లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా మోటార్ సైకిల్ పై రోడ్డు మీదకు వచ్చిన వాడిపై లేచిన పోలీస్లాఠీలా కరుణాకర్రావు గొంతూ, చేయీ లేచినయి. గిన్నెల శబ్దానికి భయంతో మూలకు దౌడు తీసిన పిల్లిలా సరోజ తలుపు మూలకు చేరింది. జంకుతూనే ఆ యింటి వసారాలోకి అడుగెట్టిన ఎండపొడ వచ్చి యెంతసేపో కాలేదు. ఎండపొడ వసారాలోకి రాబోతూ ముందర సురుక్కున సరోజ ముక్కుమీద పడింది. సురుక్కున తగిలిన ఎండకు సరోజకు తుమ్మొచ్చింది. ఆమె తుమ్ముకి ఎండపొడ వసారాలోకి వెళ్లిపోయింది. కరుణాకర్రావుకి కోపమొచ్చింది….
ఆ వసారా అవతల వీధి రోడ్డుమీద ఒంటికాలెత్తి తవిట్రాజు కుక్క లఘుశంక తీర్చుకుంటోంది. తవిట్రాజు నిలబడి ముద్దుగా తనకుక్కను చూస్తున్నాడు. కుక్క లఘుశంక తీర్చేసుకుని తవిట్రాజును ఇక పదవోయ్ అన్నట్టుగా చూసింది.
తవిటాజుకు ఆ చూపు అంటేనే మంట! ఈ కుక్క నంజికూతురు నాకార్డర్లేస్తాది. లఘు, దీర్ఘ శంకలకు తీసుకెళ్లాల్సిన వేళకి తీసుకెళ్లకపోతే ‘ఏవోయ్! ఏటి సేస్తన్నావోయ్? ఏ యేళకి యే పని సెయ్యాలో రోజూ సెప్పాలేటివోయ్? రోజూ కొత్తేనా?’ అని కసురుకొని గొలుసునందిస్తాది తవిట్రాజుకి!
తిండీతిప్పల పూచీ తవిట్రాజుది కాదు. తవిట్రాజు భార్యామణి ది. భార్య మణి, రత్నం కాదు, పేరు మణి! తవిట్రాజుని కసురుకున్నట్టు కుక్కముండ మణమ్మని కసురుకున్నదా ఆ రోజు ముండకి ముడ్డిమాడిపోద్ది ఉపాసమే! అంచేత మణమ్మ దగ్గిట కుయ్ కుయ్ అని అతి నెమ్మదిగా, ముద్దుగా, దీనంగా ప్రధానమంత్రి ముందు నిధులు వేడుకునే ఎంపీలా వినయవిధేయ అవుతుంది! కుక్కేటి తవిట్రాజే వినయవిధేయం మణమ్మ ముందు!
కదులూ… అనంది కుక్క! కదిలేడు తవిట్రాజు. ఎక్కడ చూసేయో రెండు మగ బేపులు బౌబౌబౌ… అనరుస్తూ కుక్కపరుగున వస్తున్నాయి యిటువేపు..! ఆ అరుపులను వినీ, ఆ బేపులను చూసీ పదవోయ్ బేగా, ఆ నా కొడుకుల మూతులకి మాస్కుల్లేవు. గబాలొచ్చి నా మూతినో, ముడ్డినో నాకీగలు.. అలవాటు ప్రకారం. పదపదా అని తవిట్రాజుని తొందర చేసింది కుక్క! తవిట్రాజు మూతికీ, కుక్క మూతికీ మాస్కులున్నాయి. తవిట్రాజు మాస్కు వేసుకోకుండా గొలుసు పట్టుకోబోతే కుక్క వొప్పుకోలేదు. పోలీసోలు కాదు నీను కరిసీగల్ను… ముందర మాస్కు వేసుకో మూతికి, అని కోప్పడి మాస్కు వేయించింది యింటివద్ద.
వెళ్లబోతున్న తవిట్రాజునీ, కుక్కనీ చూసిన కరుణాకర్రావూ ఇటికల్రాజూ ఆగండీ అని కేకేసాడు.
తవిట్రాజు ఇటికల వ్యాపారం చేస్తాడు. అంచేత ఇటికల్రాజయిపోయేడు. ఎవరూ తవిట్రోజని పిలవరు. తొలినాళ్లలో వ్యాపారానికి బ్రాండ్ నేమ్ అనుకొని సరిపెట్టుకున్నాడు తవిట్రాజు. కానీ రాన్రానూ ఇంట్లోని పెళ్లాం, బంధువులూ యిటికర్రోజని రిఫర్ చేస్తుంటే మాత్రం కాస్తా అసహనం కలిగేదాయనకు. అసహనం యిటీవల యెక్కువయిపోయాక యెవరూ తవిట్రోజని తప్పా నన్ను ఇటి కర్రోజని పిలవడానికి వీల్లేదని, పిలిస్తే రామరావణ యుద్ధమయిపోతాదని ఊరందరికీ వార్నింగిచ్చేడు.
ఈ నంజికొడుక్కి సెపరేటుగ వార్నింగివ్వాల గావాల? నా కుక్క చేత కరిపించేత్తాన్నంజికొడకా…. ఇటికల్రాజని పిలిసినావంతే – అని మనసులో గొణుక్కొని అసహనంగా ఆగి కరుణాకర్రావు వేపు చూసేడు తవిట్రాజు. తవిట్రాజు ఆగిపోవడంతో ఆమడన్నర ఎడంగా బేపులు ఆగిపోయి కుక్కవేపు యేకదీక్షగా చూస్తున్నాయి.
కరుణాకర్రావు వచ్చి – బిల్డింగ్ పనాగిపోయిందండీ… ఇటికల్లేక! ఈ వేసవిలోగా ఇల్లు కట్టేసుకొని మంచి ముహూర్తం చూసుకొని గృహప్రవేశం చేద్దామనుకున్నానండీ. వెధవడి… అన్నీ ఆటంకాలే. కొన్నాళ్లు బ్యాంకు వాళ్లు లోన్ ఇవ్వడానికి తిప్పేరు. కొన్నాళ్లు ఇసుక దొరకలేదు. గవర్నమెంట్ పాలసీ మారిందిగా. సరే యిక నడుస్తోందనుకుంటే… యిదిగో యిటుక కొరత. బాబ్బాబూ… కొంచెం సరదాల. ఇటికల్రాజు గారూ అని బతిమాలేడు.
దూరంగా వుండవోయ్. డిస్టెన్స్ పాటించమని కలెక్టర్ చెప్పడం విన్లేదా? మూతికి మాస్కు తగిలించుకొని వీధిలోకి వొచ్చేస్తే… సరా? అని కుక్క కోపంగా కరుణాకర్రావు వేపు చూసి డిస్టెన్స్ పాటించింది. గొలుసు లాగుతూ తవిట్రాజుని కూడా డిస్టెన్స్ కి లాక్కెళ్లింది. కరుణాకర్రావు ఓ అడుగువేసి డిస్టెన్సుని కవర్ చేస్తూ – మళ్లీ బతిమాలేడు. మళ్లీ ఆ కుక్క భయపడుతూ – ఈ ముండాకొడుకు దూరంగా వుండమంటే వుండడేమీ? మనుషుల మీద పడిపోయి మాటాడతాడేమీ? ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార్లూ నెత్తీనోరూ కొట్టుకొని చెప్తుంటే వినబడనే లేదా యేమీ యీ ముండాకొడుక్కి? ఛీఛీ… వీళ్లకి పోలీసోల్లే మొగుళ్లు! పోలీసోడి కంటా నేనేమీ తక్కువ కాదొరే ముండా కొడకా… కండ ఎక్కదీసీ గల్ను… దూరంగుండని గుర్ గుర్ మంది.
కరుణాకర్రావుకి కుక్క భాషా తెలీదు, యాసా తెలీదు. కుక్క వేపు అడుగేస్తూ – క్యూట్ గా, బ్యూటిఫుల్ గా వుందండీ మీ డాగ్ అనన్నాడు. అతని పొగడ్తకూ, ఆంగ్లభాషకు కాస్తా మెత్తబడి లేపిన తోకని దించింది కుక్క.
ఈ రోజు యెలాగయినా నాలుగులోడ్లు ఇటిక పడాల… ఇటికల్రాజుగారూ అనన్నాడు కరుణాకర్రావు.
నాలుగు పడవు… అనన్నాడు తవిట్రాజు.
పోనీ రెండండీ… ఇటికల్రాజు గారూ?
ఒక్కటి గూడా పడదుగాక పడదు.
నో, నో… అలా అనొద్దు. హమ్మో… అలాగంటే ఎలా ఇటికల్రాజుగారూ? పనోరొచ్చేస్తారు, పనాగిపోద్ది ఇటికల్రాజు గారూ!
ఇటికల్రాజూ, యిటికల్రాజూ అని పదిసార్లు అనకమీ.. ఒళ్లు మండిపోతంది నాకు అనన్నాడు తవిట్రాజు.
ముండకొడుక్కి కండ ముక్క యెక్కదీసీమంతావేటయితే – అని చూసింది కుక్క తవిట్రాజు వేపు.
ఈడు మళ్లా ఇటికల్రాజనంతే ఆ పనే సెయ్యి – చెప్పేడు తవిట్రాజు.
అలాగా?! నోనో… నెవ్వర్! ఇంకెప్పుడే అననుగాక అనను ఇటికల్.. సారీ.. తవిట్రాజు గారూ అని లెంపలేసుకున్నాడు కరుణాకర్రావు.
క్షమించీసి పదవోయ్ అని గొలుసులాగింది కుక్క. తవిట్రాజు కదిలేడు. వెంటనడిచేడు కరుణాకర్రావు. యముడెనకాల దమయంతిలాగ నడస్తండేటితగానన్నట్టు చూసింది కుక్క.
“అది కాదండీ… కరోనా వైరస్ కారణంగా అన్నీ బంద్ చేసారు, మీకు తెల్టా? రోడ్లంట మనుసుల్ని తిరగనిస్తండ్రటి? లేబరోళ్లని రోడ్లమీదకి రానిస్తండ్రటి? ఎన్నాళ్లు యిలగుంతాదో? మీలాంటోలికి ఎన్నాళ్లయినా పర్లేదు. లేబరోలో… పూటబత్తెం పుల్ల తెలుగు..” అనన్నాడు తవిట్రాజు.
….గవర్నమెంట్ బియ్యం , పప్పులు ఉచితంగా ఇస్తారట కదవోయ్… ఇంకేం?” కరుణాకర్రావు.
“….అవి మీరు తీసుకొని మీ జీతం మాకిచ్చీయండయితే… తెలుస్తాది…” అన్నాడు తవిట్రాజు,
“….నీతో వాదించలేం గానీ, బాబ్బాబూ… నాలుగు లోడ్లు ఎయ్యిదూ….”
“…ఎందుకండీ? లేబరోల్ని రానీయరండీ… ఇటికేయించి మీరే కట్టేస్తారా యేటి బిల్డింగ్..”
“….ఏదో చేస్తాను, లోడు వేద్దూ….”
“దొంగతనంగా లోడ్ల యెయ్యాల… ఎవుడి కంటా పడకండా- అనన్నాడు తవిట్రాజు,
“పోనీ… అలాగే వెయ్యండీ!
“రేటెక్కవవతాది మరి…
“ఏంజేస్తాం? రేట్ల పెంచి అమ్ముతుంటే సరుకులు కొనడం లేదా? అలాగేనూ…! ఇల్లు పూర్తి జేయాల. ఈ అద్దె ఇల్లు దరిద్రం ఒదిలీయాల. ఓనర్ నరకం చూపిస్తున్నాడండీ. కొలాయి ఓ నిముషం యెక్కువ రానీయడు. బట్టలు ఉతకనీయడు. రాత్రి పది దాటితే గేటు దీయడు. నరకం, నరకం! సొంతింటి స్వర్గానికి యెపుడు వెళ్లామా… అని చూస్తున్నా. రేటెక్కువయినా నాలుగు లోడులు వేయించండి…. ఇటికల… సారీసారీ తవిట్రాజుగారూ – అని వివరిస్తున్నాడు కరుణాకర్రావు. సరిగ్గా అప్పుడే అటునుంచి –
“తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరేపాకు… తోటకూర….” కేకలేసుకుంటూ వస్తోంది కామేశ్వరి. ఆమె నెత్తిమీద గంలో కొద్ది ఆకుకూరలే ఉన్నాయి. పొద్దు దూరేసరికి గంప యెత్తుకొని వచ్చింది. పట్నంలోని వీధీ వీధీ తిరిగి చాలా మటుకు అమ్మేసింది. పొద్దున తొమ్మిది దాటితే పోలీసుల బెడదని ఆమె తొందర తొందరగా వుంది! కరుణాకర్రావు ఆమెను ఆగమన్నాడు. తోటకూర, కొత్తిమీర కొన్నాడు. పొన్నగంటికూర లేదా అనడిగేడు. రేపు తెస్తానంది కామేశ్వరి.
నువ్వూ యేదో ఒక ఆకుకూర తీసుకోవోయ్. ఇంటికెళ్లే మణమ్మ ఆకుకూర కనబడితే తెమ్మన్నాను గదా? చేతులూపుకోని వొచ్చీసావేమీ? ఏటి వొండాల? నీ కాలూచేతులా – అని కేకలేయగలు. తీసుకోవోయ్ అనంది కుక్క.
తవిట్రాజు కుక్క సలహా ప్రకారం యేదో కూర తీసుకోబోతే, ‘బావూ, రోజూ మీ యింటికాడకే ముందర వొస్తాను, మణమ్మ బోణీ తర్వాతే బయల్దేరతాను… అని చెప్పింది కామేశ్వరి. తవిట్రాజు కోపంగా కుక్కవేపు చూసేడు. కుక్క అదేమీ పట్టించుకోకుండా గొలుసు లాగుతూ ముందుకు నడిచింది.
ఈ ఈలోగా అటునుంచి నాగేశ్వర్రావూ, రామారావు మరో ముగ్గురు కార్యకర్తలూ వచ్చేరు. వాళ్ల చేతుల్లో రసీదు పుస్తకాలూ, భుజాలకు సంచులూ వున్నాయి. కరోనా వైరస్ వలన పనులు కోల్పోయిన పేదల కోసం విరాళాలు సేకరించడానికి బయల్దేరేరు.
ముందు కామేశ్వరిని పలకరించేడు నాగేశ్వర్రావూ ఏం? ఇలియానా…. ఇంకా వీధుల వెంబడి తిరుగుతున్నావు? వైరస్ ప్రమాదం తెలీదా? వెళిపో, వెళిపో… ఇప్పటికే గాలి గట్టిగా వీస్తే ఎగిరిపోయేలా వున్నావు అనన్నాడు.
కామేశ్వరి సన్నగా వుంటుందని ఇలియానా అని పేరు పెట్టేరట నాగేశ్వర్రావు అపార్ట్ మెంట్ వాళ్లు. కామేశ్వరా ఆ అపార్ట్ మెంట్ వాచ్ మేన్ కూతురు. వాచ్ మేన్ కి ఇద్దరు కూతుళ్లు. గర్భసంచిలో కేన్సర్ తో అయిదేళ్లు ఆసుపత్రుల్లో ఖర్చులు పెట్టించి గతయేడాది చనిపోయింది భార్య. ఆసుపత్రి ఖర్చులకు చేసిన అప్పులు తీర్చడానికి, పల్లెనొదిలేసి పట్నమొచ్చాడు. తాపీ పనులకి వెళ్లేవాడు. కూతుళ్లు కూడా ఇళ్లల్లో పనిమనుషులుగా చేరేరు. కొద్దికొద్దిగా అప్పులు తీర్చుతూ బతుకుతుండగా కామేశ్వరి పుష్పవతి అయ్యింది. మళ్లీ అప్పు చేసాడు. కామేశ్వరి పుష్పవతి అయ్యేక పనిమనిషిగా మానేసి తాపీ పనులకు వెళ్లేది. తాపీ పనికి భావాజీ పేట నుండి వచ్చే గంగరాజుతో స్నేహం, ప్రేమ, పెళ్లి జరిగేయి. రెండోయేట కూతుర్ని కన్నది.
నాగేశ్వర్రావు వాళ్ల అపార్ట్ మెంట్ కట్టడంలో కామేశ్వరీ, గంగరాజూ తాపీ పని చేసేవారు. అప్పటినుంచీ నాగేశ్వర్రావుకి పరిచయం. అపార్ట్ మెంట్ పని జరుగుతున్నపుడు ఓ రోజు అయిదో ఫ్లోర్ నుంచి దిగుతుండగా నిచ్చెన కర్రలు విరిగిపోయి గంగరాజు కిందకు పడి చనిపోయేడు. నాగేశ్వర్రావే ఆదుకున్నాడు. వాళ్లని అపార్ట్ మెంట్ కి రప్పించేడు. కామేశ్వరి తాపీ పని మానుకొని గంగరాజు ఊరు భావాజీపేట వాళ్ల వద్ద ఆకుకూరలు కొని పట్నం వీధుల్లో అమ్ముతుంది. చలాకీగా వుంటుంది. అందరితో కలుపుగోలుగా వుంటుంది.
“….అయిపోయినాయి బావూ. ఇవిగో గంప అడుగుని రెండు కూరలున్నాయి. అవి అమ్మేస్తే ఎళిపోతానిక! పోలీసోలొప్పు కోరుగదా? ఔనుగానీ మీరేటిలగ బయల్దేరేర”నడిగింది కామేశ్వరి. భుజాలకు ఉన్న జోలె చూపేడు నాగేశ్వర్రావు. అదా సంగతీ.. అననుకుంటూ, తోటకూర, కొత్తిమీర… ఆక్కూరలోయ్ అనరుచుకుంటూ నడిచింది కామేశ్వరి.
“…ఇలాగ ఎవర్నీ తిరగనీయకపోతే యెలాగండీ? వైరసొస్తే దానికి మందులు చూడాల. ఆసుపత్రులు సిద్ధం చేయాల. వీధులూ, రోడ్లూ పరిశుభ్రం చేయాల. నిధులు కేటాయించాల. అంతేగానీ ఇళ్లనించి కదలకండి. ఆఫీసులు బంద్ చేసీయండీ, పనులాపీయండీ అనంటే ఎలా? పనులాగిపోతే దేశమేమయిపోతుందీ?” మధ్య తరగతికి చెందిన కరుణాకర్రావు లోపలి అసహనాన్ని వ్యక్తం చేసాడు.
“…నిజమేనండీ. దేశం యేమవుతాదో ఊహించలేం! నీ అంతకంటే ముందు పేదల బతుకులు నాశనమైపోతాయి. వాళ్ల సంగతి చూడాల. వలసలు పోయినోళున్నారు. ఇక్కడకు వలస వచ్చిన వాళ్లున్నారు. అటువంటి వారికి వీలయినంత విరాళాలు సేకరించి సహకరిద్దామని బయల్దేరే ము… మీలాంటి వాళ్లవద్దకు విరాళాల కోసం….” అన్నాడు రామారావు,
కరుణాకర్రావు పేరులో కరుణ వుంది గానీ మనిషిలో లేదు.
“…మీ కమ్యూనిస్టులు అన్నిటికీ జోలే, జెండా పడతారండీ! ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. లాక్ డౌన్ చేసినన్నాళ్లూ పేదలకు యిబ్బంది లేకుండా అన్నీ సమకూర్చమని. ఇలా మాలాంటివార్ని డిమాండ్ చేయకండి…” అని కంటసించుకున్నాడు.
“…అయ్యా! మీకు ఆపదొస్తే కమ్యూనిస్టుల వేపు చూస్తారు. అది దాటిపోతే కమ్యూనిస్టుల్ని విమర్శిస్తారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్త ప్రమాదకారి. అందరమూ బాధితులమే. కాకపోతే కొందరం అన్నీ అమరిన వాళ్లం. మనం ఇటువంటి సమయంలోనే యేమీ లేనివాళ్లకు యెంతో కొంత సాయం చేయాల. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. చేయకపోతే యెలాగూ డిమాండ్ చేస్తాం….” అన్నాడు నాగేశ్వర్రావు.
“…నాగేశ్రావుగారూ… మంచిదే.. ముందు ఆ డిమాండేదో సెయ్యరాదా? మాలాటోళ్లకి కొంత సాయమేనా సేస్తాదేటో గవర్నమెంట్…” అన్నాడు ఇటికల్రాజు,
“మీకేమండీ? బిజినిస్ మేన్. మీరూ బీదరుపులు అరిస్తే యెలా” ప్రశ్నించాడు నాగేశ్వర్రావు.
“ఈ కుక్కముండని చూసి నేనే బలిసిపోయున్నానుకుంతన్నారు గావాల? పిల్లల్లేరని మా ఆవిడ దీన్ని తెచ్చి అంటగట్టిందండీ బాబూ. దీన్ని మేపలేక సస్తన్నాను. ఇటికల బిజనెస్ తోటి ఇటికల్రాజని పేరు సంపాయించినాను తప్ప ఇటిక ముక్కంత బూమిగాని, ఇటిక ఆము అంత ఆస్తిగానీ సంపాయింలేదండీ బాబూ… నన్నొదిలేయండి. మంచిపనికి బయల్దేరేరు. శుభం..’ అని ఆశీర్వదించేడు తవిట్రాజు.
“….ఆశీర్వాదాలు కాదు బోణీ యెయ్యండి. ఇలా బయల్దేరాం. తొలిబోనీ మీదే… ఆశీర్వాదాలు కాదు…” అని రసీదు పుస్తకం పట్టుకొని వచ్చేడు రామారావు.
“…ఇక్కడ నాకాడేటున్నాయి? ఇదిగీ కుక్కముండుంది. ఇదిస్తాను, అమ్మీసి జమజేసుకోండ..”న్నాడు తవిట్రాజు. ఆ మాటలు విన్న కుక్క – హమ్మ, తవిట్రాజూ, నీకు నామీద యింత ప్రేమ వుందా? హమ్మో! ఏదోనాడు… నువ్వు ఆ మహాతల్లి మణమ్మకి తెలీకుండా అమ్మేస్తావన్న మాట! నీగ్గాడుపు రాను. నీకు అమ్మోరెత్తుకుపోను. నీకు కరోనా రాను. రక్కన నువ్వు కాటికెళిపోను…. అని పలువిధాల దీవించుతోంది.
తవిట్రాజు మళ్లీ యేమనుకున్నాడో కరుణాకర్రావు వేపు చూసి –
“…బావూ, నీకీ రోజు యెలాగేనా ఇటికలోడ్లు యేస్తాను, అందాకల వో వంద యియ్యి బయానా! నాగేశరావు బాబు వొదలడు. ఒ వందియ్యి..” అనడిగేడు.
కరుణాకర్రావు విసుక్కుంటూ జేబులో చేయి పెట్టి డబ్బు తీసేడు. రెండు వంద నోట్లు వచ్చేయి. “…ఆ రెండిటివ్వండీ… నీది వొంద, నాది వొందా!” అని తీసీసుకొని నాగేశర్రావుకిచ్చేడు తవిట్రాజు.
ఈలోగా గంపలో ఆకుకూరలు అమ్మేసిన కామేశ్వరి వచ్చింది. గంపలో గుడ్డకిందనున్న డబ్బులు తీసి… లెక్కబెట్టింది. చిల్లర నాణేలూ, నోట్లూ నూటాయాభయి రూపాయిలున్నాయి. నూరు రూపాయలు తీసి నాగేశ్వర్రావు కిచ్చింది! నాగేశ్వర్రావు, రామారావు తదితరులు ఆశ్చర్యపోయేరు.
“…ఎంతేనా… పేదోళికున్న తెగింపు పెద్దాళికుండదు. వొంద రూపాయలివ్వడానికి వొంద ఆలోసన్లు సేసినాం. వొంద మాటలాడినాం. ఆ పిల్లకి రేపెలాగ్గడస్తాదో తెలు. అయినా… మారు మాటాడకండా యిచ్చింది. ఆళేనండీ.. తెగింపు గలోళ్ళు, యేటేనా ఆళే సెయ్యాల, మనం కాదు కరుణా కర్రావు గారూ…” అన్నాడు తవిట్రాజు.
సర్లే… యిక నడు.. అని కుక్క ఇటికల్రాజు పట్టుకున్న గొలుసుని లాగింది!
శ్ర
నేను సారంగకు కొట్టాల్సిన ఫాంట్ లో కొట్టక పోవడం వలన ఇలా పీడియెఫ్ ని అఫ్సర్ గారు ఈసరికి పెట్టారు. అసలీ రూపం లో రాడానికి దుప్పల రవి గారి సహాయం పూర్తిగా ఉంది. గనక అఫ్సర్ గారికీ, రవి గారికీ ధన్యవాదాలు. దయచేసి పీడీయెఫ్ లో చదవండని మిత్రుల్ని కోరుతున్నాను. ఇకమీదట సారంగ సూచించిన రీతిలో పంపగలనని సారంగ నిర్వాహకులకు తెలియజేస్తున్నాను.
” రేపెలాగ్గడస్తాదో తెల్దు. కడు పేదలు. అయినా తెగింపు గలోళ్ళు, యేటేనా ఆళే సెయ్యాల. ప్రపంచవ్యాప్త ప్రమాదకారి కరోనా వైరస్ గానీ మరో ముప్పు క్కానీ పేదల బతుకులు నాశనమైపోకుండా యేటేనా ఆళ్ళే సాయం సెయ్యాల ” అన్న అట్టాడ అప్పల్నాయుడు బావుకి, సాహిత్యాన్నే జీవితోద్యమంగా గడుపుతున్న బావుకి ఒందనాలు ~ కె.కె. రామయ్య
ధన్యవాదాలు సార్