పరేశ్ తనకు తానుగా వొక “కవిత”

వరివల్ల అతని గొంతు గాయపడిందో గానీ ఈ రాత్రంతా తడిసిపోయిందతని పాటతో మరి ఈ రాత్రంతా అతను పాడుతూనే ఉన్నాడు.. ఆ పాట పాడిందీ నేనే, ఆ గాయపడ్డ స్వరమూ నాదే. వో చల్లని గాయపు స్పర్శ like a dry ice ఈ రాత్రి నన్ను గాయపరిచిన దోషి పేరు పరేశ్. ఎట్లా బతుకుతూ వచ్చాడో ఆ జీవితాన్ని వొక డాక్యుమెంట్ చేశాడు. మార్మికంగా మారుతున్న, ఎదుగుతున్న క్రమం చెప్పకనే చెప్పినట్టుగా ఇట్లా కవిత్వమయ్యింది. పాపం ప్రయత్నం చేయకుండానే కవి అయిపోయిన మనిషి కదా కాస్త జాలేసింది.

Poetry is a mirror which makes beautiful that which is distorted. షెల్లీ ఏ మూడ్ లో ఉండి ఈ మాటన్నాడో గానీ… ఒక దుఃఖపు సన్నివేశాన్ని అద్భుతమైన కవిత్వంగా చూసినప్పుడు కవి skill ని మెచ్చుకోవాలా, లేక ఆ అక్షరాలు రాస్తున్నప్పుడు అతనెంత వేదన పడి ఉంటాడు అని ఆలోచించాలా?? ఎప్పటికీ నన్నొక డైలమాలో పడేసే ఆలోచన ఇది. ఇప్పుడు పరేశ్ మళ్లీ ఆ నిస్సహాయ స్థితిలోకి తనకు తోడుగా పాఠకున్నీ నెట్టి అట్లా పక్కన కూచుంటే.. కవీ నువ్వెంత నిర్దాయుడివీ అనిపించదా?

“మరణానికి ముందే/ యెన్నో మరణాలు చూశావు కదా!/ ఆ వొక్కొక్క మరణానికీ జవాబుదారీ మేము/ అయినా సిగ్గులేని బతుకులు మావి” అంటున్నప్పుడు. రోహిత్ తో పాటు ఎన్నెన్ని పార్థివ దేహాలు, ఎన్ని నిర్జీవ భారతదేశాలు కళ్ళముందు కదిలి. “బిడ్డా! నువ్విప్పుడు యెర్రెర్రని వెలిగే ప్రతీక” అని చదువుతున్నప్పుడు. కళ్ళలో ఓ నీటిపొర కదలాడి. “పూర్ణ విరామం” అనే కవితలోని ప్రాణమంతా అక్కడే ఆ “బిడ్డా” అన్న పిలుపు దగ్గరే గూడుకట్టుకొని ఉంది.

పరేశ్ కి కవిత్వం చెయ్యటంకన్నా కదిలిపోవటం బాగా తెలుసు అనిపిస్తుంది. ఏడ్చి.. ఎడ్చి.. తెరిపిన పడ్డట్టు, వొక దుఃఖ భారాన్ని దింపుకున్నట్టు అనిపించే కవితలు కొన్నున్నాయ్. “హైకూలా/ బతికి/అక్షరమైపోయాడు” త్రిశ్రీ గురించి మూడే మాటల్లో ఒక పోయేటిక్ క్యారికేచర్ లాంటి వాక్యాలివి. యేదో కవిత రాద్దామన్న ప్రయత్నంలో వచ్చిన పదాలు కావివి. అది ఒక సిగ్నేచర్, ప్రతి రాతగాడికీ ఉండే ఒక వోన్ మార్క్.

ఇలాంటివే ఒకటీ రెండు అబ్బురమనిపించే పోలికలు.. “బస్సు మధ్యతరగతి భారతీయ సంసారి లా పాక్కుంటూ పోతుంది” “మోటార్ సైకిల్ తనచప్పుడు తానే మోసుకెళ్లి పోతుంది” ఎందుకో ఇలాంటి పొలికలని జస్ట్ “కవి చమత్కారం” అనేయ్యాలనిపించదు. ఆ పోలికలు ఒక మనిషి తన జీవితాన్ని, తాను బతుకుతున్న స్థితిలో ప్రతీక్షణాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా అందులో లీనమైపోతున్నాడు అనేదానికి అదొక నిదర్శనం. “కవిత్వానికీ జీవితానికి మధ్య సరిహద్దు రేఖని చెరిపేయాలి ఎవరన్నా” అన్నాడొక చోట… ఎవడో వచ్చేదాకా ఆగటమెందుకు? అనుకున్నాడేమో! “కవిత్వమింకా ఐపోలేదు/ జీవితమింకా మిగిలే ఉందిగా” అంటూ తానే ఆపని చేసేసాడు.

