ఎల్లా పుగళుమ్ ఇఱైవనుక్కే – ఇది ‘దళపతి’ రజనీకాంత్ డైలాగు కాదు, ‘ఇళయదళపతి’ విజయ్ పాట కాదు. 22 – ఫిబ్రవరి – 2009 నాడు, ఎ. ఆర్. రహమాన్ ఆస్కార్ పురస్కారం అందుకున్నప్పుడు అకాడమీ సాక్షిగా చెప్పిన మాట. నిజమే, “సకల ఘనత, స్తోత్రం(ప్రెయిజ్) నీకే” అంటూ – భక్తి తో తల ఎత్తి దేవుడ్ని చూస్తూ అనొచ్చు లేదా తల వంచి గౌరవంతో అనొచ్చు. బహుశా, కాంతారా క్లైమాక్స్ తర్వాత అందరిలో కలిగే, మాటల్లో చెప్పలేని అనుభూతి లేదా భావన ఇదేనా?
కాంతారా సినిమా చూసొచ్చాక, దాని గురించి మాట్లాడకుండా ఉండలేము, మరీ ముఖ్యంగా ఆఖరి సన్నివేశం. సినిమాలో వృధా సన్నివేశాలేమి లేకపోవడం, ఎడిటింగ్ చాలా నీట్ గా, జంప్ లేకుండా ఉండటం, లైటింగ్ అండ్ కలర్ స్కీమ్స్ కరెక్ట్ గా ఉండటం, ఇలా క్రాఫ్ట్స్ పరంగా మంచి సినిమా. ఇక, సినిమా మీద కొన్ని రివ్యూస్, ఆర్టికల్స్ చదివినప్పుడు ఏదో ప్రశ్న. ముఖ్యంగా ఈ సినిమా, దళితుల కథని, దర్శకుడు చెప్పిన తీరు బాగుంది అని, ఇది మట్టి కథ అని… ఇలాంటివి చదువుతున్నప్పుడల్లా ఓ ప్రశ్న – నిజంగానే ఆ రచయిత, దర్శకుడు దళితుల కథ లేదా మట్టి కథనే చెప్పాడా? వారి కథని చెప్పేంత ఆలోచనా దృక్పథం ఉన్నవాడేనా?. అతని ఇంటర్వూస్ లో దైవం, ధర్మం, కల్చర్ అనే అన్నారు తప్ప, ఎక్కడ దళితుల కథ అని అనలేదు. ఎందుకంటే, ఈ భూత కోలా ని, అక్కడ తులు ప్రాంతంలో ప్రదర్శించేది, దళిత కులం వారే (నాళికే, పంబడ లేదా పరవా). ఆ కళను వాడుకుంటూ రచయిత, దర్శకుడు, కమర్షియల్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీశారు తప్ప, ప్రత్యేకించి ఆ అంశాల మీద కాదు అనిపించింది. ముఖ్యంగా, చివరి సన్నివేశం లో వచ్చే ఆ ఫ్యూషన్ మిక్స్ పాట ‘వరాహ రూపం’, ‘తైక్కుడం బ్రిడ్జి’ అనే బ్యాండ్ వారి, ‘నవరసం’ అనే పాట కాన్సెప్ట్ (ఆడియో+వీడియో) కి చాలా దగ్గరగా ఉంది అనిపించింది. దీనిపై ‘తైక్కుడం బ్రిడ్జి’ వారు కేసు వేసినట్టు వార్త కూడా వచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా కి అసలు ప్రేరణ, ‘పింగారా’ అనే తులు భాష సినిమా అని నా నమ్మకం. అవును, కథా వస్తువు, సన్నివేశాలు, కొన్ని అంశాలు దాదాపుగా అన్నీ అవే. ‘పింగారా’ కి 2020 లో ‘నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తులు’ అవార్డు వచ్చింది. అంతే కాదు, అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. ప్రీతం ఆర్ శెట్టి దీనికి దర్శకుడు. అయితే ఈ సినిమాని లోకల్ థియేటర్స్ లో విడుదల చేశారా లేదా అనేది తెలియదు. ఏ ఓటీటీ కి కూడా ఇవ్వలేదు. ఇందులో లేవనెత్తబడిన, చూపించిన అంశాలనే, కాంతారాలో కమర్షియల్ కోణంలో తీశారు. కానీ పింగారా లో మాత్రం, వివక్ష కి గురయ్యే కులం వారిని, వారి వస్త్రధారణ తో సహా వీలైనంత వరకు సహజం గా చూపించారు. వారిని, అగ్రకుల పెద్ద(జమీందార్) మరియు వారి కుటుంబం ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది, చూపించారు. అలాగే వివక్ష కులం వారి వాతావరణాన్ని కూడా వీలైనంత వరకు సహజం గానే చూపించే ప్రయత్నం జరిగింది. మరియు వారే తిరిగి, భూత/దైవ కోలా కట్టడాన్ని చూపిస్తాడు, ఇంటర్వెల్ సీన్ లో. అంతే కాదు, కంబళ క్రీడ ని చూపిస్తాడు. భూముల విషయంలో, ప్రభుత్వ చట్టాల సాయంతో తిరగబడాలనుకున్న వ్యక్తిని ఏ విధంగా అణచివేస్తారో చూపిస్తారు. అలాగే ఇంటర్వెల్ సీన్ లో, దైవం “ఓ పని చేస్తేనే, నేను కరుణిస్తా” అంటారు. ఆ సీన్ తర్వాత, జమీందార్, ఆ వేషం కట్టిన వ్యక్తి ని కలిసి ‘ఇది చెప్పింది దైవమా లేక దైవ పేరిట నీవా’ అని అడుగుతాడు. ఇది “దైవమే చెప్పిందని ఇలా కాకపోతే, నే రక్తం కక్కుకు చస్తా” అని అంటాడు. ఇవన్నీ కాంతారాలో లేవంటామా.
ఇలా దాదాపు అన్ని అంశాలు అక్కడివే. కాకపోతే అక్కడ కథ ,”కులం మరియు దైవ న్యాయం” అనే అంశం పైన మలుపు తీసుకుని, నేటి ప్రపంచం లో అస్సలు సాధ్యం కాని, ఓ మంచి క్లైమాక్స్ తో ముగుస్తుంది. నిజమే ఉటోపియా అంటే అదే కదా. ఇప్పుడిదంతా, కాంతారాని విమర్శించడానికి కాదు. ట్రోల్ చేయడానికి కాదు. రివ్యూ అస్సలు కాదు- ఇది ఏదో మేథా ప్రదర్శన కూడా కాదు. కాంతారా ప్రేరణతో పింగారా అంటుంటే, కాంతారా సక్సెస్ తో పింగారా రిలీజ్ చేస్తారు అంటూంటేనే ఏదో తెలియని భావన. ఎంత యాదృచ్చికమైనా, పింగారాలో ఉన్న అంశాలే తనకి కూడా స్క్రిప్ట్ రాసేటప్పుడు వచ్చి ఉంటాయి అనే ఆలోచన ఒకింత నమ్మశక్యంగా లేదు.
పింగారా లో “అంటచబుల్స్” అంశాన్ని లేవనెత్తిన, చూపించిన దర్శకుడు, కేవలం దాన్ని సినిమా కి కథ వస్తువు గానే చూసుంటే, పింగారా కి అవార్డు రావడం వల్ల ఆ వర్గ ప్రజలకు ఏ ఉపయోగం లేదు అనేది నా ఆలోచన. అతనేం రంజిత్.పా కాదు కదా(నేను కూడా కాదులెండి). అలాగే అదే పాయింట్, ‘తైక్కుడం బ్రిడ్జి’ వారికి వర్తిస్తుంది. కాంతారా తీసిన దర్శకుడు ‘అంటచబుల్స్’ అనే అంశాన్ని ప్రస్తావించకపోయినా, దైవం, ధర్మం, ఫోక్, కల్చర్ అంటూ, తాను రిఫరెన్స్ గా తీసుకున్న పాయింట్స్ పైన బలం గానే అన్ని చోట్ల మాట్లాడాడు. ఒక ఇంటర్వ్యూ లో, ‘దైవం లేదా డెమి-గాడ్ ఈ ప్రకృతికి మరియు మానవాళి కి మధ్య వారధి’ అని తాను నమ్ముతాను అని, అదే తీసినట్టుగా చెప్పాడు. అదే మనకి కనబడుతుంది కూడా.
హీరో, హీరోయిన్ల పాత్రల పేర్లు ‘శివ-లీల’, హీరో ఉండే చెట్టు మేడ ఇంటి పేరు ‘కైలాస’. శివ కి ఆవేశం ఎక్కువ, కోపం వస్తే ముందు వెనకా ఆలోచించకుండా అతను చేసే పని ప్రాణాల మీదకే తెస్తూ ఉంటుంది. అతనికి నాశనం చేయడమే తెలుసు. ఇవన్నీ శివ ది డిస్ట్రాయర్ ని సూచిస్తే, క్లైమాక్స్ ముందు వచ్చే ‘శుద్ధి’ ఫైట్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ‘గుళిగా లేదా క్షేత్రపాలక’ ఫైట్, శివ ది సేవియర్ ని సూచిస్తాయి. అలాగే ‘వరాహరూపం’ పాట ద్వారా, హిరాణ్యాక్షుడ్ని చంపి భూమిని కాపాడిన వరాహావతారాన్ని కూడా చూపించాడనుకోవచ్చు. అలాగే విష్ణు, శివలు కలిసి అని కూడా అనుకోవచ్చు.
వరాహ రూపం దైవ వరిష్టం – వరాహ రూపం, విష్ణువు యొక్క అవతారం; దేవతలందరిలో సర్వోన్నతమైనది.
శివ సంభూత భువి సమజాత – శివుని సారాన్ని మూర్తీభవించినవాడు; భూమిపై వర్థిల్లుతున్నవాడు.
అలాగే కిశోర్ గారు వేసిన మురళి అనే పాత్ర లో అటు నేచర్ ని, లేదా విష్ణువు ని కూడా చూడొచ్చు. ఇంతకు ముందు వచ్చిన ‘గరుడ గమన, వృషభ వాహన’ లో కూడా శివ, విష్ణు, బ్రహ్మ ల కాంబినేషన్ వాడుకున్నారు, ‘పిల్లి ఏస(పులి వేషం)’ అనే ఫోక్ డాన్స్ ని కూడా చూపిస్తారు. దీనివల్ల ఏం ఇబ్బంది లేదు. సాంప్రదాయ ఫోక్ ఆర్ట్స్ ని గౌరవించుకోవడం ప్రశంసనీయం. సినిమా కథల్లో మైథాలజీ రెఫెరెన్సులు ఉండటమో లేదా ఎంత బాగా వాటిని వాడుకుని, దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడో, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. కాకపోతే, ఈ సినిమా విడుదలయ్యాక, అది మతం రంగు పులుముకుంది(ఇలా మతం రంగు అంటుకోవడం కొత్త ఏమీ కాదు). అది వ్యక్తిగతమే అయితే సమస్యేమీ లేదు. కానీ జరుగుతున్న ప్రాపగాండా, వేరేలా ఉంది. ఇదే విషయం పై, అందులో పోలీస్ గా చేసిన కిశోర్ కూడా, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
– “Why do we fail to see the color of Adharma in the practice of untouchability, which does not allow the person who wears the vesha of the same daiva into the house belonging to the upper caste feudals, and the cleansing with holy water when he enters their house?”
– దైవం వేషాన్ని ధరించిన వ్యక్తిని అగ్రవర్ణ/భూస్వామ్య వర్గాలకు చెందిన ఇంట్లోకి అనుమతించరు. అతను వారి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పవిత్ర జలంతో శుభ్రపరుస్తారు. మరి దీనిలో అధర్మం యొక్క రంగు కనపడట్లేదా అనేది కిశోర్ ప్రశ్న.
ఇక్కడ నా ఉద్దేశ్యం కూడా ఇదే. ఈ సినిమా లో, కల్చర్ ని ఫోక్ ఆర్ట్ ని దైవం అనే కాన్సెప్ట్ తో జతపరచి, కథని చూపించిన విధానం, ఆబాలగోపాలాన్ని అలరించింది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి వచ్చేటప్పుడు, మౌనంగా మనం ఓ తెలియని అనుభూతి లోకి వెళ్లడంలోను ఏ సందేహం లేదు. రచయిత దర్శకుడిగా, అతను నా మనసు గెలుచుకున్నాడు కూడా. ఇలా నేను తీయగలనా అనే సందేహాన్ని వేరే దర్శకులకి కల్గించాడు. తానే కాదు, కన్నడ ఇండస్ట్రీ లో ఇలాంటి గొప్ప లేదా మంచి సినిమాలు తీస్తున్న rrr గా పేరొందిన sssల పనితనం కూడా నాకిష్టమే. కాకపోతే ఈ సినిమాకి, మతం రంగు అద్దడం, అసలు ఆ కళని ప్రదర్శించే వారి గురించి పెద్దగా మాట్లాడకపోటం బాలేదని అనిపిస్తుంది., అన్నిటికీ మించి ప్రేరణ పొందిన సినిమా (లేదా బ్యాండ్ వారి ఆడియో వీడియో నుండి రిఫరెన్స్) కి అయినా తగిన క్రెడిట్స్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. ప్రేరణ పొంది ఉంటాడనేది నా వ్యక్తిగత నమ్మకం. ప్రేరణ పొందడం, పేయింగ్ హోమేజ్ లాంటివి ఎన్నో సినిమాల్లో మనం చూస్తాం.
ఓ నిజ సంఘటనను ఆధారంగా తీసుకుని, ఓ ఇంగ్లీష్ సినిమా వచ్చింది. అందులో ఓ కొత్త సాంగ్ జానర్ ని స్టైల్ ని కనిపెట్టి, ఓ గాయకుడు పాడుతాడు. అప్పటి జనం, దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోరు. సరిగా కొన్నేళ్ల తర్వాత అదే మ్యూజిక్/జానర్ తో వచ్చిన ఇంకొక మ్యూజిషియన్ ని మాత్రం సక్సెస్ చేస్తారు, బహుశా ఇక్కడ, దర్శకుడి నిజాయితీకి, దైవం మెచ్చి సాయపడిందేమో, అది దైవమే చెప్పాలి మరి.
*
నోట్ : తైక్కుడం బ్రిడ్జి వారు వేసిన కేస్ ని స్వీకరించిన కోర్టు, క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహ రూపం’ పాటను, సినిమాలోనూ మరియు అన్నీ ఆడియో /వీడియో ప్లాట్ఫారం ల నుండి తొలగించమని తీర్పు ఇచ్చింది.
చాల క్లుప్తముగా వివరించారు 👏
వెరీ బ్రిలియంట్, ఇన్ఫర్మేటివ్…. మీ డైరెక్షన్, విజువల్ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యపోయిన నాకు ఇప్పుడు ఇది చదివాక ఇంకా ఇంట్రస్టింగ్ గా ఉంది. మీ ఇతర రచనలు ఏవైనా ఉంటే చదవాలని…. లవ్ యు బ్రో
వెరీ నైస్ అనాలసిస్. ఆ బ్యాండ్ వాళ్ళ ఇన్స్ట్రుమెంటేషన్ అంతా ఎత్తేశారు. డైరెక్టర్ వివక్ష, అస్తిత్వానికి సంబంధించిన విషయాలు తను భావజాలంతో పెట్టలేదు.
మీరన్నట్టు ఇంటర్వ్యూలో మరో కోణంలో ఉన్నాయి.