మదివాణన్
ఏదో అలికిడికి అటు వైపు చూస్తే పసుపు రంగు చొక్కా అతను ఎవర్నో చూస్తూ “డాయ్… డాయ్” అని అరుస్తున్నాడు. అతను అరుస్తున్న వైపు చూస్తే ఇందాక వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న మనిషి కనపడ్డాడు. వాడిని అంతకు ముందు చూసి వుంటి. ఇందాక నేను పార్క్‌లాండ్ హోటల్లో ఇడ్లీలని సాంబర్‌తో తిని, కాఫీ తాగి నా జావా బైక్ మీద వస్తున్నప్పుడు నా ముందు నుంచి దూసుకుపోతావున్నాడు అతనేదా ఇతను. కాళ్ళకి అడ్డం పడకుండా లుంగీ మోకాళ్ళపైకి కట్టుకున్నాడు. లోపల అతను వేసుకున్న గీతల నిజారు లుంగీ కింద నుండి కనబడతా వుంది. గీతల నిజారు మనిషి రొప్పుకుంటూ పరిగెడతా వచ్చినాడుగా …ఆయాసం! నల్లగా, పొట్టిగా ధృఢంగా వున్నాడు. నల్లటి వొత్తైన పొట్టి జుత్తు. బహుశ ఐదు అడుగుల ఎత్తు వుంటాడేమో. రోడ్డు మీద అటూ ఇటూ దేనికోసమో అన్నట్టు చూశాడు. అతని కళ్ళకి అక్కడే పేవ్‌మెంట్ పక్కనే స్టాండ్ వేసి నిలబెట్టిన రెడ్ కలర్ బిఎస్ఏ గర్ల్స్ సైకిల్ కనబడింది. ఒక్క రెండు గెంతుల్లో దాని మీదకు లంఘించాడు. హాండిల్‌ని పట్టుకుని, కుడి కాలితో సైడ్‌స్టాండ్‌ని తప్పించి సైకిల్‌ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ దాని మీదకి దూకి అదే ఊపుతో శరవేగంతో తొక్కుతూ రోడ్డుకి అడ్దంగా నడుపుతూ ఎడం చేతివైపున్న శ్రీనివాసయ్యర్ వీధిలోకి పొయ్యినాడు.
సీతారామన్
పాన్‌షాప్ దగ్గిర నిలబడి సిగరెట్టు తాగుతున్న నాకు ఒక ఐదారుగురు నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చేది కానొచ్చింది. వారందరిలోకి ముందున్న వ్యక్తి నడి వయసువాడు. నుదుట విభూతి చారలు, బాగా ఉతికి, ఇస్త్రీ చేసిన తెల్ల రంగు చొక్కా, తెల్లరంగు లుంగి. లుంగీ జారిపోతోంది. రోడ్డు మీద ఒక క్షణం ఆగి లుంగి విప్పి మళ్ళీ కట్టుకున్నాడు. “ముర్లీ…వాన్ని విడవకూడదు! పోడా, వాడి వెనకాల్న పో!” అని అరుస్తున్నాడు. బహుశ మురళి ఆఫీస్ బాయ్ అనుకుంటా, పాతికేళ్ళు వుంటాయేమో, ఊసీ లా సన్నగా వున్నాడు. ఖాకీ రంగుషర్టు, పాంటు వేసుకున్నాడు. కాళ్ళకి రబ్బరు చెప్పులు. “మామా వాన్ని వదలను మామా!” అంటూ నా వైపుకు దూసుకు వస్తున్నాడు మురళి. అతని వెనుక మరో నలుగురైదుగురు.
సిద్దార్థ
మా అక్క షాపులో ఏవో కొనుక్కుంటూ వుంటే నేను బయట నిలబడి రోడ్డు మీద పార్క్ చేసుకున్న నా ‘ఆంబీ’ కారుకి ఆనుకుని దమ్ము కొట్టుకుంటున్నాను. ఈ ఆడోళ్ల గురించి మీకు తెలినిదేముంది. షాపంతా తిరగాబోర్లా వేయించి చివరికి గుండు సూది కొనుక్కుని వస్తారు. ఆ తిరగాబోర్లా కనీసం రెండు మూడు గంటలు పట్టుద్ది. కాని మా అక్క అలా కాదు. గంటలోనే కానిచ్చుద్ది. సరే అలా దమ్ము కొడుతున్నానా…కొడుతూ రింగులు, రింగులుగా పొగూదుతూ వదులుతున్నా! అప్పుడు ఆ రింగులో గళ్ళ డ్రాయరోడు, వాడి వెనక పరిగెడుతూ వస్తున్న ఐదారుగురు ఆపించారు. వాళ్ల ముందున్న ఆయన లుంగీ వూడిపోయింది! వార్నీయమ్మ! మళ్ళీ సవరదీసుకుని కట్టుకుంటూ వెనక్కి తిరిగి ఏదో అంటున్నాడు. ఎదో జరగరానిది జరిగింది అన్నది అర్థమయ్యింది. ఈ లోపు ఆ చారల నిక్కరోడు నా వేపుకి పరిగెత్తుకుంటూ రావడమేంది, నా కారు పక్కన నిలబెట్టిన ఆడపిల్లలు తొక్కుకునే బి ఎస్ ఏ సైకుల్ స్టాండ్ తీయడమేంది, దాన్ని తోస్కుంటూ అలానే ఎక్కుకుంటూ ఆ ఎదురు గొందిలోకి పోవడమేంది…అంతా క్షణ్ణాళ్లో జరిగిపోయింది!
మనకి ఆగదుగా!
ఈ లోపు లుంగీ ఊడిపోయిన ఆయన నాకు దగ్గిర్లోకి వచ్చాడు. “సార్, ఇన్న ఆచ్చీ?” అని ఆయన్ని అడిగా! నిలబడి పోయి వూడి జారిపోతున్న లుంగీ నీ సరిజేసుకుంటూ నన్ను ఎగా దిగా చూసాడు! అర్థమైపోయింది ‘మనవాడు’ అని! ”తెవిడియా పయ్యా తంబీ! దుడ్డు ఎత్తుకుని పరుగిస్తున్నాడు!” అని అన్నాడు. మనకి కేసు అర్థమైపోయింది.
సిగరెట్టు విసిరేసా!
కార్లోకి దూకా!
స్టార్ట్ చేసా!
గేర్ మార్చా!
సర్రున రివర్స్‌లోకి కట్ చేసా!
టైర్లు ‘కీ’ అని ఏడిచినాయి! వినిపించుకోలే.
ముందుకి దూకించా!
అపర్ణ
కీచు మని కారు టైర్ల శబ్దం వినబడగానే బయ్యం వేసింది! తమ్ముడు ఏదో చేస్తున్నాడని! రెండంగల్లో షాపు గుమ్మం కాడికి చేరా! అప్పటికే తమ్ముడు కారు రివర్స్‌లోకి తీసేసుకున్నాడు. ఆ ఎదురుగుండా గొందిలోకి తిప్పేసాడు! అసలే మొండోడు! పైగా బండోడు! ఏ మైందో తెలవదు! అలా చూస్తూ వుండి పొయ్యానా…షాపులో సేల్స్‌మన్ నా వెనక నుండి “ఏమైంది మేడం?”
అని అడిగాడు.
“ఆ కారు…”
“చూసినాను మేడం. మీ బెదరు దానే ఆ సందులోకి పొయినాడెందబ్బా అనుకుంటా వుణ్ణాను”
అంటూ రోడ్డు మీద పార్క్ వైపునుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న మరో అతన్ని కేకేసాడు. అతని వెనకాతల ఇంకో ఐదారుగురున్నట్టున్నారు.
సేల్స్‌మాన్ పన్నీర్‌సెల్వం
“సుబ్రమణి…అన్నా…సుబ్రమణి” అని పిలిచినానా ఆ పెద్దాయన నన్ను చూసి ఆగినాడు. పార్కు ఎదురుగుండా ఆ చెట్టియార్ బట్టల కొట్టులో కాషియర్. నిండా మంచి మనిషి. ఆ పెద్దాయన కాష్‌లో వుంటే కాల్నా తక్కువ రాదు, పది పైసలు ఎక్కువ పోదు. అంత కరెక్టుగా వుంటాడు. “ఏందన్న అందరు పరిగెడుతా వున్నారు?’ అని అడిగినానా! అన్న కంట తడి. ‘వాడి కాషులో డబ్బులు దొబ్బేసినాడు సెల్వం’ అంటూ ఏడ్చే ముఖం పెట్టేసినాడు. “షన్ముగా…నేనేమి తప్పు సెయ్యలేదే! నాకేమి ఈ దండన?” అంటు తన రెండు చేతులు కలిపి నెత్తి మీదుగా ఆకాసంలోకి చూస్తూ సామికి దణ్ణం పెడుతూ అంటావున్నాడు. ఆయన నెత్తి మీద కుంకం సెమటకి తడిసిపొయ్యి కళ్లమీదుగా ముక్కు మీందగా జారిపోతావుండాది! నాకు జాలేసింది. ‘అన్నా! నువ్వు రాన్నా లోపలికి! వచ్చి కూర్చుండిమి! అంతా మంచి జరుగుతాది! ఆ మురుగన్ నీకు అంతా మంచి చేస్తాడు. బయం వద్దు.” అంటు అంగడిలోకి తీసుకు వచ్చి మా ఓనర్ టేబుల్ దగ్గిర కూర్చోబెట్టి టేబుల్ ఫాన్ ఆయన వైపుకి కుంచెం తిప్పి పెట్టినా. ఆయనకి ఏడ్పు ఒక్కటే తక్కువ! మేడంని చూపించినా. “ఈ అమ్మ తంబి కారు తీసుకుని ఆ పొరంబోకు వెనక పోయినాడు. నువ్వేం చింతించకు,” అని చెప్పినా.
“అమ్మా తాయే! ఆ లమ్డీకుడుకు దొరకాల నీ తమ్ముడికి కోడంబాకం మురుగన్ కోయిల్ పూజ చేయిస్తానమ్మా!’ అని ఏడుపు ఆపుకుంటూ అన్నాడు. ఈ లోపు మా అంగడిలో బాయ్ వేలు ‘అన్నా ఇందా ఈ వెల్లం తాగు అన్నా,” అంటూ స్టీలు టంబర్లో మంచి నీరు ఇచ్చినాడు. మా అంగడిలో వాళ్లందరూ సుబ్రమణి అన్న చుట్టూ చేరినారు.
వడివేలు
నేనేం చెయ్యాలా? వాండ్లు ఆ కిళ్ళీ షాపులోకి డ్రింక్ బాటిల్స్ దింపుకుంటా వుణ్ణారు. ఈ పక్కన పార్సిల్ ఆపీసు. వాడి లారీలో పార్సిల్ దింపుకుంటా వుణ్ణారు. అసలే చిన్న సందు. అదేమన్న మవుంట్ రోడ్డా! ఆ సందులోని సందులో ఆ పెద్ద అంబాసిడరు కారు! ఆ మనిషి ఒకటే హారన్ కొడతా వున్నాడు. చెవులు పగిలిపోతావున్నాయి! మధ్యలో ఆ సైకిల్ నాకొడుకు గుద్దేసి పోయినాడా…కాలుకి గీరుకుంది! “డాయి, ఆగరా,” అని పిలుస్తానే వుణ్ణాను, పారిపోయినాడు సోంబేరి నాయలు!
“సార్, అణ్ణాచ్చి, వుండండి అబ్బా! బండి తీస్తావుణ్ణానుగా! అయ్యో ఇది మీ కారు కాదు అణ్ణాచి! ఎటు పడితే అటు తిప్పేదానికి. కట్టవండి! అయ్యో ఒక గెల పడిపోయినాది!” చెప్తానే వుణ్ణాను. ఆ ఆంధ్రావాడు దిగినాడు, బండిని తోసి పెట్టినాడు. కారు ఎక్కిణాడు…సుయ్య్ మని పొయినాడబ్బా!
పంజాచ్చరం
అలా ఆ రోహిణి వోటల్ రవుండ్ ఠాణా దగ్గిర నిలబడు వుణ్ణాను. ఒక ముసలి మామి వచ్చింది. ‘ఏమప్పా శరవణా స్స్టోర్‌కి వస్తువా? ఎంత అడుగుతావు’ అని అడిగినాది. ‘ఈయ్యమ్మ నీకు తెలుసును కదా’ అనినాను. ఆ మామీతో బేరం మాట్లాడుతూనే ఈ లోపు ఎవడో సైకిల్ మీద వేగంగా వచ్చినాడు. వాడి ముందు ఆటో వుండాది. దాన్ని తప్పించడానికి నా వైపు వచ్చినాడు. మామినో, నన్నో, నా రిక్షాకి డాష్ ఇస్తుడేమోనని తలిచాను! అంత ఫీడుగా తొక్కుతా వున్నడణ్ణా! మంచి కాలం! తప్పించేసుకుంటిమి! వాడు పోయినాడు. ఆటోవాడు కూడా వాడిని తిట్టుకుంటూ పోయినాడు. మామి రెండు చేతుల్లోను సరుకుల బేగులు.
‘నువ్వే చెప్పుమి’ అంది మామి.
‘ఈ మామీ ఒక ఐదు రూపాయలు’ అంటిని.
‘ఏమప్ప దుడ్లు ఏమన్న చెడికి కాస్తున్నాయా? మూణు రూబా ఇస్తును’
‘సరే పోనీ మామీ, నీకు నాకు వద్దు! నాల్ రూబా ఇవ్వుమీ!’ అని మామి చేతిలో సంచి తీసుకుంటిని. మామి సల్లబడింది. ‘సరే పో’ అని చెప్పేసి రిక్షా ఎక్కుతా వుంది! ఈ లోపు సర్రు మని దూసుకుంటా వచ్చిందణ్ణా కారు. ఏవడో సేటు-నా-కొడుకు డ్రైవ్ చెస్తా వుణ్ణాడు! ఎంత తిమురు అణ్ణా! రిక్షా వస్తోందని చూసుకో బడ్లా! ఆటోకి డాష్ చెయ్యకుండా నా రిక్షాకి చేసినాడణ్ణా! ముందు టైర్ బెండై పోయింది సామి! టైర్ బంపర్ వంగి పూడ్సింది! మామి సీట్‌లో పడిపోయింది! ‘డెయ్ కమ్నాటి …’అని అరిచినాను! ఆ సేట్-నా-కొడుకు వినిపించుకోలేదు. అలానే ఆ సైకిల్ నాయలు వెళ్నాడే ఆ రాఘవయ్యా రోడ్‌లోకి వెళ్ళిపోయినాడు! రాస్కెల్!
అన్నపూర్ణ
బజుల్లా రోడ్డు నుండి రాఘవయ్య రోడ్డులోకి తిరిగాను. గబ గబా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను. ఒకటే సౌండ్! ఎవిటా అని చూస్తే ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న అంబాసిడర్ కార్. ఓ తెగ కొట్టేస్తున్నాడు హార్న్. ఎందుకబ్బా అలా కొడుతున్నాడని చూస్తుంటే…చూస్తునే వున్నాను…తన కార్ ముందున్న రెడ్ కలర్ బిఎస్ఏ గర్ల్స్ సైకిల్‌ని డాష్ కొట్టింది. ఆ సైకిల్ మీదున్నాయన స్పీడుగా తొక్కుతూ వస్తున్నాడన్నది చూసాను గాని పట్టించుకోలేదు. కాని రోడు వైడ్‌గానే వుందిగా కారు ఎందుకని ఆ సైకిల్‌కి డాష్ ఇచ్చింది… అది కూడా స్లోగా…అని ఆలోచిస్తున్నాను. ఆ స్మాల్ డాష్‌కి సైకిల్ మీదున్నతను పడిపొయ్యాడు. హడావుడిగా లేచి సర్దుకుని బెండ్ ఐపోయిన సైకిల్ హాండిల్ బార్‌ని అలానే పట్టుకుని రోడ్డ్‌కి రైట్ సైడ్ అంటే నా వైపుకి వస్తున్నాడు. కార్ కొంచెం వెనక్కి రివర్స్ తీసుకుని కొంచెం స్పీడ్ పెంచి రైట్‌కి కట్ చేసి మళ్ళీ సైకిల్‌కి డాష్ ఇచ్చింది. సైకిల్ పడిపోయింది. సైకిల్ మీదున్నతను కూడా పడిపొయ్యాడు. కారు రోడ్డు పక్కనున్న పేవ్‌మెంట్‌కి ఆని ఆగిపోయింది. సైకిల మీదున్నతని లుంగి జారిపోయింది. వైట్ కలర్ షర్ట్ నడుం పైకి వెళ్ళింది. డ్రాయర్ కనబడుతోంది. ఆ డ్రాయర్ పైన నడుం చుట్టు వైడ్‌గా వున్న రెడ్ కలర్ బెల్ట్ కనపడింది. సైకిల్ రైడర్ లేచి ఆ కారు డ్రైవర్‌ని కొట్టడానికి వెళ్తాడనుకున్నాను. అలా కాకుండా కాస్త కుంటుతూ నా వైపుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎడం కాలు బెణికినట్టుంది. నాకేమి అర్థం కావడం లేదు! ఆయనేమిటి డ్రైవర్‌ని తిట్టకుండా నా వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని అనుకుంటున్నా! అప్పుడు ఆ కారు డ్రైవర్, నా వైపు చేతులు వూపుతూ, ‘పుడీ, పుడీ, వాడ్ని పట్టుకో, తిరుడన్…దొంగ…తిరుడన్….దొంగ…” అని అరుస్తున్నాడు! అటూ ఇటు చూసాను! నా దగ్గిర్లో ఎవరూ లేరు! ఆ కార్ డ్రైవరేమో అరుస్తున్నాడు పట్టుకోమని!
డొజో లో పోయిన వారం నేర్చుకున్న జూడొ మూవ్ గుర్తు తెచ్చుకున్నా! డే ఆషీ హరాయ్! రెండడుగులు ముందుకు వేసా. నా వైపు వస్తున్న ఆ సైకిల్ రైడర్ షర్ట్ కాలర్ రెండు చేతుల్తో పట్టుకున్నా, అదే వూపులో అతని కుడికాలిని వెనక వైపునుంచి , నా సాచిన కుడి కాలితో ముందుకి అంటే నా వైపుకి లాక్కున్నా! అంతే! ఇంకేముంది! బాలన్స్ తప్పాడు. ‘అమ్మా…తాయే’ అంటూ కింద పడిపొయ్యాడు! ఈ లోపు కార్ డ్రైవర్ నా దగ్గిరకి వచ్చాడు! ఇద్దరం కలిసి అతన్ని పేవ్‌మెంట్ మీద కూర్చోపెట్టాం. కార్ డ్రైవర్ అతన్ని ఆ చెంపా ఈ చెంపా మీద కొట్టి వాయగొట్టాడు! ఈ లోపు ఈ గొడవకి మా చుట్టూ ఆ రోడ్డ్ మీద వెళ్తున్నవారందరు చేరారు!
కథకుడు
వాళ్ళందరి వెనకే ఆ చెట్టియార్ బట్టల కొట్టు గుమాస్తాలు, వాళ్ళ బాయ్ మురళీ కూడా చేరుకున్నారు. కోపం పట్టలేక అమ్మ ఆలీ బూతులు తిడుతూ ఆ సైకిల్ రైడర్ మీద పిడి గుద్దులు కురిపించారు. వాళ్ల చుట్టు చేరిన గుంపులో ఒక పెద్దాయన, ‘వాడు సచ్చిపోతుడబ్బా…అలా కొట్టొద్దు… వాడ్కి కొంచెం జలం ఇవ్వండప్పా!’ అని అన్నాడు! సిద్దార్థ కారులో వున్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాడికి అందించాడు. అందించి తన సిగరెట్టు అంటించుకున్నాడు. ఆ గుంపులో వున్న ఒకాయన లేత నీలం రంగు షర్ట్‌ని డార్క్ బ్లూ కలర్ పాంట్ లోకి నీట్‌గా టక్ చేసుకుని కనబడ్డాడు. షర్ట్ జేబు మీద మద్రాస్ రిపోర్టర్ అని ఎంబ్రాయిడర్ చేసుంది. అతని దృష్టి అంతా అన్నపూర్ణ మీదే వుంది.
సిద్దార్థ్ ఆ సైకిల్ రైడర్ దగ్గిర్నుంచి బాటిల్ తీసుకున్నాడు. అతని షర్ట్ సగం విప్పి రెండు చేతులు వెనక్కి వంచి షర్ట్‌తో బిగించి, “నీ పేరేంటి?” అని అడిగాడు. “తంగవేల్” ఈ లోపు మురళి వాడి నడుం చుట్టూ వున్న వెడల్పాటి బెల్ట్‌కి అమిరిన చిన్న పోకెట్‌కి ఉన్న జిప్ లాగబోతుంటే షణ్ముగం అడ్డం పడ్డాడు. “నువ్వు తీయొద్దరా! మణీ సార్ చూసుకుంటాడులే,” అని అపాడు.
సిద్దార్థతో, ” థాంక్స్ సార్, వీణ్ణి పట్టుకున్నందుకు. మీరు సరే అంటే మీ కారులోనే మా చెట్టియార్ గారి దగ్గిరకి వీడిని తీసుకుపోదాం సార్. అక్కడ వీడికి చెయ్యాల్సిన బజన ఆయన చేస్తాడు!” అని అంటూ తంగవేలు వీపు మీద మళ్ళీ పిడికిలితో గుద్దాడు.
“నేను చేసింది ఏమి లేదు.. అంతా ఆ అమ్మాయే చేసింది,” అంటూ అన్నపూర్ణని చూపించాడు. “థాంక్సమ్మా! నండ్రి” అంటూండగానే ఇందాకటి నీలం రంగు షర్ట్ ఆయన, ‘నీ పేరేమిటి తల్లీ’ అని అడిగితే, ఆ అమ్మాయి అన్నపూర్ణ అని చెప్పింది. అందరూ అన్నపూర్ణ కి తమ ధన్యవాదాలు తెలియజేసేలోపల సిద్దార్థ కారుని వెనక్కి తిప్పి, హార్న్ మోగించాడు. చెట్టియార్ అంగడి గుమస్తాలందరూ తలా ఒక చెయ్యి వేసి తంగవేలుని కారులో బాక్ సీట్‌లోకి నెట్టి వాళ్ళు కారులోకి ఎక్కారు. కారు పాండిబజార్ వైపుకి బయలు దేరింది.
షాపు దగ్గిరకి రాగానే కారుని ఆపాడు సిద్దార్థ. మురళిని తంగవేలుతోనే వుండమని చెప్పి అందరూ కారు దిగిన తరువాత కారు నాలుగు డోర్లు లాక్‌చేసి షాపులోకి వెళ్ళారు. తమ్ముడ్ని చూడగానే ఒక్క వుదుటున అపర్ణ లేచి వాడి దగ్గిరకి వెళ్ళి ‘ఏం కాలేదు కదా?’ అని అడిగింది. అలా అడుగుతూనే అతని చేతులు, ముఖం వంకా ఏమైనా గాయాలున్నవా అని చూసింది.
‘దొరికాడా?’ అని అడిగింది.
“సింహం వేటకి వెళ్తే దొరక్క పోవటం వుండదు కదా అక్కా!” అంటూ నవ్వాడు తమ్ముడు.
ఈ లోపు వీళ్లని చూడగానే లేచి నుంచున్న సుబ్రమణి సిద్దార్థ దగ్గిరకొచ్చి అతన్ని వాటేసుకున్నాడు
‘తంబి, నువ్వు లేకపోతే ఈ రోజు వాడు దొరికెవాడే కాదు తంబీ! నిండా సంతోషం తంబీ” అంటూ, ఆ షాపు కాష్ కౌంటర్ వెనకున్న సుబ్రహ్మణ్యస్వామి దేవుడి పటానికి సాష్టాంగ దండ ప్రమాణం చేసాడు. చేస్తున్నంత సేపు…”ఆండవా…ఆండవా…” అంటూ ఆనంద బాష్పాలు కారుస్తునే వున్నాడు. ఈ లోపు షాపు అధినేత, పన్నీర్‌సెల్వంని అందరికి కాఫీలు తెప్పించమని పురమాయించాడు.
“అసలు ఏమయ్యిందన్నా?” అని అందరూ ఆత్రంగా సుబ్రమని చుట్టూ చేరి అడిగారు. అపర్ణకు కూడా ఒక స్టూల్ వేస్తే ఆమె కూర్చుంది. సిగరెట్టు తాగడానికి బయటికి వెళ్లబోతున్న సిద్దార్థని కళ్ళతో వురిమి చూసింది. మాట్లడకుండా వెళ్ళి ఆమే పక్కనే కుర్చున్నాడు సిద్దార్థ.
సుబ్రమణి ఆ ఉదయం అంగడిలోకి వచ్చిన లగాయితు ఏం చేసింది వైన వైనంగా వివరించాడు.
కౌంటర్ దగ్గిర బిజి బిజిగా ఉన్నప్పుడు నలుగు స్త్రీలు వచ్చారని బిల్లులో కూడికలు సరిగ్గాలేవని ఒకరు, డిస్కౌంటు ఎందుకు ఇవ్వలేదని ఒకరు, నా దగ్గిర బిల్లుకు తగ్గ డబ్బులేదని మరొకరు తనకి ఊపిరాడకుండా చేస్తున్న సందర్భంలో ఆ దొంగనాకొడుకు పక్కనుంచి కౌంటర్‌లోకి దూరి, తను లెక్కబెట్టి కట్టిన కాష్ బండిల్స్‌ని పెరుక్కుని పరిగెత్తిపొయినాడని చెప్పాడు.
‘సరే పదండి మణి అణ్ణా! వాడ్ని చూసి ఆ దుడ్డు ఎంత ఉణ్ణాదో చూద్దాము” అని అందరూ కారు దగ్గిరకి వెళ్లారు.
కారు వెనక సీటులో మురళి ఉన్నాడు. నోట్లో నాప్కిన్. వాడి ఖాకీ షర్ట్‌తో వాడి పెడరెక్కలు వెనక్కి కట్టిసి వున్నవి. కాళ్ళని వాడి బనియన్‌తో కట్టేసి ఉన్నాయి.
తంగవేలు?
తంగవేలు ఏడి?
మురుగా! మురుగా! అప్పనే!
* * *
మరుసటి రోజు ఉదయం ‘మద్రాస్ రిపోర్టర్’ పత్రికలో బానర్ హెడ్‌లైన్ ఇలా వుంది.
ఔరా వీరబాలిక!
టీ. నగర్‌లో గజదొంగ తంగవేలు పట్టివేత.
నిన్న ఉదయం ఇక్కడి ప్రముఖ దుకాణంలో నగదు దొంగిలించి పారిపోతున్న గజదొంగ తంగవేలును విద్యామందిర్ బాలకోన్నత పాఠశాలలో ఎస్ ఎస్ ఎల్ సీ చదువుతున్న విద్యార్ధిని అన్నపూర్ణ తను నేర్చుకున్న జూడొ లోని డే ఆషీ హరాయ్ కిటుకుని ప్రయోగించి అతి లాఘవంగా పట్టుకుంది. ఈ సంఘటనలో ఆమెకు తోడ్పడిన మరో యువకుడు సిద్దార్థకు కూడా కృతజ్జతలు తెలుపుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో కుమారి అన్నపూర్ణని సత్కరిస్తూ మద్రాసు ఎక్స్‌నోర స్వచ్చంద సేవా సంస్థ అధ్యకులు, ప్రముఖ వైద్యులు వైద్యనాధన్ ఆమెకు ‘యువ సేవా శిరోమణి’ బిరుదుని ప్రసాదించారు. మద్రాసు నగర చరిత్రలో సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలతో కూడిన ఒక బాలిక ఈ అన్నపూర్ణ పేరుతో చిరస్థాయిగా నిలబడి పోతుందని అన్నారు. మాంబళం పోలిస్ స్టేషన్ సి. ఐ రవీంద్రన్ సభలో పాల్గొని కుమారి అన్నపూర్ణ ధైర్యాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతే కాదు. ఆవిడ సమయ స్పూర్తిని కొనియాడుతూ, కారులోనే మురళిని బంధించి, పారిపోతున్న తంగవేలుని గుర్తించి తనకు హానీ చేస్తాడేమోనన్న భయం లేకుండా రెండో సారి కూడా అతన్ని తను జూడోలో నేర్చుకున్న పట్టుతో పట్టుకుని పోలీసులకి అప్పగించినందుకు, సమాజానికి ఆమె సేవలను గుర్తించి తగిన ప్రోత్సాహకాలను అందించవలసినదిగా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారులకి కూడా సిఫార్స్ జేస్తానని అన్నారు. అదే సభలో చాకచక్యంగా తంగవేలుని వెంబడించి పట్టుకోవడంలో సహయపడిన సిద్దార్థని కూడా ఈ సందర్భంగా సముచితంగా సత్కరించారు.
*
అంతేగా; ఒకరు కష్టపడతారు, మరొకరు చరిత్రలో నిలిచిపోతారు.
Hahaha!
Dark humour at the core. Nice story sir. I liked the way, how explicitly each character drove the story.
As usual good narrative style. Liked it. That too the the story is set in T.Nagar, a place we lived! How many stories did u write so far? When can we expect a book titled “అనిల్ అట్లూరి కథలు” ?
మీడియా వాళ్లని ఏం తిట్టినావప్పా… ఈ శైలి సర్రున ఎక్కలేదు కానీ… పట్టుబట్టి చదివితినా… ఫర్లేదనిపించలే…
రిలే రేసులా ఆద్యంతం దౌడుతీసిన కథ. కథనంలో, శైలిలో నూతనత్వం. మద్రాసు/నెల్లూరు తెలుగు సువాసనలు దండిగా ఉన్నాయి. అవి కథను మరింత వేగంగా, సహజంగా ముందుకి పరుగెత్తించాయి. నేపథ్యాన్ని బట్టి అర్థం అయ్యాయి – ఇబ్బందికలగలేదు. మచ్చుకి – నిజారు (లాగు), ఊసీ (ఊచ?), సవరదీసుకొను (సర్దుకొను?), దుడ్డు (డబ్బు), కాల్నడ (?), తిమురు (తిమ్మిరి). అభినందనలు, అనిల్!