నలుపెరుపు కథ గురించి…

క పక్కన బోలెడంత తీరిక , అద్ధంలా  మెరిసే ఇల్లు , ముట్టుకుంటే కందిపోయే  బంగారపుబొమ్మ , సుఖంగా వుంటానికి ఎక్కడికక్కడ అన్నీ అమర్చే పనిమనిషి  వెరసి ఒక ముప్ఫయి ఏళ్ల  పిల్లలు లేని అమ్మగారు . ( కొంచెం మొరటుగా వుండే అయ్యగారు ) . అన్నీ అలా అమిరినట్టుగా  వుండే జీవితానికీ ,  సౌఖ్యానికి  గ్యారెంటీ ఇచ్చే , నలుగుపెట్టుకునే నగ్న శరీరపు మెళ్ళో జారే మంగళసూత్రాలూ , నల్లపూసలూ ..

నలుపెరుపు కథ ఇక్కడ చదవండి :నలుపెరుపు

ఆటోల్లో తిరగటం  , బెజవాళ్ళో సినిమాలకి వెళ్ళటం  భవానీపురంలో కడుపుచెయ్యబడటం  , దుర్గమ్మ కొండకింద మంత్రసానింట్లో కడుపుపోగొట్టుకోవటం  అన్నీ ఒక్క వాక్యంలో తేలిపోయ్యేంత పలచని జీవితం రత్నంది . ఆరోక్లాసు చదివింది. మైకంలో లేచి వచ్చింది జమీల్ తో . కొత్త మురిపెంలో కొన్ని రోజులు  మూడు గదుల పెంకుటింట్లో కాపురం , రాత్రి ఎనిమిదికెల్లా ఇంటికి రావటం శరీరాన్ని అనువనువు గా  అనుభవించడం కొద్దికాలం సాగింది రత్నానికి .

ఆ తరవాత బొంబాయి లో లక్ష రూపాయలకు అమ్మదగ్గ శరీరంగా కనపడసాగింది రత్నం జమీల్ కి  . అమ్మి బంగారపు బాతు గుడ్డును ఒక్కసారే కోసుకోవటం ఎందుకు . పడగ్గదిలో జరిగే యవ్వారాన్ని బొమ్మలు తీసి అమ్మితే  రత్నం రోజూ పాడి పితుక్కునే ఆవే . సుఖానికి సుఖం , డబ్బుకు డబ్బూ కూడా  జమీల్ కి .కాదంటానికేమయినా  రత్నం కట్టుకున్నదా .లేచొచ్చిన బాపతు అయ్యే . కాదంటే , లేదంటే  ‘ ఏందీ  పెళ్ళాం లెక్క వాగుతున్నావ్ , ఇరగదీస్తా  ‘ అని పళ్ళూడిపోయేంత   గట్టిగా గవదలు నొక్కగలడు జమీల్.

‘లేచి రావటానికి  నీకెవరూ  దొరకలేదా ఆడు దప్ప . ఎవడు అటో మీద షికార్లు తిప్పితే ఆడితో లేచిపోతావా , నీ బుద్ధి మంచిదయితే బానే వుండేదానివి’ అని అమ్మగారి సన్నాయి నొక్కులు . నిజమే మెరుపు నీడలు తేలే విల్లాలో వుంటూ  బద్ధకంగా , తీరిగ్గా వుండే కలలు కంటానికి కూడా ఒక స్థోమత వుండాలి .  రత్నం ఆరోతరగతి  చదువు జమీల్ ని మించిన కలలేం కనగలదు .

కానయితే మురికి తుడిచి ,  మురికి నీళ్ల గిన్నెలు కడిగి , మురికి పూసుకునే తనకంటే  వొంటికీ , ఇంటికీ , కాళ్ళకీ కూడా మట్టి అంటని అమ్మగారయితే అలాటి పడగ్గది  బొమ్మలకు పసందుగా సరిపోతుందని గ్రహించగలదు రత్నం .

అమ్మగారికి  రత్నం నలుగుపెట్టటం అనేది శాస్త్రిగారు వర్ణించిన దృశ్యకావ్యం . నూనె పెట్టుకుని , ఎక్కడా ఒక్క తెల్లవెంట్రుక లేని మెత్తటి జుట్టు  , తల్లోంచి వస్తున్న నల్ల సెలయేరులా వీపుమీదకి జారిన జుట్టు . మెడకీ , భుజాలకీ , జబ్బలకీ , తొడలకీ , మోకాళ్ళకీ , పిక్కలకీ , ఎదభాగానికీ , పొత్తికడుపుకీ , చెవుల వెనకాల నీళ్లు జల్లుకుంటూ అంచెలంచెలుగా పిండి రుద్దుతూ , నలుస్తుంటే మెత్తటి పిండి గింజల్లాగా రాలుతుంది  పిండి .

కెరళ్ళు కెరళ్లుగా దుఃఖం తన్నుకొచ్చినట్లు తలదిమ్ముతో , నొప్పితో జమీల్ గాడు ఎక్కడకీ కదలకుండా తిష్ఠవేసుక్కూచున్నాడు రత్నంలో.   దుప్పటి కింద సారాయి సీసాలా నోరు తెరిచి నిద్రపోతున్న వాడి శవం ( శరీరం ) మీద  మనసులో  వుమ్మేసి బయటబడ్డా వాడు లోపలే తిష్ఠవేసుక్కూచున్నాడు . అమ్మగారికి నలుగు పెడుతూ ,  వాడు పెట్టే హింస  పరిపరి విధాలుగా లోపల్నుంచి ఉబుకుగు రాగా  జమీల్ గాడి పీక నొక్కుతున్నాననుకుంటూ అమ్మగారి పీక నొక్కేసింది రత్నం .  శాస్త్రి గారూ రత్నం అమ్మగారి పీక నొక్కటం అనేది ఏమయినా  మెటఫరా ,  క్షమించండి అది నాకు అర్ధం చేసుకునేంత తెలివి లేదు .

సుఖమూ , విలాసమూ , వంచనా , నీచమూ  , బతుకు హైన్య మూ  , దుక్కమూ  పక్కపక్కనే కలిసిపొయ్యి  కలగలిసి పొయ్యిన ఈ జీవన చిత్రాన్ని చూస్తే ఈ మధ్యనే  చూసిన Parasites  సినిమా గుర్తుకొచ్చింది . కలుగు వాసన అనగానే అప్పటిదాకా కాపాడాలనుకునే వాడి గొంతులో  కత్తి కసుక్కున పొడిచినట్లు రత్నం లోపల్లోపల్లుంచి బతుకుమీద పొంగుకొచ్చిన క్రోధంలోంచి  అసంకల్పితంగా అమ్మగారి పీక నొక్కేసింది.

*

 

బోడపాటి పద్మావతి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు