‘నేను ఈ సంబంధం చేసుకోను’ అనే మాటలు ఏ పురుషుడు వాడినా అది అమానవీయమే అనేది వెంకట్రావు అభిప్రాయం. పెళ్లిచూపుల దాకా వచ్చాక, యిక ఆ సంబంధం ఖాయం చేసుకుతీరాలనీ, అప్పుడు మాత్రమే ఆ అమ్మాయి ఆత్మాభిమానానికి విలువ యిచ్చినట్లువుతుందనీ అతను నమ్మాడు. ఆ రకంగా నమ్మడం అన్నది అతను చదివిన పుస్తకాల ప్రభావం వల్ల జరిగిందే. అలాగని, ఏ పుస్తకాలు అతని ఆలోచనల్ని ఆ రకంగా మళ్లించాయి అన్నది చెప్పలేడు వెంకట్రావు. ఈ వొక్క కారణంగానే అని కాదుగానీ, మొత్తమ్మీద కొడుకు కొంచెం తేడా అని గ్రహించిన కుటుంబసభ్యులు జాగ్రత్తగా వెతికీ వెతికీ వెంకట్రావుకి లీల రూపంలో అనుకూలవతి అయిన మంచి అమ్మాయిని పట్టుకొచ్చారు. పిల్ల అందగత్తె కాదూ అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
భార్య తనతో సఖ్యతగా వుండడం, ఆమెకీ తనకీ ఎలాంటి భేదాభిప్రాయాలూ లేకపోవడం వెంకట్రావుకి చాలా గర్వంగా అనిపించేది. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం పెళ్లి జరిగినందునే అలాంటి అన్యోన్యత సాధ్యపడిందని అతను భావించేవాడు. పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలీ అనే విషయంలో తనకి వున్నంత వ్యవహార జ్ఞానం మిగతావాళ్లకి లేకపోవడం అతనికి చాలా విడ్డూరంగా అనిపించేది. చెప్పొద్దూ, పెళ్లికి ముందు కూడా వెంకట్రావు నాలుగైదుసార్లు ప్రేమలో పడినంత పని చేశాడు. ఆ నాలుగైదు సందర్భాలూ వీసమెత్తు తేడా లేకుండా వొకే మాదిరిగా మొదలై, వొకే మాదిరిగా ముగిశాయి. అతను వొకమ్మాయిని చూడడం, ఇష్టపడడం మొదటి దశ. తనలాంటి గొప్పవాడి ప్రేమకి పాత్రురాలైన ఆ అమ్మాయి అదృష్టం ఎంత గొప్పదో కదా అని ముసిముసిగా నవ్వుకోవడం రెండో దశ. అంతటి అదృష్టాన్ని గుర్తించేపాటి విజ్ఞత ఆ అమ్మాయికి లేకపోయినందుకు వుసూరుమనడం మూడో దశ. ఆమె ఏ సుబ్బారావునో అప్పారావునో ప్రేమించడం, సదరు అమ్మాయి తన ప్రేమని పొందడానికి అర్హురాలు కాదని వెంకట్రావు నిట్టూరుస్తూ, నిర్థారించాల్సి రావడం చివరి దశ. తనలాంటి ఉత్తముడిలోని సద్గుణాలని గుర్తించాలంటే ఏ అమ్మాయైనా తనకి చాలా సన్నిహితంగా రావాల్సివుంటుందనీ, అంత సన్నిహితంగా రావడం అన్నది భారతీయ సమాజంలో పెళ్లి ద్వారానే సాధ్యం కాబట్టీ తన గొప్పదనం తన భార్యకి మాత్రమే తెలిసిందనీ తీర్మానించేశాడు వెంకట్రావు. భర్తని బేషరతుగా గౌరవించి తీరాల్సిందేననే నియమానికి అంటిపెట్టుకోవడం వల్ల తన భార్య నోరెత్తడం లేదనీ, అంతేతప్ప తాను కష్టపడి ఆమె మనసులో స్థానం సంపాదించుకు చచ్చిందేమీ లేదనీ అతనికి తట్టే అవకాశం లేకపోయింది.
సమాజం గురించీ, సృష్టి గురించీ, యుగాంతం గురించీ దేని గురించి తాను ఏం చెప్పినా భార్య అబ్బురంగా తనకేసి చూడడం వెంకట్రావుకి చాలా ముచ్చటగా అనిపించేది. అవే మాటలు వేరేవాళ్ల దగ్గర మాట్లాడినప్పుడు వాళ్లు తనకేసి జాలిగా చూడడం అతను గమనించకపోలేదు. లీల స్వతహాగా అంత లోకజ్ఞానం వున్న జీవి కాకపోయినప్పటికీ తనతో సహవాసం చేయడం వల్ల ఆమెకి కూడా జిజ్ఞాస, పరిశీలనాశక్తి పెరిగాయని అతనికి తోచింది. భర్త గొప్పదనాన్ని గుర్తించి, గర్వించే భార్య దొరకడం చాలా అరుదైన విలాసాల కోవలోకి వస్తుందనీ, లోకంలో చాలామందికి లేనిదేదో తనకి దొరికిందనీ కూడా అతనికి అర్థమైంది. అయితే అది అయాచితంగానో, లేదా యింట్లోవాళ్ల ప్రణాళిక వల్లనో సంప్రాప్తించిందని అతను వొప్పుకోడు. ఈ మొత్తం వ్యవహారంలో వెంకట్రావుకి వొకటి మాత్రం అంతుబట్టేది కాదు. తనకున్నంత చురుకైన మెదడు లేనివారు, తన భార్యంతటి పతివ్రతని భార్యగా పొందలేని వారు కూడా తనకన్నా ఎక్కువ సంతోషంగా వున్నట్టు కనిపించడం అతన్ని యిబ్బందిపెట్టేది. వాళ్ల సంతోషం మిధ్య అనీ, అది అట్టే ఎక్కువకాలం నిలిచేది కాదనీ వెంకట్రావు సర్దిచెప్పుకునేవాడు. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు మిధ్య అనే కాన్సెప్టు వొకటున్నదని తెలియకపోడం మూలానో, ఎంచేతనో గానీ చుట్టూతా వున్న వివాహిత జంటలన్నీ సంతోషంగానే వుండడం వెంకట్రావు విచారానికి కారణం అవుతూ వుండేది. అంతమాత్రాన ఎదుటివారు సంతోషంగా వుంటే వెంకట్రావుకి గిట్టదని పొరబడరాదు. నిజంగా సంతోషంగా వున్నందున కాకుండా.. ఏది నిజమైన సంతోషమో అర్థం కాని కారణంగా జనాలు సంతోషంగా వుండడం పట్ల మాత్రమే అతనికి అభ్యంతరం.
అప్పుడప్పుడూ వేరేవాళ్ల భార్యల్ని చూసినప్పుడు వెంకట్రావుకి కొంచెం అసూయ కలిగేది. మొదట్లో అతను దాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. తనకి పరాయి స్త్రీల పట్ల మోజు కలిగిందీ అంటే దానర్థం లీల కంటే వాళ్లు ఆకర్షణీయంగా వున్నారనేగా. అంటే, తన ఎంపిక మరీ అంత గొప్పది కాదనేగా! దీన్ని వొప్పుకోవడం అతనికి యిష్టం లేకపోయేది. కానీ, ఒక దశకి వచ్చాక ఆ ఆకర్షణని గుర్తించక తప్పలేదతనికి. ఒకానొక పవిత్ర వుదయాన, వొంటరిగా కూచోని లోతుగా ఆలోచించాడు వెంకట్రావ్. తన భార్యకన్నా ఎక్కువ ఆకర్షణీయంగా వుండే ఆడవాళ్లు లోకంలో వున్నారనీ, వాళ్లు తమ భర్తల గొప్పదనాన్ని గుర్తించకపోయినప్పటికీ అందగత్తెలు అయిన కారణంగా ప్రపంచం తాలూకూ ఆదరణకి నోచుకుంటున్నారనీ అతనికి అర్థమైంది. అంతేకాదు, తుచ్ఛమైన భౌతిక సౌందర్యం తాత్కాలికంగా బలమైన సిద్ధాంతం మీద విజయం సాధించగలదని కూడా అతనికి ఎరుకలోకొచ్చింది. తాత్కాలికమే అని తెలిస్తే మాత్రం దాని ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడం ఎల్లాగా?! దేహం తాలూకూ సణుగుడు వినిపించుకోకపోవడం ఏవంత వివేకమన్నట్టు?! ఇతరుల భార్యల మీద కూడా తనకి ఎంతోకొంత అధికారం కల్పించగల సిద్ధాంతం ఏదైనా దొరుకుతుందేమోనని వెతికిచూశాడు వెంకట్రావ్. వెతగ్గా వెతగ్గా అతనికి వొక ఆలోచన తట్టింది. భార్యల మస్తిష్కాలకి తగినంత వుద్వేగాన్నీ, వుత్సాహాన్నీ అందివ్వలేని పనికిమాలిన భర్తలకి భార్యలు లొంగివుండాల్సిన అవసరం వుండరాదని అతనికి అనిపించింది. అంతేకాదు, తన ఆదర్శాల్నీ సిద్ధాంతాల్నీ వివాహితులైన ఆడవాళ్లకి కూడా విస్తరించాల్సిన చారిత్రక అవసరాన్ని వెంకట్రావు గుర్తించసాగాడు.
లోకంలో చాలామందికి వున్నట్టే తనకి కూడా యితరుల భార్యల పట్ల ఏదో అకర్షణ వుందనీ, ఆ ఆకర్షణే తన ఆలోచనల్ని నియత్రిస్తున్నదనీ వొప్పుకునేంత నిజాయితీ వెంకట్రావుకి లేదు. కొత్త ఆలోచనల తాలూకూ మత్తులో పడిన అతను పరాయి స్త్రీలతో పరాచికాలు ఆడ్డానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూడ్డం మొదలెట్టాడు. ఏ ఆడదైనా వొంటరిగా దొరకడం పాపం, తన విజయగాధలని ఏకరువు పెట్టేవాడు. తనని పెళ్లి చేసుకోవడం ద్వారా తన భార్య లీల ఏ విధంగా నక్కతోకని తొక్కినట్లయ్యిందో, పెళ్లికి ముందు నిస్సారంగా వున్న ఆమె జీవితం ఎలా నందనవనంగా మారిందో సావధానంగా వివరించేవాడు.
కానీ, తన మాటలు చాలామంది స్త్రీలలో పెద్దగా రసస్పందన కలిగించడం లేదని వెంకట్రావుకి క్రమంగా బోధపడసాగింది. తనతో పోల్చుకున్నప్పుడు విషయలంపటులని చెప్పదగిన వెధవాయిల మాటలకే ఆడవాళ్లు త్వరగా ఆకర్షితులు కావడం గమనించాక అసలు ఆడాళ్లకి ఏం కావాలో తనకి తెలియదేమో అనే భయం కూడా అతనిలో మొదలైంది. కానీ, ఆ అనుమానం పెరక్కముందే దాన్ని మొదలుకంటా తవ్వి పీకి అవతల పారేశాడు. ‘నిజానికి ఎవరికి ఏం కావాలీ అన్నది తనకి తెలుసు. తనకి మాత్రమే తెలుసు. కానీ, లోకంలో చాలామంది ఆడవాళ్లకి, ముఖ్యంగా తుచ్ఛమైన భౌతికసౌందర్యం ఆలంబనగా మనుగడ సాగించే ఆడవాళ్లకి, వాళ్లకేం కావాలో వాళ్లకే తెలియదు. ఏం కావాలో తెలియనప్పుడు.. ఆ కావాల్సినదాన్ని పుష్కలంగా అందించగలిగిన తనలాంటి వాడి ఔన్నత్యాన్ని అర్థం చేసుకోగలరని ఆశించడం అనవసరం’. ఈ కొత్త సిద్ధాంతం వెంకట్రావుకి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది.
కానీ, ఆ ఆనందం కూడా ఎక్కువకాలం నిలవలేదు. బుర్రకాయ్ చూలాగ్గా గ్రహించేసిన సత్యాన్ని ఆకళింపు చేస్కోడానికి వెంకట్రావు యింద్రియాలన్నీ ససేమిరా అన్నాయి. బుద్ధితో తలపడిన ఐహిక వాంఛలు తమ ఉనికిని బలంగా చాటసాగాయి. తనతో తానే పలుమార్లు తాత్వికచర్చలు జరిపిన తర్వాత వెంకట్రావు మరో కొత్త సంగతి కనిపెట్టాడు. వివాహవ్యవస్థ వేళ్లూనుకొని నిలబడడానికి వీలుగానే ఆర్యులు వేశ్యావృత్తిని ప్రోత్సహించారు. వారు ద్రవిడుల కన్నా అధికులుగా చలామణీ అవడానికి ప్రధాన కారణం యిదే అయి వున్నా ఆశ్చర్యం లేదు. అందుకే, ఎవరి కంటా బడకుండా ఏ మాపటేలో శరీరానికి కాసింత సుఖాన్ని లంచంగా విసిరేస్తే, మళ్లీ తెల్లారి చీకటిపడేవరకూ బుద్ధే సర్వాధికారి.
మానవేతిహాసంలో వేశ్యల పాత్ర ఎంత కీలకమో అవగతం చేసుకున్న వెంకట్రావు అనతికాలంలోనే ప్రముఖ విటుడిగా అవతరించాడు. అతని మనస్సాక్షి అప్పుడప్పుడూ గింజుకుంటూ వుండేది భార్యకి ద్రోహం చేస్తున్నావూ అని. ఆ అపరాధభావనని అధిగమించడం కోసం సందర్భం లేకపోయినా భార్యకోసం ఏదో వొక నగ కొని తీసుకెళ్లడం అలవాటుగా చేసుకున్నాడు. అయితే, వేశ్యల సంఖ్య అపరిమితంగా వుండడం, ఆర్థిక వనరులు పరిమితంగా వుండడం అతనికి భారంగా పరిణమించింది. కొత్త వేశ్యని కలిసిన ప్రతిసారీ భార్యమీద కూడా పెట్టుబడి పెట్టడం దండగ అని గ్రహించేసరికి లీల వొంటిమీదకి చాలా బంగారం వచ్చిచేరింది.
వెంకట్రావు ఏకపత్నీవ్రతుడిగా వున్నప్పుడు అతన్ని పెద్దగా పట్టించుకోని ఆడవాళ్లందరూ యిప్పుడు అతన్ని కాస్త ఆరాధనాభావంతో చూడడం మొదలెట్టారు. ‘రాకోయీ అనుకోని అతిథీ’ అన్నట్టు అతన్ని దూరంగా పెట్టినవాళ్లలో కొంతమంది ‘రసికరాజ తగువారము కామా’ అన్నట్టు వోరచూపులు చూడడం వెంకట్రావు గమనించాడు. తనకీ రకమైన గౌరవం రావడానికి కారణమైన వేశ్యలమీద అతనికి అమాంతం వాత్సల్యం, అభిమానం, అనురాగం యిత్యాదులు పుట్టుకొచ్చాయి. భార్య, భర్త, కనీసం వొక వేశ్య అనే ముక్కోణ ప్రేమకథల పట్ల అతనికి మక్కువ హెచ్చింది. వేశ్యల్ని సమాజం చిన్నచూపు చూడడం అతనికి చాలా ఆవేదనని కలిగించింది. అసలు చాలామంది భార్యల్ని మగవాళ్లు తన్ని తరిమేయకపోవడానికి కారణం వేశ్యలేననీ, వారే లేకపోతే అసలు వివాహవ్యవస్థ ఎప్పుడో కుప్పకూలేదని వెంకట్రావు సూత్రీకరించడం కీలక పరిణామం. సూత్రీకరణతో ఆగకుండా ఆ విషయాన్ని పదిమందితోనూ అంగీకరింపజేయాలని కంకణం కట్టుకోవడం మరింత కీలకం కానున్నదని నిరూపించడానికి కాలం సమాయత్తమవుతోందని ఎవరికి మాత్రం తెలుసు.
సంసార స్త్రీలతో పాటు సమాజానికి వేశ్యల అవసరం కూడా వుందని భావించడంతో సరిపెట్టుకోని వుంటే ఎలా వుండేదో. అసలు వివాహం చేసుకోదలచిన ప్రతి స్త్రీ కనీసం కొన్నాళ్లు వేశ్యావృత్తిలో వున్నట్లయితే అది లోకకళ్యాణానికి దోహదకారి కాగలదని కూడా వాదించడం మొదలెట్టాడు వెంకట్రావు. అతని వాచాలత్వానికి అలవాటు పడిపోయిన మిత్రులు కూడా ఈ తాజా పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. వెంకట్రావు చెపుతున్నది విడ్డూరంగా తోచడం ఒక కారణం అయితే.. అతని మాటలు తమ భార్యలకి అంత విడ్డూరంగా అనిపించకపోవడం సదరు మిత్రుల్ని మరింత కలవరపాటుకి గురిచేసిందని చెప్పొచ్చు. ఏతావాతా, వెంకట్రావు ఫిలాసఫీకి క్రమంగా శ్రోతలు కరువయ్యారు.
