నిశ్శబ్దం – శబ్దం

   కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని పాటించడానికై అడవులకు వెళ్లిపోయారు. ధర్మరాజు పాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉంది. భీముడు, అర్జునుడు, నకులసహదేవులు నలుగురు రాజ్యపాలనలో, ధర్మస్థాపనలో నిమగ్నమై అన్నకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉన్నారు.

ఆంతరంగిక మందిరాన్ని వదిలి భీముడు, ద్రౌపది ప్రకృతిని ఆశ్వాదించడానికి ఉద్యానవనంలోకి వచ్చారు. పరిమళాన్ని వెదజల్లే పుష్పాలు, తుమ్మెదల ఝంకారాలు, చిరుగాలికి ఊగుతున్న లేత తీగలు అన్నీ వాళ్ల మనసుకు ఆనందాన్నిస్తున్నాయి. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ భీముడు ద్రౌపదితో “దేవీ..! నీకోసం ఒకప్పుడు సౌగంధికా పుష్పాన్ని తెచ్చిన రోజులు గుర్తుకొస్తున్నాయి” అన్నాడు.

“అవును. ఇలాంటి సుందర ప్రకృతిని చూసి, అస్వాదించి ఎంత కాలమైంది?” అన్నది ద్రౌపది.

“అవును. అరణ్యవాసం, అజ్ఞాతవాసం, రాయబారం విఫలమవడం, భయంకరమైన యుద్ధంలో విజయం మనసొంతమవడం, అన్న సింహాసనం అధిష్టించడం… ఇప్పుడు దొరికింది ప్రశాంతత” మనసు తేలికపడినట్లు అన్నాడు భీముడు.

“ఒక్కసారి గతాన్ని తలచుకుంటే ఎంతో భయంగా ఉంటుంది. ఇన్ని కష్టాలకు ఓర్చి, నా అయిదుగురు పుత్రులను కూడా యుద్ధంలో పోగొట్టుకుని ఏం సాధించానా అనిపిస్తుంది?” ద్రౌపది గొంతులో ఏదో బాధ తొంగిచూసింది.

“అదేంటి దేవి..!? నీవు ఈ సకల సామ్రాజ్యానికి పట్టమహిషివి. ఇంత మంది దాసీలు? ఇంత సంపద? ఇన్ని సుఖాలు? ఇంతకన్నా ఇంకేం కావాలి?” అడిగాడు భీముడు.

“అవును. నిజమే! అయిదుగురు భర్తలు. దేవతలనైనా జయించే పరాక్రమవంతులు. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించి, ధర్మాన్ని స్థాపించారు. కానీ నాలో ఏదో అసంతృప్తి” నెమ్మదిగా అన్నది ద్రౌపది.

“అసంతృప్తా… ఇంకానా!?” భీముడు అనుమానంగా అన్నాడు.

“అవును.. నిండు సభలో అవమానం పొందాను. అజ్ఞాతవాసంలో దాసిగా జీవించాను. కీచకుడి చేతిలోంచి తృటిలో తప్పించుకున్నాను. ఇప్పుడు సుఖంగా ఉన్న..! ఉన్నానా..? సంతోషంగా ఉన్న…! ఉన్నానా?” చివరి పదాన్ని నొక్కి పలికింది ద్రౌపది.

అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ద్రౌపది మాటలు భీముడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.

“ఏమైంది దేవీ? నీ మనసు పరిపరి విధాలా అనాలోచితంగా ఉంది. ఆ కొలను దగ్గరకు వెళ్లి చల్లటి గాలిని ఆశ్వాదిద్దాం.. రా…” అంటూ భీముడు ద్రౌపదిని కొలను దగ్గరకు తీసుకెళ్లాడు.

కొలను పైనుంచి గాలి చల్లగా శరీరాలను తాకుతున్నా ద్రౌపదిలో ఎలాంటి మార్పు రాలేదు.

“నిన్ను ఎవరైనా, ఏమన్నా అన్నారా? అన్న ధర్మరాజు నీ మనసును నొప్పించారా? మనసులో తీరని కోర్కెలు ఇంకా ఏమైనా ఉన్నాయా?” అనునయంగా అడిగాడు భీముడు.

“లేదు… లేదు.. వారు ఎప్పుడు రాజధర్మం, లోకనీతి గురించే ఆలోచిస్తుంటారు. నా గురించి ఆలోచించే తీరికెక్కడిది? ఒక్క జూదంలో తప్ప” నిష్ఠూరంగా అన్నది ద్రౌపది.

ద్రౌపది మాటకు భీముడు కొంత నొచ్చుకున్నా… ఆమెపై ఉన్న అమిత ఇష్టంతో…

“ఈ సరికొత్త భావనాలోచనకు కారణం మరి!?” ప్రేమగా అడిగాడు.

“నిన్న దాసీలు నన్ను అలంకరిస్తున్నప్పుడు, నా మనసులో ఓ చిత్రమైన, వాస్తవమైన ఆలోచన వచ్చింది. నేను అనుభవిస్తున్న సంతోషం, సుఖం, పట్టమహిషి హోదా… అన్నీ నావి కాదుకదా అని”

ఆ మాటలకు భీముడి ముఖంలో రంగులు మారాయి.

“అలా ఎందుకు అనుకుంటున్నావు దేవీ? మాతోపాటు కష్టాలు, కన్నీళ్లు అనుభవించావు. అడవుల్లో తలదాచుకున్నావు? విరాటరాజు ఇంట ఎన్ని బాధలు పడ్డావో మర్చిపోయావా? ఈ ఆనందం, సుఖం నీకు సొంతంగాక ఇంకెవరికి?” కంగారుగా అడిగాడు.

“నేను అనుభవించిన కష్టాలు, ఇప్పటి సుఖాలు.. నేను అనుభవించాల్సినవి మాత్రమే కావు. ఎందుకంటే నాకంటే ముందే ఈ పాండురాజు కుటుంబానికి పెద్దకోడలు ఉంది” కచ్చితంగా ఉన్నాయి ద్రౌపది మాటలు.

భీముడికి అర్థమైంది ద్రౌపది ఎవరి గురించి మాట్లాడుతుందో..! కానీ అర్థంకానట్లు ముఖం పెట్టి “పెద్దకోడలా?” అన్నట్లు ప్రశ్నించాడు.

“మీకు నటించడం రాదు. అందులోనూ నా ముందు నటించడం అసలు రాదు. మీకు తెలియక కాదు, గుర్తుకు రాకా కాదు. అయినా చెప్తా వినండి. హిడింబి. మీ మొదటి భార్య” అన్నది ద్రౌపది.

ద్రౌపది ముక్కుసూటిగా చెప్పడంతో భీముడు ఏమీ మాట్లాడలేక పోయాడు. తడబడుతూ “అదీ… అదీ.. ఆ రోజు అమ్మ మాటలు కాదనలేక అలా మా అన్నదమ్ముల్లో నేనే మొదటి వివాహం చేసుకున్నాను” అన్నాడు.

“అవును. తర్వాత ఎప్పుడైనా ఆమె గురించి పట్టించుకున్నారా? యుద్ధంలో తన ఒక్కగానొక్క పుత్రుడ్ని కోల్పోయింది. ఇన్ని సుఖాల్లో నేను ఇప్పుడు మునిగితేలుతున్నాను. సంతోషంగా ఉన్నాను. ఆమె కూడా రాజమాతగా గౌరవం, హోదా పొందడానికి తగిన ఇల్లాలు కాదా?” అన్నది ద్రౌపది.

ఆ మాటలకు భీముడు ఆలోచనలో పడ్డాడు.

“అవును నిజమే.. తన ప్రేమకోసం అన్నను కూడా కోల్పోయింది. ఆ తర్వాత అతి కొద్దికాలం మాత్రమే కొండలు, గుట్టలు, నదీ నదాల మధ్య సుఖాన్ని, సంతోషాన్ని నాకు పంచింది. ఆపై తనను వదిలేసి వచ్చేశాను. పైగా యుద్ధంలో తన కొడుకు ఘటోత్కచుడు చూపిన పరాక్రమం అంతా ఇంతా కాదు” తనలో తానే తర్కించుకుంటూ ఆలోచనలో పడ్డాడు భీముడు.

మళ్లీ ద్రౌపది కల్పించుకొని

“కర్ణుని శక్తికి బలైపోయాడు హిడింబి ఒక్కగానొక్క కొడుకు. ఒకవేళ అతనే ఆ రాత్రి యుద్ధంలో అడ్డుపడకుంటే.. అర్జునుడిపై కర్ణుడు దేవేంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించేవాడు. అంటే అర్జునునికి ప్రాణదానం చేశాడు హిడింబి, మీకు పుట్టిన ఘటోత్కచుడు” అని గుర్తుచేసింది.

భీముడు ఏదో తప్పు చేసినట్లు తల వంచుకున్నాడు. మళ్లీ ఆలోచనలో పడ్డాడు.

స్వచ్ఛమైన ప్రకృతిలో కలిసిపోయి, ఏ అధికారాలు, ఆజ్ఞలు లేకుండా, మనస్ఫూర్తిగా హిడింబి అందించిన ప్రేమను ఎలా మర్చిపోగలను? తొలిసారి అనుభవంలోకి వచ్చిన నిస్వార్థమైన ప్రేమ హిడింబిది. తనంతతానుగా వచ్చి తనను వలచింది. పైగా తన అన్న హిడింబాసురుడ్ని చంపిన తర్వాత ఎటు వెళ్లాలో దిక్కుతోచక తల్లి కుంతితోపాటు అయిదుగురు అన్నదమ్ములు అడవిలో ఉంటే.. శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్లండి అక్కడ దప్పిక, ఆకలి లేని సరస్సు నీళ్లు ఉంటాయని మార్గం చెప్పింది. కర్తవ్యబోధ చేసింది. పైగా అక్కడికే కదా… ! వ్యాసుడు వచ్చి తమ భవిష్యత్ కార్యాచరణ చెప్పింది. హిడింబి చేసిన సాయం, చూపిన ప్రేమ ఎలా మర్చిపోగలడు?

ఆలోచనలతో భీముడి మనసు వేడెక్కింది. “ద్రౌపదీ… ఇక్కడి నుంచి వెళ్లిపోదాం” అంటూ ద్రౌపదికోసం కూడా చూడకుండా.. ఆంతరంగిక మందిరానికి వెళ్లిపోయాడు భీముడు.

ద్రౌపది కూడా ఆ ఆలోచనలతోనే మందిరానికి వెళ్లింది.

భీముడు వెళ్లి హంసతూలికా తల్పం మీద పడుకున్నా అతడి ఆలోచనలన్నీ హిడింబి చుట్టూనే తిరుగుతున్నాయి. తలనొప్పి ఎక్కువకావడంతో దాసీలను పిలిచాడు. ఒకరు వింజామరతో గాలి వీస్తుంటే, మరొకరు తల నొప్పి తగ్గడానికి ఔషధం రాస్తున్నారు. అయినా భీముడి మనసు తేలిక పడడం లేదు.

సేవకులను పిలిపించాడు. వారితో “మీరు ఎన్ని రాజ్యాలైనా, ఎన్ని అడవులైనా, నదీ పరివాహక ప్రాంతాలైనా తిరగండి. శోధించండి. హిడింబి ఆచూకి తెలుసుకొని. మీ భర్త భీమసేనుడు తీసుకరమ్మన్నాడని, వెంటబెట్టుకరండి” అని ఆమె రూపు రేఖల గురించి వివరించి. చిత్రపటం గీయించి మరీ పంపించాడు.

****   ****   ****   ****

ద్రౌపదికి ఏ అలంకరణ చేయించుకోవాలన్నా, పట్టమహిషిగా సభలో కూర్చోవాలన్నా, సేవకులు, దాసీలు ఇచ్చే గౌరవాన్ని పొందాలన్నా… ఎక్కడో తెలియని అసంతృప్తి, అర్జునుడు ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను వివాహం చేసుకున్నా వాళ్లందరూ రాజస్త్రీలుగా సుఖాలు అనుభవించిన వాళ్లే. కానీ హిడింబి మాత్రం అలా కాదు. రాజస్త్రీ భర్తతో కలిసి అనుభవించే ఏ సుఖాన్ని, సంతోషాన్ని ఆమె పొందలేదు. ఆమె కూడా అవన్నీ పొందితే బాగుండు అని ఆలోచించసాగింది.

ఓ వారం రోజుల తర్వాత భీముడు పంపిన సేవకులు వచ్చారు. ఆ వార్త తెలుసుకున్న ద్రౌపది కూడా సంతోషంగా భీముని మందిరానికి వచ్చింది, అక్క హిడింబిని చూడొచ్చని సంతోషంతో…

సేవకులు భీముడితో-

“మహారాజా…! ఆమె హిమాలయ దిగువప్రాంతంలో ఉన్నారు. మీరు పంపారని చెప్పినా, తీసుకురమ్మన్నారని మనవి చేసినా.. రానన్నారు. మా ప్రయత్నం మేము చేశాం. మన్నించండి” అని వినయంగా చెప్పి, నమస్కారం చేసి వెళ్లిపోయారు.

ఆ మాటలు విన్న భీముడి అహం దెబ్బతిన్నది.

“ఇంతటి మహారాజ్యానికి అధిపతైన ధర్మరాజు తమ్ముడ్ని, కొండలనైనా పిండి చేయగల బలవంతుడ్ని. ఒకప్పుడు తన ప్రేమకోసం తపించిన హిడింబి.. భార్య. నేనే స్వయంగా రమ్మని కబురు పంపితే రాననడమా..?! రాజ్యాధికారాన్నే కాదు, భర్తననే నా అధికారాన్ని కూడా హిడింబి లెక్కచేయడం లేదా!? లేక తనను, తన ప్రేమను ఇప్పుడు చులకనగా చూస్తుందా.. !?” ఆక్రోషంగా అన్నాడు భీముడు.

అక్కడే ఉన్న ద్రౌపది భీముడి అంతరంగాన్ని గ్రహించింది. భీముడి మీదున్న ప్రేమతో “నేను వెళ్లి అక్క హిడింబిని ఒప్పిస్తాను. నేను అనుభవిస్తున్న సుఖాల్లో, హోదాల్లో తనకూ పాలు ఉందని చెప్పి తీసుకొస్తాను” అని భీముడి మనసును తేలిక పరిచి హిడింబి పరిచారికులతో దగ్గరకు బయల్దేరింది.

****   ****   ****   ****

ఆగి ఆగి కురుస్తున్న మంచు జడులు. ఆ తుహిన బిందువుల మీద నుంచి వీస్తున్న చల్లటి పరిమళభరితమైన గాలి. లే ఎండకు మెరుస్తున్న చిగురాకులు. గాలికి వయ్యారంగా ఊగుతున్న సన్నని లతలు, దివికి వేసిన ఆకుపచ్చని నిచ్చెనల్లా పెరిగి ఉన్న పెద్దపెద్ద సాలు వృక్షాలు. మనసుకు స్వచ్ఛతను ఆపాదిస్తున్న మంచుతో కప్పబడిన చిన్నచిన్న పర్వత శ్రేణులు. వాటి మధ్య ఎండకు మెరుస్తున్న సరస్సులు… ప్రకృతిని రసరమ్యం చేస్తున్నాయి.

వాటి మధ్య పరిచారికులతో నడుస్తున్న ద్రౌపదికి అరణ్యవాసం చేసిన రోజులు మదిలో మెదిలాయి. ఈ రోజూ భోగాలు అనుభవిస్తున్నా… ఆ అడవుల్లో తిరిగిన రోజులే బాగున్నాయేమో అనిపించింది. దూరంగా ఒక ఎత్తైన కొండ మీద పూర్తిగా చెట్ల కొమ్మలతో, ఆకులతో కట్టిన కుటీరం కనిపించింది. సేవకులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం అది హిడింబిదేనని మనసులో నిర్ణయించుకొని అటుగా నడవడం మొదలుపెట్టింది ద్రౌపది. దగ్గరయ్యే కొద్దీ ఆ ప్రాంతంలోని నిశ్శబ్దం ద్రౌపది మనసుకు హాయినివ్వసాగింది.

ద్రౌపది అడుగుల చప్పుడు విని హిడింబి కుటీరం లోపల నుంచి బయటకు వచ్చింది.

పరిచయాలు, పరస్పర ఆలింగనాలు, అతిథి మర్యాదలు ఆయిన తర్వాత ఇద్దరూ ఓ బండరాయి మీద కూర్చున్నారు. దూరం నుంచి గంగానది శబ్దం మంద్రంగా వినిపిస్తుంది.

“చెప్పు ద్రౌపది… ఇంతకాలానికి ఇలా వచ్చావు? ఏదైనా ప్రత్యేక విశేషమా?” అడిగింది హిడింబి.

ద్రౌపది ముక్కుసూటిగా, ఇతర విషయాలు మాట్లాడకుండా…

“నేను అనుభవిస్తున్న రాజభోగాలు, సంపద, పట్టమహిషి హోదా.. వాటిలో నిన్నూ చూడాలని వచ్చాను” చెప్పింది ద్రౌపది.

ఆ మాటలకు హిడింబి విరక్తిగా నవ్వింది. ఆ నవ్వుకు అర్థం ద్రౌపదికి బోధపడలేదు. అందుకే తను మళ్లీ…

“అన్నదమ్ముల్లో పెద్దవాడైన ధర్మరాజు భార్యను నేనైనా, భీముడి తొలి భార్యగా పాండవవంశానికి తొలి కోడలివి నువ్వు. అందుకే మాతో కలిసి ఉందువు…” అని వివరంగా చెప్పింది.

మరోసారి విరక్తిగా నవ్వి హిడింబి “నేను భీముడ్ని ప్రేమించాను. అతను క్షత్రియుడని, రాజ్య సంపదలు అనుభవించవచ్చని, పట్టమహిషిగా సుఖాలు పొందాలని కాదు. అప్పటికి అతను క్షత్రియుడని కూడా నాకు తెలియదు. అతని నుంచి ప్రేమను మాత్రమే కోరుకున్నాను. సొంత అన్నను పోగొట్టుకున్నా, అతని ప్రేమకోసమే తపించాను. అది పొందాను, అంతవరకే. ఆ ప్రేమ చాలు నాకు. నీవు అనుకునే సంపదలు, సుఖాలు… వాటన్నింటితో నాకు సంబంధం లేదు” అన్నది హిడింబి.

హిడింబి మాటలు ద్రౌపదికి కొత్తగా అనిపించాయి. హిడింబి కళ్లలోకి చూసింది. అవి స్వచ్ఛమైన తెల్లటి కలువల్లా ఉన్నాయి. హిడింబి మనసు కూడా అలాంటిదేనని తెలిసివచ్చింది. హిడింబి చెప్తూనే ఉంది..

“నిజం ద్రౌపది, నాకు ప్రకృతి అంటే ఇష్టం. ఆ రోజుల్లో కూడా ఇలాంటి కొండలు గుట్టలు, పచ్చని గుబురుల్లో, ప్రవహించే సెలయేళ్ల మధ్య భీమునితో గడిపాను. మా ప్రేమకు ఘటోత్కచుడు పుట్టాడు. వాడు యుద్ధంలో ఎలా చనిపోయాడో నీకూ తెలుసు. నన్ను రమ్మంటున్నావు. సంతోషం, సుఖం ఉన్నాయంటున్నావు? మనస్ఫూర్తిగా చెప్పు నువ్వు సంతోషంగా ఉన్నావా? నీకు నువ్వు ఉన్నావా? నీలో నువ్వు ఉన్నావా?” అని అడిగింది.

ద్రౌపదికి హిడింబి ప్రశ్న కొత్తగా అనిపించింది. ఏవేవో ఆలోచనలు ముంచెత్తాయి.

“నువ్వు అంటున్నది నాకు అర్థం కావడం లేదు” అడిగింది ద్రౌపది.

“నా గురించి చెప్తా విను… నీ గురించి నాకు అర్థమవుతుంది. నాకు పుట్టినప్పటి నుంచి ప్రకృతి అంటే ఇష్టం. అది నా మనసు. ప్రకృతి సౌందర్యంలో నా మనోలతలు విచ్చుకుంటాయి. మనసు ఆనందంతో కేరింతలు కొడుతుంది. భీముడితో అతి తక్కువకాలం గడిపినా, ఘటోత్కచుడు దూరమైనా నాకు నేను మిగిలే ఉన్నాను. ఒక స్త్రీగా నా సంతోషం నాకు ఉంది. నా నుంచి నేను దూరమవలేదు. దూరమవను కూడా.. అదే నా వ్యక్తిత్వం. నేనే అది. భీముడు, పెళ్లి, ఘటోత్కచుడు… అన్నీ నా ప్రయాణంలో ఓ భాగం మాత్రమే. నన్ను నేను కోల్పోయి, ప్రకృతి మయమైన ఈ సౌందర్యదృష్టిని నేను కోల్పోలేదు. కోల్పోను కూడా. ఒక స్త్రీగా నా తత్త్వం అది. వ్యక్తిత్వం అది. నా అభీష్టం ప్రకృతితో మమేకమై బతకడం” వివరంగా చెప్పింది హిడింబి.

ఆ మాటలు చెప్తున్నప్పుడు హిడింబిలో ద్రౌపదికి స్వచ్ఛమైన అస్తిత్వ ఆకాంక్ష తాలూకూ మూలలు కనిపించాయి. ఆమె ముఖంలో ప్రకాశించే కాంతిని ద్రౌపది పూర్తిగా పసిగట్టింది.

ఆ మాటలకు ద్రౌపది ఆలోచనల్లోని పునాదులు కూలుతున్నాయి. ఆమె వ్యక్తిత్వపు లోతుల్లో కొత్త తవ్వకాలు మొదలయ్యాయి. అప్పటి వరకు చల్లగా వీచిన పవన వీచికల్లో వేడి సెగలు మొదలయ్యాయి.

“నా గురించి నేను ఎందుకు తెలుసుకోలేక పోయాను? అత్త కుంతి, వ్యాసుడి మాటలు విని అయిదగురిని వివాహం చేసుకున్నాను. సంప్రదాయ ధర్మానికి తలొంచాను. భర్తకున్న జూద వ్యసనానికి బలయ్యాను. ఆ తర్వాత నిండుసభలో వస్త్రాపహరణం, భరించలేని అవమానం. ఎవరికోసం? అజ్ఞాతవాసం. అరణ్యవాసం అనుభవించాను. వారివల్లే..! భర్తలు క్షత్రియులు. వాళ్లు రాజ్యధర్మాన్ని పాటించాలి. వాళ్లకు అధికారం కావాలి. నేనూ అదే లోకం అనుకున్నాను. వాళ్లను అనుసరించాను. వాళ్ల రాజ్య కాంక్షకు కొడుకులూ బలయ్యారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్న సంతోషం, సుఖం అనుకున్నవి నాలో ఉన్నాయా? నేను నిజంగా కోరుకున్నవా? లేక వాళ్ల అధికారం, రాజ్యధర్మం, భావజాలం నాలో కల్పించినవా…?” తొలిసారిగా ద్రౌపదిలో ద్రౌపది తొంగి చూసింది.

నా మనసేంటి? నా ఇష్టాయిష్టాలేంటి? ఆలోచనలేంటి? నా శక్తియుక్తులేంటి? నాకై నేను పొందే ఆనందాలేంటి? ఒక స్త్రీగా నేను ఏంటి.. ? పతిధర్మం, పతివ్రత, పట్టమహిషి అంటున్నారు. నేనూ అనుకుంటున్నాను. ఇదంతా కల్పితమా… మాయా.. నాకు నేనుగాని ఓ సుందర మాయాజాలమా…? నా చుట్టూ అల్లిన ఓ కల్పనా వలయమా..!? ఎవరు కల్పించారు!!? హిడింబి చెప్పినట్లు ఈ సుందర ప్రకృతి ఎంత అందంగా ఉంది! ఇక్కడ అడుగుపెట్టగానే నా మనసు ఎందుకు సంతోషమయమైంది? పులకించింది? పట్టమహిషిగా, ధర్మరాజు భార్యగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా ఇంత ఆనందం నా హృదయంలో కలగలేదే?! మరి ఇంతకాలం నాది కాని లోకంలో చిక్కుకుని ఉన్నానా? ఇప్పుడు హిడింబి నా ఆంతరంగిక లోకానికున్న కళ్లు తెరిపించిందా? అని తనను తాను పరిశోధించుకుంది. శోధించుకుంది.

ఒక స్త్రీగా, సొంతంగా, తనకుతాను సరికొత్తగా పరిణామం చెందుతూ ఉంది ద్రౌపది.

ఎవరికి వాళ్లే ఆత్మశోధన చేసుకోవాలని భావించిన హిడింబి అక్కడి నుంచి సెలయేళ్లు సందడి చేస్తున్న దృశ్యాన్ని తిలకించడానికి వెళ్లిపోయింది.

****   ****   ****   ****

ధర్మరాజు సింహాసనం మీద కూర్చొని, పట్టమహిషిగా ద్రౌపది ఎక్కడా అని అడుగుతున్నాడు. భీముడు హిడింబి దగ్గరకు వెళ్లిందని చెప్పడానికి వెనకాడుతున్నాడు. ఆ సమయంలోనే ఆస్థాన పురోహితులు వచ్చారు. ద్రౌపదితో కలిసి రాజ్యం సుభీక్షంగా ఉండటం కోసం భార్యాసమేతంగా ఓ వ్రతం చేయాలని సలహా ఇచ్చారు.

ద్రౌపది మాత్రం హిమాలయాలలో హిడింబి కుటీరం దగ్గర ఏకాంతంగా తనలోకి తాను పరకాయ ప్రవేశం చేసి ఓ స్త్రీగా ప్రకృతిలో లీనమై తాదాత్మ్యం పొందుతూ ఉంది.

ఓం.. శాంతి… శాంతి.. శాంతి

———————–

గమనిక: మహాభారతం ప్రకారం కొడుక్కు రాజ్యాన్ని అప్పగించిన తర్వాత హిడింబి తపస్సుకై హిమాలయాలకు వెళ్తుంది. నేడు హిమాచల్ ప్రదేశ్ మనాలిలో హిడింబికి ఓ గుడి ఉంది. అక్కడి ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని భీమ్ తాల్ కు 3. కి.మీ. దూరంలో హిడింబ పర్వతం కూడా ఉంది.

*

 

ఎ.రవీంద్రబాబు

8 comments

Leave a Reply to డా. పట్టపు. శివకుమార్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంత గొప్ప ఆలోచన.. నిశిత నిగూఢమైన ఈ రహస్య పరిశీలన… మనోఫలకం పై స్ఫురించి ఇంతటి గాఢమైన కథారూపాన్ని తీసుకోవడం అద్భుతమైన విషయం. తార్కిక మైన ఆలోచన, సునిశితమైన మనస్సుల అంతరంగాల ఆవిష్కరణ వెరసి… ఈకథ. ఇతిహాసాలు, చరిత్ర, కాలమూ ఉపేక్షించిన పాత్రల వ్యక్తిత్వాన్ని ఒడిసిపట్టుకుని, ఆ పాత్రలో అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈకథ…

  • కథ ఎంతో బాగా రాశావు రవీంద్రా.నమ్మవేమో కానీ, 3 సార్లు చదివాను ….అంత ఇష్టంగా. భీముడి దర్పం, అహం హిడింబి వ్యక్తిత్వం ముందు మరుగుజ్జులా తోచింది. “ఒక స్త్రీగా నా సంతోషం నాకు ఉంది. నానుంచి నేను దూరమవలేదు . అవనుకూడా ..” అనే హిడింబి మాటల వెనక ఎంత గొప్ప సత్యం దాగివుందో . నిజమే , మన మంతా మనకోసం జీవిక సాగించక , మరెవరికోసమో తాపత్రయ పడుతుంటాం. రమణీయమైన హిమాలయ సానువుల వర్ణన మనసుకు హాయిగా అనిపించింది . మనస్పూర్తిగా అభినందిస్తున్నాను రవీంద్రా .

  • “ద్రౌపది ఆలోచనల్లోని పునాదులు కూలుతున్నాయి. ఆమె వ్యక్తిత్వపు లోతుల్లో కొత్త తవ్వకాలు మొదలయ్యాయి. అప్పటి వరకు చల్లగా వీచిన పవన వీచికల్లో వేడి సెగలు మొదలయ్యాయి.” పునాదులు కూలగొట్టడానికి, కొత్తతవ్వకాలు తవ్వటానికే డా.రవీంద్ర ఈ కథ రాశాడు. ఆఫీసులోనే తన సిస్టమ్ లోనే చదవమని చూపాడు. అపుడెందుకో ఇంతగా స్ఫందన కలగలేదు. నిజంగా చాలా బాగుంది. నిరంజన గారి ” మాధవి ” నవల , చలంగారి అనసూయ, చంద్రమతి, అహల్య కథలు జ్ఞఆపకానికి వచ్చఆయి.

  • మహాభారతంలోని పాత్రలు అంతరంగిక మనో వాస్తవికాఆ విష్కరణ… పాత కథ కొత్త ఆవిష్కరణ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు