నేనొక తలారిని
విధికి బద్ధుడిని…
నిశీధి కనురెప్పలమాటున
నల్లటి కలల మధ్య
కలత నిద్ర నా శాశ్వత చిరునామా…
ఉరికొయ్యే నా నిత్య సహచరి
ప్రతి నిమిషం
మృత్యువుతో నా అనుబంధం…
కాలం నా గుండెపై కాలుమోపి
ప్రతి ఊపిరినీ నా చేతిలో ఉంచుతుంది…
తప్పో, ఒప్పో,
న్యాయమో, అన్యాయమో
ఉరి శిక్ష నిర్ణయమయ్యాక
రేపటి సూర్యుడిని చూడని ప్రాణం
నా చేతుల్లోనే నిశ్చలమవుతుంది…
చీకటి తెర తొలగక ముందే
మృత్యు నాటకానికి రంగం సిద్ధం
నా కర్తవ్యం ఒక నిశ్శబ్ద యుద్ధం…
తాడు మెడకు తగిలించే ముందు
మెడ చుట్టూ మైనం ముద్దను చిక్కగా రుద్ది
ఓదార్పు పూత పూస్తాను…
శరీర బరువుకు తగ్గట్లు
తాడు పొడవును కొలుస్తాను
ప్రతి అడుగులో లెక్క
ప్రతి ముడిలో వేదన…
ఉరితాడు బిగించిన ప్రతిసారీ
నా గొంతు కూడా బిగుసుకుపోతుంది
అప్రయత్నంగా,తెలియని భయంతో…
అధికారి కనుసైగతో మీట నొక్కగానే
పెళపెళమని విరిగిన మెడపూసల చప్పుడు
నా కర్తవ్యం పరిపూర్ణమైందన్న రుజువు…
ఆ క్రూర అనాహూత శబ్దం
నా ఆత్మ ఘోషకు పరాకాష్ట!
ప్రాణం లేని దేహాన్ని చూసినప్పుడల్లా
మూగరోదనతో నా ఆత్మ
కన్నీటి ధార అవుతుంది
గొంతు కోసిన కోడిపిల్లలా
అంతరాత్మ అల్లాడుతుంది…
శిలువ మోసిన క్రీస్తు గుండెల్లో
క్షణ క్షణం సలపరించినట్టు
మేకులు గుదిబండలవుతాయి
చిరిగి వేలాడే పుటనవుతాను…
పాపపుణ్యాల మధ్య,
న్యాయాన్యాయాల మధ్య
నిలిచిన నేను
ప్రతి మరణ విషాద కావ్యంలోనూ
సగం చిరిగి వేలాడే పుటను…
తలారిగా నేను
మృత్యువుకు సాక్షిని…
ఆత్మశాంతికి నోచుకోని
“జెనైడా మాక్రోరా” వలె
నేనొక ఆత్మహత్య చేసుకున్న తలారిని…
బతికున్న శవాన్ని!
రాత్రి పగలు ఏడ్చే శిలను!
నా మనసు వేదనకు ఆలయం…
ఉరి తాడుతో
మనిషి ప్రాణం తీయడమంటే
కళ్ళముందే ఎదిగిన చెట్టును
స్వయంగా నరికేయడమే!
ఒక జీవించే ప్రతిధ్వనిని నేను
నేనేం చేశానని ఈ శిక్ష నాకు?…
(ప్రముఖ కథకులు బద్రి నర్సన్ కథ ‘ఈ శిక్ష మాకొద్దు’ చదివాక)
ప్రతి మరణ విషాద కావ్యంలోనూ
సగం చిరిగి వేలాడే పుటను…