విప్లవభావాలున్న వాళ్లని సమాజం దూరంగా పెట్టడం సహజమేనని వెంకట్రావుకి తెలుసు. కానీ, సమాజంతో దూరంగా పెట్టబడిన కారణంగా తన భావాలకి విప్లవస్వభావం వున్నదని వెంకట్రావు అనుకోవడం అతని గురించి అవగాహన వున్నవారికి అంతగా ఆశ్చర్యాన్ని కలిగించదు. అతను జరుపుతున్న మేథోమధనాలు, వాటి తాలూకూ ప్రకంపనలూ, ప్రతిధ్వనులూ అతని భార్యని తాకలేదు. భర్త ఏం చెప్పినా, ఆ మాటకొస్తే, భర్త గురించి ఎవరేం చెప్పినా నిర్వికారంగా చూస్తూ వుండిపోవడం తప్ప ఆ మహాతల్లి నోరు విప్పి తన వుద్దేశం ఏవిటో స్పష్టం చేసింది లేదు.
ఇదిలా వుండగా, శ్రోతరహిత సమాజ ధోరణి పట్ల తన ధిక్కారాన్ని ఎలా ప్రకటించాలా అని మల్లగుల్లాలు పడుతున్న వెంకట్రావు కంటికి భార్య ఆశాజ్యోతిలా అగుపడింది. ఆవిడని కూచోబెట్టి, పెళ్లి గురించి తాజాగా తనలో వెల్లివిరిసిన అభిప్రాయాలన్నీ కుమ్మరించాడు. వాయిదాల పద్ధతిలో చెపితే ఎలా వుండేదో గానీ, వొకే దెబ్బలో విషయం తెగ్గొట్టేయాలన్న అతని ఆత్రం అంత సత్ఫలితాలని యివ్వలేదు. కాసేపు నిర్వికారంగా విన్న మీదట, వెంకట్రావు భార్య రోకలిబండ తీసుకొచ్చి, అతని తలమీద ఠపీమని కొట్టింది, నిర్వికారంగానే. ప్రతిఘటించడం లాంటి చాదస్తాలూ అవీ పెట్టుకోకుండా పుటుక్కున బాల్చీ తన్నేశాడు వెంకట్రావు. దానికి కారణం అతనికి ప్రొటెస్టు చేయడం పట్ల నమ్మకం లేదని కాదు. చేయాలని గ్రహించేంతటి వ్యవధి లేదంతే. అతను చిన్నప్పుడు కాథలిక్ మిషనరీ స్కూల్లో చదవడం మూలంగానే ప్రొటెస్టెంటు వ్యతిరేక భావజాలాన్ని నింపుకున్నాడనీ, లేదంటే ఎంతోకొంత ప్రొటెస్టు చేయగలిగి వుండేవాడనీ చరిత్రకారులెవరూ అభిప్రాయపడలేదు. ఎందుకంటే, అసలు వెంకట్రావు భార్య చేతిలో హత్యకి గురయ్యాడనే అనుమానం కూడా ఎవరికీ రాలేదు.
భర్తకి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పెద్దగా ఏడవకుండా నిర్వికారంగా వున్న లీలని చూసి ఎవరూ ముక్కున వేలేసుకోలేదు. భర్త హఠాన్మరణంతో షాక్‌లోకి వెళ్లిపోయిందనీ, సుమంగళిగా పోలేకపోయాననే నిజాన్ని తట్టుకోలేక ఆమెకి పిచ్చిపట్టిందనీ జనాలు చెప్పుకున్నారు. ఆ మాటలు చెవిన పడ్డప్పుడు కూడా ఖండించకుండా నిర్వికారంగానే చూస్తుండిపోయింది లీల. పెళ్లి అనే వ్యవస్థ పట్ల, ప్రత్యేకంగా తన వైవాహిక జీవితం పట్ల ఆమెకి ఎలాంటి వుద్దేశాలు వున్నాయీ అనేది ఎవరికీ తెలీని విషయంగానే మిగిలిపోయింది. భర్తని బేషరతుగా స్వీకరించడంలో లీలని మించినవాళ్లు ఎవరూ లేరని తెలిసిందే కాబట్టీ ఎవరూ ఆమె అభిప్రాయం అడగలేదు కూడానూ.