కవిత్వం ఒక మార్మికం. అయితే, కొన్నిసార్లు అత్యంత స్పష్టమైనదీ కవిత్వమేనేమో అనిపిస్తుంది. అప్పటిదాకా మనిషిగా మనలాగే అనిపించినవాడు కవిత్వం రాస్తున్నప్పుడు అమాంతంగా ఎదిగిపోతాడు. బుద్దున్ని మించిన జ్ఞానవంతుడౌతాడు. కవిత్వంలో చివరి అక్షరం పూర్తయ్యిందా అతనూ మళ్లీ మామూలు మనిషే. లేదంటే…మనలాగే రోజూ పెరుగుతున్నధరాలూ, ఇంటి రెంటూ, గ్యాసు బిల్లూ లాంటి విషయాలు ఆలోచించినవాడే ఉన్నట్టుండి “రోడ్డు మీద అప్పటికప్పుడు కట్టిన కాలువ/పడి ఉన్న పండుటాకులనూ, పాదముద్రలనూ కొట్టుకుపోయింది/ ఇలాంటి వానే వొకటి లోపలా కురవాలి” అని ఎట్లా రాయగలిగాడు!? తనను తానే వేరుగా చూసుకునే ఒక పిచ్చి ఇతనికీ ఉన్నట్టుంది.

ఒకపక్క తెలుగులో రెండోపక్క ఇంగ్లీష్ లో తనవర్క్ ని తానే ట్రాన్సలేట్ చేసుకున్నాడు. తనకు తానే ఇట్లా బతుకుతున్నందుకు మురిసిపోయే ఒక తాత్వికుడి లాంటి లక్షణం ఉంది. “నాబొజ్జ మీద చల్లగా ఉంచిన నీ పాదం” అంటూ కూతురిని, “ఎప్పుడైనా నిద్దట్లో నీ మెత్తని కాలితో నా పొట్టమీద తంతే/ మీ అమ్మకడుపులో నువ్వున్నప్పటి క్షణాలను ఊహిస్తాను” అంటూ దత్తపుత్రుడినీ ఎంత మురిపెంగా రాసుకున్నాడో… (దత్తపుత్రుడినీ కవర్ మీద ముద్రించుకున్నాడు కూడా) ముప్పయ్యేళ్ళ నాటినుంచి ఇప్పటివరకూ ఇట్లా అన్ని జ్ఞాపకాలనీ వో పుస్తకం చేసి పక్కన పడేశాడు.. కొన్ని అద్భుతమైన అనువాదాలూ చేశాడు.

కానీ ఎందుకో పరేశ్ ని కవి అంటే నచ్చదు నాకు.

పరేశ్ తనకు తానుగా వొక “కవిత”.

ఇంకా వానతనం పోని తడితడి మెత్తని నేల…

*

అలా గెలిస్తే అక్కడితో కవిత్వం ఆగిపోతుంది: పరేశ్

  1. కవిత్వం రాసుకున్న కొన్ని క్షణాల రహస్యాలు చెప్పండి.

కవిత్వం వ్రాసేటప్పుడు రహస్యం ఏమీ వుండదు నాకు. అది పుట్టే క్షణాల్లోనే వుంటుంది. ఎలాగంటే ఒకసారి వాట్సాప్ లో ఒక వీడియో చూసాను. ఒక sand artist గాజు మీద ఇసక ను పోసి ఒక బొమ్మ చిత్రించడం, కొన్ని సెకన్లలోనే దాన్ని అక్కడక్కడా చెరిపేసి మరో బొమ్మ తయారు చేయడం ఇలా జరిగింది. ఇదంతా పెద్ద తెర మీద ప్రేక్షకులకు కనిపించేలా ఏర్పాటు జరిగింది. ఆ కళాకారుడు గొప్పవాడే. సందేహం లేదు. ఒక కొత్త, కనీసం నా వరకు, మీడియం తో చిత్రాలు వేయడం, అదీ వేగంగా. అందరితో పాటే నేనూ చప్పట్లు కొట్టాను, అయితే మనసులో. కాని ఆ క్షణంలో నాకు జరిగిన revelation ఏమిటంటే అతను ఎంత ప్రేమగా ఇసక చిత్రం గీసాడో, అంతే తేలికగా దాన్ని చెరిపేసి కొత్త చిత్రం వేశాడు. నాలాంటి వాళ్ళు ఏవో నాలుగు అక్షరాలు బరికి దాన్ని అపురూపంగా చూసుకుంటాము. అంత మమకారం, ownership పెంచుకుంటాం. ఇతనేంటి ఇంత తేలికగా తన సృష్టిని చెరిపేయడానికి క్షణం పాటు కూడా జంకడం లేదు అనిపించింది. ఈ ఒక్క క్షణం నాకు చాలా తాత్త్విక పాఠాలు నేర్పాయి. అందులోంచే వచ్చింది ఒక కవిత. చాలా వరకు కవితా రహస్యాలు ఆ నదీ మూలాల్లోనే వుంటాయి. చాలా తక్కువసార్లు, నా వరకూ మళ్ళీ, వ్రాసేటప్పుడు వుంటాయి.

  1. భాషకి సంబంధించి మీ సంఘర్షణని ఎట్లా గెలిచారు?

భాషకు సంబంధించిన ఘర్షణ ను నేను గెలవలేదు. అలా గెలిస్తే అక్కడితో కవిత్వం ఆగిపోతుంది. ఆ ఘర్షణ వున్నంత కాలమే కవిత్వమూనూ. ఎందుకంటే ఎదుట ఒక మామిడి పండు వుంటే అది చూసే ప్రతి వ్యక్తికీ విభిన్నంగా కనబడుతుంది. విభిన్నమైన భావాలను పుట్టిస్తుంది. ఒకవేళ తినాలి అన్న తీవ్రమైన కోరిక పుట్టినా, ఆ భావాన్ని మాటల్లో పెట్టగలిగే వీలుండదు. నోరు ఊరుతుంది. కళ్ళు మెరుస్తాయి. మనసులో ఏవేవో భావాలు కదులుతాయి. ఇవి ఒక్కోసారి చాలా విచిత్రంగానూ వుంటాయి. దాన్నే కవి ఒక కవితలో బంధించాలనుకుంటే తెలిసిన భాషలోని పదాలు సరిపోవు. ఎలాగోలా వ్రాసినా అది సంపూర్ణంగా వచ్చినట్టు ఉండదు. ఎన్ని సార్లు తిరగవ్రాసినా సంతృప్తిగా వుండదు. నేను ఊటీలో తిరుగుతున్నప్పుడు, మహా బలేశ్వర్ లో తిరుగుతున్నప్పుడు, FTII లో వున్న చిన్న చెట్ల సముదాయం, అది అడవిని భ్రమింపజేస్తుంది, మధ్య నడుస్తున్నప్పుడు రకరకాల భావాలు కలుగుతాయి. ఒక పెద్ద రహస్యమయ సృష్టిలో వో కదులుతున్న బిందువులాగా. అప్పుడు వ్రాసిన కవితలు పోగొట్టుకున్నాను కూడా. నాకు నిర్లక్ష్యం చాలా ఎక్కువ.

ఇంకొకటి భాష నా మీద పెట్టే పరిమితులను అధిగమించడానికి ఒకోసారి కొత్త పదాలు కనిపెడతాను. ఒకోసారి సింటాక్స్ ను విరిచి తంటాలు పడతాను. అయినా చాలా సార్లు తృప్తిగా వుండదు. ఆ gap వుంటుంది, వుండాల్సిందే. ఇప్పుడు ఒక పదం “పరుషవేదం” అని పెట్టాను. పరుషంగా వుండేదేదో అందులో వుంది. వేదం అని ఎందుకన్నానంటే మగజాతి చెప్పిందే వేదం అన్న విషయం స్ఫురణకు రావాలని. గమ్మత్తేమిటంటే దీన్ని ఇంగ్లీషులో అనువదించేటప్పుడు తెలుగులో వున్న వీలు అక్కడ చిక్కలేదు. అందుకే శీర్షికలో మార్పు తెచ్చాను.

“ఆకాశం పతతం తోయం, సాగరం పదగచ్చతి…” అని వుంది. వర్షం, నది, సముద్రం, evaporation, మేఘం మళ్ళీ వాన ఇదే భ్రమణం జన్మ పరంపరలో కూడా వుంది. నేను పునర్జన్మలో నమ్ముతాను. అందుకే ఒక కవితకు “వానతనం” పెట్టాను.

భాష పరిమితులను నేనైతే దాటలేకపోయాను. I just manage the show with the language in my limited way.

  1. ఈ సంపుటిలో కొన్ని అనువాద కవితలున్నాయి. ఆ కవుల పాత్ర ఏమిటి మీ కవిత్వ జీవితంలో?

నా పుస్తకంలో కొన్ని అనువాద కవితలు పెట్టాను. వాటికి ఒక ప్రత్యేకమైన ఆర్డర్ లేదు. అసలు నేను చేసే ఏ పనీ ఒక ఆర్డర్ లో చెయ్యను. చేతికొచ్చింది చదువుతాను. చాలా వరకూ సగం చదివి వదిలేసినవి. నాలో అసహానం ఎక్కువ. మధ్యలో ఎక్కడ బిగువు సడలినట్టు అనిపించినా పక్కన పెట్టేస్తాను. ఈ కవితలు అనువదించానూ అంటే అవి నన్ను కూర్చోబెట్టేసాయి కాబట్టి. Spirituality లో నాకున్న నమ్మకాన్ని కొన్ని బయట పెడితే, కొన్ని స్త్రీల పట్ల నా భావాన్ని echo చేస్తాయి. జామెట్రిక్ ఫిగర్స్ మీద గిల్లెవిచ్ కవితలు నాకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపెట్టాయి. ఇలా ఒక్కొక్కరి వెనుక ఒక్కో కథ వుంది. అయితే ఇప్పుడు నాకు ఒక విషయం లో గిల్ట్ వుంది. నేను కవిత్వం చదవడం మొదలు పెట్టిందే టాగోర్ తో. అతని కవితలు రెండన్నా పెట్టి వుండాల్సింది. సరే చాలా చెయ్యలేదు, వాటిల్లో ఇదొకటి అనుకోవాలి.

  1. పరేశ్ రాయలసినంత కవిత్వం రాయలేదని అతని మిత్రుల ఫిర్యాదు. నిజమేనా?

నిజమే. వ్రాయాల్సినంత వ్రాయలేదు. రెండు కారణాలు. ఒకటి చాలామందికి తెలీదు. ఒక పదిహేను సంవత్సరాలు నేను తీవ్రమైన డిప్రెషన్ లో వున్నాను. ఏమీ చదవబుధ్ధి కాదు, వ్రాయబుధ్ధి కాదు. ఉద్యోగంలో బిజీ గా వుండబట్టి సరిపోయింది. ఆ కాలంలోనే ఆధ్యాత్మికతలోకి వెళ్ళాను. కొంతమంది గురువుల కు మానసికంగా శిష్యరికం చేసాను. ఆ తర్వాత కొన్ని కొన్ని తెలిసి తొందరగా బయటకు వచ్చాను. ఇప్పుడు నా దారి నా లోపలికి వెళ్తుంది. నా అన్వేషణ సాగుతూనే వుంది. మా అమ్మాయి మీద వ్రాసిన కవిత 1999 లో వ్రాస్తే ఆ తర్వాతి కవిత 2015 లో వ్రాశానేమో.

ఇంకొక విషయం ఒక కవిత వ్రాయాలంటే దానికి ఒక మానసిక స్థితి వుండాలి. అంటే వ్రాసేటప్పుడే కాదు. జీవితం లోనే. టీ తాగుతున్నా అది కేవలం టీ తాగడమే కాదు. మిత్రుడితో నవ్వుతున్నా అది కేవలం నవ్వూ, సంభాషణా కాదు. అంతకంటే ఎక్కువ. ఒక పని అయిపోయింది అన్న పధ్ధతిలో బ్రతికితే కవితలు రావు. నా మెదడును నేనే మెస్ చేసుకున్న కారణంగా కొంత నష్టం జరిగింది.

ఇక ఇప్పుడు అంటే నేను అనుకోవడం, peak of creative spell in life దాటి పోయాను. చాలా కొద్ది మంది ఏ టాగోర్ లాంటి వారో చివరి దాకా సృజనాత్మకంగా వున్నారు. అసలు ఆయన బొమ్మలు వేయడం అనేది చాలా పెద్ద వయసులో మొదలు పెట్టాడు. ఇప్పుడు నా యువ మిత్రులతో అంటుంటాను, మీది పీక్ స్టేజ్, ఇప్పుడు నిర్లక్ష్యం చెయ్యొద్దు అని. అంతే ఇదేదో 2+2=4 లాగా నిరూపించగలిగిన విషయం కాదు. కేవలం నా గమనింపు.

*

నరేష్కుమార్ సూఫీ

5 comments

Leave a Reply to Muralikrishna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కటి. .. దగ్గిరతనపు విశ్లేషణ..
    పరేశ్ అలాంటి వాడే… బాగా దగ్గిరగా చూస్తే .. కొంచెం అంటే కొంచెమే అర్థం అవుతాడు

  • నరేష్ నువ్వు కవిగానే కాదు చక్కటి విశ్లేషకుడిగా ఎడిగావ్. చాలా బావుంది. Sorry రెస్పాన్స్ లేట్ అయ్యింది. అందమైన కవితలకి తీరైన పరిచయం.

  • పరిచయం,సంభాషణ రెండూ బావున్నాయి నరేశ్… మీరు రాయడంలోనూ ఒక కవితాత్మక అనుభవం ఉంటుంది..తక్కువగానే చదివినా పరేశ్ గారి కవిత్వం నాకూ బాగా ఇష్టం.ఎదో ప్రత్యేకత ఆయనలో.. ఆయన గురించి మీ వాక్యాన్ని ఇలా చదవడం బావుంది
    ఇద్దరికీ శుభాకాంక్షలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు