ప్రతి రోజూ ఉదయానికి
ఆకలిని బహుమతి చేస్తాను
సూర్యుడు ఆకాశంలో నుంచి జారి
కిటికీ చువ్వల్లోంచి గదిలోకి రావటానికి
ప్రయత్నిస్తూ ఉంటాడు
చిన్నప్పుడు ఆటలాడుకుంటూ
పరిగెత్తుతూ కాలికి బోట్రాయి తగిలితే
నుదురు మీద చిమ్మిన నెత్తురులా
మొకం మీద ఎండ
అంతే చురుక్కుమనేలా పడుతోంది
ఆకలిని మర్చిపోదామని ప్రయత్నిస్తుంటే
రాత్రి మెలుకువంతా బద్దకంగా మారి
నన్ను నిద్రా పోనివ్వదు మెలుకువనూ రానివ్వదు.
నగరంలో ఉన్నాక నిద్రకి, తిండికి యడమయ్యాక
కాస్త మిగిలింది ఈ బద్దకమే అనుకుంటా!
రాత్రి దుప్పట్ల మీద ఉదయాన్ని కప్పుకుంటే
నా మెలుకువ ఇక మధ్యాహ్ననానికే
పొద్దున్నే ఆకలిని మర్చి పోదామనుకొని
పొరపాటున రాత్రి నిద్రను మర్చిపోతాను
అందుకే రాత్రి ఆకలి ఉండదు
ఉదయం మెలుకువ ఉండదు
దేశపు దేహమైన ఈ నగరంలో
ఇలా మానవ చర్యలను
తారుమారు చేసిన నన్ను ఎవరైనా
దేశ ద్రోహి అంటారేమో అని
నా అనుమానం.
*
Add comment