*
కథ బాగుంది శ్రీధర్ ,కథలో progression ఎలా తీసుకుని రావాలి అన్న ప్రక్రియలో మీరు కథలు రాయడానికి ముందే పరిణితి సాధించారు .అది బాగా కనిపిస్తోంది ఈ కథలో కూడా. వెంకట్రావు ఆలోచనలో ప్రతీ మెట్టూ చాలా సహజంగా అమరింది .సస్పెన్స్ అల్లా ఎలా బాల్చీ తంతాడు అన్నది మాత్రమే .
మీ అభిమానానికి ధన్యవాదాలు. నా ప్రతి కథనీ చదివి, మీ అభిప్రాయం చెప్పడం నాకు చాలా సంతోషంగా వుంది. 🙏🙏🙏
ప్రతి పదిమంది లో ఒక వెంకట్రావు తప్పనిసరిగా వుంటారు. ఆ extremities అన్నింటినీ ఆనందంగా భరిస్తున్నట్లుగా పైకి కన్పించే స్త్రీలు అందరూ ఈ కథను own చేసుకుంటారు.
మనస్తత్వవిశ్లేషణ అంటే కష్టమైన పదజాలంతో ఎవరికీ అర్థం కాకుండా రాయాలనే అభిప్రాయం తప్పని రచయిత prove చేశారు. అయితే వెంకట్రావు కు అలాంటి sad ending యివ్వకుండా వుంటే (కధైనా సరే)సంతోషం గా వుండేది(నాకు)
నా కథ కొంతవరకూ మీకు నచ్చిందని అర్థమైంది. కృతజ్ఞతలు. వెంకట్రావుని చంపేయకుండా వుండాల్సిందని చాలామంది మిత్రులు చెప్పారు. నిర్వికారంగా కనిపిస్తున్నప్పటికీ ఆవిడలో ఎంత అసంతృప్తి పేరుకుపోయిందో చెప్పేయాలన్న ఆత్రం నాతో అలా చేయించింది. బహుశా యింకో విధంగా ముగించి వుండాల్సిందేమో. మీ స్పందన తెలిపినందుకు మరోసారి ధన్యవాదాలు.. 🙏
వెంకట్రావు ని చంపకుండా, అతనికి చిత్త చాపల్యానికి, పైత్యానికి బుద్ధి వొచ్చేలా బడితెపూజ చేసిఉంటే బాగుండేది అతని భార్య లీల. కథా విశేషం, విషయం వేరే అయినా, కథలో రావిశాస్త్రి గారి “అల్పజీవి” శైలి కనిపించింది. వెంకట్రావులాంటి విడ్డురపు వింత జీవులు అక్కడక్కడా తారసపడుతూవుంటారు ఆడవాళ్ళకి. తమాషా కథ. అభినందనలు అండి.
తన ఆదర్శాల్నీ సిద్ధాంతాల్నీ వివాహితులైన ఆడవాళ్లకి కూడా విస్తరించాల్సిన చారిత్రక అవసరాన్ని వెంకట్రావు గుర్తించసాగాడు….హ హ. మంచి హాస్య కథ. చివరి రెండు మూడు పేరాగ్రాఫులు కూడా బాగా నవ్వించాయి. మీ శైలి, వాక్యనిర్మాణం కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. శుభాకాంక్షలు.
చాలా సులువైన పదాలతో, మస్తిష్కంలో జరిగే వాద ప్రతి వాదాలను దారి తప్పకుండా చాలా బాగా ముందుకు నడిపించారు, ఈ కథ చదివే ముందు మీరు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం ఒక మంచి రచయితగా పరిచయం అయ్యారు. ఒక రకంగా ఇది ఒక మానసిక సంఘర్షణ శాస్త్రం కానీ దాని ఫలితం మాత్రం భౌతిక మైనది.
ఒక స్త్రీ మౌనాన్ని అర్థం చేసుకునే పద్ధతిని రెండు పార్శాలుగా ఒకటి భర్త మరొకటి సమాజం కోణంలో చెప్పారు, అదే మౌనాన్ని తన పరంగా స్త్రీ వ్యక్తపరిస్తే అది తగిన సమయంలో….. అదే ” బాల్చి తంతునానేనా”