జూలై10

మానస జన్మదిన సందర్భంగా

క్కడున్నావు హేమా!

 

ఎంతకీ స్పందించడం లేదు

నీ సమాధి పెట్టెలో

ఒక సెల్ ఫోన్ పెట్టినా బావుండేది

ఎప్పటికైనా

బదులిచ్చే దానివి కదాని భావిస్తూ

బాధపడుతూ వుంటాను

నువ్వు పరలోకంలో వున్నా

నా గుండె గడియారంలో

లోలకంలా కొట్టుకున్నట్లే

నాలోపలి  నీతో మాట్లాడుతుంటాను

 

రోజు

పెద్ద పాప పుట్టినరోజు

 

నాన్నా! అమ్మెక్కడుంది

అక్కడికి నన్ను తీసుకెళ్లమంటుంది

నిన్ను చూపిద్దామని

బంగారు తల్లిని భుజాన వేసుకొని

రాత్రికి రాత్రి ప్రయాణమై

ఎక్కడికెళ్లాలో తెలియక

ఏ దారిలో నీ జాడ కానరాక

ఊహారథం మీద

ఊర్ధ్వ లోకాలవైపు

ఉరకలు తీశాను

నక్షత్రాల కూడలి దాకా చేరాక

ఇప్పుడు ఎక్కడని వెదకాలి?

 

దేవ లోకానికి

దారెవరు చూపెడతారు

రూట్ మ్యాపు కూడా లేదు

 

ఓ దేవతలారా!

 

ఈ పుట్టినరోజు రాత్రైనా

అమ్మను అప్పజెప్పుతారా

 

ల్లి ఒడిలో

తెల్లవారుజాము దాకా

తనివి తీరా ఆడుకోనిస్తారా

చందమామ వెండి తల్లెలో

వెన్నెల బువ్వ తినిపిస్తారా

ఈ ఒక్క రాత్రికి  వరమిస్తారా

నా మనో నేత్రికి అమ్మ స్వరమిస్తారా?!

*

 

ఎండ్లూరి సుధాకర్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హేమ గారు
    శాశ్వతంగా దూరమయ్యాక
    సుధాకర్ గారు ఆవిడను తలచుకుంటూ
    ఎన్ని కవితలు రాసారో,అవన్నీ,చదూ తుంటె
    చెప్పలేని బాధ కలుగుతూంది.
    ఈ కవిత కూడా ,కూతురు పుట్టిన రోజున ,ఆమెను తల్లి లేని
    పిల్లగా చూడడం ఎంత బాధ కలుగుతూండొ ఈ కవిత చెబుతున్నది.

  • హేమలత అమ్మను ఆప్యాయత అనురాగం ఎప్పటికీ మర్చిపోలేను. ఎండ్లూరి సుధాకర్ సార్ గారి ప్రతి రచనలోనూ హేమలత మేడం గారి పైన మరచిపోలేని ప్రేమ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నిజంగా హేమలత మేడం గారు ఆప్యాయతతో పలకరించే అమ్మ

  • హేమలత గారంతటి ప్రేమైక మనిషిని కోల్పోవడం బాధకారమే. ఇవ్వాళ మానస పుట్టిన రోజు ఆవిడలేని లోతు బాగా కనపడుతుంది .

  • హేమలత గారు చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆవిడ లేని లోటు ….. ఈ రోజు మానస పుట్టిన రోజునాడు ఆవిదన్ ఆప్యాయంగా తలచుకొంటూ ….

  • ఆప్యాయత అనురాగాలకు చిరునామ హేమలత మేడమ్ గారు..

    చిరునవ్వుతో పలకరించే ఆ తల్లి (మేడమ్ గారు) కళ్ల ముందు కదలాడుతునె వున్నారు అనిపిస్తూంది…

    గురువు ఎండ్లూరి సుధాకర్ గారు.. ఆ తల్లి(మేడమ్) పై రాసిన వారి ప్రేమ బంధాన్నీ తెలిపే కవితలన్నీ ఈ భూమండలంపై ధ్వనిస్తూనె వున్నాయి..

    మనసు నీరవ్వుతూనే వుంది…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు