1
కలలో దేవుడు
కలగన్నాను
దేవుడే – కర్షకుడుగా ఇలమీద వెలిసినట్టు –
బురదలో బురదై .. వరదలో వరదై ..
మట్టిపాదాలతో .. దుమ్ముకొట్టిన దేహంతో ..
శ్రమజీవిగా యీ నేలమీద సంచరిస్తున్నట్టు ..
తలపాగా చుట్టుకొనీ .. నాగలి భుజాన మోసుకొనీ ..
లోకం మీద ఆకలిరాకాసిని మట్టుబెట్టేందుకు
మరో అవతారమెత్తినట్టు .. !
అతడు నడచిన నేల నేలంతా
ఆకుపచ్చని లోకంగా మారిపోతున్నట్టు –
ఆకాశం చినుకుపూలు కురిపిస్తున్నట్టు –
భూదేవి మట్టిగంధం పూస్తున్నట్టు –
రుతువులు ముత్తైదువులై మంగళ హారతినిస్తున్నట్టు –
పక్షులు తమ కీర్తనల్ని మాలగుచ్చి
అతనిమెడలో అలంకరిస్తున్నట్టు –
సమస్త ప్రకృతీ జయహో గీతాలు పాడుతున్నట్టు
ఏరువాక రథం మీద ఊరేగుతూ .. దేవుడు
నిత్య వసంతాలతో వెలిగిపోతున్నట్టు –
కలగన్నాను !
అతనిలోంచి .. స్వేదసముద్రాలు పొరలుతున్నట్టు –
నాగేటికర్ర అతని నాశికమైనట్టూ
దివారాత్రాలు ఆకుపచ్చని నేత్రాలైనట్టు –
పారా .. బొరిగె .. కంకీ .. కొడవలి ..
అతని హస్తాలకు ఆయుధానట్టు –
అతడు నేలమీద పిడికెడు విత్తనాలు జల్లితే ..
భూమి పచ్చగా నవ్వినట్టూ –
కలగన్నాను !
బతుకంటే ఏమిటనీ ..
కలలో దేవుడ్ని నేనడిగినట్టూ –
దానికతడు బతుకంటే .. శ్రమన్నట్టూ –
అదే.. మానవాళి చిరునవ్వుకు మూలమన్నట్టూ
మనుషులు బీళ్ల కాకూడదన్నట్టూ –
నారుమళ్లై పచ్చగా మొలకెత్తాలన్నట్టూ –
కలగన్నాను !
లేచి చూస్తే .. యింకేముంది !
దుర్భరమైన ఆకలితో .. దేవుడు
రోడ్ల మీద దర్నాలు జేస్తున్నాడు
అప్పుల నిప్పుల్లో తునకల్లా వేగిపోతూ
బ్యాంకుల మెట్లమీద తలబాదుకుంటున్నాడు
ఎరువులకోసం .. విత్తనాలకోసం ..
అధికార కార్యాలయాల ముందు ఆథార్ కార్డై
అక్కుపక్షిలా పడిగాపులు కాస్తున్నాడు
ప్రతి అడ్డగాడిదకాళ్లూ పట్టుకొనీ ..
వసుదేవుడై దండాలు పెడుతున్నాడు
నాగలి విరిగిపోయీ ..
చాలుమీద దుక్కిటెద్దు కూలిపోయీ ..
బతుకు యుద్ధరంగంలో క్షతగాత్రుడై .. ఇవాల
నల్లచట్టాల సంకెలలో బంధీగా .. పాపం
ఎంత క్షోభ పడ్డాడో .. దీనుడు
కడాన తన పొలంలో తానే శవమై వేలాడుతున్నాడు!
2
దేవుడొచ్చీ ..!
పొగజెండాలతో కంపెనీ వొచ్చీ ..
నా పొలాన్ని దున్నేసింది
కాంక్రీట్ వటవృక్షం వేళ్లు దన్నీ ..
నా గుడిసెను కూల్చేసింది !
ఇనుపరెక్కల గెద్ద ఎగిరొచ్చీ ..
నా ఏరుని తన్నుకుపోయింది
అగ్నిగోళం దబ్బున పడి ..
నా అంబలిదాక బద్దలైపోయింది
యీ దేశపు జెండా ..
నా గోచిగుడ్డ జారిపోయింది !
యివాల నాకు
దాకా లేదు .. దోకీ లేదు
గుడిసే లేదు .. కట్టుగుడ్డా లేదు !
పోనీ ..
దిసమొలతో నిలబడదామన్నా ..
చేరడు మట్టికి దిక్కూ లేదు
నా కష్టాన్ని చూడొచ్చిన సముద్రం
చుట్టమై నా కళ్లల్లో తిష్టేసాక ..
‘ఏం జేతును దేవుడా ..’ అని
నెత్తిగొట్టుకుంటే –
దేవుడొచ్చీ ..
నా మొండిగోడల దివ్వగూట్లో
దీపాలార్పేసి పోయేడు !!
*
రెండు విభిన్నమైన, విలక్షణ, విలువైన కవితలు..🙏
చాలా ప్రశస్తమయిన కవిత. కవి సృజనాత్మకత కు జోహార్లు. రైతును దేవునితో జతచెయ్యడం అద్భుతం.
చాలా బాగుంది, శ్రమజీవి కష్టాలకు ఫలితంగా శ్రమే మిగిలింది. సమాజం తమాషా చూస్తోంది.
మంచి కవితలు అన్న…మీకు మరోమారు హృదయ పూర్వక శుభాకాంక్షలు
దేవుడు దిగి వచ్చినా సరే, సిరికి స్వామినాయుడు రైతు గురించే కల గంటారు. మట్టిమనిషి కష్టం గురించే వరాలాశిస్తాడు. భిన్నమైన కోణంలో మరో కవితలోనైనా కోరిక వెలిబుచ్చుతారనుకుంటే, అక్కడా కూడు, గూడు లేని బడుగుజీవి నివేదనలే! అదీ కవి చిత్తశుద్ధి.
అభినందనలు.
కవిత చాలా బాగుంది.దేవుడు రక్షకుడు కావడం మంచి ఊహ.మీ కల నిజం కావాలని కోరుతున్నాను