రూపం
పచ్చి మోసకారి
నిన్ను మోహించమంటది
తన కాళ్లకాడ తిరిగే కుక్కపిల్లను
చేస్తది
నీకు ఏ ఆలోచనా లేకుండా చేసి, నీ మనసును చచ్చుపడేలా చేస్తది
రూపం
దృశ్యమై నిన్ను తనలో విలీనం చేసుకుంటది
నీకు ఉనికిలేకుండా చేసి
నీ నీడను మింగేస్తది
నువ్వు నడిచిన నీ పాద ముద్రలను తుడిచేస్తది
నీ దేహధూళిని ఊడ్చేస్తది
రూపం
అగ్నిలాంటిది
అది నయన కాష్టంలో నిన్ను భస్మ పర్వతంలా కుప్ప పోస్తది
రూపం
ఎర్రగా ఎగిసే అగ్ని కీల
సముద్రాలను తాగేసే విషకంఠి
అంతర్నేత్రాలను పొడిచేసే ఇనుప చువ్వ అది
రూపం
ఆఖరికి నిన్ను ఇసుక తెప్పల కింద కప్పేసే
తృష్ణ అల
రూపాన్ని తొలుచుకొని వెళ్లు
అక్కడ నిబిడాశ్చర్య సత్యం కనిపిస్తది
ఆ పరమ సత్యాన్ని వీక్షించ నువ్వు
ధమ్మ నేత్రం ధరించాలి
*
సత్యం
“రూపాన్ని తొలుచుకొని వెళ్లు
అక్కడ నిబిడాశ్చర్య సత్యం కనిపిస్తది
ఆ పరమ సత్యాన్ని వీక్షించ నువ్వు
ధమ్మ నేత్రం ధరించాలి”
అద్భుతమైన వ్యక్తీకరణ అన్న. శుభాకాంక్షలు.
కవిత చాలా బాగుంది మిత్రమా !
రూపాన్ని ధ్వంసం చేశావ్!
కవిత బాగుంది🌿