దేశి పాత్రుడు మాయ్యగారు

బర్మా క్యాంపు కథలు 11

“రాత్రి మన రేగు చెట్టు దగ్గరకు దెయ్యమొచ్చిందిరా  నువ్వు యెంత లేపినా లేవ  లేదు , అంత  మొద్దు నిద్ర ఏంటి హరిబాబూ ? ”

” నిన్న దెయ్యాలన్నీ ఉయ్యాలూగాయిరా రేగు చెట్టుకి ఉయ్యాల కట్టుకొని,  మన గులాబీ మొక్కలు పుడికేసి పువ్వులు తల్లో పెట్టుకున్నాయి”

” ఆ… నన్ను లేపలేదేమండి మాయ్య గారు ”

” ఇవ్వాళ ఖచ్చితంగా లేపుతానురా ”

” మాయ్యగారు ఈ రోజు కూడా మీరు నన్ను నిద్ర లేపలేదు , దెయ్యాలు చూడటం అవలేదు ”

దేశి పాత్రుడు మాయ్యగారు నల్లగా వుంటారు, ప్రశాంతంగా , ఎప్పుడూ చిరునవ్వుతో వుంటారు, సిగిరెట్ కూడా చాలా ప్రశాంతంగా కాలుస్తారు , మాయ్య  గారి అసలు వూరు కొత్తవలస దగ్గరున్న దేశిపాత్రుని పాలెం. ఆయన పాత్రుడులు, రాజుల తరువాత అంత వైభవంగా ఉండేవారు, వాళ్ళ పిలుపులు, పేర్లు,పద్ధతులు, బంధుగణం వినడానికి, చూడటానికి  గొప్ప చిత్రంగా ఉండేది.

“పాత్రుడులు “, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎక్కువుగా వుంటారు. వారు రాజుల కాలంలో సైన్యం పర్యవేక్షించే  వారట, కొందరు రాజ్యాలు కూడా ఏలారు , చాలా మంది ఎత్తుగా దృఢంగా వుంటారు.ఒక తరం కొంతకాలం బర్మా వెళ్లి సంపాదించు కొని వొచ్చింది.

రాజుల వ్యవహారానికి దర్జాకి కొంచెం దగ్గర దర్పం ప్రదర్శించే పాత్రుళ్లు  ,కాలక్రమంలో  లీడర్లుగా,  తరువాత తరం ఎక్కువ మోటా ర్  ఫీల్డ్ లోనూ కుదురుకున్నారు.

తుమ్మడ పాలెంలో మాయ్య గారింటిలో మేమూ రాజమ్మ మామ్మతో, మా బాబులు చిన్నాన్నతో, కలిసి ఎవరి పోర్షన్ లో వాళ్ళు అద్దెకుండే వాళ్ళం.

” అమ్మలూ అనే వారు ” అమ్మని  ఆప్యాయంగా .

” మాయ్య గారు “అమ్మాజత్తా ” అని పిలిచే వాళ్ళం నేనూ తమ్ముడూ వాళ్ళని.

రక రకాల చెక్కల కటకటాల పోర్షన్ల  ఇళ్ళు ,కమ్మల ఇల్లు, పెంకుటిళ్లు , అన్ని కులాల యైక్యతతో ఒక కమ్యూన్ లా ఉండేది అక్కడ.

చెడ్డీ వేసుకొని ఆడుకుంటున్న శ్యామ్ వాళ్ళ చెల్లెలు  మేరీ బొగ్గుల పొయ్యి మీద వేడి  నీళ్లు  మీద పడేసుకొని  గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే మాయ్యగారే కంచరపాలెం ఆసుపత్రికి తువ్వాలు చుట్టి తీసుకెళ్ళేరు.

ఇంటిపక్కనుండే మేడలో వుండే పట్నాయక్ మోహనరావు, కర్రల మోహన్ రావు, పొడుం డబ్బా మాస్టారు, అప్పాయమ్మ గారు ఇలా అందరికి మాయ్య గారంటే చాలా మర్యాద.

రాత్రి  భోజనాలు  చేసేటప్పుడు ఒక్కోసారి నా కంచం పట్టుకొని మాయ్య గారి పోర్షన్ లోకి వెళ్లిపోయేవాడిని. అన్నంలో  పాలు వేసుకొని పంచదార లేదా బెల్లం వేసుకొని ఆయన తినడం చూసి, చూసి నాకు అదే అలవాటు వొచ్చేసింది మెల్లగా.

ఇంటి ముందు వున్న పెద్ద  ఖాళీ స్థలంలో  రాత్రి మడత మంచాలు, నవ్వారు మంచాలు ఆరు బయట వేసుకొని  హాయిగా గాలి వీస్తుండగా కథ మొదలు పెట్టే వారు మాయ్య గారు. కానీ అన్నీ దెయ్యం కథలే, ఎప్పుడూ  దెయ్యాల  కబుర్లే.

దేశి మాయ్యగారు డాక్ యార్డ్ లో పనిచేసేవారు.

” హరి బాబూ నిన్న డాక్ యార్డ్  నుంచి వొస్తూ సాయంత్రం పైడిమాంబ గుడి దారిలో  వున్న దెయ్యాల మెట్ట దగ్గర కూర్చొని  సిగరెట్ కాల్చుకుం టున్నానురా , ఈ లోగా  ఒక పిల్ల దెయ్యం వొచ్చి మన సైకిల్ మీద కూర్చొని  బెల్లు  కొట్టి తెగ అల్లరి చేసేసిందనుకో , ఆ తరువాత ఒకదాని తరువాత ఒకటి  చాలా పిల్ల దెయ్యాలు వొచ్చి మన సైకిల్ బెల్ పాడుచేసేసాయి , ఇప్పుడు మన సైకిల్ బెల్ పని చేయటం లేదు కావాలంటే చూడు ”  అని చెప్పే వారు.

” నిజమే మాయ్య గారు  బెల్ పని చేయటం లేదండీ , మరి మిమ్మల్ని ఏం చేయలేదా ఆ దెయ్యాలు ”

” దెయ్యాలకు  నిప్పంటే భయంరా ,నా దగ్గర  కాలుతున్న సిగరెట్ వుంది కదా  నా జోలికి రావు ”

ఇలా రోజుకోరకంగా దెయ్యాల కథలు నిజాలంతా అందంగా చెప్పే వారు .

*     *     *

వీపు సాప్  ఆటాడదాం రారా అన్నారు మామి, సీత.

సీత మాయ్య గారి  అబ్బాయిపేరు, మామి అమ్మాయి పేరు.

వయసులో నాకంటే చాలా పెద్దోళ్ళయినా ఆళ్ళతో  నేను, మేరీ , దీప అందరం వీపు సాప్ చేయుంచుకున్నాక అలసి పోయి తుమ్మడ పాలెం పట్టాల దగ్గరకెళ్ళి చాలా సేపు ఎదురు చూసాక వొచ్చిన ఆ  రైలింజన్ కింద పది పైసల బిళ్ళ  పెట్టి, సాగిన ఆ పదిపైసల బిల్లకు మధ్యలో కన్నం పెట్టి దారంతో ఆడుకున్నాక, తుమ్మడ పాలెం వీధులు చక్కేసి, రైళ్లలో వెళ్లే వాళ్లకి , టికెట్ లేకుండా బోగీల మీద ఎక్కి ప్రయాణం చేసే వారికి టాటాలు చెప్పి ఎప్పటికో ఇంటికి చేరిన నాకు ఆ సాయంత్రం భోజనాలు అయ్యాక,అనంత ఆకాశంలో  చుక్కలు చూస్తుండగా మళ్లీ  మాయ్య గారి కథ  మొదలయ్యేది.

” ఒరేయ్ నువ్వు పట్టాల కాడకి  వెళ్ళేవు గాని,  అస్తమానం వెళ్ళకు మొన్న రాత్రి మన రేగు చెట్టు దగ్గరకు వొచ్చిన దెయ్యాలు ఆడుకుంటూ, రేగిపళ్ళు తింటూ మన రైలు పట్టాల దగ్గరకు వెళ్లి కూర్చున్నాయి, ఒక దాని పేలు ఒకటి చూసుకుంటూ వున్నాయి, ఒక చిన్న దెయ్యానికి ఎవరూ పేలు చూడటం లేదు, అదే దాని బుర్ర బయటకు తీసి పేలు చూసుకోవడం మొదలెట్టింది, ఈ లోగా మన వీధిలో తిరిగే ఎర్రకుక్క దాని తల తీసుకొని నా దగ్గరకు వొచ్చేసింది, మొండెం తలతో పిల్ల దయ్యం చాలా సేపు బతిమిలాడక దాని తల దానికి ఇచ్చేసాననకో ,

నువ్వేమిట్రా ఎన్ని సార్లు లేపినా  లేవలేదు ”

“ అయ్యయ్యో యెంత పనైపోయింది ఈసారి ఎలాగైనా లేస్తాను మాయ్యగారు”

మాయ్య గారు చెపుతున్న దెయ్యాలను  ఎలాగైనా పట్టుకోవాలని కథ అయిపోయినా ఒకరోజు అర్ధరాత్రి లేచి దుప్పటిలోంచి కళ్ళు మాత్రమే బయటపెట్టి చూద్దును కదా  కరనాల  మాస్టారి ఇంటి  గోడ మీద నీడ మాత్రమే కనపడుతుంది. దెయ్యం మన దగ్గరకు రాకుండా వెంటనే నేను ముసుగేసుకున్నాను.

” రాత్రి దెయ్యాన్ని చూసాను మాయ్య గారు” అన్నాను   ” సెహబాష్ అదీ ధైర్యం “అన్నారు మాయ్య గారు

వీ. టీ  కాన్వెంట్ లో వున్న వాళ్లందరికి చూసిన  దెయ్యం గురుంచి చెప్పాను

అందరూ నన్ను  దెయ్యాన్ని చూసిన మొనగాడిగా  గుర్తించారు.

దెయ్యం కథలతో నన్ను కథల ఊహా లోకంలోకి తీసుకెళ్లిన మాయ్య గారిని ఎప్పటికి మర్చిపోలేను.

అలా నోరెళ్ళ బెట్టి కథలు వినే నా ఉత్సాహం మా దొంగ నీలాద్రి తాత కూడా గమనించి  గోదావరి గట్టున వేసవి కాలంలో  ఆరుబయట మడత మంచాల కథా కచ్చేరీలో …

” ఒరేయ్  హరి బాబూ రాత్రి మన హెలికాఫ్టర్ వొచ్చిందిరా మనం ద్రాక్షతోటల దగ్గరకు వెళ్ళాం, నువ్వు వేళ్ళాడుతున్న ద్రాక్షపళ్ళు నిద్దట్లోనే  తెగ తేనెసావనుకో ”

” అక్కడ ఇంకో అమ్మమ్మ ఉందిరా మనకు చేపల కూర కూడా వొండింది, ముళ్ళు కూడా లేని చేపల కూర నీకు వేసింది ”

నిజమేనా తాతయ్య అని నేను అడిగితే నిజమేరా కావాలంటే వీళ్లందరినీ అడుగు అన్నారు.

” నిజం .. నువ్వు వెళ్ళావు ” అని బుల్లి, పెద్ద, చిన్న, , రవీ, బండోడు, కళ్యాణి,లీల  ఏక కంఠంతో అన్నారు.

వాళ్ళెవరికీ దక్కని అదృష్టం నాకు దక్కినందుకు  ఆనందపడుతూ ఉంటే …. మళ్లీ  మరుసటి  రోజు చుక్కల ఆరుబయట

” రాత్రి మనం హెలికాఫ్టర్ మీద వెళ్ళాంరా .. ఇక్కడే తాటమ్మ తల్లి గుడి ముందు హెలికాఫ్టర్ దిగింది, నువ్వు నిద్రలేవకపోతే అలాగే తీసుకెళ్లి అందులో  కూర్చో బెట్టాం … మన నల్ల ద్రాక్ష గుత్తులు వున్నాయి  అబ్బో.. తెగ విరగ కాసాయనకో ”

” నిజమా తాతయ్య నన్ను ఎందుకు నిద్ర లేపలేదు ”

మరో … కథ ఆరంభం..

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

7 comments

Leave a Reply to Satyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హరి వెంకటరమణ రచించిన దేశ పాత్రుడు మాయ్యా కధ చాలా బాగుంది.పిల్లల్ని లాలించడానికి
    పెద్దలు చెప్పే పిట్టకథల్ని కధలో బాగా చొప్పించారు.కధ మొత్తం ఆసక్తి చదివింపజేశారు.

  • Kasha kallaku kattinattluga undhi,enka devudu unte cheyyam unnatle.appudu unna bandhalu eppudu anta baga levu.

  • కద చాలా బాగుంది సార్ , తాతయ్య గారు చెప్పిన దెయ్యం కతలు చాలా బాగుంది మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఈ కధలో చాలా చక్కగా రాశారు ప్రతి విషయం స్పష్టంగా రాసారు చాలా బాగుంది సార్ . మీరు ఇంకా ఎన్నో కథలు చాలా రాయాలని కోరుకుంటున్నాను. మా మిత్రులు శ్రీ హరి గారికీ హృదయ పూర్వక అభినందనలు సార్. 😊🤝🙏👌👌👌

  • చాలా చక్కగా ఆసక్తికరంగా ఉంది. మరిన్ని కధలు మీనుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు