ప్రసాద్ అట్లూరి కవితలు

కురిసి కురిసి అలసి ఆగిపోయిన జడివాన
ఎటు పోవాలో పాలుపోక రోడ్డు మధ్యలో నిలబడిపోయిన
బిక్కమొహపు బిత్తరచూపుల వర్షపు నీరవుతుంది

చెరిగిపోయిన చిత్రం

 

దిక్కు నుండి దిక్కుకి పొద్దుల్ని నెత్తిన పెట్టుకుని

మోసుకుపోవటం మాత్రమే తెలిసినట్లుండే  కాలం

ఏదో ఒక రోజు నిన్నూ నన్నూ

ఇట్టే మాయం చేయగల మంత్రగత్తె కూడా అని తెలియక

నవ్వుతూ తుళ్ళుతూనే  అదృశ్యం అయిపోతాం !

 

నువ్వెళ్ళి పోయావని నేనో  నేనెళ్ళిపోయానని నువ్వో

కొన్ని కన్నీటి బొట్లను మొహం వాకిట్లో మొలిపించుకుని

మనసంతా జ్ఞాపకాల పచ్చివాసన కొడుతుంటే

లోపటి శూన్యాన్ని బయటకు నెట్టలేక నెట్టుతుంటాం

క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు , పక్షాలు ,

సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు

ఎంత మంది పిల్లల్ని ఓపిగ్గా సాకుతుందీ కాలం తల్లి!

 

చుట్టచుట్టి ఏ  జమ్మిచెట్టుపైనో దాచుకున్న ఆశలు

ఎదురుచూపుల్లోనే  మెల్లమెల్లగా బుగిలిపోతుంటే

గతానికే చెందినట్లు వెనకెక్కడో ఆగిపోయిన ఆనందాన్ని

అప్పుడప్పుడు తెచ్చి గుండెలపై  ఒంపిపోతూ

రాత్రీ పగలూ అదేపనిగా తగలడిపోతుంటాయ్

కాలం కాన్వాసుపై  ఒక్కసారి చెరిగిపోయిన చిత్రమయ్యాక

మళ్ళీ బ్రహ్మ గీతల్లోనే

 ప్రాణం పోసుకునేది నువ్వయినా నేనయినా !

 

వాన ముచ్చట్లు 

 

ఉట్టికట్టి వేలాడేసి దాచుకున్న నల్లమబ్బుల్ని
మధించి మధించి సాధించిన వానామృతాన్ని
నిత్యయవ్వనం ఒసగాలని భూమికి పంచుతుంటే
మోహినీ అవతారమెత్తిన విష్ణుమూర్తవుతుంది ఆకాశం

ఉరుములు మెరుపులతో తిరిగొచ్చిన వానని
మండుతున్న గుండెలకు గట్టిగా హత్తుకొని
బడికెళ్లిన బిడ్డడు రాకకై గుమ్మంలోనే నిలబడి

తల్లడిల్లుతున్న ఎదురుచూపుల తల్లవుతుంది ధరిత్రి

కోరికలు సాంతంగా వొడగట్టుకుపోయి
బాధ్యతల బరువింకా మోస్తున్న ఓ పెద్దాయన
వీధిలో వాహ్యాళికి వచ్చిన వాననీటి వాగుని చూసి
కాగితపు పడవై తేలిపోతుంటాడు తన్మయంగా

ఆకుపచ్చని ప్రాయంతో మిసమిసలాడే అడవిని
ఎప్పుడు మోహించిందో
ముసురు మిషతో కమ్ముకున్న చిత్తడి వాన
చెట్టు బెరడులపైనా ఆకులపైనా టప టపల దరువేస్తూ
గలగల రాగంలో సెలయేటి  కొంటె పాటవుతుంది

వర్షపు చినుకుల అనంతానంత విన్యాసాలకు
చెట్లు తలలూపుతూ గాలి ఈలలేసి
ప్రశంసిస్తున్న దృశ్యాన్ని ప్రదర్శిస్తూ
మా వీధిదీపపు వెలుగు గొప్ప కళావేదికవుతుంది

తొలకరి చినుకులు తనువుని తాకి విచ్చుకున్న
కొన్ని మట్టిపెల్లల మధుర క్షణాలు
బసవన్నల కొమ్ములకు రంగులు పులిమి
రైతన్న గుండెలకు ఏరువాక తోరణాలు కట్టి పోతాయి

కుప్పలు కుప్పలుగా పోగుపడ్డ భవనాల దేహాలపై
కురిసి కురిసి అలసి ఆగిపోయిన జడివాన
ఎటు పోవాలో పాలుపోక రోడ్డు మధ్యలో నిలబడిపోయిన
బిక్కమొహపు బిత్తరచూపుల వర్షపు నీరవుతుంది

అదేంటో ..

వాన ముచ్చట్లలో  తడుస్తుంటే

మనసు కొమ్మన కొత్తగా చిగురించడం

గుండెలోకి ఇష్టంగా ప్రవహించడం బాగుంటుంది.

*

ప్రసాద్ అట్లూరి

1 comment

Leave a Reply to chelamallu giriprasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు