పాశ్చాత్య సంస్కృతి, ప్రపంచీకరణ రెండూ కలిసి జమిలీగా మనిషిని ఎంత అథఃపాతాళానికి దిగజార్చాలో అంత దిగజార్చాయి. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న, అనుభవిస్తున్న వికృత సమాజం. రోజు రోజు మనిషి ప్రవర్తన చూసి మనల్ని సృష్టించిన బ్రహ్మ దేవుడు కూడా పశ్చాత్తాప పడేలా చేస్తున్నాం. “ఎంతో శ్రద్ధతో జీవుల్ని సృష్టించి సత్యం, క్షమ, ధర్మం మొదలైన సద్గుణాలు సమభాగాలుగా పంచి పెట్టినా మానవలోకంలో అసంతృప్తి, కలహాలు, రక్తపాతాలు, ద్రోహం, కుత్సితం రోజు రోజు ప్రబలిపోతున్నాయి.” ఇంత విద్యాగంధం, ఇంత శాస్త్ర సాంకేతిక ప్రగతి, ఇంత ఆధునికత మనిషిని ఏ మాత్రం ఉన్నతీకరించడానికి ఉపయోగపడలేక పోతున్నాయి. భారతీయ, సంస్కృతి, సంప్రదాయాల్ని కాల రాచి ఎన్నో వెర్రి వేషాలు నేర్చుకుని అదే నాగరికత అనుకుంటున్నాం. సుమారు ఎనిమిది దశాబ్దాల సామాజ పోకడను అక్షరీకరించి చూపిన కథ ‘పీడకల’.
ఓ రోజు బ్రహ్మ దేవుడు తన రోజువారీ సృష్టి కార్యకలాపం నొసటి రాతలు రాయడం పూర్తి చేసి బరువెక్కిన గుండెలతో, నైరాశ్యం నిండిన ముఖంతో అంతఃపురం చేరుకున్నాడు. అది చూసి సరస్వతి దేవి నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? అని ప్రశ్నిస్తుంది. అలాంటిదేమీ లేదు నా వ్రాతలో ఏదో తెలియకుండానే పొరపాటు జరిగిపోతోంది. “స్వాధ్యాయము, విపరీతము, పవిత్ర హోమానల ప్రదీప్తము అయిన వేద భూమిలో కూడా మితిమీరిన దౌర్జన్యము, కుట్రలు, విప్లవాలు బయలుదేరుతున్నై” అని బాధ పడుతూనే కాళ్ళు చేతులు కడుక్కొని రెండు మెతుకులు నోట్లో వేసుకొని తల బరువుగా ఉందంటూ శయన గృహము చేరి కాసేపు పక్క మీద పడుకున్నాడు. కొంచెం నిద్ర పట్టిందో లేదో తానొక్కడే సత్య వీధుల్లో పిచ్చి వాడిలా తిరుగుతున్నాడు.
మునిగణమంతా జయజయ నినాదాల్తో డెమాస్ట్రేషన్ జరుపుతున్నారు. “ఇదేం రోగం వీళ్ళకి? ఉండుండి ఇట్లా తయారైనారేం? మోకాళ్ళవరకు లాల్చీలు, ఖద్దరు టోపీలు కళ్లకద్దాలు, కళ్ళకి చెప్పులు అయ్యో అయ్యో సత్య లోకమంతా భ్రష్ఠమైందే? ముక్కు పట్టుకొని తపస్సు చేసుకునే ముండా కొడుకుల కీ విపరీత బుద్ధులేంటి? వీరి నోట్లో ఏమో తెల్లగా ఉన్నాయేం? ఆరరే! సిగరెట్లు కాలుస్తున్నారే! వీళ్ళ నిత్యాగ్ని కర్మలు కాలిపోను. మేకల మోస్తరేమో చప్పరిస్తున్నారే! ఊ హు! తమ్మలపాకులు!! పవన పర్నాంబు భక్షులై ఇనుప కచ్చడాల్గట్టిన ముని మ్రుచ్చులు!!! ఏదో ప్రళయ మొచ్చేట్టుంది. ఏమో నా అంతఃపురం వైపు పరుగెడుతున్నారే? తగలబెట్టరు గదా! ఇక్కడుంటే చంపేస్తార ట్టుంది… అని భయపడిపోతాడు. నారదుడు కూడా తన మహతిని విసిరేసి వయోలిన్ పట్టుకుంటాడు. మరో చేతిలో రేరాణి, అభిసారిక సంచికలుంటాయి. ఇవి వీడికెక్కడ అభించాయి. ఎలాంటి వాళ్లెట్లా మారిపోయ్యారేం? అని బాధ పడుతాడు.
