నిప్పుల కొలిమిలో జీవితాన్ని వెలిగించిన కథ

మానవీయతను ఏ క్షణమూ కోల్పోవద్దని ముగిసే ఒక ఆకురాయిలాంటి కథ ఇది!

వలా రచయిత్రిగానే విశేష ఖ్యాతి పొందిన పోల్కంపల్లి శాంతాదేవి సుమారు 70-80 దాకా కథలు కూడా రాశారని చాలా మందికి తెలియదు. ఎందుకంటే వీరు రాసిన నవలా సాహిత్యం ఒకప్పటి దిన, వార, మాస పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వెలువడి, ‘చండీప్రియ’, ‘వరమాల’, ‘పచ్చిక’ ‘పుష్యమి’, లాంటి నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ‘ప్రేమ పూజారి’, ‘పాణి గ్రహణం’, ‘కాలపురుషుని హెచ్చరిక’, ‘రక్తతిలకం’, ‘పూజా సుమం’, ‘ప్రేమబంధం’, ‘జీవన సంగీతం’, ‘దేవదాసీ’, ‘సుమలత’ ‘అడవిమంట’ ‘ఆత్మబంధువు’ లాంటి 62 నవలలు రాశారు. ‘నైనా’ నవల 2008లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘రచయిత్రి ఉత్తమ గ్రంథం’ పురస్కారాన్ని పొందింది. పఠనాసక్తిని కలిగించి అత్యధికంగా పాఠకులను పెంచిన నవలా రచయిత్రుల్లో వీరు కూడా ఒకరు.

మనుషుల్లో మరుగున పడిపోతున్న మానవతా విలువల్ని తట్టిలేపి, మంచి దారిలో నడవడానికి స్ఫూర్తి నిచ్చిన నవలెన్నో రాసిన పోల్కంపల్లి శాంతాదేవి ఇదే కోణంలో తాను రాసిన కథల్లో కొన్నింటిని 2010లో ‘మరణం అంచున మందహాసం’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు. వీరి కథలపైనా, సాహిత్యం పైన పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. వీరు కేవలం రచనలకే పరిమితం కాకుండా ‘స్త్రీ చైతన్య స్రవంతి’ అనే సంస్థను ప్రారంభించి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వీరి ప్రసిద్ధ కథ ‘నివురు తొలగిన నిప్పు’ కథ ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. ఈ కథ మొదట 1980లో ‘యువ’ మాస పత్రిక దీపావళి సంచికలో ప్రచురింపబడింది. ఈ కథ కన్నడం లోకి కూడా అనువాదం అయ్యింది.

రమణ బి. ఏ ఫైనలీయర్ స్టూడెంట్. తాయారమ్మ అనే ఒక పేదరాలి కొడుకు. రమణకు ఏడాది వయసున్నప్పుడే తండ్రి చనిపోతాడు. వాళ్ళ నాన్న ఇచ్చిపోయిన చిన్న పెంకుటింట్లో ఉంటూ, పల్లెలో వాళ్ళకున్న పొలంలో పండిన పంటతో బతుకుతుంటారు. తాయారమ్మ రాట్నం వడికి పై ఖర్చులు, రమణకు చదువుకయ్యే ఖర్చులను వెళ్లదీస్తుంది. కానీ ఈ మధ్య తాయారమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రాట్నం వడకడం లేదు. ఈ దరిద్రంతో రమణ ఇక తాను చదవలేనని, ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని అంటాడు. ఉద్యోగం దొరికే వరకు చదువు మానవద్దని తల్లి తాయారమ్మ చెప్తుంది. రమణ బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాసవుతాడు. మెరిట్ స్కాలర్ షిప్ కూడా వస్తుంది.

రమణ రోజూ నిద్ర లేకుండా చదవడం వల్ల ఒళ్ళు బాగా వేడి చేసింది. పొరుగింటి సీతమ్మ ఊళ్ళో అందరికీ పాలు వాడుకగా పోస్తుంది. ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగని రమణ సీతమ్మను ఒక గ్లాసు మజ్జిగ అడిగి లేదనిపించుకుంటాడు. కాలేజీ ఫీజు వంద రూపాయలు కట్టాల్సి ఉన్నది రమణ. ఈ వంద రూపాయలు కట్టి పరీక్షలు రాస్తేనే రమణ చదువు పూర్తవుతుంది. కానీ ఆ ఫీజు ఎలా కట్టాలో రమణకు బోధపడదు. తన ఇంటి ఎదురుగా ఉన్న ఈశ్వర్ రావు అనే న్యాయవాదిని ఒక వంద రూపాయలు అప్పుగా ఇమ్మని అడుగుతాడు. కానీ ఆయన తన దగ్గర లేవని ఐదు రూపాయలు దానం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రమణ ఆ అయిదు రూపాయలు తనకు వద్దని అవమానంతో వచ్చేస్తాడు. దీనితో తాయారమ్మ ఎలాగైనా కొడుకు కాలేజీ ఫీజు కట్టాలని సిగ్గు విడిచి తనతో పాటు రాట్నం వడికే శారదమ్మ ఇంటికి వెళ్ళి తన కొడుకు కాలేజీ ఫీజు కోసం వంద రూపాయాలు అప్పుగా ఇవ్వుమని అడుగుతుంది.

శారదమ్మ కూడా తన దగ్గర డబ్బులు లేవని చెబుతుంది. కానీ శారదమ్మ ఇంట్లో తాత్కాలికంగా నివాసముంటున్న శారదమ్మ పెద్దమ్మ తాయారమ్మ బాధను చూడలేక తన కళ్ల ఆపరేషన్ కోసం దాచుకున్న మొత్తం లోంచి వంద రూపాయలు తీసి తాయారమ్మకు ఇస్తుంది. శారదమ్మ చీర కొనుక్కుంటానని ఎన్ని సార్లూ అడిగినా రూపాయి ఇవ్వని పెద్దమ్మ తీరు చూసి శారదమ్మ విసుక్కుంటుంది. రమణ ఆ రోజు సాయంకాలం వెళ్ళి శారదమ్మ పెద్దమ్మకు కృతజ్ఞతలు చెప్తాడు.

రమణకు పక్కింటి సవిత అంటే చాలా ఇష్టం. కానీ సవిత మాత్రం ఎప్పుడూ రమణను ఇష్టపడేది కాదు. పైగా పీరు కట్టే అని ఏడిపించేది. కొన్నాళ్ళకు రమణకు ఫైనలీయర్ పరీక్షలు కూడా అయిపోతాయి. వెంటనే ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరిపోతాడు. జీతం మూడు వందలు. దీనితో రమణ తన జీవితంలోకి ఇప్పుడిప్పుడే కాస్త వసంతం తొంగి చూస్తుందనుకుంటాడు. రమణ ప్రైవేట్ ఉద్యోగంతోనే తృప్తి పడక IAS కు రాసి సెలెక్ట్ అవుతాడు. అప్పుడు రమణను చిన్న చూపు చూసిన సీతమ్మ, ఈశ్వర్ రావు, సవిత పశ్చాతాప పడుతారు. రమణకు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత అదే ఊళ్ళో కలెక్టర్ గా పోస్టింగ్ వేస్తారు. రమణ కొద్ది రోజుల తరువాత తన చిన్న పెంకుటిల్లును కూలగొట్టి అక్కడే పెద్ద భవనాన్ని కట్టిస్తాడు. రమణ కృతజ్ఞతా భావంతో తనకు ఫీజు కట్టి ఆదుకున్న శారదమ్మ వాళ్ళ పెద్దమ్మకు కళ్ల ఆపరేషన్ చేయిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు కళ్ళు రావు. తన నూతన గృహ ప్రవేశానికి ఎంతో మందిని పిలుస్తాడు రమణ. వాళ్ళతో పాటు శారదమ్మ పెద్దమ్మను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఆరిపోతున్న దీపానికి నూనె పోసినట్లుగా ముఖ్య దేవతగా గౌరవిస్తారు. ఆమెకు కళ్ళు లేని లోటును రమణ, తాయారమ్మ తీరుస్తుంటారు.

కష్ట పడితే నిప్పులాగా, సింహంలాగా బతకవచ్చునని నిరూపించిన కథ ఇది. చీకటిలో ఉన్న మనిషి ఇక తన జీవితం నిండా చీకటేనని అనుకోవద్దు. కష్టపడితే మన జీవితంలో కూడా వెలుతురు ప్రసరిస్తుందని ఉదాహరణ ప్రాయంగా చెప్పిన కథ. మనిషికి డబ్బుంటేనే విలువ. డబ్బు లేని సందర్భంలో కీటకం కంటే కడహీనంగా చూడబడుతాడు ఈ కథలో రమణ. అలాగే ఉన్నదాంట్లోనే పొదుపుగా ఎలా బతకాలో చెప్తుంది తాయారమ్మ పాత్ర. మన చుట్టూ ఉన్నవాళ్లనెవర్నీ తక్కువగా చూడవద్దని ప్రతి మనిషికి ఒక రోజు తప్పకుండా వస్తుందని మౌనంగా చెప్తుందీ కథ.

మనల్ని ఆపదలో కాపాడిన వారిని జీవితాంతం మర్చి పోవద్దని కూడ బోధిస్తుందీ కథ. చదువు విలువ, డబ్బు విలువ, మనిషి విలువ, పేదరికపు స్పర్శ, తోటి మనిషికి సహాయపడే మనస్తత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వం, స్వీయాభిమానం ఇలా ఎన్నో కోణాల మధ్య మనల్ని నిలబెట్టి జీవితాన్ని పరిచయం చేస్తుందీ కథ. కథ చాలా సరళ శిల్పంలో సాగినా చివరికొచ్చే సరికి మనలో ఒక గొప్ప ఆత్మ విశ్వాసం, జీవితాన్ని గెల్చి తీరాలనే ఒక పట్టుదలను, ఒక మానవీయ సంస్కారాన్ని కల్గిస్తుందీ కథ. రమణ పాత్ర ఇప్పటి యువతరానికి ఎంతో స్ఫూర్తినందించే పాత్ర. శారదమ్మ వాళ్ళ పెద్దమ్మ పాత్ర కూడా ఎప్పటికీ పాఠకుల మనసులో నిల్చిపోయే పాత్ర. తాను చదువుకోకున్నా, తన కొడుక్కు కూడా చదువు అబ్బక చివరికి జ్వరంతో చనిపోయినా ఆమెకు చదువు మీద మమకారం చావదు. అందుకే చదువులో ఫస్ట్ వస్తోన్న రమణకు అడగ్గానే డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది.

వాస్తవిక జీవితం నుండి కథాంశాన్ని ఎన్నుకోవడం వల్ల కథ ఎక్కడా అభూత కల్పనగా తోచకుండా ప్రతి సంఘటనలో జీవితపు తడి తాకుతుంది. ఆస్తిపాస్తులు లేకున్నా మధ్యతరగతి మనిషిని చదువే ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని ఇందులోని ప్రతి అక్షరం సాక్ష్యమిస్తుంది. కష్టాలెన్నెదురైనా పోరాడుతూ నిలబడాలని, విజయం సాధించగానే ఉబ్బి పోకుండా తాను ఎక్కి వచ్చిన మెట్లను మర్చి పోవద్దని, ప్రతి మనిషి అంతరంగంలో ఉండే మానవీయతను ఏ క్షణమూ కోల్పోవద్దని ముగిసే ఒక ఆకురాయిలాంటి కథ ఇది. కష్టాల పలుగు రాయికి మనల్ని మనం రాసుకొని జీవితంలో మిలమిలా మెరవాలని, బతుకులో పర్చుకున్న చీకటిని తిడుతూ కూర్చునే కన్నా ఒక చిరు దీపాన్ని వెలిగించి జీవితాన్ని కాంతివంతం చేసుకోవాలనే ఒక స్ఫూర్తిని మిగిల్చే కథ.

*

కథ

నివురు తొలగిన నిప్పు

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

6 comments

Leave a Reply to Dr. Veldandi Sridhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సంగ్రహంగా కథను మా ముందు ఉంచారు. చక్కగా తెలిపిన విధానం బాగుంది సార్. నిజంగా ఈ రమణ పాత్ర లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఆ పాత్ర కష్ట పడే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి దాయకంగా ఉంది. కథను మొటివేషన్ గా తీసుకోవచ్చు. ఇలాంటి మంచి కథను చిత్రం గా తీసే దర్శకులు ముందుకు రావాలి మొత్తంగా శ్రీధర్ సార్ కు ధన్యవాదాలు.

    ఘనపురం సుదర్శన్
    పరిశోధక విద్యార్థి
    ఉస్మానియా విశ్వవిద్యాలయం.
    9000470542

  • శఖంలో పోసిన నీరు తీర్థం అయినట్టు, హృద్యమైన కథ మీ విశ్లేషణతో పరిపూర్ణత సంతరించుకుంది శ్రీధర్ గారు. పోల్కంపల్లి శాంతాదేవి గారి కథ “కథా కచ్చీరు” లో పరిచయం చేయడం సంతోషం కలిగింది. ధన్యవాదాలు.

  • mee vishleshana chala bagundi. katha link icchaaru . katha chadivina tarvata …..intha manchi kathanu andinchina meeku kruthagnatalu .munu mundu inka manchi kathala andistarani ashistunnaanu.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు