పబ్బులోపలికి వెళ్దామా?

చెప్పావులేవోయ్ బోడి.. అని మీరు విసుక్కోకున్నా నేను ఓవరాక్షన్ చేస్తున్నాని నాకే అర్థం అవుతోంది.

అనువాదం: అవినేని భాస్కర్

బ్బుకి ఎన్నింటికెళ్తే ‘కెవ్వు కేక’ లా కనపడుతుంది?

పబ్బు యమరంజుగా ఉండేది రాత్రి పదకొండు దాటాకే అయినా, పదింటికే లోపలికెళ్ళిపోవడం అక్కడున్న వాతావరణాన్ని అంచనా వేసుకోడానికి సాయపడుతుంది. పబ్బుల్లో సాయంత్రం ఆరునుండి ఎనిమిది వరకు హేపీ హవర్స్ ఉంటాయి. సగం ధరకి లేదా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇలా రకరకాల ఆఫర్లుంటాయి.

ఈ టైమ్ లో పెద్ద రద్దీ ఉండదు కాబట్టి పళ్ళరసం తాగి బొజ్జ పెంచుకున్న వాళ్ళు ఈ హేపీ హవర్స్ లో వెళ్ళరు.

సీనియర్ పబ్ సిటిజెన్ గ్యాంగ్ సాయంత్రం 4 నుండి చవగ్గా వైన్ షాపులో మందు కొని తాగుతూ ఉంటారు, వైన్ షాపు కట్టేయగానే పబ్బు వైపుకు ధ్వజమెత్తుతారు.

పడుచు అమ్మాయిలు బాయ్ ఫ్రండ్స్ ద్వారా మందు తెప్పించుకుని రూంలోనే తాగి తూలుతూ పదింటికి మేకప్పేసుకోవటం మొదలు పెడతారు. వీళ్ళు పబ్ లో నామ మాత్రానికి ఒకటి లేదా రెండు రౌండ్‌లు మాత్రమే మందు కొడతారు. పబ్బులోనే తాగి ఫుల్లుగా మత్తు ఎక్కాలంటే అది రాజకీయాల్లో ప్రజా సేవ చేసేవారికో సినిమాల్లో కళాసేవ చేసేవారికో మాత్రమే సాధ్యం.

ప్రపంచ వ్యాప్తంగా పబ్బుకంటూ ప్రత్యేకంగా కొన్ని డ్రెస్ కోడ్‌లున్నాయి.

అయితే, చెన్నై పబ్బుల్లో అలాంటివి పాటించేవాళ్ళని చూడలేము. ఇప్పటికీ కాలర్ టీ-షర్టు, పీవీసి పైప్ ఫిట్టింగ్ జీన్సు వేసుకుని అబ్బాయిలూ, పళ్ళకు సైతం లిప్‌స్టిక్ రాసుకుని అలాంటి జీన్సులేనో లేదూ పొడవాటి సింగిల్ డ్రెస్సులో వేసుకుని అమ్మాయిలూ వస్తారు. మామూలుగా కంటే నాలుగు రెట్లు ఎక్కువగా పర్ఫ్యూం కొట్టుకుని అమ్మాయి బయల్దేరిందంటే ఆమె పబ్బుకు వెళ్తోందని అర్థం.

పబ్బులకు వేసుకోడానికి యోగ్యమైన ఆడవారి లోదుస్తులూ గట్రా ఈ రోజుల్లో ప్లాట్ఫార్మ్ మీదే 195 రూపాయలకే దొరుకుతున్నాయి. అయితే, వాటిని కొని వేసుకునే అమ్మాయిలు మాత్రం టీ.నగర్ రంగనాథన్ వీధిలో సల్వార్లు బేరమాడుతూనో, నుదట ఏమాత్రమూ ఖాళీ లేకుండ బొట్లు పెట్టుకుని కనక దుర్గమ్మ గుడి ఆవరణంలో ప్రదక్షిణలు చేస్తూనో ఉంటారన్నది వేరే విషయం.

చెన్నై పబ్బుల్లో డ్రెస్ కోడ్ కి సంబంధించి ఎలాంటి రూల్సూ లేవు కాబట్టి అడుగులంగాని మడిచి కట్టుకుని షిమ్మీ వేసుకుని వచ్చినా ఎవరూ ఆపరు. డ్రెస్సులేకుండా రాకూడదన్న రూల్ కూడా ఎక్కడా కంట పడలేదు.

మగవాళ్ళకి కొన్ని కట్టుబాట్లున్నాయి. షార్ట్స్ వేసుకుని రాకూడదు. లుంగీ, పంచ కట్టుకుంటే ప్రవేశం లేదు. కట్ బనియను, చారల చెడ్డీలు అస్సలు వేసుకురాకూడదు. మరీ ముఖ్యంగా షూ వేసుకోవాలి. 5000 రూపాయల చెప్పులు వేసుకున్నా లోపలికి పంపరు. 99 రూపాయల షూ వేసుకునెళ్తే లోపలికి పంపుతారు.

చెప్పావులేవోయ్ బోడి.. అని మీరు విసుక్కోకున్నా నేను ఓవరాక్షన్ చేస్తున్నాని నాకే అర్థం అవుతోంది. వీలైనంత వివరాలు చెప్పేయాలన్న తాపత్రయంతో ఇంత బిల్డప్ ఇన్తున్నాను.

సరే రండి లోపలికి వెళ్దాం. మగవాళ్ళు మొదటి సారి వెళ్తున్నట్టయితే జంటతో వెళ్ళడం ఉత్తమం. ఎటువంటి ఇబ్బందీ లేకుండా లోపలికి ప్రవేశించవచ్చు. కేవలం పబ్ అంటే ఏంటో తెలుసుకోడానికి ఒంటికాయ సొంఠికొమ్ములా వెళ్తున్నట్టయితే సాయంత్రం 6 గంటలకే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళేప్పుడే ఈ ఒంటికాయలకు చెప్తారు ‘8 గంటలకు బయట పంపించేస్తాం’ అని. 8 తర్వాత జంటగా వచ్చేవారికి మాత్రమే ప్రవేశం.

ఒక్కసారి లోపలికి వెళ్ళి పోయినట్టయితే మసిబూసి మారేడుకాయ చేసుకోవచ్చు. ఆ కథాకమామిషేంటో తర్వాత చూద్దాం. కోట్ సూట్ వేసుకున్న భారీ ఆకారపు బౌన్సర్‌లు మన ఒంటిలో ఎక్కడా బాంబులు దాచుకోలేదన్న విషయాన్ని నిర్ధారించి వారి అష్టాంగ కౌగిటినుండి మనల్ని విముక్తుల్ని చేశాక లోపలికి వెళ్తే ఆక్కడ రెండు పెద్ద తలుపులు ఆహ్వానం పలుకుతాయి.

వాటిని తెరుచుకుని లోపలికి వెళ్తే ముందుగా మనమీద దాడి చేసేది సంగీతమే. బేస్ స్పీకర్లను ఫుల్ వాల్యూంలో పెట్టేసుంటారు. ‘ధుమ్ ధుమ్ ధుంక్ ధుంక్…’ అంటూ డ్రమ్స్ బీట్ మన ఒంటిలో అదరటాన్ని ఫీలవ్వచ్చు. ఏంజెల్స్ ని వెతుక్కుంటూ లోపలికి వచ్చిన మన కళ్ళకు మందు కనిపించేదేమో 50 ఏళ్ళు దాటిన అంకుల్సు. తాతలు కూడా యూత్ గెట్టప్పుల్లో వణికిపోతూ కూర్చునుండటం చూస్తాం.

ఆ వాతావరణానికి కళ్ళను కొంచం అలవాటు చేసుకుని పరీక్షగా చూసినట్టయితే అంకుల్సు, తాతల మధ్యన, ముఖం మీద నువ్వులెప్పుడు పోస్తారా అని కాచుకునుండే హింది డబ్బింగ్ సీరియల్ అత్తగార్ల టైపు వృద్ధనారీమణులుంటారు.