ఇంకొంచెం దూరం పోగానే రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలు కూడా సమాన హక్కులు, శాసన సభలో రిజర్వేషన్, సివిల్ సర్వీస్ లో రిజర్వేషన్ కోరుతారు. తమ పొడవాటి నల్లని కురులు కత్తిరించి మగవాళ్లలాగా క్రాపులు పెంచుకుంటారు. లిప్ స్టిక్ లు, రిస్ట్ వాచీలు పెట్టుకుంటారు. కళ్ళద్దాలు కూడా పెట్టుకుంటారు.
కొంత మంది బ్రహ్మ కొలువు కూటానికి న్యాయస్థానమని బోర్డ్ కూడా పెడుతారు. అహల్య గౌతమునికి విడాకులిస్తుంది. కొంత మంది ముని కుమారులు “పాఠాలు వల్లించకున్నా పాఠశాలకు పోకున్నా గురువులూర్కుండాల్సిందే. ఎకాడమిక్ ఫ్రీడం కావాలి. కన్సెషన్ కావాలి. పరీక్షలు వద్దు. ప్రస్తుత విద్యా విధానం మారాలి” అని సమ్మె చేస్తున్నారు. కచయోగి ప్యాంటూ, బుస్కోటు వేసుకుంటాడు. దేవయాని రెండు జెడలు వేసుకుని ఇద్దరూ సినిమాకు వెళ్తారు. చివరికి సరస్వతి దేవి కూడా బాడ్ మెంటన్ బ్యాట్ పట్టుకుంటుంది. ఇంకా ఎన్ని ఘోరాలు జరిగాయో చూడాలంటే మనం కూడా ఆ ‘పీడకల’లోకి వెళ్ళాల్సిందే.
లోకమెంత భ్రష్టు పట్టి పోయిందో చెప్పడానికి రచయిత లౌకిక సమాజాన్ని ఉదాహరణగా చూపకుండా కథంతా దేవలోకంలో జరిగినట్టుగా చూపించాడు. పైకి కనిపించే రూపంలో ఇది దేవతల కథే అయినా సారంలో ఇది నేల మీది మనుషుల కథ. సిగరెట్లు తాగడం, కామక్రోధాల్ని అలవర్చుకోవడం, విభిన్న విప్లవాలని లేవనెత్తడం, అత్యాధునిక వస్త్ర ధారణ చేసుకొని వెకిలి నవ్వులు నవ్వడం, పాఠశాల ఎగ్గొట్టి ఉత్తినే పాస్ కావాలనుకోవడం… ఇవన్నీ మానవ సమాజంలోని అకృత్యాలు. దేవతలకు ఆపాదించి రచయిత మానవ స్వరూప, స్వభావాల్ని ఎంతో ధ్వన్యాత్మకంగా చెప్పాడు.
మానవుల స్వభావాన్ని దేవతలకు ఆపాదించి చెప్పినట్టుగానే ఈ కథలోని భాష కూడా కొంత దేవతల భాష, కొంత లౌకిక మానవుల భాషను వాడడం రచయిత ఎంచుకున్న శిల్పంలో భాగమే. మణిప్రవాళ భాష వలన కథ కొత్త శైలిలో సాగిపోయింది. ప్రబంధ యుగ కావ్యాలకు ఏ మాత్రం తీసిపోని కథ. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. “ఈ సౌందర్య మూర్తి ఎవరు చెప్మా? ఓహో శుక్రాచార్యుల పుత్రిక పరమ పతివ్రత దేవయాని! కచయోగీంద్ర మానసాంతర ప్రేమ మాధురీ మకరంద స్రవంతికా వీచీడోలికాందోళిత ప్రేమమూర్తి!” అని ఏ ప్రబంధ పద్యానికి తీసిపోని దీర్ఘ సమాస భూయుక్తంగా రాశాడు.
ఈ “పీడకల”ను మనకు చూపించిన రచయిత ‘తెలుగు జానపద గేయ సాహిత్యం’ అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యం పై మొట్ట మొదటి పిహెచ్. డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందిన డా. బిరుదురాజు రామరాజు. వీరు 1925 ఏప్రిల్ 16న దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ జిల్లా మడికొండలో జరిగింది. మూడవ తరగతి నుండి ఇంటర్ మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదివారు.
మెట్రిక్ చదివేటపుడు కాళోజీ నారాయణరావు, టి. హయగ్రీవాచారి, ముదిగొండ సిద్ధ రాజలింగం, జమలాపురం కేశవరావు, మొదలైన యువ నాయకులతో కలిసి రజాకార్ల ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. 1947-50 మధ్య నిజాం కాలేజీలో తెలంగాణ విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా కూడా పని చేశారు. బి. ఏ. తరువాత న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. సంస్కృతంలో కూడా ఎం. ఏ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎం. ఏ. చదివే రోజుల్లో విద్యార్థి నాయకులుగా గుర్తింపు పొందారు.
ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అనుమతి లేకుండా కవి సమ్మేళనం నిర్వహించినందుకుగాను అరెస్ట్ కూడా అయ్యారు. ఎం. ఏ. చదివే రోజుల్లో ప్రముఖ కవి సి. నారాయణరెడ్డితో కలిసి కొంత కాలం ‘రామనారాయణ కవులు’ అనే పేరుతో జంట కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంత రావు ఆంధ్ర సంఘం నెలకొల్పి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించారు. ‘తెలంగాణ రచయితల సంఘం’ కు బిరుదురాజు రామరాజు మొదటి కార్యదర్శి. ఇటీవల వివాదాస్పదం అయిన ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘సారంగ దరియా…’ పాటను మొదట సేకరించి, ప్రచురించిన వారు బిరుదురాజు రామరాజు.
వీరు అనేక గ్రంథాలు రాశారు. అందులో కొన్ని ఇవి. ‘ఆంధ్ర యోగులు’ (నాలుగు సంపుటాలు) ‘సంస్కృత సాహిత్యానికి తెలుగు వారి సేవ’, ‘చరిత్రకెక్కని చరితార్థులు’, ‘మరుగున పడిన మాణిక్యాలు’, ‘తెలుగు వీరుడు’, ‘తెలుగు జానపద రామాయణం’, ‘వీరగాథలు’, ‘యక్షగాన వాఙ్మయము’, ‘తెలుగు సాహిత్యోద్ధారకులు’, ‘ఉర్దూ తెలుగు నిఘంటువు’, ‘విన్నపాలు’, ‘గురుగోవిందు సింగు చరిత్ర’, ‘పల్లెపట్టు’ (నాటకం), ‘తెలంగాణ పిల్లల పాటలు’, ‘తెలంగాణ పల్లె పాటలు’, ‘త్రివేణి’ మొదలైనవి. ఈ ‘పీడకల’ కథ మొదట ‘శోభ’ పత్రికలో ఏప్రిల్ 1950లో ప్రచురింపబడింది. తరువాత డా. టి. శ్రీరంగ స్వామి సంపాదకత్వంలో వెలువడిన ‘వరంగల్ జిల్లా కథా సర్వస్వం’లో చోటు చేసుకుంది.
*
ఈ కథ చూడలేదు. కానీ ఇది ఆధునికత మీద వెటకారం లా వుందే. హక్కులు, ఫ్రీడం లాంటి భావాలని నెగిటివ్ గా ఎగతాళి చేస్తున్నట్లు వుంది.
Wonderful and good story also review. DANYAVADALU sir regularga good reviews testunnandulaku abhinandanalu
రచయిత బిరుదురాజు గారు “పీడకల” పేరుతో కథ రాసినా ఇది నేటికాలాన్ని చక్కగా ప్రతిబింభించింది. కథా రచనలో భిన్న శైలి ఉంది. కథలో భావాన్ని భాషను, ప్రత్యేకతలను బాగా చెప్పారు విమర్శకులు డా. వెల్డండి శ్రీధర్ గారు. కీ. శే. బిరుదురాజు గారు కూడా మంచి కథకులు అని ఈ కథ ద్వారా తెలియవచ్చింది. సారంగకు ధన్యవాదాలు
మంచి సమాచారం తో సమీక్ష రాసినందుకు వెల్దండి శ్రీధర్ కు అభినందనలు
మంచి విశ్లేషణ శ్రీధర్ గారు బిరుదురాజు రామరాజు గారి గురించి తెలుసుకొనుటకు అవకాశం దొరికింది మీకు ధన్యవాదాలు
బిరుదురాజు రామరాజు గారు “పీడకల” అనే పేరును కథకు పెట్టిన, పాఠకులకు పిడుగులాంటి కథను అందించాడనే చెప్పాలి. 1950లో కథ రాసినా, ప్రస్తుతం నడుస్తున్న అత్యాధునిక కాల ధోరణులకు తీసిపోని, పోలేని కథను రాశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
బిరుదురాజు గారికి, భాష మీద ఎంత పట్టు ఉందో అర్థమవుతుంది. సందర్భానుసారంగా ఇంగ్లీష్, సంస్కృత, తెలుగు భూయిష్టమైన పదబంధాలను వాడటంలో ఎంతో నేర్పును ప్రదర్శించారు. పదాడంబరాలకు తగ్గ కథను రసవత్తరంగా నడిపించారు. ఒక విషయాన్నీ చెప్పాలనుకున్నప్పుడు సూటిగా, వర్ణనాత్మకంగా చెప్పడం ఒక కళయితే, వాటితోపాటు హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించడం అంత సులువైన, సాధ్యమయ్యే పనికాదు. బిరుదురాజు గారు అన్నింటినీ సమపాళ్ళలో కథను నడిపారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే కథలో రెండు పార్శ్వాలను చూపారు. ఒకవైపుమో బ్రిటిష్ వారి రాక ముందు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆచరించిన తీరు, బ్రిటిష్ వారు వచ్చాక వారి సంస్కృతి, అలవాట్లను దగ్గరుండి గమనించి, వారి సంస్కృతి, అలవాట్లను ఆచరిస్తున్నారని, మన ఆచార, వ్యవహారాలు ఏమి కావాలని గగ్గోలు పడే సందర్భం ఒకటైతే.
మరో కోణంలో ఎవరి సంస్కృతి, సాంప్రదాయాలు వారికి గొప్పవే అయినా మారుతున్న కాలంతోపాటు, మారాల్సిన అంశాలు, అవకాశాలు, అవసరాలకు తగ్గట్టు జీవనం కొనసాగించాలన్నది మరో వాదన. మనం జీవించే ఆచరించే సూత్రాలు, పద్ధతులు గొప్పవే అయినా మన కన్నా గొప్పగా భావించే, కాలానుగుణమైన అవసరాలకు తగ్గట్టు ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరాలను గుర్తించి, ఆ మార్పును కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదనుకునే వాదం మరోవైపు.
రచయిత రెండు అంశాలను చెప్పినా ఎవరికి సరిపోయిన జోళ్లను వారు ధరించినట్టుగానే మనం కూడా ఇతర పరిస్థితులు ఎంత ఆకర్షించినా, ప్రలోభ పెట్టిన మనకు తగ్గట్లుగానే ఉండాలని, మన దేశ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలని సూచించారు. ఒకవేళ ఆ విష సంస్కృతులకు అలవాటు పడితే జరిగబోయే విషయాలను కాలజ్ఞానిలా పీడకల రూపంలో చూపించాడు. చదువు, సంస్కారం పాటించకపోతే జరిగే అనర్థాలను చూపించాడు. సంయమనం పాటించాల్సిన వారు పాటించకపోతే రోడ్ల మీదకు ఎక్కి చేస్తున్న నిరసనలు, దౌర్జన్యాలు ఎలా తాండవిస్తాయో, ఉన్న స్వేచ్ఛను నాశనం చేసుకుని, అర్థం పర్థం లేని స్వేచ్ఛ కోసం పరుగులు తీస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అన్నింటిన్ని కళ్ళకు కట్టాడు. ఓకే కథలో సమాజంలో నిత్యం జరిగే ఎన్నో రకాల కథలను రామరాజు గారు ఎంతో వైవిధ్యభరితమైన కథను అందించారు. ఇప్పుడే రాసినట్టు ఉన్న శిల్పచాతుర్యం గల కథను చదివి, అవపోశాన పట్టి, రసాన్ని ఆస్వాదించే, సారాన్ని గ్రహించే అవకాశం కల్పించడంతోపాటు, బిరుదురాజు రచనలతోపాటు, ఆయన జీవిత చరిత్రను అందించడం చాలా గొప్ప విషయం. ఇంతటి మంచి కథను మనకందించిన డాక్టర్ వెల్దండి శ్రీధర్ సార్ గారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.
ఆలోచనాత్మక కథలను పరిచయం చేస్తున్న శ్రీధర్ వెల్దండికి అభినందనలు