‘ఆఫీసుకు లేటవుతున్నది, తొందరగ బాక్స్ ఇయ్యి..’ టీవీ ముందు కూర్చుని టిఫిన్ తినుకుంటనే కేకలేశిన.
‘ముందుగాల మింగేదైతే మింగు! తర్వాత మింగేదాని గురించి ఎందుకట్ల తొందర?’ స్టవ్ దగ్గర్నుంచి బాక్స్ సర్దుకుంట తెచ్చిస్తూ అన్నది వనజ.
‘ఆ… మీ అయ్య పెట్టిందేమన్న మింగుతున్ననా? నేను కష్టపడ్డదే కదా! ఆఫీసుకు లేటుగపోతే ఈ మింగేది గూడ దొర్కదు’ అని ఈసడించుకుంట ఓ చేతిల బాక్సు, ఇంకో చేతిల నీళ్లగ్లాసు తీసుకున్న. నా చేతులు ఖాళీ లేవని బీపీ టాబ్లెట్ తీసి నేరుగ నోట్లనే వేశింది వనజ. గడగడ నీళ్లు తాగుకుంట బైటికి పరిగెత్తిన.
“నీ ఆగం సల్లగుండా! ఓ అద్దగంట ముందు లేస్తే ఏంబాయే? టీవీల, ఫోన్ల మూతి పెట్టకుంటె ఏం మునిగే? జాగ్రత్త.. జాగ్రత్త’ అనుకుంట ఇంట్లకు పోయింది వనజ.
కొమురెల్లి మల్లన్నకు మొక్కంగ మొక్కంగ పుట్టిననని ‘మల్లికార్జున్’ అని ఆ దేవుని పేరే నాకు పెట్టుకున్నడు మా బాపు. కొమురెళ్లి పక్కనే ఏటిగడ్డ కిష్టాపూర్ మాది. పీజీ చదివి హైదరాబాదుకు పదిహేనేండ్ల కిందట వచ్చి ప్రైవేట్ కంపెనీల ఉద్యోగానికి కుదురుకున్న. అప్పటినుండి సొంతూరు దూరమైంది, పట్నమే దిక్కైంది. ఊర్ల ఉన్న పొలం బాపు ఆరోగ్యానికి ఖర్చయిపోయె! ఆ కోపం కొంత, బాధ కొంత కలిసి వూరికి పోవుడే లేదు. వచ్చే జీతంల పోరగాండ్ల చదువు, ఇంటి ఖర్చులు తీరుడే కష్టమున్నది. రోజూ బండిలో రెండు లీటర్ల పెట్రోల్ పొయ్యాల్నంటె 250 రూపాయలైతయ్! అవి ఏడికెంచి తేవాల్నని బస్ పాస్ తీసుకొని ఆఫీసుకు పోతున్న.
ప్యాట్ని దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తుండంగ ఊరి దోస్తు రమేష్ కనిపించిండు. ఎంతో ఉత్సాహంగ ఉండేటోడు పీలమొఖంతో జీవకళ లేనట్టున్నడు. కొంచెం సందేహించి ‘అరేయ్ రమేష్! ఏడికిపోతున్నవురా?’ అని పిలిచిన.
‘అరే… మల్లికార్జునన్నా! నువ్వా? ఎన్నేండ్లయిందే నిన్ను జూసి! మంచిగనే గుర్తుపట్టినవ్! ఎట్లున్నవే?’ అని కుశల ప్రశ్నలేశిండు.
‘ఆ… మంచిగనే ఉన్నరా! గీడేం చేస్తున్నవ్?’ అని అడిగిన.
‘గిప్పుడే జేబీఎస్ల బస్సు దిగిన్నే! బాపును దావఖాన్ల చూపిద్దామని అచ్చిన. గాడికేయి గీడికి నడిచేసరికే ఆయాసం బాగా అత్తుందని అగో గాడ కూసున్నడు..’ చెట్టుకిందున్న తండ్రిని చూపించిండు. విపరీతంగ ఆయాసపడుతూ కూర్చోనింకె గూడా ఇబ్బంది పడుతుండాయన. ‘ఏం నాయినా! ఎట్లున్నవ్?’ అని పెద్దమనిషిని మాట్లాడిస్తూనే, ‘మంచిగుండె కదరా! గిట్లెట్లయిండు? మంచి దావఖాన్ల చూపియ్యిరా’ అన్న రమేష్‌తో.
‘ఏడన్నా? మూడేండ్ల సంది అరిగోస పడ్తున్నం. పెద్ద దవాఖాన్లల్ల అడ్డగోలు పైసలు ఖర్చయినయి గని బీమార్ తగ్గుతలేదు. డాక్టర్లేమో వయసైంది గదా, మెల్లగ తగ్గుతది అంటుండ్రు. ఆళ్లు, ఈళ్లు చెప్పినప్పుడల్ల దవాఖాన్లు మార్చి మార్చి చూపిచ్చిన. ఇగో గీ గల్లీల్నే లేదా కార్పొరేటు దవాఖానా! గండ్లనే చూపిత్తున్నా. అచ్చినప్పుడల్లా తక్కువల తక్కువ పదిగేను, ఇరవై వేలయితున్నయ్’ అన్నడు రమేష్.
‘ఏం జేత్తంరా! ఆగంగాకు తియ్. అన్నీ మంచిగైతయి. బాపూ పయిలం’ అని రమేష్ ఫోన్ నెంబర్ తీస్కొని బస్సు రాంగనే పోయి ఎక్కుకుంట ‘ఏమన్న అవసరం బడితే ఫోన్ చెయ్ రా’ అన్న.
ఊగులాడుతున్న బస్సుల చెమటలు కారుతుండంగ అటూ, ఇటూ మెసులుకుంటున్న. సీట్లల్ల కూర్చున్నోళ్లు ఎవలు కదులుతున్నరా, స్టేజి వచ్చిందని ఎవరు లేవడానికి తయారుగున్నరా అని చూస్తున్న. చురుగ్గుంటెనే ఆర్టీసీ బస్సులో సీటు దొర్కుతది. లేకపోతే గచ్చిబౌలి దాక కాళ్లమీదనే ప్రయాణం. రసూల్‌పురా దగ్గరికి రాంగనే సీటు సంపాయించుకొని కూర్చున్న. రమేష్ వాళ్ల బాపును తల్చుకుంటే పాత రోజులు గుర్తుకొచ్చినయ్.
పన్నెండేళ్ల క్రితం సంగతి! అప్పటికి నాకు పెండ్లైనా, ఇంకా హైదరాబాద్ల సంసారం పెట్టేందుకు జీతం సరిపోక బ్యాచిలర్‌గా మా దోస్తు సుధాకర్ రూంలనే ఉంటున్న. అప్పుడప్పుడే సెల్‌ఫోన్లొచ్చి ఇన్ కమింగ్‌కి బిల్ కట్టే రోజుల్లో సుధాకర్‌కి ఓ రాత్రి ఫోనొచ్చింది. మా బాపుకు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిందని, గజ్వేల్ దవాఖానకు తీసుకపోతున్నరని, అర్జంటుగ రమ్మని అన్నరు. సెకండ్ షిప్ట్ అయిపోయినంక పన్నెండు గంటలకు రూంలకి రాంగనే సుధాకర్ విషయం చెప్పిండు. తనదగ్గరున్న వెయ్యి రూపాయలు జేబుల పెట్టి ఊరికి పంపించిండు.
రాత్రి హైదరాబాదు నుంచి ప్రజ్ఞాపూర్‌కి బస్సు, అక్కడి నుంచి ఇసుక లారీలు పట్కొని గజ్వేల్ చేరేసరికి తెలవారుతున్నది. నేరుగ హాస్పిటల్‌కి పోయిన. అమ్మ బయట దీనంగ కూర్చున్నది. వరండాల దిమ్మె మీద తమ్ముడు పడుకున్నడు. అక్కడి నుంచి ఐసీయూ దగ్గరికెళ్లి సిస్టర్‌ని బతిమిలాడితే లోపలికి పంపించింది. బెడ్‌పైన ఉన్నడు నాన్న. చిన్న ముల్లు కుచ్చితేనే విలవిల్లాడే ఆ మనిషి రెండు చేతులకి సిరంజీలు కుచ్చి సెలైన్లు పెట్టిండ్రు. నోటికి ఆక్సిజన్ మాస్క్, ఒంటి నిండ బీపీ, పల్స్ మీటర్లు ఉన్నయ్. ఎడ్లబండిని అమాంతం పైకిలేపి కాడి కట్టేటోడు, యాభై కిలోల బియ్యం బస్తాని మోసుకొచ్చి ఇంట్లో ఒక్కడే దించేటోడు, బండెడు చాకిరీ చేసినా అల్సిపోకుంట మొఖమంత నవ్వుకుంట ఎదురొచ్చే బాపు అట్ల పడి ఉండేసరికి కండ్లల్ల నీళ్లు పొంగుకొచ్చినయ్.
నన్ను చూసి అమ్మ ఏడుపు మొదలువెట్టింది. సిస్టర్ అక్కడ్నుంచి మమ్మల్ని బయటకి లాక్కొచ్చింది. అమ్మ ఇంగా ఏడుస్తనే ఉన్నది. అందరికీ ధైర్నం చెప్పే నాన్నే సోయి లేకుంట హాస్పిటల్ల ఉన్నడు. నన్ను నేను తమాయించుకొని అమ్మని ఓదార్చి, ఏం జరిగిందని అడిగిన. ‘సాయంత్రం చేను కాన్నుండి రాంగనే తల తిరుగుతుందని చాయ్ ఇమ్మన్నడ్రా! కొంచెంసేపు పండుకుంటా అని చెప్పి అట్లే చక్కెరొచ్చినట్టు పడిపోయిండు. ఆర్ఎంపీ వచ్చి చూశి గజ్వేల్‌కి తీస్కపొమ్మంటే గిట్ల తీస్కచ్చినం. సర్కార్ దవాఖాన్లకు పోతే డాక్టర్ లేడని చెప్పి ఈడికి పంపిండ్రు’ అన్నది.
పదిగంటలప్పుడు మామ, ఊరి ఆర్ఎంపీ వచ్చిండ్రు. డాక్టర్ వచ్చి మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడిండు. ‘బీపీ బాగా పెరిగి మెదడ్లో నరాలు తెగిపోయినయ్. రక్తం గడ్డకట్టింది. పేషంట్ కోమాలో ఉన్నడు. ఇటువంటి కేసుల్లో 24 గంటల నుండి 48 గంటలైతే కానీ ఏమీ చెప్పలేం! ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యాలి. మిగతా విషయాలు నువు చెప్పు’ అని ఆర్ఎంపీ దిక్కుతిరిగి హాస్పిటల్ అకౌంటెంట్‌కి చెప్పిండు. ఆ డాక్టర్ వెళ్లిపోయినంక ‘నిన్న కట్టిన అడ్వాన్స్ పదివేలు అయిపోయినయి. ఇంకో ఇరవై ఐదు వేలు కట్టండి. రెండ్రోజులైనంక మందులతో తగ్గుతదా, లేకపోతే ఆపరేషన్ చేయాల్నా అనేది తెలుస్తది’ అని అకౌంటెంట్ కూడా ఆర్‌ఎంపీ దిక్కు చూసుకుంట యెళ్లిపోయిండు.
అమ్మ ఏడ్సుకుంటనే మామ దిక్కుతిరిగి “వామ్మో పదివేలు ఒక్కరాత్రికే ఓడజేసిండ్రా? అన్నా! ఇరవై ఐదు వేలంటే యాడికేయి తెస్తం? గవర్నమెంట్ దావఖాన్లకు పోదాం పా” అన్నది. వెంటనే ఆర్ఎంపీ అందుకొని “అక్కా! నువు పైసలకు చూస్కుంటున్నవ్. సర్కార్ దవాఖాన్ల సౌలత్లుంటయా? గీ కోమాల ఉన్న మనిషిని పట్టించుకుంటరా? అండ్లకు తీస్కపోవుడంటే చస్తే చావనితియ్ అని వదిలేసుకున్నట్టే!” అన్నడు. ఆ మాటకి భయంతోటి “అమ్మా! నువ్వు ఫికర్ చెయ్యక్! పైసల సంగతి తర్వాత ఆలోచిద్దం తియ్” అన్న. “గిప్పుడేడికెయి తెత్తవు బిడ్డా?” అన్నదామె.
ఆర్ఎంపీ అందుకొని “నేను డాక్టర్కు చెప్తా! పగటీలి వరకు తీసుకరాండ్రి. కావాల్నంటె మనూరు సేటు దగ్గర భూమి కాయిదాలు పెట్టి తేండ్రి” అన్నడు. భూమి అనే మాట వినంగనే అమ్మ ఒక్కసారిగ దిగాలు పడ్డది. ‘ఉన్న ఒక్క ఆధారం ఆ ఎకరంన్నర! అది పోతే పోరగాండ్లెట్ల బతకాలెనని’ అన్నది. “అక్కా! గీ పైసలకే భూమి పోతదా? గిప్పుడు ఆలోచిస్తే పనిగాదు. అయితే పట్నంల పెద్ద దావఖాన్లకు తీస్కపోవాలే, లేకపోతే పైసల్ కట్టాలే” అన్నడు. “కోమాలో ఉన్నాయన్ని సర్కార్ దవాఖాన్లకు ఏడ తీస్కపోయినా చంపుకున్నట్టే! ఇగ పట్నం ప్రైవేట్ దవాఖాన్లైతే రోజుకే లక్షలైతయి. ఆడయినా గివే మందులు, ఈడయినా గివే మందులు. మీరు ఇబ్బందుల పడద్దనే ఈడ ఉంచుమంటున్నా” అన్నడు ఆర్‌ఎంపీ.
మొత్తానికి సేటు దగ్గర పైసలు తెచ్చి దవాఖాన్ల కట్టి, మూడ్రోజులుంచినం. బాపు అప్పడప్పుడు కదులుతుండు కానీ పెద్ద తేడా రాలే! డాక్టరొచ్చి “ఎమ్మారైల రక్తం గడ్డలు ఎక్కువ కన్పిస్తున్నయ్. మందులకు కరుగుతలేవు. ఎందుకైనా మంచిది పట్నం తీస్కపోండి” అన్నడు. ‘గిదేంది? నలబైవేలు తీస్కొని మూడ్రోజులైనంక గీ మాటంటుండ్రు?’ అని తమ్ముడు కోపానికచ్చిండు. అవేవీ పట్టించుకోకుంట అందరూ యెళ్లిపోయిండ్రు.
పట్నంల సర్కార్ దవాఖాన్లకు తీస్కపోంగానే ‘ఆ కార్డుందా? ఈ కార్డుందా?’ అని గంట, రెండు గంటలు బాపుని అంబులెన్సులనే ఉంచిండ్రు. ఇంకో రెండు గంటలు ఆడ బెడ్డు లేదు, ఈడ బెడ్డులేదు అని అట్లే వదిలేశిండ్రు. చివరికి తీస్కపోయి జనరల్ వార్డుల ఉంచిండ్రు. అప్పటికే పెద్ద డాక్టర్ యెళ్లిపోయిండంట. డ్యూటీ డాక్టర్ వచ్చి చూశి ఏదో చీటీ రాశిచ్చిండు. మాట్లాడుతున్నా సమాధానం ఇవ్వకుంట యెళ్లిపోయిండు. అక్కడ వాతావరణం చూస్తె తల తిరుగుతున్నది. మొత్తం జనం, ఏడంటెఆడ చెత్త, అదో రకమైన వాసన. సగం మంది పేషంట్లు కింద, సగం మంది చిరిగిపోయి, ఇరిగిపోయిన బెడ్ల మీద ఉన్నరు. ఎవ్వలి మొఖంల జీవకళ లేదు. మొత్తం వార్డుల ఇద్దరే సిస్టర్లు, ఎన్నిసార్లు అడిగినా నాన్న దగ్గరికచ్చి సెలైన్ పెట్టనింకె సాయంత్రమైంది. బాపులో ఉలుకు లేదు, పలుకు లేదు. అమ్మను రానీయకపోవుడు మంచిదైంది, లేకుంటే ఇదంత చూశి ఆమె గూడ పేషంట్ అయితుండె! తమ్ముడేమో “అన్నా! ఈడ ఎటో ఉంది. బాపు బతుకుతడాయే?” అని దీనంగ అడుగుతున్నడు.
“గిదంత కాదురా! మన సర్పంచ్‌తోని మాట్లాడి పెద్దోళ్లకి చెప్పి డాక్టర్లకు మంచిగ చూడమని చెప్పుమందం” అన్న. సాయంత్రం పైసలతోపాటు సద్దిభోజనం తేవడానికి ఊరికొచ్చి సర్పంచును కలిశిన. మొత్తం సంగతి విన్న సర్పంచ్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పిండు. “మీరేం ఫికర్ చేయకుండ్రి! ఎమ్మెల్యే సాబ్ చూసుకుంటడు” అని ఫోన్ కట్ చేసి అన్నడు. సేట్ దగ్గర పైసల్ తీస్కొని ఇంటికి సద్దికోసం పోయేసరికి ఇరుగుపొరుగు వచ్చిండ్రు. ‘చెట్టంత మనిషి బతికుంటే ఇంతకు పదింతలు సంపాదిస్తడు. పైసలకు బయపడి పెద్దాయన్ని చంపేయకుండ్రా! ఆ సర్కార్ దవాఖాన్ల ఉంచి’ అని ఒకరు, ‘ఆర్ఎంపీగాడు కమిషన్ దొబ్బనీకి ఏదేదో చెప్పి గజ్వేల్లనే మస్తు ముంచె! పట్నంల ప్రైవేట్ దావఖాన్ల జర జాగ్రత్త’ అని మరొకరు.. ఎవరికి తోచిన మాట వాళ్లు చెప్తున్నరు.
మరునాడు పెద్ద డాక్టర్ వచ్చి చూశి ఐసీయూకి పంపిండు. అక్కడ జనరల్ వార్డు మీద కొంచెం మెరుగున్నది. స్కానింగులు, రిపోర్టులన్ని తెప్పిచ్చి పెద్ద డాక్టర్ పిలిచిండు. బాపు మెదడ్లో రక్తం గడ్డకట్టిందని, ఆపరేషన్ చేసి తీయాలన్నడు. ఆపరేషన్ మిషిన్ సరిగ పని చేస్తలేదని, చాలామంది లైన్ల ఉన్నరని చెప్పిండు. రెండ్రోజులైతదని చెప్పి, పాణాలకు గ్యారంటీ ఇయ్యలేమన్నడు.
నేను, అమ్మ ఒకేసారి ‘ఏదైతే అదైతది! ఈడికి నాల్రోజులాయె! బాపు పీనుగలెక్కనే పడుండె! పైసల సంగతి తర్వాత చూద్దాం. ప్రైవేట్ దావఖాన్లకు తీస్కపోదం పా’ అని అంబులెన్స్ మాట్లాడుకొని పోయినం. ఆర్ఎంపీ అన్నట్టు మొదట డిపాజిటే లక్ష కట్టించుకున్నరు. ఈ బీమారి సర్కారి బీమా కిందకు రాదని, మొత్తం అయిపోయే వరకు మూడు లక్షల దాక ఖర్చయితదని చెప్పి, అదే రోజు రాత్రి ఆపరేషన్ చేసిండ్రు. తెల్లారి మధ్యాహ్నంకల్లా కొంచెం కొంచెం కళ్లు తెరిచిండు బాపు. అమ్మ నిమ్మలవడ్డది. ఇంతల్నే మల్లా యాభై వేలు కట్టమని చెప్పంగనే పోయి కట్టొచ్చి అట్ల కూసున్న.
పెద్ద డాక్టర్ పిలుస్తున్నడని నర్సు చెప్పింది. “బాబూ! నువ్వేమైతవ్ పేషంట్‌కి?” అని అడిగిండు. “మా బాపు సర్ ఆయిన. ఏమైంది?” అని అడిగిన. “నిన్న చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ మళ్లీ బీపీ పెరిగి వేరే దగ్గర రక్తం గడ్డకట్టింది. అర్జంటుగా ఆపరేషన్ చేయాలె! మీరు ఏర్పాట్లు చేసుకోండి” అన్నడు. డాక్టర్ ఏం చెప్పిండో కొంచెంసేపటిదాక అర్థం కాలే! ‘గిదేంది? మూడు లక్షల దాక అయితయి అని మొదట చెప్పి ఇప్పుడు మల్ల ఇంకా పైసల్ రెడీ చెస్కోమంటున్నరని’ అడ్మినిస్ట్రేషన్ల అడిగితే, ‘ఒక ఆపరేషన్‌కి అంత అయితది అని చెప్పాము. ఇప్పుడు మల్లా ఆపరేషన్ చేయాలె కదా! పేషంట్ కండీషన్ బట్టి డాక్టర్లు చెప్తారు. మీ ఇష్టం ఉంటే ఉంచండి, లేదంటే డిశ్చార్జి చేసుకొని పోండి’ అని దబాయించినట్టు మాట్లాడిండ్రు.
నాకు, తమ్మునికి విపరీతమైన కోపమొచ్చింది. తమ్ముడు పెద్దగ అరుస్తున్నడు. వాణ్ని సంబాళించి, ఏదైతే అదయిందని సేట్ దగ్గర కాయిదాలు పెట్టి, హాస్పిటల్ల వాళ్లు అడిగినప్పుడల్ల పైసల్ కడుతనే ఉన్నం. వారం తర్వాత బాపు మనుషుల్ని కొంచెం కొంచెం గుర్తు పడుతున్నడు, కానీ మాట పడిపోయింది. కుడి చేయి, కాలికి పక్షవాతమొచ్చింది. ఎట్లనో ఐదు లక్షల బిల్లు కట్టి బయటపడ్డం. ఆ తర్వాత నెలకోసారి హాస్పిటల్ చుట్టూ తిరిగినం. బాపు పరిస్థితిల పెద్ద మార్పేం లేదు. ఏదో బతికున్నడంటే ఉన్నడు. అప్పుకు మిత్తి పెరుగుకుంట పోయి పొలం బేరానికి పెట్టినం. ఆ పైసల్ వచ్చుడు, బాపు పోవుడు.. రెండూ ఒకేసారి జరిగినయి. అప్పులు పోనూ మిగిలిన పైసలు ఆయన కర్మకాండలకు సరిపోయినయి.
ఉన్న ఊర్ల ఏదీ మిగలక అమ్మని, భార్యని తీసుకొని పట్నంల ఇరుకుటింట్ల కాపురం మొదలుపెట్టిన. బాపు పోయిన దుఃఖం, మేం అనుభవిస్తున్న దరిద్రం చూసి అమ్మ తల్లడిల్లిపోయింది. రోజురోజుకు చిక్కి, రెండేళ్ల తర్వాత తమ్ముని పెళ్లి అయిన రెండు నెలలకే ఆమె కూడా బాపు దగ్గరికే పోయింది. గందుకే హాస్పిటళ్లు గుర్తుకొస్తె నాకు ఎట్లనో ఉంటది. దవాఖాన్లు కాదవి, దగాఖాన్లని ఒల్లంత కంపరం పుడుతది. గచ్చిబౌలి రాంగనే ఆలోచనల్లోంచి తేరుకొని ఆఫీసుకొచ్చిన.
వారం తర్వాత బస్సులో ఆఫీసుకు పోతుంటె కార్పొరేట్ హాస్పిటల్ బోర్డు కనవడ్డది. రమేష్ గుర్తొచ్చి ఫోన్ చేసిన. “నానకు ఎట్లుంది రమేష్?” అని అడిగిన.
“ఇంకెక్కడి నాన అన్నా! మొన్ననే చనిపోయె! పొలం తాకట్టు పెట్టి లక్షలు ఖర్చు పెట్టినా లాభం లేకపోయె! మాయదారి రోగం, మాయదారి దవాఖాన్లన్నా” అనుకుంట బావురుమన్నడు. మనసంతా ఎట్లనో అయిపోయింది. బస్సు దిగి పోతుంటే దగదగా మండుతున్న అక్షరాలల్ల ‘దగాఖానా’ అనే బోర్డు కనిపించి, రాకాసి రూపంల నవ్వుతున్నట్టు అనిపించింది.
*
బలంగా కదిలించే అంశం కనిపిస్తే తప్ప కథలు రాయలేను
- హాయ్ సుధీర్! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది పూర్వ కరీంనగర్ (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల) జిల్లా ఆవునూరు. ఆ ఊరికి దగ్గర్లో ఉన్న వెంకటాపురంలో పదో తరగతి దాకా చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశాను. 2003 నుంచి 2015 దాకా వివిధ పత్రికలు, న్యూస్ ఛానెళ్లలో పని చేశాను. ప్రస్తుతం టీసాట్(Telangana Skills, Academic and Training)లో ప్రోగ్రామ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను.
- కథల వైపు ప్రయాణం ఎలా మొదలైంది?
నిజానికి నేను కవిని. ఎక్కువగా కవితలే రాశాను. కవిత్వంలో అయితే అప్పటికప్పుడు మన భావాలు చెప్పడం సులభం అని నా అభిప్రాయం. అయితే అన్ని అంశాలూ కవితల్లో ఒదగవు. నేను చూసిన అనుభవాలను ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలంటే కథలు రాయాలని అనిపించింది. 1999లో డిగ్రీ చదువుతున్నప్పుడు ‘వలసలు’ అనే కథ రాశాను. దాదాపు 13 ఏళ్ల పాటు అది ఎక్కడా ప్రచురితం కాలేదు.
- ఎందుకలా?
ఒక పక్క చదువు, అదయ్యాక ఉద్యోగం.. తీరిక లేని పరిస్థితుల్లో నేను రాసిన కథలు ప్రచురించాలన్న ఆలోచన ఉండేది కాదు. 2013లో ‘శ్రీశ్రీ ఫౌండేషన్’ కథలపోటీ నిర్వహించింది. దానికి నా తరఫున నా స్నేహితుడు ‘వలసలు’ కథ పంపాడు. అది పదివేల రూపాయల బహుమతి అందుకుంది.
- ‘వలసలు’ కథ నేపథ్యం ఏమిటి?
తెలంగాణలో నిరుపేదల జీవనాధారం గురించి ఒక మాట వాడుకలో ఉంది. అదే ‘బొంబాయి.. బొగ్గుబాయి.. దుబాయి’. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారిలో కొందరు బొంబాయి, భీవండి వంటి ప్రాంతాలకు వెళ్లేవాళ్లు. కొంతమేరకు చదువు ఉన్నవాళ్లు సింగరేణి బొగ్గు గనుల పనికి తరలిపోయేవారు. మరికొందరు రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం దుబాయ్ విమానం ఎక్కేవారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిలో కొందరు అక్కడే మరణించేవారు.
చిన్నప్పటి నుంచి ఈ పరిస్థితులు గమనిస్తూ ఉన్నాను. పుట్టిన ఊరిని, సొంతవారిని, తనది అనుకున్న ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదాని వదిలి దూరప్రాంతాలకు వెళ్లే మనిషి మనసు ఎలా ఉంటుంది? ఎంత బాధపడుతుందనే ఆలోచనతో ‘వలసలు’ కథ రాశాను. విచిత్రమేమిటంటే, ఆ కథ పురస్కారం అందుకుంది కానీ ఎక్కడా ప్రచురితం కాలేదు.
- పత్రికల్లో ప్రచురితమైన మీ తొలి కథ ఏది?
కరోనా లాక్‌డౌన్ లో సమయం దొరికింది అలా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను రాసి పెట్టుకున్న పాత కథలన్నీ బయటకు తీసి, టైప్ చేశాను. వాటిలో కొన్ని పత్రికలకు పంపాను. 2020 జూన్‌లో నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఇగురం’ కథ ప్రచురితమైంది. పత్రికల్లో ప్రచురితమైన నా తొలి కథ అదే! ఆ తర్వాత ‘సమ్మె’, ‘నిశ్శబ్దం’ ‘ఆకలి రోగం’ ‘గెలుపు జ్ఞాపకం’.. ఇంకా మరికొన్ని కథలు రాశాను. వాటిలో 14 కథలతో 2021లో తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహకారంతో ‘ఇగురం’ కథాసంపుటి తీసుకొచ్చాను.
- తొలి కథాసంపుటితోనే మీరు పాఠకులకు చేరువయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మీ పుస్తకాన్ని ప్రశంసించారు కదా?
అవును! నా కథాసంపుటి 2021 హైదరాబాద్ బుక్ ఫెయిర్లో విడుదలైంది. తక్కువ కాలంలోనే ఎక్కువమందికి చేరింది. మొదటి నెలలోనే రీప్రింట్‌కు వెళ్లింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారితో కలిసి 2022 జనవరి 27న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో మాతో వచ్చిన వాళ్లందరూ ఆయనతో ఫొటోలు దిగుతున్నారు. నేనూ ఫొటో దిగి వెనక్కి వస్తున్న సమయంలో నన్ను కేసీఆర్ గారు గుర్తుపట్టి “ఇగురం రైటర్ కదా మీరు?” అన్నారు. “ఇగురం పుస్తకం చాలా బాగుంది. అద్భుతంగా రాస్తున్నావు. కీప్ రైటింగ్! రాయడం వదలొద్దు” అని ప్రశంసించారు. ఆ క్షణం జీవితాంతం మరిచిపోలేనిది.
- మీ పుస్తకాన్ని ఎక్కువమందికి చేర్చే క్రమంలో ‘Suspend a Copy’ అనే విధానం తీసుకొచ్చారట! దాని గురించి చెప్పండి.
విదేశాల్లో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా ఒక హోటల్‌కి వెళ్లినప్పుడు తాను తాగిన కాఫీతోపాటు మరో కాఫీ/కాఫీలకు డబ్బులు చెల్లిస్తారు. తాను తాగింది కాకుండా మిగిలిన కాఫీలను ‘Suspend’ అంటారు. కాఫీకి డబ్బులు లేని వారెవరైనా ఆ హోటల్‌కి వస్తే ఆ సస్పెండ్ అయిన కాఫీలు వారికి ఉచితంగా అందిస్తారు. దీన్ని Suspended Coffee విధానం అంటారు.
నా పుస్తకాన్ని మరింత మందికి చేర్చేందుకు ‘Suspend a Copy’ విధానం తీసుకొచ్చాను. రెండు పుస్తకాలకు డబ్బులు కడితే, ఒకటి వారికి ఇచ్చి, మరొకటి డబ్బులు పెట్టి పుస్తకం కొనలేని వారికి అందించాను. అలా నా పుస్తకం ఇప్పటిదాకా 2500 కాపీలు అమ్ముడుపోయింది. తెలంగాణ ప్రభుత్వం, టీడీఎఫ్ లాంటి సంస్థలు ఈ పుస్తకం కాపీలు కొని, తమ ఆధ్వర్యంలోని స్కూల్ లైబ్రరీలలో పెట్టాలని ప్రతిపాదించి అమలు చేశాయి.
- మీ రచనా శైలిపై ప్రభావం చూపిన రచయితలెవరు?
నాపై ఎక్కువగా ప్రభావం చూపిన పుస్తకం శ్రీశ్రీ గారి ‘మహాప్రస్థానం’. ఆయన మీద గౌరవంతో నా ఇద్దరు అబ్బాయిలకు ‘శ్రీ’తో మొదలయ్యే పేర్లు పెట్టాను. కె.వి.నరేందర్ గారి ‘కర్రావు’ నాకు చాలా చాలా ఇష్టమైన కథ. పెద్దింటి అశోక్ కుమార్ గారి ఊరు మా ఊరికి కూతవేటు దూరం. ఆయన కథలు చాలా ఇష్టంగా చదువుతాను.
చినబాలు పర్శరాములు అనే రచయిత నాపై చాలా ప్రభావం చూపారు. ఆయన ‘చైతన్య ప్రకాశ్’ అనే కలం పేరుతో కథలు రాశారు. ప్రస్తుతం ఆయన లేరు. ఆయనది మా ఊరికి మూడు కి.మీల దూరంలో ఉన్న ఊరు. నన్ను ఆయన చాలా ప్రోత్సహించేవారు. కలిసినప్పుడల్లా చాలా కథలు చెప్పేవారు. కథల గురించి చర్చించేవారు. మాండలికం రాయడం, పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి.
- ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?
నన్ను బలంగా కదిలించే అంశం కనిపిస్తే తప్ప కథలు రాయలేను. కథ మొత్తం నా లోలోపల తయారవ్వాలి. ఒక్క సిట్టింగ్‌లో కథంతా రాయడం నా పద్ధతి. మరిన్ని మంచి కథలు రాస్తూ ఉంటాను.
*
సూపర్ నీ కథలు బాగున్నాయి రా సుధీర్ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళుతున్నాయి
ఈ సస్పెండ్ కాపీ విధానమే నాకు నచ్చలేదు ఎందుకంటే వేరే వాళ్ళతో రెండు పుస్తకానికి డబ్బులు కట్టించుకొని ఇంకో వారికి నువ్వు ఫ్రీగా ఇవ్వడం ఏంటి నువ్వు డబ్బులు కట్టించుకోకుండా ఫ్రీగా ఇవ్వాలి కదా
ఒక రచయిత ఎన్నో కష్ట నష్టాలకోర్చి తన పుస్తకాన్ని తీసుకువస్తాడు, అందులో ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉంటాయి, ఉచితంగా ఇవ్వడం వల్ల అతనిపై మరింత ఆర్థిక భారానికి తోడు, చూసావా… పుస్తకాలేసుకొని పంచిపెడుతున్నాడు అనే అపవాదులు, పై పెచ్చు ఉచితంగా వచ్చినదాన్ని చదవాలి అనే ఆతృత అంతగా ఉండకపోవచ్చు కూడా… అందుకే నా మటుకు నా పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వకూడదు అనుకున్నా… నేను సస్పెండ్ కాపీ సైతం చదువుతాను అని ఇంట్రస్ట్ చూపిన వాళ్లకు మాత్రమే ఇస్తున్నా…
థాంక్యూ కథపై మీ అభిప్రాయం తెలియజేసినందుకు