దేశభక్తి గీతం పాడదామంటే గొంతుకేదో అడ్డం పడుతుంది

 ‘సూర్యుడు తప్పిపోయాడు’, ‘నిషిద్దాక్షరి’,నీలి గోరింట’ మొ.న కవిత్వసంపుటాలు; సమకాలీన సామాజిక సమస్యలపై రాసిన కాలమ్ ‘వానచినుకులు’ తో సాహిత్య ప్రపంచానికి సుపరిచితురాలైన కవి మందరపు హైమావతి ఇటీవల రాసిన “సశేషం” కవిత గురించి మాట్లాడుకుందాం.

*

సశేషం

~

ఏం విశేషాలుంటాయి చెప్పు!

నిన్నటి పాత రాగాల పాటే గదా ఇవాళా

నిన్నటి నాచు పట్టిన క్షణాలే గదా ఈనాడూ

అలవాటుగా

డబ్బుల తుఫానులో కొట్టుకుపోతూ అందరూ

వలస కూలీల కంచాల్లో నాలుగు మెతుకులు రాల్చని వ్యవస్థలో

రామమందిర నిర్మాణానికి వెండి బంగారు ఇటుకలకు

నిధులెలా వస్తాయో ఆశ్చర్యార్ధకం!

 

తాళం వేసిన ప్రపంచంలో

ముగింపువాక్యాలెపుడో తెలీని విషాదం

దగ్గరితనం పరిమళాలు పూయాల్సిన చోట

దూరపు గోడలు మొలిచిన అనివార్యత

వీధుల్లో కమ్ముకున్న కనబడని మృత్యుచ్చాయలు

‘దేశభక్తి మంత్రం’ జపిస్తూ దేశాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ

పరాయి దేశాలకు అమ్మే పాలకులు

పనిదినాలన్నీ సెలవు దినాలైన ఆటవిడుపులో

తీరిక ఉయ్యాల్లో ఊగే కుటుంబ సభ్యుల

జిహ్వ చాపల్యం తీర్చడానికి

వంటింటి దుర్గమారణ్యంలో

మరింత చిక్కుకున్న అన్నపూర్ణలు

నాలుగు రాళ్ళు గడించడానికి చెమటబిందుసేద్యం చేయదలచుకొన్నా

ఉపాధి దొరకని కరువు కాలంలో

బతుకు బండిని వొడ్డుకు లాగలేక

కునుకు నదిలో కనుల పడవలు సాగని

బడుగుజీవుల వెతల కాలంలో

‘దేశభక్తి గీతం’ పాడదామంటే గొంతుక్కేదో అడ్డం పడుతుంది

*

విశాల భవనానికి ప్రాంగణ ద్వారం లాంటిది ‘శీర్షిక’ అయితే, తల వాకిలి లాంటిది ఆరంభ వాక్యమని, ముగింపు ఒక దీపస్తంభం అని పెన్నా శివరామకృష్ణ తన ‘వచన కవిత-అలంకారికత’ లో చెబుతారు. కవిత్వ నిర్వహణలో ఎత్తుగడ, ముగింపు కీలకమైన అంశాలని గ్రహించవచ్చు. ఇక్కడ ఒక నిట్టూర్పుతో కూడిన సమాధానం ఆశ్చర్యార్ధకాన్ని కలుపుకొని ‘ఎత్తుగడ’గా మారింది. అది ఏకకాలంలో తనకు తానుగాను, ఎదుటివ్యక్తితోను/సమూహంతోను సంభాషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాక్యాల్ని ఎలా పలకాలో చదువరికి సూచిస్తున్నట్టుగా తోస్తుంది. కవిత యొక్క నడకను సూచించేది ‘కొనసాగింపు’. కవితా వస్తువుకు సంబంధించిన ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో నిర్ణయిస్తుంది. వస్తుపరిధి, కవి నైపుణ్యం కీలక పాత్ర వహిస్తాయి. ఇక్కడ కరోనా కాలపు స్థితిగతులు, కుటుంబాల్లోని మహిళలపై కనిపించని పని వొత్తిడి, ఉపాధి దొరకని కరువులు-వీటి ముసుగులో అధికార పక్షపు రాజకీయ ఎత్తుగడలు కొనసాగింపులో భాగంగా కనిపిస్తాయి.

*

‘నాలుగు మెతుకులు రాల్చని వ్యవస్థ’ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ నిస్సహాయస్థితి ధ్వనిస్తుంది. అదే సందర్భంలో ‘రామమందిర నిర్మాణానికి వెండి బంగారు ఇటుకలు’ ప్రస్తావన దాని కపటనీతిని బట్టబయలు చేస్తుంది. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయని అంతరంగ మథనం వల్ల ‘ఆగ్రహం’ స్థానంలో ‘ఆశ్చర్యం’ తిష్ట వేస్తుంది. ‘దేశభక్తి మంత్రం’ కూడా ఒకానొక హిప్నాటిజం టెక్నిక్. దీన్ని ప్రయోగించకుండా వారి పనులు చక్కబెట్టుకోవడం కుదరదు. లోహాల్ని వాటి లక్షణాల(తాన్తవత, అఘాత వర్ధనీయత, ఉష్ణవాహకత, విద్యుత్ వాహకత)ఆధారంగా వాటిని రేకులుగా, తీగలుగా మార్చి ఏ రుపంలోకైనా సులువుగా మలుచుకున్నట్టే, మనుష్యుల బలహీనత(కులం, మతం, దేశభక్తి)లను ఆసరాగా చేసుకొని తమకు అనుకూలంగా చేసుకొని, తమ అనుయాయులుగా మార్చుకుంటారు.

*

కొనసాగింపుకు ఎక్కువ అవకాశం వున్నవస్తువు విషయంలో బలమైన ‘ముగింపు’ చాలా కష్టమైన పని. ఇక్కడ ముగింపు  ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలకు తావిస్తూ ‘ఎత్తుగడ’ వైపుకు షటిల్ సర్విస్ చేయిస్తుంది.

*

బండారి రాజ్ కుమార్

1 comment

Leave a Reply to Sujatha .p.v.l Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు