మనకీ, చరిత్రకీ మధ్య ఓ దాటలేని లక్ష్మణరేఖని గీస్తుంది కాలం. గీసి ఆవలివైపుకి చూసే ఓ చిన్న కిటికీని మాత్రం తెరిచిపెడుతుంది. హాహాకారాలతో గందరగోళంగా ఉన్న అటువైపు ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం ఓ పక్క, ఏమీ చెయ్యలేని నిస్సహాయత మరో పక్క మనకి!
చరిత్రని రాజుల, రాజ్యాలలో వచ్చిన మార్పులకన్నా, జనసముదాయాలపై అవి తెచ్చిన పరిణామాలతో చూడగలగాలి. సంవత్సరాలతో కన్నా ఆ మార్పులు చూపించిన ప్రభావాలతో అర్థం చేసుకోగలగాలి. ముఖ్యంగా ఆనాటి సమాజాన్ని హీరోలూ, విలన్లుగా కాకుండా, పరిస్థితులూ, నిర్ణయాలుగా చూడగలిగే ధైర్యం మనలో ఉండి ఉండగలగాలి. ‘తేజో తుంగభద్ర’ లో వసుధేంద్ర పైవన్నీ చేయగలిగారు. అవన్నీ చేస్తూనే, ఈ నాలుగు వందల పేజీలకి మించిన పుస్తకాన్ని ఓ ప్రేమ కథగా మలిచి ఆపకుండా చదివించగలిగారు.
స్పెయిన్ దేశపు తేజో నది ఒడ్డునున్న పోర్చుగల్ లోని లిస్బన్ నగరానికి ఓ రోజు రాత్రికి రాత్రే తరలివచ్చిన యూదుల (జ్యూ లు) అమ్మాయి బెల్లాకీ, స్థానిక క్రిస్టియన్ అయిన గేబ్రియల్ కీ మధ్య మొదలైన ప్రేమ, రాజు మాన్యుయెల్ తీసుకునే నిర్ణయాలకీ, అప్పట్లో ప్రబలిన ప్లేగ్ వ్యాధికీ, భారతదేశపు మిరియాలతో మారిన ఆర్థికవ్యవస్థకీ ఎలా బలయ్యిందో చెప్పేదే స్థూలంగా ఈ కథ. అలాగే, తుంగభద్ర తీరంలో, విజయనగరానికి దగ్గరలో ఉన్న తెంబకపురంలో నివసించే హంపమ్మ, కేశవల పెళ్లి చుట్టూ అలుముకున్న రాజకీయం, ధర్మాల మధ్య కొట్లాటలూ, సతీ దురాచారాలూ, కృష్ణదేవరాయలి దండయాత్రలూ చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు రచయిత. తేజో, తుంగభద్రల కథనాల మధ్య సంబంధం ఏంటి? అక్కడి గాబ్రియల్, ఇక్కడి హంపమ్మల కథలు ఎక్కడ కలవబోతున్నాయి? అల్బుకర్క్ చివరికి గోవాని వశం చేసుకోగలిగాడా? అనే కొత్త కొత్త ప్రశ్నలతో, ఉత్సుకత పెరుగుతూనే ఉంటుంది నవల అంతా. చివరికి ఆ రెండు కథలనీ రచయిత కలిపిన తీరు ఆశ్చర్యపరుస్తుంది.
చరిత్ర ఎక్కువగా ఇష్టపడేవారిని తరచూ కుతూహలపరిచే విషయం – “అక్కడ ఆ సమయంలో అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది?” అని. “బాబర్ ఉత్తర భారతాన్ని ఆక్రమిస్తున్నప్పుడు దక్షిణాదిలో ఏం జరుగుతోంది?”, “అశోకుడు కళింగ రాజుతో తలపడుతున్నప్పుడు పాండ్య రాజులు ఎవరికీ సహాయపడలేదా?”, “శివాజీ ఎప్పుడైనా ఆంధ్ర రాజకీయాలని ప్రభావితం చేశాడా?” ఇలా. అలానే “వాస్కోడగామా భారతదేశాన్ని కనుగొన్న తర్వాత, యూరప్ లో వచ్చిన విప్లవాత్మక పరిణామాలేంటి? అవి భారతీయుల్ని ఎలా ప్రభావితం చేశాయి?” అనే విషయాల్ని ఈ కథలో అంతర్గతం చేసి చెప్పడం మరో గొప్ప విషయం.
నవల మొదటి భాగంలో, యూదుల సమాజంలోని ఒంటరితనాన్నీ, వారి జీవితాల్లోని కల్లోలాన్నీ, ఎంత దగ్గరగా ఒడిసిపట్టుకున్నారో వసుధేంద్ర! రాజ్యాలకి రాజ్యాలు, దేశాలకి దేశాలు చీదరించుకున్న సమాజం అది. శతాబ్దాల పాటు పారిపోతూ, భయపడుతూ బతికిన సమాజం అది. రాత్రికి రాత్రే ఉన్న దేశాన్ని వదిలి పోవలసిని పరిస్థితి, తమకంటూ ఒక దేశమే లేని దుస్థితి. ఎన్ని తరాల వివక్ష, ఎంతటి వెలివేత! మొత్తంగా ఒక సముదాయం నుదుటి మీదే ఓ పెద్ద దురదృష్ట రేఖ రాసిపెట్టినట్టు. “మా తెలివితేటలకీ, ఎక్కడైనా సంపదని పోగేయగలిగే సామర్థ్యానికీ, నాకు గర్వంగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అవే మాకు శాపంగా మారిపోయాయి. ఆ ఆఫ్రికన్ బానిసల బ్రతుకే బావుంది.” అని బాధపడతాడు యూదుడైన బెల్షామ్. ఇవన్నీ కాక ‘క్రీస్తు హంతకులు’ అని ఎన్నటికీ మాయని మచ్చ! ఒక తరం చేసిన అన్యాయాలు ఓ సమాజానికి దేవుడినిస్తే, మరో సమాజానికి తలెత్తుకోలేని అవమానాన్నిచ్చాయి. “యూదులంటే ఎలుకల్లా బతకాలి, చాలా కష్టం, కానీ వాళ్ళకది అలవాటే. ఇప్పుడూ నీ ఇంటి కిందే దాక్కుని ఉండి ఉంటాయి అవి.” అంటాడో నాజీ అధికారి ఒక సినిమాలో. ఊచకోతలకీ, గ్యాస్ ఛాంబర్స్ కి బలి కాకుండా ఉండాలంటే, ఏదో ఓ రకంగా మారాలి కదా మనిషి!
రెండవ కథనంలో, ఇక్కడ తుంగభద్ర దగ్గరున్న తెంబకపురం గ్రామాన్నీ, అందులో ఉండే హంపమ్మకీ, శిల్పిగా ఉంటూ క్షత్రియుడిగా మారాలని ఉబలాటపడే కేశవుడికీ మధ్య జరిగే వివాహాన్నీ, అందులో తలెత్తిన ఘర్షణలనీ అద్భుతంగా చిత్రీకరించారు రచయిత. ఆ గ్రామం నేపధ్యంలో ఆ కాలంలో తలెత్తిన శైవ, వైష్ణవ వివాదాలని ఎత్తి చూపించారు. రాజు స్వీకరించిన, సమర్థించిన మతంలో లేని ప్రజలకు వచ్చే అనుమానాలనీ, అపనమ్మకాలనీ ఆ ఊరి వైద్యుడు అడవిస్వామి మనోభావాలతో బలంగా చూపించగలిగారు. అవన్నీ మనం ఇప్పటికీ అన్వయించుకోగలిగిన విషయాలే. అలాగే, అంతఃపుర స్త్రీల కష్టాలని దగ్గరగా చూసిన చంపక్క, రాయలి ఆముక్తమాల్యదని ఆయన ఎదుటే సమీక్షించగలిగే నాట్యగురువు గుణసుందరి, గోవాతో పెనవేసుకున్న సంబంధంతో అటు పోర్చుగల్ నావికులకీ, ఇటు విజయనగరానికీ వారధిలా పనిచేసి సర్వం పోగొట్టుకున్న తిమ్మాజీ…ఇలా గొప్ప గొప్ప పాత్రలు మనలోకి ఇంకిపోతూనే ఉంటాయి పేజీలు తిప్పుతున్నప్పుడల్లా.
చివరికి ఈ రెండు దారులనీ కలిపేదే పోర్చుగీసు కర్కోటక నావికుడు అల్బుకర్క్ ప్రయాణం. ఒక ఓడ ప్రయాణం గురించి ఇంత వివరంగా చదివడం ఈ పుస్తకంలోనే నేను. రెండేళ్ళు పైన పట్టిన ఆ ప్రయాణంలో, వాళ్ళు పడిన కష్టాలూ, గేబ్రియెల్ తో పాటు ప్రయాణించే జాకోవ్, ఆర్నిక్ పాత్రలూ, మధ్యమార్గంలో వచ్చే ముస్లిం రాజ్యాల్లో వాళ్ళు చేసిన దారుణాలూ మన కళ్ళని తడిగానే ఉంచుతాయి. నావికుల బారిన పడకుండా కొంత మంది ముస్లిం స్త్రీలను ఆ రాజ్యాల వారు స్తంభాలకి కట్టిపడేసి పారిపోయేవారని చెప్తాడు రచయిత. నావికులు ఓడ దిగి వారి కామం తీర్చుకునేసరికి మిగతా వారు దూరంగా పారిపోవచ్చని! మత మార్పిడులూ, ముక్కూ, చెవుల నరికివేతలూ, బావుల్లో విషం కలపడాలూ, ఓడలో ఆహారం సరిపోక మనుషులని మొసళ్లకి బలి వేయడాలూ…ఇలా హద్దులేని దారుణాలు జరుగుతాయి ఆ ప్రయాణంలో సంపద పేరు మీద!
ఓ ఇంటర్వ్యూలో “మీరు అప్పటి చరిత్ర గురించి ఇన్ని దారుణాలు రాశారు కదా, మంచి విషయాలు ఏవైనా ఉన్నాయా అప్పట్లో?” అని అడిగితే వసుధేంద్ర అంటారు “ఎందుకు లేవు, పరమత సహనం ఉండేది బాగా అప్పట్లో. అది స్పష్టంగా విజయనగరంలో కనపడేది కూడా.” అని. కానీ నవల చదువుతున్నప్పుడు మనకలా అనిపించదు. ప్రౌఢ దేవరాయలు తన సింహాసనం పక్కన ఖురాన్ గ్రంధం ఎందుకు పెట్టుకునేవాడు? కృష్ణదేవరాయలికి పోర్చుగీసులంటే ఎందుకంత స్నేహం? ఇమాన్యుయెల్ కి యూదులంటే ఏంటంత అభిమానం? అన్నిటికీ ఒకే సమాధానం. అవసరం! రాయలి యుద్ధాలకి పోర్చుగీసులు తేగలిగే అరేబియా గుర్రాలు కావాలి, ఇమాన్యుయెల్ కి పడిపోతున్న ఆర్థిక వ్యవస్థని మార్చే యూదులు కావాలి. అంతే. రాజకీయ, ఆర్థిక అవసరాలకి ఇతరులని కేవలం భరించినట్టు కనపడుతుంది తప్పితే పరమత సహనం మరో రకంగా అగుపడదు. అసలు దాని గురించి గొప్ప చెప్పుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది నాకు. కాతే భారతదేశం ప్రపంచ దేశాలని పురుగుల్లా తన వైపు ఆకర్షించుకోగలిగేది అన్నది మాత్రం నిజం. కాకపోతే ఆ పురుగులతోనే కమ్మబడి సొంత కాంతిని పోగొట్టుకోబోతోందని తెలియని అమాయకపు దేశం!
సాధారణ మనుషుల జీవితాల్ని వారి గొంతుకతోనే చెప్పించిన కథ ఇది, వారి కళ్ళతోనే చూపించిన కథనం ఇది. ఇది చదివినప్పుడు మనకి వాళ్ల మీద కోపాలొస్తాయ్, కన్నీళ్లొస్తాయ్, చాలా చాలా ప్రశ్నలొస్తాయ్. తప్పు లేదు కానీ, మనమూ రేపటి చరిత్రే! ఇప్పటి నేతల నిర్ణయాలనూ, సామాజిక మార్పులనూ మనం ఎంత వరకూ నియంత్రించగలుగుతున్నామో, ఎదుర్కొనగలుగుతున్నామో, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామో రేపటి తరాలూ చదువుతాయి, వింటాయి, మన వైపు ఆశ్చర్యపోయి చూస్తాయి. ఇవాల్టి మన ప్రశ్నలే రేపు మనకి ఇంకొంచెం గట్టిగా ఎదురవుతాయి. మనం చరిత్ర నుండి నేర్చుకోవలసింది ఏదైనా ఉందీ అంటే, వాటికి సమాధానాలు చెప్పగలగటమే.
ఈ నవలని కన్నడం నుండి తెలుగులోకి అనువాదం చేసిన రంగనాథ రామచంద్రరావు గారి గురించి చెప్పాలి. ‘పడి మునకలు’ వ్యాసాల్లో అనుకుంటా మెహెర్ అంటారు ‘సాహిత్యాన్ని అతి దగ్గరగా చూసేదీ, చదివేదీ అనువాదకులే’ అని. రామచంద్రరావు గారు మనల్ని ఆ కథా కాలానికీ, ఆ పాత్రలకీ దగ్గరగా తీసుకెళ్ళడానికి ఎంత శ్రమించారో, కథలో మనల్ని లీనం చేయడంలో, ఎలాంటి వాక్య దోషాలూ, అచ్చుతప్పులూ లేకుండా ఇన్ని పేజీల ఈ నవల అనువాదానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో, ఓ రచయితగా స్పష్టంగా తెలుస్తూ ఉంది నాకు. వారికి నా ధన్యవాదాలు. ఇలా ఆలోచింపజేసే సాహిత్యాన్ని వేరే భాషల నుండి మనకి అందించే ప్రయత్నాలు చేస్తున్న మిగిలిన తెలుగు అనువాదకులకి కూడా ఈ సందర్భంలో మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సెలవు.
పుస్తకం కాపీల కోసం, ఛాయా పబ్లిషర్స్ ని సంప్రదించగలరు. అమెజాన్ లింక్ – తేజో తుంగభద్ర
సాహిత్యాన్ని ఇష్టపడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన చరిత్ర – తేజో తుంగభద్ర .,
మంచి విశ్లేషణ – అభినందనలు .,