“పగులు”లోంచి కొత్త సమాధానం!

నం ఊహించుకునేది మన జీవితం కాదు. మనకి లభించినదీ, మనం గడుపుతున్నదీ మాత్రమే మన జీవితం అని గుర్తెరిగి ఉన్నదున్నట్టుగా జీవితాన్ని అంగీకరించి జీవించేవారెందరు?

ఆటా-2022 నవలలపోటీలో గెలుపొందిన తాడికొండ శివకుమార శర్మ గారు రచించిన “పగులు”  నవల చదవకముందు మీ సమాధానం ఏదయినప్పటికీ, చదువుతున్నప్పుడు మాత్రం మరో సమాధానమూ దొరుకుతుంది. శశి రూపంలో. ఈ నవలకి కథానాయకుడు శశి. శశిధర్. అతనిదే ఈ కథ. అతనే ఈ కథ. శశి తాత్వికంగా, తార్కికంగా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, భావుకపరంగా ఆలోచనల్లో ఒక సగటు మనిషి కన్నా ఎంతో ఎత్తులో ఉంటాడు. అతడికి భార్య శిరీష పట్ల ఉండే అపారమైన ప్రేమ కూడా అసాధారణంగానే ఉంటుంది. దురదృష్టవశాత్తూ అదీ ఆమె అందుకోలేనంత ఎత్తులోనే ఉంటుంది. అతని మేధో ప్రపంచం, భావప్రపంచం ఒకే తలంలో సమాంతరంగా సాగుతుంటాయి. వేటినీ ఆస్వాదించలేని విభిన్న జీవనతలం ఆమెది. “అందరికీ అన్నీ అమరవు” అన్న తాత్వికతతో అన్యోన్యతానురాగాలు లోపించిన జీవితంలో వెలుగురేఖలు వెదుక్కుంటూ గడిపే పరిణతి అతనిది. అసాధారణ విజయాలతో కూడిన అతడి జీవితం మొత్తాన్నీ అతడు చేసిన పొరపాటుకి కుదించి అతన్ని అంతమటుకే చూడగలిగే పరిమితి ఆమెది. క్షమించుకోలేని అతని వేదనాగ్నిని, క్షమించకపోవటంతో ఎప్పటికప్పుడు ప్రజ్వరిల్లేలా చేస్తూనే ఉంటుంది ఆమె. ఏమిటతని పొరపాటు? ఆమె పరుష వాక్యాల వెనకున్న గతం ఏమిటి? ఓ ఘటనంటూ జరగకపోయుంటే ఆ జంట జీవితం శశి కలగన్నట్టుండుండేదా? ఇద్దరి మధ్యా ఉన్న బంధంలో పగులుతో మొదలయిన ఈ నవల చివరివరకల్లా మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. పగులు ఉన్నది ఎక్కడ? ఆలోచనల్లోనా? నిర్ణయాల్లోనా? వ్యక్తిత్వాల్లోనా? మానవ సంబంధాల్లోనా? బంధాల పునాదుల్లోనా? ఊహకి, నిజ జీవితానికి మధ్య ఏర్పడిన అగాధాన్ని తవ్వుతూ ఆమె, కప్పిపుచ్చేందుకు అతను నిరంతరం చేసే ప్రయత్నం ఒక పరిమితి(Threshold) ని దాటినపుడు భళ్ళున ఎదురుపడ్డ వాస్తవంలోనా?

నిజానికి పుస్తకం మొదట్లోనే ఈ పగులు ఎందుకనేది సూచీగా ఈ జంట కొనబోయే ఇంటిని పరిశీలించిన ఇన్స్పెక్టర్ మాటల్లో చెప్పిస్తారు ఈ నవలా రచయిత. “ఇంటి బరువు భూమి మీద సెటిలవుతున్నప్పుడు దాన్ని మోసే నేలలో ఆ పై భారాలని పట్టి ఆపే శక్తిలో తేడాలుండటం వల్ల పునాదిలో పగుళ్ళు ఏర్పడతాయని. అదీ, ఎత్తుపల్లాలు లేని చదరపు నేలపై కట్టిన ఇళ్ళ కన్నా, ఏటవాలుగా ఉండే నేలపై కట్టిన ఇళ్ళకి కింద వాటర్ టేబుల్ సమంగా లేకపోవటం వల్ల పగులు ఏర్పడే అవకాశముంటుంది” అని. వీరిరువురి బంధం కూడా ఏటవాలు నేలపై నిర్మితమైనదే. పగులు అనివార్యమయింది. ఇందుకు భిన్నంగా చదునైన నేల మీద ఉన్న పొరుగింటి పీటర్, మిషెళ్ల సంసారాన్నితరచి చూస్తే, వాళ్లు అమెరికా నేల మీద పుట్టి పెరిగినవారే గనక కొత్త సమాజంలో ఇమడడానికి పడే సంఘర్షణలు లేనటువంటి సాఫీ జీవితాలు. ఏటవాలు నేల మీద వలస వచ్చినవారి జీవితాల్లోకి కొట్టుకునొచ్చిన సమస్యలు, పెంపకంలో సంఘర్షణలు అన్నీ పగులు పెద్దదవడానికి శాయశక్తులా ఎలా సాయపడ్డాయనేది ఆఖరివరకూ విలక్షణంగా మలిచిన మలుపులలో దగ్గరగా చూస్తూనే ఉంటాము.

పగులు, పాము, పావురం“! ఈ ముగింపు చదివాక ఒక అచేతనావస్థలోకి వెళ్లతాము. హోరున తిరిగిన ఆలోచనలన్నీ అక్కడితో స్తంభించిపోయినట్టయి, ఒకానొక భయంకరమైన నిశ్శబ్దం అనుభవంలోకి వస్తుంది. ఆపై ఎప్పటికో మెళకువలోకి రావటం జరిగినప్పటికీ, కొన్ని నెలలపాటు మనలని వెంటాడుతాయి ఇందులో చర్చించిన కొన్ని జీవితాలు. నిజం చెప్పాలంటే ఇందులో ప్రతీ పాత్రా మన చుట్టూ ఉండే మనుషుల్లో ఎవరో ఒకరిని స్ఫురింపజేస్తుంది. అంత సజీవంగా ఉంటాయి అన్ని పాత్రలూ. అన్న కిషోర్ సాధించుకున్న ఆర్థికపరమైన ఉన్నతి మాత్రమే అసలైన ఎదుగుదలగా పరిగణిస్తూండే శిరీష, ఆమె తల్లిదండ్రులూ ఆకాశం నుంచి ఊడిపడ్డ పాత్రలేమీ కాదు. చుట్టూ ఉండే సమాజంలో కోకొల్లలు. ఒక్కొక్క పాత్ర వ్యక్తిత్వాన్ని చిన్న చిన్న సంభాషణల్లోనే పరిచయం చేస్తూ రచయిత మనల్ని నవలలోకి, గతం తాలూకు వివరాలలోకి, పొరలు పొరలుగా అల్లుకున్న సన్నివేశాల మీదుగా తీసుకెళ్ళుతూంటే రచయిత బాణీలో సహజంగా ఇమిడిపోయే సునిశిత మనోవైజ్ఞానిక విశ్లేషణ వారగా పాత్రలు, వాటి స్వభావవైరుధ్యాలతో సహా పాఠకుల ముందు సజీవంగా నిలబడతాయి. చిరపరిచితమైనవిగానూ కనబడి మనసులో కూర్చుండిపోతాయి. ఆమె అసహనం, ఆగ్రహం వెనుక కారణం అనారోగ్యంతో కూడిన అసహాయత అన్న విషయాన్ని మనకి గుర్తు చేస్తూనే ఆమెకి అది సమకూర్చిన ఆధిపత్యమే ఆసరాగా అదేపనిగా అవమానించే ధోరణికి కుంచించుకుపోతూ అతను కూడా బాధితుడవటం చూపిస్తూ, వైవాహికబంధాలలో పొరలని విప్పిజూపేందుకు ఎన్నుకున్న బాణీ వలన పాఠకులుగా మనమూ శశి వలెనే తటస్థంగా అతడు వితర్కించుకునే ఘటనాఘటనల తలపోతలలో చిక్కుకుపోతుంటాము.

స్థూలంగా చెప్పాలంటే కథ ఇది – ఐఐటీ మద్రాస్ లో బీ.టెక్, అమెరికాలోని రట్గర్స్ లో మాస్టర్స్, ఆపై ప్రిన్స్ టన్ లో పిహెచ్.డి. చేసిన శశి చిన్ననాటి నుంచీ ప్రేమించిన చెలి శిరీషని పెళ్ళాడగలుగుతాడు. ఆ సమయంలో, అంతకు ముందు, ఆ పైనా అతని అమెరికా జీవితంలోని కీలక దశలైన విద్యార్థి, ఉద్యోగ, కుటుంబ జీవితం ఎలా సాగిందనేదే ఈ నవల. అమెరికా జీవితాన్ని, జీవన విధానాలనీ పరిచయం చేస్తూ మలుచుకున్న పాత్రలు, సంఘటనలతో విలక్షణమైన శైలిలో సాగుతూంటుంది కథాగమనం. మధ్యమధ్యలో మనుషుల తీరుపై చేసే వ్యాఖ్యలన్నీ పైకి తేలిగ్గా కనబడినప్పటికీ సామాజికంగా రచయిత లోతైన పరిశీలనని పట్టిస్తూంటాయి. ఐఐటీ రోజుల్లో కలిగిన క్వాంటం మెకానిక్స్ పై సందేహాలు, అతను అవలంబించే హోలోగ్రాం భక్తికి భిన్నంగా ఉండే ప్రొఫెసర్ల ఆధ్యాత్మిక ఆసక్తులని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ జరిపే సంభాషణలూ గతాన్ని, కుటుంబాన్ని పరిచయం చేస్తూనే విషయపరంగా ఆకట్టుకుంటాయి. పరిశోధనల పట్ల అతనికున్న ఆసక్తి, పరిశోధకులపై ఆరాధన పలుసందర్భాలలో ద్యోతకమవుతూ ఉంటాయి. అదే సమయంలో పరిశోధనల సారాన్ని దైవత్వానికి ముడిపెడుతూ శశి చేసే విచికిత్సలన్నీ మనల్నీ అప్రయత్నంగా అతని వాదంలోకి లాగుతూంటాయి.

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ!

సిద్ధ్య సిద్ధో స్సమో భూత్వా సమత్వం యోగ ముచ్యతే!!

“యోగివై నీ పని నిర్వర్తించు. అనుకున్నది అయినప్పుడు, కానప్పుడు రెండింట్లోనూ సమభావన చూపగల్గితే అది యోగం” – అని కదా గీతలో పరమాత్ముడన్నది? ప్రతి మనిషీ యోగి కాగలడా లేక తనకి నియోగింపబడిన పరిధిలోనే మనగలడా? మానవమాత్రుడైన శశి సంగతేమిటి?

పట్టుకోవాలే కానీ ప్రతీ పేజీలోనూ వాక్యాల్లో తత్వం, తార్కిక జ్ఞానం, విజ్ఞానం ఎదురుపడుతూనే ఉంటాయి. కథారచనలో విభిన్న ప్రయోగాలని ఇష్టంగానూ, విజయవంతంగానూ చేసే శివకుమార శర్మ గారి శైలిని బాగా ఎరిగిన పాఠకులకి ఆశించిన పఠనానుభవాన్ని అలవోకగా అందిస్తుంది ఈ నవల. రచయిత నిర్మాణశైలి, పరిశీలనా శక్తితో పూర్వపరిచయం లేని పాఠకులని సైతం ఆద్యంతం అబ్బురపరుస్తూ మంచి నవలని చదివిన అనుభూతిని మిగులుస్తుంది.

వాస్తవ దూరమైన ఫాంటసీలు చూపించే నవలలు రాయటమూ సులువే, ఆకట్టుకోవటమూ సులువే.  కానీ, ఎత్తుగడలోనే బాంధవ్యంలో సంతోషమంటూ లేని ఓ పరమ నిస్సార జీవితాన్నిసృజిస్తున్నట్టుగా ముందుగా సూచించి మరీ, చివరివరకూ ఆపకుండా చదివించగలగటం, కట్టిపడేయటం సామాన్యమైన విషయం కాదు. అందులోనూ అద్భుతాలు, ఫాంటసీలు లేని శశి లాంటి సాదా మనిషి జీవితాన్ని ప్రథమ పురుషలో కాకుండా ఒక నెరేటర్ లా చెప్పే ప్రయోగం కత్తిమీద సామే అయినప్పటికీ,  విశేష రచనానుభవంతో అంతకుమునుపే అందుకు అనువుగా చేయి తిరిగి ఉండటం వల్ల రచయిత ఆ సాము పొందిగ్గా చేసారు. బాగా కుదిరింది.

అయితే ఒక బహుమతి పొందిన నవలనగానే ప్రాచీన సాంస్కృతికాంశమో, చారిత్రక నేపథ్యమో, ఏ సోషియో ఫాంటసీనో లేక ఏదయినా వర్గ/వర్ణ పోరాట నేపథ్యమో అయుంటుందనుకున్నాను. ఈ మధ్యకాలంలో పేరెన్నిన నవలలు ఎక్కువగా ప్రాంతీయ స్పృహతోనో, సామాజిక స్పృహతోనో రాసినవే ఎక్కువ వచ్చి ఉన్నట్టున్నాయి. అయితే కుడి, లేదంటే వామ జాలాలలో ఏదో ఓ భావజాలానికి అనుకూలమయినవో అయితే తప్ప ఒక రచన వెలుగులోకి రావటం అరుదవుతోంది అనిపిస్తూ ఉన్న తరుణంలో ఏ ఫోర్సుడ్ ఎలిమెంట్లూ లేకుండా విభిన్నంగా ఉండీ అవార్డు గెలుచుకోవటం కొత్త పరిణామంగానూ అనిపించింది. ఒక సాంఘిక నవల ఈ బహుమతిని అందుకోవటం ఆనందపరిచిందని నేను చెబితే, ఆయా ఇతర అంశాల నవలలపై నాకేదో వ్యతిరేకత ఉన్నట్టుగా భావించక్కరలేదు, ఇది కేవలం నవలాంశంతో పాటుగా ఒక కథ చెప్పిన వినూత్న విధానానికి, అందులో పటిష్టంగా అమరేలా ఇమిడ్చిన ఎన్నో సైద్ధాంతిక అంశాలకి, రచయిత చాకచక్యంగా అల్లుకున్న సన్నివేశాలకి, అందులోని వాక్యాలకి, వాక్యాలలో సహజంగా తళుక్కుమనే తెలుగు విరుపులకి గౌరవనీయమైన స్థానం దక్కటం వల్ల కలిగిన సంతోషమే.

నవలలో లోపాలే లేవా? లోపమనలేము కానీ, కొన్ని చోట్ల సైన్సు/ తార్కిక వివరణలు ఎక్కువనిపించి, ముఖ్య సన్నివేశాల్లోని భావసాంద్రతని (బాధ కానీ, సంతోషం కానీ) అనుభూతించలేకుండా (కొంత) అడ్డుతగలమొకటీ జరిగిందేమో కానీ విరివిగా పాశ్చాత్య నవలలు చదివిన పాఠకులకి అంతగా అడ్డుగా అనిపించకపోవచ్చు. విస్తృతంగా మేధోపరమైన విషయాలు చర్చించటం, తెలుగు చదువరులూ ఇలా విభిన్న పఠనానుభవాలు సొంతం చేసుకొనే పంథాలో నవలలు రావటం మంచి పరిణామమే. మనకి ఇంతకు ముందు తెలీని అంశాలెన్నో పఠనంలో అందటం నాకు మటుకూ అదనపు పఠనానుభూతినే అందించింది.

అమెరికా నవలా రచయితలు పురస్కారాలు పొందటం సుసాధ్యం చేసినందుకు రచయిత తాడికొండ కె. శివకుమారశర్మ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇది అమెరికా సాహితీఅధ్యాయంలో గుర్తుంచుకోదగ్గ అపురూపమైన మలుపు.

*

దీప్తి, శ్రీనివాస్ పెండ్యాల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు