1
జీవించే క్షణమొకటి….
ఉదయం నుండే మొదలవుతుంది
ఒక ఆరాటం
ప్రత్యర్ధిని దాటి
మునుముందుకు సాగాలనే
ఒక పరుగు పోరాటం
అక్కడే శాంతికి అశాంతికి మధ్య
సరిహద్దురేఖ ముళ్ళకంచెలా మొలుస్తుంది
ఏదో కొల్లగొట్టాలని
సర్వం సొంతం చేసుకోవాలనే
కుదురులేనితనం
ఏమీ తోచనీయకుండా
చర్నాకోలుతో మెదడును అదిలిస్తుంది
సూర్యుడు ఎర్రగా చూస్తున్న సమయం
సగం కాలిన మొక్కజొన్నై శరీరం
అలసటకు ఆరాటానికి మధ్య
గందరగోళంలో వేళ్ళాడుతుంది
పాదాలు మొరాయిస్తున్నా విననితనం
ఎగుస్తున్న విసుగుపొగను జోకొడుతుంది
ముదురుతున్న సాయంసంధ్యలో
చీకటి రెక్కలు విప్పి
వాలడానికి సన్నద్ధమవుతున్న వేళ
మనసుకు మెదడుకు
ఒక భీకరయుద్ధం ఆరంభమవుతుంది
గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా
ప్రతిదినం ఇదే మూసలో
చవి లేని చప్పిడిబ్రతుకు మూలుగుతుంది
తెల్లారగానే
మళ్ళీ పరుగుపందానికి తెర లేస్తూ
నింగిలో మేఘాలు
నిస్తేజంగా పరుగులు తీస్తాయి
ఆ మూలన నిలబడ్డ మొక్క
మౌనంగా పూలు పూస్తూ
పరిమళపు భాషను
శ్రద్ధగా ప్రపంచానికి నేర్పుతుంది
ఆనందానికి భాష్యం చెబుతుంది
ఉరుకుల పరుగుల మధ్య
గమనించీ గమనించనట్టే
రెప్పపడని రాత్రి అంచుల్లో
జీవించే క్షణమొకటి
కన్నీటిచుక్కను అద్దుకుని
నిశ్శబ్దంగా జారిపోతుంది.
*
నిన్నటి మాట
నిన్నటి మాట
వెంటాడుతుంది వేధిస్తుంది
కలతచీకటి నలతలా వ్యాపిస్తుంది
వెలుగు ఉదయాలనిండా
కన్నీటికొలను పొంగి పొరలుతుంటుందినిన్నటిని పారేసి
నేటిని మాత్రమే కొంగుకు కట్టేసుకోమని కొందరంటారు అతితేలికగామాటే కదా
గాలి అప్పుడే ఎగరేసుకుపోయిందిగా
ఇప్పుడెందుకు ఆ గోల
అంటూ ముఖం చిట్లిస్తారు
మరి కొందరునిన్నటి మాట
ఉత్సాహంగా ఎగురుతున్న
గుండెబుడగను సూదిలా గుచ్చగానే
అదాటున నేల రాలుతుంది
హఠాత్తుగా నీరసించి చతికిలపడుతుందినవ్వులపరదాలు కప్పిన
మాటే కావచ్చు అది
సంభాషణానదుల నడుమ
మొలిచిన పలుకురాయిలాంటి
మొనదేలిన మాట
నున్నటి బాటపై నడుస్తున్నపుడు
మేకులా లోతుగా దిగబడిన మాటమరపుపూత ఎంత పూసినా
ఆలోచనల నడుమ దొంగలా జొరబడుతూ
ముందుకు కదులుతున్నపుడు
వెనుకకు లాగుతున్న మాటఅవునూ
మాటలు మరణించవని
మళ్ళీ మళ్ళీ మనసును తవ్వినప్పుడల్లా
అవశేషాలు బయటపడతాయని
నిద్రిస్తున్న దుఃఖాన్ని మేల్కోలిపి
బయటపెడతాయని
మాటలను బాణాలలా సంధించే వారికి
తెలియదంటారా?!*
పరిచయం:
కథలు కవిత్వం నవలలు చదవడం ఇష్టం
కవిత్వమంటే మరింత ఇష్టం
నా కవితలు కథలు ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి
2021లో సాహిత్య అకాడమీ వారి
ఆన్ లైన్ కవితాపఠనంలో పాల్గొన్నాను
మొదటి కవితాసంపుటి
“కొత్త వేకువ” 2020లో వచ్చింది
మొదటి కథాసంపుటి
“కురిసి అలసిన ఆకాశం” 2021లో వచ్చింది.*
రెండు కవితలు బాగున్నాయి
మేడం శుభాకాంక్షలు
ధన్యవాదాలు గోపాల్ గారు
కవితలు బావున్నాయి మేడం…శుభాకాంక్షలు
ధన్యవాదాలు నాగరాజుగారు
బావున్నాయి
బావున్నాయి కవితలు
ధన్యవాదాలు దేశరాజుగారు
ప్రస్తుత వ్యక్తుల మానసిక పరిస్థితికి అద్దం పట్టిన కవిత. అభినందనలు మేడం
ధన్యవాదాలు శివకృష్ణగారు
అవును. ఈటె లాంటి మాట ను జాగ్రత్తగా ఉపయోగించాలి.కవితాత్మకంగా బాగా చెప్పారు
ధన్యవాదాలు రవిబాబుగారు