తలక్రిందుల తెలుగు కథ

తలక్రిందుల తెలుగు కథ

(ఆటా సాహిత్య సదస్సు ప్రసంగ పాఠం కొనసాగింపు వ్యాసం)

తెలుగు కథని ఇష్టపడేవారు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. ఏడాదికి సుమారు రెండు వేల పైచిలుకు కథలు (2021) వస్తున్నాయని ఒక అంచనా. ఎన్నో కథలు వచ్చినా, మంచి కథలని ఎంచుకోవడం పాఠకులకి ఎప్పటికీ సమస్యే. ఏ సాహిత్యమైనా మనగలగాలంటే వాటిపై సమీక్షలు అవసరం. రచనలపై సమీక్షలు, రచయితలతో ముఖాముఖీ వంటి శీర్షికలు ఇటు రచయితకీ, అటు పాఠకుడుకీ మధ్య వారధిగా ఉపయోగపడతాయి. మనకి రచనల కొరత లేకపోయినా, ప్రస్తుత తెలుగు కథా ప్రక్రియ ఆశించిన విధంగా లేదని ఎవరైనా అంగీకరించే విషయం. ప్రస్తుత కథా సాహిత్యం తీరు తెన్నులపై నా పరిశీలనలు, సూచనలూ  ఈ వ్యాసంలో పంచుకుంటాను.

తెలుగు కథా సాహిత్యంలో ఎవరిని అడిగినా మంచి కథలు రావట్లేదని ఏకగ్రీవంగా అంగీకరిస్తారు.  మంచి కథలు ఎందుకు రావట్లేదు? తమ రచనలపై పాఠకుల స్పందన రచయితలకి ఎంతో అవసరం, తద్వారా, తమ రచనలని  మెరుగుపరచుకునే అవకాశం ఎక్కువ. సమీక్షకులు ఒక అడుగు ముందుకేసి, విశ్లేషిస్తే రచయితలకి ఎంతైనా ఉపయోగకరం. ఆయా రచనలని కొనియాడితే సంతోషించని రచయితలు ఉండరు; అవే వారి కొత్త రచనలకి ప్రేరణ కలిగిస్తాయి. పత్రికలు మనగలగాలంటే రచయితలు అవసరం;  ఆలాగే, రచయితలకి పత్రికల నుండి ప్రోత్సాహం కూడా అంతే అవసరం.  ఇటువంటి వాతావరణం ప్రస్తుత సాహిత్య రంగంలో కొరవడిందని నిర్భయంగా చెప్పవచ్చు.

ఎంత తలమాసిన రచయితలకైనా తగినంత గుర్తింపు లేకపోతే సాహిత్యానికి దూరంగా ఉండడం గమనిస్తూనే ఉన్నాము. కొత్త రచయితలకి తగినంత ప్రోత్సాహం అందడం లేదని ఇంకో ఆరోపణ. అయినా కొందరు రాస్తూనే ఉన్నారు. తెలుగు సాహిత్యంలో సోషల్ మీడియా ప్రభావం వలన, రచయితలు సమూహాలు ఎక్కువయ్యాయి. ఏదో ఒక సమూహంలో చేరడం రచయితలకి అనివార్యమయ్యింది. ఈ సమూహాల వలన ఉపయోగాలు ఉన్నా, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమూహల వలన కథా సాహిత్యం ఎక్కువ మందికి చేరే అవకాశమున్నా, వేరే సమూహాలకి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. సమూహానికి చెందితే వారి కథ నాలుగు లైకులతో కంచికి చేరుతుంది. లేదంటే, ఆ కథలు ఎక్కడో అట్టడుగున మిగిలిపోతాయి.

ప్రస్తుత సాహిత్య వాతావరణంలో, సంపాదకులు నచ్చితే ప్రచురిస్తున్నారు తప్ప వెంటపడి రాయించే సంపాదకులు అరుదుగానే ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. బ్రాండింగ్ సరుకులకే కాదు, సాహిత్యానికీ కూడా అవసరం. ఉత్తమ కథ నిలబడాలంటే మంచీ చెడూ తెలియజేసే సమీక్షకులు కావాలి. ఈ సమీక్షకులకు కూడా సమూహాలు ఉండడం పెద్ద బెడదగా పరిణమించింది. అందువలన, ఏ కథ మంచిది? ఏది కాదు?  అన్నది, పాఠకులకి సమస్యగా మారింది. సత్తులేని కథలని ఆకాశానికి ఎత్తెయ్యడంతో పాఠకులు అయోమయానికి గురవుతున్నారు. అందువలన, సాహిత్యానికి మెల్లగా దూరమవుతున్నారు. వీరే మంచి కథలకి దూరమయ్యే అవకాశం కూడా మెండుగా ఉంది. ఇది కేవలం కథా సమీక్షలు, పుస్తక పరిచయాలకే కాదు, సాహిత్య విమర్శకి కూడా ఇదే పరిస్థితి (దుస్థితి) ఆవరించింది.

ప్రస్తుతం, మన సాహితీ సభలు సన్మానాలకి, రీసైకిల్ ప్రసంగాలకి పరిమితమయిన ప్రదర్శన కళగా మారాయి. సాహిత్యంపై దృష్టి పెట్టే అభిరుచి గల నిర్వాహకులు అరుదుగా కనిపిస్తున్నారు. చప్పట్లకి, సన్మానాలకీ రచయితలు బానిసలు అవుతున్నారు. ఈ సభల వలన ఇటు రచయితలకి, కానీ అటు ప్రేక్షకులకీ ఏ రకమైన ప్రయోజనం చేకూరడంలేదు. ఫోటోలకి, వార్తలకీ ఈ సభలు పరిమితం అయిపోతున్నాయి. వీటి వలన సాహిత్యాభిమానులు సభలకి దూరంగా మసలుతున్నారు. ఇవన్నీ ఒక మొక్కుబడి ప్రహసనంగా మారుతున్నాయి.

సాహిత్య సభల వరకూ ఇలా ఉంటే, పుస్తక ప్రచురణ మరో పెద్ద ప్రహసనంగా మారింది. రచయితలు తమ రచనలు వారే పుస్తకాలుగా ప్రచురించే ఒక దుస్థితి దాపరించింది. అంతే కాదు, వారే అమ్ముకోవడం (అంటగట్టడం) సర్వసాధారణం అయిపోయింది. ప్రముఖ ప్రచురణ సంస్థలు కూడా రోజుకో పుస్తకం ప్రచురిస్తున్నాయి. వారు వేసిన పుస్తకాలు ఏమవుతున్నాయి? ఎవరి  పని వారు చేసుకుంటున్నారు తప్ప తమని దాటి, తమ సమూహాన్ని దాటి, కేవలం కథకి కట్టుబడి పనిచేసే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు.

కోవిడ్ వచ్చి కథలకి కొత్త రూపు తెచ్చింది–అవి కథా పఠన కార్యక్రమాలు.

ప్రతి కథా వినడానికి బావుండదు. కొన్ని కథలు ఏకాగ్రతతో,  సాంతం చదువుకోవాలి. 

కథలో నిమగ్నం కావాలి.

కొన్ని కథలు వినడానికి కూడా బాగుంటాయి. చక్కటి గొంతుతో, హావభావాలు ధ్వనించేలా చదివితే శ్రోతలకు జనరంజకంగా ఉంటుంది.

ఏ కథ పఠనా యోగ్యం, ఏది కాదు అన్నది కథా ప్రక్రియతో అనుభవం ఉన్నవారికి ఇట్టే తెలుస్తుంది.
ఈ మౌలిక సూత్రాలు పట్టించుకోని కొన్ని కార్యక్రమాలు, కేవలం వీరతాళ్ళ కోసం తాపత్రయపడుతూ,  ప్రక్రియని ప్రహసనంగా మార్చాయి. వీటి వలన కొత్త శ్రోతలను తయారుచేయడం, కథా సాహిత్యం పట్ల అవగాహన పెంచడం వంటి ప్రయోజనాలు చేకూరవు.  

ఇవి మంచి కథలని పాఠకులకి చేరువ చెయ్యాలి తప్ప అంకెల గారడిలా మిగలకూడదు.

పొరపాటున సాహిత్యాభిమానులెవరైనా, సమీక్షల బాధ్యత తీసుకుని, మెచ్చుకోళ్ళు లేకపోతే రచయితలు తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారు. పొగడ్తలు అందరికీ నచ్చుతాయి, కానీ పట్టించుకోని రచనల కంటే వాటిపై వచ్చే విమర్శ మెరుగని రచయితలు గ్రహించే పరిస్థితి లేదు. అసలే ఏ మెప్పూ దక్కని ప్రయాస, దానికి తోడు ఈ వాదవివాదాలు ఎందుకని సమీక్షకులు వెనక్కి తగ్గిపోతున్నారు.

అభిరుచి గల నిర్వాహకులు, సమీక్షకులు మంచి కథకి తమ ముద్ర వేసి చదవమని పాఠకుడికి భరోసా ఇస్తారన్న చిన్న విషయాన్ని రచయితలు గ్రహించలేకపోతున్నారు. ఈ సమీక్షకులు, విమర్శకులే సాహిత్య ప్రచారానికి వెన్నుముకని రచయితలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రచన ప్రచురితమయిన తర్వాత, ఆ రచన పాఠకుల సొత్తని రచయితలు గ్రహించినపుడే సాహిత్య పరిపుష్టి ఏర్పడుతుంది. ఈ చిన్న విషయాన్ని రచయితలూ గ్రహిస్తే సాహిత్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు.

ఈ పరిస్థితి నుండి బయట పడే దారులు లేవా? అంటే, ఉన్నాయి. దీనికి పత్రికా సంపాదకులు, రచయితలు, సమీక్షకులూ, విమర్శకులూ  సామూహికంగా పనిచేయాల్సిన అవసరం వుంది.

అయితే, జరగాల్సింది ఏమిటి?

డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ గత పాతికేళ్లుగా  సాహితీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవి సుపరిచితమైన సాహితీ సభల్లా కాకుండా పుస్తకాలని లోతుగా విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణలో రచయితలని కూడా భాగస్వాములని చేస్తారు. దీని వలన అటు పాఠకులకి, ఇటు రచయితలకీ, ఆయా రచనల పట్ల  విశేషమైన అవగాహన కలిగే అవకాశం ఎంతైనా ఉంది.

అలాగే, హైదరాబాద్ లో అనిల్ అట్లూరి నిర్వహించే వేదిక కార్యక్రమంలో కథలని, పుస్తకాలని కూలంకుషంగా విశ్లేషిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని వస్తే అటు పాఠకులకి, ఇటు రచయితలకీ ఉపయోగకరం.

ఇవే కాకుండా, రమణమూర్తి వంటి కథా సమీక్షకులు ఫేస్‌బుక్‌లో నాలుగేళ్ల పాటు వారికి నచ్చిన కథలని కథా శీర్షిక  ద్వారా పరిచయం చేసారు. ఈ కార్యక్రమం, కొంత వెలితిని తీర్చింది. మూడు నెలల పాటు వచ్చిన వందల కథలు చదివి పాతిక చదవదగ్గ కథలని విశ్లేషించేవారు, వివరాలు సూటిగా ఉండేవి, వీలైనంత వరకూ వెబ్ లింక్ కూడా ఇచ్చేవారు. అంత ఉపయోగమైన శీర్షిక మరలా కనిపించలేదు.

ఇటు రచయితలు కూడా, తోటి రచయితల కథల పట్ల అభిప్రాయాలూ కేవలం పుస్తకంలో ముందుమాటలకే పరిమితం కాకుండా, వేరే మాధ్యమాల ద్వారా  తమ అభిప్రాయాలు విరివిగా పంచుకోవాలి. రచయితలు కూడా నేను-నా రచన-నా గుర్తింపు దాటి ఎవరి కథైనా, ఎటువంటి కథైనా, ఏ వాదమైనా, సరైన ప్రమాణాలని తాకి, మంచి కథ అనిపిస్తే నలుగురికి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.  పరోక్షంగా చదువరులని పెంచాలి. అంతా కథా స్థాయి ఉన్నతమవుతుంది.

ఇది ఏ ఒక్కరి పనీ కాదు.

ఈ సత్ప్రచారంలో అంతా సమాన భాగస్వాములు.

అసలు మన పాఠకులు ఎవరు? పత్రికల బాధ్యత కేవలం రచనల ప్రచురణ వరకే పరిమితమా? కొత్త సంచిక వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో తెలియజేయడంతో వారి బాధ్యత ముగుస్తుందన్నట్లుగా కనిపిస్తోంది. తరచుగా వచ్చేవారు ఎలాగూ వస్తారనే ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ఇంకా పాఠకుడే సాహిత్యాన్ని వెతుక్కుంటూ వస్తాడనే భ్రమలో ఉంటున్నారనిపిస్తోంది.

కొత్త పుస్తకాల పరిచయం ద్వారా పాఠకులకి దగ్గర అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సృజనకి తగ్గ ప్రతిఫలం పాఠకులు మాత్రమే ఇవ్వగలరు.  మన పత్రికలు ఇంకా పాతబడిన పనిముట్ల దగ్గరే (వెబ్సైటు) ఉన్నాయి. కొత్త తరహా ప్రచార సాధనాలని ఉపయోగించుకోకపోవడం వలన చదవడం అంటే ఆసక్తి ఉన్నవారిని పూర్తిగా చేరుకోలేకపోయారు.

వీరు ఇలా ఉంటే, ప్రచురణా సంస్థల తీరు మరోలా ఉంది. రోజుకో పుస్తకం అచ్చు వేస్తున్నారు. పుస్తకాల పండగలకి, లేదా తాము ప్రచురించిన పుస్తక రచయితకి ఏదైనా పురస్కారం వంటి ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప హడావిడి చేసిన దాఖలాలు కనిపించడం లేదు.

పాఠకుడు, ఓ మంచి పుస్తక సమీక్ష చదవగానే వెంటనే పుస్తకం చదవాలని అనుకుంటాడు. కానీ కొనే సదుపాయం ఉండకపోవడంతో సమీక్ష  ముఖ్య ప్రయోజనం నిరర్థకం అవుతుంది.

పాఠకులు అంటే తెలుగు వారు మాత్రమే కానక్కర్లేదు, భాషేతరులు కూడా కావచ్చు. మనకీ గొప్ప కథకులు ఉన్నారు; మరి వారి సాహిత్యం ఇతర భాషల్లోకి ఎందుకు వెళ్ళలేదు. నేను మాట్లాడేది మనకి మనం చేసుకునే అనువాదాలు కాదు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్, హార్పర్ కొలిన్స్ వంటి పెద్ద సంస్థలు మన వెంట ఎందుకు పడట్లేదు? ఉదాహరణకి, సాహిత్య అకాడమీ గౌరవం దక్కిన మన పుస్తకాలు అక్కడే ఎందుకు నిలిచిపోతున్నాయి.

ఈ సమస్య(లు) తెలుగువారికి మాత్రమే అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్యన తమిళంలో వచ్చిన మంచి పుస్తకాలు ఏమిటవి గూగుల్ చేస్తే, ఠకీమని జవాబు వస్తుంది. అదే తెలుగులో  ప్రయత్నించి చూడండి. దాని జవాబు మనందరికీ తెలుసు.

ఈ జాల పత్రికలని కూడగట్టి ఒకచోట చూపే అగ్రిగేటర్ ఆప్ అవసరం ఉంది (ఆపిల్ న్యూస్ వంటిది). పిల్లా పెద్దా తేడా లేకుండా అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. వారి దృష్టిలో పడాలంటే ఆదరణ పొందిన కథలూ, కథా సంకలనాలని తెలియజేసే సందేశాలు నేరుగా అరచేతిలోకి రావాలి. ప్రచురణకర్తల సమూహాలూ, పత్రికాసంపాదకుల సమూహాలూ నడుం కట్టి, సమిష్టిగా ప్రయత్నమేదో చెయ్యాలి.  ఉదాహరణకి, ఆదరణ పొందుతున్న “న్యూ యార్క్ టైమ్స్ – బెస్ట్ సెల్లర్” వంటి పుస్తకాల పట్టీని తెలియజేయాలి. పోటీ ఉన్నపుడే రచనలు పెరుగుతాయి, నాణ్యత పెరుగుతుంది.

తెలుగు కథకి పాఠకులే కాదు శ్రోతల అవసరం కూడా ఉంది. ముఖ్యంగా తెలుగు చదవడం రాని వారికి, చదివే తీరిక లేని వారికి హర్షణీయం ఆడియో మంచి ప్రయత్నం. గొప్ప కథలని చిరు పరిచయంతో పాటు చదివే తీరు శ్రోతలని తప్పక ఆకట్టుకుంటుంది. అందరికీ సుపరిచితమైన స్పాటిఫై ఆప్‌ని వినియోగించడం ద్వారా టెక్నాలజీ పరంగా కథకు కొత్త త్రోవని చూపారు.

కొప్పర్తి రాంబాబు, స్వాతి పంతుల, హరిత భండారు, హర్షణీయం అనిల్ కుమార్   వంటి ఇంకా ఎందరో తెలుగు కథలని ఆడియో రూపంలో యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు. వాట్సాప్ ద్వారా  ఎందరికో కథా రచనలని చేరవేస్తున్నారు.

ఇంగ్లీష్ చదువుల వలన తెలుగు చదవడం తగ్గింది.

మరి అదే సమస్య ఉన్న తమిళం, కన్నడ బాషల రచనలకి ఎందుకు ఆదరిస్తున్నారు? అక్కడ ఆనంద వికటన్, కల్కి, మయూర, సుధ వంటి అచ్చు పత్రికలు ఇంకా ప్రచురిస్తున్నారు. అసలు ఇంగ్లీష్ బెడద కాదు, గొప్ప అవకాశమని తమ ఇంగ్లీష్ అనువాదాలతో జయమోహన్, వివేక్ షాన్బాగ్, వసుధేంద్ర జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుని చూపించారు. ఉత్తమ సాహిత్యం అతి కొద్దిమందికి చేరుతుందనేది ఒక అపోహ అని ఈ రచయితలు నిరూపిస్తున్నారు. జయమోహన్ ప్రసిద్ధ వ్యక్తులపై రాసిన ఆరం రెండు లక్షల కాపీలు, వసుధేంద్ర పుస్తకాలు ఎనభై వేలకి పైగా పుస్తకాలు అమ్ముడయ్యాయి. తెలుగులో వంద పుస్తకాలు అమ్మితే పండుగ చేసుకునే పరిస్థితి.

ఈ పరిస్థితి మారాలంటే, రచయిత కథలో ప్రత్యేకత ఉండాలి, కథా వస్తువు ఎక్కువ శాతం పాఠకులని తాకేలా ఉండాలి. ముఖ్యంగా, యువతని ఆకర్షించాలంటే సమకాలీన అంశాలని కొత్తగా చూపే కథకుల అవసరం ఉంది. సార్వత్రిక, సర్వకాలీన అంశాలు ఉంటే రీడబిలిటీ పెరుగుతుంది. పుస్తకంపై రచయిత పేరు చూడగానే పాఠకుడు ఉత్సాహపడే జనరంజమైన సాహిత్యం రావాలి.

మనకి కథా సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసినవారు ఉన్నారు. ప్రక్రియకి అంకితమైనవారు. కథా ప్రముఖులుగా అందరికీ చిరపరిచితులు. వారి కథలూ, వ్యాసాలూ రచనలు, సామాజిక మాధ్యమాల పోస్టులుతో ఎన్నో తెలియని అంశాలని పంచుకుని రంజింపజేస్తారు, అబ్బురపరుస్తారు, లోతైన వ్యక్తీకరణతో కదిలిస్తారు. నిస్సందేహంగా, ఈ అరుదైనవారు, మన ఉమ్మడి ఆస్తి.

అయితే, ఈ కథా ప్రముఖుల విరహ వేదన ఎంతకీ తీరదు. వీరు పాత తరపు కథలని వదిలి రారు. ఇంకా శ్రీపాద, బుచ్చిబాబు, రావిశాస్రి దగ్గరే ఉంటారు. ప్రపంచ కథ చదువుకున్నవారు,  కాఫ్కా, చెహోవ్, హెమింగ్వే అని పలవరిస్తారు తప్ప సమకాలీన రచనల గురించి మాట్లాడరు. అద్దంలో తమని తాము చూసుకుని మురిసినట్టు, వీరి రాతల్లో కొన్ని వాక్యాలు అద్దం పెంకులుగా మెరుస్తాయి. కానీ, మాములుగా అనిపించే ఇతర రచయితల కథలని ఇంధనంలా వాడుకుని, కసిగా తెగనాడతారు. అది సరైన ధోరణి కాదు. ఇది సాహితీ క్లాసిజం.

ఎక్కడో ఇరుకు సందుల్లో తచ్చాడుతూ, రష్యా చలిని, ఆకలి రాత్రులని తలచుకుంటూ చేసే రచనలు ఈ సాహితీవేత్తలకి సరిపడవు. వెలుగులోకి వచ్చి, నలుగురినీ కలుపుకోవడం ఒక బాధ్యత. వీరిపై ప్రక్రియని ముందుకు నడిపిస్తారనే కనిపించని భారం ఉంది. వీరు పూనుకుని యువ రచయితలకి, ఔత్సాహికులకీ కథా శిల్పం, శైలి పట్ల అవగాహన పెంచాలి, పెద్దరికం వహించాలి.

మనం మాట్లాడుకోని తెరచాటు వాదం కొన్ని ప్రముఖ పత్రికలలో కనిపిస్తుంది. పైకి సముచితంగా కనిపించినా, పొరలు వలిస్తే, మేము చెప్పిందే ప్రామాణికమనే ధోరణి అణువణువునా కనిపిస్తుంది. కంటెంట్‌తో ఎవరికీ పేచీ లేదు, టోన్‌తోనే ఇబ్బంది. ఎందుకంటే, పాఠకుడు పాఠాలు వినడానికి రాడు, వినోదం కోసం వస్తాడు. పత్రిక తెరవగానే సందడిగా అనిపించాలి, కొత్తదనం ఉండాలి తప్ప పాత వాసనల పెంకుటిల్లులా ఉండకూడదు. ఆ రకంగా చూస్తే, రీడబిలిటీ పరంగా, ఓ మోస్తరు సాహితీ విలువలు పాటించే అస్తిత్వ సాహిత్యం ఎన్నో రెట్లు మెరుగు.

సంపాదకులు అంటే రచనలని ప్రోగుచేసేవారని కాదు. పత్రికని, తద్వారా, కథా సాహిత్యం దిశని నిర్దేశించే దిక్సూచి. కథా సాహిత్యానికి తగినంత సమీక్ష, పరిచయం, చర్చ వంటి విలువని పెంచే ప్రక్రియలని ప్రోత్సహించాలి. ప్రతిభావంతుల వెంటపడి రాయించాలి. ప్రచురణా సంస్థలతో కలిసి సాహిత్యాన్ని మొహమాటపడకుండా, విస్తృతంగా సత్ప్రచారం జరపాలి.

****

మధు పెమ్మరాజు

మధు పెమ్మరాజు నివాసం హ్యూస్టన్ దగ్గరలోని కేటీ నగరం. శీర్షికలు, కధలు, కవితలు రచించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి హాబీలు. వీరి రచనలు కౌముది, కినిగే, ఆంధ్రజ్యోతి, చినుకు, వాకిలి, సారంగ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆధునిక కథ నాలుగురోడ్ల కూడలి లో అనాథ.
    సమగ్రమైన వ్యాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  • Writers readers and publishers
    sameekshakulu andari gurinchi yadhaatadhamgaa chakkagaa vivarinchaaru .
    Dhanyavadaalu
    Annapurna .

    • అన్నపూర్ణ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు!

  • కంటెంట్‌తో ఎవరికీ పేచీ లేదు, టోన్‌తోనే ఇబ్బంది. ఎందుకంటే, పాఠకుడు పాఠాలు వినడానికి రాడు, వినోదం కోసం వస్తాడు. పత్రిక తెరవగానే సందడిగా అనిపించాలి, కొత్తదనం ఉండాలి తప్ప పాత వాసనల పెంకుటిల్లులా ఉండకూడదు.

    చాలా బాగుంది, అన్ని వైపులనుంచి రుబ్బి పడేసారు.

  • To whom ever it may concern
    It was a wonderful analysis,frank discussion and criticism of the existing Telugu literature
    The suggestions offered by the author are highly relevant and helpful to the writers if they are interested and magnanimous enough to take with a grain of salt
    Writers should be aware of the importance of various trends occurring in this technological world
    Author,s point is well taken about
    How the other languages are way eccabetter than us
    All would be writers will be better off
    If they pay attention to author,s suggestions
    If possible I would like to know authors,s email or phone number
    (Only if acceptable to author)
    Thanks all the best

  • ఇప్పుడున్న పరిస్థితులలో ప్రింట్ మీడియా మీద ఆశ వొదులుకొని, వెబ్ మేగజైన్‌లపై దృష్టి పెట్టడమే ఉత్తమం అనిపిస్తోంది. రచయితలు తగినంతగా (తెలుగేతర భారతీయ+ అంతర్జాతీయ సాహిత్యం) చదవకపోవడం, చర్చించకపోవడం ఒక పెద్ద లోపం. ప్రపంచం, సమాజం చాలా తొందరగా మారిపోతున్నవి. ముందుతరం (50+) వారి అవగాహనా విస్తృతి పెరగడంలేదు. యువతరం ఓటీటీ, సినీమా రంగాల ప్రభావంలో మునిగితేలుతున్నది. తెలుగులో రచనా ప్రక్రియలన్నీ వెనుకంజ వేశాయి. ఇతర భారతీయ భాషల్లో ఇది సమస్య కాదనుకుంటాను. (ఎంచేత?). ఈ అభిప్రాయాలకు మినహాయింపులు ఉంటాయి. కాదనను. చర్చను లేవనెత్తినందుకు ధన్యవాదాలు!

    • సుధాకర్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరన్నట్టుగా, మినహాయింపులు తప్పకుండా ఉంటాయి.

  • మధు గారూ,
    అద్భుతమైన వ్యాసం.
    ప్రస్తుత రచనా రంగం లో పరిస్ధితు లను నిశితంగా పరిశీలించి, నిర్మాణాత్మకంగా విశదీకరించారు..
    ఒక వక్తకు చప్పట్లూ, ఒక గాయకుడికి శ్రోతల తలలూపి తాళాలూ, ఒక రంగస్థల నటుడికి వన్సుమోర్లూ కళ్ళెదుట కనబడి. వెంటనే ప్రోత్సాహాన్నిస్తాయి.
    ఒక కధా రచయితకు… తన కధను ఓపిగ్గా చదివి, తీరిగ్గా ఆస్వాదించి,కధలో తన వెంట ప్తయాణించి…. తన అభిప్రాయాన్ని తెలిపే పాఠకుడే తన కలానికి బలం.
    మీ వ్యాసం లో చదువరి, సంపాదకుడు, సమీక్షకుడూ, విమర్శకుడూ… అందరి పాత్రలనూ వివరంగా గుర్తు చేశారు.
    మంచి విశ్లేషణాత్మకమైన రచన చదివిన త్రృప్తి కలిగింది.

  • తెలుగు కథ నిజంగా తలకిందులైందా?
    (Condemning Madhu Pemmaraju’s Article)

    “తెలుగు కథా సాహిత్యంలో ఎవరిని అడిగినా మంచి కథలు రావట్లేదని ఏకగ్రీవంగా అంగీకరిస్తారు” – మధు పెమ్మరాజు

    ‘తలక్రిందుల తెలుగు కథ’ అనే హెడ్డింగ్‌తో కథకుడు మధు పెమ్మరాజు గారు సారంగలో, తన వాల్‌పైన రాసిన వ్యాసంలోని ఓ వాక్యం ఇది. ఈ వ్యాసం ఆటా సాహిత్య సదస్సు ప్రసంగ పాఠం కొనసాగింపు వ్యాసం అని ఆయన పేర్కొన్నారు. అంటే ఒక వేదికపైన సాధికారికంగా మాట్లాడాల్సిన సందర్భంలో ఆయన చెప్పిన మాటలు ఇవి!

    కథ నాకు మా అమ్మ తర్వాత అమ్మ. ఎవరైనా ఉత్తినే కథని ఒక మాటంటే తీసుకోలేను. అందులో నిజానిజాలు ఎంచేదాకా మనసు ఊరుకోదు. అది నా బలం కావొచ్చు, బలహీనత కావొచ్చు. మధు పెమ్మరాజు గారు రాసిన మొత్తం వ్యాసంలో ఈ పై వాక్యాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. నిజానికి చాలా చాలా హర్ట్ చేశాయి.

    “ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో మంచి కథల సంఖ్య తక్కువగా ఉంటోంది” అని అప్పుడప్పుడూ కొందరి నుంచి వినిపించే అభిప్రాయం. అది వారి వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి దాని మీద నాకు అభ్యంతరం లేదు. కానీ మధు గారి మాటల్లో మాత్రం ఒక అసంబద్ధ స్టేట్‌మెంట్ కనిపించింది. ‘ఎవరిని అడిగినా సరే, తెలుగులో మంచి కథలు రావడం లేదని’ అంటారట! ఈ మాట మీద నాకు గట్టి అభ్యంతరం ఉంది.

    మధు గారు ‘ఎవరిని అడిగినా’ అనే మాట ఉపయోగించారు. అంటే ‘అందర్నీ’ అనే అర్థంలో వాడారు. సరే! ఎవరు వాళ్లు? మధు గారు ఎంతమందిని అడిగాక ఈ కన్‌క్లూజన్‌కి వచ్చారు? ఎంతమంది ఆ మాట అన్నారు? వందలో వారి శాతం ఎంత? ఆ మాట అన్నవారిలో ఎంతమందికి సాహిత్యం తెలుసు? ఎంతమంది కొత్తగా వస్తున్న కథలు చదువుతున్నారు? ఎంతమందికి కథావిమర్శ మీద అవగాహన ఉంది? ఎంత మంది మంచి కథలను ఎంచగలరు?

    ఇవేవీ చెప్పకుండా కేవలం ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేస్తే సరిపోతుందా? తెలుగులో మంచి కథలు రావట్లేదనే ఏకాభిప్రాయానికి వచ్చేస్తే చాలా? సొంత అభిప్రాయాన్ని సార్వజనీనం చేస్తే అయిపోతుందా? ఏయే పరిశోధనలు, పరిశీలనలు జరిపి ఈ అభిప్రాయానికి వచ్చారో చెప్పాలి కదా?

    ఈ కిందివి కథలు, వాటిని రాసినవారి పేర్లు

    పూర్ణ చంద్రోదయం – ఉణుదుర్తి సుధాకర్
    రకూన్ – అఫ్సర్
    దాహగీతి – మహమ్మద్ ఖదీర్‌బాబు
    యేటంబిడా ఎర్రబిల్ల ఏడుచ్చా పోయా – పుట్టా పెంచలదాస్
    సిలమంతకూరి రైలుగేటు దగ్గిర కొజ్జా – సొలొమోన్ విజయ్‌కుమార్
    విషప్ప్రేమ – మానస ఎండ్లూరి
    బతికున్న వాసాలు – ఎండపల్లి భారతి
    మేజిక్ ఇఫ్ – ఇండ్ల చంద్రశేఖర్
    ఎర్రమరకలు – వివేక్ లంకమల
    తోక – చిన్ని అజయ్

    2023 జనవరి నుంచి 2024 మార్చి దాకా అంటే 15 నెలల మధ్యలో తెలుగులో వచ్చిన ‘మంచి కథలు’ ఇవి. ఉత్తమ కథా సంకలనాల్లో చేర్చదగ్గ కథలు. ఇవి కేవలం నాకు గుర్తున్నవే! నేను చదవనివి మరెన్నో మంచి కథలున్నాయి. ఏటా కనీసం ఓ 50 దాకా లెక్క తేలుతాయి. వాటి శైలి, శిల్పం, కథావస్తువుల మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గాక, కానీ అవి తప్పకుండా మంచి కథల జాబితాలో చేరేవే అని పదిలో ఏడుగురు తప్పకుండా ఒప్పుకుంటారు.

    మధు గారు ఇవేవీ చదవలేదా? చదివినా ఆయనకు ఇవి గొప్ప కథల్లా అనిపించలేదా? లేదా తక్కువ సంఖ్యలో వస్తున్న మంచి కథలను చదవలేక ‘అబ్బే! తెలుగులో మంచి కథలు రావట్లేదండీ’ అని రొటీన్ కన్‌క్లూజన్‌‌కి వచ్చేశారా? ఏటా వచ్చే కథల్లో ఓ నాలుగు చదివేసి, ‘మంచి కథలు రావడం లేదండీ’ అని ఎవరన్నా అంటే అది తప్పే! ఆ మాటను ఆటా లాంటి వేదికపై అనడం మరింత దారుణం.

    సరే! “రచయితలు తమ రచనలు వారే పుస్తకాలుగా ప్రచురించే ఒక దుస్థితి దాపరించింది. అంతే కాదు, వారే అమ్ముకోవడం (అంటగట్టడం) సర్వసాధారణం అయిపోయింది.” ఇవి కూడా మధు గారు రాసిన వాక్యాలే! రచయితలు తమ పుస్తకాలను తాము ప్రచురించుకోవడం దుస్థితా? ఆటా వేదిక మీద ఇలాంటి మాటలా వినిపించింది? తమ పుస్తకాన్ని తాము ప్రచురించుకోవడం రచయిత హక్కు, ఇష్టం. అందులో దుస్థితి ఏముందో, అంత పాపం ఏమిటో మధు గారికే తెలియాలి. ఆయనకు ఏ రచయితలు తమ పుస్తకాలు అమ్మారో (ఆయన దృష్టిలో అంటగట్టారో) పేర్లు చెప్తే వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి ఇప్పించే పని చేద్దాం! ఇవన్నీ ఆయన అభిప్రాయాలే కావచ్చు కానీ, మరీ ఇంత దారుణమైన అభిప్రాయాలు ఉండటం బాధాకరం. తెలుగు రాష్ట్రాలలోని సాహిత్య వాతావరణానికి, ఇక్కడి వాస్తవ పరిస్థితికి ఆయన చాలా దూరంగా ఉన్నారని అర్థమవుతోంది.

    “సాహితీవేత్తలు పూనుకుని యువ రచయితలకి, ఔత్సాహికులకీ కథా శిల్పం, శైలి పట్ల అవగాహన పెంచాలి, పెద్దరికం వహించాలి..” ఇది కూడా ఆయన రాసిన వ్యాసంలోని వాక్యాలే! మంచి సూచన. కానీ ఇంత మంచి సూచన చేసినవారు మొత్తం వ్యాసంలో ఒక్కరంటే ఒక్క యువ కథకుడి పేరు ప్రస్తావించకపోవడం అన్యాయం. వి.మల్లికార్జున్, శ్రీఊహ, చరణ్ పరిమి, కె.వి.మన్‌ప్రీతమ్, మేడి చైతన్య, రమేశ్ కార్తిక్ నాయక్, గూండ్ల వెంకటనారాయణ, సురేంద్ర శీలం.. వీళ్లలో ఎవరూ కనిపించలేదా? ఒక్కరి పేరైనా చెప్పాలని అనిపించలేదా? ఒక్కరు రాసిన కథ కూడా నచ్చలేదా? సరే! వీళ్లంతా తెలుగు రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి అంత దూరంలో ఉన్నవారి కంటికి ఆనలేదేమో? కనీసం విదేశాల్లో ఉంటూ కథలు రాస్తున్న శ్రీనిధి యెల్లల, ధీరజ్ కశ్యప్ వేముగంటి, రవి మంత్రిప్రగడ.. వీళ్లు కూడా కనిపించలేదా? అసలు వీళ్ళు రాసినవేవీ చదవలేదా? యువ రచయితల పేర్లు రాయకూడదనే దీక్ష మీద ఉన్నారా?

    ఆటా లాంటి వేదికపై ఇలాంటి ప్రసంగం రావడం చాలా చాలా బాధాకరం. I felt very bad to read such Article. మధుగారు మంచి కథకులు. మరి ఇలాంటి అభిప్రాయం ఎందుకు వ్యక్తం చేశారో తెలియడం లేదు.

    – విశీ(వి.సాయివంశీ) ✍️✍️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు