సున్నితమైన మనస్తత్వపుపొరను చీల్చుకుని మనిషిగ కౄరత్వాన్ని, హింసను ఆనందించే స్థాయికి చేరుకున్న కాలంలో పొగొట్టుకున్న పసితనాల్ని, మరిచిపోయిన ప్రేమల్ని, స్వేచ్ఛల్ని, కోల్పోయిన చూపుల్ని, దూరమైపోయిన స్పర్శల్ని, పారేసుకున్న వినికిడి జ్ఞానాన్ని, బంధించుకున్న మనసే లేని దేహాల్ని, దారితప్పిన ఏకాంతాల్ని, వద్దనుకున్నా అంటిపెట్టుకునే ఒంటరితనాల్ని గురించి క్షణమైనా ఆలోచించే స్థితిలో మనం లేం. ఇలా లేకపోవడం వల్లనే, సున్నితత్వాన్ని కోల్పోవడం వల్లనే మనిషి ఉన్మాద స్థితికి చేరుకుంటున్నాడు.
*
ఇంతా చేసి… నెత్తుటి+ మరకలా ముగిసిపోతున్నాం
~
అందమైన ఆకుపచ్చని మైదానాలు ఇచ్చావు
అందులో ఉల్లాసంగా గంతులేసే పసితనాన్నిమేం పోగొట్టుకున్నాం
పూలతోటలతో కళకళలాడుతూ పరిమళాలు వీచే లోయలెన్నో ఇచ్చావు
ఆ లోయలలో తూనీగల్లా ఎగిరేందుకు రెక్కలున్నాయన్న సంగతే మరిచిపోయాం
ఆకాశాన్ని బంగారం చేసే ధగధగల ఉదయాన్నిచ్చావు
మేం గనులను తొలుస్తూ దేహాన్ని రెండు దీపాలుగా వెలిగించే కనులను కోల్పోయాం
జలజల పారే సెలయేళ్ళనీ పరవశంతో జారిపడే జలపాతాలనీ ఇచ్చావు
ఆ పరవశంలో ఒళ్ళంతా తుళ్ళిపడేలా తడిసిపోగల నగ్నత్వానికి దూరమయ్యాం
ఎడారి ఏకాంత వర్ణం మీద గాలి పాడే సోయగాల గీతాన్నిచ్చావు
మేం ఎండమావుల తగరపు తీగల మీద కర్ణభేరుల్ని పారేసుకున్నాం
రంగు రంగుల పక్షుల్నీ పక్షుల మీద మబ్బుల్నీ మబ్బుల నుంచి వానల్నీ ఇచ్చావు
మేం చుట్టూ గోడలు కట్టుకుని పైన కప్పు కూడా వేసుకున్నాం
మిల మిల మెరిసే నక్షత్రాల అంతరిక్షాన్ని కౌగిలిగా ఇచ్చావు
మేం ఆవలి తీరాలకు చేర్చే ప్రేమని మరచి ఒంటరిగా మిగిలాం
నిక్కమైన చీకట్లో కోసుల దూరం పరిచిన స్వప్నాలను ఇచ్చావు
మేం నిదురకు దూరమై దారి తప్పాం
ఆకాశ దేహాల వంటి
పూలతోటల వంటి
సెలయేళ్ళ వంటి
ఎడారులూ, పక్షులూ, మబ్బులూ, వానల వంటి
చెక్కిన దీపం వంటి
చిక్కని చీకటి వంటి
స్త్రీని ఇచ్చావు
మేం
దేహాన్ని
వెలిగించలేక
వెలిగించుకోలేక
తగలబెడుతున్నాం
తగలబడిపోతున్నాం
పుట్టుకకూ చావుకూ మధ్య వంతెనలా నిలిచిన ఇంద్రధనుస్సు
చూపుడు వేలు అందిస్తే
చేతులు ఖాళీ లేక పట్టుకోలేక
ప్రతిక్షణం శ్మశానం వైపు అడుగులు వేస్తున్నాం.
ఇంతా చేసి…
ఒక నెత్తుటి మరకలా ముగిసిపోతున్నాం.
– పసునూరు శ్రీధర్‌బాబు
*
శీర్షికలోని ‘ఇంతా చేసి’ అనే పదం ఆసక్తి రేకేత్తిస్తుంది. తెలుసుకోవాలనే మానవ సహజ స్వభావగుణం కవితలోపలికి పాఠకుడి మనసును లాక్కెళ్తుంది. ఆ తర్వాత పాఠకుడి మనసులో అలజడి కలిగిస్తుంది. “ఆకాశ దేహాల వంటి, పూలతోటల వంటి, సెలయేళ్ళ వంటి, ఎడారులూ, పక్షులూ, మబ్బులూ, వానల వంటి, చెక్కిన దీపం వంటి, చిక్కని చీకటి వంటి”- స్త్రీ విషయంలో ఈ పోలికలన్నీ ఎప్పుడో పాతరేసాం. జ్ఞానేంద్రియాల్ని సమాధి చేసుకున్నాం. ఇప్పుడామె కేవలం భోగవస్తువుగా మాత్రమే చూడబడుతుంది. దేహాల్ని చిత్రవధ చేసి, ఛిద్రం చేసి, నాలుకల్ని తెగ్గోస్తున్న కాలమిది. నిజాలు నెత్తురోడుతున్న సమాజమిది. తీర్చిదిద్దుకోగలిగితే మనిషిది అందమైన, అద్భుతమైన జీవితం. చేజేతులా పోగొట్టుకోవడం విషాదం.
“ఇంతా చేసి…
ఒక నెత్తుటి మరకలా ముగిసిపోతున్నాం”- ఇలా ముగిసిపోకూడదంటే ఏం చేయాలి?
లోచూపును శుభ్రపరుచుకోవాలి. మనోనేత్రంతో సౌందర్యవంతమైన ప్రకృతిని ఆస్వాదించగలగాలి. దేహపాత్రను ప్రేమతో నింపుకోవాలి. అందమైన ఆకుపచ్చని మైదానాల్ని, పూలతోటలతో కళకళలాడుతూ పరిమళాలు వీచే లోయల్ని, ఆకాశాన్ని బంగారం చేసే ధగధగల ఉదయాల్ని, జలజలపారే సెలయేళ్ళని, పరవశంతో జారిపడే జలపాతాల్ని, ఎడారి ఏకాంతవర్ణం మీద గాలిపాడే సోయగాల గీతాల్ని, రంగు రంగుల పక్షుల్ని, మబ్బుల్ని, వానల్ని, మిలమిల మెరిసే నక్షత్రాల అంతరిక్షాన్ని, అంతరంగ స్వప్నాల్ని మచ్చిక చేసుకోవాలి. తథాత్మ్యం చెందాలి. ప్రకృతితో స్నేహం కుదిరితేగానీ స్వార్ధం విసర్జించబడదు.
*
కవితలో ‘స్థానభ్రంశం'(displacement) ప్రధాన నిర్మాణసూత్రంగా పనిచే స్తుంది. మనిషి వేటిస్థానంలో వేటిని భర్తీచేస్తున్నాడనేదే అంతర్లయగా ధ్వనిస్తుంది. ప్రత్యక్షంగా పర్యవసానాల్ని, పరోక్షంగా పరిష్కారమార్గాల్ని సూచిస్తుంది. ‘ఇంతా చేసి’ అని అనడంలో తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. మనిషి ఆలోచనల్లో తిరోగమనమే పురోగమనంగా ట్యూన్ చేయబడింది. అదే అసలు ప్రగతిగా భ్రమింపజేస్తుంది. ‘ఇంతా చేసి’ అనే పదం తర్వాత మూడు చుక్కలు వేటిని చెబుతున్నట్టు? ఎవరిని సంబోధించి కవి మాట్లాడుతున్నట్టు? ఆదిమ మానవుడు ప్రకృతికి దైవత్వాన్ని ఆపాదించిన తర్వాత కవి కూడా అతని/ఆమెకే మొరపెట్టుకుంటున్నట్టా? ‘ప్రకృతిలోకి తిరిగి పోదాం'(Go back to nature) అన్న రూసో మాటలే శిరోధార్యమని జ్ఞానోదయమవుతుంది.
మరి రూసో మాటల్ని ఎలా నిజం చేయగల్గుతాం? మానవ ప్రవృత్తి దిశను ఎలా మార్చగలుగుతాం? అన్నది పెద్ద సమస్య. ఇంతగనం జేత్తె వల్లకాటికే తొవ్వబడుతానమని రంది పడుతున్నాడు కవి.
*
జోక్యం చేసుకునే చరాల(mediating variables) యొక్క ఉధృతిని తగ్గించగలిగితే అసలు లక్ష్యం(aim)పై గురి కుదురుతుంది. మనస్తత్వశాస్త్రం ప్రకారం మనసు అట్టడుగుపొరల్లో అణచబడ్డ సెక్స్, హింస మొ.న వాంఛిత ప్రవృత్తులు గుణాత్మకమైనవి(qualitative moderators); డ్రగ్స్, ఆల్కహాల్ మొ.నవి పరిమాణాత్మకమైనవి(quantitative moderators). మానవ పరిణామ వికాస దశల్లో ఒక్కో స్థాయిలో ఒక్కోవిధంగా వాటి ప్రభావం ఉంటుంది, దాంతో పాటు ఒక్కొక్క దానిపై కొన్ని ఉత్ప్రేరకాల ప్రభావం కూడా పనిచేస్తుంటుంది. అయితే ఇప్పటి సమాజంలో ‘కులం, మతం, అధికారం, ధనం’ మొ.నవి అత్యంత ప్రభావవంతంగా పనిచేసే చరాలుగా చెప్పొచ్చు. ఇవి పాలల్ల విషం చుక్కల్లాంటివి. జర పైలంగుండాలె.
*
పెయి మీద బట్ట సోయి వున్న మనుషులం కదా! ఆమాత్రం అర్థం చేసుకుంటారని కవి అంతరంగం.
*
గొప్ప కవిత. దీన్ని చదవకుండా మిగిలిపోతే జీవితంలో ఎంతోకొంత మరింత కోల్పోవడం ఖాయం. ప్రత్యేకంగా విశ్లేషించాలనుకోవడం కన్నా చదివాక నిలవలేనితనమే రాజ్ తో రాయించిందనుకుంటాను.
మనం దేనిని పోగొట్టుకుని, మరి దేనిని మిగుల్చుకుని, చివరికి ఎట్లా మిగిలిపోతున్నామో అని హృద్యంగా చెప్పిన శ్రీధర్ కవితకు ధీటుగా నీ విశ్లేషణ సాగింది రాజ్ కుమార్ !