తలారి ఆత్మఘోష

నేనొక తలారిని

విధికి బద్ధుడిని…

 

నిశీధి   కనురెప్పలమాటున

నల్లటి కలల మధ్య

కలత నిద్ర నా శాశ్వత చిరునామా…

 

ఉరికొయ్యే నా నిత్య సహచరి

ప్రతి నిమిషం

మృత్యువుతో నా అనుబంధం…

 

కాలం నా గుండెపై కాలుమోపి

ప్రతి  ఊపిరినీ  నా చేతిలో ఉంచుతుంది…

 

తప్పో, ఒప్పో,

న్యాయమో, అన్యాయమో

ఉరి శిక్ష నిర్ణయమయ్యాక

రేపటి సూర్యుడిని చూడని ప్రాణం

నా చేతుల్లోనే నిశ్చలమవుతుంది…

 

చీకటి తెర తొలగక ముందే

మృత్యు నాటకానికి రంగం సిద్ధం

నా కర్తవ్యం ఒక నిశ్శబ్ద యుద్ధం…

 

తాడు మెడకు తగిలించే ముందు

మెడ చుట్టూ మైనం ముద్దను చిక్కగా రుద్ది

ఓదార్పు పూత పూస్తాను…

 

శరీర బరువుకు తగ్గట్లు

తాడు పొడవును కొలుస్తాను

ప్రతి అడుగులో లెక్క

ప్రతి ముడిలో వేదన…

 

ఉరితాడు బిగించిన ప్రతిసారీ

నా గొంతు కూడా బిగుసుకుపోతుంది

అప్రయత్నంగా,తెలియని భయంతో…

 

అధికారి కనుసైగతో మీట నొక్కగానే

పెళపెళమని విరిగిన మెడపూసల చప్పుడు

నా కర్తవ్యం పరిపూర్ణమైందన్న రుజువు…

 

ఆ క్రూర అనాహూత శబ్దం

నా ఆత్మ ఘోషకు పరాకాష్ట!

 

ప్రాణం లేని దేహాన్ని చూసినప్పుడల్లా

మూగరోదనతో నా ఆత్మ

కన్నీటి ధార అవుతుంది

గొంతు కోసిన కోడిపిల్లలా

అంతరాత్మ అల్లాడుతుంది…

 

శిలువ మోసిన క్రీస్తు గుండెల్లో

క్షణ క్షణం సలపరించినట్టు

మేకులు గుదిబండలవుతాయి

చిరిగి వేలాడే పుటనవుతాను…

 

పాపపుణ్యాల మధ్య,

న్యాయాన్యాయాల మధ్య

నిలిచిన నేను

ప్రతి మరణ విషాద కావ్యంలోనూ

సగం చిరిగి వేలాడే పుటను…

 

తలారిగా నేను

మృత్యువుకు సాక్షిని…

 

ఆత్మశాంతికి నోచుకోని

“జెనైడా మాక్రోరా” వలె

నేనొక ఆత్మహత్య చేసుకున్న తలారిని…

 

బతికున్న శవాన్ని!

రాత్రి పగలు ఏడ్చే శిలను!

నా మనసు వేదనకు ఆలయం…

 

ఉరి తాడుతో

మనిషి ప్రాణం తీయడమంటే

కళ్ళముందే ఎదిగిన చెట్టును

స్వయంగా నరికేయడమే!

 

ఒక జీవించే ప్రతిధ్వనిని నేను

నేనేం చేశానని ఈ శిక్ష నాకు?…

(ప్రముఖ కథకులు బద్రి నర్సన్ కథ ‘ఈ శిక్ష మాకొద్దు’ చదివాక)

విల్సన్ రావు కొమ్మవరపు

15 comments

Leave a Reply to విల్సన్ రావు కొమ్మవరపు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రతి మరణ విషాద కావ్యంలోనూ

    సగం చిరిగి వేలాడే పుటను…

  • ఒక తలారి మానసిక సంఘర్షణ ను చాలా సంవేదన తో చిత్రించారు కవి విల్సన్ రావు గారు.

    • ధన్యవాదాలు మేడం గారు

    • ధన్యవాదాలు డాక్టర్ గారు

  • నేనేమి చేసానని ఈ శిక్ష నాకు? వారి కర్మే తలారిని చేసింది. విధి( కర్మచే శిక్ష పడిన వాడు) ఊరువేయబడ్డ ఊపిరిని తలారిచేతిలో ఉంచుతుంది. తలారి హృదయం అర్థం చేసుకొని రాసిన జీవించే కవిత.

    • ధన్యవాదాలు ప్రసాద్

  • విల్సన్ సోదరుడి కవిత చదివాక మనసంతా ఆర్థ్రతతో నిండిపోయింది,మాటలతో చెప్పలేను 🙏

    • ధన్యవాదాలు మిత్రమా

  • తలారి ఆవేదన కళ్ళకు కట్టినట్లు అక్షరాల్లో చూపించారు…
    🙏🙏🙏🙏🙏

    • ధన్యవాదాలు బాబూరావు గారు

  • తలారి ఆత్మసోధనగా 1973 లో పరిమళా సోమేశ్వర్ కథ “ఉరి”ని చదివి ఆశ్చర్యపోయాను.మళ్ళీ ఇన్నాళ్ళకు మీ కవితే అనుకుంటాను.ఇంతకు ముందు కవిత్వంలో ఏదీ వచ్చినట్లు లేదు.అరుదైన అంశంతో ఆద్యంతం హత్తుకునేలా రాసారు.అభినందనలు విల్సన్ రావు గారూ

    • ధన్యవాదాలు మేడం గారు

  • కవిత మొత్తం మానవీయతకై పెనుగులాట. వృత్తి చట్టబద్ధమే కానీ చూస్తూ చూస్తూ ప్రాణం తీయటానికి మనసు ఒప్పుకోని వేదన కవిత్వం నిండా ఉన్నది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు