తాబేలు నడకలు – 3

సమయంలో మాకు తెలియనిదేమిటంటే – ప్లానింగ్ కమిషన్ డిప్యుటీ ఛైర్మన్ గా ఉన్న అశోక్ మెహతా – కొంతమంది ఇండియన్ ప్రొఫెషనల్స్ ను తమ సంస్థలోకి తీసుకోవాల్సిందిగా ఫోర్డ్ ఫౌండేషన్ (ఎఫ్. ఎఫ్)ను ఒత్తిడి చేస్తూ ఉన్నారట! అప్పటికి ఉన్నత అర్హతలున్న ఇండియన్ అధికారులు అమెరికాలో ఉన్న ఎఫ్.ఎఫ్.లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ సరైన అవకాశాలు దొరికితే వారిలో కొందరు తిరిగి వస్తారని అశోక్ మెహతా ఆలోచన. అప్పటికి ప్రభుత్వ జీతాలు తక్కువగా ఉండేవి కనుక ఒకసారి వెళ్లినవారు మళ్లీ తిరిగి వచ్చి ప్రభుత్వంతో పనిచెయ్యాలనే ఆలోచనలో ఉండేవారు కాదు. అటువంటివారిని ఆకర్షించాలంటే, వారికి ఫౌండేషన్ ఆ స్థాయి జీతభత్యాలిస్తే బాగుంటుంది, ఇక్కడి పరిస్థితులు తెలిసినవారు కనుక తమ ప్రతిభతో వారు ఇక్కడి అభివృద్ధి పనుల్లో భాగమవుతారని ఆయన అనుకున్నారు.

ఫౌండేషన్ కూ ఈ ప్రతిపాదన బాగానే నచ్చింది. తమకూ కొంత ఖర్చు కలిసొస్తుంది, పనులు నాణ్యంగా జరుగుతాయన్న అవగాహన వారిలో కలిగింది.

ఇది కార్యరూపం దాల్చేలోపు సతీశ్ కు ఈ అవకాశం పట్ల విముఖత కలిగింది. దీర్ఘకాలపు ఉద్యోగం కాదని, ఇంటి సౌకర్యం ఉండదని అతనికి నచ్చలేదు. ఫౌండేషన్ తరపున వచ్చే విజిటింగ్ ప్రొఫెషనల్స్ కు వసతి సౌకర్యం ఇచ్చేవారు కాని ఇండియన్ ప్రొఫెషనల్స్ కు ఇచ్చేవారు కాదు.

తనకున్న పరిచయాల వల్ల సతీశ్ సర్వీసులో చేరిన తొలి ఏడాదిలోనే గహవసతి సౌకర్యం సంపాదించుకున్నాడు. ప్రభుత్వ సర్వీసులో లేకుండా, అటువంటి ఇంట్లో ఉండాలంటే ఫౌండేషన్ ఇచ్చే జీతంలో సగానికి పైగా ఖర్చు చెయ్యాలి. అదీగాక, ఫౌండేషన్ లో రెండుమూడేళ్లు పనిచేసిన తర్వాత తాను మళ్లీ ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుందన్న ఆలోచన కూడా అతనికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో అతను నేనుగాని ఫౌండేషన్ లో చేరడానికి ఇష్టపడతానేమో అని అడిగాడు.

ఆ ప్రతిపాదనకు సరేననడానికి నాకే అభ్యంతరమూ కనిపించలేదు. ఒకటి – నేను ఢిల్లీ వదిలి వెళ్లనవసరం లేదు. ప్రభుత్వంలో అప్పటిదాకా చేస్తున్న పనే, మరింత మెరుగ్గా, ఉన్నత స్థాయిలో చేసే అవకాశం దొరుకుతోంది. అది కొంచెం సవాలే, భవిష్యత్తులో కొంత రిస్కూ ఉండొచ్చు. కాని నాముందున్న అవకాశాలు తక్కువ. వాటిలోంచే ఏదో ఒకటి ఎంచుకోవాలి. అన్నిటినీ బేరీజు వేసుకున్నాక, నేను ఫౌండేషన్ ఉద్యోగానికి అభ్యర్థిగా వెళతానని చెప్పాను సతీశ్ తో. నేను అంగీకరించినందుకు అతను సంతోషించాడు. నా అనుభవం ఎలా ఉందో చూశాక, అంటే కొత్త ఉద్యోగంలో నేను విజయవంతమైతే అతను చేరతాడు, ఒకవేళ నేను ఫెయిలయితే, అతను రిస్కు లేకుండా ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతాడు! ఈ ప్రయోగంలో నేనొక జంతువునన్న మాట. అది నాకేం కష్టమనిపించలేదు.

మూడు దశల్లో నాకు ఇంటర్వ్యూలు సాగాయి. మూడో ఇంటర్వ్యూ చేసినది ఫౌండేషన్ నుంచి వచ్చిన అత్యున్నత అధికారి. ఆయనే ఇండియా విభాగానికి అధికారి. ఉద్యోగం ప్రయోగదశలోనే ఉందని వాళ్లూ బాహాటంగానే చెప్పారు, రిస్కుకు వెనకాడబోనని నేనూ ఒప్పుకున్నాను. మరికొంత వ్యవధిలో వాళ్లు నన్ను ఖరారు చేస్తున్నట్టు తెలియజేశారు.

నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి 1968 జులై 6న రాజీనామా చేశాను. అదే రోజు మధ్యాహ్నం ఫోర్డ్ ఫౌండేషన్ ఉద్యోగంలో చేరిపోయాను. ఆరోజే ఫౌండేషన్ నూతనంగా నిర్మించుకున్న భవనంలోకి మారింది. అది ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ పక్కనే. నేను ప్రభుత్వ సర్వీసులోంచి వెళ్లిపోతానని నా స్నేహితులు కొందరు అనుకుంటూనే ఉన్నారు, కాని ఎక్కువమంది నేను ఎకనామిక్ టైమ్స్ ఉద్యోగానికి వెళతాననని అనుకున్నారు. ఫోర్డ్ ఫౌండేషన్ లో చేరిన తొలి ఇండియన్ అధికారిని నేనే కావడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. (అప్పటివరకూ ఉన్నవారంతా విదేశంలో పనిచేస్తున్నారు, ఇక్కడ ఉన్నది అడ్మినిస్ట్రేటివ్ లేదా హౌస్ కీపింగ్ స్థాయి వారే)

ఏదైనప్పటికీ అది చీకట్లో బాణం వెయ్యడం కిందే లెక్క. భవిష్యత్తులో నా ఉద్యోగ జీవితం ఏ మలుపులు తిరుగుతుందో నా స్నేహితులకే కాదు, కనీసం నాక్కూడా తెలియలేదు. రంగ్నేకర్ కు నా నిర్ణయాన్ని తెలియజేశాను. నాతోపాటు ఇంటర్వ్యూకు వచ్చిన అశోక్ దేశాయ్ కూడా ఎకనామిక్ టైమ్స్ ఉద్యోగాన్ని తిరస్కరించాడనుకుంటాను. రంగ్నేకర్ కొంత నిరాశ చెందినా, మంచి మనసుతో నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఫోర్డ్ ఫౌండేషన్ లో పనిచేసి మరింత అనుభవాన్ని మూటగట్టుకున్నాక అప్పుడే రావచ్చు పత్రికలోకి..’ అంటూ ప్రోత్సహించారు.

*****

ప్రఖ్యాత మోటార్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ను స్థాపించినది అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. సామాన్యులకు కారును అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థగా అమెరికాలో ఫోర్డ్ కు గొప్ప పేరుంది. హెన్రీ ఫోర్డ్, అతని కుమారుడు ఎడ్సెల్ ఫోర్డ్ కలిసి ‘ఫోర్డ్ ఫౌండేషన్’ను 1936లో స్థాపించారు. తమ ఆస్తిపాస్తులను భారీగా ధారాదత్తం చేసి వారు దాన్ని మొదలుపెట్టారు. అది వివిధ దేశాల్లో మంచి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తూ, తన దాతృత్వాన్ని చాటుకుంది.

ఇండియాకు సాయం అందించడానికి ఫోర్డ్ ఫౌండేషన్ (ఎఫ్.ఎఫ్.) ముందుకొచ్చింది. మరో దిగ్గజ సంస్థ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అప్పటికి రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో వేళ్లూనుకుని ఉంది.

ఎఫ్.ఎఫ్. ప్రతినిధి డగ్లస్ ఎన్ స్మినర్. ఆ సంస్థ తొలిరోజుల నుంచీ ఇండియాలోనే ఉన్నారు. మొట్టమొదట గోధుమల ఒప్పందం కోసం వచ్చిన పాల్ హాఫ్మన్ బృందంలోని సభ్యుడిగా ఈ దేశానికి తొలిసారి వచ్చారు. ఒప్పందం కుదిరాక తమ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో ఉండి ఆ దిగుమతి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తే బాగుంటుందని హాఫ్మన్ అనుకున్నారు. దానికి డగ్లస్ ఎన్స్మినర్ ను ఎంచుకున్నారు.

అందరూ ప్రేమగా ‘డౌగ్’ అని పిలుచుకునే ఆయన అమెరికా ప్రభుత్వంలో వ్యవసాయశాఖ అధికారి. అంత పెద్ద ఉద్యోగాన్ని వదులుకుని ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున ఒక చిన్న కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రావడం గొప్ప విషయమే. కాని వచ్చారు, అప్పటినుంచి ఫోర్డ్ ఫౌండేషన్ ప్రతినిధిగా ఇక్కడే ఉండిపోయారు. భారత ప్రభుత్వం అతనికి కార్యాలయాన్ని, వసతి సౌకర్యాన్ని కల్పించింది.

ఇక్కడొక సరదా సంగతి చెప్పాలి. భారత ప్రభుత్వం డౌగ్ కోసమని ఒక ప్యూన్ ను నియమించింది. కాని అమెరికాలో పుట్టిపెరిగిన వ్యక్తిగా అతను తన పనులన్నీ తానే చేసుకునేవారు. ఫైళ్లు తీసుకొనిపోవడం వంటివి. దాంతో ప్యూన్ అవసరం ఉండేది కాదు. కాని డౌగ్ ఆఫీసులో ఉన్నప్పుడు ఆ ప్యూన్ నీడలా అంటిపెట్టుకుని తిరిగేవాడు. అతను బయటికొచ్చినప్పుడల్లా లేచినిల్చునేవాడు. ఇది అతనికి నచ్చలేదు. కొద్ది నెలల తర్వాత ప్రధానమంత్రిని ఒక సమావేశంలో కలిసినప్పుడు, ముఖ్యవిషయాలన్నీ చర్చించాక ‘ఇంకా ఏమైనా కావాలా’ అని ప్రధాని ఆయన్ను అడిగారు.

డౌగ్ సందేహిస్తూనే ‘ఆ ప్యూన్ని వెనక్కి తీసుకుంటారా, నాకు అటువంటి సాయమేదీ అవసరం లేదు..’ అని అడిగారు.

దానికి ప్రధాని నవ్వేసి ఒకసారి నియమించాక వెనక్కి తీసుకోవడం కుదరదు అని చెబుతూనే ‘మీరే నెమ్మదిగా అలవాటు పడతారు’ అని సాగిపోయారు.

డౌగ్ నిత్య విద్యార్థి. అతనికి నేర్చుకోవాలన్న తపన ఎక్కువ. రెండేళ్ల కోసం అని వచ్చి ఇరవయ్యేళ్లకు పైగా ఇండియాలో ఉండిపోయాడు. ఇండియా అంటే అతనికి అపరిమితమైన ఇష్టం. కాలక్రమంలో ఫౌండేషన్ కార్యకలాపాలు సైతం అనేక రంగాలకు విస్తరించాయి. నేను చేరేనాటికి ఫౌండేషన్ లో 150 మందికి పైగా నిపుణులు వివిధ రంగాల్లో పని చేసేవారు. వ్యవసాయం, కుటుంబ నియంత్రణ వంటి అంశాల్లో ఫోర్డ్ ఫౌండేషన్ చేసిన పని చాలా విలువైనది. కమ్యూనిటీ డెవలప్మెంట్ మీద ఎఫ్.ఎఫ్. పెద్ద చర్చను లేవనెత్తింది కాని దురదృష్టవశాత్తూ అది విఫలమైంది. పై అంశాలకు తోడు వ్యవసాయాభివృద్ధి, హరిత విప్లవం, మానవ వనరుల అభివృద్ధి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బలోపేతం చేయడం, ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ వంటివి స్థాపించడానికి సాయం చెయ్యడం – భారతీయ ఆర్థికాభివృద్ధి చరిత్ర రాస్తే, అందులో ఫోర్డ్ ఫౌండేషన్ పాత్ర కీలకమని తప్పకుండా రాయాలి.

​నేను చేరే సమయానికి ఈ పనులన్నీ ముమ్మరంగా నడుస్తున్నాయి. కాని అదే సమయంలో ఫోర్డ్ ఫౌండేషన్ అధినాయకత్వంలో మార్పు వచ్చింది. ప్రెసిడెంట్ గా మెక్ జార్జ్ బండీ వచ్చాడు. ఆయన విద్యాధికుడు, హార్వర్డ్ కాలేజి డీన్ గా పనిచేశాడు, అధ్యక్షులు జాన్ ఎఫ్. కెనెడీ, లిండన్ బి. జాన్సన్లకు యునైటెడ్ స్టేట్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేశాడు. అతన్ని బోస్టన్ బ్రాహ్మిన్, (బోస్టన్ లోని ఉన్నతవర్గానికి చెందినవాడు అనే అర్థంలో) వియత్నామ్ హాక్ (యుద్ధాన్ని సమర్థించినవారిని అలా అనేవారు) అని పేరుపొందినవాడు. అతను విదేశాల్లో ఫోర్డ్ ఫౌండేషన్ సేవలను తగ్గించి, స్వదేశం అంటే అమెరికాలో వాటిని పెంచాలన్న ఆలోచనలో ఉండేవారు. తమ నగరాల్లో ఘెట్టోలు, నల్లవారి అభివృద్ధికి తాము పాటుపడాలని అతని ఆలోచన. మార్టిన్ లూథర్ కింగ్ హత్య, ఆ తర్వాత ముఖ్యంగా రాజధానిలో చెలరేగిన అల్లర్లు బండీ వంటి మేధావులను ఆలోచనలో పడేశాయి. అప్పటివరకు మేధావులు వియత్నాం యుద్ధాన్ని సమర్ధించేవారు, గ్రేట్ సొసైటీ అంటూ ప్రచారం చేసేవారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఫోర్డ్ ఫౌండేషన్ గున్నార్ మిర్థాల్ అనే విదేశీ ఆర్థికవేత్తను ఆహ్వానించి అమెరికాలో జాతి విద్వేషాలు గురించి పరిశోధన చేయమని కోరింది. ఆ పని పూర్తి చేసి ఆయన ‘ద అమెరికన్ డైలమా’ అనే పుస్తకం రాశాడు. అది చరిత్రలో ఒక లాండ్ మార్క్ అనదగిన పుస్తకంగా నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో బండీ స్వదేశం మీద దృష్టి పెడదామని పట్టుదలగా ఉండేవాడు, డగ్లస్ భారతదేశంలో ఫోర్డ్ ఫౌండేషన్ చేస్తున్న మంచి పనులు ఆగకూడదని తాపత్రయపడేవారు. వారిద్దరి దృష్టి కోణాల్లో ఉన్న తేడాల వల్ల డౌగ్ న్యూయార్క్ కు తరచూ ప్రయాణించ వలసి వచ్చేది. తనకు కావలసిన పనులు చక్కబెట్టుకు రావడానికి ఆయన అవిశ్రాంతంగా కృషిచేసేవాడు.

ఫౌండేషన్ లో చేరిన నిపుణుల సామర్థ్యం వెలికితీయడం, వారితో చక్కగా పని చేయించుకునే నైపుణ్యం డౌగ్ సొంతం. కొంత పొల్లు లేకపోలేదుగాని అక్కడ ఉన్నవారిలో ఎక్కువ మంది నిబద్ధత గల నిపుణులే. ఫౌండేషన్ సమావేశాల్లో డౌగ్ ఒక అమాయకమైన మొహం పెట్టి కూర్చునేవాడు. వాళ్లను తోచినంత మాట్లాడనిచ్చేవాడు. సమావేశం ముగిసే ముందు ఆయన రంగంలోకి దూకేవాడు – అప్పటిదాకా ఎవ్వరూ ఊహించని ఒక కొత్త కోణం పట్టుకుని ప్రశ్నలడిగేవాడు. దాంతో వారు తత్తరపడేవారు.

‘అయ్యో మేం వీటి గురించి అసలు ఆలోచించలేదు. అధ్యయనం చేసి మళ్లీ వస్తాం సమావేశానికి’ అని అభ్యర్ధించిన వారు సెలవు తీసుకునేవారు.

డౌగ్ కు ఎంతసేపు ఒకటే ఆలోచన – ‘ఈ అంశం ఇండియాకు ఎలా మేలు చేస్తుంది’ అనేదే. ఒక ప్రతిపాదన బాగుంది, మంచిది అనుకుంటే ఎంత కష్టపడి అయినా అది అమలు అయ్యేలా చూసేవాడు. అతని స్ఫూర్తి ఇతరులకు ఒక అంటువ్యాధిలాగా అనుకునేది. అలాగే అతని చక్కటి నవ్వు కూడా. భారత ఆర్థిక అభివృద్ధి చరిత్రలో అతని గురించి తప్పకుండా రాయాలి.

ఫౌండేషన్ లో నా విధి ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి, సుముఖంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ సిస్టం ఏర్పాటు చేయడంలో సహకరించడం. ఇది ఇంతకు ముందు నేను చేసిన పనికి కొనసాగింపే కాని అది చాలా మటుకు ఆయా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు వద్దు అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు.

దానికోసం దానికి చేయాల్సిన ఎ.ఆర్.సి. అప్పటికే సూచనలు చేసింది. కాని ఫైనాన్స్ మినిస్ట్రీ పెద్ద ఉత్సాహం చూపలేదు, అలాగని వ్యతిరేకించినట్లు కూడా కనిపించలేదు. ఇది ప్రభుత్వంలో సాధారణంగా జరిగేదే. సూత్రప్రాయంగా అంగీకరించడం, అమలు ఆలస్యంగా చేయడం.

పైగా ఆలస్యానికి కొత్తకొత్త సాకులు వెతికే పనిలో ఉండేది ఫైనాన్స్ మినిస్ట్రీ. అంతలో క్యాబినెట్ సెక్రటరీగా వచ్చిన డి.ఎస్. జోషి మెరుపువేగంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వయంగా ఎ.ఆర్.సి. సూచనలను క్షుణ్ణంగా చదివారు. చాలా ముగ్ధులయ్యారు. వెంటనే ఒక పేరాగ్రాఫ్ లో తన ఆదేశాలను అందరు సెక్రటరీలకు పంపేశారు. ఆ పేరాగ్రాఫ్ సారాంశం ఏమంటే పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ systems అన్నిచోట్ల వెంటనే ప్రవేశపెట్టాలన్నదే. ఆ నిర్ణయం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శరాఘాతంలా తగిలింది. కాని దాన్ని మార్చే అవకాశం లేదు. ఎంత అయిష్టత ఉన్నా అమలుకు నడుంబిగించక తప్పని పరిస్థితి. అది నాకు వరంగా పరిణమించింది. నా పనిలో పెద్ద అవరోధాలు తొలగిపోయినట్లు అయింది.

 

పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ పద్ధతులను ప్రవేశపెట్టాలంటే పెద్ద సంఖ్యలో సుశిక్షితులైన వ్యక్తులు కావాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. ఆ సిస్టమ్స్ ను ఎలా ఇన్ స్టాల్ చేయాలి, ఎలా నిర్వహించాలి, చెయ్యవలసినవేమిటి, ఏమేం చెయ్యకూడదు – ఇవన్నీ వివరంగా చెప్పే మెటీరియల్ రూపొందించాలి. ఉన్నతాధికారులకు షార్ట్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం చేయాలి, సాధారణ ఉద్యోగులకు ఎక్కువ కాలం శిక్షణ ఇవ్వాలి. దానికోసం మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ లో అప్పుడే కొత్తగా ఏర్పాటైన ట్రైనింగ్ డివిజన్ ఆధ్వర్యంలో ఒక శిక్షణ కార్యక్రమం రూపొందించాం. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సెక్రటేరియట్ ట్రైనింగ్ స్కూల్ – వీటిలో ఉన్నతాధికారులకు శిక్షణ నిర్వహించాం. మొదటిసారిగా ఆలిండియా సర్వీస్ అధికారులకు రెండువారాల రిఫ్రెషర్ కోర్సు మొదలెట్టాం.

క్యాబినెట్ సెక్రటరీ ఆదేశాలు అందిన నెలరోజుల కల్లా ఈ శిక్షణ కార్యక్రమం మొదలైపోయింది. దీన్ని అటు ప్రభుత్వం ఇటు ఫోర్డ్ ఫౌండేషన్ కూడా చాలా ప్రశంసించాయి.

 

నా పనిని చాలామట్టుకు కొంతవరకు ఫోర్డ్ ఫౌండేషన్ పని సంస్కృతి ప్రభావితం చేసింది. నేను ఇక్కడ ఏ ఫైళ్లూ నిర్వహించనవసరం లేదు, ప్రోగ్రాం అడ్వైజర్ తో, ప్రతినిధితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించనవసరం లేదు. ఎఫ్.ఎఫ్.లో పని వ్యక్తి ప్రాథమిక బలాల మీద, అతని ప్రయత్నం, చర్చ నైపుణ్యాలు, సాధారణ పరిజ్ఞానం వంటివాటి మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రభుత్వంలో వ్యక్తికి ప్రాముఖ్యత లేదు. చాలా సందర్భాలలో అతను సామాన్యుడిగా ఉంటాడు.

నా ఉద్యోగం నాకు కొత్త, ఫౌండేషన్ కి కొత్త. అందువల్ల నేను నా ప్రతిపాదనలకు ప్రోగ్రామ్ అడ్వైజర్ (బాస్) అనుమతి తీసుకోవాలని అనుకున్నాను. నా అడ్వైజర్ పేరు ఎడ్వర్డ్ కీలోచ్. ఆయన అధికారం, పనులు, బాధ్యతలు అన్నిటిని పంచుకోవడంలో నమ్మకం ఉన్నవాడు. నేను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు వెళ్లేందుకు ఆయన అనుమతి కోసం వెళితే ఆయన ‘మీకు నా పూర్తి సహకారం ఉంది, ఇవన్నీ మీరే నిర్ణయించుకోండి’ అనేవారు. అది అప్పటికి బాగున్నట్టు సంతోషంగా ఉండేదిగాని ఈ ప్రయోగం చివర్లో ఏమవుతుందోనని భయంగా ఉండేది.

ప్రభుత్వ ఉద్యోగులకు నన్ను ఫౌండేషన్ ప్రతినిధిగా చూసేందుకు కొత్తలో ఇబ్బందిగా ఉండేది. తొందర్లోనే నేను వారితో సహకారపూర్వక స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోగలిగాను. నేను ‘ఎవరికి రావలసిన పేరు కొట్టెయ్యను’ అని స్పష్టం చేశాను. అంతే కాదు, అట్టహాసం ఏమీ లేకుండా లోగుట్టుగా నా పని నేను చేసుకు పోతున్నాను. ​పబ్లిక్ రోల్ అంతా ఫైనాన్స్ మినిస్ట్రీ ఉన్నతాధికారులకు వదిలేసేవాణ్ని. అయినా, నేను డోనార్ ఏజెన్సీ (దాతృత్వ సంస్థ) కు చెందినవాడిని కావడం వల్ల కొన్ని అంతర్గత ప్రయోజనాలు ఉండేవి.

 

సీనియర్ అధికారులకు విదేశాలకు ముఖ్యంగా అమెరికా వెళ్లాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అందువల్ల వారు ఫోర్డ్ ఫౌండేషన్ దృష్టిలో పడాలని ప్రయత్నించేవారు. మమ్మల్ని కలవడానికి, చర్చలకు, అడిగిన సమాచారం ఇవ్వడానికి ఎప్పుడైనా సరే అన్నట్టుగా సంసిద్ధంగా ఉండేవారు. ఈ ప్రాసెస్లో అదివరకు నన్ను లక్ష్యపెట్టని ఉన్నతాధికారులు సైతం ఫోన్ చేయడం, లంచ్ కు ఆహ్వానించడం వంటివి చేసేవారు. ఎంపీలు, ఇతర రాజకీయ నాయకులు కూడా ఇదే వరుసలో ఉండే వారు. ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు (తర్వాత ఆయన దేశ ఆర్థిక మంత్రి అయ్యారు) ఫోర్డ్ ఫౌండేషన్ అధికారులతో స్నేహంగా తిరగడానికి ఇష్టపడేవారు. వీరు నిర్వహించే లంచ్, డిన్నర్ కార్యక్రమాల్లో విదేశీ మద్యం పుష్కలంగా లభించడం కూడా మరొక కారణం. అమెరికన్ అధికారులతో పరిచయాలు పెంచుకోవడానికి ఎంత ముఖ్యమైన సమాచారాన్ని అయినా ఇచ్చేయడానికి వెనుకాడేవారు కాదు. ఫౌండేషన్ లో నా సహోద్యోగులను ‘మీకీ సమాచారం ఎలా వచ్చింది’ అని అడిగితే చెప్పేవారు. నాకు అయోమయంగా అనిపించేది. విదేశీయులకు అంత ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చేందుకు ఏ కారణం ఉందా అని ఆశ్చర్యంగా ఉండేది. కాని అది దాత శక్తియుక్తులకు తార్కాణం.

 

పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటుచేసుకోవడానికి రాష్ట్రాలు అంగీకరిస్తున్నకొద్దీ నాకు ప్రయాణాలు, పనిభారం పెరగడం మొదలైంది. మైసూర్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు పాండిచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ముందుగా

ఆసక్తి చూపాయి. వారి అధికారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామని నన్ను కోరారు. ఈ రకమైన స్పందన నన్ను ఫౌండేషన్ని కూడా చాలా ఆకట్టుకుంది. నాతో చేసిన ప్రయోగం సఫలం అవుతోందని ఎఫ్.ఎఫ్. ఉన్నతాధికారుల భావన.

 

నేను చేరిన మూడు నెలల తర్వాత ఒక సమావేశానికి రమ్మని పిలుపు వచ్చింది. అది ఫౌండేషన్ లోని కుటుంబ నియంత్రణ విభాగానికి సంబంధించినది. వాళ్లు ప్లానింగ్ కమిషన్ సభ్యుడైన డాక్టర్ నాగ్ చౌదరికి మార్కెటింగ్ వ్యూహం తెలియజేయాలి. సాధారణంగా జరిగే దానికి భిన్నంగా ఆయనే ఫౌండేషన్ ఆఫీసుకు వచ్చారు. ఇద్దరు అమెరికన్ కన్సల్టెంట్లు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు.

నాగ్ చౌదరి అంతా బాగుందని చెప్తూ ‘రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తాయి’ అని ప్రశ్న లేవనెత్తారు. దానికి ఎవరూ స్పందించలేదు. డౌగ్ నా వైపు చూశారు. ‘మీకున్న పరిజ్ఞానంతో దీనికి ఏమైనా సమాధానం చెబుతారా’ అని అడిగారు.

అప్పుడు నేను స్పందించాను. ఈ పథకానికి 95 శాతం నిధులు కేంద్రమే సమకూరుస్తోందిగనక రాష్ట్రాల మీద పెద్ద భారం ఉండబోదని ఆయనకు తెలియజేశాను. ఇది నాగ్ చౌదరి కి నచ్చింది. ఎందుకంటే ఆ వ్యూహాన్ని ప్రభుత్వంలో చెప్పి ఒప్పించుకోవాల్సిన బాధ్యత ఆయనదే మరి. ఆయన అంగీకరించడంతో మా సమావేశం ముగిసింది.

నేను అక్కడితో ఆ విషయం మర్చిపోయాను, నా ఆఫీసుకు వెళ్లి పనిలో పడ్డాను.

రెండు రోజుల తరువాత నాకు వచ్చిన నోటీసులో నా జీతాన్ని 40% పెంచుతున్నట్టుగా ఉంది. ఆ సమావేశంలో డౌగ్ పరువు కాపాడినందుకైనా ఆ పెంపు ఇవ్వాలని ఆయన అనుకున్నారట. అటుపైన వీలైనంతవరకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగే సమావేశాలకు నేను తప్పకుండా ఉండాలని ఆయన ఆదేశించారట. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే ఫోర్డ్ ఫౌండేషన్ లోకి మరింత మంది భారతీయ నిపుణులను తీసుకురావడానికి ఆయన పచ్చజెండా ఊపారు. అప్పటికి అమెరికాలోని యూనివర్సిటీల్లో పనిచేస్తూ ఉన్నవారు కొందరున్నారు. వారిలో ఇండియాకు తిరిగి వచ్చిఫౌండేషన్ లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న ప్రొఫెషనల్స్ ఎందరని గుర్తించేందుకు ఒక కసరత్తు మొదలుపెట్టారు.

​నేను పని చేస్తూ పోతున్న కొద్దీ ఒక విషయం స్పష్టమైంది పర్ఫార్మెన్స్ బడ్జెట్ సిస్టమ్స్ కు ఇంకా మద్దతు రావాలి అంటే దాని గురించి ఒక సమగ్రమైన పుస్తకం రావాలి. అది సాధారణ పాఠకులకు అర్థం కావాలి, అలాగే ప్రభుత్వానికి ఒక మాన్యువల్ లాగా కూడా ఉపయోగపడాలి. ఈ లక్ష్యంతో నేను నా రెండో పుస్తకం రాయడానికి ఉపక్రమించాను. ఈ పని తొందరగా పూర్తి చేసేందుకు ఫోర్డ్ ఫౌండేషన్ నాకు మరో స్టాఫ్ అసిస్టెంట్ను అంటే స్టెనోగ్రాఫర్ ను కూడా ఇచ్చింది. దానివల్ల నేను రోజువారి పని చేసుకుంటూనే పుస్తకాన్ని మూడు నెలల్లో పూర్తి చేశాను. దాన్ని ప్రచురించేందుకు ఒక ప్రైవేట్ పబ్లిషర్ ను పట్టుకోవడం ఈసారి కష్టం కాలేదు.

అప్పుడే ‘ఎకడమిక్ బుక్స్’ అనే ఒక కొత్త పబ్లిషింగ్ కంపెనీ ఏర్పాటయింది. దానిలో ముఖ్య పాత్ర పోషించినది ప్రొఫెసర్ వి.ఎస్. ఝా. ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలో పని చేసి రిటైర్ అయిన వైస్ ఛాన్స్లర్. అప్పటి విద్యా మంత్రి ఎం. సి. ఛాగ్లాకు సలహాదారు. ఈ కంపెనీకి పెట్టుబడి బొంబాయిలో ఉన్న ఓ గ్రూప్ పెట్టేది. వాళ్లు కేంద్ర విద్యాశాఖ సూచించిన పాఠ్యపుస్తకాలు ముద్రించడం ద్వారా అప్పటికే చాలా డబ్బు సంపాదించి ఉన్నారు.

ప్రొఫెసర్ ఝా నా పుస్తకం వెయ్యాలనుకున్నారు, నాకేమో అది త్వరగా వెలుగు చూడాలని ఆశ. నా తొలి పుస్తకం ప్రచురించిన ఎడిటర్ అబ్బూరి వరద రాజేశ్వర్రావును సంప్రదిస్తే, వాళ్లకు ఇంకా చాలా పుస్తకాలు పెండింగ్లో ఉన్నాయి కనుక ఆ ఒప్పందం నుంచి నన్ను విడుదల చేయడానికి ఆయన అంగీకరించాడు. అలా నా రెండో పుస్తకం ఇంకొకచోట ప్రచురణ చేసుకునే వీలు కలిగింది. ‘అకడమిక్ బుక్స్’ వారు, ప్రొఫెసర్ ఝా తమ మాట నిలబెట్టుకున్నారు. కొద్ది వారాల్లోనే ముద్రణ పూర్తిచేసి విడుదలకు సన్నాహాలు చేశారు. ఆ పుస్తకం కూడా వాణిజ్యపరంగా విజయవంతం అయింది, మరీముఖ్యంగా అవసరమైన వారందరికీ సమయానికి చేతికి అందొచ్చింది.

పుస్తకానికున్న విస్తృతమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కు అందజేస్తే బాగుంటుందని నాకు కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. ఆ సమయంలో రాజకీయ భేదాభిప్రాయాలు వల్ల ఫైనాన్స్ మినిస్టర్ ను బయటకు సాగనంపారు. ఆ శాఖను స్వయంగా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీయే చూసుకునేవారు. ఆమెను కలవడం కష్టం అనిపించిందిగాని ఒక ప్రయత్నం చేయడం తప్పేం కాదు కదా అనుకున్నాను.

ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాను. నా ఉద్దేశం వివరించాను.

అటువైపు వారు ‘మీరు ధవాన్ తో మాట్లాడాలి’ అన్నారు.

తర్వాత ఒక క్షణంలో ఆయనే నేరుగా లైన్ లోకి వచ్చారు.

నా పని ఏమిటో ఆయనకు చెప్పాను.

‘రేపు ఉదయం 11 గంటలకు రాగలరా’ అని అడిగారు.

అది నేను ఊహించని ఆహ్వానం. నాకు సంతోషం, ఆశ్చర్యం కలిగాయి.

 

నేను ప్రధానమంత్రి ని కలవడానికి వెళ్తున్నాను అంటే ఫోర్డ్ ఫౌండేషన్ లో నా సహోద్యోగులు చాలా సంతోషించారు. మర్నాడు ఉదయం ప్రధానమంత్రి ఇంటికి పావుగంట ముందుగా చేరుకున్నాను. సందర్శకులను వంతులవారీగా పంపడంలో బిజీగా ఉన్నారు ధవాన్. ఆమె లివింగ్ రూమ్ అతి సాధారణంగా ఉంది. ఫర్నిచర్ పెద్దగా ఏమీ లేదు. ఉన్నవి రెండు సోఫాలు. వాటికి ఇటుక రంగు కవరు వేసి ఉంది. ఆమె తండ్రి ఫోటో పెద్దది ఒకటి గోడకుంది. అది ఢిల్లీలోని మధ్యతరగతి ఇల్లు లాగా ఉంది తప్పితే ఒక ప్రధానమంత్రి స్వగృహం అన్న భావన రాలేదు.

శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని ఒక మూలన నిల్చున్నారు. ఒక్కో బృందాన్ని కలిసి వారిచ్చిన పూలమాలలను స్వీకరించడం, తర్వాత వాటిని సహాయకులకు ఇచ్చేయడం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో కోసం పోజివ్వడం, (అది భద్రత కారణాల కోసమని తెలిసింది) తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వారితో ముచ్చటిస్తూ వారు వచ్చిన పని తెలుసుకోవడం, అవసరాన్నిబట్టి వారికి భరోసా ఇవ్వడం – ఇదీ వరుస క్రమం.

 

నా పేరు ఆధికారికంగా ఆనాటి సందర్శకుల జాబితాలో లేదు. ధవాన్ గారికి వీలున్నప్పుడు నన్ను ఆమె దగ్గర ప్రవేశపెడతారని నాకు అర్థం అయింది. నాకు ఇచ్చిన సమయం ఆసన్నం అవుతోంది. చివరి సందర్శక బృందం బయటికి వెళ్లిపోతోంది, ప్రధానమంత్రి కూడా మరో గదిలోకి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు. సరిగ్గా ఆ సమయంలో ధవాన్ ఆమె చెవిలో ఏదో చెప్పారు, మరోవైపు నన్ను రమ్మని సైగ చేశారు.

నేను వారి దగ్గరగా వెళ్లాను, ప్రధానమంత్రి ఇందిరకు నా పుస్తకాన్ని అందజేసి దాని ఉద్దేశం ఏమిటో క్లుప్తంగా చెప్పాను. ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఆమెకు ఆ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని, వ్యవస్థలో మార్పు వచ్చేందుకు ఆమె సహకరిస్తారని ఆశిస్తున్నట్లుగా చెప్పాను. ఆమె చిరునవ్వు చిందించారు. ఒకసారి పక్కకు, కిందకూ చూశారు. వాస్తవానికి ఆమె సందర్శకుల కళ్ళలోకి చూసి నేరుగా మాట్లాడరు అని నేను గమనించాను.

‘మీకు తెలిసే ఉంటుంది, నేను టెక్నికల్ పర్సన్ని కాదు, ఏదో మధ్యంతరంగా అవసరార్థం ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్నాను. అయితే ఈ పుస్తకాన్ని మా అధికారులకు ఇస్తాను ఏం చేయాలో వారిని చూడమని చెబుతాను’ అన్నారు ఆమె. అక్కడితో నా సమావేశం అయిపోయింది, నేను బయటకు వచ్చేశాను. ఆమె లోపలకు నిష్క్రమించారు.

ఆ కొద్దిసేపటిలో నా మనోఫలకం మీద స్పష్టంగా ముద్రించుకుపోయింది ఒకటే అంశం. అదేమంటే ఆమె మూడ్స్ చాలా త్వరగా మారిపోతాయి. సందర్శకులను చూసి చిరునవ్వులు చిందిస్తారు, మరుక్షణంలో అటు తిరిగి ఇంటి పనివారి మీద నిప్పులు కురిపిస్తారు. మళ్ళీ ఏమీ జరగనట్లే ఇటువైపు నవ్వుతూ మాట్లాడుతారు. అది నాకు గొప్ప ఆశ్చర్యంగా అనిపించింది. నా అవగాహన ప్రకారం ఎవరికైనా ఒక మూడ్ నుంచి మరోదానికి వెళ్లేందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఆమెకు చాలా తక్కువ. ప్రజాజీవితంలో ఉన్న రాజకీయ నాయకులకు ఇవన్నీ ఇలాగే ఉంటాయేమో మరి.

నా పుస్తకం బాగా విజయవంతం అయింది. రాయల్టీల రూపంలో నాకు డబ్బులొచ్చాయి. ఆ తర్వాత ‘అకడమిక్ బుక్స్’ సంస్థతో ప్రొఫెసర్ ఝా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆయన ప్రొఫెసర్, అకడమిక్ వ్యక్తి, వ్యాపార మెలకువలు తెలియవు. అది ఆ గ్రూప్ గ్రహించింది, కొద్దిగా నష్టాల పాలయింది. అది తెలుసుకున్న ప్రొఫెసర్ వాళ్లు వెళ్లమనక ముందుగానే బయటకు వచ్చేశారు. ఆయనకి వారికి పొత్తు పొసగలేదు. తర్వాత ఆ సంస్థ మూత పడింది.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పెర్ఫార్మెన్స్ బడ్జెట్ యూనిట్ స్థాపించేందుకు, నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేయడంలో నా సహోద్యోగి ఫ్రాంక్ కారాసియోలోకి సాయం చేశాను. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ స్థాపించేందుకు మేమిద్దరం బొంబాయి వెళ్ళి వివిధ సంస్థలకు చెందిన హ్యూమన్ రిసోర్స్ మేనేజర్లను కలిశాం. కాని వాళ్లెవరికీ ఆ సొసైటీ, దాన్ని ప్రాంతీయ శాఖల అవసరం అర్థం కాలేదు. దాంతో నేను ప్లానింగ్ కమిషన్ లో ఉన్న నా స్నేహితులను తీసుకొచ్చి ముందు ఒక చిన్నసంస్థ గా మొదలు పెట్టాను. ముందు అనుకున్న దాని కన్నా భిన్నంగా ఆ సొసైటీ తర్వాత పెద్దగా విస్తరించింది.

ప్రయోగాత్మకంగా చేపట్టిన నా ఉద్యోగం మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. అది ఫోర్డ్ ఫౌండేషన్ వారికి సంతృప్తి కలిగించింది. తర్వాత వారు నన్ను స్టడీ టూర్ కోసం అమెరికా పంపాలని అనుకున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అయిన వాల్టర్ ఫ్రీస్ ఆ ప్రతిపాదనను బలపరిచారట. ఆయన అంతకు ముందు నా పనిని రివ్యూ చేశారు. నా సహోద్యోగులు ఫ్రాంక్ కారాసియోలో, రాస్ పొలాక్ నా టూర్ కు అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని ఏర్పాటుచేశారు. అమెరికాలో బ్యూరో ఆఫ్ బడ్జెట్, జనరల్ అకౌంటింగ్ ఆఫీస్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎమ్.ఎఫ్) ఇంకొన్ని ఇతర సంస్థలతో నా సమావేశాలు ప్లాన్ చేశారు. సంస్థలను కలిసికట్టుగా ముందే మాట్లాడి పెట్టారు.

*****

1969 జులైలో నేను తొలిసారి అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యాను. అదే నా తొలి విదేశీ ప్రయాణం అని చెప్పుకునే మాట కొద్దిలో తప్పిపోయింది. ఆ గొప్ప నేపాల్ ఎగరేసుకుపోయింది. ఫోర్డ్ ఫౌండేషన్ పనిమీద మూడు రోజులు నేపాల్ వెళ్లి వచ్చాను. నా పర్యటనను ఫోర్డ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తోంది కనుక నేను అమెరికన్ విమానాల్లో మాత్రమే తిరగాలి. అప్పట్లో ‘పాన్ అమ్’ అనే విమానయాన సంస్థ ఉండేది. అది పెద్ద సంస్థ. ప్రతిరోజు రౌండ్ ద వరల్డ్ ట్రిప్ నిర్వహించేది. అందులో భాగంగా ఢిల్లీకి విమానం ఉదయాన్నే వచ్చేది. తర్వాత ఇండియన్ రైళ్లలాగా అది కూడా అన్నిచోట్ల ఆగుతూ పోయేది. టెహ్రాన్, బీరుట్, ఇస్తాంబుల్, ఫ్రాంక్ ఫర్ట్ చివరకు లండన్. అన్ని స్టాపులు ఉండటం వల్ల లండన్ చేరడానికి సమయం పట్టేది. నేను లండన్ లో ఒక వారం రోజులు ఉన్నాను.

 

​ద ఎకానమిస్ట్, న్యూ స్టేట్స్ మన్ వంటి బ్రిటిష్ మ్యాగజైన్లను చదువుతున్నందువల్లనో, హైస్కూల్, కాలేజీ స్థాయిలో ఆ చరిత్రను బాగా చదివినందుకోగాని, నాకు లండన్ చిరపరిచితంగా అనిపించింది. బ్రిటిష్ ట్రెజరీ ఉన్నతాధికారులతో అన్ని మీటింగులకు నేను నేను ఎవరి సాయం అవసరం లేకుండా ఒక్కడినే టాక్సీ కూడా తీసుకోకుండా వెళ్ళగలిగాను. నేను దిగినప్పుడే ప్రిన్స్ చార్లెస్కు అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పట్టాభిషేకం జరిగింది. దాంతో నగరమంతా పండగ వాతావరణం ఉండేది. అలాగే అదే సమయంలో బ్రిటన్ అంతా పబ్లిక్ ఎక్స్పెండిచర్ సర్వే కమిటీ ( పి.డి.ఎస్.సి.) పనిని ప్రమోట్ చేయడంలో, ప్రభుత్వ కార్యకలాపాలకు అవుట్పుట్ బడ్జెటింగ్ టెక్నిక్స్ అనువర్తనలో తలమునకలుగా ఉంది. లండన్ లో ఒక వారం గడిచాక నేను వాషింగ్టన్ చేరాను.

ఇక్కడ కూడా అంతా హడావుడిగా ఉంది. ఎందుకంటే సరిగ్గా అప్పుడే చంద్రుడి మీద మనిషి అడుగుపెట్టే సమయం ఆసన్నమవుతూ ఉండేది. ఆ మహత్తర క్షణాల కోసం దేశమంతా, ఆ మాటకొస్తే ప్రపంచమంతా కాచుకుని కూర్చుంది. పత్రికలు, టీవీ లు అంతటా అదే చర్చ జరుగుతూ ఉండేది.

నేను డల్లెస్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. అప్పట్లో అది పెద్ద వాడకంలో ఉండేది కాదు. సౌకర్యాలు తక్కువ గనుక కొన్ని విదేశీ ఫ్లైట్లు దిగేవి. నగరంలోకి వెళ్తూంటే deer crossing board లు చూడటం తమాషాగా అనిపించింది.

 

మూన్ లాండింగ్ ముచ్చట ముగిశాక నేను సమావేశాలతో బిజీ అయ్యాను. మిగిలిన వాటికన్నా బడ్జెట్ బ్యూరోతో, జనరల్ అకౌంటింగ్ ఆఫీస్,  బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్, పెంటగాన్ లో నా సమావేశాలు ఎక్కువ సేపు సాగాయి. ఇండియా అమెరికాల మధ్య తేడా ఎంత ఉందో నాకు తొలిసారి అప్పుడే అర్థమైంది. అక్కడ ప్రజలకు ఎంతో సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజలు నిజాయితీపరులు, ఉదారులు, ఇతరులకు సాయపడే గుణమున్నవారు. ప్రపంచబ్యాంకులో నేను కలిసింది మధ్యస్థాయి ఉద్యోగులను. ఎందుకంటే ఆ సంస్థలో గవర్నమెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తో పని చేస్తున్న వారు ఎవరూ లేరు.

తర్వాత నేను రిచర్డ్ గూడేని కలిసాను. ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలోని fiscal affairs డిపార్ట్మెంట్ కి డైరెక్టర్.

నేనెన్నో ప్రశ్నలు వేశాను, ఆయన అన్నిటికీ చక్కగా సమాధానాలు చెప్పారు. ఇలా మాట్లాడుతూ ఉండగా ఆయన నా తొలి పుస్తకాన్ని చదివారని తెలిసింది. ఆయన ఇండియా గురించి రాస్తున్న రచనకు అది చాలా ఉపయోగపడిందట. అది రాసింది నేనేనని తెలిశాక ఆయన స్వరం పూర్తిగా మారిపోయింది. మరింత స్నేహపూర్వకంగా, ఇన్ ఫార్మల్ గా మాట్లాడటం మొదలు పెట్టారు. తర్వాత ఆయన నన్ను వివిధ ఆఫీసులకు తిప్పి చూపించి తన సహోద్యోగులకు పరిచయం చేశారు.

మేము ఒక ఆఫీసుకు వెళ్ళేసరికి అక్కడున్న సీనియర్ అధికారి – డచ్ దేశస్థుడు, ఏదో వెతుకుతూ ఉన్నారు. టేబుల్ నిండా కాగితాలు, డాక్యుమెంట్లే. పరిచయాలు అయ్యాక ఆయన ఒక పదం గురించి ఆలోచిస్తూ తికమక పడుతున్నట్టు చెప్పారు. గూడే ఆ పదం ఏమిటని అడిగారు.

‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు’ అంటే ఏమిటో తెలియక తికమకపడుతున్నానని చెప్పారాయన.

గుడేకి తెలిసినా ‘బహుశా ప్రేమ్చంద్ మీకు సమాధానం సరిగా చెబుతారు’ అన్నారు. నేను దాని గురించి వివరించాను.

 

తర్వాత మరో అధికారిని కలిశాం. ఆయన న్యూజిలాండ్కు చెందినవారు. మధ్యాహ్నం కెఫెటేరియాకు తీసుకువెళ్లి కాఫీ తాగించాడు, తర్వాత ఆయన ఆఫీస్ కు తిరిగి వచ్చాక ఏదో మాట్లాడుతూ వుండగా గూడే నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ‘మీకు ఐ.ఎమ్.ఎఫ్.లో ఉద్యోగిగా చేరే ఉద్దేశం ఉందా’ అని ఆయన అడిగారు. నేను ఏమీ ఆలోచించకుండానే ‘పెద్ద ఇష్టపడను’ అని చెప్పేశాను. ఎందుకంటే అప్పటికి నేను ఫోర్డ్ ఫౌండేషన్ లో పనిని ఆస్వాదిస్తున్నాను. ఢిల్లీలో అంతా సాఫీగా నడుస్తోంది.

 

ఢిల్లీలో ఉంటూనే కొన్ని టెక్నికల్ అసిస్టెన్స్ అసైన్మెంట్లు చేయవచ్చా అని అడిగాను. దానికి గూడె ‘మీరింకా చిన్నవాళ్లే. తల నెరిసినవారికిగాని అది సాధ్యం కాదు. ఈ వయసులో ఉద్యోగిగా చేరడమే మంచిది. అయినా మీరు వెంటనే ఏమీ చెప్పనవసరం లేదు. నెమ్మదిగా ఆలోచించుకుని సమాధానం చెప్పండి’ అన్నారు.

వారు ఇస్తున్న ఆఫర్ నిజమైనది, స్థిరమైనది అవునోకాదో తేల్చుకోలేక నేను సతమతం అయ్యాను. అది కేవలం సూచనలాగా అనిపించింది. దాంతో నేను అక్కడే నివసిస్తున్న నా స్నేహితుడు మూర్తిని సంప్రదించాను. అతను నాకు ఆంధ్ర యూనివర్సిటీ రోజులనుంచి తెలుసు. అప్పటికి ఆయన ఇండియన్ ఎంబసీలో భాగంగా ఇండియా సప్లై మిషన్ లో పని చేస్తూ ఉండేవాడు. అతనికి అమెరికాలోని ఉద్యోగ భర్తీ విధివిధానాలు తెలుసు. అందువల్ల నాకు దొరికింది firm offer అని, వెంటనే అంగీకరించడం మంచిది అన్నాడు. ఇంట్లోవారిని కూడా ఒక మాట అడగాలని అనుకున్నాను.

ఆ తర్వాత న్యూయార్క్ లో మిగిలిన కార్యక్రమం యధావిధిగా సాగింది. వచ్చేముందు అక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ కొని ఇండియాకు తీసుకువచ్చాను. మా పిల్లలు తీసుకురమ్మని అడిగింది అది ఒక్కటే మరి.

నేను ఇండియా వచ్చేసరికి రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అధ్యక్ష అభ్యర్థి ప్రధానమంత్రికి నచ్చలేదు. ఆ కారణంతో ఆమె పార్టీని చీల్చి తన పేరుమీద వేరే పార్టీని పెట్టారు. ప్రెసిడెంట్ అభ్యర్థిగా వేరే వ్యక్తిని నిలబెట్టారు. ఆమె అభ్యర్థి గెలిచారు. అప్పుడే బ్యాంకుల జాతీయీకరణ కూడా జరిగింది. సివిల్ సర్వీసు ప్రధానికి నిబద్ధమై, విశ్వాసపాత్రంగా ఉండాలనే డిమాండ్ పెరిగింది. సివిల్ సర్వెంట్లులు తమ ప్రతిభనే కాదు ఆత్మలను సైతం అమ్ముకోవాల్సిన కాలంగా అది దాపురించింది.

*****

 

ఐ.ఎమ్.ఎఫ్.లో ఉద్యోగ ప్రతిపాదన గురించి నా బుర్రలో ఆలోచన సుడులు తిరుగుతూనే ఉంది. ఒకవైపు అది ఎంత గట్టిదో తేల్చుకోలేకపోయాను. అలాగని అది ఉత్తిదే అని వదిలెయ్యలేకపోయాను. ‘ఇన్నేళ్లుగా ఉన్నచోటిని వదిలి కుటుంబాన్ని వేరే ఖండానికి తరలించాలా’ అని ఆలోచించాను. మా ఇంట్లో చర్చలు దీని గురించి సాగాయి. చూడబోతే నా కన్నా నా భార్య పిల్లలు గట్టి నిర్ణయం తీసేసుకున్నారు. ‘ఆఫర్ అంటూ వస్తే గనక వెళ్ళిపోదాం’ అన్నారు.

ఈలోగా గూడె నాకు ఉత్తరం రాశారు. ఐ.ఎమ్.ఎఫ్.లో నేను చేరాలనుకుంటున్నట్లయితే దరఖాస్తు నింపి ఆయనకు పంపమని రాశారు. మా అమెరికన్ కొలీగ్ జార్జ్ టోబియస్ మ్యాన్ పవర్ ఎక్స్పర్ట్. గతంలో ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్ గా పని చేసినవాడు. నేను ఈ ఆఫర్ గురించి ఎక్కువ ఆశ పడకూడదని, ఎందుకంటే ఆ సంస్థలో పర్సనల్ డివిజన్ చీఫ్ ఒక భారతీయుడని, అతనికి ఇతర భారతీయులు అందులో చేరడం ఇష్టం ఉండదు అన్నట్లుగా చెప్పాడు.

అయినా దరఖాస్తు ఎలాగో చేతిలో ఉంది కదా అని నింపేసి ఐ.ఎమ్.ఎఫ్ కు పంపేశాను. అది నవంబర్ 13వ తేదీ. కొందరికది శుభసూచకం కాదు. కాని నాకు ఆ ఉద్యోగం పట్ల పెద్ద ఆశ ఏమీ లేదు గనుక ఏ తేదీ అయితే ఏం – అనుకున్నాను. దరఖాస్తులో నేను ఇచ్చిన రిఫరెన్స్ వ్యక్తులకు కనీసం తెలియచేయలేదు.

1969 డిసెంబర్లో నేను లక్నో వెళ్ళాను.

తిరిగి వచ్చేసరికి నా బల్ల మీద ఒక సందేశం ఉంది. ప్లానింగ్ కమిషన్ సభ్యులు బుర్రా వెంకటప్పయ్య గారిని కలవమని దాని సారాంశం. మర్నాడు ఉదయం వారింటికి వెళ్ళాను. ఆయన గురించి నా గురించి అడుగుతూ ఐ.ఎమ్.ఎఫ్. నుంచి లేఖ వచ్చిందని అందువల్ల నా పూర్తి వివరాలు నేపథ్యం తెలుసుకోవడానికి పిలిచానన్నారు. అప్పుడు వారికి సంగతంతా తెలియజేశాను. ఆయన రిఫరెన్స్ ఇవ్వడానికి ముందుగా అనుమతి తీసుకోనందుకు క్షమాపణలు చెప్పాను. ఆయన పెద్ద మనసుతో ‘గుడ్ లక్’ అంటూ నన్ను ఆశీర్వదించారు.

ఫండ్ పనిచేస్తున్న వేగానికి నాకు ఆశ్చర్యం కలిగింది.

డిసెంబర్ 21 శనివారం. నేను ఇంట్లో ఉండగా ఫోర్డ్ ఫౌండేషన్ డ్యూటీ క్లర్క్ నాకు ‘కేబుల్ వచ్చింది ఆఫీసుకు’ అని ఫోన్ చేశాడు. అందులో ఏముందో చదివి చెప్పమని అతన్ని అడిగాను. ‘మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎయిర్ మెయిల్ చేశాం’ అని వచ్చిన కేబుల్ అది. వచ్చింది ఐ.ఎమ్.ఎఫ్. నుంచి!

 

ఈ విషయాన్ని ఫోర్డ్ ఫౌండేషన్ కు తెలియజేయడం, వారి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు క్షమించి నన్ను వదిలిపెట్టమని కోరడం ఈ పనులు ఉన్నాయి. డగ్లస్ ను కలిస్తే ఈ మలుపులతో తాను సంతోషిస్తున్నానన్నారు. తాను ఎంచుకున్న వ్యక్తిని ఐ.ఎమ్.ఎఫ్ కూడా ఎంచుకున్నదని గర్వపడ్డారు. ‘కాంట్రాక్ట్ గురించి ఆందోళన వద్దు ప్రేమ్ చంద్, మేం వ్యక్తుల నైపుణ్యాల అభివృద్ధికి ఇన్వెస్ట్ చేస్తాం కాని వారు కేవలం మాకే పరిమితమై పోవాలని కోరుకోం. మీరు ఎప్పుడు వెళ్లాలో చెప్పండి. దానికి కావలసిన కాగితాలు సిద్ధం చేయమని అడ్మినిస్ట్రేషన్ చెప్తాను’ అని అన్నారు.

దాంతో నాకు చాలా సంతోషం కలిగింది. మా పిల్లల విద్యా సంవత్సరం పూర్తయ్యాక అంటే 1970 ఏప్రిల్లో ఇండియా నుంచి బయలుదేరి రాగలనని, నా అపాయింట్మెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ గూడేకు ఉత్తరం రాశాను. ఆయన దానికి అంగీకరించారు.

*****

 

ఈలోగా డగ్లస్ కు, ఫోర్డ్ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ కు మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆయన ఇండియా నుంచి వెళ్లిపోతారనే మాట వినిపించింది. అప్పుడు కూడా ఆయన ఇండియాలో పేదరికం గురించి, దాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ఏం చేయాలని ఆలోచించారు. ఆ ప్రాజెక్టు పేరు ‘ఎటాక్ ఆన్ పావర్టీ’. ఫౌండేషన్ లోని ప్రతి డివిజన్ తమ సబ్జెక్టు మీద పేదరికానికి సంబంధించి ఒక సమగ్రమైన పేపర్ ఇవ్వాలని ఆదేశించారు. భారత ప్రభుత్వానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి వెళ్లాలని ఆయన ఉద్దేశం.

1970 మొదటి మూడు నెలలు నేను ఈ ప్రాజెక్టు లోనే నిమగ్నం అయ్యాను. మరోవైపు రాష్ట్రాల్లో పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ సిస్టమ్స్ అమర్చడంలో సాయం చేశాను. కేంద్ర ప్రభుత్వ ఉపయోగార్థం ఒక శిక్షణ పుస్తకం రాశాను. అధికారులకు ఉపయుక్తంగా ఉండటం, సులువుగా అందుబాటులోకి రావాలన్నది ట్రైనింగ్ వాల్యూమ్ ఉద్దేశం. పేజీలు 100 లోపే. శీర్షిక పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ an introductory అనాలిసిస్. దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ ప్రచురించి అధికారులకు అందజేసింది.

 

ఆ సమయంలో మరో రెండు అనుభవాలు రాజకీయ నాయకుల మనస్తత్వాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి నాకు ఉపయోగపడ్డాయి.

మొదటిది జయప్రకాష్ నారాయణ్ ని కలవడం. ఆయన గొప్ప వ్యక్తిత్వం అంటే నాకెంతో గౌరవం. ఆయన నా చిన్నప్పటి రోల్ మోడల్. ఆదర్శపురుషుడు. 1948 లో కోస్తా ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన కొన్ని సమావేశాలకు వెళ్ళి ఆయన ప్రసంగాలు విన్నాను. డగ్లస్ ఆయనను ఫోర్డ్ ఫౌండేషన్ కు ఆహ్వానించారు, నన్ను ఆయనతో ఉండమన్నారు.

అనుకున్న సమయానికి జయప్రకాశ్ నారాయణ్ వచ్చారు. ఆయనతో పాటు మరో ఇద్దరున్నారు. ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి నేను, డగ్లస్. అంతే. మొత్తం అంతా కలిపి ఐదుమంది. రెండున్నర గంటల పాటు మేము ఆయన్ని అనేక ప్రశ్నలు అడిగాం. ఆయన సమాధానాలు అత్యంత జాగరూకతతో విన్నాం, దురదృష్టవశాత్తు ఆ చర్చ అంతా ఆఫ్ ది రికార్డ్.

జయప్రకాష్ నారాయణ్ ఎప్పట్లానే నెమ్మదిగా ప్రశాంతంగా నిరాడంబరంగా ఉన్నారు. భారత సమాజానికి సంబంధించి వివిధ అంశాల మీద తన అభిప్రాయాలు నిర్దిష్టంగా చెప్పారు. సమస్యల్ని ఆయనలాగా అర్థం చేసుకుని ప్రస్తావించే నేతలు అరుదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఉండవలసిన వ్యక్తి కాదు. ఆ తరహా పదవులు ఆయనకు తగవు.

ఆయన అంత సమయం ఫోర్డ్ ఫౌండేషన్ తో ఎందుకు వెచ్చించారు అనేది నాకు అంతుపట్టలేదు. Douglas ఆయనకు చిరపరిచితుడు. ఆ గౌరవంతో ఆయన పిలుపు మేరకు వచ్చారేమో మరి.

నేను చూసిన రెండో రాజకీయ సమావేశం శ్రీమతి ఇందిరా గాంధీది.

ఫోర్డ్ ఫౌండేషన్ కు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ కు మధ్య గాంధీ – మార్టిన్ లూథర్ కింగ్ ప్లాజా నిర్మాణం జరిగింది. దాన్ని జాతికి అంకితం ఇచ్చే సభ సెమి పబ్లిక్ ఈవెంట్. ఫోర్డ్ ఫౌండేషన్ ఉద్యోగస్తులు కాకుండా ఇంకొంతమందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. వారిలో ఇందిరాగాంధీ మేనత్త, వారి బంధువులు ఉన్నారు. ఆమెకు వారికి సయోధ్య అస్సలు లేదనేది బహిరంగ రహస్యం. నేను గమనించిన మేరకు ఆ కార్యక్రమం జరిగినంత సేపు ఇందిర కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ఫోర్డ్ ఫౌండేషన్ ను ప్రశంసలతో ముంచెత్తారామె. అదేసమయంలో వారి కార్యకలాపాలను ఇండియాలో తగ్గించాలంటూ ప్రచారం ఉధృతం చేశారు! తర్వాత కొద్ది వారాల్లో నేను ఇండియా వదిలేశాను నేను వెళ్ళిన రెండు రోజులకే డగ్లస్ కూడా ఇండియా నుంచి వెళ్ళిపోయారు. నా బాస్ కీలోచ్ మరో రెండు నెలల్లో ఇండియా వదిలి వెళ్ళిపోయారు.

వీడ్కోలు కానుకగా ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన కానుక ‘అటాక్ ఆన్ పావర్టీ’ బ్లూప్రింట్. దాన్నే ‘గరీబీ హటావో’గా అమల్లోకి తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. ఒక ఏడాది లోపల ఇండియా నుంచి ఫోర్డ్ ఫౌండేషన్ పూర్తిగా మాయం అయిపోయింది.

*****

 

అరిగపూడి ప్రేమ్ చంద్

2 comments

Leave a Reply to Aruna Pappu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Sir, you are making us wait too long. Please post regularly. We eager to know more about your life’s experiences. Regards

    • Many thanks. Experiences will come in the future sections .I am thankful for his curiosity.
      (Reply from Premchand garu)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు