నిశ్శబ్దంలో శబ్దం

ముసలితనం

ఏరోజుకారోజు

దాని నీరసంలో

చిన్నబుచ్చుతూనే ఉంది

 

నిజాల్ని అద్దం

కటువుగా అయినా

పాడి విపిస్తూనే ఉంది

 

నిన్ననన్ను ఎప్పుడో వదిలేసింది

నేడుకూడా నెమ్మది నెమ్మదిగా వదిలేస్తూనే ఉంది  

రేపుఒక్కటే నాకోసం ఎదురు చూస్తోంది

రాత్రి ఏదేదో చెబుతూనే ఉంటొంది

నాకు అర్ధం కాకుండా ఉంది

 

పగలు క్రిందినుండి పైకి

రాత్రి పైనుండి క్రిందికి

కొండను చదువుకుంటూనే ఉన్నాను

 

అదేమిటో

నా మతిమరుపు

దాని అన్ని రెక్కల్నీ విప్పుకొని

వెతుకూతూనే పోతోంది

దేనికోసం వెతుకుతోందో కూడా మరచిపోయి

మెడదాకా నీళ్లలో మునిగి

నీటికోసం ఆరాట పడుతున్నట్టు

 

అన్నన్ని నదుల్ని లోపలుంచుకొని

ఏ నది

ఎక్కడి నది

ఎక్కడుందని సముద్రం అడిగినట్టు

అన్నన్ని ముత్యాల్ని

లోపలెక్కడో దాచుకొని

ఏమీ ఎరగని సముద్రంలా

వయస్సు

 

అన్నీ మరచిపోయి

సమయంతోపాటు నడవటానికి

నిశ్సబ్దాన్ని గెలిచే

కవిత్వాన్నో సంగీతాన్నో

వెతుక్కుంటూనే ఉన్నాను.

 

అయినా నాతో నడుస్తున్న

నిశ్శబ్దానికి నేను ఏమి ఇవ్వగలను

శబ్దాలు చేయలేని పలికే పదాలు తప్ప

*

ముకుంద రామారావు

7 comments

Leave a Reply to vijay kumar svk Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంత చదివినా కొండ అర్థం కాదు. నదుల సంగమం గురించి సముద్రం చెప్పదు.
    పోయెం చాలా బాగుంది. అనేకమైన మరపుల మధ్య దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి.

    • ధన్యవాదాలు అండి

      ముకుంద రామారావు

  • గొప్ప కవిత్వం. చిక్కని పద చిత్రాలు లోతైన భావనలను ఛాయామాత్రంగా కనుపింపచేస్తూ మనసుకు విందు చేశాయి.
    మీరు ఇది నాకు పంపినందుకు సంతోషం.
    🙏👍👌

  • గురువు గారు నమస్తే! కవిత్వం మనిషి సాదరణత్వం ను అసాధారణ వ్యక్తీకరణ గా తీర్చిదిద్దుతుంది. మీది కొందరకు అనుభవంలో ఉండే ఒక ప్రత్యేక దశను విశ్వజననీయంగా అద్భుతంగా కవిత్వికరించారు.మాటకు అనంత శక్తి ఎలా వస్తుందో తెలిసిన వారు ముకుంద వారు.గాఢమైన ఆనుభూతుల ప్రవాహం లోకి మీతోపాటు నన్ను లాక్కెళ్లారు మీరు.

  • బాగుంది సార్..వృద్ధాప్యాన్ని సముద్రంతో పోల్చడం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు