పోడూరి బ్ర‌దర్స్‌‌ @ ఎట(ఉప) కారం. కామ్‌

మంగ‌ళ‌వారం. రాత్రి 8-30 గంట‌లు. క‌మ‌లేశ్వ‌రా థియేట‌ర్‌లో మొద‌టి ఆట ఇంట‌ర్వెల్ ఇచ్చారు. థియేట‌ర్‌లో క్యాంటీన్ ద‌గ్గ‌ర ఒక‌రి చేతిలో న్యూస్ పేప‌ర్‌లో నాలుగైదు ప‌కోడీలు కలిపితే పెద్ద ప‌కోడీగా మారిన క్రికెట్ బాల్ అంత  ప‌కోడీ ఉంది. మ‌రొక‌రి చేతిలో చూపుడు వేలు, మ‌ధ్య వేలు క‌లిపితే ఎంత ఉంటుందో అంత పొడ‌వున్నరెండు మిర‌ప‌కాయ బ‌జ్జీలు ఉన్నాయి. వాటిని మ‌ధ్య‌లో కోసి ఉప్పుకారం వేయ‌డం వ‌ల్ల తెల్ల‌గా, ఎర్ర‌గా చిన్న చిన్న గురుతులున్నాయి. వాటి ప‌క్క‌న తెల్ల‌గా అదోర‌కం మెరుపుతో ఉన్న చిన్న చిన్న ఉల్లిపాయ ముక్క‌లున్నాయి. ఇన్ని రంగుల క‌ల‌యిక‌తో మిర‌ప‌కాయ బ‌జ్జీలు ఆకారం మారిపోయి… అడ్డంగా క‌నిపిస్తున్న ఇంద్ర‌ధ‌న‌స్సులా ఉన్నాయి. నిమ్మ‌కాయ పిండ‌డం వ‌ల్ల ఆ బ‌జ్జీల మీద నిమ్మ‌ గింజ‌లు నాలుగైదు వ‌రకూ ఉన్నాయి. వాటిలో కొన్నిచాకుతో కోసిన కార‌ణంగా స‌గం తెగిన  గింజ‌లైతే, మ‌రికొన్ని పూర్తి గింజలు. నూనెలో బాగా వేగ‌డం వ‌ల్ల మిర‌ప‌కాయ బ‌జ్జీలు సిమెంట్ గోడ పగిలినట్టుగా అక్క‌డ‌క్క‌డ ప‌గిలి ఉన్నాయి.

ప‌కోడీ తింటున్నాయ‌న పేరు పోడూరి సుబ్ర‌హ్మ‌ణ్యం. మిర‌ప‌కాయ బ‌జ్జీలు తింటున్నాయ‌న సుబ్ర‌హ్మ‌ణ్యం త‌మ్ముడు పోడూరి వెంక‌ట్రావు. అగ్ర‌హారం ప్రారంభంలో ఉన్న పోడూరి మెడిక‌ల్స్‌ య‌జ‌మానులు వారిద్ద‌రు. మంగ‌ళ‌వారం అగ్ర‌హారం ఉన్న అమ‌లాపురం ప‌ట్ట‌ణంలో మార్కెట్ బంద్‌. దాదాపు అన్ని షాపులు మూసేస్తారు. మెడిక‌ల్ షాపులు మాత్రం ఓ వారం కొంద‌రు, మ‌రో వారం ఇంకొంద‌రు తెరిచి ఉంచుతారు. అది అత్య‌వ‌స‌రం కాబ‌ట్టి ఆ ఏర్పాటు చేసుకున్నారు మెడిక‌ల్ షాపు య‌జ‌మానులు. ఈ వారం పోడూరి మెడిక‌ల్స్ కి సెల‌వు వ‌చ్చింది. అందుక‌ని ఆ అన్న‌ద‌మ్ము‌లిద్ద‌రూ క‌మ‌లేశ్వ‌రా థియేట‌ర్ సినిమాకి ఫ‌స్ట్ షో చూసేందుకు వ‌చ్చారు.

అలా బ‌జ్జీలు, ప‌కోడీ తింటున్న వారిద్ద‌రి ద‌గ్గ‌రికి అగ్ర‌హారంలో నివాసం ఉంటున్న పోచిరాజు బుజ్జి వెళ్లి..

” అన్న‌య్య‌లూ… ఏటి బావున్నారా… సినిమాకొచ్చేరా…” అని అడిగాడు

“లేదురా… కాగితాలు ఏరుకుందుకు వ‌చ్చాం. ఇదిగో ఇద్ద‌రం రెండు కాగితాలు ఏరుకున్నాం…” అని స్రుబ్ర‌హ్మణ్యం న‌వ్వుతూ స‌మాధానం చెప్పారు.

“అదేటి అన్న‌య్యా… క‌నప‌డ్డార‌ని అడిగా. కాగితాలు ఏరుకోవ‌డమేటీ. ఎట‌కారం కాపోతే… “అని అక్క‌డి నుంచి విస‌విసా వెళ్లిపోయాడు పోచిరాజు బుజ్జి.

“లేపోతే. ఇంట‌ర్వెల్‌లో చూసి సినిమాకొచ్చేరా అంటాడేటీడు. బుర్ర త‌క్కువోడు”  అనుకున్నారు అన్న‌ద‌మ్ములిద్ద‌రు.

*                                                                                       *                                                                            *

పోడూరి అమ్మ‌మ్మ‌గారు అంటూ మేం పిలిచే ఇంటి య‌జ‌మానురాలికి ముగ్గురు కొడుకులు. ఇద్ద‌రు కూతుళ్లు. పెద్ద‌బ్బాయ్ ఇప్ప‌టి చెన్నై, అప్ప‌టి మ‌ద్రాసులో  ఉద్యోగం. మిగిలిన ఇద్ద‌రు మ‌గ పిల్లలు సుబ్ర‌హ్మ‌ణ్యం, వెంక‌ట్రావ్. డిగ్రీలు చ‌దువుకుని కాల‌క్షేపం కోసం మెడిక‌ల్ షాపు పెట్టుకున్నారు.

పోడూరి సుబ్ర‌హ్మ‌ణ్యం బాగా మిగ‌ల ముగ్గిన క‌డియం జాంపండు స‌గం కోస్తే ఎలా ఉంటుందో అలా ఉండే వారు. బ‌ట్ట‌త‌ల‌. న‌వ్వితే పెదాలు ఎడ‌మ వైపున్న కంటికి త‌గులుతాయా అన్న‌ట్లు న‌వ్వేవారు. పెద్ద పొడుగు కాదు.. అలాగ‌ని పొట్టీ కాదు. ఇలాంటి అందం అని చెప్ప‌లేం కాని అంద‌గాడు.