ఏంజెల్ ఎక్కడ్రా అని వెతికితే, సైతానుకీ ఏంజిల్‌కూ పుట్టినట్టు ఒకే ఒక క్రాస్ ఏంజెల్ ని చూడవచ్చు. దురదృష్టమేంటంటే ఆ క్రాస్ ఏంజెల్ ఓ నాలుగైదు సైతాన్లతో కలిసి వచ్చి ఉంటుంది. ఆ సైతాన్లు వంతులేసుకుని మరి బాధ్యతలను నిర్వహిస్తుంటారు.

ఒక సైతాన్ పబ్బులో ఉన్న అందరు మగవాళ్ళనీ ఒ కంట కనిపెట్టుకని ఉంటాడు. ఇంకో సైతాను శ్రద్ధగా శుశ్రూషలు చేస్తుంటాడు.

గుడిమెట్లమీద చిప్పపుచ్చుకు కూర్చున్నోడిలా పడిగాపులు కాయాలి బేరర్ల కటాక్షానికి.

అంత మంది బేరర్లుంటారా, ప్రధాని మోడీకి ఫైళ్ళందిస్తున్నామన్నట్టు అటు ఇటు తిరుగుతుంటారుగానీ మన దగ్గరకు మాత్రం రారు. వాళ్ళని కాలర్ పట్టుకుని లాక్కొచ్చేంత పని చేస్తే మెనూ కార్డుని మన మొహాన కొట్టి మళ్ళీ ప్రకాష్ జవడేకర్ కి ఫైళ్ళందివ్వడానికి వెళ్ళిపోతారు. మొదటి సారి కాబట్టి ఆసక్తితో మెనూ కార్డు మొత్తం తిరగేసే ప్రయత్నం చేస్తాం.

కొన్ని పబ్బుల్లో తాత గోచీ అంత మెను కార్డులుంటే కొన్నిట్లో అమ్మమ్మ కట్టే పదహారుగజాల నార చీరంత మెను కార్డులుంటాయి. వేయి పడగలంత మెనూని మొత్తం చదివి సారం గ్రహించాలంటే మెను కార్డుని అద్దెకు తీసుకుని ఇంటికి తీసుకెళ్ళాల్సిందే. కాబట్టి ఈజీ చాయిస్ ఏంటంటే ఒక డ్రాట్ బీరో(ఉంటే) లేదా పింట్ బీరో ఆర్డర్ చెప్పేసి మళ్ళీ పబ్బుని పరీక్షగా చూడచ్చు.

నంజుడుకి సైడ్ డిష్ అన్న పేరుతో చికెన్ టిక్కా, మటన్ ప్లేటర్ అని స్టయిల్ గా ఆర్డర్ చెయ్యడాన్ని అవాయ్డ్ చెయ్యొచ్చు. కావాలంటే సీసర్ సలాడ్ అర్డర్ చేసుకోవచ్చు. కాసేపు డీజేని పట్టించుకుందాం.

పబ్బు ఇంకా రక్తి కట్టలేదు. దీనికే ఆ శాల్తీ , తనే ఈ మ్యూజిక్ కంపోజ్ చేసినట్టు ఊగిపోతున్నాడు చూడండి. అతను చేస్తున్న ఈ పాటి శ్రమకే రెండు బీర్లు పొట్టలో పోసుకున్నాడు.

ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకున్న 330 ఎమ్మెల్ బీరు ధర రూ.350 నుండి రూ.1200 దాక ఉండచ్చు. బీరు మరియూ హోటల్ బ్రాండుని బట్టి ధర ఉంటుంది.

(తూగుతూ ఉందాం)

 

మూలం: ‘కుంకుమమ్’ అనే అరవ వార పత్రకలో సీరీస్ గా వస్తున్న వ్యాసం. తేదీ: 26 జూలై 2019.

 

అరాత్తు

1 comment

Leave a Reply to Arjun Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు