ఈ సంవత్సరం తొంబయ్యవ పడిలో అడుగు పెట్టిన గుల్జార్ సాబ్ హిందీ సినిమా ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరే గాని ఆయన బహుముఖ ప్రజ్ఞా జీవితాన్నీ, కళనూ కేవలం సినిమాకు కుదించలేం. దేశ విభజనలో బొంబాయికి తరలి వచ్చిన పదమూడేళ్ల కుర్రవాడిగా కార్ల మరమ్మత్తు వర్క్ షాపులో అక్షరాలా శ్రామిక జీవితంతో ప్రారంభించి ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మీదుగా 1963లో సినిమా రంగంలో ప్రవేశించి అత్యున్నత శిఖరాలు అందుకున్న గుల్జార్ కవి, సినిమా పాటల, మాటల రచయిత, కథా రచయిత, నవలా రచయిత, దర్శకుడు, శాంతి ఉద్యమ నాయకుడు.
ప్రతిరోజూ దినపత్రిక చదవడంతో మొదలయ్యే అనివార్య జీవితంలో సమకాలీన సామాజిక రాజకీయ సంక్షోభ ఘటనలతో ఒక సున్నిత మనస్కుడైన కవిలో ఎటువంటి భావాలు, ఆలోచనలు, ఆందోళనలు ముప్పిరిగొంటాయో నిదర్శనం ఈ అనుమానిత కవితలు. వర్తమానం మీద ప్రతిస్పందించడమే అనుమానితమవుతున్న చోట, వర్తమానానికి కవితారూప వ్యాఖ్యానాలు, ప్రతిఫలనాలు ఈ అనుమానిత కవితలు. ఈ వార్తలన్నీ మన దృష్టికీ, ఎవరి దృష్టికైనా కూడ వచ్చి ఉంటాయి. మనకు కూడ ఆ వార్తలు చదివినప్పుడు, విన్నప్పుడు విచారమో, ఆందోళనో, ఆగ్రహమో, దుఃఖమో కలిగే ఉంటుంది. ఆ అనుభూతుల, అనుభవాల, స్పందనల కవిత్వ అభివ్యక్తి ఈ అనుమానిత కవితలు.
ఈ స్పందనలు వ్యంగ్యంగా, హాస్యంగా, ధ్వనిపూర్వకంగా, విసురుగా, ఉన్నది ఉన్నట్టుగా, కవితాత్మకంగా ఉన్నప్పటికీ, వాటిలో ప్రతి ఒక్కదాని వెనుకా గూడు కట్టుకున్న ఈ దేశపు ఏడెనిమిది దశాబ్దాల దుఃఖం ఉంది. రెండు మూడు తరాల పేరుకుపోయిన అసంతృప్తి ఉంది. ఈ చీకటి ఎప్పటికైనా తెల్లవారుతుండా అనే నిరాశ ఉంది. ఈ అవ్యవస్థ మారుతుందనే ఆకాంక్ష ఉంది. తప్పనిసరిగా భళ్లున తెల్లవారుతుందనే విశ్వాసం ఉంది. ఆ దుఃఖం, అసంతృప్తి, నిరాశ, ఆకాంక్ష, విశ్వాసం ఈ ఒక్క కవికో, ఈ ఒక్క పుస్తకానికో మాత్రమే కాదు, దేశానికంతా వర్తిస్తాయి, భావుకుడైన ఏ కవికైనా వర్తిస్తాయి, వ్యక్తిగతంగా గుల్జార్ సాబ్ కూ వర్తిస్తాయి.
వలస భారతదేశంలోని పంజాబ్ లో ఝీలమ్ జిల్లా దీనా పట్టణం (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది) లో ఒక సిక్కు కుటుంబంలో 1934 ఆగస్ట్ 18న పుట్టిన సంపూరణ్ సింగ్ కాల్రా పదమూడో ఏట దేశ విభజన సందర్భంగా చెదిరిపోయిన కుటుంబంతో బొంబాయి చేరాడు. బాల కార్మికుడిగా ఒక కారు గారేజీలో చేరి, ఆక్సిడెంట్లలో దెబ్బతిన్న కార్లకు రంగులు వేసే పనికి కుదురుకున్నాడు. ‘రంగులు కలపడంలో నాకు ప్రావీణ్యం ఉండేది’ అని ఆయనే ఆ తర్వాత చెప్పుకున్నట్టు, కేవలం భౌతికమైన రంగుల మిశ్రమం మాత్రమే కాదు, మానవ జీవిత అనుభూతుల భిన్న వర్ణాల సమ్మేళనంతో అద్భుతమైన దృశ్యాలూ చిత్రాలూ ఎట్లా రూపొందించవచ్చునో ఆయన నేర్చుకున్నాడు. అప్పుడే పగిలిపోయిన కార్లకు కుంచెతో, స్ప్రేతో రంగులు అద్దుతున్నట్టే, విరిగిపోయిన జీవితాలను రంగుల్లో చిత్రించడానికి కలం పట్టుకున్నాడు. పని వదిలి, పనికిరాని రచనలో పడ్డాడని తండ్రి కోప్పడితే, అప్పుడు కలం పేరు కోసం వెతికాడు. ఒక అందమైన ప్రతీక లేదా పేరు, దాని పక్కన ఊరి పేరు పెట్టుకునే అప్పటి ఉర్దూ కవుల సంప్రదాయాన్ని అనుసరించి గుల్జార్ దీన్వి అనే పేరుతో రాయడం ప్రారంభించాడు, తర్వాత అదే గుల్జార్ గా మారిపోయింది.
కార్ల పెయింటర్ గా పనిచేస్తూనే చదవడం, రాయడం కొనసాగించాడు. కాలేజీ చదువు కూడా మొదలుపెట్టాడు. అలా బొంబాయిలో బలంగా ఉండిన అభ్యుదయ సాహిత్యోద్యమంతో పరిచయం అయింది. అభ్యుదయ రచయితల సంఘం ప్రతి ఆదివారం జరుపుతుండిన సమావేశాలకు వెళ్తూ తన కవిత్వం వినిపిస్తున్నప్పుడు, ఇటు అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకులు, అటు సినిమా రంగంలో ప్రముఖులూ అయిన శైలేంద్ర, బిమల్ రాయ్ ఆయనను సినిమా రంగంలోకి రమ్మని ప్రోత్సహించారు. అలా బిమల్ రాయ్, హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు పని చేయడం ప్రారంభించాడు.
బిమల్ రాయ్ దర్శకత్వంలో 1963లో వచ్చిన బందిని సినిమాకు పాటల రచయితగా ఆయన సినిమా సాహిత్య జీవితం ప్రారంభమయింది. ఆ సినిమాకు మిగిలిన పాటలన్నీ రాసిన శైలేంద్ర, ఒక పాట రాయమని గుల్జార్ ను ప్రోత్సహించాడు. లతా మంగేష్కర్ గొంతులో గుల్జార్ మొదటి పాట ‘మోరా గోరా అంగ్ లాయిలే’ పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హృషీకేశ్ ముఖర్జీ సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది గాని, 1969లో అసిత్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ఖామోషీ సినిమాలో గుల్జార్ రాసిన ‘హమ్ నే దేఖీ హై ఉన్ ఆంఖోంకీ మెహెక్తీ ఖుష్బూ’ పాటతో గుల్జార్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 1971లో గుడ్డీ కోసం రాసిన ‘హమ్ కో మన్ కి శక్తి దేనా’ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రార్థనా గీతం అయింది.
మొత్తంగా ఆరు దశాబ్దాల సినిమా జీవితంలో గుల్జార్ సాబ్ కొన్ని వందల పాటలు రాశారు. డజన్ల కొద్దీ సినిమాలకు కథలు, మాటలు రాశారు. స్వయంగా తానే మేరే అప్నే, పరిచయ్, కోషిష్, అచానక్, ఆంధీ, మౌసమ్, అంగూర్, ఇజాజత్, మాచిస్ వంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. మీర్జా గాలిబ్, తహ్రీర్ మున్షీ ప్రేమ్ చంద్ కీ వంటి టెలివిజన్ సీరియళ్లకు దర్శకత్వం వహించారు. పిల్లల కథలు చదివి వినిపించిన కాసెట్లు తయారు చేశారు. ఆరోగ్య సమస్యలున్న పిల్లల కోసం పనిచేసే ఆరుషి, విద్యారంగంలో పనిచేసే ఏకలవ్య ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో పని చేశారు. పిల్లల పత్రిక చక్ మక్ కు కథలూ పాటలూ రాశారు. సినిమా రంగంలో తలమునకలుగా ఉంటూనే ఉర్దూ, పంజాబీ, బ్రజ్ భాష, ఖరీబోలీ, హరియాణ్వీ, మార్వారీ భాషల్లో కవిత్వం విరివిగా రాశారు. ఎన్నో కవితా సంపుటాలు, రావి పార్, ధువా అనే కథా సంపుటాలు ప్రచురించారు. దేశ విభజన ఇతివృత్తంగా రెండు నవలలు రాశారు. భారత పాకిస్తాన్ ప్రజల మైత్రి కోసం అమన్ కీ ఆశా అనే సంస్థ ఏర్పడినప్పుడు దానితో సన్నిహితంగా పనిచేయడం మాత్రమే కాక, శంకర్ మహదేవన్, రాహత్ ఫతే అలీ ఖాన్ పాడిన దాని పతాక గీతం నజర్ మే రహతే హో కూడా రాశారు.
గుల్జార్ సాబ్ రాసిన కవితలతో ఒక సంపుటం, కొన్ని కథలు గతంలో తెలుగులోకి వచ్చాయి. తెలుగు పాఠకులకు మరింతగా తెలియవలసిన గుల్జార్ సాహిత్య కృషిలో ఈ అనువాదాలు ఒక భాగం. వరవర రావు గారు భీమా కోరేగాం అబద్ధపు కేసులో నిందితుడిగా 2018 ఆగస్ట్ 28న అరెస్టు కావడానికి కొద్ది ముందు ఈ సంపుటం ఇంగ్లిష్, హిందీలలో వెలువడింది. అప్పుడే ప్రారంభించిన ఈ అనువాదాన్ని ఇంత ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు క్షమించాలి.
– స్వేచ్ఛాసాహితి
జూన్ 9, 2023
Add comment