ఆయ‌న త‌మ్ముడు వెంక‌ట్రావు న‌లుపు కాదు కాని చామ‌న‌ఛాయ‌. పొడుగు మ‌నిషి. న‌వ్వితే ముఖ‌మంతా విచ్చుకున్న పొద్దు తిరుగుడు పువ్వులా ఉండేది. వెంక‌ట్రావ్ న‌వ్వుతూంటే ఆ న‌వ్వు మ‌ధ్య‌లో చిత్రంగా, చిన్న‌గా హు అని శ‌బ్దం వ‌చ్చేది. అది న‌వ్వులో క‌లిసిపోవ‌డం వ‌ల్ల ఎదుటి వాళ్లకి తెలిసేది కాదు. కాని వాళ్ల‌న్న‌య్య సుబ్ర‌హ్మ‌ణ్యానికి మాత్రం తెలిసేది దాన‌ర్ధం.

హు… శ‌బ్దం వారిద్ద‌రికి ర‌హ‌స్య సంకేతం

హు.. శ‌బ్దం వారిద్ద‌రికి వెట‌కార‌పు క‌వ్వింత‌

హు.. శ‌బ్దం వారిద్ద‌రికి ఉత్సాహం

వెంక‌ట్రావ్ అలా హు శ‌బ్దం చేస్తూ న‌వ్వాడంటే వారిద్ద‌రి ముందు ఉన్న ఆసామి ప‌ని అయిపోయిన‌ట్లే. అంటే “న‌న్ను వ‌దిలేయండి మ‌హాప్ర‌భో” అనేంత వ‌ర‌కూ అత‌డ్ని త‌మ వెట‌కారంతో చంపేసే వారు.

*                                                                          *                                                                                      *

ఎన్ని బేరాలొచ్చినా… ఎంత వ్యాపారం ఉంద‌నుకున్నా… ఠంచ‌నుగా రాత్రి తొమ్మిది గంట‌ల‌కి మెడిక‌ల్ షాపు మూసేసే

వారు.  భూమికి కనీసం పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తులో పోడూరారి ఇల్లు ఉండేది. నేల నుంచి ఏడెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ముఖద్వారం ఉండేది. ముఖద్వారం పక్కన కుడివైపున మెడికల్ షాప్ ఉండేది. షాపు వెనుక  గదిలో చెక్కలతో చేసిన అలమారాలు, వాటిలో రకరకాల మందులు, టానిక్ సీసాలు, ఓ పక్కన ఫ్రిడ్జీ ఉండేవి. ఈ గదికి ముందున్న షాపులో కూడా గోడలకి అలమారాలు ఉండేవి. వాటిలో కూడా వివిధ కంపెనీల మందుల డబ్బాలు ఉండేవి. ఆ షాపులో కుడివైపు ఐమూలగా ఉన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఇద్దరన్నదమ్ములలో ఎవరో ఒకరు కూర్చునేవారు. మరొకరు అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చోవడమో, ముందులు ఇవ్వడమో చేసేవారు. ఆ మెడికల్ షాపులో ప్రత్యేకంగా సేల్స్ బాయ్ ఉండేవారు కాదు. ఈ అన్నదమ్ములే ఒక్కోసారి ఒకరు యజమానిగా, ఇంకొకరు సేల్స్ బాయ్ గా మారి మారి ఉండేవారు. ఇంటి ముఖద్వారానికి, షాపునకు మధ్యలో నాలుగడుగుల ఎత్తు, ఆరడుగుల పొడవు ఉన్న రెండు బల్లలు ఉండేవి. వాటికి ఆ చివరా.. ఈ చివరా, మధ్యలోనూ ఆరు కాళ్లు ఉండేవి.

రాత్రి తొమ్మిది గంటలకి మెడికల్ షాపు మూసేసిన తర్వాత అన్నదమ్ములిద్దరూ భోజనాధికాలు ముగిసిన తర్వాత లుంగీలు, బనీన్లు ధరించి మెడికల్ షాపుకి, అగ్రహారం రోడ్డుకి మధ్యలో ఆ చివరొకరు.. ఈ చివరొకరు ఓ బల్ల మీద కూర్చునేవారు. వారు కూర్చున్న బల్లకు ఎదురుగా మరో బల్ల ఉండేది. ఈ బల్ల అటుగా వెళ్తున్న వారు కూర్చుంటారని చేసిన ఏర్పాటు. ఇద్దరికి చుట్ట తాగడం అలావాటు కాబట్టి చుట్టలు వెలిగించి ఓ అలౌకిక ఆనందంలో తేలుతుండేవారు.

ఆ సమయంలో అటువైపుగా ఏ హోటల్ కో లేదూ మరో అవసరం కోసమో బజారుకు వెళ్లేవారిని బల్ల మీద కూర్చోబెట్టి కబుర్లు చెప్పేవారు. క‌బుర్లు అనే కంటే వెట‌కారం పాళ్లే ఎక్కువ. ఇది వారిద్ద‌రి రోజు వారీ ప్ర‌క్రియ‌.

ఓ వెన్నెల రాత్రి అగ్ర‌హారంలో పోడూరారి మెడిక‌ల్ షాపు ముందు ఓ బ‌ల్ల‌పై కూర్చున్నారు అన్న‌ద‌మ్ములిద్ద‌రు. అప్పుడు స‌మ‌యం రాత్రి తొమ్మిదింపావు కంటే ఎక్కువ‌గాను, తొమ్మిదిన్న‌ర కంటే త‌క్కువ‌గానూ అయ్యింది.  అగ్ర‌హారం చివ‌ర్లో నివాసం ఉంటున్న అనిప్పిండి వారబ్బాయి అబ్బి చేతిలో గుడ్డ సంచీతో వ‌స్తున్నాడు. పోడూరారి ఇంటి ప‌క్క‌నే ఉన్న నారాయ‌ణ‌పేట వెళ్లే వీధి మొగ‌లో ఉన్న దీప‌స్థంభం వెలుతురులో అబ్బి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాడు. అబ్బి అస‌లు పేరు అనిప్పిండి నాగ వెంక‌ట స‌త్య ఉమా మ‌హేశ్వ‌ర మ‌ల్లికార్జున శ‌ర్మ‌. ఇంత పేరు ప‌ల‌క‌డం క‌ష్టం అని అబ్బి అంటారు అగ్ర‌హారంలో అంద‌రూ. అబ్బి అమాయ‌కుడు కాదు… అలాగ‌ని తెలివైన వాడూ కాదు. కాక‌పోతే తెలివిత‌క్కువ వాడు. త‌న‌ని అందరూ చాలా తెలివైన వాడు అనుకోవాలని తెగ తాప‌త్ర‌య‌ప‌డ‌తాడు. అదిగో అలాంటి స‌మయంలోనే ఏవేవో మాట్లాడేసి ఒకింత న‌వ్వుల పాలు అవుతాడు. స‌హ‌జంగానే వెట‌కారం పాళ్లు ఎక్కువ‌గా ఉన్న పోడూరి బ్ర‌ద‌ర్స్ కి అబ్బి క‌న‌ప‌డితే మ‌హా సంతోషం.

ఆ రోజు శ‌నివారం. ఇంట్లో ఒంటిపూట తిళ్లు. అందుకే  గ‌డియార‌స్థంభం ద‌గ్గ‌రున్న నాయుడి హొట‌ల్ కి బ‌యలుదేరాడు అబ్బి. పోడూరి బ్ర‌ద‌ర్స్ ని చూసి ఓ చిరున‌వ్వు న‌వ్వి వెళ్లిపోవ‌చ్చు క‌దా… అలా చేస్తే అబ్బి ఎందుక‌వుతాడు. కాడు. కానే కాడు. అందుకే ప‌ల‌క‌రించాడు.

“ఏటీ భోజ‌నాలు అయిపోయాయేటి అన్న‌ద‌మ్ములిద్ద‌రు సుట్ట‌లు కాల్చుకుంటూ కూసున్నారు” అంటూ   పోడూరి బ్ర‌ద‌ర్స్ ని క‌దిలించాడు.

“ ఆ… ఏటీ అబ్బీ. ఈ రాత్రి ఎక్కడికి బయలుదేరావ్. టిఫిన్ కా ” అని సుబ్రహ్మణ్యం అడిగితే…

“ శనారం కదా… టిపిన్ల‌ కోసం అయ్యుంటుంది. హోటల్ కి బయలుదేరుంటాడు అబ్బీ.. అంతేనా ” అని వెంకట్రావ్ సమాధానం చెబుతూ హు అన్నాడు.

“ అవును. టిపినుకే. నాయుడు వోట‌ల్‌కి. మా అమ్మకి బాలేదు. మా నాన్న ఉప్పుపిండి, అల్ల‌ప‌చ్చ‌డి చేస్తాన‌న్నాడు. నేనే వ‌ద్దు అని వొట‌ల్‌కి బ‌య‌లుదేరా” అన్నాడు అబ్బి.

వెంక‌ట్రావ్ క‌లుగ‌జేసుకుని “ ఇంత‌కీ ఏ టిపిను ప‌ట్టుకెళ్తావ్ ఇంటికి‌” అని ప్ర‌శ్నించాడు.

“ నాకు ఉల్లి దోశ‌. మా నాన్న, అమ్మ‌కీ ఇడ్లీ. మా చెల్లికి పెస‌ర‌ట్టు ” స‌మాధానం చెప్పాడు అబ్బి.

“మీరేం తిన్నారేంటి టిపిను” అబ్బి మళ్లీ ప్రశ్నించాడు.

“ మేం ఏం తింటావు అబ్బి. శ‌నారం క‌దా. టిపినే. కాపోతే మీ అంత డ‌బ్బులు లేవు క‌దా… అందుక‌ని ఇంట్లోనే కరాచీ నూక ఉప్మా తిని ఇప్పుడే కూర్చున్నాం. నువ్వొచ్చావ్‌” అన్నాడు సుబ్ర‌హ్మ‌ణ్యం.

“ మీరు డబ్బులేని వారేటీ ఎవరైన వింటే నవ్వుతారు. ఉప్మాలో జీడిపప్పులేసారా  ” అబ్బి

“ జీడిపప్పులా…. గన్నేరు పప్పులేశారు. కాస్త తింటావేటీ ” అని సుబ్రహ్మణ్యం తన పెదాలని ఎడం వైపు పైకెత్తుతూ అన్నాడు.

“ అబ్బీ పప్పన్నం ఎప్పుడూ…సంబంధాలొస్తున్నాయా… ” అని వెంకట్రావు ప్రశ్నించాడు.

“ మొన్నే రేవవతల నుంచి గంటి వారు వచ్చారు. వాళ్లమ్మాయిని ఇస్తామని. వారం పది రోజుల్లో పిల్లను చూసేందుకు రమ్మన్నారు. మంచి రోజు చూసుకుని వెళ్లాలి ” అని కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు అబ్బీ.

“కట్నం ఎంత తీసుకుంటావ్. ఓ వెయి రూపాయలిస్తారేటీ” అని సుబ్మహ్మణ్యం ఎడమ కన్ను గీటుతూ అడిగాడు.

“ఏటీ ఎయ్యి రూపాయలా… బట్టలకే రావు. భలే సెప్తావ్ అన్నయ్య నువ్వు ” అని కాస్త కోపంగా అన్నాడు అబ్బి.

“ పోన్లేరా అబ్బీ పన్నెండొందలు తీసుకో ” అని వెంకట్రావ్ సముదాయించాడు.

“ మీ దగ్గరుంటే వూరికే సేసేసేలా ఉన్నారు పెళ్లి.. మీకో దండం. ” అని నాయుడు హొటల్ వైపు వెళ్లాడు అబ్బి.

*                                            **                                              *

మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది. పోడూరి అన్నదమ్ములిద్దరూ షాపులోనే కూర్చున్నారు. ఉదయం నుంచి పెద్దగా బేరాలు లేవు. అలాగే ఎటకారాలూ లేవు. క్యాష్ కౌంటర్లో వెంకట్రావు కూర్చున్నాడు. దానికి కొంచెం దూరంగా ఉన్న కుర్చీలో ఆంధ్రజ్యోతి సినిమా పేజీ చదువుతూ సుబ్రహ్మణ్యం కుర్చున్నాడు.

అన్నదమ్ములిద్దరికీ విసుగ్గా ఉంది. చికాకుగా ఉంది. నిస్సత్తువగా ఉంది. నీరసంగా కూడా ఉంది.

మందులు అమ్మనందుకో, బిల్లులు రానందుకో వచ్చిన అసహనం కాదది. కాలక్షేపానికి ఎవరూ లేరని లోలోపల అన్నదమ్ములిద్దరూ తెగ ఇదై పోతున్నారు.

ఒకళ్లకొక‌ళ్లు బయటకి చెప్పటం లేదు కాని, ఇద్దరి లోలోపలా ఓ మబ్బు ఆవరించి ఉంది.

అదీ… డాక్టర్ కోసం చాల సేపటి నుంచి వేచి చూస్తున్న పక్క ఊరి రోగిలా ఉంది.

అదీ… చీటీ లేకుండా నిద్ర మాత్రలు అడిగేందుకు  వచ్చిన దొంగ పేషెంటులా ఉంది

అదీ.. రక్త నమూనాలు ఇచ్చిన మూడు రోజుల తర్వాత కూడా రోగం తెలియని ఫలితంలా ఉంది.

అదిగో అలాంటి సమయంలో… ఆ మహత్తర వేళలో బజాజ్ కబ్ బండి మీద డు..డు..డు..డూ అంటూ శబ్ధం చేసుకుంటూ  పొడుగు ముక్కు మనిషి మెడికల్ షాపు ముందు ఆగాడు.

బండి ఇంజనాపి.. స్టాండేస్తూ “ ఏరా ఎంకట్రావ్ బాగున్నావా ” అని పలకరించాడు.

“ ఏరా సాగిరాజు… రా… రా . లంక నుంచి ఎప్పుడొచ్చావ్ ” అని వెంకట్రావ్ అడిగాడు.

అలా బండి మీద మెడికల్ షాపుకు వచ్చిన అతని పేరు సాగి రామకృష్ణ రాజు. మురమళ్ల పక్కన ఉన్న లంక గ్రామం అతనిది. సన్నగా, పొడవుగా, తెల్లగా ఉంటాడు సాగిరాజు. పొడుగ్గా కొనదేరినట్టున్న అతని ముక్కును చూడగానే రాజులబ్బాయ్ అని తెల్సిపోతుంది. కళ్లు సినీ హీరో కృష్ణంరాజు కళ్లలా ఎర్రగా ఉంటాయి. ఆస్తిపరుడు. వ్యవసాయంతో పాటు కొత్త కొత్త వ్యవసాయ వ్యాపారాలు చేయడం సాగిరాజుకు ఇష్టం.

అమలాపురంలో రూం తీసుకుని ఉంటూ డిగ్రీ చదివాడు. వెంకట్రావ్ క్లాస్ మేట్. ఇద్దరికి వురేయ్..వురేయ్ అనుకునే స్నేహం. పెద్ద పనుంటే తప్ప సాగిరాజు అమలాపురం రారు. వచ్చినా రేవు దాటి తన సొంత బజాజ్ కబ్ మీదే వస్తాడు తప్ప ఇతర వాహనాలు ఎక్కరు.

బండి స్టాండు వేసిన తర్వాత క్యాష్ కౌంటర్లో కూర్చున్న వెంకట్రావ్ దగ్గరకు వచ్చాడు సాగిరాజు. అలా కాదని ముఖద్వారం ముందున్న మెట్ల మీద నుంచి పైకొచ్చి షాపు పక్కనే కుడివైపు ఉన్న బల్లమీద కూర్చోమన్నాడు వెంకట్రావ్. సాగి రాజు గారు అలాగే వచ్చి బల్ల మీద కూర్చుంటూ “ ఏరా ఎంకట్రావ్ ఎలాగున్నావ్ ” అని అడిగారు.

దానికి “ బావున్నాను రా. నువ్వేటీ చాలకాలం తర్వాత వచ్చావ్”  అని వెంకట్రావ్ కుశల ప్రశ్నలు వేసాడు.

“ఏం బాగురా. అరికాల్లు మంట్లు. రాతిళ్లు మూడు నాలుగుసార్లు వొంటికి  లేవాల్సి వస్తోంది. నిన్నే వచ్చాను. పరీచ్చలు చేయించాను. ఇయాల పొద్దున్న రిపోర్టులొచ్చాయ్. సుగరట… మందులు రాసారు. నిన్ను కలిసి నట్టు ఉంటది, ముందులు తీసుకున్నట్టు ఉంటదని  వచ్చా” అన్నారు సాగిరాజు.

“షుగరు పెద్ద రోగమేమి కాదురా, జాగ్రత్తగా ఉండాలంతే. ఇంతకీ ఎంతుందేటీ షుగరు ” అడిగాడు వెంకట్రావ్

“ తినక ముందు 250. తిన్నతర్వాత 450 ” సాగిరాజు సమాధానమిచ్చాడు.

“అవునా…. పోనీ ఓ పని చేయరా.  తినకు. షుగరుండదు ” నవ్వుతూ అంటూ మధ్యలో హు అన్నాడు. ఈ సంకేతం సాగిరాజుకి తెలియలేదు. సుబ్రహ్మణ్యానికి తెలిసింది.

“ తినకపోతే ముందే సచ్చిపోతాం.. అవునొరేయ్ నీకుందా సుగరు ” అని ప్రశ్నించాడు సాగిరాజు.

సాగిరాజు ఇచ్చిన చీటిలో మందులు తీస్తూ సుబ్రహ్మణ్యం “ ఆడికి షుగర్ లేదు బెల్లం ఉంది ” అని ఎడమ కన్ను గీటేడు.

“ వురేయ్ మీ అన్నదమ్ములిద్దరూ ఇంతేనా. ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా ” అన్నాడు సాగిరాజు.

అన్న సుబ్రహ్మణ్యం ఇచ్చిన మందులకు బిల్లు రాస్తూ “ లేదురా. ఇలా ఉండం. ఇంట్లో లుంగీ కట్టుకుంటాం ”  అన్నాడు వెంకట్రావు.

మిత్రుడి ముఖంలో కోపం గమనించిన వెంకట్రావ్ వాతావరణాన్ని తేలిక చేయాలని “సరే. నీకు ఎందుకు వచ్చిందిరా షుగరు. నువ్వు జాగ్రత్తగా ఉంటావుగా “ అన్నాడు

ఈ మాటతో కాసింత తేటపడిన సాగి రాజు గారు… “ ఏం లేదురా… రొయ్యల సెరువేసాం. దీనెమ్మా… ఒకటే టెచ్చన్చ్‌. ఆటి రోగాలు. కౌంటు పెరగడం. పట్టడం… అమ్మకాలు… రొయ్యల వల్ల ఈ రోగం “ అన్నారు సాగిరాజు.

“ అవునా… రొయ్యల వల్ల వచ్చిందా షుగరు… ఆటికుంటదా… మరి ఆ యాపారం ఎందుకు “ అన్నాడు వెంకట్రావ్..

“ రొయ్యల వల్ల రావడం కాదురా… ఆ యాపారం వల్లరా నాయనా… నన్ను వదిలేయ్ “ అంటూ మందులు తీసుకుని వెళ్లిపోయారు సాగి రాజు గారు.

*                                                                          *                                                                                         *

కాలింగ్ బెల్ మోగింది. కాదు కాదు… మోగుతూనే ఉంది. అర్ధరాత్రి. టైం ఒంటి గంటన్నరై ఉంటుంది. పోడూరి  బ్రదర్స్ ఇద్దరి బెడ్ రూంల్లోనూ ఈ  బెల్ మోగుతూనే ఉంది. ఆ బెల్ మోతకి అన్నదమ్ములిద్దరితో పాటు భార్యా పిల్లలు కూడా లేచారు.

“ మందుల కోసం ఎవరో వచ్చారమ్మా… మీరు పడుకోండి “ అని పిల్లల్ని పడుకోమని అన్నదమ్ములిద్దరూ లైట్లు వేసి ఒక్క ఉదుటన హాల్లోకి గబగబా నడుచుకుంటూ హాలులోకి వచ్చి ముఖద్వారం తలుపులు తీసారు.  ఎదురుగా ఓ ఏభై ఏళ్ల మనిషి. అతని పక్కనే ఇరవైయేళ్ల కుర్రాడు. ఆ కుర్రాడి చేతిలో ఓ మందుల చీటి ఉంది.

“ ఈ మందులు కావాలండి. అర్జంట్. సానా దూరం నుంచి వచ్చాం. ఎక్కడా లేవు. ఎవరో మీ గురించి చెప్తే వచ్చాం “ అంటూ చేతిలో ఉన్న మందుల చీటి అందించాడు ఆ కుర్రాడు.

“ ఏమైంది. కంగారు పడకండి . మందులున్నాయి. తీసుకెళండి. ఏమైంది “ సుబ్రహ్మణ్యం అడుగుతూంటే… పక్కనే ఉన్న  మెడికల్ షాపు తలుపులు తీసి మందులు ఇచ్చే పనిలో పడ్డాడు వెంకట్రావ్.

“ యాక్సిడెంటా… మందులూ, ఇంజెక్షన్లు రాసారు. ఏ హాస్పటల్ లో ఉన్నారు “  మందులు ఇస్తూ వెంకట్రావ్ అడిగాడు.

“ ఆయ్. యాక్సిడెంటండి. దొంగనా కొడుకులు గుద్దేసి ఎల్లిపోయారు. సానా దెబ్బలు తగిలాయి. నల్లొంతెన దిగువన మెట్లోరి ఆసుపత్రిలో సేర్చాం. ఎక్కడా మందులు లేవు. ఎవరో మీ దగ్గరకెళ్లమంటే వొచ్చాం “ ఏభై ఏళ్ల మనిషి చెప్పాడు.

“ మంచి మందులే. ఫర్లేదు. ముందు తీసుకెళ్లండి “ అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ డబ్బులు ఎంత “ ఏభై ఏళ్ల మనిషి అడిగాడు

“ డబ్బులు రేపు వచ్చి ఇవ్వండి. ముందు మందులు తీసుకెళ్లండి “ వెంకట్రావ్ మందులిచ్చి వారిని పంపించేశాడు.

“ తలుపులేసేయ్. పెద్ద యాక్సిడెంట్ కాదులే. పొద్దున్న వస్తారులే “ అని తమ్ముడికి పురమాయించి సుబ్రహ్మణ్యం లోపలకి వెళ్లిపోయారు. వెంకట్రావ్ తలుపులు వేసేసి లోపలికి వెళ్లిపోయారు.

తెల్లవారింది. ఉదయం తొమ్మిది గంటలు. మెడికల్ షాపు తెరవడానికి మరో అరగంట టైముంది. అదిగో అప్పుడొచ్చారు అర్ధరాత్రి వచ్చిన తండ్రీకొడుకూ. సుబ్రహ్మణ్యం ఎత్తు అరుగుల మీదే కూర్చున్నారు. వెంకట్రావ్ లోపల స్నానం చేసేందుకు వెళ్లారు.

“ బాబూ మందులు సమయానికిచ్చారు. కుర్రోడు బతికేడు. రాత్రంతా బయమే. మీరు మందులు ఇవ్వకపోతే అన్నాయం అయిపోయేది “ అంటూ డబ్బులు తీసాడు తండ్రి.

“ డబ్బులివ్వడానికి ఇంత పొద్దున్నే వస్తారా… మెల్లిగా రావచ్చు కదా… “ సుబ్రహ్మణ్యం అన్నాడు.

“ అయ్యో… అర్ధరాత్రేళ దేవుళ్లా మందులిచ్చారు. డబ్బులివ్వకపోతే ఎలా బాబూ “ పెద్ద మనిషి సమాధానం చెబుతూ రెండొందలు తీసి ఇచ్చాడు.

ఆ డబ్బులు తీసుకున్న సుబ్రహ్మణ్యం మందుల డబ్బులు 147 రూపాయలు తీసుకుని 53 రూపాయలు వెనక్కి ఇచ్చేశాడు.

*                                                                                           *                                                                           *

ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు బస్సులకు కాలం చెల్లింది. ప్రభుత్వం చాలా రూట్లను స్వాధీనం చేసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పడింది. ఇక ప్రైయివేటు బస్సుల స్ధానంలో ఆర్టీసీ బస్సులు తిరగడం ప్రారంభించాయి. రాష్ట్రంలోని ప్రతి పట్నంలోను బస్టాండులు వెలుస్తున్నాయి. కోనసీమలో పెద్ద పట్నమైన అమలాపురంలో బస్టాండు తో పాటు డిపోను కూడా ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ  చర్యలు ప్రారంభించింది. బస్టాండుతో పాటు డిపో కోసం కనీసం మూడు నుంచి ఐదెకరాల స్ధలం కావాలని అంచనా వేసారు. పట్టణ ముఖద్వారంలో ఐదెకరాల స్ధలం గుర్తించారు. ఆ స్ధల యజామానులతో మాట్లాడి స్ధల సేకరణ చేయాలని నిర్ణయించారు.

ఆర్టీసీ అధికారులు సేకరించాలనుకున్న స్ధలం పోడూరి బ్రదర్స్ ది.

ఐదెకరాల స్ధలంలో మూడున్నర ఎకరాలు పోడూరి బ్రదర్స్ ది. ఆ స్ధలాన్ని ఆర్టీసీ కోసం సేకరించాలని ఓ ఆదివారం ఉదయం పది గంటలకు ప్రభుత్వ అధికారులు పోడూరారి ఇంటికి వచ్చారు. తాము ఫలానా అని పరిచయం చేసుకున్నారు. కోనసీమ ప్రజలకు ఉపయోగప‌డ‌డానికి ఆర్టీసీ బస్టాండు కోసం స్ధలం ఇవ్వాలంటూ అడిగారు. అందుకు ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అప్పడు ఆ స్ధ‌లం ఖరీదు ఎకరం మార్కెట్ ధర రెండు లక్షలు. ప్రభుత్వ ధర 65,000. ఇదే విషయాన్ని అధికారులు పోడూరి బ్రదర్స్ కి చెప్పారు.

ఇంటికి వచ్చిన అధికారులకు ఇడ్లీ పెట్టారు. అందులోకి  కారపొడి, నెయ్యి, కొబ్బరి పచ్చడి కూడా వేసారు. టిఫిన్ చేసిన తర్వాత కమ్మటి ఫిల్టర్ కాఫీ కూడా ఇచ్చారు. అధికారులతో పాటు అన్నదమ్ములు కూడా ఫిల్టర్ కాఫీ తాగుతూ

“ మంచిపని. మా ఊరి వాళ్ల కోసమే కదా. ఆలోచిస్తాం. మేమిద్దరం నిర్ణయం తీసుకోలేం. మద్రాసులో మా అన్నయ్య ఉన్నారు. ఆయన తోనూ, మా అమ్మగారితోనూ మాట్లాడి నాలుగైదు రోజులలో మా నిర్ణయం చెబుతాం ”  అని అన్నారు.

అధికారులు టిఫిన్ తిని, కాఫీ తాగి రెండు చేతులతో దణ్ణం పెట్టి “ మీ మనసులు మంచివని ఊరులో చాలా మంది చెప్పారు. మీ నిర్ణయం ఎంత త్వరగా చెబితే బస్టాండ్ నిర్మాణ పనులు అంత త్వరగా ప్రారంభమవుతాయి ” అని  అంబాసిడర్ కారులో వెళ్లిపోయారు.

అప్పటికి అగ్రహారంలో మూడు నాలుగిళ్లలోనే ఫోన్లు ఉండేవి. అందులో ఒకటి పోడూరారి ఇంటిలో ఉండేది. మద్రాసులో ఉన్న అన్నగారితో ఫోన్లో విషయం చెప్పారు.

ఆయన “ అమ్మకి, మీకూ ఏది మంచిదనిపిస్తే అది చేయండి ” అని అన్నారు.

నాలుగు రోజుల తర్వాత అధికారులకు స్ధలం ఇవ్వడానికి  తమకు ఎటువంటి అభ్యతరం లేదని కబురెట్టారు.

వారం రోజుల లోపే ఇప్పుడు కోట్లు విలువ చేసే పొలం ఆర్టీసీ పేరిట రిజష్టర్ అయ్యింది.

*                                     *                                                                      *

2000 సంవత్సరం మే నెల. ఎండలు మండిస్తున్నాయి. భూమిలోంచి వేడి పొగలు వస్తున్నాయి. సాయంత్రం ఏడు గంటలైనా వేడి తగ్గలేదు. అదిగో అలాంటి సమయంలో పోడూరి బ్రదర్స్ లో రెండవాడైన సుబ్రహ్మణ్యం ఒక్కరే బజారుకి వచ్చారు. గడియారం స్థంభం నుంచి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళుతున్నారు. వెనక నుంచి ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు సుబ్రహ్మణ్యాన్ని ఢీకొంది.

సుబ్రహ్మణ్యం…. అక్కడిక్కక్కడే ప్రాణాలు విడిచారు.

సుబ్రహ్మణ్యం…. రోడ్డు మీద హఠాత్తుగా మటుమాయం అయ్యారు

సుబ్రహ్మణ్యం… ఆ రోజు నుంచి అగ్రహారానికి ఓ జ్ఞాపకం అయ్యారు.

అలా ప్రమాదంలో మరణించిన సుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అందరూ కన్నీరు మున్నీరవుతున్నారు. అగ్రహారమంతా పోడూరారి ఇంటి ముందే ఉంది.

పోడూరి వెంకట్రావు గంభీరంగా ఉన్నారు. కుడి చేయి కోల్పోయినట్టు ఉన్నారు. ఆయన కళ్లల్లో ఇక నాకు ఎవరున్నారు అన్న బెంగ స్పష్టంగా కనిపిస్తోంది. అన్నయ్య తోబుట్టువా, నన్నెరిగిన స్నేహితుడా అన్న సంశయంలో ఉన్నారు.

వెంకట్రావుకి ఏడవాలని ఉంది. గట్టుతెగిన గోదారిలా కన్నీళ్లు జలజలా రాల్చాలని ఉంది.

కడుపులో దు:ఖం పెఠిల్లున పగలాలని ఉంది. కాని అవేమి కావటం లేదు.

అరుగు మీద మెత్తటి పరుపుపై ఉంచిన సుబ్రహ్మణ్యం భౌతికకాయం దగ్గరకి వెంకట్రావు వెళ్లేడు.

అన్నయ్య సుబ్రహ్మణ్యం తల నిమిరాడు…  ఏడుపు రాలేదు

రెండు చేతులతో రెండు చెంపలు నిమిరాడు…. ఏడుపు రాలేదు

దింపుడు కళ్లేం ఆశల కొద్దిగా కదిపాడు. ఏడుపు రాలేదు

అన్నయ్య చెవి దగ్గరకు వెళ్లి  “హు” అన్నాడు

వినపడలేదేమో అని ఇంకో రెండు సార్లు హు… హు అంటూ గట్టిగా అన్నాడు.

ఏ మార్పులేదు. ఏ కదలికా లేదు. ఏ ఆశా లేదు.

అదిగో అప్పుడు వెంకట్రావు గుండె పగిలింది. అప్పుడు వెంకట్రావు కళ్ల నుండి ధారాపాతంగా కన్నీళ్లు వచ్చాయి.

“ అన్నయ్యా ” అంటూ చిన్నపిల్లవాడిలా వలవలా ఏడ్చాడు. తండ్రిని పోగొట్టుకున్న కొడుకులా భోరుభోరున విలపించాడు.

అగ్రహారం పెద్దలు వెంకట్రావును సముదాయించి, మిగతా కార్యక్రమాలు కానిచ్చారు.

*                                                    *                                                                     *

ఆరు నెలలు గడిచింది. వెంకట్రావు మనిషిలా లేడు. బిత్తర చూపులు చూసేవాడు. తన పక్కనే సుబ్రహ్మణ్యం అన్నయ్య ఉన్నాడనుకుని మాట్లాడేవాడు.  అన్న మరణంతో కుంగిపోయిన వెంకట్రావు క్షణం క్షణం అనారోగ్యంతో క్షీణించిపోయాడు.

ఆ అనారోగ్యం పేరు బెంగ…

ఆ అనారోగ్యం పేరు అన్నపై అభిమానం

ఆ అనారోగ్యం పేరు అన్నపై ఆత్మీయత

ఓ రోజు ఆ ఆత్మీయత శాశ్వతంగా నిద్రపోయింది. అన్నపై అభిమానం ఆ అన్నను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. అన్నపై  బెంగతో ఆ గుండె భళ్లున పగిలి కొట్టుకోవడం ఆగిపోయింది.

*

ముక్కామల చక్రధర్

25 comments

Leave a Reply to PVSLN MURTY PODURI బుడ్డి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆనందం ధుఖం రెండు తెప్పించావు బుజ్జి ఈ కథని వాళ్ళ గురించి తెలిసిన వారు వారి తో అనుబంధం వున్న వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు
    ఒకసారి ఒక ఆయన ఒక ఆడపిల్ల నీ తీసుకుని shpop కి వచ్చాడు .. అప్పుడు వారి సంభాషణ
    వెంకట్ రావు.. ఆడ పిల్ల ను పెంచుకుంటున్నారు ఏమిటి రా
    సుబ్రమణ్యం…..ఆడ పిల్ల అయితే మీద పడి ఏడుస్తుంది..మగాడు అయితే దూరంగా స్థంభానికి ఆనుకుని చూస్తాడు నిప్పు పట్టుకుని….
    ఇందులో ఎంత ఏటకారం వున్న…జీవిత సత్యం కూడా అంతే వుంది
    బాగా రాసి మా ఆత్మీయులను ఇద్దరినీ గుర్తు చేశావ్

  • Orey bujji bagundira. Ma buddi bava annattu a yetakaram swayamga chudali leda anubhavinchali. Appude dani maja. Valla daggara undi kuda ivvaleni mandula kosam evaraina vaste appudu chudali valla yetakara viswaroopam. As sambhashana ela undedo chinna example.

    Subramanyam garu koncham ee mandulu kavalandi

    Mandula cheeti chusi. Ayyo ninnane. Ayipoyandi lekapothe mee kante kavalasina vaallevaru, time ki ivvalekapoyam ayyo Antaru.

    Babbabu koncham chudandi, inka ekkadiki tiragalenu antadu.

    Annayya a shelf lo oka box undali chudu ani annayyaki chebuthadu .
    Annayya shelf antha vethiki (vethikinattu natinchi levani chebuthadu) levura antadu..

    Valliddariki telusu unnayani, kani ivvakudadu. Iddaru kalisi manchi coordination tho scene ni bhale rakti kattinchevaru.

    Enni cheppina a yetakaram swayamga anubhavinchina vallake a maja telustundi.
    Thanks ra manchi story.

  • అగ్రహారం లో ఉన్న పోడూరి మెడికల్ స్టోర్స్ ఆందరికి సుపరిచితమే. ఆ సోదరులు ఇద్దరు ఎప్పుదు జంట కవుల
    వలె కనపడే వారు. వారి గురించి తెలియని విషయాలు వ్రాసినందుకు ధన్యవాదములు.

  • Annadammuliddarni maatalatho bomma katti chupimchaaru. Yetakaaram kaakapothey iddarni okesaari theesukupovaalaa Dhevudu.
    Dhevudiki thochaka kaalakshepam kosam theesukupoyaademo?
    Hu..

  • Excellent narration…remembering old golden days… I also have experience with them so many times…..(vetakaram…. both are used to call me with my surname)…even now also ,we remember them when all our family members meet…🙏🙏🙏

  • పోడురారి అన్నదమ్ముల అనుబంధం గురించి, వాళ్ళ నిత్యకృత్యం గురించి, నాణేనికి ఒకవైపు సేవా భావం ఇంకొకవైపు చమత్కారం లాంటి వెటకారం సమపాళ్లలో కలిపి అందించారు. అద్భుతః.
    అంతర్లీనంగా వారికి సామాజిక సేవ చేయాలనే ఆసక్తి , ప్రజలకు ఉపయోగపడే టందుకు కోట్ల రూపాయల ఆస్తిని తృణ ప్రాయంగా వదులుకోవడం వంటివి వారి యొక్క విశాల హృదయం కు చిహ్నం.

  • గోదావరి యాస గుభాళింపులకు తోడు పొడూరి బ్రదర్స్ మితిమీరని ఎటకారం, మధ్య రాత్రి మందులకోసం వచ్చిన అపరిచితులకు కూడా విసుక్కోకుండా మందులిచ్చి మందులు తర్వాత ఇవ్వమని చెప్పే
    ఔదార్యం, ఊరి అభివృద్దికోసం కోట్లాది రూపాయల విలువైన మూడెకరాల స్థలాన్ని ఆర్.టి.సి. కి ఇచ్చిన వారి దాతృత్వం ఈకథకు హైలైట్ గా నిలిచిపొయాయి. చివరికి ఎంతటి వారికైన తప్పని మృత్యువు ‘హూ’ అలా ముగిసిపోవడం విచారకరమే! బుజ్జిగాడికి మరో సారి అభినందనలు!!

  • Simply wonderful. నువ్వు ఇలా రాస్తావని అప్పుడు తెలిసి ఉండి ఉంటే ముక్కామల మేష్టారికి మాఇల్లు ఊరికే ఇచ్చేవాళ్ళం.

  • Nice narration…..Thanks for sharing us the
    veta/ upa “karam” memories of mavayyagaru🙏
    We still remember his smile.

  • గోదావరి ఎటకారం తో అద్భుతంగా సాగింది. ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా సాగింది. చివరలో గుండె పిండేసింది. కధనం, శైలి అమోఘం. రచయత కాలం నుంచి మరిన్ని కథలు ఆశిస్తూ, సెలవు.

  • చాలా బాగుంది బుజ్జీ! పోడూరి బ్రదర్స్ బాగా పరిచయం ఉన్నవాళ్లెవరికైనా గుండెల్ని బాగా కదిలిస్తుంది. అంతగా తెలీని నాకే అదోలా మనసుని తాకింది. . “వురేయ్ మీ అన్నదమ్ములిద్దరూ ఇంతేనా. ఇంట్లోకూడా కూడా ఇలాగే ఉంటారా” , దానికి వాళ్ల సమాధానం కోనసీమ ఎటకారాన్ని బాగా పరిచయం చేసాయి. అలాగే, “రొయ్యల వల్ల వచ్చిందా షుగరు… ఆటికుంటదా…” ఇది మరీ ఎటకారం. “కాగితాలు ఏరుకుందుకు వచ్చాం” ఇది మహా ఎటకారం. వీళ్లతో పరిచయం ఉంటే బాగుండేది అనిపించింది. “ఏంటీ, ఎటకారం కోసమే?” అని ఎటకారం చెయ్యకు. నా అమలాపురం, నా అమలాపురం అని తెగ అనేసుకోవడమే తప్ప, నా అమలాపురం నాకు పరిచయమే లేదు అనిపిస్తోంది. నువ్వు మంచి ఫ్రెండువు కాబట్టి, కృతజ్ఞతలు చెప్పట్లేదు.

  • పోడూరి బ్రదర్స్ వెటకారం స్వానుభవమే.
    వెటకారమే కాక, వారినుంచి నేర్చుకోవలసింది చాలాఉంది……
    – అన్నదమ్ముల మధ్య ఉండవలసిన మమకారం, అభిప్రాయభేదాలకు లేదు ఆస్కారం.
    – ఊరికి వారి సహకారం etc..

    కధ ద్వారా కధమొదట్లో వర్ణించిన
    మిరపకాయ బజ్జీ తినిపించారు మాచేత.
    కళ్ళనీళ్ళు వస్తున్నా మిరపకాయ బజ్జీ ఆస్వాదించినట్లే
    వివిధ సంఘటనల ద్వారా వారి ” వెటకారాన్ని” రుచి చూపించడమేకాక చివర్లో వారిమధ్య ఉన్న “మమకారాన్ని” గుర్తు చేస్తూ ఇద్దరూ వెంటవెంటనే “వెళ్ళిపోవడం” బాధ కలిగించే విషయమే.
    ధన్యవాదాలు.

  • వాస్తవ సంఘటన ను ఆనాటి వారికి ఈనాటి వారికి కళ్ళ కు కట్టినట్లు గా కధ కధనం పరిశీలనాత్మక విశ్లేషణ ఆ అన్నదమ్ముల విశిష్టత ఎటకార మమకార వ్యవహార జీవన సాకార దాతృత్వ అభిమానతను ఇప్పుడు నల్వురికి చాటిచెప్పిన విధివిధానం మానవతా మార్గం చూపి మహనీయత సంతరించుకొని రచయిత ప్రశంసా పీఠంబును అధిష్ఠించాడు

  • One more wonderful writing narrated in beautifully.Though I didnt know about them but your description made me felt live…Very nice to know that Amalapuram bus stand land belonged to them and donated without second thought..Grt souls..Excellent writing one more added to your beautiful writings..

  • చాలా బాగా రాస్తున్నావు బుజ్జీ. అన్నదమ్ములు ఇద్దరు గుర్తు కు వచ్చారు. సహృదయులు 🙏🙏🙏

  • ఈ కధ చతువుతుమటే ఇప్పుడే మన కళ్ళముందు జరుగుతున్నట్లుఅనిపించింది. ఆవెటకారం కలిసిన ఆత్మీయత అనుభవించినట్లు వర్ణించటం జరిగింది. చాలామందికి ఇది కధ కావచ్చు కానీ వారితో (పోడుారి బ్రదర్స్) పరిచయం ఉన్న వాళ్ళకి, మరియు విన్నవాళ్ళకి మరీ బాగా అర్దమౌతుంది. ఆ మందుల దుకాణం అచ్చం కధలో వర్ణించినట్లే ఉండేది ఇన్ని సంవత్సరాలతరువాతకుాడా గుర్తుపెట్టుకోవటం చాలా కస్టం. రచియితకి నా అభినందనలు, ఆ కలంనుంచి మరిన్ని ఙ్ఞాపకాలదోంతరలని చదవాలని ఆసిస్తుా…..

  • ఈ కథ చదువుతుంటే 1976 ముందరకు వెళ్లిపోయింది ఆలోచన. చాలా బాగా రాసావు. చాలా బాగుంది.

  • అయ్యా… బుజ్జి గారూ…
    చాలా బాగా వ్రాసారు…పోడూరు మామ్మ గారు… ఈ..అన్నదమ్ములిద్దరూ..నాకు బాగా పరిచయస్తులు…ఈ మమకార…ఎటకారాలు..నేను అనుభవించాను…అగ్రహారం లో ఆంజనేయ స్వామి వారి గుడి ఎదురుగా..మా బావగారి type institute ఉండేది… (అంబికా type institute…గన్నవరపు సీతారామచంద్రమూర్తి గారు) నాది పేరూరే అయినా… ఎక్కువ గా మా బావగారింటి వద్దనే ఉండేవాడిని…..ఆ
    రోజులు జ్ఞాపకం చేసారు… ఒక్కసారి కళ్ళు చెమర్చాయి సార్ ……Tnq…యజ్ఞ నారాయణ శర్మ… నూకల….పేరూరు..

  • పోడూరి వారి మెడికల్ షాప్….. ఒక పాతిక ఏళ్ల క్రితం అగ్రహారంలో ఎంతో సుపరిచితమయిన గమ్యం, మందులు కావాలి అంటే అగ్రహారీకులు అందరూ అక్కడకు వచ్చేవారు. నాకు తెలిసి మూడే మెడికల్స్ ఉండేవి. ఈ ఇద్దరి అన్నదమ్ములని చూసి అబ్బురంగా అనిపించేది.అలాంటి ఒక మధుర జ్ఞాపకాలను నిజంగా ఏదో కాలయంత్రంలో వెనక్కు తీసుకు వెళ్లి మరీ మా ముందు అక్షర రూపంలో ఆవిష్కరిస్తున్న మీకు అభినందనలు. నిజంగా కళ్ళకు కట్టినట్టు మాకు తెలియని ఎన్నో అగ్రహారం విషయాలను నీ రచనల ద్వారా గతకాలపు జ్ఞాపకాలను తవ్వి తీస్తున్నావు. మరోసారి అభినందనలు చెబుతూ ఇలాంటివి ఎన్నో ఇంకా రచనలు రాయాలని కోరుతూ….

  • Subrahamnayam mamayyani venkatarao mamayyani okasaari gurtuchesavu vallamatalu okkokkati gurtukochai aarojule bagunnai ammammagaru ninnu eadukondalu anevaru gurtuvunda bujji

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు