నువ్వెవరో ఏంటో నాకు తెలియకూడదు.

నిన్ను నేరుగా కలిస్తే నువ్వు కూడా సముద్రం ఒడ్డున శంఖంలాగే ఐపోతావు నాకు.

డియర్ జి.హెచ్.ఆర్,

నా మీద కోపం ఈపాటికి పోయే ఉంటుందని అనుకుంటున్నా. గతాన్నీ, నీ నియంత్రణ లో లేని వర్తమానాన్ని నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడు నీ మీద వచ్చి వాలిన పావురాన్ని ఎగిరిపోనిచ్చినట్టు వదిలేస్తావని నాకు తెలుసు. ఆ రోజు తర్వాత నా నుండి యే ఉత్తరమూ రాకపోవటంతో జరిగినదాన్ని నీ వెనకే గాల్లో అలా వేలాడదీసి నువ్వు ముందుకెళ్ళిపోతావని కూడా నాకు తెలుసు. కానీ నీకు వందల ఉత్తరాలు రాసి, నువ్వు బదులివ్వకపోతే నువ్వు తిరిగే రాసే వరకూ నిన్ను వేధించి, నిన్ను ఒకసారైనా వ్యక్తిగతంగా కలవకపోతే నా జీవితమే వ్యర్ధమన్నట్టు బ్రతిమాలి నిన్ను ఒప్పించి, ఒక తేదీ, ఒక చోటు నిర్ణయించి, అక్కడ నీకోసం వేచి చూస్తానని చెప్పి, తీరా నువ్వు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి చూస్తే నేను లేను అక్కడ. దాన్ని నువ్వు అర్ధం చేసుకుంటావని తెలుసు కానీ ఎలా అర్ధం చేసుకుంటావన్నది మాత్రం తెలీదు నాకు. నీ కధల్లో పాత్రలన్నీ నీలాగే ఉంటాయి కానీ అందులో ప్రతి రెండూ, చాలా విషయాల్లో విభేదిస్తుంటాయి. నువ్వు రాసిన “ఎండుచేపలు” కధలో రాఘవ లాగ “ఇంత జగన్నాటకంలో ఇదో ఘట్టం” అని నడిచెల్లిపోతావా లేక “వలయం” కధలో మైథిలి లాగ “ఈ ప్రపంచం నాకో పట్టాన అర్ధం కాదు” అని నిట్టూరుస్తావా అని ఆలోచించా.

నువ్వు ఏమైనా అనుకొని ఉండచ్చు కానీ నేను నిన్ను ఎందుకు కలవలేదో నీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందనిపించింది. అందుకే ఈ ఉత్తరం. ఇదే నీకు నా చివరి ఉత్తరం కావచ్చు.

నిజానికి నేను నువ్వు రాకముందే అక్కడికి వచ్చాను. మనం కలుద్దామనుకున్న టిఫిన్ హోటల్లో నేను రెండింటికే వచ్చి కూర్చున్నాను. కలం పేరుతో రచనలన్నీ చేస్తూ ప్రపంచానికి ఎప్పటికీ అజ్ఞాతంలోనే ఉండాలని నిర్ణయించుకున్న నా అభిమాన రచయిత నన్ను ఒక్కడిని మాత్రం కలుస్తున్నాడని ఆనందంతో ఉప్పొంగిపోవాల్సిన సమయంలో నాలో ఒక భయం మొదలైంది.

సర్వర్ చాయ్ తెచ్చి నా ముందు టేబుల్ మీద పెట్టాడు. గ్లాసు మరీ వేడిగా ఉందని కాసేపు దాన్ని అలాగే ఉంచాను. అక్కడ కూర్చొని చూస్తే బైట రోడ్డు బాగా కనబడుతుంది. ఎంట్రన్స్ నుండి రెండో టేబులే కాబట్టి హారన్ శబ్దాలు కూడా స్పష్టంగా వినబడుతున్నాయి. ఎదురుగా కిరాణా కొట్లు, ఎలక్ట్రిక్ షాపులు, హార్డువేర్ షాపుల వద్ద సరుకులు కొనుక్కోడానికి వచ్చిన మిడిల్ క్లాస్ మనుషులతో రోడ్డు రద్దీగా వుంది. పాత స్కూటర్లు, టీవీఎస్ ల మీద ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు ఇరికించుకుని వెళ్తున్నారు. మాసిపోయిన చొక్కాలకి చెమటలు తుడుచుకుంటున్నారు. పక్కనే టీ బడ్డీ దగ్గర టీ తాగడానికి ఆగిన ఆటోవాడొకడు దిగుతూ దిగుతూ ఎర్రటి పాన్ పరాగ్ రోడ్డు మీద ఊస్తున్నాడు. అటుగా నడిచి వెళ్తున్న ఒకాయన ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ ఆ పాన్ పరాగ్ కొంత ఆయన చెప్పు మీద పడ్డ విషయం గుర్తించలేదు. ఒక లారీ వేగంగా అటూ వెళ్లి రోడ్డు మీద దుమ్మునంతా గాల్లోకి లేపింది. అప్పుడే ముదిరిన ఎండ ఆ దుమ్ముని మరింత స్పష్టంగా చూపిస్తుంది. విశ్వాన్ని వండి వారుస్తూ పైన సన్నగా మునివేళ్లతో కొబ్బరి కోరు చల్లినట్టు దేవుడు mediocrity ని మెల్లగా చల్లుతుంటే ఇక్కడ ఒక్క చోటే అది ఒక పెద్ద ముద్దగా పడిపోయినట్టు, ఈ మూర్తీభవించిన మామూలుతనం ఆ ఎండకీ దుమ్ముకీ చిక్కబడి తారులా కారుతూ జిడ్డుని నా మనసుకి అంటించిపోయింది. అప్పుడు కలిగింది నాకు భయం.

నువ్వు కూడా చూడటానికి ఆ ఎలక్ట్రిక్ షాపు యజమానిలా మామూలుగా ఉంటే? నాకు సాధారణ మనుషుల మీద condescension ఉందనుకుంటున్నావు కదూ? ఉంది. నా మీద నాకు కూడా. ప్రత్యేకమైన మనుషులు కూడా డబ్బో అందమో పేరో కప్పుకున్న సాధారణ మనుషులే నాకు. ప్రత్యేకంగా కనిపించేది నువ్వొక్కడివే.

అందుకనే నిన్ను కలిసాక, నువ్వు పేదగా కనిపిస్తే చులకనైపోతావేమో, నీ రచనల్లో అంతర్లీనంగా ఉండే angst అంతా ఆర్ధిక భారంగా లెక్కగట్టేస్తానేమో. నువ్వు డబ్బున్నోడివైతే వెచ్చగా ఒక చోట కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు అనిపిస్తుందేమో. నువ్వు వికారంగా కనిపిస్తే అందం లేని వెలితిని నీ రచనా పటిమతో పూడ్చుకుంటూ దీన్నో compensatory crutch గా వాడుకుంటున్నావనేసుకుంటానేమో. మరీ అందంగా ఉంటే నేను alienate అయిపోయి మన మధ్య మానసికంగా ఉందనుకున్న దగ్గరితనాన్ని ఇకపై feel అవ్వలేనేమో. ఈ మామూలుతనం లోంచి నన్ను దూరంగా లాక్కెళ్ళే నీ మాటలని, నిన్ను నేరుగా కలిసి నిర్వీర్యం చేసేస్తున్నానా అని సందేహమొచ్చింది. ఆకాశం నుండి కింద పడటం ప్రారంభం అయినట్టు, పీడకలలో ఊపిరందక అరుపు పైకి రాక మౌనంగా కొట్టుకున్నట్టు అమాంతం ఏదో భయం కమ్మేసింది నన్ను.

మనందరికీ జీవితంలో అర్ధం కానివీ, అందుకోలేనివీ ఉండి తీరాలని నీ “పక్షి కన్ను” కధలో నందిని ఎందుకన్నదో అర్ధం అయినట్టు అనిపించింది. మన మనసుల్లో సగం సగం నిర్వచించబడి, మిగిలిన సగాలు ఏ ఆకాశంలోనో, అనంతంలోనో, చిగురాకు తడిలోనో, సైకిల్ చక్రం కిరి కిరి శబ్దం లోనో దాచబడి ఉన్న భావాలని గుర్తించి ఆ సగాల్ని కలిపి పదాల్లోకి పట్టి కధలు రాస్తావు నువ్వు. అలా ఒక పదంలో ఇరికించేసినా ఆ భావం పూర్తి కాదని విశ్వమంతా అది చెదిరిపోయి ఉంటుందని, సముద్రపు ఒడ్డున శంఖానికీ నక్షత్రమండలంలో హీలియం తెరకీ రూపంలో ఉండే సారూప్యతలో అన్నీ ముడిపెట్టబడి ఉంటాయని, మాటలకు ఉండే ఈ పరిధి మంచిదే అని ఒక చోట అన్నవుగా ఏదో కధలో. అది ఎంత నిజమో అర్ధం అయిందప్పుడు.

నిన్ను నేరుగా కలిస్తే నువ్వు కూడా సముద్రం ఒడ్డున శంఖంలాగే ఐపోతావు నాకు. ఇక ఆకాశం వైపు చూడనేమో. కానీ అలా నా తలను నక్షత్రాల వైవు తిప్పావని కదా నిన్ను అంత అభిమానించింది. అందుకే నువ్వు రాక ముందే వెళ్ళిపోయా.

నువ్వెవరో నీ రూపం ఏంటో నీ కష్టం ఏంటో నాకు తెలియకూడదు. నీ పదాల్లో నిన్ను కొద్ది కొద్దిగా ఏరుకొని, వేరే కధలో భిన్నమైన కోణం నువ్వు చూపించినప్పుడు నిన్ను పూర్తిగా పారేసుకుని, మళ్లీ నీ మాటలు నా జీవితానికి సరిగ్గా సరిపోయినప్పుడు గుర్తుచేసుకొని, మనసులో నిన్ను ఎన్నో బొమ్మలు గీసుకొని, నీ మీద ఇన్ని ప్రశ్నలతో ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండాలని వెనక్కి వచ్చేసాను. ఆ రోజు ఆ వీధిలో పారిన సాధారణత్వం నిన్ను అంటితే చూడలేకే వెనక్కి వచ్చేసాను. నాకు నీలా మాటలు చేత కావు కనక నీకు అర్ధమయ్యిందో లేదో తెలీదు. అర్ధం చేసుకోడానికి ప్రయత్నించు.

ఉంటాను.

నీ

వి.కే

Painting: Satya Birudaraju

స్వరూప్ తోటాడ

1 comment

Leave a Reply to Ram perumandla Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • #నిశబ్దపు_శ్వాస
    అదొక నాలుగు రోడ్డుల కూడలి
    దిక్కులన్నీ విడిపోతాయి
    ఎదురొడే గాలి తెప్పలన్ని
    తలంపై నేలకొరుగుతాయి
    నినాదాలను, పోరాడే హక్కులను
    నిర్భయంగా హత్యజేసే స్వేచ్ఛను
    చూసి కొన్ని “ఒంటి కన్నులు”
    జబ్బలెగరేస్తాయి.
    ఆధిపత్య తైలం పూసుకొని మీసాలు దువ్వుకుంట కదులుతూ
    ఎత్తిన పిడికిళ్లకు తూటాలై
    తన అసలు రంగు పూయుటకు
    దేహాల పొత్తిళ్లలో పిడిగుద్దులను
    ముద్రిస్తూ
    రాజ్యం సంతకాలు సేకరిస్తున్నది.
    అవును రాజ్యమంటే
    కత్తుల కొనలకంటిన రక్తపు ధార.
    శవాలు పరిచిన దారిలో
    నడుస్తున్న కిరాతకం.
    నిజాన్ని నినదిస్తుంటే
    గొంతును బిగపట్టే తడిబట్టను
    కట్టుకున్న ఎర్రటి నుదురు .
    అందుకే
    ఇప్పుడు ఆ కూడలి నిశబ్దాన్ని
    శ్వాసిస్తున్నది
    రేపటికీ రొమ్ములిడిచే మరిన్ని ప్రశ్నలను
    తన గాయాల రక్తంలో తడుపుతూ ..

    -రామ్ పెరుమాండ్ల
    9542265831

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు