పాడుబడిన గ్రామం (ఇరాక్ యుద్ధ ‘శిథిల’గాధ)

“ఈ కథ విన్నాక నీకేమనిపించింది?” ఆమె తల్లిని ప్రశ్నించింది. “తెలియదు.. నాకర్థం కాలేదు బిడ్డా. కానీ మనకు తోడు దేవుడు మాత్రమేనని నమ్ముతా” అంది తల్లి.

మూలరచన: హసన్ బ్లాసిమ్

అనువాదం: ఎయం.అయోధ్యారెడ్డి

హసన్ బ్లాసిమ్ పరిచయం

నవతరం సంచలన అరబిక్ రచయిత, సినీ దర్శకుడు హసన్ బ్లాసిమ్ ఇరాక్ దేశస్థుడు. 1973 జనవరిలో బాగ్దాద్ నగరంలో జన్మించాడు. 2000 సంవత్సరంలో స్వదేశం విడిచివెళ్ళి మరో నాలుగు సంవత్సరాలకి  ఫిన్లాండ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో “ది ఊండెడ్ కెమెరా” అనే చిత్రం చేస్తున్నప్పుడు పాలకుల వేధింపుల కారణంగా ఫిన్లాండ్‌కు శరణార్థిగా వెళ్ళిన అతనికి అక్కడ ఆశ్రయం దొరికింది. బ్లాసిమ్ ప్రస్తుతం ఫిన్లాండ్ పౌరసత్వాన్ని పొంది ఫిన్నిష్ ప్రసార సంస్థకు పనిచేస్తున్నాడు.

కవిత్వం, కథా, నవల, రేడియో, సినీ,నాటక రచన, దర్శకత్వం వంటి భిన్న ప్రక్రియల్లో అతడు అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపుతో

ముందుకు వెళుతున్నాడు. ఇరాక్ యుద్ధం, దాని పరిణామాలు; అమానవీయ ఆరాచకాలు, మారణహోమం, వివిధ ప్రాంతాలకు శరణార్థులుగా పోయిన వలస ప్రజల కడగండ్లపైన జలదరించే రోమాంచకమైన రచనలు చేసిన బ్లాసిమ్, సమకాలీన అరబిక్ సాహిత్యంలో తిరుగులేని రచయితగా, ఒక తిరుగుబాటు రచయితగా కొనసాగుతున్నాడు.

బ్లాసిమ్ తమ రచనలన్నీ అరబిక్ లోనే చేశాడు. ఆయన పలు రచనలు ప్రపంచంలోని వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. కొన్ని పుస్తకాలను ఒక్క ఇరాన్ మాత్రమే కాకుండా యావత్ అరబ్ దేశాలు నిషేధించాయి.

యుద్ధాన్ని నిరసిస్తూ బ్లాసిమ్ తీసిన ఆరడజనుకు పైగా లఘుచిత్రాలు సర్వత్రా ప్రశంసలు అందుకున్నాయి. ఫిన్నిష్ ప్రసార సంస్థ ‘వైల్’ కోసం నాలుగు లఘు చిత్రాలు చేశాడు. హసన్ బ్లాసిమ్ లఘుచిత్రాల్లో ‘ది ఊండెడ్ కెమెరా’, ‘యునెటన్’, ‘లుట్టాముక్సేన్ అర్వోయినెన్’,

ఎల్మా నోపియా కుయిన్ నౌరు’, ‘జురెట్’ ముఖ్యమైనవి.

సినిమాలపై రాసిన ఆంగ్లానువాద వ్యాస సంకనాలు ‘షార్ట్ ఫిలిమ్స్’, ‘పోయేటిక్ సినిమా’, ‘డైవింగ్ ఇంటు ఎక్సిస్టింగ్’, ‘ది ఊండెడ్ కెమెరా’ అంతర్జాతీయ ప్రజాదరణ పొందినయి. బ్లాసిమ్ వందల సంఖ్యలో కథలు రాసినప్పటికీ వాటిల్లో కొన్నిమాత్రమే ఇంగ్లీషులోకి అనువదించబడ్డాయి. ‘ది షియాస్ పాయిజండ్ చైల్డ్’, ‘మ్యాడ్ మన్ ఆఫ్ ఫ్రీడం స్క్వేర్’, ‘ది ఇరాకీ క్రైస్ట్’, ‘ది కార్ప్స్ ఎక్సిబిషన్’ సంపుటాలు ముఖ్యమైనవి. ఆయన రాసిన కథలే ముఖ్యంగా ఆయన్ని అరబ్ దేశాల పాలకులకు శత్రువును చేశాయి.

హసన్ బ్లాసిమ్ సరికొత్త నవల ‘గాడ్ 99’ ప్రపంచ సాహిత్యంలో ప్రస్తుతం సంచనాలు సృష్టిస్తున్నది. అలాగే ఇప్పటివరకు ఇండిపెండెంట్ ఫారిన్ ఫిక్షన్ అవార్డు గెలుచుకున్న ఏకైక అరబిక్ రచయితగా బ్లాసిమ్ అరుదైన ఫీట్ సాధించారు.

బ్లాసిమ్ ప్రసిద్ధ కథ “ది అబాండన్డ్ విలేజ్” కు ఇది నా అనువాదం.

*

“మిత్రమా..! నువ్విక్కడే వుండి మాకోసం ఎదురుచూడు. మేం నిన్ను తర్వాత కలుస్తాం. కానీ గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ సరిహద్దులు దాటి వెళ్ళొద్దు” వాళ్ళు వెళ్లిపోతూ చెప్పారు.  మౌనంగా విన్నాను. బదులుచెప్పకుండా పరిసరాలు గమనించాను. అదో పాడుబడిన పల్లెలా  కనిపించింది. ఒక్క మానవప్రాణి కూడా కనిపించక  నిశ్శబ్దం ఘనీభవించిన వల్లకాడులా భయం గొలుపుతుంది. అక్కడక్కడా ఇప్పటికీ ఒకటి రెండు గొర్రె మేకలు అనాధలుగా తిరుగుతున్నప్పటికీ, జనమంతా ఊరువిడిచి పారిపోయినట్టుంది.

నేనక్కడ ఎంతసేపు వేచి ఉండాలో తెలియదు. కాలక్షేపం కోసం చిన్నగా ముందుకు అడుగులేశాను.  ఖాళీగా, కూలి మొండిగోడలై మిగిలిన ఇండ్లను చూసుకుంటూ గ్రామపరిధిలోనే  తిరుగుతున్నా.

అట్లా చాలాసేపు నడిచాను. బాగా అలసిపోయి విశ్రాంతి అవసరమనిపించింది. నిజానికి నా ఈ కొత్త జీవితంలో విశ్రాంతికీ, కాసింత నిద్రకూ స్థానముందో లేదో తెలియదు. ఒక ఇంటి పైకప్పు మీదకు ఎక్కి యావత్ గ్రామాన్ని పరిశీలనగా చూసాను. సమీపంగా వున్న పట్టణాల్లో కొనసాగుతున్న భీకర యుద్ధం తాలూకు ఆనవాళ్ళు అక్కడివరకూ కనిపిస్తున్నాయి. యుద్ధ విమాణాల చప్పుడు, బాంబులమోత,  పాలక దళాలు జరిపిన దహనకాండల అవశేషాలు పొగమేఘాలై సుడులు తిరుగుతూ ఆకాశంలో మబ్బుల్తో పోటీ పడుతున్నయి. అప్పుడప్పుడు ఒకటిరెండు సైనిక హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో గగనతలంలో ఈదుకుంటూ పోతున్నయి.

ఊరు చుట్టూ నలువైపులా పత్తి పొలాలు కనిపిస్తున్నయి. విరబూసిన పత్తిపువ్వులను చూసే అవకాశం నాకు ఇంతకు ముందెన్నడూ కలుగలేదు. వాటిని డాక్యుమెంటరీల్లోనో, సినిమాల్లోనో చూసుండొచ్చు. కానీ సరిగా గుర్తులేదు. నా బతుకు బండి పయనం తొలుత ఒక బేకరీలో ప్రారంభమైంది. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్‌గా, చివరకు జైలు గార్డుగా పనిచేశాను. ఉద్యమం ప్రారంభమైనప్పుడు, నేను

ప్రతిఘటన దళంలో చేరిపోయి అక్కడే నా తుదిశ్వాస వరకు పోరాటం చేశాను.

చేలల్లోని పత్తిపువ్వులు దూరం నుంచి మంచుపొరల మాదిరి ఉన్నయి. కానీ అవిప్పుడు  వాడిపోయి వేలాడుతూ కృత్రిమంగా కనిపిస్తున్నయి. సూర్యతాపం పత్తిపూల అందాన్ని  కరిగించివేసింది.

ఎదురుగా ఒక ఇంటి పైకప్పు మీద ఒక అమ్మాయి కూర్చుని ఉండటం గమనించి ఆశ్చర్యపోయాను. నేనామెను చూశాను, కానీ ఆమె నన్ను చూడలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఒక చిన్న చెక్క స్టూలు మీద కూర్చొని తన పొడవాటి తలవెంట్రుకల్ని సున్నితంగా ఆకుపచ్చ దువ్వెనతో కదుపుతున్నది. తీవ్రమైన ఎండకు ఆమె చర్మం కమిలినట్టుగా కనిపిస్తుంది.

“అట్లాగే ఎండలో కూర్చుండు బేటీ… ఉన్నచోటు నుంచి ఎక్కడికీ కదలకు” కింద ఇంటిముందు వాకిట్లో నిలబడి ఒక మహిళ పెద్దగా అరిచి చెప్పింది. అదివిని అమ్మాయి విచారంగా తలాడించింది. దువ్వెన కిందపడేసి రెండుచేతులతో ముఖాన్ని కప్పుకుంది. దుఃఖం వల్లనో, విపరీతమైన అలసటవల్లనో కానీ, వాకిట్లో నిలబడిన స్త్రీ కళ్ళు బాగా ఉబ్బిఉన్నాయి. ఆమెకు తక్షణం నిద్ర అవసరమని నాకనిపించింది. వయసు ముప్పయి అయిదు వరకూ ఉండొచ్చు. పక్కా గ్రామీణ స్త్రీ. మనిషి బొద్దుగా, బలంగా వుంది.

నేను నించునివున్న మొండిగోడ మీది నుంచి కిందికి దూకి లోపలికి పోతున్న ఆమెను అనుసరించాను. ఆమె గది మధ్యలో కూర్చుని టీవీలో వచ్చే వార్తలను చూస్తున్నది. గొంగడితో కప్పబడిన ఒక కుర్చీలో ఆమె ఎదురుగా నిశ్శబ్దంగా కూర్చున్నాను.

పాలక దళాలు, ప్రతిఘటన యోధుల మధ్య ఇప్పటికీ తీవ్ర అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎక్కడవిన్నా మారణకాండ…

దహనకాండలు.. అత్యాచారాలు… బాంబు దాడులు, కాల్పులు. పల్లెలు, పట్టణాల్లో  ప్రజలు తమ ఇళ్ళనుండి బయటికి తరిమివేయబడ్డారు. వెంటాడి వేటాడబడ్డారు. ఆకలికి తట్టుకోలేని కొందరు చనిపోయినవారి కాలేయాలు కూడా తిన్నారు.

ఆ ఊరునుంచి జనమంతా వెళ్లిపోయినా కేవలం ఒక్క ఇంట్లో మాత్రం తల్లీకూతుళ్లు ఎందుకున్నారో నాకర్థం కాలేదు. ఏ బలమైన కారణం వాళ్ళని ఊరు విడిచిపోకుండా అడ్డుకుందోనని ఆశ్చర్యపోయాను. అక్కడేకాదు, ఎన్నో ఊళ్ళలో చాలామంది పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందడానికి పారిపోయారు.

బయట కుక్కలు ఎవరిమీదో కోపంతో క్రూరంగా మొరుగుతున్నయి. నేను బయటికి వెళ్లి చూశాను. ఇంటి ముందు వరుసగా ఇరవైకి పైగా కుక్కలు కట్టేసి ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఆ నడివయస్సు మహిళ మరోసారి వాకిట్లోకి వెళ్లి అమ్మాయిని పిలిచింది.

“సావ్సన్! ఇంకచాలు, కిందికి దిగిరా. వంటింట్లో అన్నం, సూప్ ఉన్నాయి. వెళ్లి తిను” అని చెపుతూ  తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం పిట్టగోడ దగ్గర్నుంచి సావ్సన్ చూసింది. వెళిపోతున్న  మహిళ చేతిలో ఒక సన్నటి తాడు ఉన్నది.

నేను కూడా లేచి ఆమెను అనుసరించాను. సమీపంలోని పట్టణాల్లో పాలకసైన్యాలు జరిపే బాంబుదాడులు, ఫిరంగుల మోత మావరకూ చేరి భీతిగొలుపుతుంది.

మహిళ మెల్లగా నడుస్తూ ఖాళీగా ఉన్న ఒక ఇంటి పశువుల కొట్టంలోకి పోయింది. అక్కడ విచిత్రంగా పశువులకు బదులు భయంతో

వొణికిపోతున్న ఓ కుక్క కనిపించింది. మహిళ దాని సమీపంలోకి పోయి తను తెచ్చిన కోడి మాంసం ముక్కను తీసి ముందు విసిరింది. కుక్క దాన్ని గాల్లోనే అందుకొని ఆత్రంగా తినసాగింది. ఆమె కుక్క తలమీద నిమురుతూ, మెల్లగా దాని మెడలో తాడు కట్టి కొట్టంలోంచి  బయటకు నడిపించింది.

నేను వెనుతిరిగి అమ్మాయి దగ్గరకు వెళ్ళాను. మిద్దెమీద ఎండలో ఉండీ ఉండీ వేడెక్కిన తలపై పెరట్లో పీపా లోంచి నీళ్ళను గుమ్మరించుకుంటున్నది. తర్వాత ఆమె బట్టలు కూడా మార్చుకోకుండా తడి బట్టలతోనే చెట్టునీడలో కూర్చుని చిన్నగా ఏడవసాగింది.

ఈలోగా కొట్టం నుంచి తీసుకొచ్చిన కుక్కని ఇంటి ముందున్న ఇతర కుక్కలతో పాటు కట్టేసిన మహిళ, ఓమారు నిర్జనగ్రామాన్ని నాలుదిక్కులా దిగులుతో పరికించి చూసింది.

నేనొక చెట్టెక్కి కొమ్మ మీద కూర్చున్నా. నా సహచరులు ఎప్పుడు తిరిగివవచ్చి సరిహద్దులు  దాటించేందుకు  సాయపడతారా అనే ఆలోచనల్లో మునిగాను. అందుకు ఎక్కువ కాలం పట్టదని కూడా ఆశించాను. కొద్దిసేపు చెట్టుమీద వాలుతున్న పక్షుల్ని, చెట్టుకి గుత్తులు గుత్తులుగా వేలాడే కాయలను, నీళ్ళు కారుతున్న అమ్మాయి తడి జుట్టునూ చూస్తుండిపోయాను. ముప్పయి నాలుగు వసంతాలు బతికిన నాజీవితంలోని జ్ఞాపకాల శకలాలు కళ్ళముందు కదలాడినయి.

ముప్పయి నాలుగేళ్ళంటే వాస్తవానికి చాలా తక్కువ ఆయుర్దాయం. కానీ, అందుకు నాకెలాంటి విచారంగానీ, పశ్చాత్తాపంగానీ లేదు.

నేను ధైర్యంగా ఉన్నాను, భవిష్యత్ తరాల జ్ఞాపకాల్లో, చరిత్రలో నా పేరు ప్రతిధ్వనిస్తుంది.

మహిళ పెరట్లోకొచ్చి కూతురుకి  ఏదో తినమని చెప్పింది. దానికా అమ్మాయి కోపంతో తల్లిమీద గట్టిగా అరిచింది. ఆమె అరుపులకి చెట్టుమీద కొన్ని పక్షులు ఎగిరిపోయాయి. తర్వాత  పెద్దగా ఏడుస్తూ తన రెండు చెంపల మీద అదేపనిగా గట్టిగా కొట్టుకుంది.

“నువ్వెంత చెప్పినా నేను తినను. రోజూ ఇట్లా ఎండలో మాడి చచ్చేకంటే ఆకలితో చావడమే మంచిది” అన్నది.

తల్లి ధోరణి తనని ఎంతలా బాధిస్తున్నదో అమ్మాయి మాటలు స్పష్టం చేశాయి. అప్పటికీ తల్లి మౌనంగా ఉండటం చూసి, “నువ్వసలు నా తల్లివేనా..? నువ్వో పరమ మూర్ఖురాలివి, క్రూరురాలివి. అందుకే  నేను చచ్చిపోయి నిన్ను సాధించాలనుకుంటున్నా” అన్నది కసిగా.

మహిళ సావ్సన్ దగ్గరగా వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని లాగింది. అంతలోనే ఏమైందో… హఠాత్తుగా ఆమెకూడా కూతురి పక్కన కూలబడి చెట్టు మొదలుకు తలానించి పెద్దగా ఏడవసాగింది. సావ్సన్  తల్లి ఒడిలో వాలిపోయి వెక్కిళ్లు పెట్టింది.

అమ్మాయికి పదిహేను మించి ఉండవు. సన్నగా, అందంగా ఉన్నది. చూపులు వింతగా, నిశితంగా, తనకు తెలియని ఏదో కూపంలో మునిగిపోతున్నట్టున్నాయి. అసలక్కడ ఏం  జరుగుతుందో, తల్లీకూతుళ్లు ఎందుకట్లా దుఃఖిస్తున్నారో నాకర్థం కాలేదు.

ఇంతలో మహిళ దగ్గరున్న సెల్ఫోన్ మోగింది. ఫోనెత్తి ఆమె ఎంతో ఆరాటంతో మాట్లాడింది. తన భర్త కోసం తీవ్రంగా గాలించమని

అవతలివారిని ప్రాధేయపడుతున్నది. ఆమెతో మాట్లాడేదెవరో, ఎక్కడున్నారో తెలుసుకొని నాకతన్ని కలుసుకోవాలనిపించింది.

అతని కోసం వెతికి చూడటం పెద్ద కష్టం కాకపోవచ్చు.  కానీ గ్రామం దాటలేను. సరిహద్దులు దాటి బయటికి వెళ్లరాదని మావాళ్ళు హెచ్చరించి పోయారు. నేను నియమాన్ని ఉల్లంఘించలేను.

మావాళ్ళు ఇంకా రాలేదు. యాంత్రికంగా రోజులు… వారాలు గడిపోతున్నయి. సావ్సన్, ఆమె తల్లి తప్ప ఆ నిర్జన గ్రామంలో నాకు తోడనేవారెవరూ లేరు. ప్రతిరోజూ ఆ మహిళ తన కుమార్తెని ఇంటి పైకప్పు మీద ఎండలో కూర్చోమని  బలవంతం చేస్తూనే ఉన్నది. అలాగే తరచూ తన భర్త ఆచూకీ కోసం ఎవరెవరికో ఫోన్లు చేస్తూనే ఉన్నది.

పాలన దళాలు ఏ క్షణంలోనైనా గ్రామాన్ని చుట్టుముట్టి విరుచుక పడొచ్చు. బీభత్సం సృష్టించవచ్చు. కానీ అది యుద్ధమైనా, జీవితమైనా వాస్తవానికి  ఇప్పుడు నన్ను భయపెట్టలేవు. నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఇంక ఒక్క అడుగు మాత్రమే వేయవలసి ఉన్నది.

సావ్సన్, ఆమె తల్లి మధ్య జరుగుతున్నదేమిటో నాకు క్రమేపీ అర్థమైపొయింది. కేవలం భర్త చెప్పిన ఒకమాట కారణంగా ఆ మహిళ గ్రామస్తుల మాదిరి ఊరొదిలి వెళ్లిపోకుండా ఇక్కడే  ఉండిపోయింది. జనం పోవడానికి కొన్నిరోజుల ముందు ఆమె భర్త ఆమెకు ఫోన్ చేశాడు. తను తొందర్లోనే ఇంటికొచ్చేస్తానని, తానొచ్చేవారకూ ఊళ్లోనే వేచివుండమనీ చెప్పాడు. తాను తప్పించుకోబోతున్నట్టు కూడా అతడామెకు తెలిపాడు. అతడు సమీపంలోని ఒక పట్టణంలో విపక్షదళాలతో పోరాటం చేస్తూ హఠాత్తుగా కనపడకుండా పోయాడు. అప్పట్నుంచి అతడేమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలువలేదు.

భర్త లేకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోయేందుకు ఆమె భయపడింది. తను ఇంతకాలం నివసించిన పల్లెలో  ఆమెకు తెలిసిన జీవితం చిరిగి పేలికలైంది. ఇప్పుడా మహిళ ప్రతిదినమూ ఒక పీడకల మాదిరి బతుకు వెళ్లదీస్తున్నది. పాలన సైన్యాలు అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నట్టుగా ఆమె వింటున్నది. జనం వాళ్ళని మనుషుల్ని పీడించే “దయ్యాలు”గా పిలుస్తుంటారు. ఎంతోమంది అమ్మాయిలు, స్త్రీలపై వాళ్ళు అత్యాచారాలు జరిపారని, ముఖ్యంగా తెల్లటి వొంటి ఛాయ కలిగిన ఆడాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ అఘాయిత్యాలు చేస్తున్నారని కూడా ఆమె వినివున్నది. ఆవెంటనే ఆమె చక్కటి మేనిఛాయ గల్గిన తన కూతురు ఒంటి రంగును పాడుచేయాలన్న నిర్ణయాని కొచ్చింది. అందుకోసం గంటలు గంటలు ఎర్రటి ఎండలో కూర్చోమని కూతుర్ని బలవంత పెడుతూ వొచ్చింది.

బిడ్డ చర్మం కాలిపోయిన రొట్టె మాదిరి అయితే సైనికులు తన కుమార్తె జోలికి రాకుండా వుంటారని గట్టిగా నమ్మింది. అంతేకాదు, స్వీయ రక్షణ కోసం ఆమె ఇతర మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నది.

ఆమె వద్ద ఒక చిన్న పిస్తోలు కూడా ఉన్నది. దగ్గరకెవరైనా వస్తే భయపెట్టి తరుముతాయన్న  ఆశతో గ్రామంలోని ఊర కుక్కలన్నింటినీ సమీకరించి ఇంటి ముందు కట్టేసుకుంది.

తల్లిలాగే సావ్సన్ భయపడింది. చాలాసార్లు ఎక్కడికైనా పారిపోవాలని కూడా అనుకుంది. కానీ ఎక్కడికి వెళ్లాలో, సురక్షితమైన చోటంటూ ఎక్కడుందో ఆమెకు తెలియదు.

ఒకరోజు రాత్రి నేను పాత చెక్క బెంచీమీద పడుకుని ఉన్నాను. నా బెంచీకి దగ్గర్లోనే ఆ మహిళ కార్పెట్ మీద కూర్చుని,  సావ్సన్

కమిలిన చర్మం మీద చేత్తో సున్నితంగా నిమురుతూ టీవీలో వార్తలు చూస్తున్నది. ఆమె బిడ్డ ముఖాన్ని నీటిలో ముంచిన చల్లటి బట్టతో తుడిచింది. ఎక్కువగా మంచినీళ్లు తాగమని చెపుతున్నది. అమ్మాయి మానసిక స్థితి ఏమాత్రం బాగున్నట్టులేదు. ఇంతలో కరెంటు పోయింది, తల్లి ఒక దీపం వెలిగించిపెట్టి, ఆపై ఫోన్ చేయడానికి వాకిట్లోకి పొయింది.

సావ్సన్ టీవీస్టాండు మీదున్న లావుపాటి పుస్తకాన్ని తీసుకున్నది. ఇంట్లో కేవలం రెండే పుస్తకాలు ఉన్నాయి.  ఒకటి ఖురాన్ కాగా, మరోటి నీతి కథల పుస్తకం. సావ్సన్ తండ్రి ఆమెకు పదేళ్ళప్పుడు కథల పుస్తకం కొన్నాడు.

బయటి నుంచి తిరిగి వచ్చిన తల్లి సావ్సన్ దగ్గర కూర్చున్నది. ఆమె ముఖంలో చిక్కటి దిగులు గూడుకట్టింది. ఫోన్ చేసిన తర్వాత నిరాశ, తీవ్రమైన మనస్తాపానికి గురైనట్టుంది. “నేనో కథ చదువుతాను వినమ్మా..” సావ్సన్ అన్నది.

షంషెద్దీన్ అనే ఒక నిరంకుశ రాజు. ఎంతసేపూ వినోదాలు విలాసాల్లో మునిగితేలేవాడు  తప్పితే అతడు  ప్రజల బాగోగులు, ఆందోళనలను ఏనాడూ పట్టించుకోలేదు. అతనికి ఒక అందమైన ఏనుగు ఉన్నది. ప్రజలకంటే ఏనుగును ఎక్కువ చూసుకున్నాడు. అదంటే అతనికి వల్లమాలిన ప్రేమ. ఏనుగు గురించి ఎవరు తేడాగా మాట్లాడినా, దానికి కించిత్తు హానిచేసినా నియంత సహించేవాడు  కాదు. అసలు ఏనుగువెళ్ళే దారిలో ఎవరు నిలబడినా సహించడు. ఏనుగు విచ్చలవిడిగా తిరుగుతూ తనకెదురైన.. అడ్డుగావున్న ప్రతిదాన్ని విచ్ఛిన్నం చేస్తూ వీధుల్లో, మార్కెట్లలో బీభత్సం సృష్టిస్తుంది. ఇది నగర ప్రజలకు చాలా హాని కలిగించింది. కాని ఎవరూ నోరు తెరవలేదు. రాజు ఆగ్రహానికి గురవుతామన్న భయంతో ఏమీ చేయలేయలేక నిస్సహాయులయ్యారు.

ఒక రోజు నగర ప్రజలు ఒకచోట సమావేశమై ఏనుగు కదలికలను నియంత్రించాలని, లేదా దాన్ని నగరం నుంచి బహిష్కరించమని రాజుకు విన్నవించాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి రాజభవనంలోకి పోయారు. కాని అక్కడ మహారాజు షంషెద్దీన్ కనిపించగానే వాళ్ళంతా విపరీతంగా భయపడి పారిపోవాలానుకున్నారు. ఈలోగా రాజుగారి సైనికులు, కాపలాదారులు చుట్టుముట్టారు. పారిపోయే అవకాశం లేక వాళ్ళు వెనక్కొచ్చారు. కాపలాదారులు వెనుకున్న ద్వారాలను మూయకపోతే, వాళ్లంతా పారిపోయేవారే.

భయాందోళనల వల్ల నెలకొన్న సుదీర్ఘ నిశ్శబ్దం తరువాత, ఒక వృద్ధ షేక్ మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.

“మహారాజా.. తమరి ఏనుగు..” అంటూ నసిగాడు. తను చెప్పబోయే మాటని  తనవెంట వొచ్చినవాళ్ళు పూర్తిచేస్తారని భావించి ఆగిపోయాడు. కానీ ఎవరూ ధైర్యంచేసి పెదవి విప్పలేదు. షేక్ ఒంటరైపోయాడు.

షంషెద్దీన్ కోపంగా “నా ప్రియమైన ఏనుగుకు ఏమైంది..? మాట్లాడండి” గద్దించాడు.

షేక్ భయంతో వణుకుతూ ఆ గండం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.

“ఏనుగు మరీ ఒంటరిదైపోయింది మహారాజా..! దానికో తోడు అవసరం. అందుకోసం ఇంకో ఏనుగు రాకూడదా?” అన్నాడు.

దీనికి షంషెద్దీన్ సంతోషంగా తలూపుతూ పెద్దగా నవ్వాడు.

“నువు చెప్పింది నిజమే. నీ సూచన నాకు నచ్చింది. తెలివైనవాడివి” మెచ్చుకున్నాడు.

ఆవెంటనే “మంత్రులారా, నా ప్రియమైన ఏనుగుకు తోడుగా మరో ఏనుగును తక్షణం తెప్పించండి” అని ఆదేశించాడు.

అట్లా మహారాజుకు మరో ఏనుగు వొచ్చింది. దాంతో నగర ప్రజల పరిస్థితి మునుపటి కంటే అధ్వాన్నంగా తయారైంది. అందుకని వారు వెళ్లి మరోసారి రాజుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కానీ మొదటిసారి జరిగిన సన్నివేశమే పునరావృతమైంది. వాళ్ళు భయంతో చెప్పాలనుకున్నది చెప్పలేక మూడో ఏనుగు తెప్పించమని రాజును కోరారు.

అట్లా నగర ప్రజలు రాజ భవనానికి మళ్లీ మళ్లీ వెళ్లారు. వెళ్ళిన ప్రతిసారీ రాజు మరొక ఏనుగును తీసుకురావాలని ఆదేశించాడు. చివరికి నగరమంతా ఏనుగులతో నిండిపోయింది.  అక్కడ బతకలేక ప్రజలు ఒక్కొక్కరుగా వలసలు పోయారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ దుస్థితికి తనపక్కవారి పిరికితనమే  కారణమని ఇతరులను నిందించారు.

కొద్దిరోజుల్లో పట్టణంలో ఎవరూ మిగల్లేదు. ప్రజల స్థానంలో ఏనుగుల జీవనం సాగింది. ఇప్పుడక్కడ ఏనుగులదే ఇష్టారాజ్యం.

“ఈ కథ విన్నాక నీకేమనిపించింది?” సావ్సన్ తల్లిని ప్రశ్నించింది.

“తెలియదు.. నాకర్థం కాలేదు బిడ్డా. కానీ మనకు తోడు దేవుడు మాత్రమేనని నమ్ముతా” అంది తల్లి.

సావ్సన్ మరో కథ చదువుకుంటూ పోయింది. ఆమె తల్లి లేచి వంటగదిలోకి వెళ్లి, కొంచెం రొట్టె, నేరేడుపండు జామ్ తో తిరిగొచ్చింది.

ఇంతలో హఠాత్తుగా బయట కాల్పుల శబ్దం వినిపించింది.

ఆ మహిళ చప్పున వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేసింది. నేను బయటికొచ్చి చూశాను. అక్కడ ఐదుగురు ప్రతిఘటన దళ సభ్యులు ఒక పైలట్‌ను వెంబడించడం కనిపించింది. వారతని హెలికాప్టరును పేల్చివేసి, పారాచూట్ ద్వారా పైలట్ దిగిన ప్రదేశానికి వెళ్ళి అతన్ని కనుగొన్నట్టు తెలుస్తుంది. పైలట్ వద్ద చిన్న పిస్తోలు మాత్రమే ఉంది. వాళ్ళతన్ని కలష్నికోవ్స్(రష్యాలో తయారైన మరతుపాకులు) తో వెంటాడుతున్నారు. పైలట్ పరిగెడుతూనే మూడు షాట్లు కాల్చాడు. అతడు సావ్సన్ ఇంటిని దాటిపోయాడు.

నేను తిరిగి ఇంట్లోకి వెళ్ళాను. తీవ్రంగా భయపడిన సావ్సన్ తల్లి వార్డ్రోబ్ నుంచి తన పిస్తోలు బయటకుతీసి కుమార్తె పక్కన కూర్చున్నది.

పైలట్ పరిగెత్తి ఒక ఇంట్లో దూరాడు. వాళ్ళు  ఆ ఇంటిని చుట్టుముట్టి అతన్ని లొంగిపోవాలని హెచ్చరించారు. అతనికి గత్యంతరం లేకపోయింది. తనవద్ద బుల్లెట్లు అయిపోయాయి. ఇతర మందుగుండు సామగ్రి ఏమీలేదు. తలపై చేతులుంచుకొని బయటకొచ్చాడు.

పైలట్ మీద వాళ్ళు ఒక్క ఉదుటున విరుచుకు పడ్డారు. అతన్ని నేలమీద పడేసి ఇష్టమొచ్చినట్టు తన్నారు. పైలట్ బాధ భరించలేక పెద్దగా కేకలేశాడు. అప్పుడు వాళ్లతన్ని పైకి లేవమని చెప్పారు.  వాళ్ళలో ఒకరు అతన్ని కత్తితో పొడిచాడు. ఆపైన ఇతరులు కలిసి పైలట్ దేహాన్ని తూట్లు పొడిచారు.  అతడు నేలకూలి సొంత రక్త కొలనులో తేలియాడాడు.

ఈలోగా ఒక సాయుధుడు ఎక్కడినుంచో కొంత గ్యాసోలిన్ తీసుకొచ్చాడు. మరుక్షణం పైలట్ దేహం మంటల్లో కాలింది. అతని సహచరుల్లో ఒకరు, దహన దృశ్యాన్ని సెల్ ఫోనులో వీడియో తీయసాగాడు. అందరూ ముక్తకంఠంతో దేవుని పేరుతో నినాదాలు చేశారు. తర్వాత వారు తిరిగి తమ వాహనం ఎక్కి వెళుతూ విజయోత్సాహంతో గుడ్డిగా తుపాకులు కాల్చడం ప్రారంభించారు.

సావ్సన్ ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు ఇంటిముందు పెద్ద సంఖ్యలో కుక్కల్ని కట్టేసి ఉండటం కనిపించింది. అది చూసిన వాళ్ళలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ట్రక్కు నుంచి దిగిపోయి  కుక్కలపై బుల్లెట్లతో పిచికారీ చేశారు.

లోపల తల్లీకూతుళ్లు గడగడ వణికిపోయారు. బయట ఉన్నవారు నరరూప రాక్షసులుగా భావించారు. వాళ్ళిప్పుడు ఇంట్లోకొస్తారు. సర్వనాశనం చేస్తారు. జరగబోయేది తలుచుకున్న ఆమె, తక్షణం కూతురి తలలోకి బుల్లెట్ పేల్చి, ఆపైన పిస్తోలు కనబడకుండా తన చీరలోపల తొడలమధ్య  దాచిపెట్టింది.

తుపాకుల మోత, కుక్కల అరుపుల కారణంగా, సాయుధవ్యక్తులకు  ఇంటి లోపల పిస్తోలు పేలిన శబ్దం వినిపించలేదు.

బయట చిట్టచివరి కుక్క ప్రాణాలు వదిలిన తర్వాత అక్కడ నిశ్శబ్దం అలుముకున్నది. వాళ్ళు వ్యానెక్కి వెళ్లిపోయారు. ఇంట్లో ఆ తల్లి రెండు చేతులతో పిస్తోలు పట్టుకొని మోకాళ్లపై విగ్రహంలా కూర్చొని ఉన్నది. అదేపనిగా ఎండలో కూర్చొని నల్లగా కమిలిన చర్మంమీద రక్తపు మరకలు పడిన కూతురి దేహం వైపు తిరగడానికి ఆమె ధైర్యం చాలలేదు.

తెల్లవారుజాము వరకూ ఆ స్త్రీ తానున్నచోటనే ఉండిపోయింది. నేను వెళ్లి చచ్చిపడివున్న కుక్కలకేసి చూస్తూ కొంతసేపు గడిపాను. ఒక కుక్క ఇంకా కొనఊపిరితో ఉన్నట్టున్నది. కాస్సేపట్లో ఆత్మ, దాని శరీరం నుంచి విముక్తమై అక్కడే వున్న నన్ను కలుసుకుంటుందని ఊహించుకున్నాను.

సావ్సన్ తల్లి లేచి ఇంటి ముందుతలుపు తెరిచింది. చేతిలో పిస్తోలు పట్టుకునే ఒక లక్ష్యం లేకుండా గుడ్డిగా ముందుకు నడిచింది.

పత్తి పొలంలో ప్రవేశించి ముందుకు పోతూనే ఉన్నది. ఒక్కక్షణం నాలో సందేహం మెదిలింది. ఆమె తనను తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటుందేమో చూడాలనుకున్నా. కానీ ఆమె వడివడిగా అడుగులేస్తూ గ్రామ సరిహద్దులు దాటి ఉదయించే సూర్యుని దిశగా వెళుతున్నది.

ఆతర్వాత గ్రామంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాలక దళాలు గ్రామాన్ని ముట్టడించాయి. ప్రతిపక్ష శక్తులు తీవ్ర యుద్ధం తర్వాత తిరిగి ఊరుపై నియంత్రణ సాధించాయి.  అంతర్జాతీయ మానవతా సంస్థలు సాక్ష్యాల అన్వేషణ కోసం వచ్చాయి. మైదానంలో రెండు జట్లు సాధించిన గోల్స్ లెక్కించే రిఫరీల మాదిరి, ఇరుపక్షాల దళాలు పాల్పడిన నేరాలకు సంబంధించిన  సమాచారాన్ని సేకరించాయి.

***

నేను దేవుని కుమారులైన ముజాహిదీన్లతో కలిసి పోరాడుతున్నాను. నేను వల్లంకి పిట్ట లాంటివాణ్ని. మరుగున ఉండి ఎంతోదూరం నుండి గురితప్పకుండా కాల్చే నైపుణ్యం గల్గినవాణ్ణి. ఏడాదిన్నర కాలంగా పాలక సైనికులను లక్ష్యంగా చేసుకున్నాను. చివరికి వారికే దొరికిపోయాను. విమానం ద్వారా  వాళ్ళు నేను దాక్కున్న రహస్య స్థావరం మీద బాంబులు వేశారు. వాళ్ళు నా చితికిన మృతదేహాన్ని బయటకు లాగి, కసిగా బూటుకాళ్ళతో తన్నారు. కొందరు నామీద మూత్రం పోశారు. నా శవం అట్లా అవమానించబడి,

హింసించబడినందుకు నాకేమీ చింతలేదు. యుద్ధంలో వీర మరణం పొందినందుకు ఆనందంగా ఉన్నది.

నేను స్పష్టమైన మనస్సాక్షితో ఆ ప్రభువును కలుస్తాను. నా దేహం నుంచి నేను విముక్తి పొందిన వెంటనే, కొందరు మాజీ సహచరులు నన్ను ఈలోకం నుంచి దాటించే ప్రక్రియకు ఏర్పాట్లు చేసేందుకు వచ్చారు. ఆక్రమంలో వారు నన్నీ గ్రామానికి తీసుకొచ్చారు.

నన్ను ఒంటరిగా వదిలి “ఇక్కడ వేచి ఉండండి. మేము నిన్ను స్వర్గ సరిహద్దుల్లోకి దాటిస్తాం. మెమొచ్చేవరకు ఈ గ్రామ పరిధులు దాటి వెళ్లకండి”అనిచెప్పి వెళ్లారు.

ఒకవేళ నా మాజీ సహచరులు కూడా నామాదిరే ఎక్కడైనా, మరిదేనికోసమైనా వేచిచూస్తున్నారేమో నాకు తెలియదు.

ఇది జరిగి చాలా కాలమైంది. నేనింకా అక్కడే.. ఆఊర్లోనే అట్లాగే వేచివున్నాను. ఎవరూలేని ఆ నిర్జన.. నిశ్శబ్ద గ్రామం చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో నాకే తెలియదు. ఊరిడిచి పోతూ గ్రామస్తులు వదిలిపెట్టి వెళ్ళిన వారి బట్టలు, ఇండ్ల ముందు చెల్లాచెదురుగా పడివున్న కుండలు, చిప్పలు, పిల్లల ఆటవస్తువులు, చచ్చిపోయిన పెంపుడు జంతువుల తాలూకు ఆస్తి పంజరాలు, ఎముకలపొగుల్ని చూశాను. గ్రామ పరిసర పొలాల్లో పత్తిపంటలు పూర్తిగా ఎండిపోయాయి.

రోజులు భారంగా దొర్లిస్తూ నేను బాగా విసిగిపోయాను. అంతులేని నిరీక్షణ నాలో సహనాన్ని హరించివేసింది. అయితే ఆ విసుగుదలే నాలో ఎన్నెన్ని శక్తులు దాగివున్నాయో వెళ్లాడయ్యేలా చేసింది. నేనిప్పుడు మనసులో అనుకున్నది చేయగలగుతున్నాను. చెట్ల కొమ్మల మీదా, ఇండ్ల పైకప్పుల మీదా పక్షులతో కలిసి తిరగటం ప్రారంభించాను. గాలికి చెట్ల నుంచి ఆకులు రాలి కింద పడినప్పుడు నేనుకూడా వాటితోపాటే నిశ్శబ్దంగా నేలమీదకు జారిపోతున్నాను. వీస్తున్న  పిల్లగాలులతో ఆడుకున్నాను. పురుగులను ఆటపట్టిస్తూ వాటితో తిరిగాను. క్రిమి కీటకాలను రకరకాలుగా ఇబ్బందులు పెట్టాను.

నాకిప్పుడు ఆకలిదప్పులు లేవు. ఏవిధమైన భయాందోళనలు లేవు. నేననుకున్నది ఏదైనా చేయగలను. ఒంటరితనం ఇక నన్నెంత మాత్రమూ బాధించలేని స్థితి. నా గత జీవితం తాలూకు జ్ఞాపకాలు క్రమేపీ మసకబారుతున్నాయి.

ఒకరోజు ఉదయం నేను సావ్సన్ ఇంటిపెరట్లోని చెట్టుకొమ్మల్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు నా నిరీక్షణను నిర్వీర్యం చేయగల మహత్తరమైన ఆలోచన నాకు కలిగింది. ‘అసలీ పాడుబడ్డ.. వల్లకాడైన గ్రామమే నేను చేరాల్సిన స్వర్గధామమేమో..’ అనిపించింది.

*          

 

అయోధ్యా రెడ్డి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు