నిజమైన ‘ఆత్మీయులు’ ఎవరు?

“Parental love is the only love that is truly selfless, unconditional and forgiving”
-Dr. T. P. Chia

యౌవనపు తొలి వాకిట్లో నిల్చున్నప్పుడు అపోజిట్ సెక్స్ పట్ల విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చి జీవితమంతా కొత్తబంగారు లోకాన్ని మరిపిస్తుంది. ప్రపంచాన్ని జయించినంత ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అందుకే సృష్టిలో ఏ రసమైనా ప్రేమ రసంలో సంలీనం కావాల్సిందేనని కొంత మంది ఆలంకారికులు చెప్తుంటారు. నిజానికి ప్రపంచమంతా ప్రేమమయమే. అయితే ఏది అసలైన ప్రేమ. ఏది ఆకర్షణ, ఏది ‘అవసరం’ అనేది తేల్చుకోవడానికి ఎంతో విచక్షణ, పరిణతి కావాలి.

ఒక్కోసారి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని కూడా కాదని ప్రేమిక/ప్రేమికుని వెంట అన్నీ విడిచి వెళ్లి పోతాం. తీరా కాలు బయట పెట్టాక మన పొరపాటేమిటో గ్రహింపుకొస్తుంది. కాని అప్పటికే జరగాల్సిన తీరని నష్టం జరిగిపోతుంది. కొన్ని సార్లు ఆ పొరపాటును సవరించుకోలేం కూడా. ఉడుకు రక్తంలో ఈ పొరపాట్లు మరిన్ని ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అట్లా యౌవనపు వేడిలో ప్రియుని చేయి పట్టుకొని సర్వం కోల్పోయిన ఒక ‘చిత్ర’మైన కథే ఆత్మీయులు. 

పిల్లల ఆరోగ్యం దృష్ట్యా, భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు ఎన్నో ప్రతిబంధకాల్ని సృష్టిస్తారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న చిత్ర ఆటో డ్రైవర్ ప్రేమలో పడుతుంది. అదీ అప్పటికే పెళ్ళైన వాడితో. వాడు అరచేతిలో స్వర్గం చూపించి వెంట తీసుకొచ్చిన నగలు, డబ్బు అయిపోయేదాకా కాపురం చేస్తాడు. పెళ్లి విషయం ఎత్తితే మీ వాళ్ళ ప్రేమతో పాటు ఆస్తి కూడా కావాలంటాడు. “తల్లిదండ్రులు చేసే నియంత్రణను పిల్లలు ప్రేమ రాహిత్యంగా భావించి, బయటి వ్యక్తులు దురుద్దేశంతో అందించే తాయిలాలను ప్రేమ కానుకగా భావిస్తే.. నిండు జీవితం బండపాలవుతుంది” అని గ్రహించిన చిత్ర వాడిని వదిలించుకుంటుంది. తన స్నేహితురాలైన చిత్ర కథనంతా ఆమె తల్లి సుభద్ర ద్వారా విన్న చిత్ర స్నేహితురాలు కావ్య కూడా ఎవరితోనో లేచి పోవడానికి సిద్ధమై పోతుంది. చివరికి ఈ కథంతా విన్న కావ్య ఏం చేసిందో మనం ‘ఆత్మీయులు’ కథలో చదవాల్సిందే.

ఇప్పటి యువతీ, యువకుల డొల్లపూరితమైన ప్రేమలకు ఈ కథ ఒక చెంప పెట్టు లాంటిది. అనాదిగా పురుషుడు స్త్రీని ఎంత సునాయసంగా మోసగిస్తున్నాడో తెలుసుకోవడానికి ఈ కథ ఒక నిదర్శనం. రెండు అరచేతుల మధ్య దీపం లాగా ఆడపిల్లను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా పెంచుతారో కూడా తెలపడానికి ఈ కథ ఒక నిలువుటద్దం. క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు చేస్తున్న కట్టడిని పిల్లలు ఎలా చూస్తారో ఈ కథ చాలా సున్నితంగా చెప్తుంది. తల్లిదండ్రుల కఠీనత్వం వెనుక దాగియున్న ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ కథ ఒక చేదబావి లాంటిది. ప్రేమికుడితో సినిమాలకు, షికార్లకు తిరుగుతున్నప్పుడు చాల సరదాగా ఉంటాయి. కాని వాటి ఫలితం, ప్రభావం అనుభవిస్తున్నప్పుడు తెలిసి వస్తుంది.

జీవితంలో అన్నీ కోల్పోయాక తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. చిత్రమేమిటంటే జీవితంలోని ఏ దశలోనైనా తల్లిదండ్రులు పిల్లల క్షేమాన్నే ఆశిస్తారు. ఆ విషయం గ్రహించకుండా తల్లిదండ్రులనే శత్రువులుగా భావించడం శోచనీయం. పిల్లలకు తల్లిదండ్రులు అందించినంత ప్రేమ మరెవరూ అందించలేరనేది వాస్తవం. అయితే పిల్లలు వాళ్ళ ఆవేశంలో అది గ్రహించక ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పరిస్థితులేమిటో, పర్యవసానాలేమిటో తెలుసుకోకుండానే పిల్లలు నిండు జీవితాన్ని కోల్పోతున్నారు.
ప్రేమ దాని పర్యవసానాలు తల్లిదండ్రుల పెనుగులాట, యువ ప్రేమికుల ఉబలాటం ఇవన్నీటిని కథకుడు చాలా లాఘవంగా ఈ కథలో పొందుపర్చాడు. తెలుగు సాహిత్యంలో ఇప్పటి దాకా కొన్ని వేల ప్రేమ కథలు వచ్చి ఉంటాయి. వాటిల్లో ఈ కథ ప్రేమలోని వేడిని, వాడిని, తద్వారా వాడిపోతున్న జీవితాల్ని కళ్ళకు కట్టించిన కథ.

వస్తువుతో పాటు కథ చెప్పడానికి కథకుడు ఎన్నుకున్న శిల్పం వల్లనే ఈ కథ ఒక ఉత్తమ కథగా నిల్చుంది. ఈ కథలోని కావేరి అనే మరో ప్రేమికురాలి మార్గాన్ని మార్చడానికి ఈ కథంతా జరుగుతుంది. పాత్ర చిత్రణ కూడా కథకు నూటికి నూరు పాళ్ళూ సరిపోయింది. చిత్ర, శామ్యూల్ లు ఈ నాటి ఆధునిక ప్రేమికులకు ప్రతీకలైన పాత్రలు. సుభద్ర ఒక బాధ్యతగల తల్లి. కావేరి తన పొరపాటును గ్రహించి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకున్న ఈ కాలపు అమ్మాయి.

జీవిత భాగస్వామిని ప్రేమించి ఎన్నుకోవడం సరైందే కాని ఆ ప్రేమలో కల్మషం పాలు ఎంత? తేనె పాలు ఎంత? వెన్నెల పాలు ఎంత? నిప్పుల పాలు ఎంత అని గ్రహించడంలోనే అసలు జీవిత గమ్యం దాగి ఉంది. ఈ రహస్యాన్ని ఎవరు ఎంత తొందరగా గ్రహిస్తే వాళ్ళే జీవిత విజేతలు. అలాగాక ప్రేమ అనే ఎండమావుల వెంట పరుగెడితే జీవితం బుగ్గి పాలయ్యే అవకాశం లేకపోలేదని ఈ కథ హెచ్చరిస్తుంది. అలాగని ప్రేమించడం తప్పని చెప్పదు. అడుగు వేసే ముందు ఒకసారి ఆలోచించమని చెప్తుంది. ఒక సారి కాలు జారాక వెనక్కి తీసుకోవడం ఎంత కష్టమైన పనో మనసుకు హత్తుకునే విధంగా చెప్తుంది.

ప్రేమ అనే దీపం చుట్టూ తిరుగుతూ దానిలోనే పడిపోయి జీవితాన్ని చాలిస్తున్న ప్రేమ పురుగులకు ఈ కథ ఒక దిక్సూచి. అందమైన జీవితాన్ని మరింత అందంగా మలుచుకోవడానికి తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలని చెప్పే ఈ కథను రాసింది వర్ధమాన తెలంగాణ కథకుడు, విమర్శకుడు, నాటక కర్త, ప్రయోక్త, గాయకుడు, చిత్రకారుడు, సభా వ్యాఖ్యాత, ఉపాధ్యాయుడు కటుకోజ్వల మనోహరాచారి. మనోహరాచారి ఇప్పటిదాకా ఏకలవ్య – బుర్ర కథ (1998), వినాయక చవితి భజన కీర్తనలు (2002), సుమ మాల భక్తి గీతాలు (2004), మందార మాలిక సమాహార కళాకృతులు (2008), నవ్వుతున్న నేలతల్లి – కథా సంపుటి (2013), అక్షరం అభిమతం కవితా సంపుటి (2018), 45కు పైగా కథలు, 30 దాక గేయ, వచన నాటికలు రచించారు. ఇంతేగాక తెలంగాణా పాఠ్య పుస్తకాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. వీరు తయారు చేసిన 6-10 తరగతులకు చెందిన పలు డిజిటల్ పాఠాలు మన టీవి ద్వారా ప్రసారం అయ్యాయి. ఇంతటి సాహిత్య కృషికి గాను వీరు ఎన్నో పురస్కారాలను పొందారు.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

12 comments

Leave a Reply to గంగుల నరసింహారెడ్డి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అభినందనలు
    కథాసాహిత్య రచనలు సమర్ధులైన రచయిత కటుకోజ్వల మనోహరాచారి గారు. వారికున్న విశేష జీవితానుభవంకు సృజన మేళవించి రాసిన ఈ కథ నేటియువతకు కనువిప్పు. మంటలకు ఆకర్షింపబడ్డ పురుగులు, వెలుగు అనుకొని భ్రమపడి మంటల్లో పడి కాలి పోయినట్టుగా నేటి యువత నకిలీ నకిలీ ప్రేమల మంటల్లో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
    సాహిత్య ప్రధాన పరమావధి సామాజిక ప్రయోజనం. అటువంటి సామాజిక ప్రయోజనం ఉన్న కథ అందించిన రచయితకి మనస్ఫూర్తిగా అభినందనలు.
    నిజమైన “ఆత్మీయులు” ఎవరు? తో సాహిత్య సమీక్ష విమర్శ చదివిన తర్వాత సమీక్షకులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారు పాఠకులు కథను ఆసక్తికరంగా వేగంగా చదివించడంలో విజయవంతం అయ్యారని నా అభిప్రాయం.
    “ప్రేమ దాని పర్యవసానాలు తల్లిదండ్రుల పెనుగులాట, యువ ప్రేమికుల ఉబలాటం ఇవన్నీటిని కథకుడు చాలా లాఘవంగా ఈ కథలో పొందుపర్చాడు.”, ఈ వాక్యంలో కథ సారాన్ని ఒడిసిపట్టి పాఠకులకు చెప్పడం ద్వారా సమీక్షకులు కథపై ఆసక్తిని రెట్టింపు చేశారు. డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారికి అభినందనలు.

  • ఒక గొప్ప విమర్శకుడు……….మంచి విశ్లేషణ….అభినందనలు

  • నేటి తరానికి ప్రేమ గురించి తెలియడానికి మంచి కథను ఎంచుకున్నారు రచయిత,శ్రీధర్ సర్ మీరు ఈ కథ ద్వారా నిజమైన ఆత్మీయులు ఎవరో బాగా విశ్లేషించారు.

  • బాగుంది విశ్లేషణ సార్ రెండు కథల జోడింపు ఒకటి అంతంతో ఆరంభం ,మరొకటి ఆరంభంతో అంతం

  • అన్నగారూ… కథ మీద నీ విశ్లేషణ నా ఆలోచనకంటే మరింత లోతుగా ఉంది. నీ సమీక్ష చదివాక పాఠకులు కథ చదవకుండా ఉండలేము అనిపిస్తుంది. ధన్యవాదములు.

  • చక్కటి విశ్లేషణ శ్రీధర్ సర్. నేటి యువత తప్పక చదవాల్సిన పుస్తకం.

  • The critical discerning and anatomical analysis of the short story ” Nizamaina Athmeeyulu evaru…. is a scholarly one.
    There’s an adage which says” history repeats itself”! The whole history of mankind is,it is Pleasantly oblivious of the harsh and hard realities of life. The parents,elders, well wishers,true friends who are selfless and honest always guide us, advise us,warn us and oppose us when our path or actions are not constructive and conducive…

    However, as the subtext of the short story and the analysis of the Critic Dr Veldandi Sridhar say , it is always parents who are viewd negatively as obstructions to the freedom and liberty!! As usual, they realise the Bonafides of the parents is toooo late and irreparable!!
    Both the writer and the analyst are unanimous that the only true ones who are the most concerned with the wellbeing and safety of the children are always parents!!! A story of message ..by Kotukojwula Manohara chary gaaru,and an edifying analysis… by Dr Veldandi Sridhar… both deserve kudos.

  • ఇటువంటి కథలు ఆహ్వానించతగ్గకథలు. చేతులుకాలాక ఆకుల చందాన పడకుండా…కాస్త ఏమరుపాటుతో తన కోరికతో నిండివున్నపడుచుతనపు రక్తిని భద్రత, భాద్యత ను విడనాడి ఓ మైకంలో …తమకంతో పడిపోతున్న అమ్మాయి …అదే అదునుగా మగాడు ముందుకుఉరికి…ఆమె జీవితాన్ని అనుభవించీ …సరే నీ కథ కంచికి …నేను మా ఇంటికి అనే చందనగా నడిచే కథలెన్నో….అన్ని కాలాలలోనూ ఇవి జరుగుతున్నవే…
    పేరేట్సు కట్టడియే కారణంకాదు దీనికి, పేరెట్సు నమ్మకంతో ఇచ్చె స్వేఛ్ఛకూడాకారణం అనుకుంటా.
    ఈ కధ కు రచయిత కథనంద్వారా పండించాడని నా నమ్మకం.
    ఇలాంటికథలను పదిమందిచెత చదివించాలి…ముఖ్యంగా యూత్ … యుక్తవయసులో ఉన్నవాళ్ళు చదివితే..మనకి మనంఏవిటొ అర్థంచెసుకుని …మనమేమి చెస్తున్నాం..ఏమి చేస్తే కష్టాల కడలిలొ దూకనవసరంలేకుండా మనకోరికలను సన్మార్గంలో నడచుకోవాల అనేది వ్యక్తమవుతుందని నా నమ్మకం.
    గొప్ప కథని రాసారండి. అందరంచదవాలి, చదివించాలి ముఖ్యంగా యూత్ చెత అని నా అభిప్రాయం. రచయితకు మంచి కథను అందించినందుకు కృతజ్ఞతలు.

  • ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలను చదివించాల్సిన కథ ఇది. వారెలాగూ చదవడానికి ఇష్టపడరు కాబట్టి సమయం-సందర్భం చూసుకొని తల్లిదండ్రులే తమ కూతుళ్లకు చదివి వినిపించాల్సిన కథ ; చెల్లింపుల్లో నూరిపోసి వారి మనసుల్లోకి ఇంకింపజేయాల్సిన కథ ఈ “ఆత్మీయులు”. అందుకు రచయిత నిజంగా అభినందనీయులు!
    ఇంత మంచి కథను ఎన్నుకున్నందులకూ, తనదైన శైలిలో అద్భుతంగా ‌ విశ్లేషించినందులకూ శ్రీ శ్రీధర్ గారికి రెట్టింపు అభినందనలు!!

  • “చెల్లింపుల్లో” అని తప్పుగా వచ్చింది ఎందుకో.
    దానిని “చెవుల్లో” గా చదువుకోగలరు.

  • సామాజిక స్పృహ తో మరీముఖ్యంగా యువత తమ ప్రేమ విషయం లో సరైన నిర్ణయం తీసుకొనేలా చేసే “ఆత్మీయులు” కథా రచయిత శ్రీ మనోహరాచారి గారికి, తన విశ్లేషణాత్మక చతురత తో ఆ కథను పదిమంది చదివేలా చేసిన శ్రీ వెల్దండి గారి కి హార్దిక అభినందనలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు