నిజంగానే నాకు మేలు జరుగుతుందా?

మతగ్రంథాల వల్ల కాకుండా, మిగతా ఇంకేవో బయటి గాలులు పీల్చడం వల్లనే మనుషులం ఈ మాత్రం మనుషులుగా ఉన్నామనిపిస్తుంది.

ఫీసుకు వస్తుంటే మెహిదీపట్నం దగ్గర్లో ఒకాయన లిఫ్ట్‌ కావాలన్నట్టుగా చేయెత్తాడు. ఆయన మాసాబ్‌ట్యాంక్‌ వైపు పోయేవాడు కాదని నిర్ధారించుకోవడానికి నేను బంజారాహిల్స్‌ వైపు పోతున్నానని చెప్పాను. ఎన్‌ఎండీసీ దగ్గర దింపితే చాలన్నాడు. ఎటువైపు పోయేదైనా ఫర్లేదన్నమాట.
ముస్లింగా ఉండటం వేరు; ముస్లిం అని తెలియడం వేరు. ఆ బట్టలూ, టోపీ ఆయన ఒక అస్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. నవ్వు ముఖం. యాభై దాటి ఉండొచ్చు. అసలే హెల్మెట్‌లో ఉన్నాను; ముక్కుకు అడ్డంగా కర్చీఫ్‌ కూడా కట్టుకున్నాను కాబట్టి, నా రూపురేఖ ఆయనకు తెలిసే అవకాశం లేదు. నా అస్తిత్వాన్ని నా ముఖం మీద ప్రకటించుకునేవాడిని కాదు కాబట్టి, నేనెవరై ఉంటానన్నది ఆయనకు తెలిసే అవకాశం లేదు. సరే, దగ్గరే కాబట్టి దింపాక ఆయన ‘షుక్రియా’ అని ఊరుకుంటే నాకిది రాయాలన్న ఆలోచన రాకపోయేది. ‘అల్లాహ్‌ మీకు మేలు చేస్తాడు’ అన్నట్టుగా ఇంకో వాక్యాన్ని కూడా జతచేశాడు.పుట్టుకతో నేను హిందువును అయినప్పటికీ– దేవుడు, ఆధ్యాత్మిక ప్రశ్నల్ని వెతుక్కునే క్రమంలో అన్ని మతగ్రంథాలనూ కొద్దికొద్దిగానైనా చదవడానికి ప్రయత్నిస్తున్నాను. అట్లా ముస్లింల పవిత్ర గ్రంథం కూడా చదువుతున్నాను.

‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆన్‌. ‘ప్రభూ! భూమిపై ఈ అవిశ్వాసులలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకు’మని కోరుతుంది. ఈ విధేయత ప్రకటించనివారిని– నూహ్, ఆద్, సమూద్, అర్‌–రస్స్‌ లాంటి జాతులకు జాతుల్నే అంతం చేసినట్టుగా చెబుతుంది. ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిన వివరం కాబట్టి, ఆ చావులన్నీ ఏకవాక్యాల్లోకి కుదించబడి ఉంటాయి. ‘ఎవరు అల్లాహ్‌ మార్గంలో తమ ఇండ్లను వదలి (వలస) పోయి, ఆ తరువాత చంపబడతారో లేదా మరణిస్తారో, వారికి అల్లాహ్‌ (పరలోకంలో) శ్రేష్ఠమైన ఉపాధిని ప్రసాదిస్తా’డంటుంది. ‘ఈ గ్రంథాన్ని తిరస్కరించేవారి వ్యవహారాన్ని నాకు వదిలెయ్యి; వారికి ఏమాత్రం తెలియనివిధంగా మేము వారిని క్రమేణా వినాశం వైపునకు తీసుకుపోతా’మంటుంది. దేన్నయినా అల్లాహ్‌ క్షమిస్తాడుగానీ, అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం(షిర్క్‌) అంటుంది. ‘మీరు మరియు మీ రాళ్ళదేవతలు నరకాగ్నికి ఇంధనం అవుతా’రని హెచ్చరిస్తుంది.

అలాంటప్పుడు నాలాంటి వాడికి కూడా అల్లాహ్‌ మేలు చేస్తాడా? మరి ఆ లిఫ్టు తీసుకున్నాయన అలా అన్నాడేమిటి? వందల ఏళ్ల క్రితపు పుస్తకంలోని వాక్యాల్ని యధాతథంగా తీసుకోవడం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అవుతుందా? మరి ఎప్పుడో రాయబడిన మనుధర్మ శాస్త్రాన్ని మన మేధావులు వారంలో రెండుసార్లు తగలబెడుతుంటారే!ఇది రాస్తున్నప్పుడు కొంతమంది ముస్లిం స్నేహితులు నా మనసులో మెదులుతున్నారు. వీళ్లను ఎంత ముస్లింలుగా లెక్కించాలి అనేది ఒక సమస్య. అంటే, నేను ఎంత హిందువునో వీళ్లు అంత ముస్లింలు అయివుండాలి. లేదా, నేను ఎంత హిందువును కాదో వాళ్లు అంత ముస్లింలు కాకపోయివుండాలి. ఇంకొక మతంలో ఉండటం అన్నది తప్పితే, వాళ్లు దాదాపుగా లేదా పూర్తిగా నాలాంటివాళ్లే. ఏ మతగ్రంథాలనైనా ఆ మతస్థులు విధిగా చదవకపోవచ్చు. అసలు మన ఉనికి కేవలం మన మతం కాకపోవచ్చు. పుట్టుక వల్ల మాత్రమే ఎవరైనా ఆ మతంలో ఉంటుండటం జరుగుతుండవచ్చు. మతగ్రంథాల వల్ల కాకుండా, మిగతా ఇంకేవో బయటి గాలులు పీల్చడం వల్లనే మనుషులం ఈ మాత్రం మనుషులుగా ఉన్నామనిపిస్తుంది. సమాజం ఉమ్మడిగా ప్రోది చేసుకుంటున్న విలువలు దాదాపుగా ఏ మతంవారికైనా వర్తిస్తాయి. కాబట్టే, మతాలన్నీ మంట గలిసినా మానవత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. ‘మధువు తాగు, ఖురాను కాల్చు, మక్కాను కూల్చు, విగ్రహాలను పూజించు, మనిషిని మాత్రం హింసించకు’ అంటాడు ఫార్సీ కవి ఖాజా హఫీజ్‌. ఇంత ఉదారత ఈ హఫీజ్‌ చదివి ఉంటాడనుకుంటున్న గ్రంథంలో కనబడకపోయినా– మతాలు, వాదాల కంటే మనుషులే గొప్ప అని నమ్మేవాడిని కాబట్టి, లిఫ్టు తీసుకున్నాయన ఆశీర్వచనమే ఆయన నమ్మే గ్రంథానికంటే బలమైనది అనుకుంటున్నా.

(ఆధార గ్రంథాలు: 1.దివ్య ఖుర్‌ఆన్‌ సందేశం తెలుగు భాషలో; అను: డాక్టర్‌ అబ్దుర్‌–రహీమ్‌ బిన్‌ ముహమ్మద్‌ మౌలానా. 2. దివ్య ఖుర్‌ఆన్‌ భావానువాదం; అను: మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది, షేక్‌ హమీదుల్లా షరీఫ్‌.)

పూడూరి రాజి రెడ్డి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మతం కంటే మనసు గొప్పది మంచి మాటలు ఎవరు పలికినా గొప్పవే

  • ముందుగా, ఆ ముస్లిం వ్యక్తి “అల్లాహ్‌ మీకు మేలు చేస్తాడు” – అని తెలుగులోనే చెప్పాడా?
    జనరల్గా సహాయం చేసిన వారికి కృతఙతగా, హైదరాబాదీ ముస్లింలు ‘జజాకల్లాహ్ ‘ అని గానీ, “అల్లాహ్ అఛ్ఛాకరే” అని గానీ అంటారు.
    దానర్థం – “మీరు నాకు సహాయం చేసినందుకు ప్రతిగా, అల్లా మీకు మేలు చేయాలని ఆశిస్తున్నాను” అని.
    దానికి ఎదుటి వ్యక్తి ‘ఆమీన్’ అనొచ్చు. లేదా, “ఆ తొక్కలే” అనే బ్రమ్హానందం టైపు ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి ఇగ్నోర్ చేయొచ్చు.
    మొత్తానికి, అల్లా మేలు చేయాలని ఆశించడం వరకే ఏ ముస్లిం ఐనా చేయగలిగింది. అల్లా అసలు మేలు చేస్తాడా,లేదా, చేస్తే ఎప్పుడు ఎలా చేస్తాడు- ఇవన్నీ అల్లాహ్ ఆధీనంలో ఉన్న విషయాలు. మానవ మాత్రులెవరూ కన్‌ఫం గా చెప్పలేరు.
    నా పర్సనల్ ఒపీనియన్ ఐతే –
    ఖురాన్ లోని – “మనిషి చేసే అణువంత మంచి కూడా పరిగణించబడుతుంది. మనిషి చేసే అణువంత చెడుకూడా పరిగణించబడుతుంది.”(ఖురాన్ 99:8 ) అనే వాక్యం ప్రకారం
    , రచయిత చేసిన మంచికి తప్పకుండా తగిన ప్రతిఫలం ఏదో ఒక రూపంలో పొందే అవకాశం ఉంది.
    ఇక వ్యాసంలో రాసిన మిగతా అంశాల గురించి చూస్తే – ఆ రాసిందాన్లోనే చాలా వరకూ సమాధానం ఉంది.
    వ్యాసంలో ఇలా ఉంది
    ####” ‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం అంటుంది దివ్య ఖుర్‌ఆన్‌. “####
    కరెక్ట్. ప్రతి మానవ ఆత్మ, సృష్టికర్త ఇచ్చిన తెలివితేటల్ని, ఇంగిత ఞానాన్ని(ఫ్రీ విల్) సరిగ్గా వినియోగించి, కేవలం సృష్టికర్తకే దాస్యం చేస్తామనీ, సృష్టికర్తకే విధేయులై ఉంటామనీ, సృష్టికర్తనే ఆరాధిస్తామనీ ప్రమాణం చేసే భూమిపైకి వచ్చిందనేది ఖురాన్ చెప్పే విషయం.
    కానీ, తీరా భూమిమీదకొచ్చాక, “సృష్టికర్త లేడు, గిష్టికర్త లేడు, మనిషి కేవలం గాలివాటుగా, శూన్యం నుండీ నథింగ్ వచ్చి, ఆ నథింగ్ నుండీ సమ్‌థింగ్ వచ్చి, ఆ సమ్‌థింగ్ నుండీ ఎవెరీథింగ్ వచ్చాయనీ” తీర్మానించేవారు కొందరు-
    మనిషి జీవితానికి అర్థమేలేదు, అసలు అర్థమెందుకుండాల, చనిపోయాక పూడుస్తే ఎముకలు,కాలుస్తే బూడిద తప్ప, ఇంకేం మిగల్దనీ, తిరిగిలేపి భూమిమీద చేసినపనులకు లెక్కచెప్పమని అడిగే అవకాశమే లేదని బల్లగుద్ది వాదించేవారు మరికొందరు,
    ‘మనుషుల్ని/మనిషి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్’ నే క్రియేటర్ అని పిలుచుకునేవారు మరికొందరు,
    డబ్బును,పరపతిని, పవర్ నూ ఆరాధించేవారు కొందరు, వీటిని పొందడానికి ఇతర వ్యక్తులకు దాసులుగా మారినవారు కొందరు..
    -ఇలాంటి వారందరూ సృష్టికర్తతో చేసుకున్న ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నట్లే లెక్క.
    మరి ప్రమాణమంటూ చేశాక, ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే దాని పరిణామాల్ని ఫేస్ చేయాల్సిందే కదా. ఆ పరిణామాల గురించే ఖురాన్ వివిధ రకాలుగా హెచ్చరిస్తుంది.
    ‘మేమలాంటి ప్రమాణమే చేయలేదు ‘-అని ఎవరైనా అంటే, మరీ మంచిది కదా. అప్పుడు వారికి ఇవేవీ వర్తించవని అర్థం. వారు చక్కగా దీనిని ఇగ్నోర్ చేయొచ్చు.
    ఇక్కడ ఆత్యంత కీలక విషయం- ముస్లిం కుటూంబాల్లో పుట్టినవారందరూ ప్రమాణానికి కట్టుబడినట్లు, ముస్లిమేతరులందరూ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లూ కాదు. ముస్లిం పేరు పెట్టుకున్నోల్లు కూడా చాలా మంది -డబ్బు,పరపతి,పవర్ లాంటి విషయాలని ఆరాధిస్తూ,వాటికి దాసులుగా ఉంటారు. వారందరూ ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించిన వారే. ఎవరి జీవితం ఏ ఏ ఆప్షన్ల మధ్య, ఎలాంటి ఎంపికల్ని చేసుకుందనే విషయం కేవలం ఆ వ్యక్తికి, సృష్టికర్తకీ మాత్రమే తెలుసు. అంతిమ దినం తీర్పు వీటి ఆధారంగానే ఉంటుంది, అది ముస్లింలకైనా, ముస్లిమేతరులకైనా.
    చావు కళ్ళముందు వచ్చి నిలబడగానే, మనిషికి తాను సృష్టికర్తతో చేసిన ప్రమాణం గురించి గుర్తుకు వస్తుందనీ, భూమి మీది ఈ తాత్కాలిక జీవితం, శాశ్వతమైన మరణాంతర జీవితానికి పరీక్షే అనే విషయం అప్పుడు గుర్తుకు వచ్చి, వేస్ట్ చేసుకున్న తన అవకాశం గురించి కుమిలి,కుమిలి ఏడుస్తాడనీ, మరో అవకాశం ఇవ్వమని ప్రాధేయపడతాడనీ ఖురాన్ లో ఉంది. (ఖురాన్ 23:99-100). ఇది మానవజాతి మొత్తానికి వర్తిస్తుంది తప్ప, కేవలం ముస్లిమేతరులకు కాదు.
    అదే పోస్టులో మరో లైను ###### ఈ గ్రంథాన్ని తిరస్కరించేవారి వ్యవహారాన్ని నాకు వదిలెయ్యి#####
    ‘వారి వ్యవహారాన్ని నాకు వదిలేసి, నీవు వారితో న్యాయంగా వ్యవహరించమనే ఖురాన్ చెప్తుంది తప్ప’ గ్రంధాన్ని తిరస్కరించేవారితో గొడవపడమనో, వారిని బలవంతపెట్టో, ప్రలోభపెట్టో ముస్లింలుగా మార్చమనో ఖురాన్ చెప్పదు. అది ఆ వ్యక్తికీ, అతన్ని పుట్టించిన సృష్టికర్తకూ మధ్య ఈక్వేషన్. దీనితో వేరే ముస్లింలకేం సంబంధం లేదు. అందుకే, గల్ఫ్ దేశాల్లో కొన్ని కోట్ల మంది భారతీయ ముస్లిమేతరులు పని చేస్తున్నా, ఏ ఒక్కరిపై గానీ మతం మార్చుకొమ్మని దాడులు జరిగినట్లు ఎవ్వరూ వినలేదు. భారత దేశం, 600 ఏళ్ళ పాటు ముస్లిం రాజుల పాలనలో ఉన్నప్పటికీ, ఎక్కడో ఒకటీ,అరా తప్ప బలవంత మతమార్పిడులు జరగలేదన్నది చరిత్రకారులు ఎప్పుడో తేల్చేసిన విషయమే.
    ఖురాన్ 44:53 ఇలా అంటుంది. –
    “We will show them Our signs in the horizons and within themselves until it becomes clear to them that it is the truth. But is it not sufficient concerning your Lord that He is, over all things, a Witness?”
    అలాంటి signs ఏవీ మాకు కనిపించలేవనేవారు, అదే ఆర్గ్యుమెంట్ అంతిమ దినం నాడు సృష్టికర్త ముందు చేసి, ఏవైనా మినహాయింపులు పొందే అవకాశం తప్పక ఉండే ఉంటుంది.
    నా పుస్తకం- “చార్లెస్ డార్విన్-రామ్‌గోపాల్ వర్మ-ఓ ముస్లిం”లో, ఇదే కాన్స్పెట్ ని, అండమాన్ లోని సెంటనలీస్ తెగ వారి ఎగ్జాంపుల్ తో వివరించాను. ఆసక్తి ఉన్నవారు చదవవచ్చు.
    ఇక, ఈ వ్యాసం లో, రచయిత చెప్పిన డిస్టర్బింగ్ విషయం –
    ###### “వందల ఏళ్ల క్రితపు పుస్తకంలోని వాక్యాల్ని యధాతథంగా తీసుకోవడం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అవుతుందా? మరి ఎప్పుడో రాయబడిన మనుధర్మ శాస్త్రాన్ని మన మేధావులు వారంలో రెండుసార్లు తగలబెడుతుంటారే!” #######
    ఈ వాక్యాన్ని బట్టి, రచయితకు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడంలో అభ్యంతరం ఉందో, లేక దాంతో పాటు ఖురాన్ ని ఎందుకు తగలబెట్టడం లేదని బాధ ఉందో అర్థం కావడం లేదు.
    ప్రపంచంలోని సుమారు 50 దేశాల్లో ఖురాన్ ఆధారంగా జీవించే ముస్లింలు మెజారిటిగా ఉన్నారు. అగ్రరాజ్యాల ఆయిల్, ఆధిపత్య రాజకీయాలకు బలైన 5,6 దేశాలు తప్ప మిగతా దేశాలన్నీ శాంతియుతంగా బతుకున్నవే. ఏ దేశంలో కూడా, అక్కడి మైనారిటీలపై తిండి పేరుతోగానీ, అల్లాహూక్బర్ అనమని గానీ కొట్టి చంపి సెల్ఫీ వీడియోలు తీసిన దాఖలాలు లేవు. కానీ మనుధర్మాన్ని నమ్మే ఓ పార్టి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాగానే ఈ దేశం లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలోని దలిత బహుజనులకీ, మహిళలకీ మనుధర్మం చేసిన సత్కారం గురించి కూడా అందరికీ తెలిసిందే.
    ఖురాన్ లోని కొన్ని వాక్యాల్ని చెర్రీ పిక్ చేసి, మనుధర్మం తో దానికి పోలిక పెట్టడం, అలాంటి వ్యాసాన్ని సారంగ ప్రచురించడం శోచనీయం.

    -మహమ్మద్ హనీఫ్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు