పేదోడి బతుకు స్కాన్ “అద్వంద్వం”

కవిత్వం వలన కవి కి పేరొస్తుందా, లేదు కవి వలన కవిత్వానికి పేరొస్తుందా   తేల్చి చెప్పమంటే కచ్చితంగా కవిత్వంతో నే కవి ప్రసిద్ధుడు అవుతాడు.  కవిత్వంతోనే కవి లోకానికి పరిచయం అవుతాడు.  కవిత్వం మనసుని రంజింపజేసేదే కాదు అవసరమైతే కలాన్ని కత్తి లా మలిచి జీవన యుద్ధ రంగం లో పోరాటం నేర్పించగలదు.  కవి భావాన్ని అక్షరానికి తర్జుమా చేసేప్పుడు భిన్న ఆలోచనలు ముసురుతాయి. ఆలోచనకి ప్రాణం పొసే కవిత ఎలా రూపొందించాలి అన్నది కవి ఎంచుకునే కవిత్వ సాధనాలు, టెక్నీక్కు, శైలి ని బట్టి ఆధారపడి ఉంటుంది.  కవి కి ఏ వస్తువు ని సృశించాలి అన్నదానిపై పూర్తి స్వాతంత్య్రం ఉంటుంది. అది భావ కవిత్వమా, అభ్యదయమా.  చాలా మంది కవుల్లా మొదట భావ కవిత్వం నుంచి కాక అభ్యుదయం నుంచి అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని నడుస్తున్నాడు ఈ యువతరపు కవి అయినా శ్రీరామ్. భావ కవిత్వమా ? అభ్యుదయమా ? రెండు దారుల్లో ఏ దారిని ఎంచుకోవాలి.  తనకి ఎటు వెళ్లాలో స్పష్టత ఉంది అందుకే రెండో దారిని ఎంచుకొని “అద్వంద్వం ” పేరు తో సమాజం లో జరుగుతున్న, జరిగిన సంఘటనలని అక్షరబద్దం చేసాడు  తనకి కవిత్వం అంటే పలవరింపు, గొంతెత్తి అరుస్తున్న ఎందరో బాధితులకి తన అక్షరం ఓదార్పు కావాలని ఆరాటం.   ఇతని కవిత్వమంతా పేదోడి బతుకుల్ని స్కాన్ చేసి అద్భుతమైన ప్రతీకల్తో ముంచెత్తి ఆశ్చ్యర్య పరుస్తాడు
నీవు నేను కలిసి ప్రయాణించే దారిలో నీకిష్టమైన లాగానే ఉండమంటే ఎలా, నా అస్తిత్వాన్ని నీ ముంగిట పాతేయసిన యుగాలనుంచి విముక్తిలేని ఆశనే కదా, నేనంటే కేవలం శరీరం కాదు మనసు దానికి ఇష్టముంటుంది అందుకే “నీకు శరీరాన్ని ప్రేమించడమే మహాద్భుత కళ నీకు/నన్ను మట్టి ముద్దలా పిసుకుతున్నప్పుడు/నీ వేళ్ళ సారె మీద ఖజురాహోనయ్యాను..ఇద్దరి సమాగమం లో నీ జత ని ఎప్పుడో వీడిపోయాను అయినా కూడా “నేనుప్పుడూ అస్తిత్వ చీకటి రతి లో ని ఎంగిలిని ” కాదంటూ నిరసిస్తుంది ఆత్మాభిమానం గల మహిళ.
పసితనం మోయలేని బరువుల్ని తల్లితండ్రుల అత్యాశ కి ఫలితం ఆత్మహత్యల రూపం లో చూడాల్సి రావడం ఎంత దయనీయం.  ఈ లోకం గెలిచిన వాడి మాటకే విలువనిస్తుంది.  పరాజితుడి మాట ని ఎవ్వరు లెక్క చెయ్యరు బహుశా అందుకే కాబోలు ప్రతి తల్లి తండ్రి కొడుకు/కూతురు ని గెలుపు పరుగు పందెం లో పెట్టి జూదం ఆడుతున్నారు. అత్యాశ కి ఫలితం పసితనపు ఆత్మహత్యలు చావులు. అటు చదువు లోను జీవితం లో నూ ఓడిపోవడం ఎంత దారుణం
“పుట్టక ముందే కార్పొరేట్ స్కూల్ ల అత్యాశ కి
 పసితనం చనిపోయి తెల్ల గుడ్డ కప్పుకొని ముఖం దాచేస్తుంది. “
“క్రమశిక్షణ తో విషం తీసుకుంటున్న బానిసలకి
ఆశల తీరం తెలియని గెలుపొక్కటే కావాలి ” నిజమే ఈ లోకం గెలిచినవాడిని మాత్రమే గుర్తుకు ఉంచుకుంటుంది. రెక్కలు తెగిన దారి గుండా నిన్నటి దాకా మన మధ్య తిరిగిన మన నలుసు ని వెతుక్కోవాలి ఈ అత్యాశ కి ముగింపు ఎక్కడ ? (రెక్కలు తెగిన దారి).
వలస జీవితాలకి దిక్కెవరు ఉన్న ఊళ్ళో బతకలేని సంకట స్థితి. ఎలాగైనా తన వాళ్ళని బతికించుకోవాలని తపన  మనిషి ని ఒక చోట నిలవనీయదు దానికోసమే కదా తన ఇంటి నుంచి దూరదేశాలకి వెళ్తాడు. అదే మోహబ్భర్-నామ గా రూపుదిద్దుకుంది.
“గట్టు తెగిన కన్నీళ్ల దేహాన్ని గుప్పిట మూట గట్టుకొని ఎక్కడికో దూరం గా వెళ్లి//దిగులు గూడు కడతావు/మనిషి ఎక్కడ ఉన్న మనసు మాత్రం అయినవాళ్లు చుట్టే తిరుగుతుంది. ఆకలే అస్తిత్వమే అయితే దాన్ని జయించడానికి మతమే గురువై దారి చూపెడుతుంది
తనని నిలబెట్టిన ఇంటి గురించి స్మరణ చేసుకోవడం బాధ్యత గా ఫీల్ అవుతాడు. తనని భుజాలపై మోసిన ఇంటిగురించి ఎన్ని అతని అక్షరాల్లోనే చూడండి
“చివరి అంకం లో, వయసుడిగిన అతని చుట్టూ కూర్చొని/పురిటి నొప్పులు పడ్డ తల్లులందరూ పస్తులున్న/ఇంటి యవ్వనానికి //సూర్యుడిని చూపిస్తూ   గోరుముద్దలు పెడుతుంటారు.
కవి/రచయత కి రైతు గురించిన బెంగ ఎప్పటికి తీరనిదే. తన రాత లో రైతు గురించిన అక్షరం లేకపోతె సంపూర్ణమే కాదు. దీనికి తానూ మినహాయింపు కాదంటూ రైతు పక్కన నిలబడ్డాడు ఈ రచయత. జాతి ని కదిలించిన పాద యాత్ర తనని ఎంతగా కదిలించిందో అద్భుతమైన అభివ్యక్తి తో వ్యక్తీకరించిన తీరు అబ్బురమే .
“బక్క పల్చటి దుఖ్ఖ మోకదాన్ని/దర్జాగా తలపాగా చుట్టుకొని //పొలం కాళ్ళు నగరానికొచ్చాయి.
కలల నడకంతా దిగులు పడి/పంట పాద ముద్రలు పట్నం కూడలిలో నిలబడ్డాయి//.
గమ్యం తెలిసినప్పుడు చడీ చప్పుడు చేయకుండా ఆ నాగేటి చాళ్ళు నిరసన నిశ్శబ్దాన్ని రాజ్యం ముందు పరిచి ప్రశ్నల సమూహమై ఎదురొడ్డుతుంది/ అందుకే ఈ కవి కి రైతంటే ప్రేమ, ఎంత ప్రేమ అంటే దేవుడిలా కొలిచేటంత
“ఆకలి దీర్చేవాడే దేవుడని గుర్తొస్తుంది
పొలం పాదాల్ని కళ్ళకద్దుకోవాలినిపిస్తుంది ”  తోటి మనిషి పట్ల సహానుభూతి నిండిన మమకారం కదా ఇది.
మతం ఒక మత్తు మందు నిజమే కానీ అది ఉన్మాద స్థాయి చేరినవారికి, సహోదరుల్లా కలిసి మెలిసి జీవనం కొనసాగించేవారికి కాదు. దేవుడి సందు లో  ఇరు మతాల సహృదయత ని సహానుభూతి ని చూపడం ఇప్పుడు కావాల్సింది.
“రోజా ఉంటున్న నెల మొత్తం/సుర్మా రాసుకున్న కళ్ళలోంచి ప్రేమని ఒంపుతూ ఒక్కొక్కొడు దేవుడిలా కనిపిస్తాడు/ అలా ఒక స్టేట్ మెంట్ ఇస్తూనే తన ద్రుష్టి లో మతమంటే
“నా దేశపు ఏకత్వం అన్ని తెలిసినా పసితనం ఆడుకుంటున్న మా సందులో మతం అంటే అమ్మ చెప్పిన నీతి కథ లా కనపడుతుంది ” …
ఇరు మతాల ఐకమత్యాన్ని చూసినప్పుడు ఎవరికైనా కలిగే భావనే కాదు ఇది …
మనుషులంతా సమానమన్నది వొట్టి అబద్దం.  నిమ్న జాతి ప్రేమలు హత్యలకు బలి కావాల్సిందే  పరువు హత్యల నేపధ్యాన్ని కవిత్వీకరించిన తీరు ఆలోచింపచేస్తుంది. పెళ్లి, ప్రేమలో రెండు వైరుధ్యాల్ని, లాభ నష్టాలను బేరీజు వేసుకొని వ్యాపారం చేసే అగ్ర ఆర్య సంతతికి పై అక్షర దండయాత్ర చేసాడు ఈ కవి
“లాభ నష్టాల వైకుంఠపాళి లో/నువ్వు మనిషివన్న సత్యం నేనెప్పుడో మరిచిపోయాను/నేను మదమెక్కిన ఆర్య సంతతి ని./
వ్యాపారం మాది/వ్యవహారం మాది/నీవు మాత్రం ఎంగిలిదానివి/లోక కల్యాణ హతయలన్ని పడగ్గదిలో కూడా కత్తులు దూసి పూజలు వ్రతాలు చేస్తాము …(మీకు మేమె మాకు మేమె).
పొట్ట కూటి కోసం నీటి సరిహద్దుల్ని దాటి వెళ్లడమే నేరమవుతుందా? వేట పడవల్లో జీవితాలు ఎలా ముగిసిపోతాయో, దుఃఖం ఎలా కెరటమై ఎగసిపడుతుందో ఒక్కసారి వేటపడవలని తాకి చూస్తే తెలుస్తుంది వాళ్ళు చేసిన నేరమల్లా
“లోతైన అదృష్టాన్ని వెతుక్కుంటున్నప్పుడు దేశాలు గీసుకున్న నాటికిల్ మైళ్ళ సరిహద్దుల్ని కొన్ని  చేపలు కన్ను గీతి దాటిస్తాయి/కూటి కోసం చేసే విన్యాసం గూఢచర్యం అవుతుంది.  బతుకు తెరువుకోసం సముద్రాన్ని నమ్ముకున్న పెనిమిటి,
పరదేశం తీరం వెంబడి నురగలో/ఇంటి దాని దుఃఖం నిర్భదించిన పడవల ఒంటరి గా నిలబడుతుంది.  అవును బెస్తవాళ్ల జీవితం లో ఆకలి ఒక విషాదం.  బతుకు ని నిలబెట్టడానికి చేసే ఓ యాత్ర. (వేట పడవలు) . ఈ దేశం లో దళితులు వెట్టి చాకిరీల్లో, పాకి పనుల్లో, దిగివతరగతి గానే మిగిలిపోవడం ఎంత అమానుషం. దోచినవాడికే రాజ్యం తొంబై శాతం ఉన్న నిమ్న వర్గాలకి ఎప్పుడు అధికారం దక్కేది, ? అట్రాసిటీ కవిత లో దళిత ఆత్మా గౌరవ జెండా ఎత్తి ఒక్కసారన్నా దళితుడు రాజ్య పీఠం ఎక్కడలేని కాంక్షిస్తాడు తప్పేమి కాదు కదా. కవితలో దళితులు మోస్తున్న వెట్టి చాకిరీ ని అద్భుతమైన అభివ్యక్తి తో కొనసాగించారు
“ఒక ముని ఎండకాస్తున్న రోడ్లకి/అనాది గా చెప్పులు తొడుగుతూనే ఉన్నాడు/
ఒక దేవమూర్తి మురికి కూపం లో మునిగి అనాది గా పాకీ పనికి /పుష్కర స్నానం చేయిస్తునే ఉన్నాడు ..
దళితుల పట్ల వివక్షత ని రూపుమాపాలంటే, అంటరానితనం పోవాలంటే రాజ్యాధికారం రావలసిందే అందుకే కవిత ముగింపు లో ఇలా అంటాడు
“ఇప్పుడోసారన్న గుళ్లో దేవుణ్ణి తాకితే బావుణ్ణు
ఇప్పిటకైనా వెట్టివాడోకొడు రాజైతే బావుణ్ణు ” వెట్టివాడికి రాజ్యం కట్టబెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటాడు
ఆకలి కి సమస్త వృత్తులు మోకరిల్లినప్పుడు ఆకలిని జయించగల ధీరులెవ్వరు స్వాతంత్య్రం వచ్చింది ధనవంతులకే గాని పేదలకి కాదు ఈ దేశపు ఆకలికి ఖాళి గిన్నె ఒక ఉదాహరణ. డెబ్భై ఏళ్ళ స్వాతంత్య్రం సాక్షిగా సగం ఆకలిని తీర్చుకోలేని పడుచు తల్లులెందరో. ఖాళీ గిన్నె నిండా  ఆకలి మెతుకు గోస నే..ఖాళి గిన్నె ని ప్రతీక గా చేసుకొని ఆకలి, పేదరికం  వస్తువు గా చేసుకొని రాసిన కవిత ఖాళీ గిన్నె నేటి పరిస్థితికి అద్దం పడుతుంది. (ఖాళి గిన్నె). ఒక నెత్తుటి మరక ని విదిలించిన నరమేధం అక్షరాల్లో ఎలా బంధించగలం.
కళ్ళ ముందు రక్త చరిత్ర లు మెదులుతనంటే కలం ముందుకు కదులుతుందా ఏమో వేరే ఎవరికైనా సాధ్యం కాకపోవచ్చు గాని ఈ కవి కి మాత్రం సులభమే. పౌరసత్వపు పురిటి నొప్పుల ని తానూ పల్లవిరుస్తు అక్షరాలన్నీ కూర్చాడు. నెల్లి నరమేధానికి అక్షర నీరాజనం పట్టాడు.
నెల్లి నరమేధం ఒంటికాలి మీద నిలబడింది/శరణాగత వాత్స్లా దేశానికిప్పుడు మల్లి తొమ్మిది నెలలు నిండిపోయాయి/ ఇలాంటి నరమేధాలు/పౌరసత్వాన్ని అడ్డుకునే రాజ్య ప్రయత్నాలు ఆగాలంటే ప్రజాస్వామ్యం ఒకటే దిక్కంటాడు చివర్లో : మీట నొక్కే బోతనువెళ్ళు మాత్రమే కావాలి/ద్రోణాచార్యుడి మంత్రసాని/ ఏమైనా పౌరసత్వం పేరు తో సాగుతున్న దమన కాండ కి చరమగీతం పడాల్సిందే.
మన దేశ గొప్పతనం గురించి ఎంత గొప్పగా చెప్పిన వెనుకబాటుతనాన్ని దాచలేము. రాకెట్లు ఎగిరేసే కాలం లో స్త్రీల మరుగుదొడ్ల సమస్య ని పరిష్కరించలేని ప్రభుత్వాలకి ఈ కవిత ఒక చెంపపెట్టు. ఊళ్లలో, నగరాల్లో రైలు పట్టాల పక్కనో, ఇంకా ఎవరూలేని ప్రదేశం లో స్త్రీలు పడుతున్న  అవస్థలకి ప్రతిరూపం ఎంత వేదనో ఈ కవిత నిండా…
“అరచేత్తో పట్టుకున్న రబ్బరు చెంబు నిండా
సిగ్గుతో తలలోతు మునిగిన
సప్త సముద్రాలు ఉప్పెన ల పొంగి పొర్లుతాయి
బొంతమ్మీదనుంచి బయల్దేక
ఆమెదోక సజీవ శవ యాత్ర ” ఎన్ని అడ్డంకులో , మరెంత సిగ్గుతనమో స్త్రీలకి కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వాలు గొప్పతనాలు ఎందుకు ? (ABCDF మా ఊరిప్పుడు ODF) చాలా ఆలోచింపచేసే చక్కని కవిత.  ఈ దేశం లో బహిరంగ మల విసర్జన రహితమైన వాతావరణం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన అభివృద్ధి .
ఆకలి అవసరం మనిషి చేత ఎంతటి పని అయినా చేయిస్తుంది కడుపు నింపుకోడానికి పడుపు వృత్తి లో దిగిన ఎందరో మహిళ ల బాధకి “ఇదం శరీరం” ఒక సజీవ ఉదాహరణ. శరీరానికి దేశ, భాష, ప్రాంతం తో పనిలేదు కావలసిందల్లా డబ్బు.  విధిలేని పరిస్థితుల్లో ఆకలి ఆ పని చేసితే ఎంతగా వేదన చెందుతారో…
“వీరోచిత జాతి ఆయుధాగారం లాంటి శరీరం
నిర్బంధ కూలితనంలోనో, గతి లేని అలితననంతోనో బానిస రాగం తీస్తుంది.
అవయావల ఒక్కొక్కటి తెంపుకుంటున్నప్పుడు/కన్నా తల్లి తండ్రులు గుర్తొచ్చి రోదిస్తుంది./ ఎంత అమానవీయమో కదా. కడుపు చేత పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతూ తన అస్తిత్వాన్ని చెరిపేసుకుంటుంది
“పుట్టిన నేల మీదనుంచి ఎక్కడికెకెక్కడికో ఎగిరెగిరి
విస్తరాకుల పిగిలి పీలికలౌతుంది”  (ఇదం శరీరం)
ప్రజలని మోసం చేసే నాయకులుంటారేమో కానీ నాయకులని మోసం చేసే ప్రజలు ఉండరు ఇది తరతరాలు గా నిరూపితం అవుతూనే ఉంది. పేదరికం రూపు మారాలని యత్నం చేసున్న కూడా సఫలం కావు. కానివ్వవారు ఎందుకంటే పేదరికం రూపు మాపితే నాయకుల కి పని ఉండదు.  శ్రామిక జీవిని తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు అందుకే విప్లవ భావాల్ని డబ్బు ఎర చూపి అణగదొక్కస్తున్నారు సబ్సిడీ లు తాయిలాలు పేరు తో పేదవాడిని/శ్రామికుడిని  వంచిస్తున్నారు
“చెల్లని నాణెం లాంటి పేద దేశం ముఖం మీద //కనబడని నాలోగో సింహం లా మీసం మెలేయి //సమన హక్కులడిగి సబ్సిడీ లో పని మెట్లు తీసుకో/పేదరికం చేతి వృత్తుల్లో భజనలు చేస్తే  కిలో ఆకలి రూపాయి కి తీరిపోయే పండుగ కానుకలిస్తాడు (పేదరికం పై గెలుపు).
ఈ కవితా సంపుటి లో మొత్తం ఎనభై తొమ్మిది కవితలు వేటికవే ప్రత్యేకం. ఒకదానికి  మరొకదానికి  పోలిక ఉండదు. చాలా కవితలు ప్రతీకాత్మముగా ఉంటాయి. కొత్త రకపు అభివ్యక్తి తో శైలి తో ఆద్యంతం ఆకట్టుకుంటాడు. అందరు తీసుకునే ప్రతీకలు కాకుండా భిన్నవి తీసుకోవడం లో నే ప్రతిభ కనిపిస్తుంది. అనుభూతి ని అక్షరాల్లోకి ఒడుపు గా  ఒంపుకోవడం అంత తేలికైన విషయమేమి కాదు.  తన మూడేళ్ళ కష్టానికి ప్రతిరూపం ఈ అద్వంద్వం. అయితే ఈ సంపుటి ని మాములు కవితా సంపుటి లా చదివితే ఒక్క ముక్క అర్ధం కాదు. చాలా లోతు కి వెళ్లి ఒక్కొక్కటి రెండు సార్లు చదివితేనే గాని కవిత భావం ఏమిటో తెలుసుకోలేము. కవిత్వం సంక్లిష్టమైనది అని పాఠకుడు భావించినా కాస్త ఓపిక తో అర్ధం చేసుకుంటూ ఆసాంతం చదవగలిగితే నిజంగా మనల్ని చాలా కాలం వెంటాడుతుంది .
ప్రశ్నల శరాలు సంధించి సమాధానం కోసమై ఎదురు చేస్తున్నాడు ఈ కవి.  కవి ఎప్పుడు ప్రజల పక్షమే. తన కవిత్వం అక్షరం అహరహం ప్రజలకోసమే అంటూ మంచి కవితా సంపుటి ని అందించాడు. అద్భుతమైన శైలితో, అభివ్యక్తి తో ముందుకు సాగుతున్న శ్రీరామ్ కి అభినందనలు.
*

పుష్యమీ సాగర్

2 comments

Leave a Reply to Bhanu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు