నాకూ సెలవు కావాలి

రెండో ఝాము దాటిన వేళల్లో ఒక గూడల్లేసుకుని, మునగదీసుకుని, ఉండుండి కొత్తకొత్త దేహాలతో బయటపడి నిలువెల్లా తడుముకుంటుంటే, మనశ్శాంతనేదేదో వచ్చి వాటేసుకుంటూ ఉంటుంది. ఆ ఆలింగనాల్లో మునుగుతూ, చెడగొట్టుకుంటూనే ఐదు సంపుటాల దూరం నడిచొచ్చేశా. ఊరించే ఆరోదాన్ని దాటాలనే ప్రయత్నం…. కథలమీద, నవలలమీద, ఒకప్పుడున్న ప్రేమని కవిత్వం వైపు మళ్ళించుకుని, అందులో మునకలేస్తుంటే, వదిలొచ్చినవేమో ఇప్పటికీ కన్నెర్ర చేస్తూనే ఉన్నాయి. వాటిని శాంతిపచేయడానికి–ఆనాటి వాటిని ఒక సంపుటిగా హత్తుకోవాలనే ఆరాటం కూడా…

కవిత గురించి

సన్నిహిత మిత్రుడొకరు మాటల సందర్భంలో చేసిన చిన్న వ్యాఖ్య చకితుణ్ణి చేసేసింది. అరే, ఎంత కొత్తగా ఉంది… భలేగా అన్నాడే… అనుకున్నాను. అది అక్కడితో వదిలిందా అంటే… ఉహూ లేదు. అంతటితో ఆగిందా అంటే.. అదీ లేదు. లోలోన అలజడిని సజీవంగా ఉంచుతూ ఊడలు మీద ఊడలు దిగుతూ ఎప్పుడు బయటకి పరుగులు తీద్దామా అనే ఆరాటంతో కసాపిసా తొక్కేసి రెండునెల్ల తరువాత బయటపడింది.. ఆ తరువాత ఇలా…

స్మశానానికీ జీవం ఉంటే..మాట ఉంటే…అదిలా… దశాబ్దాలు శతాబ్దాల తరబడి మోసిన మొనాటనీ నుంచి బయటపడి సెలవు పెట్టేసి, నెలవు మార్చుకొని, కొత్తగా చిగురేయాలని కోరుకోవడం తప్పేం కాదుగా! మనిషిని అమరుణ్ణి చేయడమే అవుతుందిగా! ఆ ఘనతను పొందాలనుకున్నా పొందలేని దాని తపనను, చిరాకును, అది మోస్తున్న చితిని ఎత్తిపోస్తూ ఇలా…

 

 

గుప్పిట పూచే స్వప్నానికి

పిడికెడు మట్టినందించి

తెరలితెరలి వచ్చే చివురుదీపమెట్టి

దీవెన పంచాలి కానీ

ఇదేమిటి-

కల్పాల గడపలు దాటొచ్చినా

కమురుధూపాల మధ్య

చివరెరుగని రుద్రయాగాన్నెంతకని

చేసుకుంటూపోను…

 

ఏ తేటిపాట తలుపు తోసుకురాక

ఏ అతిదీ కుశలమడగక

తలదీపాలే తోరణాలైపోతుంటే

జడలు కట్టిన శూన్యంలో

చిటికెడంత పత్రహరితాన్నైనా

కడుపున నలుసుగా కాయించుకోలేని పోతుగడ్డనై

కడచూపుల తొక్కిసలాటలో

ఎంతకని సెగమంచునైపోను…

పాపం పోనీలే, కాలం జారిపోయి

కొడిగట్టిన కనుపాపలు కదా అని

కాస్తంత ఒడినెత్తుకుందామనుకుంటే

అదే నిత్యయాగమై

కాని దిక్కున చావింటికి చుట్టాన్నై

ఏడేడులోకాలు పట్టనన్ని ముగింపుల్ని

పుక్కిట మోస్తూ ఎన్నెన్ని సహస్రవర్షాలు

గరళధాత్రినైపోను…

ఇలా… శ్మశానాన్నై మిగిలిపోను…

 

ఏ అమ్మలు కన్నారో ఏమోలే అని

చివరినిద్రలేవీ చెడకుండా

చెంగు పరుస్తున్న కొద్దీ

వరదలా వచ్చిపడే విగతత్వాలతో

చితాగ్నుల, శిథిలాస్థికల కైవారాల్లో మునిగితేలే నాకూ,

శిశిరసంజెల్ని వలసెత్తుకొచ్చే కాలదండానికీ

కుదరని సంధిలో

తెల్లవారుతోందంటే ఎంత భయమేస్తోందో-

పలుగుపోటుల్లో పోటెత్తే గుండెనెప్పితో

ఇంకెన్నిమార్లు పెడబొబ్బలు పెట్టాలోనని…

గొంతుకడ్డంపడుతూనే ఉన్న ఈ కాష్ఠాల నిప్పులగూళ్ళు

ఇంకెన్నాళ్ళు వేటాడుకుంటాయోనని…

 

నాలోకి పూలయాత్రలతో తేలివచ్చి

చివరి అడుగు నామీంచి వేసి

ప్రాణహంసలన్నీ భూరేఖను దాటేస్తుంటే

పూజలకెదగలేని అవరోహంలో దిగబడిపోయి

అడుగడుగుకు నాకు నేనే

వైధవ్యంతో ఎదురుబడుతుంటే

నా చివరి అడుగెక్కడో జాడలేక

చావుకొకచావుగా ఇంకా చావలేక

ఏకంగా ఇక

ఆ యముణ్ణే పాడెనెక్కించి

పాతాళగరిగలో పాతిపెట్టాలని ఉంది

ఇంకెప్పుడూ లయనర్తనం చేయకుండా

రుద్రుడి కాళ్లు విరిచి

మళ్ళెప్పుడూ నా గడపలోకి అడుగుపెట్టకుండా

తరిమికొట్టాలని ఉంది

 

కుదురు లేని కాలం వెన్ను విరిచి

ఇక్కడే కుదేసి

నాకిక సెలవు తీసుకోవాలని ఉంది

లోకాన్నించి లోకాలకు చేయందించే

బదిలీలకు అడ్డుగడప కట్టి

ఈ కాష్ఠాగారాల నుంచి పారిపోయి

మనిషన్నవాడు లేని చోటెక్కడైనా

మరోజన్మ ఎత్తాలని ఉంది

మళ్ళీ ఈ నేలగా కాకుండా

ఏ చీకటి ఆకాశంగానైనా పుట్టి

కాసిన్ని నక్షత్రాల్ని కరువుతీరా

తురుముకోవాలని ఉంది.

*

యార్లగడ్డ రాఘవేంద్రరావు

9 comments

Leave a Reply to Mula -veereswara Rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుందండి! ‘చావుకొకచావుగా చావలేక..’ – కదిలించే మాటలు. స్మశానాన్ని ఒక మెటఫర్‌గా – మొత్తం ప్రపంచానికే సూచకంగా వాడుకున్నారనిపించింది! అభినందనలు.

  • “తెల్లవారుతోందంటే ఎంత భయమేస్తోందో-

    పలుగుపోటుల్లో పోటెత్తే గుండెనెప్పితో

    ఇంకెన్నిమార్లు పెడబొబ్బలు పెట్టాలోనని…”

  • నేను

    నేనొక జ్ఞాపకాల కుప్ప నై
    ఏకాంత ద్వీపంలో
    కూల బడ్డాను !
    నా పాట నాకే
    వినిపిస్తుంది !
    నా కవిత్వం నన్నే
    చదువుకుంటుంది !
    నా కుంచె నన్నే
    చిత్రిస్తుంది !
    నాలుగు గోడల
    మధ్య ఒకే నేను
    నాలో నేను
    లో..లో…లో…
    ఒకే నేను
    ఏకాకి మేను
    దుఃఖ నదిలో
    ఈదులాడుతూ..
    -వీరేశ్వర రావు మూల
    3.5.2020
    _క్వారంటైన్ లో ఉన్నాక కలిగిన అనుభూతి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు