తోలు పలక

‘మీ ఇష్టమయ్యా! మేమింగేం మాట్లాడేది. మీరన్నట్టే కానీయండి. శర్మం పలకలే తీసుకోని వొస్తాంలే’ అందరికీ దండాలు పెట్టేసి ఇంటికొచ్చినాడు చెంగయ్య.

లికాలమొస్తే తెల్లార్తోనే లేసి చలి మంటేసుకోని వొళ్లు వుడుకు బెట్టుకుంటా పెళ్లాంతో సవాలాడ్తా వుండే చెంగయ్య ఆ రోజు గూడా తెల్లార్తోనే నిద్దరైతే లేశినాడు గానీ వొంట్లో ఆ జోరు లేదు. పెళ్లాం పెట్టిచ్చిన బెల్లం కాఫీ తాగతా కంబట్లో ముడుక్కుని  చలిమంట కాచుకుంటా పరదేశి వైపు చూస్తా ఉండాడు..

పరదేశి మళ్లీ యేడ్చేదానికి మళ్లుకున్నాడు..

‘ఏడ్సింది సాలు. ఇంగ నిలుపు’ అన్నాడు  చెంగయ్య.

ఏడుపాపేసిన పరదేశి  ఏం చేయాలో తెలీక దొరికిన పుల్లొకటి ఎత్తుకోని నేల మీద గీతలు గీస్తా మద్దెలో చిన్నాయన కల్లా చూస్తా ఉండాడు..

ఊరికి ఎడంగా ఉండే వాడ అది. అందులో వుండే వాళ్లంతా గవర్నమెంటిచ్చిన ఇండ్ల కాడికి ఎప్పుడో పూడ్సినా చెంగయ్య పోలేదు. పరదేశి కూడా పోలేదు. వాడలో ఇప్పుడు ఆ రెండిండ్లే ఉండేది.. ఒకదాంటో చెంగయ్య, చెంగయ్య భార్య మంగ, పరదేశి… మంచాన పడుండే పరదేశోళ్ల అమ్మ.

‘నోట్లో నాలుకలేని ఆడకూతురు ఆయమ్మ. పెనిమిటిని పోగొట్టుకోని ఆ పెద్దింట్లో ఇన్ని రోజులున్నిందే గొప్ప. కాల్చుకోని తిన్నారు వున్నన్నాళ్లూ. ఇప్పటికి నెమ్మతై పోయింది ఆయమ్మకు’ వొకసారి పైకి చూసి దణ్ణం పెట్టుకుని కండ్లు తుడుచుకున్నాడు చెంగయ్య.

ఐరాల నుంచి ఆరుమైళ్ల దూరంలో నాలుగు గుట్టల మధ్యలో ముడుక్కోని వుండే అరవై గడపల చిన్న ఊరు అది. చెరువులు నిండుగా ఉండే కాలం. అప్పటికి పండగ నెల పెట్టి వారమయ్యింది. మరో వారంలో పండగ., పండక్కి రెడీ అవతా ఉంది ఊరు. కొట్టాల్లో, దడుల్లో  పెద్దపండగ కూర కోసరం పెరగతా వుండే పొటేళ్లు, మేకలు పెరగతా ఉండగానే కూలీ నాలీ జనం పండగ మాన్యం కోసం ఎదురు చూస్తా ఉండగానే ఈ తెల్లారి ఇట్ఠా చావు వార్త మీద పడటం ఊరికి శీతలం సోకినట్టుగా ఉంది. వూరి పినపెద్ద వాసుదేవయ్య పెద్ద కోడలు దూలానికి వురిపోసుకుని  ప్రాణాలు తీసుకునేసిందన్న సంగతి తెల్లార్తోనే పొగమంచు కమ్ముకున్నట్టు కమ్ముకుంది.

‘ఎంత మంచామె ఆ మహాతల్లి’ అన్ని ఇళ్లల్లో నిట్టూర్పులు ఇడస్తా ఉన్నారు ఆడోళ్లు.

వాసుదేవయ్య పెద్దకోడలు సరస సుధాకర్‌ను పెళ్లి చేసుకొని ఏ ముహూర్తాన మెట్టినింట కాలుపెట్టిందోగానీ అత్తమామలకు ఆమె అంతగా నచ్చలేదు. అందుకు కారణం సరస అమ్మానాయిన్లు  అల్లుణ్ణి మంచి చేసుకుని వోళ్ల బతుకులు బాగు చేసుకునేస్తారేమో అని అనుమానం. దానికి తగ్గట్టే  రెండేండ్ల ముందర గానుగాడేదానికి చెరుకుపాలు తీసే క్రషర్‌ కావాలని బావమరిది అడిగితే సుధాకర్‌ పది రోజుల కోసం సొంత క్రషర్ ను టాక్టరు బాడిక్కి మాట్లాడి పంపించినాడు. అది తెలిసి అమ్మా నాన్నలతో పెద్ద రంపయ్యింది. అమ్మొక మాట, నాయిన వొకమాట, తోడబుట్టినోడు వొకమాట అనేటప్పటికి సుధాకర్‌ మానానికి పోయి వుసురు తీసుకునేసినాడు. కట్టుకున్నది కడుపుతో వుండాదని కూడా చూడలేదు. వున్నట్టుండి చెట్టంత మొగుడు పోయేసరికి యేడ్చి యేడ్చి నెలరోజుల్లోనే మొగుడితో వొచ్చిన కడుపు గూడా పోగొట్టుకొని వొంటిదై పొయ్యింది సరస.  పుట్టింటికి పోలేక అత్తగారింటికాడ్నే వుండిపొయ్యింది. అట్టాంటి మనిషికి ఏం వుపద్రవొచ్చిందో ఏమో ప్రాణం తీసుకునేసింది.

తెల్లార్తి నిద్ర లేస్తానే ఊర్లేకి పొయ్యిన  పరదేశి ఈ కబురు ఇనేశి  పరిగెత్తుకుంటా వచ్చి చిన్నాయనకు చెప్పి వో అని యేడ్సినాడు. .

‘ఇప్పుడు సరస వొదిన సావుకు మన చేత పలక కొట్టిస్తారా కొట్టించరా సిన్నాయనా?’ అని అడిగినాడు ఏడుపు కొంచెం తగ్గినాక.

ఏం జవాబు చెప్పాల్నో తెలీక చేతిలో ఉన్న ఖాళీ కాఫీ గ్లాసును తిప్పతా కుచ్చున్నాడు చెంగయ్య.

ఊర్లో వాళ్లు ఈ మద్య తమ నీడే పడనట్టుగా ఉంటా వుండారు. చిన్నరచ్చ కూడా పెద్దదిగా చేసేస్తా ఉండారు.వూర్లో  సావులకు  పలక గొట్టడం తమ వంతు. కొట్టించుకోవడం ఊరోళ్లకు తరతరాలుగా వస్తావుండే వాడికె. దానిక్కూడా అడ్డంజెప్తా ఉండారు. పరదేశికి పలక కొట్టాలంటే చానా ఇష్టం. కొంచెం  సారాయేసి పలకెత్తుకున్నాడంటే ఆ దరువు వేగాన్ని అందుకొనే మొగోడు ఆ వాడలోనే కాదు, చుట్టుపక్కల వూర్లలో కూడా వుండడు. కాని ఈ పరదేశినే చూపించి ఈ మధ్య ‘మీరు పలకలు కొట్టనే కొట్టద్దు’ అంటా రంపు జేస్తావుండాడు సర్పంచి చెంగల్రాయులు.

నాలుగురోజుల కింద మాట యిది. మాయిటేల చెంగయ్య ఆవుకోసం ముకుతాడు పేనుకుంటా వుంటే ‘సిన్నాయనా.. సిన్నాయనా’ అని అరుచుకుంటా వొచ్చినాడు పరదేశి.

‘అరవక ఏం జరిగిందో చెప్పు ముందర’ అన్నాడు చెంగయ్య.

‘ఆరోజు శీనన్న సావుకాడ తగరాదలైనప్పటి నుంచి సర్పంచి చెంగల్రాయలు  కన్ను నామిందే వుండాది. మనోళ్లంతా కాలనీ ఇండ్లకాడికి పూడ్సినాక నేను కనిపిస్తే సాలు ఏదో వొకటి అంటావుండాడు. తెల్లార్తో లేసి పుల్లొయిటి ఇంచి నోట్లో యేసుకోని పినపెద్ద ఇంటికొచ్చేస్తాడు. నేనప్పుడే కసువు కోస్కోని పోతానా. నన్ను జూస్తా పినపెద్దకి మనందరిమిందా ఎక్కిస్తా వుంటాడు’ అన్నాడు.

చెంగయ్య, పరదేశి కుటుంబాలు తరతరాలుగా పినపెద్ద ఇంట్లో జీతం లేని పనిమనుషులు. ఆడోళ్లు పినపెద్ద ఇంటి బయట పనులు చేస్తే, మొగోళ్లు బాయికాడ పనులు చేసుకుంటారు.

‘నిన్నెవడు వాయ్ శివలు కాల్చి సావిత్రోలింట్లో ఎయ్యమనింది? పలగ్గొట్టి పాటపాడేదానికి పొయ్‌ నోళ్లు పనైపోతానే మూస్కోని ఇంటికి రావల్ల. వూరోళ్ల ఇండ్లమిందికి బోతే వోళ్లు గొమ్మునే వుంటారా? అయినాగూడా దానికప్పుడే తప్పుగట్టిచ్చుకున్నారు కదా. ఇంగా ఏమంట గాడు వోళ్లకి’

‘నిన్న సరస వొదిన రెండు చెరుకులు ఇంచకచ్చీరా అంటే చెంగల్రాయిలన్నోళ్ల కయ్యకాడికి పొయ్యినా.  మేమేదన్నా పనిజెప్తే నీకు యాడాలేని నొప్పులొస్తాయి. ఆ మొగుడు బోయిందానికి మాత్రం కోరింది కోరినట్టే కాళ్ల ముందర బెడ్తావని ఒకరకంగా మాట్లాడ్నాడు. గొమ్మునే వొచ్చేసినా. ఎనకాల్నే పినపెద్ద ఇంటికాడికి వొచ్చినాడు. దూడకు కసువేస్తా అంతా ఇంటావుండా. ఈ నాయాళ్లకు వొళ్లు బలిసిపొయ్యి కొట్టుకుంటా వుండారు. మొన్న చెరుగ్గొట్టేదానికి కూలోళ్లు కావాల్సొచ్చి మనిషితో చెప్పి పంపితే సర్పంచునని గూడా వొక్కడూ మతించలా. గవుర్మెంటు పించనీలు, బియ్యాలు వూర్కేనే ఇస్తావుంటా వీళ్లింక పనేడ జేస్తారు.. పొయ్యిన్నెలంతా మైకుసెట్లు బెట్టుకోని చర్చీకాడ్నే పడి సచ్చుణ్ణారు అందరూ. వాళ్లూ, వాళ్ల సోకులూ. మెట్తో కొట్టేవాళ్లు లేక. అసలు వూరే బాగలేదు. ఏ పొద్దయినా కలిసి వొయిటిగా వుంటేగదా, అంటా వుండాడు’ అన్నాడు పరదేశి.

‘నువ్వేమన్లా?’ అడిగినాడు చెంగయ్య.

‘మా ఇంట్లో ఒక ఆడమనిషి, ఇద్దురు మొగోళ్లు కోడిగుజ్జావున వొస్తే మాయిటేల దాకా ఈడ్నే పనిజేస్తా వుండ్లేదా అనా’ అని అడిగినా.

‘నువ్వు భలే మొగోడ్లే వయ్‌. వొంట్లో సారాయిబడ్తే నీకు ముడ్డీ మూతీ తెలీదు. నీకు పనీ, పినపెద్దా గుర్తు రావాల్నంటే రెండ్రోజులు బడ్తింది అనేశి మళ్లీ సావిత్రమ్మ ఇంటి కత ఎత్తుకున్నాడు.

నేను తాగేస్తే మనిషి గాదని మీ అందురికీ తెల్సుగదా.  పీనిగ ముందర శివలేసే పని ఆ జగ్గడిది. వాడ్నెవరు నా దగ్గిరికి రమ్మన్నారు. పలక భలే జోరుగా గొడ్తావులే గానీ ఒక్క శివన్నా నేరుగా ఎయ్‌రా అని పందెమేసినాడు. ఎలిగించి వొదిలేటప్పిటికి కొంచెం వొంపొచ్చేసి సావిత్రమ్మ తాళువారంలోకి దూరిపొయ్యింది. నువ్వుగూడా వుణ్ణావు కదా. నేనేమన్నా కావాలని ఆ పన్జేసినానా?

ఆరోజే తప్పుగట్టేసి వొచ్చినా కదా తప్పయిపోయిందని జెప్పి. అయినా సరే చెంగల్రాయన్న మీరు పలకలు కొట్టొద్దు ఏమొద్దు అంటా ఉన్నాడు’ అన్నాడు పరదేశీ.

‘మనం పలక గొట్టక పోతే ఇంగౌరు కొడ్తారంట. ఇప్పటికే తోటోడు, మన రెండిండ్లోళ్లు తప్ప ఇంకెవరూ వూరు పక్క మల్లా చూడనంటా వుండారు’ అన్నాడు చెంగయ్య.

‘మన దగ్గిర  శర్మం పలకలుండేది రెండే. మిగతా మూడూ టవున్లో తెచ్చిండే ప్లాస్టీకు పలకలు. అవి కొట్టద్దంటా వుండారు.’ అన్నాడు పరదేశి.

‘నాణెంగా వుండే శర్మం పలకలు ఇప్పుడేడ దొరకతా వుండాయిరా. తోలు వొల్చినాక దాన్ని పలక్కు గట్టేదాకా ఎంత పనితనం గావాల. ఇప్పుడెవరు జేస్తావుండారు అవన్నీ. అడుగేసి పలక గొట్టాలంటే అదేందో తక్కవ పని అనుకుంటా వుండారు మన పిల్లనాయాండ్లు. సమస్యంతా నేను పినపెద్దకు చెప్పుకుంటాలే. రేపు తెల్లారే పోదాంలే. ఏం జెప్తారో చూద్దాం’ అన్నాడు చెంగయ్య.

మరుసటిరోజు పినపెద్ద ఇంటికాడ్నే వుండే రచ్చకాడకి సద్ది తాగే యేళకంతా ఒక పదిమంది పెద్ద మనుషులు,  గుళ్లో ఐవోరు, చెంగల్రాయనాయుడు అందురూ వొచ్చేసుండారు. ఇప్పుడు ఊరికి పలగ్గొట్టే వాళ్లుగా మిగిలిండే పరదేశి, చెంగయ్య, మంజునాద, ఆదెయ్య, కిష్టడు ఒక పక్క నిలబడుకున్నారు.

చెంగయ్యే అడిగినాడు ముందర. ‘పలక కొట్టగూడదని చెప్పినారంట కదయ్యా’ అని.

దానికి పినపెద్ద వాసుదేవయ్య గొంతు సర్దుకుని బదులు పలికినాడు.

‘గుడిలో ఐవోర్నడుగురా. లేకపోతే నువ్వుజెప్పు. ప్రాణం పొయ్యినప్పుడు, వూరేగింపులు పండగలప్పుడు ఇంతకు ముందంతా ఏం పలకలు కొడ్తావుణ్ణారు. తోలువే గదా. అంత మంటేసుకోని తోలు వుడుకెక్కతా వుంటే బిరుసెక్కిన పలకల్ను కొడ్తావుంటే అదీ విశేషం. మీరుండేదే ఐదుమంది. దాంట్లో తోలు పలకలుండేది ఇద్దరి దెగ్గరే. ఆ ప్లాస్టీకువే అన్నీ. నువ్వు జెప్పు ఐవోరా’ ఐవోరి కల్లా సూసినాడు.

ఐవోరు మొదులుపెట్నాడు. ఆయన్ని ఊళ్లో నల్లయివోరు అంటారు. తెల్లయివోరు దొరకలేదని దూరం జిల్లా నుంచి నల్లయివోరి కుటుంబాన్ని తొడుకోనొచ్చి వూర్లో పూజా పునస్కారాల కోసం పెట్టుకున్నారు వూరోళ్లందురూ కలిసి.

‘ఈమధ్య కాలంలో మన గ్రామంలో ఒకరు పోతే వారితో పాటే ఇంకో నాలుగు ప్రాణాలు పట్టుకెళ్లిపోతున్నారు. గమనించారా? సంప్రదాయాల్ని పాటించకుండా ఎవరికిష్టం వొచ్చినట్టు వాళ్లు అన్నీ మాకే తెలుసను కోవడం వచ్చిన తిప్పలు ఇవన్నీ. తోలు వాయిద్యాలకుండే విలువ ప్లాస్టిక్‌ వాటికి వుందా? అందుకే కదా శివాలయంలో వుండే ఆటోమేటిక్‌ డమ్ముల్ని పట్టుబట్టి మరీ మూలపడేయించా. పెద్దవాళ్లు చెప్పింది విని మసలుకోండి. లేకుంటే వూరికి అరిష్టం’. నశ్యంపొడి డబ్బా బయటకు తీస్తూ కొంచెం పెడసరంగా, ఇంకొంచెం  కోపంగా అన్నాడు ఐవోరు.

‘ఇప్పుడేం జేద్దాంనా ?’ అన్నాడు చెంగయ్య.

‘తోలు పలకలు తెచ్చుకోండిరా. ప్లాస్టీకువి నిలిపెయ్యండి. తెచ్చుకున్నాక రండి. ’

‘ఇప్పుడిప్పుడు వొద్దంటే ఎట్ట? రేపేదైనా జరిగె. అప్పుడెట్ట?’

‘మీరు లేకుంటే మాకు సద్దినీళ్లకు గూడా దిక్కు లేదన్నట్టు మాట్లాడ్తా వుండారే. మీరు కాకపోతే వూర్లో మేళం పిలుచుకుంటాం. బ్రహ్మాండంగా వుంటాది’ అన్నాడు సర్పంచి.

‘సావుకు దేవుడి మేళం పెడ్తారానా యాడైనా?’

‘మేం పెట్టుకుంటాంరా. మీరు తాగేసి చేసే రచ్చ భరించేదానికన్నా అది చానా ప్రశాంతంగా వుంటింది. వూరే వొద్దనుకోని కాలనీకాడికి పొయ్యినారు కదా. మీ చర్చీలకాడకి పొయ్యి ప్లాస్టీకు పలకలు కొట్టుకోండి. మాకు సరిపడదు ఇవన్నీ. వూర్లో పండగలు సావుల సంగతి మేం వూరోళ్లతోనే చూసుకుంటాం. మీకింగా కష్టంగా వుంటే వూర్లో సావుకింత అని లెక్కేసి మీ దుడ్డు మీకిచ్చేస్తాం. ఆ దరిద్రపు పలకలు కొట్టద్దండింక వూర్లో’

‘అంతదాకా ఎందుకులే. మేమే ఏదోవొకటి చేసి తోలు వాయిద్యాలు తెచ్చుకుంటాం. గౌరవం యెతుక్కోని పోయినోళ్లు కాలనీకి పొయ్యినారు. మేం పుట్టి పెరిగిన వూర్ని వొదల్లేక ఇట్ట పడుండాం. వుండే మా రెండు కుటుంబరాలను కూడా పొగబెట్టి పొమ్మనద్దండ’  చిన్నగా గొణిగాడు చెంగయ్య.

‘అయినా మాకు పలగ్గొడితే లచ్చలొచ్చేస్తాయని కాదునా మిమ్మల్ని అడుక్కునేది. పెద్దోళ్ల దగ్గర్నించి వొచ్చిందే విద్య. ఇప్పుడు మాన్పించేస్తే వూరుకీ మాకూ వుండే ఈ వొక్క సంబంధం కూడా తెగిపోతాది. వూరొదిలేసి మా కాలనీ కాడకు పొయ్యేది మాకు ఇష్టం లేదు’ అన్నాడు పరదేశీ.

‘ఇంట్లో పీనిగల్లేసి మా యేడుపులు మేమేడస్తా వుంటే మీరేం జేస్తారు. ఫుల్లుగా తాగేసొచ్చి కడచూపు కొచ్చే ప్రతోడి దగ్గరా నిలేసి చిల్లర దీసుకుంటారు. అదీ సాలక ఇండ్లమింద టపాసులు కాల్చి యేస్తారు. గొమ్మునుండే కొద్దికీ మీ ఆగడాలు ఎక్కువైపోతావుండాయి. ఇంగ సాలు లెయ్యండి. పనికిమాలిన పంచాయితీలు’ భుజంమీద  టవలు తీసి ఇదిలిచ్చి పైనేసుకుంటా  పైకిలేసినాడు సర్పంచు చెంగల్రాయలు.

‘మీ ఇష్టమయ్యా! మేమింగేం మాట్లాడేది. మీరన్నట్టే కానీయండి. శర్మం పలకలే తీసుకోని వొస్తాంలే’ అందరికీ దండాలు పెట్టేసి ఇంటికొచ్చినాడు చెంగయ్య.

ఆ మరుసటి రోజు పినపెద్ద ఇంటికి పనికిబొయ్యిన మంగ పొయ్యినట్టే పొయ్యి తిరుక్కోని వొచ్చేసింది యేడ్సుకుంటా.

‘మంగలోళ్ల సావిత్రి పినపెద్ద ఇంటికి పన్లోకొచ్చింది. జీతానికి పెట్టుకున్నారంట. వీధిలో నుంచే తిప్పి పంపేసినారు. మొగోళ్లను కూడా ఆ పక్కేడా రావొద్దని చెప్పమన్నారు. ఏం జరగతా వుందియా?’ అంది లబలబా నోరు కొట్టుకుంటా.

చెంగయ్యకు ఏం జరిగిందో తెలీలేదు. పలకలు కొట్టద్దన్నారు సరే పనికెందుకు వొద్దన్నారో అర్థం కాలేదు.

పరదేశిని పిలిచి ‘వొకసారి బాయికాడకు పొయ్యి సరసమ్మను అడిగి, సంగతేందో కనుక్కోరా’ అన్నాడు.

‘సరే సిన్నాయనా’ అన్నాడు పరదేశి.

పరదేశికి సరసతో కొంచిం స్నేహితం వుండాది. దానికి కారణం సుధాకరు.  వాసుదేవయ్య పెద్దకొడుకు  సుధాకరు ఈడోడే పరదేశి కూడా. చిన్నప్పటి నుంచి కులాల తేడాలు ఎన్నున్నా కలిసే ఎదిగినోళ్లు. సుధాకరుని పెండ్లి చేసుకోని సరస ఆ ఇంట్లో పెద్దకోడలిగా అడుగుపెట్టింది. తెల్లార్తోనే లేచి ఇంటిపని చేస్కోని, అంత సద్దాగేసి సంగటి గంపెత్తుకోని సుధాకరు యెనకాలే అడుగులో అడుగేసుకుంటా బాయికాడికొచ్చేది. పెండ్లయినాక వోళ్లిద్దరి ఆటాపాటా దగ్గరుండి జూసినోడు పరదేశి.

బాయికాడికి పొయ్యినప్పుడు సరసను పాటలు పాడమని సుధాకరు అడిగితే ఆ పాట యింటా దానికి అనువుగా దరువేసినోడు పరదేశి. సరసకు ఇష్టమని సుధాకరు చెప్తే మానెక్కి సంపంగి పూలు కోస్కోనొచ్చి ఇచ్చినోడు. పరదేశి ‘వొదినా’  అని పిలిస్తే ‘ఏరా’ అని పలికేది సరస. సుధాకరు ఎందుకనో ఇంట్లో వోళ్లతో మాత్రం అంటీ ముట్టనట్టు వుంటాడు. బాయికాడ మాత్రం  సరసతో కుశాలగా గడిపి ఇంట్లో ఏమీ పట్టించు కోకుండా వుంటాడు. అందుకే బాయికాడ చెంగయ్య, మంగ, పరదేశి సుధాకరుకి అసలైన కుటుంబం.

అట్టాంటిది వున్నట్టుండి వుండా వొకే ఆధారం సుధాకరు సచ్చిపోయినాక సరస ఒంటిదై పోయింది. అత్తింట్లో ఎంత పోరుణ్ణా పుట్టింటికి పోతే బాగుండదని మెట్టినింట్లోనే వుండిపొయ్యింది. పెండ్లయ్యి ఇంట్లో అడుగుబెడ్తానే మొగుణ్ణి నోట్లో యేసుకుని నీళ్లు తాగిందని అత్త పూటకోసారైనా సూటిపోటి మాటలంటింది. ఇంకా పెండ్లిగాని మరిది సూపంతా సరసమిందే వుండాది. నేరుగా చెయ్యయితే ఎయ్యడు గానీ వొచ్చి పొయ్యేటప్పుడు వొళ్లు తగిలిస్తా వుంటాడు. నీళ్లు పోసుకునేటప్పుడు తలుపు సందుల్లో మరిది చూపులు సరసను తడమతా వుంటాయి. అయినా సరే తలచెడి పుట్టింటికి పోగూడదని సరస ఆడ్నే వుండిపొయ్యింది.

మొగుడు పొయ్యిన మనాది నుంచి బయటకొచ్చినాక రోజూ బాయికాడికి పొయ్యి పనులు చేస్తా, చెయ్యిస్తా జరిగిపోయినవన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది సరస. పరదేశి, చెంగయ్య బాయికాడ ఆమెకు తోడుగా వుంటే మంగ ఇంటికాడ తోడుంటింది.  సరస చెప్పిన పనంతా పరదేశి పరిగెత్తుకోని చెయ్యడం, ఇంట్లో ఎన్ని కొట్లాటలు వుణ్ణా, అవన్నీ పరదేశి దగ్గర మర్చిపోయి ఇంట్లో మనిషి మాదిరిగా చూసుకోవడం సరస మరిది చూస్తానే వుండాడు. చెరుకుతోట కాడ సరస కోసం చెరుకులు ఇంచుకోనొచ్చేదానికి పరదేశి పొయ్యిన విషయం కొంచెం యెక్కిరింతగా చెంగల్రాయలు చెప్పిన కాడ్నించీ అతని వొళ్లంతా మంట పుడతా వుండాది. అంతేనా! పరదేశి కోసుకోనొచ్చిన సంపంగి పూలు అప్పుడప్పుడూ తీసుకోని,  గుండె నిండుకూ వాసన చూసి మంచం పక్కనే  వుండే కిటికీలో పెట్టుకోనుంటుంది సరస. ఏం చేయాలా అనుకుంటా ఉంటే సరిగ్గా అప్పుడే చెంగల్రాయలు లాంటోళ్లు తోడు రావడం అతడికి కలిసొచ్చింది.

‘ఏందబ్బోడా ఇది. వాళ్ల కాలనీ చూసొచ్చినావా? ఎట్టాంటి ఎట్టాంటి  చర్చీలు కడతా ఉండారు.  కొత్త కొత్త బండ్లేసుకోని మీద సెల్ఫోన్లెత్తుకోని  బేవార్స్ నా కొడుకులు పోజులు గొడ్తా తిరగతా ఉండారు.పనుందంటే పరిగెత్తుకోని వొచ్చేటోళ్లు. ఇప్పుడు ఇంటిముందరకు పొయ్యి పిలిస్తే గూడా తిరిగీ మళ్లీ చూడరు. . వాడలో మిగిల్నోళ్లు మన ఇళ్ల ఆడోళ్లను వొక్కర్ని వొదిలేట్టు లేరు.’ అని సరస మరిదితో, ఊర్లో పిలకాయల్తో  చెంగల్రాయలు అంటా ఉండటం పని చేసింది.

అందురూ కలిసి ఏం లా పాయింటు లాగుదామా అనంటే చర్మం కనిపించింది. వంక తోలు మీద పెట్టి పంచాయితీలో వాళ్లకు వూరోళ్లతో ఏం సంబంధం లేకుండా జేసినాక వాళ్ల వొళ్లు కొంచెం నెమ్మదించింది సరస మరిదికి. కాని సరస సంగతి?

పంచాయితీ అయిన కాడ్నించీ పరదేశి కుటుంబాన్ని పనిలోకి కూడా రానీకుండా,  తమకు అనుకూలంగా వుండే వూర్లో మనుషుల్ని పెట్టుకున్నాక వాసుదేవయ్య ఇంట్లో కూడా ఒక రకమైన నిశబ్దం వొచ్చేసింది. సరసకు ఏదో అర్థమయ్యీ కానట్టుండాది. మిరపకాయలు కోసుకోనొచ్చేదానికి బాయికాడకు బయల్దేరింది ఆరోజు. కూడా మంగలోళ్ల సావిత్రి బయల్దేరింది బుట్టెత్తుకోని. మిరపతోటకాడ పరదేశి కనిపించినాడు.

‘ఏవొదినా! మమ్మల్ని పనిలోకి రానీకుండా ఏంటికి మాన్పించేసినారు? ఏవన్నా తప్పు జరిగింటే మొకాన్నే అడగచ్చు గదా?’ ఎదురుగ్గా నిలబడి అడిగేశినాడు.

‘వొరే! నిజ్జంగా ఏం జరిగిందో నాకు తెలీదు. వూరంతా వొకటై పోయిండాది ఆ పలకల గురించి’ బాధగానే చెప్పింది.

‘పంచాయితీ లో మాట్లాడిందాన్ని గురించి నేనేమీ చెయ్యలేన్లేగానీ, రేపు పనికొద్దువులే. మామిడి చెట్లల్లో కసువుదవ్వాల’ చెప్పేసి సావిత్రితో కలిసి మిరపకాయలు తుంచే పనిలో పడింది.

ఇంటికొచ్చినాక ఆ రోజు రాత్రి అన్నం తింటా అత్తామామల ముందర  ఆ మాటే ఎత్తుకునింది.

‘ఇంట్లో పనికి పిలవకుంటే పొయ్యినారు. రేపు మావిడిచెట్ల మొదట్లో కసువు తవ్వేదానికైనా రమ్మని పరదేశిని పిలవనంపండి. కసువు పెరిగిపోతే చీటీగలు ఎక్కువైపొయ్యి కాయ మింద మచ్చలు పడిపోతాయి. పదైదుమందన్నా కూలోళ్లు కావాల’

‘బాగా అలవాటు పడినట్టుండావు వాడికి. ఒకరోజుకే అల్లాడిపోతావుండావే’ ముందు అత్త నోట్లో నుంచి వొచ్చింది మాట.

‘బాయికాడకు పొయ్యు నువ్వు చేసే బాగోతం మాకు తెలీదనుకుంటా వుండావా? వాళ్లెవరూ మనింటి గడప తొక్కగూడదని చెప్పినాక కూడా, నీ ధైర్యం. వోడ్ని బాయికాడకు పిలిపించుకుంటావా. రేపట్నుండి అడుగు బయటపెట్టు. నీ సంగతేందో తేల్చేస్తా’ అన్నాడు సరసి మరిది.

‘పెద్దింటి ఆడోళ్లకు తోలు శుబ్రం ఉండాల. మొగుడెట్టా లేడుగదా అనేశి బయట ఎంగిలి పడ్దామని అనుకుంటా ఉండావేమో. నీ కాళ్లూ చేతులూ ఇంచి  ఇంట్లోనే ఎట్ట చూసుకోవాలో నాకు తెలుసు’ అన్నాడు మళ్లీ.

రాత్రి ఒంటిగంట దాకా మాట మీద మాట అంటానే వుండారు. వాసుదేవయ్య అన్నిటికీ తలూపతా కుచ్చున్నాడు.

మరి కాసేపటికి గొడవ సద్దుమణిగింది. వాసుదేవయ్య ఎప్పుడూ పడుకున్నట్టే తాళువారంలో నవారు మంచమేసుకోని పడుకున్నాడు. చేసిన తప్పేందో తెలీకుండానే పెద్దింటి దూలానికి వేలాడింది సరస.

పనికి పిలస్తారని తెల్లార్తో ఆశగా పొయ్యిన పరదేశికి సరస చావు కబురు తెలిసి నెత్తిన బండ కూలినట్టయ్యింది.

చలిమంట ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది.

‘ఇట్టే  కూచ్చోనుంటారా? జరగాల్సిందేవన్నాచూస్తారా’ ఎచ్చరించింది మంగ కాఫీ గ్లాసులు తీసుకోనిబోతా.

‘పలకలు బయటకు తీయమంటావా సిన్నాయనా’ అన్నాడు పరదేశి.

చెంగయ్య యోచన చేస్తావుండాడు.. ఇప్పుడు చావు దరువు కొట్టేదానికి పిలస్తారా  లేదా? ఈ రోజుతో వూరుతో  అతుక్కుని వుండ్నె ఆ కొంచిం ముక్కా తెగిపోతుందా? జోబిట్లోకి బయటికి కొంచేపు తిరిగినాడు..

‘మనకు పిలుపు రాక యాడకు పోతుందిలే’ అని పలకలు తీమన్నాడు.. ఒకవేళ పిలుపొస్తే బిన్నేగా పోవాలని కాలనీలో వుండే ముగ్గురు పిలకాయలకూ కబురంపించినాడు. ఇంటి ముందర మళ్లీ మంటేసి పలకలు వేడిజేస్తా పినపెద్ద పిలుపు కోసం కాస్కోని కుచ్చున్నారు చెంగయ్య, పరదేశీ.

పొద్దెక్కతా ఉంది. సద్దులు తాగలేదు. అన్నాలు వొండుకోనేలేదు. ఎంతసేపు ఎదురు చూసినా, రావుకాలం దగ్గరికి వొచ్చేసినా ఎవరూ రమ్మని గొంతీలేదు. చానా సేపటికి వూరి నుంచి వలకల దాకా మంగళ వాయిద్యాల మోత వినిపించింది.

ఎందుకో తెలీదు. ఆ రాత్రంతా చెంగయ్య, పరదేశి చేతుల్లోని డప్పులు వో అని ఏడస్తా ఉండే శబ్దం  ఊరంతా విన్నా ఏమెరగట్టు నిద్ర నటించింది.

*

ఝాన్సీ పాపుదేశి

3 comments

Leave a Reply to Mula Ravi Kumar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఝాన్సీ గారు చాలాబాగా రాసారు.
    👍

  • ఝాన్సీ రాసే కథలు ఆ చిత్తూరు యాస వల్ల ఆసక్తితో చదువు తాను. కథ చదివి ఒక విధమైన ఉద్వేగానికి లోనయ్యాను. మా వూళ్ళో డప్పులు అంటాము. పలక అనికూడా అంటారని తెలియదు. అక్కడ డప్పులు వాయించే వారికి మంచి డిమాండ్, ఆదాయం కూడా వేలల్లో వుంది. రెండు రాష్ట్రాలలో అన్ని వూళ్ళకీ వెళ్లి సంపాదిస్తారు. అద్భుతంగా వాయిస్తారు.అశుభ కార్యాలకే కాదు. పండుగలకు, రాజకీయ సమావేశాలు జరిగినప్పుడు, ఎన్నికలలో… సినిమాలకు…
    మా వూరు క్రిష్ణా జిల్లా లోని గ్రామం. ఈ కథలో ని చిత్తూరు జిల్లా గ్రామం లో ప్లాస్టిక్, చర్మం పలకల తేడా, వివక్ష చూసి బాధ కలిగింది. బాగా రాస్తున్నారు ఝాన్సీ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు