ఇప్పటవరకూ బ్రతికేఉన్నాడని
తెలియని వ్యక్తి ఎన్నో చేతులు
మారిన వంద రూపాయిల
కాగితంలా నాకు ఎదురుగా వస్తున్నాడు
ఎడారిని కప్పుకున్న దేహం అయినా
అతని చొక్కా చిరుగుల నుండి
తూట్లు పడిన హృదయం కనిపిస్తోంది
విరిగిపోయి ఒంటరైన మబ్బు
ఏడ్చినట్లు అతని హృదయం
ఘోషిస్తోంది
తుఫాను తాకిడికి చెదిరిన
గ్రామంలా
అతని ఆలోచనలు ఎక్కడి నుండి
ఎక్కడికో ఎగిరి పడుతున్నాయి
కళ్ళు ఎన్నో యుగాల నిద్రను
మోస్తూ తిరుగుతున్నట్లు
ఉన్నాయి
అతని రక్తంలో జీవం
మిణుకు మిణుకు మంటూ
ఆగిపోవడం తెలుస్తోంది
గాలి సముద్ర కెరటమై
చెవులను కోసేస్తోంది
తెల్లబడిన చేతి గోర్లు
హెన్నా పెట్టుకున్నాయి
అయినా అతను ఎన్నో అక్షరాలను
మోసుకొస్తున్న దారి తప్పిన
మనిషిలా కాకుండా
దారి మార్చిన కవిలా
కనబడుతున్నాడు.
*
ఆమె కథ
నేను నగ్నంగా నడవాలనుకుంటున్నాను
నన్ను కౌగిలించుకోలేని నా
నీడను కూడా నువ్వు శృంగారించగలవు
నా నుండి నీకు కావాల్సిన సుఖం
ఎలా అయినా పొందగలవు
కానీ అది నీకోసం అయితే
రావట్లేదు
నన్ను తడుముతున్నప్పుడు నాకు ఎంత
హాయిగా ఉందో తెలుసా
బ్రహ్మాజెముడు, నాగజెముడు
మొక్కలు నీ ఎడారి చేతులపై
మొలిచాయి అనుకుంటా
నువ్వు నీ ఊపిరిని, నీ శక్తిని
బలవంతంగా నాలోకి తోస్తుంటావు
నీ స్వేచ్చతో నా స్వచ్ఛతను చంపేస్తుంటావు
బాహ్యంగా నీ వేళ్లు నన్ను చేతబడి చేస్తుంటాయి
అంతరంగా కూడా నీ వేళ్లు ప్రయోగాలు చేస్తుంటాయి
నేను ఇప్పుడు నగ్నత్వాన్ని
కప్పుకున్న పుల్లల గూడుని
నేను నగ్నంగానే తిరుగుతాను
ఎప్పుడైతే మీ తల్లి కళ్లలో నేను
కనిపిస్తానో అప్పటివరకు
ఎంతమంది నన్ను వ్యామోహిస్తారో
వ్యామోహించండి
*
Painting: Pathan Mastan Khan
Good poem