ఒక పక్కన బోలెడంత తీరిక , అద్ధంలా మెరిసే ఇల్లు , ముట్టుకుంటే కందిపోయే బంగారపుబొమ్మ , సుఖంగా వుంటానికి ఎక్కడికక్కడ అన్నీ అమర్చే పనిమనిషి వెరసి ఒక ముప్ఫయి ఏళ్ల పిల్లలు లేని అమ్మగారు . ( కొంచెం మొరటుగా వుండే అయ్యగారు ) . అన్నీ అలా అమిరినట్టుగా వుండే జీవితానికీ , సౌఖ్యానికి గ్యారెంటీ ఇచ్చే , నలుగుపెట్టుకునే నగ్న శరీరపు మెళ్ళో జారే మంగళసూత్రాలూ , నల్లపూసలూ ..
నలుపెరుపు కథ ఇక్కడ చదవండి :నలుపెరుపు
ఆటోల్లో తిరగటం , బెజవాళ్ళో సినిమాలకి వెళ్ళటం భవానీపురంలో కడుపుచెయ్యబడటం , దుర్గమ్మ కొండకింద మంత్రసానింట్లో కడుపుపోగొట్టుకోవటం అన్నీ ఒక్క వాక్యంలో తేలిపోయ్యేంత పలచని జీవితం రత్నంది . ఆరోక్లాసు చదివింది. మైకంలో లేచి వచ్చింది జమీల్ తో . కొత్త మురిపెంలో కొన్ని రోజులు మూడు గదుల పెంకుటింట్లో కాపురం , రాత్రి ఎనిమిదికెల్లా ఇంటికి రావటం శరీరాన్ని అనువనువు గా అనుభవించడం కొద్దికాలం సాగింది రత్నానికి .
ఆ తరవాత బొంబాయి లో లక్ష రూపాయలకు అమ్మదగ్గ శరీరంగా కనపడసాగింది రత్నం జమీల్ కి . అమ్మి బంగారపు బాతు గుడ్డును ఒక్కసారే కోసుకోవటం ఎందుకు . పడగ్గదిలో జరిగే యవ్వారాన్ని బొమ్మలు తీసి అమ్మితే రత్నం రోజూ పాడి పితుక్కునే ఆవే . సుఖానికి సుఖం , డబ్బుకు డబ్బూ కూడా జమీల్ కి .కాదంటానికేమయినా రత్నం కట్టుకున్నదా .లేచొచ్చిన బాపతు అయ్యే . కాదంటే , లేదంటే ‘ ఏందీ పెళ్ళాం లెక్క వాగుతున్నావ్ , ఇరగదీస్తా ‘ అని పళ్ళూడిపోయేంత గట్టిగా గవదలు నొక్కగలడు జమీల్.
‘లేచి రావటానికి నీకెవరూ దొరకలేదా ఆడు దప్ప . ఎవడు అటో మీద షికార్లు తిప్పితే ఆడితో లేచిపోతావా , నీ బుద్ధి మంచిదయితే బానే వుండేదానివి’ అని అమ్మగారి సన్నాయి నొక్కులు . నిజమే మెరుపు నీడలు తేలే విల్లాలో వుంటూ బద్ధకంగా , తీరిగ్గా వుండే కలలు కంటానికి కూడా ఒక స్థోమత వుండాలి . రత్నం ఆరోతరగతి చదువు జమీల్ ని మించిన కలలేం కనగలదు .
కానయితే మురికి తుడిచి , మురికి నీళ్ల గిన్నెలు కడిగి , మురికి పూసుకునే తనకంటే వొంటికీ , ఇంటికీ , కాళ్ళకీ కూడా మట్టి అంటని అమ్మగారయితే అలాటి పడగ్గది బొమ్మలకు పసందుగా సరిపోతుందని గ్రహించగలదు రత్నం .
అమ్మగారికి రత్నం నలుగుపెట్టటం అనేది శాస్త్రిగారు వర్ణించిన దృశ్యకావ్యం . నూనె పెట్టుకుని , ఎక్కడా ఒక్క తెల్లవెంట్రుక లేని మెత్తటి జుట్టు , తల్లోంచి వస్తున్న నల్ల సెలయేరులా వీపుమీదకి జారిన జుట్టు . మెడకీ , భుజాలకీ , జబ్బలకీ , తొడలకీ , మోకాళ్ళకీ , పిక్కలకీ , ఎదభాగానికీ , పొత్తికడుపుకీ , చెవుల వెనకాల నీళ్లు జల్లుకుంటూ అంచెలంచెలుగా పిండి రుద్దుతూ , నలుస్తుంటే మెత్తటి పిండి గింజల్లాగా రాలుతుంది పిండి .
కెరళ్ళు కెరళ్లుగా దుఃఖం తన్నుకొచ్చినట్లు తలదిమ్ముతో , నొప్పితో జమీల్ గాడు ఎక్కడకీ కదలకుండా తిష్ఠవేసుక్కూచున్నాడు రత్నంలో. దుప్పటి కింద సారాయి సీసాలా నోరు తెరిచి నిద్రపోతున్న వాడి శవం ( శరీరం ) మీద మనసులో వుమ్మేసి బయటబడ్డా వాడు లోపలే తిష్ఠవేసుక్కూచున్నాడు . అమ్మగారికి నలుగు పెడుతూ , వాడు పెట్టే హింస పరిపరి విధాలుగా లోపల్నుంచి ఉబుకుగు రాగా జమీల్ గాడి పీక నొక్కుతున్నాననుకుంటూ అమ్మగారి పీక నొక్కేసింది రత్నం . శాస్త్రి గారూ రత్నం అమ్మగారి పీక నొక్కటం అనేది ఏమయినా మెటఫరా , క్షమించండి అది నాకు అర్ధం చేసుకునేంత తెలివి లేదు .
సుఖమూ , విలాసమూ , వంచనా , నీచమూ , బతుకు హైన్య మూ , దుక్కమూ పక్కపక్కనే కలిసిపొయ్యి కలగలిసి పొయ్యిన ఈ జీవన చిత్రాన్ని చూస్తే ఈ మధ్యనే చూసిన Parasites సినిమా గుర్తుకొచ్చింది . కలుగు వాసన అనగానే అప్పటిదాకా కాపాడాలనుకునే వాడి గొంతులో కత్తి కసుక్కున పొడిచినట్లు రత్నం లోపల్లోపల్లుంచి బతుకుమీద పొంగుకొచ్చిన క్రోధంలోంచి అసంకల్పితంగా అమ్మగారి పీక నొక్కేసింది.
*
Add comment