ఈ రోజుల్లో తమ భాష, సాహిత్యం పట్ల ఆసక్తి, మమకారం ఉన్న తెలుగువాళ్లు తక్కువే అంటే అవమానంగా భావించి ఇదేం అర్థం పర్థం లేని మాట అని కొట్టిపారేస్తారేమోకాని ఎవరికి వారు ఈ ప్రశ్న వేసుకుంటే మాత్రం అంత బలమైన సమాధానమేమి దొరకదు. తెలుగులో వచ్చిన మంచి పుస్తకాన్ని చదివి దాని సారాన్ని, సందర్భాన్ని తమ పిల్లలకు వివరించే కుటుంబ పెద్దలెందరు? కనీసం వంద రూపాయలు వెచ్చించి ఒక పుస్తకాన్ని కొనే సాహసం చేసే వారెందరు? ఎవరైనా గౌరవంగా ఇచ్చిన పుస్తకాన్ని ఏమి రాసుంటాడని తిరిగేసే వారెందరు? ఈ ప్రశ్నల్లో ఒక్కదానికైనా చేయెత్తే వారుంటే ఈ గడ్డు కాలంలో వారు నిజంగా తెలుగు భాష ముద్దుబిడ్డలే.
ఏ భాషకైనా దాని వాడుక, అందులో వచ్చిన ఉత్తమ రచనలు, రచయితలకు దక్కిన గుర్తింపు అనేవి ఆ భాష కొనసాగింపుపై జీవధారలు. ఆ జాతి సాంస్కృతిక వైభవానికి కూడా ఇవే రథ చక్రాలు. భాషోద్యమాలు, ఉద్దరణ సంఘాలు ఎన్ని ఉన్నాఇంటి పట్టున ఉండే తెలుగువాడిగా కనీసం ఉడుత పాత్రనైనా పోషించాలి. పిల్లలు ఈ భాషలో చదివినా, ఎక్కడ ఉద్యోగాలు చేసినా మీ భాష ఏమిటి, దాని ఔన్నత్యమేమిటి, దాంట్లో ఉన్న మహా రచయితలెవరు అనే చిన్న ప్రశ్నకైనా జవాబు ఇచ్చేందుకు రెండు మాటలైనా తెలిసి ఉండాలి. తమ సమకాలీన జీవితాన్ని, సామజిక మార్పులను, ప్రాపంచిక ప్రభావాలను ఎంతో శ్రమకోర్చి భావితరాలకు ఉపయోగపడేలా అక్షరబద్దం చేసిన మహనీయుల కృషికి గుర్తింపు అత్యవసరం.
ఈ కొరతలన్నింటినీ తీర్చేందుకు ఒక తెలుగు అధ్యాపక కుటుంబం ఈ సంవత్సరం ‘తెలుగు సాహితీ కాలచక్రం’ పేరిట ఒక క్యాలెండరును ముద్రించింది. వీరి కృషితో రోజూ ఇంట్లో మనం వారాల కోసం, తేదీల కోసం ఆధారపడే గోడకు వేలాడే క్యాలెండర్ సాహితీమూర్తులు చిత్రాలతో సింగారించుకుంది.దీనిలో ప్రతి నెల పేజీలో ఆ నెలలో జన్మించిన మరియు మరణించిన తెలుగు రచయితల చిత్రాలు, జనన మరణ తారీఖులు రంగుల్లో అందంగా ఆకర్షణీయంగా ముద్రించబడ్డాయి. తేదీలకు ఒకవైపు మహోదయం పేరిట ఆ నెలలో పుట్టినవారివి, మరోవైపు మహాస్తమయం అని చనిపోయినవారివి ఉన్నాయి. ఇలా పన్నెండు నెలల్లో 160 మంది తెలుగు కవుల, రచయితల చిత్రపరిచయాలున్నాయి. క్యాలెండర్ సైజు కూడా కంటికింపుగా పెద్దగా ( 17 /24 ఇంచులు) ఉండడం మరో విశేషం.
ఈ క్యాలెండర్ మూలంగా తొలి సమాచారంగా తెలుగులో పేరున్న రచయితలెవరో తెలిసే అవకాశం ఉంది. నెలంతా కంటబడే వీలున్నందున వారి పేర్లు, రూపం గుర్తుండే ఆస్కారం కూడా ఉంది. ఆసక్తి పుడితే ఫలానా రచయిత గొప్పతనమేమిటి, ఏం రాసాడని చర్చకు దారితీయవచ్చు.
ఇది విద్యాలయాల్లో, గ్రంథాలయాల్లో, వసతి గృహాల్లో ఉంటే చిన్న వయసులోనే విద్యార్థులకు రచయితల పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. తాము చదివే తెలుగు పాఠాల్లో వీరు ఎదురైనపుడు ఇదువరకే తెలిసిన మనిషిగా అనిపించవచ్చు. స్కూలు ప్రార్థన సమయాల్లో విద్యార్థులైనా, మాస్టారులైన ఆ రోజు విశేషాల గురించి నాలుగు మాటలు కావాలంటే ఈ క్యాలెండర్ వైపు ఒకసారి చూస్తే ఏమైనా ఆలోచన తట్టవచ్చు. వార్తా పత్రికల్లో గొప్ప రచయితల జయంతి వర్దంతిల సందర్బంగా సంస్మరణ వ్యాసాలు వస్తుంటాయి. అవి రాసేవారికి ఈ క్యాలెండర్ వరంగా భావించవచ్చు.ఇలా ఇది ఎక్కడున్నా ఏదో ఒక మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు.
ఈ ఆలోచన, కార్యాచరణ సున్నపురాళ్ల శ్రీనివాసులు, వజ్రాల యశోద మరియు వారి పుత్రుడు షణ్ముఖలది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఈ దంపతులిద్దరూ తెలుగు ఉపాధ్యాయులు. బెంగళూరులో ఉద్యోగం చేసిన షణ్ముఖ కదిరిలో హరిత ప్రచురణలు ప్రారంభించి తల్లిదండ్రులు చేపట్టిన తెలుగు భాష సేవలో భాగమవుతున్నారు.ప్రస్తుతం ‘తెలుగు సాహితీ మూర్తులు, ముఖచిత్రాలు -రేపటి తరం కోసం’ అనే భారీ ప్రాజెక్టులో వీరు ముగ్గురు తలమునకలవుతున్నారు.
ఇప్పటికే వ్యయ ప్రయాసలకోర్చి 400 పైగా తెలుగు రచయితల ఫోటోలను, జీవిత విశేషాలను సేకరించి పోస్టర్లుగా సిద్ధం చేస్తున్నారు.
ఈ కుటుంబం చేపట్టిన కార్యం తెలుగువారు గర్వించదగ్గదే కాకుండా ఓ చేయి వేయవలసింది కూడా. తెలుగు సాహితీ కాలచక్రం క్యాలెండర్ కోసం, రచయితల ఫోటోల సెట్ కోసం సున్నపురాళ్ల శ్రీనివాసులును 9492087089 ద్వారా సంప్రదించవచ్చు.
*
Very good Initiative
మంచి ప్రయత్నం. హర్షణీయం. తెలుగుభాష పరంగా మెచ్చుతూ చేసిన ఈ పరిచయంలో “అంగుళాలు” కు బదులుగా “ఇంచులు” ఉండడం ఆశ్చర్యకరం!