన రచనలు భక్తులు ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు. ఈయన కులానికి కురుమ.

యక్షగాన కవుల్లో చాలామంది బీసీలున్నారు. అయితే ఈ యక్షగాన సాహిత్యాన్ని చరిత్రకారులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సాహిత్యం తక్కువస్థాయిదిగా తీర్మానించి దాని విశిష్టతను రికార్డు చేయలేదు. యస్‌.వి.జోగారావు, పొద్దుటూరి ఎల్లారెడ్డి, మొరంగుపల్లి భాగయ్యలు యక్షగానాల గురించి కొంత రాసినప్పటికీ వాళ్లు ఆయా రచనల్లోని విశిష్టతను ఎక్కడా విమర్శనా దృష్టితో విశ్లేషించలేదు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బి.బాలాజీ దాసు పాతికకు పైగా హరికథలు రాసిండు. ఇందులో పాటలు ఇంగ్లీషులో సైతం ఉన్నాయి. ఇట్లా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో కీర్తనలను ఒకే హరికథలో జొప్పించి పాడి, ఆడి అలరించిండు. ఈయన హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు కన్నా ముందే హరికథలు రాసిండు. ఒక్కో నాటకం 25, 30 సార్లు ముద్రణ పొందినాయంటే వాటి ప్రాచుర్యం తెలుస్తుంది. ఈయన బొందిలి కులస్తుడు.

ఒకప్పటి మెదక్‌ జిల్లాకు చెందిన గుజ్జరి ఎల్లాదాసు -కూచకొండ రామాయణము, గడ్డం రామదాసు -కాళింగ మర్ధన, ప్రభావతి విలాసము అనే యక్షగానాలను రాసిండు. జగిత్యాలకు చెందిన కస్తూరి రాజకవి (1813-1883) ఉమామహేశ్వర శతకము రాసిండు. విశాఖ పట్నానికి చెందిన ‘గంగాగౌరీ సంవాదము అనే గ్రంథాన్ని వెలువరించిన పసగాడ సన్యాసి, మంగళగిరికి చెందిన గంజి నాగదాసు -శ్రీయాళ చరిత్రము, చంద్రహాస నాటకము, రంగారెడ్డి జిల్లాకు చెందిన వంగరి వెంకటనరసింహాచార్య, అనేక యక్షగానాలు రాసిన నిజామాబాద్‌కు చెందిన గోశిక భూమయ్య, యాదగిరి గుట్ట కేంద్రంగా కీర్తనలు వెలువరించిన భక్తకవి ఈగ బుచ్చిదాసు, 1939 నాటికే ఎన్నో గ్రంథాలు వెలువరించిన సుగ్గము పాపయ కవి, కంకంటి ఓబచంద్రకవి, కొండా యల్లాదాసు (మెదక్‌ జిల్లా, నివాసం హైదరాబాద్‌), పడవల లక్ష్మీనరసింహకవి, కౌతరపు కమలనాథ శాస్త్రి, తిరువీధుల జగన్మోహనరావు, అందె నారాయణస్వామి, గుంటుక వెంకటనరసయ్య, వద్దితాతయ్య, కార్యముపూడి రాజమన్నార్‌, గుద్దంటి గోకర్ణము, బిట్రా వెంకటనరసింహకవి, అచలకవి వణిదపు సుబ్రహ్మణ్య స్వాములు, శెంశెట్టి పాపన్న కవి, ఏలె ఎల్లయ్య అందరూ పద్మశాలీయులు. వీరిలో ఏలె ఎల్లయ్య, గడ్డం రామదాసు, గుజ్జరి ఎల్లదాసు, కొండా యల్లదాసు కవులు గోలకొండ కవుల సంచికలో చోటు చేసుకున్నారు.

విశ్వబ్రాహ్మణుల్లో తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతి, బాణాల వీరశరభేంద్రకవి, నరుకూరు నారాయణకవి, కొండూరి వెంకటాచార్య, కురిచేటి సుబ్బరాయకవి, కడియాల వీపూరి ఆచారి,గొన్నాబత్తుల అమ్మనార్యుడు, అక్కనార్యుడు, మండూరి సుబ్బరాయకవి, వినుకొండ కాళీకవి, కొండముది బంగారయ్య, ఓగిరాల పాపయ్య, వెల్లటూరు శేషవధానులు, వడ్డెపాటి నిరంజన కవి, యలవర్తి ఆంజనేయశాస్త్రి, సిరికొండ దశరథరామశాస్త్రి, అడ్డాడ వీరభద్రుడు, గొనుగుంట వీరబ్రహ్మము, కన్నెకంటి ప్రభులింగాచారి, ఉదారి నాగదాసు, మల్లెల సుబ్రహ్మణ్య చారి, కొండభవానీ శంకరాచార్యులు, మద్దాల కాశీపతి, కొండూరు వీరరాఘవాచార్య, కొమ్మూరి సోమనాథకవి, గద్దె చంద్రశేఖర కవి, కిన్నెర చంద్రశేఖర కవి ఇట్లా పదుల సంఖ్యలో కవిత్వము, యక్షగానాలు, భక్తి, వేదాంత రచనలు చేసిన విశ్వబ్రాహ్మణులు ఉన్నారు.

అయితే వీరి రచనలు చాలా వరకు అలభ్యం కావడంతో వాటి మీద పరిశోధకులు, ఆచార్యులు దృష్టి సారించడం లేదు. వీరితో పాటుగా వివిధ బీసి కులాలకు చెందిన గోపినాథకవి, త్రిపురాన తమ్మయ దొర, తిమ్మరాజు సిద్ధరాజు, తిరువెంగళకవి పచ్చకప్పురపు, డబ్బీరు నరసకవి, కాసుల పురుషోత్తమకవి, భారతి రామరాజు, అన్నావధూత, వరకవి సిద్ధప్ప, రాఘవసింహము రామనరసింహకవి, మునిపంతులు, తూము రామదాసు, దొంతర మల్లేశము, అమలాపురము సన్యాసి కవి, కావేరిపాకం పార్థసారథి నాయుడు, గుజ్జుల నారాయణదాసు, పెళ్లూరు మస్తానయ్య, కట్టా వరదరాజు, గుడారు వెంకటదాసు, ఫక్కి వేంకటనరసయ్య, మాటూరి వేంకటప్పయ్య, శ్రీధరమల్లె వేంకటస్వామి, ధర్మపురి శేషప్పకవి, సూరపరాజు ఊడుమూడి, పోకల శేషచల నాయుడు, బోడి సుదర్శనదాసు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల మంది కావ్య, యక్షగాన, అచల, వేదాంత, భక్తి రచయితలు కనబడతారు.

స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని ‘హరిజన’ సంస్కరణ కోసం కవిత్వమల్లిన సాయం వరదదాసు ఆ తర్వాతి కాలంలో ఆధ్యాత్మికవేత్తగా మారి అనేక రచనలు చేసిండు. ‘ఆత్మరామ తత్వామృతము’ అనే తత్వగీతాలు, గాంధీమత ప్రబోధము పేరిట కోలాట పాట రాసిండు. రాయలసీమ బలిజ కులానికి చెందిన ఈయన సమగ్ర రచనలు వెలువడ్డాయి. అట్లాగే బోయ నరసన్న వామన చరిత్రము అనే పేరుతో ఒక యక్షగానము రాసిండు.
విమర్శలో భండారు తమ్మయ్య (జంగమ), పెదగాడ గంగయ్య (విశ్వబ్రాహ్మణ), సేవూరి లక్ష్మీనరసయ్య (పద్మశాలి), వడ్డెపాటి నిరంజన శాస్త్రి (విశ్వబ్రాహ్మణ), చిదిరెమఠము వీరభద్రశర్మ (జంగమ) తదితరులున్నారు.

పత్రికలు నడిపిన వారిలో ఎ.సి.పార్థసారథి నాయుడు, పింజల సుబ్రహ్మణ్యం శెట్టి, గానాల, పెండెం వెంకట్రాములు, చిదిరెమఠము వీరభద్రశర్మ, వడ్డెపాటి నిరంజన శాస్త్రి తదితరులు పదుల సంఖ్యలో ఉన్నారు.

ఈ చరిత్రంతా స్వాతంత్య్రానికి పూర్వపుదే. ఇందులోనూ లోతుగా అధ్యయనం చేసినట్లయితే గోలకొండ కవుల సంచికలో కులాలవారి వివరాలతో పేర్కొన్న కవులందరూ చేరలేదు. వడ్డెపాటి నిరంజన శాస్త్రి 1915 నుంచి ప్రత్యేక శ్రద్ధతో విశ్వబ్రాహ్మణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చిండ్రు. వందేండ్ల నాటి పాత పత్రికలు, పాత ప్రచురణలు, గ్రంథాలయాలు, పండితుల సేకరణలోని రచనలను విశ్లేషించినట్లయితే ఎంతోమంది విస్మృతులైన పండితులు కనిపిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క కవి గురించి వివరంగా జీవిత వివరాలు, రచనా విశ్లేషణ చేసి కొత్త తరానికి అందించినట్లయితే తమ పూర్వీకుల గొప్పతనం తెలుసుకుంటారు. తెలుసుకొని తామెందుకు చరిత్రలో లేకుండా పోయామని నిలదీస్తారు. అందుకు ఈ రచన ఒక ఆకరం కావాలని కోరుకుంటున్నాను.

*

సంగిశెట్టి శ్రీనివాస్

4 comments

Leave a Reply to Pattipaka Mohan Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • గొప్ప పరిశోధన.. అంతకు మించిన ఆవేదన.. అన్న నీ పాదాలకు పదివేల దండాలు.. నీ స్పూర్తి కి శానార్థులు

      • వెలితి ని పూరించాలంటే వెలుగుని ప్రసరించాలి అందరమూ 🙏🏾

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు