దూరం వల్లనే అంత దగ్గిర!

ఆకాశం పెద్దదైనా పక్షికన్నాచిన్నదైనప్పుడు ఎగరాలని ప్రయత్నించే పక్షే ఆకాశానికి ఆశకలిగిస్తుంది.

వి ‘కృష్ణుడు’ రచించిన ‘ఆకాశం కోల్పోయిన పక్షి’ కవితా సంపుటి ఆవిష్కరణ ఏప్రిల్ 7 శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం .ఆవిష్కర్త చంద్రశేఖర కంబార (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు )విశిష్ట అతిథులు కె. శ్రీనివాస్, నగ్నముని, కె. శివారెడ్డి ,దేవీప్రియ, చంద్రశేఖర్ రెడ్డి. ఆప్తవాక్యాలు కె. శ్రీనివాస రావు (కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ)

కృష్ణుడూ, ఈ పదేళ్ళలో వచ్చిన మార్పుల్ని ఒక కవిగా మీరెలా చూస్తున్నారు?

  మనుషులుండీ నిర్మానుష్యంగా కనిపించే వాతావరణం చాలా కాలం నుంచీ ప్రారంభమైంది. మన కాళ్ల క్రింద నేల జారిపోయి చాలా కాలమైంది. కళ్లముందు కనపడేవేవీ వాస్తవం కావు. రహదారులపై వేగంగా పరిగెత్తే వాహనాలు సజీవంగా కనిపిస్తాయేమో కాని అది సజీవ మానవుల శవాలపై పరిగెత్తే యంత్రాలు. నెత్తుటి మరకను తుడిచేసిన తర్వాత రోడ్డు నిర్లిప్తంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇదేనా మనకు కావాల్సిన ప్రశాంతత? చట్టసభలు వాయిదా పడతాయి. అంతా స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. కాని చట్ట సభలకూ, ఆఫీసులకు తెలియని రహస్య ఒప్పందాలు ఎక్కడో  ఏ ఫార్మ్ హౌజ్ ల్లోనో జరుగుతాయి. అంతా చట్టబద్దంగా కనిపిస్తాయి కాని వేల కోట్ల ప్రజాధనాన్ని నిర్లిప్తంగా కొల్లగొట్టిన నేతలు ప్రజాస్వామ్యం గురించి అనర్గళ ప్రసంగాల్ని ఇస్తుంటారు. పసిపాపలు పాలు లేక ఏడుస్తుంటారు కాని వేల కోట్ల విలువై క్షీర ధారలు విగ్రహాల్ని తడుపుతుంటాయి. భక్తి ధనవంతుల ఆడంబర చిహ్నంగా మారింది.   రైతుల ఆత్మహత్యలు చూడమని ఒకరంటే, సరిహద్దుల్లో సైన్యాన్ని చూడమంటారు మరొకరు. కుళ్లిపోయిన వ్యవస్థ గురించి మాట్లాడలేని వారు దేశభక్తి గురించి ప్రవచనాలు ఉల్లేఖిస్తారు. ఉద్యమాలలో నీరసత్వం ఆవహిస్తుంది. ఫేస్ బుక్ ల్లోనే  పోరాటాలు  జరుగుతాయి. విప్లవం ఒక పురాస్మృతిగా మారిపోతోంది. అమాయకులైన ఆదివాసీలకు ఎందుకు ఏళ్లతరబడి తాము నిర్బంధంలో ఉన్నామో తెలియదు. మనకు తెలియకుండా మన హత్యలు జరుగుతున్నాయి. మన చైతన్యాలు ముక్కలు ముక్కలై, కులాలై, వర్గాలై, అస్తిత్వాలై, అభిమాన సంఘాలై లక్ష్యాన్ని కోల్పోతున్నాయి. దిగంబర కవిత్వం రాసిన నాటికీ ఇప్పటికీ మార్పేమీ లేదు. అది మరింత దారుణాతి దారుణంగా మారింది. పైగా ఈ పదేళ్లలో నాటి మానవ సంబంధాలు కూడా కుప్పకూలిపోయాయి. సమాజాలూ, సంఘాలూ విచ్చిన్నమయిపోయాయి. ప్రతి మనిషిలోనూ ప్రేతకళ తాండవిస్తోంది.

మీలో కవీ,పత్రికా రచయితా ఇద్దరూ పోటీ పడుతుంటారు. మీరెవరి పక్షం?

 కవి పత్రికా రచయిత అయితే అతడి బాధ వర్ణనాతీతం. కవితో పత్రికా రచయిత ఎప్పుడూ పోటీ పడలేడు. పత్రికా రచయిత రాసేదాంట్లో ఎక్కువ సమాజానికి అవసరం లేని, బూటకమైన, తనను తాను వంచించుకునే అసత్యాలు. నిజాల పాలు తక్కువ. కాని కవికి అలా చేయాల్సిన అవసరం లేదు అయితే సాధారణ కవి కంటే పత్రికారచయిత అయిన కవి కున్న అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకు  నేను బాబ్రీమసీదు విధ్వంసం చూశాక రాసిన వార్త వేరు. దానిపై రాసిన కవిత గాఢత వేరు. పత్రికారచయిత చాలా సమీపం నుంచి బూటకపు దుర్మార్గ వ్యవస్థను గమనించగలడు. అతడు కవి అయితే దాన్ని సహజంగా చిత్రించగలడు. ‘నేను నా సర్వీసులో 50 మందిని కాల్చి చంపాను’ అనే అధికారితో ఏ కవి అయినా సంభాషించగలడా పత్రికా రచయిత అయితే  తప్ప.  వేల కోట్లను కబళించినా సాధారణంగా కనపడే నేతలతో ఏ కవి అయినా కరచాలనం చేయగలడా పత్రికా రచయిత అయితే తప్ప?  అయితే కవికి మాత్రమే ఆ కరస్పర్శలో ప్రవహించిన నల్లటి రక్తాన్ని కవితల్లో చెప్పగలగిన శక్తి ఉంటుంది. ఒక కవి పత్రికా రచయిత అయితే తనలోని బడబాలనంతో కాగితాలను జ్వలింపచేయగలడు.

 కొత్త కవిత్వంలో కృష్ణుడి చిరునామా యెక్కడ?

 కవిత్వం పాతబడింది. ఒక వ్యాయమంగా మారింది. ఒక ప్రహసనంగా మారింది. ఒక వ్యాపకంగా, గుర్తింపుకు చిహ్నంగా తయారైంది. కనిపించేది అధునాతనంగా ఉన్నా, విప్లవాత్కకంగా ఉన్నా విషయం నిర్జీవమైంది, భావం యాంత్రికమైంది.  ఈ డొల్లల్ని బద్దలు కొట్టి, విశ్వాసాల్ని ప్రశ్నించి, మూసల్ని ఛేదించి, చితుల్ని వదిలించుకుని, శవాలను భుజాలపైనుంచి నెట్టేసి నిత్యనూతనంగా, అధునాతనంగా నిలబడే ధిక్కార స్వరాన్ని వినిపించాలన్నదే కృష్ణుడి లక్ష్యం. సమాజం నుంచి తనను తాను ఎలిమినేట్ చేసుకుని సమాజాన్ని ఆవాహన చేసుకుని, ఒక సామూహిక స్పందనకు చిహ్నంగా నిలబడడమే వాడి ధ్యేయం. గుట్టగా పడి ఉన్న శవాలపై నుంచి ఎగిరే జెండాయే వాడి చిరునామా.

 ఇటీవలి కాలంలో సాహిత్య పరంగా మీకు గొప్ప స్ఫూర్తి ఏమిటి?

 స్ఫూర్తి? ఏదీ స్ఫూర్తి నివ్వకపోవడమే  స్ఫూర్తి. ఒకామే ఆఫీసుకు వచ్చి వికలాంగుడైన తన  భర్తకు అన్యాయంగా యావజ్జీవ శిక్షపడిందని చెప్పినప్పుడు, ‘మేమందరమూ కేసులను,  నియమించబోయే జడ్జిలను పంచుకుంటామని, గద్దెపై నున్న వాడి బూట్లను నాకేందుకు పోటీపడతామ’ని ఒక న్యాయమూర్తి స్వయంగా చెప్పినప్పుడు, హోటల్ లాబీల్లో  చమురు మాఫియాలు, ఆయుధాల వ్యాపారులు, రాజకీయ దళారులు చెట్టపట్టాలు వేసుకున్నట్లు గమనించినప్పుడు, ఉద్యమాలు శవాల లెక్కింపుకోసం పోటీపడ్డప్పుడు, గడ్డకట్టిన చలిలో దుప్పటికోసం ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడిని రాయితో కొట్టి చంపాడని తెలిసినప్పుడు, రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగులోనూ బూటకత్వం పసిగట్టినప్పుడు శ్రీ శ్రీ రాసిన ఉరితీయబడ్డ శిరస్సు రహస్యం గోచరిస్తుంది.  అప్రయత్నంగా కళ్లు మెరుస్తాయి. పెదాలపై అప్రయత్నంగా చిరునవ్వు కదులుతుంది. అదే  స్ఫూర్తి.

“ఆకాశంలో పక్షి” మీరేనా?మీ చుట్టూ వున్న మొత్తం సమూహమా?

 పక్షులు లేని ఆకాశం ఒక ఆకాశమా? సమాజం నిర్వీర్యమైనప్పుడు, జడత్వం ఆవరించినప్పుడు, సమాజాన్ని కుట్ర కబళించినప్పుడు వ్యక్తికీ సమాజానికీ తేడా ఏముంది? సమాజం కుంచించుకుపోయినప్పుడు దాన్ని చేదించుకున్నప్పుడే వ్యక్తి సమాజాన్ని అప్రమత్తం చేయగలుగుతాడు. ఆకాశం పెద్దదైనా పక్షికన్నాచిన్నదైనప్పుడు ఎగరాలని ప్రయత్నించే పక్షే ఆకాశానికి ఆశకలిగిస్తుంది.

తెలుగు నేలకి దూరంగా వుండడం…ఇది ఎంతవరకు మీ కవిత్వ అనుభవంలో భాగమవుతోంది?

 నేను తెలుగునేలకు దూరం గా ఎప్పుడూ లేను. దగ్గరగా ఎప్పుడూ లేను. అక్కడ మనుషులు, కవులు, సంఘాలు, ఉద్యమాలు, రాజకీయ నాయకుల కదలికలు, ప్రకంపనలూ నన్ను తాకుతూనే ఉంటాయి. వారితో లేకపోవడం, కలిసిపనిచేయకపోవడం జరగనంత మాత్రాన ఆ స్పందనలు నన్ను తాకవని చెప్పలేను. అక్కడి కళ్లు, మనసులు నాతో సంభాషిస్తూనే ఉంటాయి. అదే సమయంలో ఆ కళ్ల క్రింద పరుచుకున్న నల్లటి నీడల్నీ, ఆ మనసులపై క్రమ్మిన తెరల్నీ, వారి ఆలోచనల్లో తచ్చాడే వారు చెప్పలేని భావాల్నీ గమనించలేదని చెప్పలేను. దూరంగా ఉన్నాను కాబట్టే తెలుగునేల ఏమి కోల్పోయిందో, నేను ఏది కోల్పోయానో విహంగ వీక్షణం చేయగలుగుతున్నానేమో.. కవిత్వీకరించగలుగుతున్నానేమో..

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Leave a Reply to Balasudhakarmouli Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు